April 16, 2024

చంద్రోదయం . 28

రచన: మన్నెం శారద

ఆ సమయంలో వాళ్ళు అక్కగారి సంగతి తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు.
పరీక్షలు సరిగ్గా వ్రాయలేరు. అందుచేత ఆ వుద్ధేశ్యం విరమించుకున్నాడు సారథి.
స్వాతి కోలుకోటానికి చాలా రోజులు పటింది. ఆమె మానసికంగా బలహీనురాలయిపోయింది. సారథి జాగ్రత్తగా ఆమెని గమనిస్తున్నాడు.
చిన్న చప్పుడయితే పెద్దగా అరిచేది. ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడ్చేది. భయంతో బిగుసుకుపోయేది.
హిస్టీరికల్‌గా ఫీలవుతున్న ఆమెని చూసి బాధపడేవాడు సారథి. సున్నితమైన ఆమె హృదయం బలంగా దెబ్బతిన్నదని అతనికి అర్ధమయింది.
మోహన్ నిజంగా మనిషయి వుంటే స్వాతి పరిస్థితిని చూసన్నా హృదయం కరుగుతుందేమొ. తనలాంటి మోసగాణ్ణి, దగాకోరునీ సృష్టించిన దేవుడు ప్రేమమూర్తుల్ని తీయని మాటలకే పూర్తిగా నమ్మి, తమ హృదయాలను అర్పించే అమాయక జీవుల్ని కూడా పుట్టించేడని తెలుసుకుంటాడేమో అనిపించింది. అలాంటి సమయంలోనే సారథి ఓ రోజున స్వాతిని అడిగేడు. “స్వాతీ! నిన్నో మాట అడగనా?”
స్వాతి అతని కళ్లలోకి నిర్వికారంగా చూసింది.
అతను ఏమి అడగబోతున్నాడో ఆమెకి తెలీదు. కానీ అతను చాలా మామూలుగా ఉన్నాడు. స్వాతి అతనికి ఏ విధమైన సమాధానం చెప్పలేదు.
అతను మెత్తగా నవ్వేసి “ఏం లేదు. నేను నిన్నేమీ అడగకూడదా స్వాతీ? నాకామాత్రం అధికారం లేదా?” అని అడిగేడు.
అతని మాటలకి స్వాతి కళ్ళలో నీరు పొంగింది. అతను కాస్త ముందుకి వంగేడు.
“నువ్వింకా మోహన్ని ప్రేమిస్తున్నావా?”
ఆ మాటల్ని అతను చాలా మామూలుగానే అడిగేడు. కానీ ఆ మాటలు ఆమెపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అతను ఊహించి వుండడు. కొరడా పెట్టి కొట్టినట్టుగా ఉలిక్కిపడింది స్వాతి. తలెత్తి అతని మొహంలోకి చూడాలంటే జంకు.
అతనికి తన గురించి తెలిసిపోయిందన్న ఉక్రోషం, ఆందోళనా ఒక్కసారిగా కల్గి ఆవేదనగా మారిపోయేయి.
మోహన్‌తో తనని ఎంతవరకు అతను ఊహిస్తున్నాడో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఆమె గుండెలు ఉద్వేగంతో ఎగిరిపడుతున్నాయి.
మొహాన్ని బేలగా దించుకుంది.
“నువ్వు ప్రేమించటం తప్పనను. మొక్క బతకాలంటే నీరు, గాలి ఎంత అవసరమో, మనిషికి ప్రేమానురాగాలు అంత ముఖ్యం. మనిషి తనకోసం తాను బ్రతికేవాడు స్వార్ధపరుడు. పెద్ద చెట్టు చుట్టూ వున్న చిన్న మొక్కల్ని బ్రతుక నీయకుండా ఎలా ఆక్రమించుకొని పెరుగుతుందో, స్వార్ధపరుడు, నీచుడు తన చుట్టూ వున్న వాళ్ల సుఖాల్ని దోచుకుని, వాళ్ల బ్రతుకుల్ని కాలరాచి తన జీవనమందిరానికి పునాదులు వేసుకుంటాడు.
ఒంటరిగా వున్న నువ్వు అతని పన్నీటి చిలకరింపులాంటి మాటలని నమ్మి అతన్ని ప్రేమించేవు. అది నీ దురదృష్టం. దానికింత బాధపడి కృంగిపోవటం అనవసరం. ఓ దుర్మార్గుడికోసం నువ్వెంత కన్నీరు వెచ్చించేవో తెలుసా?” అన్నాదు అనునయంగా.
సారథి ప్రశ్నకు స్వాతి తల దించుకొంది.
“చెప్పు, నువ్వింకా అతన్ని ప్రేమిస్తుంటే నేనతన్ని బ్రతిమాలి మీ పెళ్ళి జరిపిస్తాను” సారథి మాటలకి స్వాతి ఎర్రబడి చూసింది.
“ఆ దుర్మార్గుడి పేరు నా ముందు ఎత్తకండి. వాడు కన్పిస్తే నేను వాణ్ని హత్య చేస్తానేమోనన్నత భయంగా వుంది” అంది ఆవేశంగా వణికిపోతూ.
సారథి కాస్సేపు మాట్లాడలేదు.
“స్వాతీ, నీవు అపార్ధం చేసుకోనంటే చిన్న మాట చెప్పనా?”
“చెప్పండి”
“నువ్వింక ఒంటరిగా బ్రతకలేవని నేను అనుకుంటున్నాను.”
స్వాతి సారథి కేసి చూసింది.
“నువ్వింక ఉద్యోగం కూడా చేయలేవనిపిస్తోంది. ఆ ధైర్యం నీలో లేదు”
స్వాతి భయంగా చూసిందతనివైపు.
సారథి నవ్వేడు. “నాకు తెలుసు. నువ్వు వుద్యోగం మానేసి అమ్మావాళ్ల దగ్గరకు వెళ్లిపో. ఈ యిల్లు అద్దెకిస్తాను. వున్నదానితోనే బ్రతకొచ్చు.”
“అలా ఎన్నాళ్లు జరుగుతుంది.?” స్వాతి అనుమానంగా అడిగింది.
“జరిగిన్నాళ్లు. ఈ లోపున వసుధ డాక్టరవుతుంది”
అతని మాటలకు స్వాతి నవ్వింది. “ఎవరి జీవితాలు వారివి. వసుధ డాక్టరయి నన్ను, నా బాబుని ఆదుకొంటుందన్న స్వార్థంతో నేను చదువు చెప్పించటం లేదు. రేపు వసుధ పెళ్లి చేసుకొని వేరే యింటికి వెళ్లిపోతుంది. అలాంటిదాన్ని “మమ్మల్ని పోషించు” అని దేవిరించడం ధర్మం కాదు” అంది స్వాతి.
“నువ్వు దేవిరించనవసరం లేదు. ఆపాటి బాధత వసుధ తీసుకుంటుందని నా నమ్మకం”అన్నాడు సారథి.
స్వాతి మరేం మాట్లాడలేదు. నిట్టూర్చి కళ్లు మూసుకుంది.
*****
సారథి బాల్కనీలో కూర్చున్నాడు.
ఆ రాత్రికి అతను మద్రాసు వెళ్లిపోతున్నాడు. స్వాతికి దిగులుగా వుంది. అతను వెళ్లిపోతే మళ్లీ తన జీవన ప్రాంగణంలో గాఢాంధకారం అలుముకొంటుంది.
నానీకి సారథి బాగా అలవాటయిపోయేడు.
ప్రతిక్షణం “అంకుల్..అంకుల్” అంటూ వెంటబడి తిరుగుతున్నాడు.
సారథి వెళ్లిపోతాడన్న విషయంస్ స్వాతి భరించలేకపోతోంది.
అతన్ని ఆపాలి. వెళ్లనివ్వకూడదు.
ఎలా?
ఆలోచనలతో సతమతమవుతోన్న స్వాతికి క్రింద జానకమ్మ మాటలు వినబడుతున్నాయి.
“ఈ రోజుల్లో కుర్రకారుకి అదుపూ- ఆజ్ఞ లేవిటి? అటు మోహన్‌గాడు పోయేడని మంచమెక్కిందా.. అయిపోయింది. ఇప్పుడొ కొత్తమొగుడు దొరికేడు. అతగాడికేం వుద్యోగమో గాని.. ఎప్పుడూ యిక్కడే తిష్ట. ఆ ఏడుపేదో పెళ్లి చేసుకుని ఏడ్వకూడదూ?”
స్వాతికి ఆ మాటలు బాధ కల్గించకపోగా, ఆలోచనలు రేకెత్తెంచేవిగా వున్నాయి.
ఆమె వెంటనే సారథి వున్న చోటుకి వచ్చింది.
ఏదో నిర్ణయానికి వచ్చినదానిలా రివ్వున వచ్చిన స్వాతిని ఆశ్చర్యంగా చూసేడు సారథి.
“మీరు.. మీరు.. ఇక్కడే వుండిపోకూడదూ?”
స్వాతి మాటలకు ఆశ్చర్యంగా చూసేడు సారథి.
స్వాతి తలదించుకుంది. “మీరు ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చుగా?” తిరిగి తానే అంది మెల్లిగా.
సారథి మాట్లాడలేదు.
“మీరు వచ్చేక నానీ వుత్సాహంగా వున్నాదు. మీరు వెళ్లిపోతే బెంగపెట్టుకుంటాడని భయంగా వుంది” అంది బాధగా.
సారథి ఆలోచిస్తున్నాడు. స్వాతి మరో ప్రశ్న వేసింది.
“మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?” స్వాతి అర్ధం లేని ప్రశ్నకు నిర్ఘాంతపోయాడు సారథి.
“మీరు పెళ్ళి చేసుకోకపోవడం, మాకీ విధంగా సహాయం చెయ్యటం అందరికీ అనుమానం కలిగించేదిలా వుంది. మీరు పెళ్లి చేసుకొని మాకు దూరంగానైనా వెళ్లిపోండి. లేదూ మా పట్ల నిజమైన ప్రేమాభిమానాలు వుంటే జీవితాంతం నానీకి అందగా నిలబడండి” స్వాతి వచ్చినంత వేగంగానూ లోపలికెళ్లిపోయింది.
సారథి మతి పోయినట్లు చూసేడు కాస్సేపు. అది ప్రార్ధనో, అర్ధింపో, అధికారమో అతనికి చాలా సేపు అర్ధం కాలేదు.
స్వాతి ఉద్ధేశ్యం ఏవిటో అతనికి ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు.
ఒక్కొక్కసారి స్వాతి మాటలు, ప్రవర్తనా చూస్తే తను ఇలా ఇంత శ్రమ పడటం వృధా అనిపిస్తూంది. ఇంక రాకూడదు అనుకుంటాడు.
కానీ, ఎక్కడో.. ఏమూలో ప్రేమ తనని కట్టిపడేస్తోంది. శేఖర్ తన జీవితాన్ని నిలబెట్టాడు. తననో మనిషిని చేసేడూ. అలాంటి శేఖర్ ఇంటిదీపం ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత తన మీదనే వుంది. అది అక్షరాలా నిజం.
“జీవితాంతం నానీకి అండగా నిలబడండి” స్వాతి మాటల్లో అతనికేదో అర్ధం స్ఫురిస్తోంది.
అతనో నిర్ణయానికి వచ్చినవాడిలా లేచి నిలబడి గుమ్మం దాకా వెళ్ళేడు.
స్వాతి నానీని నిద్రబుచ్చుతూ గుమ్మం దగ్గర నిలబడ్డ సారథి వైపు చూసి తల తిప్పుకుంది.
“స్వాతీ! నువ్వు నేను చెయ్యవలసిందేమిటో చెప్పావు. థాంక్స్. నానీకి అండగా నిలబడాల్సిన బాధ్యత నాకుంది. శేఖర్ ఆప్తమిత్రుడిగా నేనా బాధ్యత యిన్నాళ్ళూ విస్మరించినందుకు సిగ్గుపడుతున్నాను. అయితే ఈ విషయంలో నాకు నీ సహకారం కావాలి.” అన్నాడు.
స్వాతి అర్ధం కానట్లు చూసింది.
“నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అందుకు నువ్వంగీకరించాలి. ఇందులో నా స్వార్ధం ఏమీ లేదు. కేవలం నానీకి తల్లిదండ్రుల మధ్య పెరిగేనన్న ధీమ, తృప్తి కలిగించడానికి. అంతే కాదు. మరెవరూ నీ జీవితంతో ఆడుకోడానికి వీలు లేకుండా కాపాడుకోడానికి రిజిస్ట్రారాఫీసులో మన పెళ్లి రేపే జరిగిపోతుంది”
అతను గిరుక్కున వెనుతిరిగి తన గదిలోకి వెళ్లిపోయేడు. స్వాతి ఆశ్చర్యపోలేదు. ఇందాక తను మాట్లాడిన మాటల్లో యెవరైనా అలాంటి భావమే ఊహిస్తారు. కాని అతను తనని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నాడా? కేవలం జాలి కాదు కదా.
ఏ విధంగానైనా అతను తనకు కావాలి. అంతే..
తెలతెలవారుతుండగా సారథి గుంటూరు చేరేడు. తల విదిలించుకుని బస్సు దిగేడు.

*****

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *