April 25, 2024

అష్టవిధ నాయికలు. ప్రోషితభర్త్రుక.

కథారచన: పంతుల ధనలక్ష్మి.

మహారాణీ మాలినీదేవి మహా అందాలరాణి. అందమంతా తనసొత్తే అన్నట్టుంటుంది.
రాజా ప్రతాపవర్మ గొప్ప యుద్ధ నైపుణ్యం గుణగణాలు కలవాడని చాలాసార్లు చాలామందినోట విన్నది. అటువంటివాడు తన తండ్రిపైకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసింది.
వెంటనే తన తండ్రి అతనితో యుద్ధం కంటే సంధి చేసుకోవటం మంచిదని భావించి సంధి చేసుకున్నాడు.
తమ ఉద్యానవనం చూపించడానికి తీసుకొని వచ్చి అక్కడేవున్న తనని పరిచయం చేసాడు.
అందంలోను అందమైన లలిత కళలలోను ప్రావీణ్యం కలిగిన మాలినీదేవిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు.
తన రాజ్యానికి సగౌరవముగా తీసుకువచ్చాడు.

*****

ఒక సంవత్సరం ఇరువురు ఆనందంగా అన్యోన్యంగా ఉన్నారు.
ప్రతాపవర్మ ప్రశాంతంగా ఇంట్లోవుండటం చూసి చుట్టుపక్కల రాజులు కూడ బలుక్కుని అందరూ
కలిసికట్టుగా మూకుమ్మడిగా నాలుగు పక్కలనుండి దాడి చేయడానికి పథకం వేస్తున్నట్టుసమాచారం అందింది.
ప్రతాపవర్మ ఎప్పుడైనా ఇలాటి పరిస్థితి వస్తుందని ముందు జాగ్రత్త చర్యగా సైన్యాన్నసిద్ధంగా వుంచుతాడు.

ప్రత్యర్థులు తనమీద దాడి చెయ్యకముందే తానే అకస్మాత్తుగా దాడి చేసాడు. దానితో వెంటనే యుద్ధానికి సిద్ధంగా లేని వారు ఓడిపోవడం ఇష్టంలేక అడవుల్లోకి పారిపోయారు.
కానీ ప్రతాపవర్మ వాళ్ళని అలా వదిలేస్తే మళ్ళీ ఇంకొంతమందిని కలుపుకుని తనపై యుద్ధానికి దిగే ప్రమాదం వుందని, శతృశేషం మిగలకూడదని అడవులలో వెతుకుతూ రాజ్యానికి రాలేదు.
మాలినీదేవి అతడు ఎప్పుడు వస్తాడో, ఏ సమాచారం తెలుస్తుందో అని ఎదురు చూస్తోంది.

*****

ఈ కథను ఇక్కడిదాకా చదివిన తేజోవతి అనుకుంది.” ప్చ్! తన పరిస్థితి కూడా ఇంతే!” తన భర్త

ఇండియన్ ఆర్మీలో వున్నాడు.
రాణా ప్రదీప్ తనతో కలిసి చదువుకున్నాడు. రాణాకి మొదటినుంచీ ఆర్మీలో చేరి దేశాన్ని రక్షిస్తూ

దేశసేవ చెయ్యాలని కోరిక.
ఎవరైనా సైన్యాధికారులు రిటైరయినవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చాలా విషయాలు వివరంగా తెలుసుకునేవాడు.
ఆ విధంగా ఇష్టంగా డిఫెన్స్ ఎకాడమీలో చేరి పరీక్షలు పాసయి శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగరీత్యా సరిహద్దు
ప్రాంతానికి వెళ్ళాడు.
అతనితో వివాహానికి తన తల్లిదండ్రులు ఇష్టపడలేదు.. ఎందుకంటే ఇద్దరూ కలిసి వుండే అవకాశం తక్కువని. అంతే.
అయితే యశోవతి పట్టుబట్టి “దేశానికి రక్షణగా వుండే రాణా ప్రదీప్ తో తన వివాహం జరగా”లంది.
పెళ్ళయిన సంవత్సరం వరకు కలిసేవున్నారు. తరువాత చైనా వారు అకస్మాత్తుగా రాత్రి సమయాల్లో దాడిచేసి
ఇబ్బంది పెడుతున్నారని ప్రదీప్ కి అక్కడ డ్యూటీ వేసి పంపించారు.
వెళ్ళి రెండేళ్ళు దాటింది. ఆ గాల్వన్ నదీతీరంలో అక్కడెలావున్నాడో!
ఏమైనా తినడానికి సమయముందో లేదో? ఆ చలిలో ,వానలో, మంఛులో ఎలావున్నారో? కిందటి నెలనుంచీ ఒక్కసారైనా వస్తే బాగుండుననిపిస్తోంది.ఏమిటో! ఏపని చేసినా తనమాటలు,చేతలు గుర్తొస్తున్నాయి.” అనుకొంది
” పెళ్ళవగానే తనని చాలా ప్రదేశాలకు తీసికెళ్ళి చూపించాడు..ఇండియాలో కేరళ మున్నార్, అలెప్పీ బోట్ హౌస్ లో రాత్రంతా ఉన్నారు.
ఇంకా ” గోవా” బీచ్ లు, నెమళ్ళు, ప్రకృతి అందాలు, కార్తీక పౌర్ణమి నాడు ఆగ్రాలో తాజ్‌మహల్ వెన్నెలలో ఎంత
అందంగా వుంది? అక్కడ వెన్నెల్లో తమ పెళ్ళి రోజు తనకి మంచి తెలుపు రంగు చీరమీద సెల్ఫ్ డిజైన్ ఢిల్లీలో కొన్నాడు. ఇద్దరూ ఆ వెన్నెల్లో ఫోటోలు తీయించుకున్నారు.
ఓసారి ఆ ఫోటోలు ఆల్బమ్ తీసి చూసింది.
తనకి, ప్రదీప్ కి పూలమొక్కలు పెఃచడం చాలా యిష్టం.
అంతేకాదు ఆ పూలు విచ్చుకునేటప్పుడు చూడాలని కోరిక. ఒక మొగ్గ కనిపిస్తే అది రెండు రోజులకో
విడుతుందని అనుకొని కెమేరా పట్టుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుని మర్చిపోయి చూస్తే ఆ పువ్వు విచ్చుకుని ఉండేది.
“అయ్యో” చూడలేదే! ” అనుకునేవారు.
వర్షం పడుతుంటే “మిర్చిబజ్జీలు తిందామా? ” అని అడిగి అతనే వంటింటిలోకి వెళ్ళి వాము మిరపకాయల్లో
కూరి రెడీచేసి పిలిచేవాడు.
” ఏమిటో ఎన్ని జ్ఞాపకాలో! “ఎప్పుడొస్తాడో ? ఫోను చేస్తాడేమో! మళ్ళీ గుర్తొచ్చింది
ఫోను చెయ్యకూడదు. సిగ్నల్స్ ని బట్టి శతృవులు తెలుసుకుంటారని.
మరెలా?
పోనీ అతని చిత్రాన్ని గీద్దామని వాటర్ కలర్స్, బ్రష్ లు తీసింది. ఫైన్ ఆర్ట్స్ లో నేర్చుకుంది.
మొదలెట్టింది. కానీ ఇదేమిటి? చేతులు వణుకుతున్నాయి? ”
అతని చిత్రమునైనా చూడలేనా? ఛఛ నా చేతులే నాకు శతృవుల్లా వున్నాయి.” అనుకొని “అయ్యో కన్నీరు కూడ వస్తోంది. ఏమీ కనిపించటంలేదు. అందుకే బొమ్మ వెయ్యలేక పోతున్నాను.”
మళ్ళీ తాము తిరిగిన దేశాలు, అక్కడ కొనుక్కున్న వస్తువులన్నీ అలా పరీక్షగా చూసింది.
దుబాయ్, మారిషస్, శ్రీలంక ఇంకా రెండు మూడు దేశాలు చూసేరు.
అవన్నీ గుర్తు చేసుకుంటూ కావ్యనాయిక ప్రోషిత భర్త్రుక” లా
దూరతీరాలనున్నప్రదీప్ కోసం ఎధురు చూస్తూ
” ఏడ తానున్నాడు బావా!
అందాల ఓ మేఘమాలా!”

ఇంకా ” ఆకాశదేశాన, ఆషాఢమాసాన
వినిపించు ఓ మేఘమా” అంటూ అతనికిష్టమయిన పాటలు పాడుతూ

” ఓ మేఘమా! నువ్వయినా తొందరగా తీసుకురా! ” అంటూ ఎదురు చూసింది

ప్రోషితభర్త్రుక తేజోవతి.

ప్రోషితభర్తృక లక్షణము:-

పతి దూర దేశాలు ప్రాంతాలలో దేశరక్షణ ఇంకా సహాయార్థమై ఉన్నప్పుడు అతనిని తల్చుకుంటూ జ్ఞాపకాలను చూసుకుంటూ ఎదురు చూసే భార్య లేక కావ్యనాయికను ప్రోషితభర్తృక అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *