March 28, 2024

ధృతి – 10

రచన:-మణి గోవిందరాజుల

“అమ్మా! అంతా బానే అయింది కానీ… ఆ పెళ్ళి వాళ్ళ ప్రవర్తనే నాకు నచ్చలేదు. కరణం అంకుల్ని అలా తీసిపడేసింది ఒక చిన్న పిల్ల. పెద్దవాళ్ళు కనీసం చెప్పనన్నా లేదు. మగపిల్ల వాళ్ళు అనగానే అంత పొగరుగా ఉంటారా?” అక్కడి విశేషాలన్నీ చెప్తూ తాంబూలాల సందర్భంలో జరిగిన సంఘటన చెప్తూ ఆశ్చర్యంగా అడిగింది.
“ఆ అమ్మాయి స్వభావం అది అయి ఉంటుంది. రేపు ఆ అమ్మాయి తన పెళ్ళిలో కూడా తాను తగ్గదు. అప్పుడు ఆ మగపిల్లాడు వాళ్ళు ఏడ్చుకోవాలి” నవ్వుతూ అని “ఆడపిల్లవాళ్ళయినా, మగపిల్లాడి వాళ్ళయినా… పెళ్ళి తర్వాత ఆ కుటుంబం తమ కుటుంబంలో కలుస్తుంది, ఆ ఇంటి గౌరవాన్ని కాపాడడం తమ బాధ్యత అనుకుంటే అసలు పెళ్ళిళ్ళల్లో గొడవలే ఉండవు. పెళ్ళి తర్వాతా ఉండవు. అయినా ఇదంతా మన చర్చల్లో తేలే సంగతి కాదు కానీ, రెస్ట్ తీసుకోపో…”
ఆర్తీకార్తీ ఆ అమ్మాయి ఎలా అరిచిందో, ఎలా గెంతిందో యాక్షన్ చేసి చూపించారు. అందరూ నవ్వసాగారు. “ఒకళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే అందరికీ నవ్వులాటగా ఎలా ఉంటుందో కదా?” వాళ్ళను చూస్తూ అనుకున్నది ధృతి.
“అమ్మా! అన్నం తిన్నాక నేనెళ్ళిపోతాను. మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక వస్తాను” అన్నాడు శివ
“శివా… శివా! ఈ రోజుండి రేపెళ్ళు. ప్లీజ్… ప్లీజ్!” బ్రతిమాలసాగారు ఆర్తీకార్తీ.
ఆడుకుంటూ ఎగురుకుంటూ వాళ్ళు సందడి చేయసాగారు.
******
చూస్తుండగానే పరీక్షలు అయిపోయాయి. విశ్వ పరీక్షలు రాసాడే కానీ మనసంతా దిగులుగా అయింది. “అయ్యో! రోజులు గడిచిపోతున్నాయి. నేనేమో చెప్పలేకపోతున్నాను. ఇవ్వాళ్ళ కలిసి రేపు ఐ లవ్ యూ అని చెప్పే ఈ రోజుల్లో నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను?” తనను తాను ప్రశ్నించుకున్నాడు. “తనది పై పై ఆకర్షణ కాదు. ఏదన్నా చెప్పాక ధృతి ‘యూ టూ బ్రూటస్’ అన్నదంటే తాను తట్టుకోలేడు. పోనీ ఎవరిదన్నా మధ్యవర్తిత్వం తీసుకుందామంటే భయం” రక రకాలుగా ఆలోచిస్తున్నాడు.
ధృతి ఆడుతూ పాడుతూ పరీక్షలు రాసేసింది. గ్యారంటీగా క్లాస్ ఫస్ట్ ఖాయం. సెలవులిచ్చారు. మధ్య మధ్య ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. విశ్వతో కూడా మునపటిలానే కలుస్తూనే ఉన్నది, అతని కళ్ళల్లోని ఆరాధనను చూస్తునే ఉన్నది. కాని తనంతట తాను బయటపడదల్చుకోలేదు.
శివకు ఎస్సై గా పోస్టీంగ్ వచ్చింది. ట్రైనింగ్ జరుగుతున్నది. శివ లేకుండా పల్లెటూరులో తల్లిని ఉంచడం దినేష్ కి ఇష్టం లేకపోయినా రంగనాయకమ్మ రాను అనేసరికి ఏమి చేయలేకపోయాడు. అందుకని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అక్కడికి వెళ్ళి రావడం అలవాటు చేసుకున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడే కరణంగారమ్మాయి పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళివాళ్ళు బాగా ఏడిపించారని విని ఇంట్లో అందరూ బాధ పడ్డారు. ధృతి ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నది ఆస్తి, అందమూ కాదు గుణం ముఖ్యం అని.
ఆ రోజు రిజల్ట్స్ వచ్చాయని కాలేజీకి వచ్చారు అందరూ. ఒక చెట్టుకింద ఉన్న బెంచ్ మీద కూర్చుని ఫ్రెండ్స్ తో బాతాఖానీ వేస్తున్న ధృతి దగ్గరకు వడి వడిగా వచ్చాడు విశ్వ. ధృతి ఎక్కడుంటే అక్కడ నవ్వుల మతాబులే. ఏదో జోక్ వేసినట్లున్నది అందరూ పడీ పడీ నవ్వుతున్నారు.
“ఇంత హాయిగా నవ్వుతున్న ధృతిని తాను జీవితాంతమూ అలాగే ఉంచగలడా?” వాళ్ళ దగ్గరకు వచ్చి నించుని ఆలోచనలో పడిపోయాడు విశ్వ.
“హై విశ్వా! హార్టీ కంగ్రాచ్యులేషన్స్” విశ్వను చూసి సంతోషంగా లేచి వచ్చి అభినందించింది ధృతి.
“థాంక్యూ ధృతీ… నీక్కూడా అభినందనలు. కాలేజ్ ఫస్ట్ వచ్చావుగా” తాను కూడా చెప్పాడు గ్రీటింగ్స్.
“థాంక్యూ బాస్… మనవాళ్లేరి? ఇది సెలెబ్రేషన్ టైం. చలో… చలో…”
అక్కడున్న వాళ్ళంతా కూడా విశ్వను అభినందించి వెళ్ళారు. ఆఖరి స్టూడెంట్ కూడా వెళ్ళేదాకా ఆగి ఇద్దరూ కాంపస్ లో నడవసాగారు.
వాతావరణం చాలా హాయి గొలుపుతున్నది. ఇంటర్నల్ రోడ్స్ కి అటూ ఇటూ ఉన్న చెట్లనుండి వీస్తున్న గాలి చక్కిలిగింతలు పెడుతున్నది.
“అవునూ ఇంతకూ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నావా? పిలిచి ఇస్తున్నారుగా? ప్రౌడ్ ఆఫ్ యూ”
తమను అభినందిస్తున్న వాళ్ళకు థాంక్స్ చెప్తూ మాట్లాడసాగింది ధృతి. కొద్దిసేపయ్యాక గమనించింది, తానొక్కతే మాట్లాడుతున్నది. విశ్వ వింటున్నాడో కూడా తెలీకుండా అన్యమనస్కంగా నడుస్తున్నాడు అని.
“హలో మిస్టర్! ఏంటి సంగతి? అమ్మనొదిలి వెళ్తున్నానని బెంగగా ఉన్నదా?” టీజ్ చేసింది.
“ధృతీ! నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇక్కడ కాదు కానీ బయటకెళ్దాం పద” ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా పార్కింగ్ వేపు దారి తీసాడు.
అతనిలో జరిగే అలజడిని అర్థం చేసుకున్నట్లుగా మారు మాట లేకుండా అనుసరించింది.
“నీ బైక్ ఇక్కడే ఉండనీ. మళ్ళీ వచ్చి తీసుకుందాము. నా కార్లో వెళ్దాం పద” అంటూనే కార్లో కూచుని స్టార్ట్ చేసాడు.
ఎక్కడికి? ఎందుకు అని అడగకుండా కారెక్కి కూచున్నది. సరాసరి ఇంటికి తీసుకెళ్ళాడు.
అప్పుడే వసంతా, రాజారావులు బయటినుండి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని కాఫీ తాగుతున్నారు. వాళ్ళకు చాలా ఆనందంగా ఉన్నది. కొడుక్కి గోల్డ్ మెడల్ రావడమే కాక, అమెరికాలో పేరున్న పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్ రావడం వాళ్ళకు చాలా గర్వంగా కూడా ఉన్నది. ఆ సంతోషాన్ని పెద్దవాళ్ళతో షేర్ చేసుకుని ఇంటికొచ్చారు. రాగానే కొడుకు రావడం వాళ్ళకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది.
“రారా! రామ్మా ధృతీ బాగున్నావా? కంగ్రాచ్యులేషన్స్! ఇందాకే మావాడు చెప్పాడు. చాలా సంతోషమమ్మా” ఆప్యాయంగా పలకరిస్తూనే అభినందించారు ఇద్దరూ.
“థాంక్స్ అండీ… “ నమస్కారం పెడుతూ సమాధానం ఇచ్చింది ధృతి. వాళ్ళకు ధృతి చాలా నచ్చుతుంది. ఇంట్లో పెళ్ళీడు పిల్లాడుంటే అందమైన ఏ అమ్మాయిని చూసినా “ఇలాంటి అమ్మాయిమా కోడలైతే బాగుండును” అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో అందంతో పాటు సంస్కారం ఉన్నట్లుగా అనిపిస్తే మరీను. అలాగే ధృతిని చూసిన ప్రతిసారీ “ఈ పిల్లకు ఎక్కడ రాసిపెట్టున్నదో కాని వాళ్ళు అదృష్టవంతులు” అనుకుంటారు వారిద్దరూ.
లోపలికి వెళ్ళి ఇద్దరికీ కాఫీ కలిపి తీసుకుని వచ్చింది వసంత. తాగాక “గార్డెన్ లో కూర్చుందాము ధృతీ” చెప్తూ గార్డెన్ లోకి దారి తీసాడు
ఈడూ జోడూగా ఉన్న వారిద్దరూ ఇంకా బాగా నచ్చారు రాజారావు దంపతులకు.
చిన్న స్థలమే అయినా పొందిగ్గా డిజైన్ చేయించుకున్నది వసంత. పగలూ సాయంత్రం అని లేకుండా ఏ సమయంలో కూర్చున్నా హాయిగా ఉండేట్లు ఒక గొడుగు, దానికింద నాలుగు కుర్చీలు వేసి ఉంటాయి. చుట్టు పక్కల ఒక లైన్ అంతా గులాబీ మొక్కలు, కొద్దిగా అవతలికి రక రకాల పూల మొక్కలు, గోడలకు కొద్దిగా ఇవతలికి అన్ని రకాల క్రీపర్స్ చక్కగా పందిర్లు వేసి పాకించింది. ఒక రకమైన ఆహ్లాద కరమైన వాతావరణం మనసును తాకుతున్నది.
“కూర్చో!”కుర్చీ లాగుతూ చెప్పి తానో కుర్చీలో కూర్చున్నాడు.
“ఎంత బాగుంటుందో మీ గార్డెన్. నాకు చాలా ఇష్టం” చుట్టూ చూస్తూ ప్రతి సారిలానే మెచ్చుకున్నది. ధృతికి మనసంతా ఉద్విగ్నంగా ఉన్నది. ఎంత అల్లరిపిల్ల అయినా, ఎంత మెచ్యూరిటీ వచ్చినా, అతనేమి అడగబోతాడో తెలుస్తుండడం వల్ల కొద్దిగా సిగ్గుగా కూడా ఉన్నది. దాంతో ఎప్పటిలా సంభాషణ సాగడం లేదు.
“ధృతీ! ఎప్పటి నుండో నీకీ సంగతి చెప్పాలని ఉన్నా ధైర్యం చాల లేదు. కాని ఇప్పుడు కూడా చెప్పకపోతే ఆ తర్వాత అవకాశం రాదేమో అన్న భయంతో ఇప్పుడు చెప్తున్నాను. ధృతీ! మొదటి సారి నిన్ను చూసిన క్షణం నాలో నిలిచి పోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మేవాణ్ణి కాదు కానీ ఇప్పుడు నమ్మాల్సొస్తున్నది. ధృతీ ఐ లవ్ యూ” ఎన్నో అనుకుని, రిహార్సల్స్ వేసుకున్నవి ఏవీ గుర్తు రాక ఆ క్షణానికి తోచిన ముక్కలు చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు.
ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకుని కూర్చున్న ధృతిని చూస్తూ కొనసాగించాడు. ‘మా ఇల్లు, మా అమ్మావాళ్లను చూసావు కదా? నువు నీ ఇష్ట ప్రకారం ఉండొచ్చు. నీ చదువయ్యాకే, నాకు మంచి జాబ్ దొరికాకే పెళ్ళి చేసుకుందాము. నీ నిర్ణయం చెప్తే నేను ప్రశాంతంగా నా చదువు కొనసాగిస్తాను”
అప్పటికీ ఏమీ మాట్లాడలేదు. ధృతికి ఒకపక్క నవ్వూగానూ, ఒకపక్క ఒకరకమైన డిసప్పాయింట్మెంట్ గా ఉన్నది. ఎంతో ఊహించుకున్న సందర్భం ఇంత చప్పగా అయిందే అని కొద్ది నిరాశ మనసును ఆవరించుకున్నది. విశ్వ అవస్థ చూస్తుంటే నవ్వొస్తున్నది…
“నీ అభిప్రాయం చెప్తే నేను, మా అమ్మావాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతాము. నాకు చాలా టెన్షన్ గా ఉన్నది. నువు నో అంటే నా పరిస్థితి ఏంటా అని”
అప్పుడు నోరు విప్పింది ధృతి. కొద్దిగా సర్దుకున్న ధృతిలో ఎప్పటి అల్లరిపిల్ల ప్రవేశించింది. “ఆ.. అయితే ఏంటిటా? నువు ఐ లవ్యూ అనగానే మీ టూ అనాలా?” సర్కాస్టిక్ గా అడిగింది.
“అదేంటి ధృతీ? అందుకే నీ అభిప్రాయం అడిగానే కాని, డిమాండ్ చేయలేదు కదా?” బిక్కమొహం వేసుకుని అడిగాడు విశ్వ.
“నాకవన్నీ తెలీదు…ఇలాగేనా ఒక ఆడపిల్లకు ప్రపోజ్ చేసేది? క్యాండిల్ లైట్ డిన్నర్ ఏది? పరిమళ భరితమైన వాతావరణం ఏది? నీ చేతిలో గులాబీ పువ్వేది?” ఈసారి ఇంకాస్త ఎక్కువ కోపం చూపెట్టబోయినా ఆపుకోలేని నవ్వు బయటికి వచ్చింది.
ధృతి నవ్వు చూసి కాస్త తేరుకున్నాడు. “బయట ఎక్కడన్నా మనం హోటల్లో కనపడితే మనవాళ్ళు తాటాకులు కడతారు. అందుకే ఇక్కడకు తీసుకు వచ్చాను. నువ్వొక గులాబీ అడుగుతున్నావు. నేను నిన్ను గులాబీ వనంలో కూర్చోబెట్టి అడుగుతున్నాను” తానూ అంతే సరదాగా రిప్లై ఇచ్చాడు.
“పర్లేదే… బానే చెప్పావు. మెచ్చుకున్నాను భక్తుడా” సరదాగా అని గొంతు సవరించుకున్న ధృతిలో సీరియస్ నెస్ చోటు చేసుకున్నది. “విశ్వా! ఫస్ట్ థింగ్ నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం అనేది పక్కనపెడితే, నేను మా అమ్మావాళ్ళను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకోను. సెకండ్ థింగ్ నా ఉద్దేశ్యంలో నాకింకా పెళ్ళి గురించి ఆలోచించే వయసు రాలేదు. ఇంకా చెప్పాలంటే నీక్కూడా రాలేదు. హాయిగా చదువుకోవటానికి వెళ్ళు. గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో సీట్ వచ్చింది. యు ఆర్ సో లక్కీ. అఫ్కోర్స్.. అదంతా నీ మేధస్సు ఫలితమే. మనం ఫ్రెండ్స్ గా టచ్ లోనే ఉందాము. భవిష్యత్ అంతా నీ చేతిలోనే ఉన్నది. ఇప్పుడు నేను నీకు ఏ మాటా ఇవ్వలేను. సో బి హాపీ… అండ్ గో ఫర్ స్టడీస్”
“అలాక్కాదు. నువు ఏదో ఒక మాట చెప్తే…”
మళ్లీ నవ్వింది “ఏదో ఒక మాట చెప్పటానికి ఇది కూరగాయల బేరమా?” హర్ట్ అయినట్లు చూసాడు విశ్వ.
“హర్ట్ కాకు… నువ్వలా అనగానే నాకు నవ్వొచ్చింది, దానికి నేనేమీ చేయలేను. ఐతే కచ్చితంగా నా బీటెక్ పూర్తయ్యేదాకా పెళ్ళి చేసుకోను. అంటే నీకు మూడేళ్ళ వ్యవధి ఉన్నది. మా అమ్మా నాన్నలకు తెలీకుండా ప్రేమలో పడే అవకాశం కూడా లేదు”
“అది కాదు. మొన్నలా మంచి సంబంధం వచ్చిందని పెద్దవాళ్ళు బలవంతం చేస్తేనో?” సంశయంగా అడిగాడు.
“చెప్పా కదా? నాకు పెళ్ళికంటే చదువు ముఖ్యం. మొన్నేదో మా బామ్మ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు ఆశపడ్డారు. అందుకే అలా అయింది. నేను నా మనసులో ప్రేమ దాచుకుని ఇలా చెప్తున్నానేమో అనుకోకు. హండ్రెడ్ పర్సెంట్ నాకెలాంటి ఉద్దేశ్యమూ లేదు. కాకపోతే కా లం గడుస్తున్నకొద్దీ ఎలా ఉంటుందో చెప్పలేము. లెట్ అజ్ వెయిట్ అండ్ సీ.. ఇక నన్ను కాలేజీ దగ్గర దింపితే నా బైక్ వేసుకుని ఇంటికి చేరతాను. అయినా ఇంత చప్పగా చెప్పేదానికి అక్కడే చెప్పినట్లైతే నీకు ఈ శ్రమ తగ్గేది” మళ్ళీ నవ్వింది చిలిపిగా.
“ఈ సారి ఎవరికన్నా ప్రపోజ్ చేసేప్పుడు ఎలా చెయ్యాలో క్లాసెస్ తీస్కో… బై.. బై!” పక పకా నవ్వుతూ కార్ దిగి బై చెప్పింది.

******

“మీకేమైనా పిచ్చా? అసలు ఆ అమ్మాయికి మనవాడికి వయసు తేడా ఉన్నది. వాళ్ళకూ మనకూ అంతస్తుల తేడా ఉన్నది. కులాల తారతమ్యం ఉన్నది. ఆ అమ్మాయి చదువు ఇంకా మొదట్లోనే ఉన్నది. మీకేమయిందో నాకర్థం కావటం లేదు. అసలు ఏమి చూసి మీరు ఆ అమ్మాయి వెంట పడుతున్నారో నాకర్థం కావటం లేదు” చిరాగ్గా అరిచింది స్వాతి భర్త మీద.

ఇంకా ఉన్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *