April 23, 2024

వెంటాడే కథలు – 7

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!
-చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు

*********************************

పూల గొడుగు!

ఉలిక్కిపడి లేచింది సాధన.
టేబుల్ మీది గడియారం ఉదయం ఆరు గంటలు చూపిస్తోంది..
‘అప్పుడే ఆరయిందా?’ అనుకుంటూ బాత్‌రూంలోకి చరచర నడిచిందామె.
ఈ అలికిడికి బల్‌దేవ్ కళ్ళు తెరిచాడు.
భార్య హడావుడిపడుతూ బాత్‌రూంలోకి వెళ్లడాన్ని ఆశ్చర్యంగా చూశాడు.
రాత్రంతా కలతనిద్ర కారణంగా మళ్లీ నిద్రమత్తు మేఘంలా అతన్ని కమ్మేసింది.
సాధన వేగంగా తన పనులు ముగించుకొని వంట గదిలోకి వెళ్ళిపోయింది.
ఎనిమిదిన్నరకల్లా శైలూకు బాక్స్ రెడీ చేయాలి. ఆరేళ్ల పిల్ల కావడంతో స్కూలుకు తనే తయారు చేయాలి. ఆ బస్సువాడు వచ్చాడంటే ఆగడు.. ఇంటి ముందు నిలబడి హారన్ కొడుతూనే ఉంటాడు. ఆ సరికి పిల్లను రెడీ చేయకపోతే వాడితో చాలా మాటలు పడాల్సి వస్తుంది.
బల్‌దేవ్ కూడా ఆలస్యం అయితే ఒప్పుకోడు, తన విషయమైనా అంతే! కూతురు విషయమైనా అంతే!
అతనికి కూడా తొమ్మిది గంటలకల్లా బ్రేక్ఫాస్ట్, పదిన్నరకు లంచ్ బాక్స్ సిద్ధం చేయాలి.
అనారోగ్యంతో మంచం పట్టిన అత్తగారికీ మామగారికీ కాఫీ, ఫలహారాలు అందించాలి.
ఇవన్నీ ఆలోచిస్తూనే సాధన యంత్రంలా పనులు చకచకా చేసుకుపోతోంది.
అప్పటికే అత్తమామలు ముఖాలు కడుక్కుని కాఫీకోసం హాలులో కూర్చొని ఎదురుచూస్తున్నారు.

గబగబా కాఫీ కలిపి హాలులోని అత్త మామలకు అందించి వచ్చింది. తను కప్పులో పోసుకుంది గానీ తాగడానికి తీరిక దొరికితే కదా? రోజూ ఇదే తంతు! ఏ ఒక్కరోజునా తను వేడి వేడి కాఫీ తాగిన పాపాన పోలేదు.
‘బద్ధకంగా పడుకోకపోతే బల్‌దేవ్ వచ్చి కాస్త సాయం చేయొచ్చుగా..’ అనుకుంది.
కానీ ఆ ఆలోచన అంత ఒత్తిడిలోనూ నవ్వు తెప్పించింది.
‘హుఁ అతనా? సాయమా? సరేలే తన డ్రస్సులు, ఆఫీస్ ఫైళ్లు, కళ్లజోడు నన్ను అడక్కుండా ఉంటే సాయం చేసిన్నట్లే’ అనుకుని నిట్టూర్చింది.
అయ్యో అప్పుడే టైమ్ ఏడున్నరయింది.
“ఏమండీ ఏమండీ తొందరగా లేవండి.. శైలూను నిద్రలేపి మొహం కడిగించండి.. లేవాలి తొందరగా! టైమ్ అప్పుడే ఏడున్నరయింది” అంటూ వంటింట్లోంచి గట్టిగా కేక పెట్టింది సాధన.
బల్‌దేవ్ ఉలిక్కిపడి లేచాడు.
“మిమ్మల్నే.. లేచారా? కాస్త పిల్ల సంగతి చూడండి. ఆలస్యమైతే ఆ డ్రైవర్ తిట్టిపోస్తాడు.. స్కూలు వాళ్ళు మెమోలు పంపిస్తారు” వంటింట్లోంచి అరుస్తూనే ఉంది సాధన.
బల్‌దేవ్ లేచి వంటింట్లోకి నడిచేడు.
“సాధనా… నువ్వు ముందు కాస్త ప్రశాంతంగా కాఫీ తాగు..” అన్నాడు.
“లేదండి. తర్వాత తాగుతాను.. ఇంకా మీకు అత్తగారికి, మామగారికి టిఫిన్ చెయ్యాలి..” అంటూ వంట పాత్రలతో కుస్తీ పడుతోంది సాధన.
బల్‌దేవ్ హాల్లోకి నడుస్తుంటే –
“ఇంతకీ పిల్లని లేపారా లేదా? నేను వచ్చానంటే దానికి వీపు విమానం మోత మోగినట్టే! ఆ తర్వాత మీ అయ్య కూతుళ్ల ఇష్టం! నన్ను అంటే నేను ఊరుకోను.. వెళ్లండి తొందరగా లేపండి”
సాధన గొంతు బిగ్గరగా వినపడుతుంటే బల్‌దేవ్ పడక గదిలోకి వెళ్లాడు. మంచం మీద దుప్పటి ముసుగు తన్ని పడుకున్న కూతుర్ని లేపడానికి మాత్రం ప్రయత్నించలేదతను.
హాలులో కాఫీలు తాగుతున్న అత్త మామలు- కొడుకూ కోడలి వ్యవహారం చూసి రెప్పలు వాల్చేసుకున్నారు.
కోడలి తీరు వారికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.
అంతలోనే వంటింట్లోంచి సుడిగాలిలా కాఫీకప్పుతో హాల్లోకొచ్చింది సాధన.
“చూశారా అత్తయ్యగారు మీ అబ్బాయి వాలకం?. పిల్లను లేపమంటే లేపరు.. తయారు చేయమంటే చెయ్యరు. ఒక్కదాన్నే ఎన్నింటికని చావాలి” అంటూ రుసరుసలాడుతూ పడక గదిలోకి వెళ్లింది.
బాల్కనీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డ భర్తను చూసేసరికి మండిపోయింది.
చరచరా బాల్కనీలోకి నడిచి – “మీకు ఒకసారి చెబితే అర్థం కాదా? ఇంకా నేను పిల్లకు బాక్స్ సర్దాలి.. అప్పుడే ఎనిమిది దాటింది.. పిల్లను ఇవ్వాళ పాచిమొహంతోనే స్కూలుకు పంపుతారా?” అంటూ గిర్రున వెనక్కి తిరిగి పడక మీద ఉన్న శైలూ దగ్గరకు వెళ్ళబోయింది.

బల్దేవ్ వేగంగా వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు.
“పాపను నేను లేపుతాను. నువ్వెళ్ళి మిగిలిన పనులు చూడు” అన్నాడతను మంచం వైపు నడుస్తూ.
“ఈ పనేదో ఇందాకే చేస్తే బాగుండేది. ఇవాళ దానికి స్నానం వద్దులే ! తొందరగా ముఖం కడిగించి ఫ్రెష్ చేసి, స్కూల్ డ్రెస్సు వేసేయండి. నేను బాక్స్ రెడీ చేసి తీసుకొస్తాను..” అంటూ పరిగెత్తినట్లే వంటింట్లోకి వెళ్ళింది సాధన.
“సరే సరే అలాగే అలాగే” అన్నాడు బల్‌దేవ్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ.
ఎనిమిది ఇరవై అయిదు కల్లా కూతురి లంచ్ బాక్స్, పుస్తకాల బ్యాగు తీసుకుని వీధిలోకి వచ్చింది సాధన.
“ఏమండీ ఇంకా ఎంతసేపు? లోపల నుంచి రారేంటి? శైలూను తీసుకురండి. వచ్చేటప్పుడు దాని పూలగొడుగు తీసుకురండి.. జల్లు పడేలా ఉంది.. తడిస్తే చిన్నతల్లికి జలుబు పట్టుకుంటుంది” అని వీధిలోనుంచే అరిచింది సాధన.
పాలిపోయిన మొహంతో బల్‌దేవ్ బయటికి వచ్చాడు. శైలూ మాత్రం అతని వెంట రాలేదు.
తమ కళ్లముందే జరుగుతున్న తంతు అంతా చూస్తూ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్నట్లు హాల్లోని అత్త మామలు గాభరా పడుతున్నారు.
స్కూలు బస్సు రానే వచ్చింది.
బస్సు డ్రైవర్ వాళ్ళ ఇంటి ముందు కొంచెం స్లో చేశాడు. ఒక చేతిలో లంచిబాక్సు ఇంకో చేతిలో పుస్తకాల బ్యాగ్ తో నిలబడ్డ ఆ కన్నతల్లిని చూసి అతని కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది.
“అదేంటండి? బస్సు ఆపకుండానే వెళ్ళిపోతున్నాడు.. పిలవండి ..పిలవండి! ఆపండి ఆపండి! శైలూ ఎక్కాలి కదా” ఆక్రోశంగా అంటున్న భార్యను రెండు చేతులతో పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు బల్దేవ్.
నిన్నటి సంఘటన ఆమెకు గుర్తొచ్చింది.
నిన్న ఖచ్చితంగా ఇదే వేళకు శైలూ బస్సు ఎక్కబోతుండగా రాంగ్ రూటులో వచ్చిన ఓ కారు ధడాలున గుద్దేసింది.
అంతే! క్షణాలలోనే రక్తపు మడుగులో విలవిల కొట్టుకుంటూ కళ్లెదుటే చిన్నారి కూతురు ప్రాణాలు విడవడం ఆ కన్న తల్లిని షాక్ కు గురిచేసింది.
రాత్రంతా శైలూ బతికి ఉన్నట్లే భ్రమిస్తూ కూతురు ఇష్టంగా ఆడుకునే బొమ్మను పక్కన పడుకోబెట్టుకుని దుప్పటి కప్పి కూతురికి జోకొట్టినట్టు జోకొడుతూ నిద్రపుచ్చిందామె. బిడ్డ పోయిన దుఃఖం, భార్య మతిభ్రమణం చూస్తూ ఏం చేయాలో తోచక బల్‌దేవ్ జీవచ్ఛవమయ్యాడు. రాత్రంతా అతనికి కంటిమీద కునుకు లేదు. కళ్ళు మూస్తే అమాయకంగా చూసే శైలూయే కళ్ళముందు తారాడుతోంది..
సాధనను భుజం పట్టుకుని ఇంట్లోకి నడిపించుకుని వచ్చాడు బల్దేవ్.
ఇల్లు మొత్తం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది.
సాధనను ఊరడించడానికి, తన గుండెకోతను తట్టుకోడానికి శక్తిలేని బల్‌దేవ్, నోట మాట రాక తల్లిదండ్రుల వంక నిస్సహాయంగా చూశాడు. చెక్కిళ్ళపై నుంచి ధారలుగా కన్నీరు కారిపోతోంది.
పోయిన మనవరాలు ఎలాగూ పోయింది.. కోడలి పరిస్థితి ఇలా అవడం చూసి ముసలి దంపతులు పొర్లిపొర్లి ఏడ్చారు..
చేసేదేదో పైవాడు చేశాక మనుషులు ఏం చేయగలరు భోరుమనడం తప్ప!

-:౦౦౦:-

నా విశ్లేషణ:

నాకు గుర్తున్నంత మేరకు ఇది గుజరాతీ లేదా సింధీ కథ! అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరమైతే ఆ తల్లిదండ్రులు పడే మనోవేదనను రచయిత ఆద్యంతం కన్నీటి పర్యంతం అయ్యేలా చెప్పాడు. ఇంత హృదయ విదారకమైన కథలో కూడా చిట్టచివరి వరకు సస్పెన్స్ నిలబెట్టాడు.
‘విపుల’లో ఈ కథ ప్రచురితమైనప్పుడు..
సినీ నటుడు ఉత్తేజ్ ఫోన్ చేసి ఈ కథ గురించి కన్నీరుమున్నీరవుతూ మాట్లాడడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కథతో పాటు కథనం దీనికి ప్రాణంగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

-చంద్ర ప్రతాప్ కంతెేటి
8008143507
27.3.22

12 thoughts on “వెంటాడే కథలు – 7

 1. ఇంతకు పూర్వమే, ఇతరులు చెప్పినట్లు, హృదయాన్ని తట్టే కథ. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

 2. ఎంతో చక్కటి కథనం ఉన్న కథను పరిచయం చేసారు ప్రతాప్ గారు. తల్లి ప్రేమను ఎన్నో రకాలుగా చెప్పవచ్చు. కానీ రచయిత గతంలో ఉండిపోయి, జ్ఞాపకాన్ని వెంటాడే ప్రేమను చెప్పిన వైవిధ్య శైలి నిజంగా హృద్యంగా ఉంది. ఇన్ని వేల కథల మధ్య కొన్ని కథలను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోగలగడం నిజంగా గొప్ప విషయం.మంచి కథను పరిచయం చేసిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

  1. ధన్యవాదాలు రచన గారు.. మీ సమీక్ష ద్వారా నాకు మరింత ఉత్సాహం పెరిగింది

 3. వెంటాడే కథతో కంట తడి పెట్టించారు. ఖచ్చితంగా ఇది వెంటాడే కథ – తోడుగా గుండెని Instantగా కరిగింస్తుంది. చిట్టి కథలో గొప్ప ఉత్కంట. కథతో పాటు దాని సంభందిత వివరాలు కూడా ఇచ్చి కథకి మరింత శోభ పంచారు. CP గారికి కృతజ్ఞతలు.

  1. సంపత్ గారు చక్కని సమీక్ష.. అవును .. ఇది నిజంగానే వెంటాడే కథ. మన లాంటి సున్నిత మనస్కులు ఇలాంటి సంఘటనలకు ఇట్టే కరిగి పోతారు. ఎప్ప టికీ మరచి పోలేరు.

 4. ఉమ్మడి కుటుంబంలో భారతీయ స్త్రీ నిర్వహించే భాధ్యతలను,అందులోనూ ఒక తల్లి తన బిడ్డ పట్ల చూపించే ప్రేమాభినాలు చక్కగా వర్ణించారు రచయిత.
  విషాదాంతం ఉహించలేనిది.భరించలేనిది. నిజంగానే ‘వెంటాడే కధ’సంభాషణల ద్వారా కధ నడిపిన విధానం బాగుంది. చక్కటి కధ అందించారు. ధన్యవాదాలు.

  1. ధన్యవాదాలు యోగానంద గారికి

   మీ అభిప్రాయాన్ని చక్కగా తెలియజేశారు. మీలాంటి పాఠకులు దొరకడం నిజంగా మా అదృష్టం.

 5. Depicted emotions of mother with delicacy and suspense. Difficult to forget such stories.
  Thank you chandra pratap garu

  1. మీరు మెచ్చుకోవడం చాలా సంతోషమండీ.. ధన్య వాదాలు. ఎన్నేళ్లయినా మనసును వెంటాడే కథ!

 6. అవును ఈ కథను నేనూ చదివాను.కళ్ళు చెమర్చే విషయాన్ని అంతం వరకూ తెలియనివ్వకుండా చేసిన కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *