April 25, 2024

దేవీ భాగవతం – 9

 

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి

 

7 వ స్కంధము, 28 వ కథ

బ్రహ్మ సృష్టిని చేయుట

 

విష్ణు భగవానుని నాభి కమలమునుండి బ్రహ్మ ఉత్పన్నమయ్యెను. సృష్టి కార్యక్రమమును బ్రహ్మ మిక్కిలి తపమొనరించిన తరువాత భగవతి యొక్క వరముచే ఆరంభించెను. మొదట ఏడుగురు మానస పుత్రులు ఉదయించిరి. 1. మరీచి 2. అంగిరా 3. అత్రి 4. వశిష్టుడు 5. పులహుడు 6. క్రతువు 7. పులస్త్యుడు.

బ్రహ్మయొక్క రోషమునుండి రుద్రుడు, ఒడినుండి నారదుడు, బొటనవ్రేలినుండి దక్ష ప్రజాపతి ఉదయించిరి. సనక సనందనాది మానసపుత్రులు అట్లే జన్మించిరి.

ఎడమ చేతి బొటన వ్రేలునుండి దక్షుని పత్ని జన్మించెను. ఆమె అందమైనది. పురాణములలో ఆమె ‘‘వీరణ’’ అని పిలువబడెను. ‘‘అసిక్నీ’’ అని కూడా ఆమెకు పేరుగలదు. దక్షప్రజాపతికి మొదట 5,000 మంది వీరణ గర్భమునుండి ఉత్పన్నమైరి. వారందరినీ నారదుడు వనములకు పంపివేసెను. నారదునికి గర్భవాసము శాపమునిచ్చి మరల అరువది మంది కన్యలను ఉత్పన్నము చేసెను. నారదుడును వీరణి గర్భమున ప్రకటితుడయ్యెను.

కశ్యపునికి 13గురిని, 10మంది ధర్మునకు, 27గురు చంద్రునకు, ఇద్దరిని భృగువునకు, నలుగురుని అరిష్టనేమికి, మరి నలుగురిని అంగీరసునికి ఇచ్చి పెళ్ళిచేసెను.

సర్వదేవతలు, మానవులు ఈ కన్యల సంతానమే (పుత్రులు, పుత్రికలు, పౌత్రులు), కాని వారెవరికీ ఒకరియందు మరియొకరికి ద్వేషమే గాని, ప్రేమలేదు. యిట్లు దక్షప్రజాపతి సంతానమే సర్వజనుల పుట్టుకకు కారణమయ్యెను. ఆ మునుల యొక్క సంతానమే ఈ దేవతలూ, మానవులూను.

 

 

 

 

 

7 వ స్కంధము 29వ కథ

సూర్యవంశ రాజులు

 

బ్రహ్మ 10వేల సంవత్సరములు తపమొనరించి మానస పుత్రులను ప్రకటించెను. వారిలో మరీచి మొదటివాడు. మరీచి కొడుకు కశ్యపుడు. దక్షప్రజాపతి 13మంది కన్యలను కశ్యపునకిచ్చి వివాహము చేసెను. దేవతలు, దానవులు, యక్షులు, సర్పగణములు, పశువులు, పక్షులు ఆయన సంతానమే. వారందరికీ కాశ్యపసృష్టి అని పేరు గల్గెను.

దేవతలలో శ్రేష్ఠుడు సూర్యుడు. వివశ్వంతుడు అనిపేరు. ఆయన కుమారుడైన వైవస్వత మనువునకు శాసనకార్యము అప్పజెప్పబడెను. ఆ మనువునుండి సూర్యవంశము వృద్ధి చెందెను.

ఆ మనువుకు 1. ఇక్ష్వాకుడు 2. నాభాగుడు 3. ధృష్ట 4. శర్వాతి 5. నరిష్మంతుడు 6. ప్రాంశుడు 7. నృగుడు, 8. దిష్ట 9. కరూషుడు 10. పృషధ్రుడు అనే కుమారులు కల్గిరి. పెద్దవాడు ఇక్ష్వాకుడు. వానికి 100 కుమారులు.

వారిలో వికుక్షి అనేవాడ ఆత్మజ్ఞాని.

నాభాగుని కుమారుడు ప్రతాపవంతుడైన అంబరీషుడు.

ధ్రష్టుని కొడుకు ` దార్ష్యుడు. యితడు బ్రాహ్మణకర్మలు చేసేవాడు.

శర్వాతి కొడుకు అనర్తకుడు.

అనర్తుడి కొడుకు రేవతుడు

క్షువుడి కుమారుడు ఇక్ష్వాకుడు.

వాడికి వందమంది పుత్రులు.

ఇక్ష్వాకుని కుమారులలో పెద్దవాడు వికుక్షి.

వికుక్షికి శశాదుడు అనే పేరుగలదు.

ఇక్ష్వాకుని తరువాత అతడే అయోధ్యకు రాజు.

అతడు సరయూనది తీరమున అనేక యజ్ఞములు చేసెను.

వకుక్షి కొడుకు కకుత్థ్సుడు

వాడికే ఇంద్రవాహనుడు, పురంజయుడు అని పేర్లు గలవు.

ఈ కకుత్థ్సుడనేవాడు మహావీరుడు. దేవతలను పీడించుచున్న దానవులను ఓడించుటకు విష్ణువు దేవతలను కకుత్థ్సుని వద్దకు పంపెను. అతడు దానవులతో యుద్ధమునకు అంగీకరించి ఇంద్రుని వాహనముగా ఉండాలని కోరాడు. వెంటనే శ్రీహరి ఆజ్ఞతో అంగీకరించి వృషభరూపుడైన ఇంద్రుని కుముదము మీద కూర్చుని పోరు సలుపుటచే అతనికి కకుత్థ్సుడు అనే పేరు వచ్చెను. ఇంద్రుడు వాహనమయ్యాడు కనుక ఇంద్రవాహనుడయ్యాడు. దైత్యులను ఓడించాడు గనుక ‘‘పురంజయుడయ్యాడు’’.

కకుత్థ్సుని కుమారుడు అనేన.

అనేన కొడుకు పృథువు – విష్ణువు అంశ.

పృథువు కుమారుడు – విశ్వరంద్రి.

విశ్వరంధ్రుని కొడుకు చంద్రుడు.

చంద్రుని కొడుకు యువనాశ్వుడు.

యువనాశ్వుని కొడుకు శావంతుడు. అతడే శావంతి అనే రాజ్యమును నిర్మించెను.

శావంతుని కొడుకు బృహదశ్వుడు.

బృహదశ్వుని కుమారుడు కువలాశ్వుడు. అతడు దుంధువు అనే రాక్షసుడిని చంపి దుంధుసారుడయ్యెను.

కువలాశ్వుని పుత్రుడు దృఢాశ్వుడు.

దృడాశ్వుని కొడుకు హర్యశ్వుడు.

హర్యశ్వుని కొడుకు – నికుంభుడు.

నికుంభుని కొడుకు బర్హణాశ్వుడు.

అతని కొడుకు కృశాశ్వుడు.

వాడు కొడుకు ప్రసేనజిత్తు.

ప్రసేనజిత్తు కొడుకు యేవనాశ్వుడు.

యేవనాశ్వుడి కొడుకు మాంధాత. ఈ మాంధాత నూటయెనిమిది భవ్య భవనములు నిర్మించెను. జగదంబికను సంతుష్టపరుచుటకు గొప్ప గొప్ప తీర్థములను మందిరములను నిర్మించెను. యితడు స్త్రీ గర్భము నుండి గాక తండ్రి గర్భమున జన్మించెను. తండ్రి ఉదరమును చీల్చి దానినుండి బయటకు వచ్చెను.

రాజగు యేవనాశ్వునికి వందమంది భార్యలున్నారు. గాని సంతానము లేదు. అతడు మిక్కిలి దుఃఖితుడై వనములకు వెళ్ళిపోయెను. అచట ఋషులు, మునులు అతని దుఃఖమునకు కారణము గ్రహించి మంత్రములతో జలమును అభిమంత్రించి వారు ఒక కలశమును యజ్ఞశాల యందు వుంచగా ఆ రాజు దాహార్తుడై రాత్రివేళ యందు ఆ మంత్రజలమును త్రాగెను. రాణికి ఇవ్వవలసిన జలము రాజు త్రాగెను. మునులు ఆ విషయమును తెలుసుకొని విధి బలీయమైనదని గ్రహించి యజ్ఞమున పూర్ణాహుతి నొసగి వెళ్ళిపోయిరి. ఫలితముగా రాజు ఉదరమున గర్భము నిలిచెను. సమయము పూర్తికాగా రాజు దక్షిణ ఉదరమును చీల్చుకొని ఒక పుత్రుడు ఉదయించెను. దేవతల కృపవలన రాజు కెట్టి ఆపద కలుగలేదు. మంత్రులు ఆ బాలుడు ఎవరి పాలు తాగునని అరచిరి. ఇంద్రుడు తన వేలిని అతని నోటిలో పెట్టి నేను రక్షించెదనని పల్కెను. అతడే మాంధాత. పెరిగి పెద్దవాడై చక్రవర్తి అయ్యెను. అతడంటే చోరులకు దోపిడిదార్లకు భయము. ఇంద్రుడు అతనిని ‘‘త్రసద్దస్యుడు’’ అని పిలిచెను. మాంధాత భార్య శశివిందుని పుత్రిక విందుమతి.

మాంధాతకు ఇద్దరు పుత్రులు – పురుకుత్సుడు, ముచుకుందుడు.

పురుకుత్సుని కొడుకు అరణ్యకుడు. ఇతనికి పితృభక్తి మెండు.

అరణ్యకుని కొడుకు – బృహదశ్వుడు.

బృహదశ్వుని కొడుకు – హర్యక్షుడు.

హర్యక్షుని కొడుకు – త్రిధన్వుడు.

అతని కొడుకు – అరుణుడు.

అరుణుని పుత్రుడు – సత్యవ్రతుడు. ఎనలేని సంపద ఉండెను. అతడు మూర్ఖుడు, లోభి, కాముకుడు. అనేక అపరాధములు చేయుచుండగా వశిష్ఠుడు అతనికి భూమండలమున త్రిశంకుడనే పేరుతో ఉందువని శపించెను.

త్రిశంకుని పుత్రుడు – హరిశ్చంద్రుడు.

 

 

 

 

 

 

 

 

7వ స్కంధము 30 వ కథ

దుర్గ, శతాక్షి, శాకంబరి నామముల చరిత్ర

 

జగజ్జననికి అనంతనామములు గలవు. యిప్పుడు చెప్పబోయే కథలో అమ్మవారికి దుర్గ, శతాక్షి, శాకంబరి అనే నామములు ఎట్లు వచ్చెనో చెబుతోంది.

ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశములో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకి పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు, దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు వేయి యేళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి, తన ఘోరతపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకొని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడిరచే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే యగునని వరమొసగి అంతర్థాన మయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేదమంత్రములు మరచిపోయిరి. స్నాన, జప, తప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నీ నశించెను. సృష్టి యంతటనూ ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిస్సులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు, వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు, పశువులు ప్రాణములు విడిచి పెడుతున్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అగుచుండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై బడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు, కొండలు, గుట్టల లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచు కాలము గడుపుచున్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనముల తిరుగుచు విచారించుచుండిరి. చివరకు హిమాలయములను చేరుకొని వారు కూడా ఆ పరమేశ్వరిని సమాధి, ధ్యానము, పూజల ద్వారా స్తుతించసాగిరి. ‘‘అమ్మా! నీ మాయవలనే యిట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తునుండి మమ్ములను కాపాడు తల్లీ! వేదాంతవేద్యవు. చిద్రూపిణివి, సకల ఆగమ శాస్త్రములు ‘సతి’, ‘సతి’ అని నిన్ను స్తుతించుచున్నవి. అమ్మా భగవతి శరణు శరణు అని వారంతా విలపించుచుండిరి.

అ భువనేశ్వరి, మహేశ్వరి అఖండ తేజముతో అనంత నేత్రములతో దివ్యరూపమున వారికి దర్శనమొసగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచుండెను. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు. ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తములందు సుశోభితములై ఉన్నవి. గొప్పధనుస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రములనుండి నీరు ఉబకసాగెను. తొమ్మిది రాత్రులు కుంభవృష్టి కురిసెను. కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ప్రాణులన్నీ సంతుష్టిని చెందాయి. నదులు సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటకి వచ్చిరి. వారును ఆ పరమేశ్వరిని మనః పూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి. వారి దీనమైన ఆలాపములను విని కరిగిపోయెను. అనేక శాకములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి, పశువులకు కొత్త తృణములను ఒసగెను. అందుచే ఆమెను వారందరూ ‘‘శాకంబరి’’ యని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును ఒసగినది కావున ఆమెను ‘‘శతాక్షి’’ నామముతో పిలిచిరి.

దుర్గమునికి ఈవార్త తెలిసి వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునకు వచ్చెను. భగవతి నలువైపుల నుండి తేజోమయ చక్రముచే దేవతలను కాపాడుచూ దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాలా, త్రిపుర, భైరవి, రమా, బగలా, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, దేవి తులజా, జంభినీ, మోహిని, ఛిన్న మస్త, గుహ్యకాళీ మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పిరి. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను.

మహేశ్వరికి, దుర్గమునికీ భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన ఐదు బాణములతో దుర్గముని ధ్వజము, రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చివేయగా ఆ భయంకర దానవుడు నేలగూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల, సకల దేవతలు అంబను వేనోళ్ళ శతాక్షియని, శాకంబరి యని, కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యులనుండి వేదములను లాగికొని దేవతల కొసగెను.

ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగెనని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని, వాటిని రక్షించవలెనని మధురముగా బల్కెను. నా చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యెను గనుక ‘‘దుర్గ’’ యను నామముతో తనను పిలిచిన వారు ఎవరైనను తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను.

నిరంతరము ఈ అధ్యాయమును శ్రవణము చేసినచో సకల శుభములు కల్గును. సకల కోరికలు సిద్ధించుటయే గాక అంతమున దేవీ సన్నిధానమునకు చేరుదురు అని వ్యాసుడు జనమేజయునికి పరమేశ్వరి మహిమను తెలిపెను.

ఆమె చరణ కమలములు దివ్య రత్నములు. శ్వాకేశ్వేతర శాఖాధ్యాయ మహాపురుషులు శ్రుతియందు స్పష్టముగా నిట్లు చెప్పిరి. జన్మ సాఫల్యమునకు భగవతి నారాధించి, త్యాగిjైు వైరాగ్యభావముతో ధ్యానము చేయాలి. వేదాంతము దీనిని స్పష్టీకరించినది. భగవతిని కీర్తించితే సంసార బంధములనుండి జనులు ముక్తులగుదురు. యిదిస్వయముగా వ్యాసముని జనమేజయునికి భగవతి అంబను ఆరాధించవలసిన విధానమును వివరించి చెప్పెను. సూర్య, చంద్ర వంశ రాజులెందరో ఆమెను ఉపాసించి పరమ ధార్మికులైరి.

8వ స్కంధము, 31 వ కథ

శ్రీ మహావిష్ణువు యజ్ఞ వరాహముగా ఆవిర్భవించుట

 

బ్రహ్మ మానస పుత్రుడగు నారదమహర్షి భూమండలమున విహరించుచు భగవంతుడగు నారాయణాశ్రమమును చేరెను. పురాణ పురుషోత్తముడు, జగదోద్థారకుడు, సర్వజ్ఞాని, అయన నారాయణుని ఆద్యతత్త్వమును గురించి తెలుపమని నారదుడడుగగా యోగీశ్వరుడైన ఆ స్వామి యిట్లు చెప్పెను.

స్వాయంభువ మనువు బ్రహ్మకుమారుడు. ఆయన భార్య శతరూప. ఒకసారి ఆ మనువు తన తండ్రిని ప్రజాసృష్టి జరుగు మార్గమునకు సాధన గూర్చి అడుగగా బ్రహ్మ భగవతీ భువనేశ్వరిని ఉపాసించమని చెప్పెను. మనువు వెంటనే వేదమయి, సకల దేవతారాధ్యమయి పరమేశ్వరిని అనేక విధముల స్తుతింపగా ఆ దేవి ప్రసన్నురాలై ఈ ప్రజాసృష్టి తప్పక జరుగునని ఎవరైనను భక్తితో తనను ప్రసన్నురాలను చేసుకొని అతడు చేసిన స్తోత్రమును చదివినచో వారి కీర్తి, విద్య, ప్రజలు, తేజస్సు వృద్ధి పొందునని చెప్పెను. ఆమె అంతర్థానమవగానే స్వయంభువ మనువు మరల తన తండ్రి వద్దకు వచ్చి ఆ దేవి తనను కరుణించి వరమొసగెనని చెప్పెను.

బ్రహ్మకు సందేహము కలిగెను. తాను ఎప్పటినుండో ఈ జగత్తును సృష్టించుచున్నాను అది నిలవక నీటిలో కలిసిపోవుచున్నది. అతడిట్లు ఆలోచించుచుండెను. సకల దేవతలు, మరీచి నలువైపులా విరాజమానులై ఉన్నారు. ఇంతలో బ్రహ్మ నాసిక అగ్రభాగము నుండి ఒక చిన్న వరాహ శరీరము అకస్మాత్తుగా ప్రకటితమయ్యెను. దాని పొడవు కేవలము ఒక అంగుళము. అది అలా అలా పెరగసాగెను. దాని ఆకారము ఒక పెద్ద ఏనుగువలె అయ్యెను. బ్రహ్మాది దేవతలందరూ ఆ సూకర రూపమును చూసి ఆశ్చర్యపోయిరి. మొదట అంగుష్ఠ ప్రమాణమై యిట్లు విశాల రూపము పొందినది. ఇది తప్పక ఆ మహావిష్ణువే అయి ఉండునని వారంతా తలచిరి. అప్పుడు ఆ వరాహము పెద్ద శబ్దముతో ఘర్జించెను. సర్వలోకవాసులు, మునులు, యోగులు ఆ ఘర్‌ఘరావమును విన్నారు. ఋక్‌, సామ, యజుర్వేదములో ఉన్న ఉత్తమ వైదిక స్తోత్రముల ద్వారా ఆ వరాహస్వామిని స్తుతించారు. ఆ స్తుతులను విని కరుణామయుడైన స్వామి వారి ననుగ్రహించెను. వెంటనే అచటి జలములోనికి ప్రవేశించెను. అతని భయంకరమైన తాకిడికి సముద్రుని హృదయమున అలజడి రేగెను. నన్ను రక్షింపుము అని ప్రార్థన చేసాడు సముద్రుడు. ఆ వరాహస్వామి జలముల అడుగున చొచ్చుకొని పోయి భూమిని వెదకుచు నలువైపులా ఆ జలములో తిరుగుచుండెను. అన్ని వైపులా వాసన చూస్తూ జలము అడుగునకు, రసాతలమునకు వెళ్ళి అక్కడ పృధివి ఉనికిని తెలుసుకొని అ భూమిని తన కోరల కొనలతో పైకెత్తెను. ఆ సమయమున ఒక పెద్ద ఏనుగు కమలమును తన దంతములమీద ఉంచుకొనెనా అనునట్లు ఆ యజ్ఞేశ్వరుడు, యజ్ఞవరాహస్వామి వెలుగుచుండెను. భూమిని తన కోరలపై నిలిపి ప్రకాశించుచుండిన స్వామిని చూచి సకల దేవతలు గొప్ప శాంతిని పొందిరి. బ్రహ్మ కమల లోచనుడైన ఆ శ్రీహరికి ప్రణామము చేసి స్వామీ సకల చరాచర సృష్టి చేయమని నన్ను నియమించావు. నీ సహాయముననే దేవతలు అమరులైరి. అగ్ని, ఇంద్రుడు, సూర్య చంద్రులు నీ ఆనతిమీదనే సర్వకార్యముల నొనర్చుచున్నారు. దిక్పాలకులు నీ ఆజ్ఞకు బద్ధులు. యక్ష, కిన్నెర, కుబేరులు నీ అధీనులు. సర్వము నీ విభూదియే అని అనేక విధముల ఆ స్వామిని స్తుతించెను. అదే సమయమున అచటికి హిరణ్యాక్షుడు వచ్చెను. వాడు అహంకారియై మార్గమును ఆపగా శ్రీహరి గదాఘాతముతో వానిని హతమార్చెను. భూమిని జలముపై నిడెను. ఆ దానవుని రక్తముచే స్వామి దేహము తడిసిపోయెను. కోరల సాయముతో స్వామి పృధివిని ఎత్తెను. జలముపై దింపెను. పిదప తన పరంధామమునకు వెళ్ళిపోయెను. ఆ భూమిని రసాతలమునుండి తెచ్చుటకు స్వామి అట్టి వరాహరూపమును పొంది లీల చేసెను. ఈ ఉత్తమ చరిత్ర అధ్యయనము, శ్రవణము, సకల పాపములను హరించును. విష్ణులోకమునకు వెళ్ళుటకు అర్హుడగును.

 

 

 

8వ స్కంధము, 32 వ కథ

ప్రాణుల సృష్టి

 

దేవతలు, మానవులు, పశువులు మొదలగు ప్రాణులసృష్టికి కారణము ఎవరు అనే విషయం తెలుసుకుందాం.

బ్రహ్మ కుమారుడైన స్వాయంభువ మనువు తండ్రి ఆజ్ఞ ననుసరించి తన హృదయమునందు ప్రజాసృష్టి చేయుటకు సంకల్పించెను. అతడి భార్య శతరూప. మనువుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు మరియు అకూతి, దేవహూతి, ప్రసూతి. అకూతిని రుచి అను వానికి, దేవహూతిని కర్దమ మునికి, ప్రసూతిని దక్షప్రజాపతికి వివాహము జరిపించెను. వీరికి పుట్టిన ప్రజలందరూ జగత్ప్రసిద్ధి పొందిరి.

రుచికి అకూతి గర్భమున అదిపురుషుడైన భగవంతుడు యజ్ఞపురుషుడుగా జన్మించెను. కర్దముడు, దేవహూతులకు భగవంతుడు కపిలుడుగా ప్రకటితమయ్యెను. ఈ కపిలుడు సాంఖ్యశాస్త్రమునకు ఆచార్యుడు.

దక్షప్రజాపతికి ప్రసూతి ద్వారా అనేక కన్యలు ఉదయించిరి. వీరికి దేవతలు, మానవులు, పశువులు మొదలగు సంతానము కలిగినది. స్వాయంభువ మనువు మన్వంతరము నందు యజ్ఞపురుషుడు ప్రకటితమవ్వడం, మహాత్ముడు, యోగి, భగవంతుడైన కపిలుడు కర్దముని ఆశ్రమంలోఉండి తన తల్లిjైున దేవహూతికి పరమ జ్ఞానోపదేశము చేయుట జరిగినది. ఆయన ముందు సమస్త విద్యలు శిధిలములయ్యెను. ధ్యానయోగములను, ఆధ్యాత్మ సిద్ధాంతమును కపిలుడు ప్రతిపాదించెను. సకల అజ్ఞానమును తొలగించే ఆ శాస్త్రమే కపిల శాస్త్రముగా, కపిల గీతగా ప్రసిద్ధి చెందెను. అతడు గొప్పయోగి. సాంఖ్యశాస్త్రము ప్రవక్తకుడు, తల్లికి జ్ఞానోపదేశము చేసి అతడు వనములలో పులహుడు అనే ముని ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. యిప్పుడు కూడా ఆ స్వామి అచ్చటనే విరాజమానుడై యున్నాడు. అతడి పేరు తలచుకోగానే సాంఖ్యయోగము సిద్ధించును. ఇట్లు స్వాయంభువ మనువు యొక్క ముగ్గురు పుత్రికల ద్వారా ఈ దేవతలు, మానవులు, పశువుల సృష్టి జరిగినది.

 

 

 

8వ స్కంధము, 33 వ కథ

సప్త ద్వీపములు –  సప్త సముద్రములు

 

సప్తద్వీపములు, సప్త సముద్రములు ఎట్లు ఉత్పన్నమయ్యెనో తెలుసుకుందాం.

బ్రహ్మపుత్రుడైన స్వాయంభువ మనువు యొక్క జ్యేష్ట కుమారుడు ప్రియవ్రతుడు. తండ్రి సేవయందే లగ్నమై యుండే వాడు. పిత్రుభక్తి మెండు. విశ్వకర్మ యను ప్రజాపతి యొక్క పుత్రిక బర్హిష్మతితో వాని వివాహము జరిగినది. ఆమె మంచి గుణవతి, శీలవతి.

వారికి 10 మంది పుత్రులు పుట్టారు. ఒక కుమార్తె. పేరు ఊర్జస్వతి. కుమారులు అగ్నేద్రుడు, యుద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, రుక్మశుక్రుడు, ధ్రుతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, అగ్నిహోత్రుడు, కవి. వీరిలో ముగ్గురు వైరాగ్యముతో ఆత్మవిద్యాసాధనకై పరమహంసాశ్రమము స్వీకరించారు.

ప్రియవ్రతుని రెండవ భార్యకు ముగ్గురు పుత్రులు ` ఉత్తముడు, తాపసుడు, రైవతుడు. వారు ఒక్కొక్క మన్వంతరములకు అధిష్టాతగా ఉన్నారు.

ఒకనాడు సూర్యుడు భూమియొక్క ప్రధమభాగమున ఉదయించునప్పుడు ఆ భాగమంతా వెలుగుగానూ, రెండవభాగము అంధకారముగాను ఉండుట ప్రియవ్రతుడు గమనించి తన పాలనలో చీకటి భూమి మీద ఉండరాదని తన తపోబలముచే దానిని నివారించుతునని, సూర్యునితో సమానమైన రథమును ఎక్కి ఆ ప్రకాశమును వ్యాపింపజేయుచు ప్రధివికి ఏడుసార్లు ప్రదక్షిణ చేసెను. అలా పరిక్రమణ చేయునపుడు భూమిమీద గుంతలు ఏర్పడెను. అవి ఈ జగత్తుకు శ్రేయస్సు కలిగే ఏడు సముద్రములయ్యెను. వాటి మధ్య భూమి ఏడు దీవులుగా ఏర్పడెను. ఆ రథ చక్రపుటంచుల గుర్తుగల భాగములు పెద్ద అగడ్తలై ఏడు సముద్రములుగా మారెను.

జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కరములను నామములు ఆ ద్వీపములకు కల్గెను. జంబూద్వీపే అని మనం పూజకు సంకల్పం చెప్పుకుంటాము కదా అదే ఈ జంబూ ద్వీపం. ఒక దానికంటే మరోటి రెండిరతల పరిమాణములో పెద్దవి. వీటికి నలువైపులా విభాగ క్రమములో సముద్రములున్నవి.

  1. క్షారోదక 2. ఇక్షురసోదక 3. సురోదక 4. ఘృతోదక 5. క్షీరోదక 6. దధిమండోదక 7. శుద్ధోదక. వీటికే సప్తసముద్రాలని పేరు.

క్షార సముద్రముతో పరివృతమయిన మొదటి ద్వీపము జంబూ అనే పేరుగలది. అగ్నేద్రుడు దీనికి రాజు.

రెండవది పక్ష ద్వీపము ` చెఱుకు రసముతో నిండిన సముద్రము దీని చుట్టూ ఉన్నది. యుద్మజిహ్వుడు దీనికి అధిపతి. సురాసముద్రముచే చుట్టబడి ఉన్న శాల్మలి దీవికి యజ్ఞబాహువు రాజు.

అందమైన కుశ ద్వీపము చుట్టూ నేతి సముద్రము ఉంది. హిరణ్యరేతుడు దీనికి రాజు.

ధ్రుతపృష్ఠుడు క్రౌంచ ద్వీపమునకు అధిపతి దీని చుట్టూ క్షీరసాగరమున్నది.

శ్రేష్ఠమైన సుందరమైన శాక దీపము దధి మండోదక సముద్రముచే చుట్టబడి ఉంది. ఈ ద్వీపమునకు మేధోతిథి రాజు.

పుష్కర ద్వీపము మంచినీటి సముద్రముచే చుట్టబడి ఉన్నది. వీతిహోత్రుడు అధిపతి.

ప్రియవ్రతుని పుత్రిక ఊర్జస్వతి వివాహం శుక్రాచార్యునితో జరిగినది. యితడు రాక్షసుల గురువు. దేవయాని వీరికి పుత్రికగా జన్మించెను. యిట్లు సప్తద్వీపములు, సప్త సముద్రములు ప్రియవ్రతుని వలన ఏర్పడెను.

 

చూసారా మనం చూసే సముద్రాలు, ద్వీపాలు ఎలా ఏర్పడ్డాయో.

1 thought on “దేవీ భాగవతం – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *