March 28, 2024

సాఫ్ట్ వేర్ కథలు – మైసూరు బజ్జీ

రచన: రవీంద్ర కంభంపాటి

కొత్త ఉద్యోగంలో చేరేది ఆ రోజేననేమో.. ఆ రోజు నిశ్చలకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. కాసింత టెన్షన్ కూడా ఉంది. పాత ఉద్యోగంతో పోలిస్తే ఇక్కడ నలభై శాతం జీతం ఎక్కువ ఆఫర్ చేసేరు. పైగా అందమైన కేంపస్, జిమ్మూ గట్రా అదనం !
ఆఫీస్ క్యాంపస్ లోకి అడుగుపెడుతూనే, తల్లి ఫోను, ‘ఏమే.. జాగ్రత్తగా చేరేవా ?’ అంటూ. ‘చిన్న పిల్లనా ఏమిటి ? బాగానే వచ్చేసేను.. చూడు మా క్యాంపస్ ఎంత బాగుందో ?’ అంటూ అప్పటికప్పుడు ఓ సెల్ఫీ తీసుకుని, వాట్సాప్ చేసి, ‘తర్వాత మాట్లాడతానని ‘ ఫోన్ పెట్టేసి, ‘ఫీలింగ్ లక్కీ ‘ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫోటో అప్లోడ్ చేసింది.
మొదటిరోజున ఓరియెంటేషన్ ప్రోగ్రాం హెచ్చార్ వాళ్ళతో ఉంటుంది, ఫలానా బిల్డింగ్ లో అని మూడు రోజుల క్రితం మెయిల్ వచ్చింది. మెయిల్ ప్రింటవుట్ తీసుకుని, నేరుగా ఆ బిల్డింగ్ కి వెళ్ళింది.
బిల్డింగ్ ముందు లాబీలో ఓ చిన్న బోర్డు, దాని మీద ‘కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి స్వాగతం ‘ అంటూ గులాబీ పువ్వులతో డెకరేషన్ కనిపించింది. ఒక్కసారి పాత కంపెనీ గుర్తుకు వచ్చింది, ఎవరి పని వాళ్ళు పట్టించుకోవడమే తప్ప, ఇలా ఎంప్లాయిస్ ని ఆహ్లాదంగా ఉంచేవేవీ అక్కడ ఉండేవి కావు.
ఆలోచనల్లోంచి బయటపడి, ఆ ఓరియెంటేషన్ జరిగే మీటింగ్ హాల్ వైపు నడిచింది. అప్పటికే ఆ మీటింగ్ రూమ్ లో తనలా కొత్తగా జాయినైన వాళ్ళనుకుంటా.. ఓ ఇరవై మంది దాకా ఉన్నారు. అందరూ చాలా ఉత్సాహంగా, దర్జాగా కనిపించేరు. కొంచెం ముందు వరసలో సీట్ వెతుక్కుని కూచుని, పక్క సీట్లలో ఉన్నవాళ్ళని పరిచయం చేసుకుంది.
వాళ్ళు కూడా తనలాగే, క్యాంపస్ ఎంత గొప్పగా ఉందో చెబుతున్నారు.
‘రోజూ ఆఫీస్ కి వచ్చి పని చేసుకోవడమే కాకుండా, ఇలా పచ్చని లాన్లు, అందమైన చెట్లు నుంచొచ్చే చల్లని గాలి. వీలైనప్పుడు జిమ్, స్పోర్ట్స్.. ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం మన అదృష్టం కదా ‘ అంది పక్క సీట్లోని రమ్య
‘అవును. వియ్ ఆర్ రియల్లీ లక్కీ.. ‘ అంది అటుపక్క సీట్లోని సుధ.
ఇంతలో హెచ్చార్ హెడ్ తో పాటు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఒకాయన రావడంతో రూమ్ లో అందరూ సైలెంటయ్యేరు
విగ్నేష్ అనే ఆ వైస్ ప్రెసిడెంట్ తనని తాను పరిచయం చేసుకుని, తనతో పాటు వచ్చిన హెచ్చార్ మేనేజర్ ఆదర్శ్ ని పరిచయం చేసేడు.
విగ్నేష్, జాయిన్ అయిన వాళ్ళ వివరాలు అడిగి, ఆ తరువాత, తమ కంపెనీ అసలు ఎలా పుట్టిందీ, దాని చరిత్ర, ప్రస్తుతం ఏ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏమేం చెయ్యబోతున్నారు అనే విషయాలు వివరించి, ఇవాళ మిగతా సెషన్స్ అన్నీ ఆదర్శ్ చూసుకుంటాడు, నేను మిమ్మల్ని రాబోయే రోజుల్లో రెగ్యులర్ గా కలుస్తూంటాను ‘ అనేసి -అందరికీ బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళిపోయేడు.
ఆదర్శ్, ‘మనం మన కంపెనీ పాలిసీలు తెలుసుకునే ముందు చిన్న టీ బ్రేక్ తీసుకుందాం’ అనగానే, అందరూ ఆ మీటింగ్ హాల్ బయటికి వెళ్ళేరు.
అప్పటికే అక్కడ టేబుల్స్ అరేంజ్ చేసి, వాటి మీద రకరకాల స్నాక్స్ ప్లేట్లలో పెట్టి ఉన్నాయి. యూనిఫామ్ వేసుకున్న ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు ఆ ప్లేట్లని అందరికీ అందించి, కాఫీయా టీయా అని అడిగి, అందరికీ ఇస్తున్నారు.
నిశ్చల సుధతో అంది, ‘మా పాత కంపెనీకి దీనికీ ఎంత తేడా ఉందో ! అక్కడ పని చేసుకున్నామా వెళ్లిపోయేమా అన్నట్టు ఉండేది.. ఇక్కడ చూడు, ఎంప్లాయిస్ ని ఎంత బాగా చూసుకుంటున్నారో ? అక్కడైతే టీ తప్ప ఏదీ ఫ్రీ కాదు.. అదే ఇక్కడ చూడు ? ఎన్ని స్నాక్స్ పెట్టేరో !’, ‘ట్రూ.. వెరీ ట్రూ ‘ అని సుధ బదులిచ్చింది.
మళ్ళీ సెషన్ మొదలైంది.
ఆదర్శ్ చెప్పడం మొదలెట్టేడు, ‘మిగతా కంపెనీ ఎంప్లాయిస్ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి ఎప్పుడు వెళదామా అని ఆలోచిస్తారు.. కానీ మన కంపెనీని ఎంప్లాయిస్ తమ సొంత ఇల్లులా ఫీల్ అవుతారు.. ఇక్కడ లేని ఆక్టివిటీస్ ఉండవు.. వచ్చే రోజులలో మీకే తెలుస్తుంది ‘ అనేసరికి, ఆ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయిస్ చాలా మంది చప్పట్లు కొట్టేసేరు !
కంపెనీ లీవ్ పాలిసీలు, ఇన్సూరెన్సు అన్నీ వివరించేడు.
ఎవరో ఒకతను అడిగేడు, ‘మాకు రెగ్యులర్ శాలరీ హైక్స్ ఉంటాయా ?’
ఆదర్శ్ నవ్వుతూ బదులిచ్చేడు, ‘నాకు తెలుసు.. ఈ ప్రశ్న వస్తుందని.. మీ పెర్ఫార్మన్స్ బావుండేలా చూసుకోండి.. మీ హైక్స్ విషయం మేము చూసుకుంటాము ‘
ఆ తర్వాత అందరూ జాయినింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసేరు.
‘మీ అందరికీ లంచ్ అరేంజ్ చేసేము. ఆ తర్వాత మీరందరూ న్యూటన్ బిల్డింగ్ కి వెళ్ళి మీ మీ లాప్టాపులు, సెల్ఫోన్లు కలెక్ట్ చేసుకోండి.. మనందరం మళ్ళీ రెండింటికి కలుద్దాం.. అన్నట్టు మీరో విషయం గమనించేరా ? మన బిల్డింగులన్నీ ఫేమస్ సైంటిస్టుల పేర్ల మీద ఉంటాయి’ అన్నాడు
‘ఎవరో అడిగేరు… ఏ ఫోన్ ఇస్తారు ? ఐ ఫోనా ?’
ఆదర్శ్ నవ్వేడు ‘ఐ ఫోన్ ఇవ్వలేము మై ఫ్రెండ్.. ఇది కంపెనీ పర్పస్ కోసం ఇచ్చేది.. శాంసంగ్ లేటెస్ట్ మోడల్.
రూమ్ లో అందరి మొహాలూ వెలిగిపోయేయి. రమ్య ‘సాధారణంగా అందరూ లాప్టాప్ ఇవ్వడం విన్నాను.. వీళ్ళు సెల్ఫోన్ కూడా ఇస్తున్నారు.. సూపర్ !’ అనేసరికి, నిశ్చల, సుధా ఆనందంగా తలూపేరు.
నిశ్చల వెంటనే వాళ్ళమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పి, ‘ఇదిగో. నేను వాడుతున్న ఫోన్ నువ్వు తీసేసుకో.. మా కంపెనీ వాళ్ళు నాకు లేటెస్ట్ సెల్ఫోన్ ఇస్తున్నారు ‘ అనేసరికి, ఆవిడ ‘అదృష్టవంతురాలివే తల్లీ.. ఎంతైనా పెట్టి పుట్టేవు.. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు, ఆ లాప్టాప్, సెల్ఫోన్ తీసుకెళ్ళి గుళ్లో పూజ చేయించు.. జీవితంలో నీకు ఇంకా ఎన్నో లాప్టాపులూ, ఫోన్లూ ఇలా ఫ్రీ గా రావాలని గెట్టిగా దణ్ణం పెట్టుకో ‘ అని చెబుతూంటే, అలాగలాగే అంటూ ఫోన్ పెట్టేసింది నిశ్చల !
పది రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ తో భోజనం గ్రాండ్ గా పెట్టేరు, ఆ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ లాప్టాపులు, ఫోన్లు కలెక్ట్ చేసుకున్నారు.
మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి సెషన్ మొదలైంది.
ఆదర్శ్ చెప్పేడు, ‘ఎలాగూ భోజనం చేసొచ్చేరు కదా.. మీ నిద్ర ఆపుకోవడానికి, మీకొక చిన్న క్యాంపస్ టూర్ ‘ అని అందరినీ క్యాంపస్ అంతా తిప్పి చూపించేడు. దార్లో కనిపించిన షటిల్ కోర్టులు, టెన్నిస్ కోర్టులు చూసి మురిసిపోయిన కుర్రాళ్ళు అక్కడికక్కడ సెల్ఫీలు తీసుకున్నారు, అమ్మాయిలు లాన్ల మీద వయ్యారంగా కూచుని ఫోటోలు దిగేరు. వెంటనే ఎవరికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో అప్లోడ్ చేసుకుంటూంటే, ఆదర్శ్ నవ్వుతూ అన్నాడు ‘మనం త్వరగా వెళ్ళాలి, మీకోసం అక్కడ వేడి వేడి టీ, బిస్కట్స్, కేక్స్ తో కలిసి వెయిట్ చేస్తూంది.. ‘. అందరూ గబగబ ఆ మీటింగ్ హాల్ వైపు నడవడం మొదలెట్టేరు.
అక్కడ అందరూ టీ తాగుతూంటే, ఆదర్శ్ అన్నాడు, ‘ఇప్పుడు సాయంత్రం నాలుగయ్యింది.. ఇంక మీరు ఇంటికి వెళ్ళొచ్చు.. రేపటి నుండి మీరు మీ మీ ప్రాజెక్ట్స్ లో రిపోర్ట్ చెయ్యాలి.. ఆ వివరాలతో ఇవాళ రాత్రి మీకు ఈమెయిల్ వస్తుంది.. బెస్టాఫ్ లక్ ‘అనేసి తన కేబిన్ వేపు గబగబ వెళ్ళిపోయేడు.
‘అయ్యో, అతనికి మనం కనీసం థాంక్స్ కూడా చెప్పలేదే ‘ అని సుధ అంటే, ‘పదండి.. వెంటనే వెళ్లి చెబుదాం ‘అని నిశ్చల, రమ్య అన్నారు !
వెంటనే ముగ్గురూ ఆదర్శ్ కేబిన్ దగ్గిరికి వెళ్ళేసరికి, ‘వెధవ కంపెనీ.. ఇవాళ నాకు కంపెనీలో ఆఖరి రోజు అని తెలిసి కూడా సాయంత్రం నాలుగు దాకా పనిచేయించేరు.. పైగా కొత్తగా జాయినైన వాళ్ళకి అన్నీ అబద్ధాలు చెప్పే పని.. ఈ ఆఖరి రోజున కూడా చెయ్యడమంత పాపం ఇంకోటుండదు ‘ అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించేడా ఆదర్శ్ !

*****

3 thoughts on “సాఫ్ట్ వేర్ కథలు – మైసూరు బజ్జీ

  1. దూరపుకొండలు నునుపు. స్నాక్స్ ఇచ్చే కంపెనీల్లో చాకిరీలెక్కువ. బాగుంది రవీ. అయితే ఈ ఉద్యోగాలు పూర్వం ఆఫీసుల్లో గొడ్డుచాకిరీ, గొర్రెతోక జీతాల ఉద్యోగాల కన్నా మెరుగే కదా.

  2. బావుంది. మైసూర్ బజ్జి లో మైసూర్ లేదన్నట్టు.

Leave a Reply to SAIRAM Cancel reply

Your email address will not be published. Required fields are marked *