April 16, 2024

తాత్పర్యం – దిగడానికి కూడా మెట్లు కావాలి

రచన: – రామా చంద్రమౌళి


రాత్రి పదీ నలభై నిముషాలు.
డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు. అటు చివర. ఎప్పటిదో. పాతది. దొడ్డు సిమెంట్ మొగురాలతో. సిమెంట్ పలకతో చేసిన బోర్డ్. పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు. ‘నయీ ఢిల్లీ ‘. పైన గుడ్డి వెలుగు. కొంచెం చీకటికూడా. వెలుతురు నీటిజలలా జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా. మంచుతెర. పైగా పల్చగా చీకటి పొరొకటి. అంతా స్పష్టాస్పష్టత. కనబడీ కనబడనట్టు. కొంత చీకటి.. గుడ్డి గుడ్డిగా. కొంత వెలుతురు మసక మసగ్గా. తన జీవితం వలె. చీకటి ఒక లోయ. వెలుతురు ఒక శిఖరమా. లోయ ప్రక్కనే శిఖరం. చీకటి ప్రక్కనే. తోడుగా చీకటి. జతలు. జతులు. ద్వంద్వాలు. వైవిధ్యాలు. వైరుధ్యాలు.
డిసెంబర్ నెల. ఇరవై ఆరు. చలి. గాఢంగా. . అప్పుడప్పుడు వణికిస్తూ. అప్పుడప్పుడు. మృదువుగా స్పర్శిస్తూ. కప్పుకున్న శాలువాకింద శరీరం. నులువెచ్చగా. భాషకందని గిలిగింత. కళ్ళుమూసుకుంటే.. గుండెల్లో భైరవీ రాగంలో ఏదో.. ప్రళయభీకర గీతం.
మేఘాలు చిట్లిపోతూ. . ఆకాశం పగిలిపోతూ. . ఇసుక తుఫానులతో ఎడారులు ప్రళయిస్తూ. శబ్దం విస్ఫోటిస్తూ. అంతిమంగా. శబ్దాలూ. రాగాలూ. గీతాలూ. అన్నీ. ఒక అతి నిశ్శబ్ద బిందువులోకి అదృశ్యమైపోతూ. చివరికి. ఒట్టి.. శాంత మౌన ఏకాంతం. జీవితం ఇది. అంతా ఉండీ. చివరికి ఏమీ లేని. ఏమీ లేక అంతిమంగా అన్నీ ఉన్నట్టనిపించే ఒక సుదీర్ఘ భ్రాంతిగా మిగిలి. ,
“జిన్ హే హం భూల్ నా చాహే.. ఓ అక్సర్ యాద్ ఆతీహై “.. అతి విషాద స్వరంతో ముఖేష్.. దుఃఖం గడ్డకడుతున్నట్టు.. యుగయుగాల పరితపన కన్నీరై ప్రవహిస్తున్నట్టు. ,
ఉష.. నలభై ఆరేళ్ళ ఉష. శరీరాన్ని. దళసరి ఉన్ని శాలువాలో దాచుకుని. అటు చీకట్లోకి చూస్తోంది. నిశ్శబ్దం లోకి. ఆమెకు బయట అటు దూరంగా వందలమంది ప్రయాణీకులు. గోలగోలగా ఉన్నా లోపల తనొక్కతే. అంతా నిర్వాణ నిశ్శబ్దం. నిర్గమ నిశ్శబ్దం. నిరామయ నిశ్శబ్దం.
ఒక ఎలక్ట్రిక్ లోకో ఇంజన్ ఏదో అతి వికారంగా అరుస్తూ ప్రక్కనున్న ట్రాక్ పైనుండి మెల్లగా కదుల్తూ.. అటు దూరంగా నిష్క్రమిస్తూ,వెలుతురులోనుండి చీకట్లోకి. పైన అన్నీ ఎలక్ట్రిక్ కేబుల్స్. చిక్కు చిక్కుగా. ,
చిక్కు. చిక్కు పడ్డ దారం ఉండ జీవితం. ముళ్ళుపడి. అల్లుకుపోయి. కొస దొరుకక. వెదుకులాట. కొస కోసం. ఒక దరి కోసం. దారికోసం. వెదుకులాట. చిన్ననాటినుండి. ఈ క్షణందాకా. ఒకటే నిరంతరమైన అనంత అన్వేషణ. ,
ఇంతవరకు వేల పాటలు. వందల సభలు. లక్షలమంది శ్రోతలు. కోట్ల చప్పట్లు. పట్టణాలు. నగరాలు. దేశాలు. ఖండ ఖండాంతరాలు. అంతర్జాతీయ వేదికలు. సన్మానాలు. సత్కారాలు. జ్ఞాపికలు. శాలువాలు. పర్స్ లు. పైవ్ స్టార్ హోటళ్ళు. బెంజ్ కార్లలో ప్రయాణాలు. ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ.. విమానాల్లో. మళ్ళీ శూన్యంలోకి.. అన్నీ ఉండి.. ఏదీలేని.. ఒక ఖాళీలోకి.
ఇంటిగ్రేట్. జీవితాన్ని సమాకలించుకోవాలి. లోయర్ లిమిట్ నుండి అప్పర్ లిమిట్ వరకు. అవధులు.. అవధులు. కిందినుండి పైకి. పుట్టుక నుండి మృత్యువుదాకా. మృత్యువునుండి.. మళ్ళీ జన్మదాకా.
‘ మేడ లోన అల పైడి బొమ్మా
నీడనే చిలకమ్మా
కొండలే రగిలే వడగాలీ
నీ సిగలో పువ్వేలోయ్ ‘
.. చందమామ మసకేసిపోతుందా. ?
ఉష.. మసక లోకి.. మసక వెలుతురులోకి. మసక చీకట్లోకి. చూస్తోంది.

*****

వర్షం కురుస్తూనే ఉంది. రెండు రోజులుగా. ఎడతెరిపిలేకుండా.
విజయవాడ.. హోటల్ మనోరమ వెనుక గల్లీ.. అంబికా వైన్స్.
రాత్రి తొమ్మిదిన్నర. రజియాబేగం కు చాలా అలసటగా.. చాలా చికాగ్గా.. చాలా దుఃఖంగా, జీవితంపట్ల చాలా విసుగ్గా, రోతగా కూడా ఉంది.
‘ఈ జీవితాన్ని జీవించి జీవించి అలసిపోయాన్నేను’.. అని ఏ ఐదు వందలవసారో అనుకుందామె. అనుకుని చాలా నిస్సహాయంగా ఆ వర్షం కురుస్తున్న రాత్రి తనచుట్టు తానే చూచుకుంది.
అంతా నీటి తేమ వాసన. వెలసిన గోడలతో నిలబడ్డ అంబికా వైన్స్.. షాప్ ముందు. తోపుడుబండి. ఒక కొసకు వ్రేలాడ్తూ. పెట్రోమాక్స్ లైట్. మసిపట్టిన గాజు ఎక్క. మసక వెలుతురు.. ‘ సుయ్ ‘.. మని వొక వింత చప్పుడు.. పెట్రోమాక్స్ దీ.. ఆమె ఎదుట మూకుడులో నూనెలో వేగుతున్న చికెన్ కాళ్ళదీ.. లోపల గుండెల్లో బయటికి వినబడని యుగయుగాల దుఃఖానిది. ప్రక్కనే వాననీళ్ళు కారుతున్న చూరుకింద నిలబడి కస్టమర్ల ఎదురు చూపు. ఇద్దరు ముగ్గురున్నారు. ఒకడికి చికెన్ కాళ్ళు రెండు. మరొకడికి బాయిల్డ్ ఎగ్స్. ఇంకొకడికి. రెండు బొచ్చె చేప వేపుడు ముక్కలు.
రెండ్రోజులుగా ముసురుగా కురుస్తున్న వర్షానికి.. నగరంలోని వ్యాపారాలన్నీ మందగించాయి.. కాని ఈ వైన్ షాప్ లు మాత్రం పుంజుకున్నాయి. తాగుబోతులకు వర్షాలు కురిసినా.. శీతాకాలం మంచు కమ్ముకున్నా.. ఎండాకాలం ధుమధుమలాడ్తూ సెగలు చిమ్మినా తాగుడుదిక్కే మనసు పోతుంది.. అప్పుడు బ్రాండీ విస్కీలు.. తర్వాత చల్లని బీర్లు. కాబట్టి వైన్ షాప్ లన్నీ.. ఋతువుల్తో సంబంధంలేకుండా సర్వవేళల్లో కళకళలాడ్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి. అందుకే అవి ప్రభుత్వాలనూ.. కొందరు బలిసిన మోతుబరులనూ పోషించే కామధేనువులు. అసలు ఈ భూమ్మీద మద్యాన్ని అమ్మేవాల్లదీ.. తాగేవాళ్ళదీ ఒక ప్రత్యేక జాతిగా రజియా ఏనాడో గుర్తించింది. ఈ రెండు జాతుల మనుషులతో ఆమెకు పది సంవత్సరాల అనుబంధం. ఆ వైన్ షాప్ ముందు తోపుడు బండి మీద ‘ తిండి ‘ని అమ్ముతూ ఆమె అక్కడ ఒక శాశ్వత అడ్డా మనిషిగా మారిపోయింది. ఆ పది పదిహేనేళ్లలో షాప్ ఓనర్స్ మారిపోయారుగాని రజియా మాత్రం పర్మనెంటైపోయింది. రజియా చేతి ఐటంస్ రుచి అలాంటిది. ఒక్కతే బండిని చూచుకుంటుంది. సాయంత్రం ఏడునుండి. ఏ రాత్రి పదకొండుదాకానో.
తోపుడుబండికి. ఒక మూలకున్న గుంజకు ఒక పాత గొడుగును సుతిలి తాళ్లతో గట్టిగా కట్టుకుంది రజియా. పైన చత్రీ అక్కడక్కడ రంధ్రాలుపడి.. కొద్దికొద్దిగా నీటి తడి కారుడు. కస్టమర్లు వేచిఉండడంవల్ల వడివడిగా పనికానిస్తూ, ప్రక్కనున్న వెదురు బుట్టలోని నాల్గయిదు చేపముక్కలను బేసిన్ గిన్నెలోని కలిపిన శనగపిండిలో వేసి కలుపుతూ అనుకుంది.. ’చికెన్ ముక్కలూ,చేప ముక్కలూ ఐపోవస్తున్నాయి. లక్ష్మణ్. ఇంకా రాలేదు ఇంటినుండి సరుకు తీసుకుని.. ఒకవేళ లక్ష్మణ్ లారీ దిగి ఇంకా డ్యూటీ నుండి రాకుంటే అప్పల్రాజన్నా రావాలిగదా. వాడూ పత్తాలేడు. ఇక్కడ గిరాకేమో మస్తుగా ఉంది.. ఇప్పుడెలా ‘.. అనుకుంటూనే.. చకచకా.. ఉడికిన కోడిగ్రుడ్ల పొట్టు తీస్తోంది. చుట్టూ అంతా మసాలా.. కాగిన నూనె కలెగలిసి.. అదోరకమైన ముక్క వాసన.
రజియా మనసులో లక్ష్మణ్ కదిలాడు.
లక్ష్మణ్ చిన్ననాడు తమ ఇంటిప్రక్కనే ఉండే పుష్ప అత్తమ్మ కొడుకు. పుష్ప అత్తకు ఒక చిన్న చాయ్ హోటల్ ఉండె. ఆమె భర్త జట్కా నడిపించేటోడు. పుష్ప అత్తమ్మ చాయ్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్. రోజుకు కనీసం రెండువందల చాయ్ లమ్మేది. లక్ష్మణ్ కూడా తల్లితో కలిసి గారెలు చేసుడు,సమోసాలు చేసుడు,రోటీ చికెన్,రోటీ కీమా తయారుచేసుడు. చాలా బిజీగా ఉండేటోడు. తర్వాత్త ర్వాత పుష్పత్త భర్త ఒక ప్రైవేట్ ఇసుక లారీకి డ్రైవర్ గా కుదిరి అప్పుడప్పుడు లక్ష్మణ్ ను తన వెంట క్లీనర్ గా తీసుకెళ్ళేవాడు. లక్ష్మణ్ ది చాలా శ్రావ్యమైన గొంతు. తల్లి హోటల్ లో రాత్రింబవళ్ళు మోగే రేడియోలోని పాటలను విని వెంటనే ఏ పాటనైనా రెండు నిముషాల్లో అచ్చం అలాగే మళ్ళీ పాడేవాడు. అందరూ ఆశ్చర్యపోయేవారు లక్ష్మణ్ ప్రతిభను చూచి. ఇంటిపక్క హోటలే కాబట్టి.. చిన్నప్పటినుండి లక్ష్మణ్ తో ఉన్న దోస్తీ వల్లా దాదాపు ప్రతిరోజూ ఒక్క గంటన్నా ఆ హోటల్లో గడిపేది తను. ఒకసారి ఎవరో ఒక పెద్దాయన పుష్పత్త చాయ్ పేరు విని తాగడానికొచ్చి లక్ష్మణ్ పాట విని.. మెచ్చుకుంటూ “వీడు ఏకసంతాగ్రాహి”అని చెప్పాడు. అంటే ఏమిటిసార్.. అని తాను ఆశ్చర్యంగా అడిగితే.. వీనికి దేన్నైనా ఒక్కసారి వింటేనే దాన్ని యథాతథంగా ధారణ చేసుకుని పునరుత్పత్తి చేయగల సామర్థ్యముంది. అది భగవదత్తమైన ఒక వరం. అదే వీడు ఏ గొప్ప ఇంట్లోనో పుడితే కొన్ని కళల్లో శిక్షణ పొంది.. గొప్ప కళాకారుడయ్యేవాడు. కాని.. అని ఆగిపొయ్యాడు. ఆ క్షణం లక్ష్మణ్ నిస్సహాయంగా ఆ పెద్దాయన ముఖంలోకి చూచిన చూపు తనకింకా జ్ఞాపకమే.
లక్ష్మణ్ లోని ఆ గొప్పతనం తనను ఆశ్చర్యపరిచింది. ప్రతిరోజూ.. వీలు చిక్కినప్పుడల్లా ప్రక్కనే ఉన్న బుగ్గోల్ల తోటలోకి ఇద్దరమూ కాస్సేపు పారిపోయి.. పాటలను వినేది. తను.. అడిగేది.. “గిట్ల ఎట్ల జ్ఞాపకముంటై నీకు” అని. కాని లక్ష్మణ్ నుండి ఏ జవాబూ వచ్చేదికాది..
ఊర్కే నవ్వేవాడు. నవ్వి “అంతే.. దేవుని దయ అంతా.. “అనే వాడు. లక్ష్మణ్ ముఖంలో ఏదో ఒక వింతకాంతి కనిపించేది దీపం వత్తిలో వెలుగులా. తర్వాత్తర్వాత.. మెలమెల్లగా లక్ష్మణ్ తన తండ్రి వెంట ఉండి తనూ డ్రైవర్ గా మారి,ఒక పర్ఫెక్ట్ లారీ డ్రైవర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో ఏవేవో ఊళ్ళు తిరుగుతూ.. ట్రిప్ ల కని.. దూర దూర ప్రాంతాలకు ఎక్కువసార్లు వెళ్తూ.. దూరమౌతున్న సందర్భంగా.. అర్థమైంది తనకు.. లక్ష్మణ్ పట్ల ఆ సహించలేని.. భరించలేని ఎడబాటునే ‘ప్రేమ ‘ అంటారని. అప్పుడు తను ఒకరోజు లక్ష్మణ్ తో కలిసి అతని అశోక్ లేల్యాండ్ లారీలో కూడా ఎవరికీ చెప్పకుండా తీరుబడిగా మాట్లాడాలని భీమవరం వెళ్ళింది. ఒకరు హిందూ.. ఒకరు ముస్లిం.. తమ ముందు నిలబడ్డ బలమైన కలిసి బతకాలనే కాంక్ష. అప్పటికి తను ఎనిమిదవ తరగతి చదివింది. లక్ష్మణ్ ఇంటర్ ఫేల్. యౌవ్వనం.. లక్ష్మణ్ స్పష్టంగానే నిర్ణయం తీసుకుని అన్నవరం సత్యనారాయణ సమక్షంలో.. పెళ్ళడాడు ధైర్యంగా. అన్నాడు.. ‘ రజియా.. రెండు చేతులకు తోడు మరో రెండు చేతుల.. కలిసి నడుద్దాం ‘ అని. ఆ రాత్రి.. వెన్నెల్లో ఎన్నో పాటలు పాడి వినిపించాడు.
విజయవాడ రైల్వే పట్టాలప్రక్కనున్న.. మార్క్స్ కాలనీలో కాపురం.. జీవితమంతా రాత్రింబవళ్ళు రైళ్ళ శబ్దాలతోనే సహవాసం. నిత్య యుద్ధం. బతుకే ఒక సవాల్. లక్ష్మణ్ లారీ పై డ్యూటీలు.. తను రోజువారీ సంపాదనకోసం వెదుకులాట. కూరగాయల బేరం.. నాలుగిండ్లలో పాచిపని.. చిన్న చిన్న హోటల్లలో వంటపని.. లక్ష్మణ్ కు దేవుడిచ్చిన స్వరంలాగనే తనకు.. రుచికరంగా వంటలను చేయగల నైపుణ్యం అబ్బి. చివరికి.. హోటల్ మనోరమ కిచెన్ డ్యూటీనుండి.. ఒక హోటల్ బాయ్ సహకారంతో.. ఈ వైన్ షాప్ దగ్గర దొరికిన ఈ అడ్డా.
ఈ లోగా ఇద్దరు పిల్లలు.. ముందు ఉష.. తర్వాత షకీల్.
జీవితమంతా పోరాటమే. కమ్యూనిస్ట్ నాయకుల మధ్య విభేదాలతో తాముంటున్న గుడిసెవాసుల పై పోలీసుల దాడి అప్పుడప్పుడు. ఇళ్ళను కూలగొట్టుట. కాల్చివేయుట. పోలీస్ కేస్ లు. కోర్ట్ లు. నేలపై. బురద కుంటల ప్రక్కన నివాసం.. ముక్కులు పగిలిపోయే బకింగ్ హాం కెనాల్ ఒడ్డుపై కొన్నాళ్ళు.. ’ సందులలో గొందులలో.. బురదలలో పందులవలె’.. చీకట్లో చీకిపోయిన బతుకు. ,
తర్వాత.. లక్ష్మణ్ లో ఒక మహమ్మారి అలవాటు ప్రవేశించి. తాగుడు. తాగి లారీ నడుపుడు. భగవంతుడిచ్చిన గొంతు నశించి.. మనిషి ముఖం నిండా ఒట్టి దైన్యం. బేలతనం. జాలి కల్గించే ఒట్టి శూన్యం. ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు చదివేవాడు. గంటలకు గంటలు లైబ్రరీలో కూర్చుని.. బుక్స్ తెచ్చుకునే వాడు ఇంటికి. చదువుతూ చదువుతూ అలాగే పడుకుని.. ఏవేవో తనలో తానే తత్వాలను పాడుకుంటూ.. సారాయి తాగుతూ,
ఇటు పిల్లలు పెరిగి పెద్దగౌతూ. ,
ఎక్కడో పిడుగుపడ్డట్టు అకస్మాత్తుగా ఓ ఉరుము ఉరిమి.. రజియా చేయి కొద్దిగా వణికి.. ముందున్న నూనె మూకుడు పైనున్న గరిటె కొద్దిగా జారి. ,
రెండుమూడు వేడి నూనె రవ్వలు చిట్లి.. ఆమె చేతిపైబడి.. ఉలిక్కి పడింది.
“జాగ్రత్తమ్మా.. నూనె పైబడ్తుంది.. “అన్నాడు ఆ ప్రక్క గోడనానుకుని నిలబడ్డ గిరాకీ.
అప్పటికే.. చేపలను వేయించడం.. చికెన్ లెగ్స్ ప్యాక్ చేయడం.. నాల్గు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం.. చేస్తూ,
జ్ఞాపకాలు చటుక్కున తెగిపోయేయి.. చూరునీళ్ళ ధారవలె.
షాప్ లోపల ఇంకా ఫుల్ గా జనం. ఒకటే రద్దీ.
తన దగ్గర స్టాక్ ఐపోతోంది.. లక్ష్మణ్ రాడు.. అప్పల్రావూ రాడు. ఇప్పుడెలా.
రజియాలో ఆందోళన. గిరాకీ ఉన్నప్పుడే నాల్గు రూపాయలు సంపాదించుకోవాలి. ఎలా.. ఎలా.
సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమైంది ఎదుట ఉష.. పూర్తిగా తడిచి.. నీళ్ళలో ముంచి తీసిన కోడివలె. తలపైనుంది నీళ్ళు కారుతూ.. నెత్తిపై, భుజాలపై. ఏదో ఒక పాలిథిన్ కాగితం చుట్టుకుని.
ఉష అప్పుడు ఎనిమిదవ క్లాస్.. పొద్దంతా తన తోపుడు బండికి కావలసిన ఉల్లి గడ్డలు కోసుకోవడం.. చికెన్ షాప్ లనుండి రెండవరకం మెటీరియల్ ను తెప్పించుకుని.. దాన్ని శనగపిండిలో.. కారం.. మసాలాలలో కలుపుకుని నాన్చడం.. కోడి గుడ్లను ఉడి కించుకోవడం.. ఈ పనిలో సహాయం చేసేది. షకీల్ గాడు ఒట్టి వెధవ. ఎప్పుడూ అక్కలా పనిలో సహాయం చేయడు. మళ్ళీ రైల్వే పట్టాలప్రక్కన మార్క్స్ కాలనీకి దగ్గరలో.. బోస్ నగర్ కు మారినప్పటినుండి వాడికి అంతా స్నేహితులే. నిరంతరం పోరగాండ్లతో రైల్ పట్టాలపై ఆటలు.. కూలిన గోడల్లో సిగరెట్లు తాగుడు. తండ్రి వలెనే అప్పుడప్పుడు మందు.
“తల్లిదండ్రుల లక్షణాలు తప్పక పిల్లలకొస్తాయా. “అని తననుతాను ప్రశ్నించుకుంటే.. ‘తప్పకుండా.. వస్తాయనే ‘అనిపిస్తుంది తనకు.
లక్ష్మణ్ లో ఉన్న ఆ స్వరం.. అమృతమయమైన గొంతు.. ఉష పాడితే అద్భుతమైన మాధుర్యం.. అవన్నీ వచ్చాయి బిడ్డకు.. తండ్రి నుండి.
కాని షకీలే.. ఒట్టి అవారా ఔతున్నాడు రోజురోజుకు. బడికి పోడు.. చిల్లర దొంగతనాలు.. పోలీస్ కేసులు. విడిపించుకు రావడాలు. తాగి ఎక్కడెక్కడో పడిపోవడాలు.. ఏవేవో సినిమా హీరోల అభిమాన సంఘాలంటాడు. రాజకీయ నాయకుల కనుసన్నలలో.. ఊరేగింపులు. దౌర్జన్యాల్లో పాలుపంచుకోవడాలు. అన్నీ చిల్లర అల్లరిమూకల చేష్టలు.
ఆ రాత్రి.. ఉష వర్షంలో పూర్తిగా తడుస్తూ.. అమ్మ మీద.. అమ్మయొక్క జీవనోపాధి ఐన చిన్న వ్యాపారంపైన గౌరవంతో చేయూతగా రావడం.. రజియాకు పట్టరాని ఆనందాన్నిచ్చింది.
” క్యా హువా.. లక్ష్మణ్ నహీ హై” అంది అప్రయత్నంగానే.
” రాలేదింకా.. బాగా తాగి.. హోష్ లేకుండా ఎక్కడున్నాడో. అప్పల్రాజు కూతురుకు యాక్సిడెంటై దవాఖానకెళ్ళాడు. ” అని తన చేతిలోని మెటీరియల్ ను అందించింది తల్లికి.
అప్పటికే కావలసిన తిండి సరుకు లేదని చిన్నబుచ్చుకున్న వైన్ షాప్ కస్టమర్లు.. బిలబిలా బండి దగ్గరికి పరుగెత్తుకొచ్చి.. ” రెండు చేప.. పావుకిలో చికెన్ మంచూరియా.. మూడు బాయిల్డ్ ఎగ్స్.. ” ఆర్డర్స్ కురిపిస్తూ. ,
మూకుమ్మడి దాడిలో రజియాకు ఉషతో మాట్లాడే తీరికే లేదు. పనిలో మునిగిపోయింది. కాస్సేపాగి.. “మరి నే వెళ్ళొస్తానమ్మా.. నువ్వు.. “అంది ఉష.. వర్షంలో తడుస్తూనే. రజియా.. తలెత్తి బిడ్డదిక్కు నిస్సహాయంగా చూచి. ,
అనివార్యత.. అనివార్యత.
” సరే బిడ్డా.. నువ్వెళ్ళు.. నేనొస్తా.. షాప్ మూసుకుని”
‘ సంపాదన. ఒక తాగుబోతు తండ్రిని పోషిస్తూ.. ఒక తిరుగుబోతు కొడుకును సాకుతూ.. ఒక ఇంటర్ పాసై.. గడప దగ్గర నిలబడ్డ బిడ్డకు దన్నుగా ఉంటూ.. ఒక తల్లి.. రాత్రి పదకొండు గంటలకు.. వర్షంలో.. తడుస్తూ.. నిజాయితీతో కూడిన సంపాదనలో.. ఈ దేశాన్ని అవినీతితో దోచుకుంటున్న అనేకమంది వైట్ కాలర్డ్ దొంగలకన్న నిర్మలంగా.. తన తల్లి.. తన అమ్మ.. తన మా. ‘
ఉష తిరిగొచ్చింది ఇంటికి.
వచ్చేసరికి.. ఇంట్లో ఎవరూ లేరు. లక్ష్మణ్ యధావిధిగానే ఎక్కడో తాగుతూ.. తమ్ముడు షకీల్ ఏ ఫ్రెండ్స్ తోనో. ,
కాని.. తమ ప్రక్కనే ఉన్న రేకుల షెడ్ లో ఉండే శరత్ మాత్రం ఎదురుచూస్తూ ఉన్నాడు ఉషకోసం. దాన్ని ప్రేమ అంటాడు శరత్. అది వట్టి బూటకం అని తెలుసు ఉషకు.
ఈ ఏ పూటకాపూట కుటుంబాల్లో.. ఇంటి పరిస్థితులు మనుషులకు తప్పులు చేయడానికి చాలా అవకాశాలను కల్పిస్తాయి.. ముఖ్యంగా ఒంటరితనాలను.. స్వేచ్ఛను.. యూజ్ అండ్ త్రో టైప్ సందర్భాలను.. బలహీనతలను ఆసరా చేసుకుని.
శరీరం ఒక అగ్ని బాంఢం.. వాంఛ ఒక పెట్రోల్ బావి. అగ్గి తారసపడ్తే భగ్గున మండి భస్మం చేస్తుంది.
ఇదివరకు ఉష.. ఒక ముసురుపట్టిన రాత్రి ఒంటరిగా శరత్ కు ప్రక్కనే తారసపడ్తే. ,
ఒక వెకిలి వవ్వుతో.. ఒక చూపుతో గుచ్చి గుచ్చి చంపి.. ఒక కవ్వింత.. లోపల ఒక తీవ్ర జ్వలన.
‘ ఏదేమైనా తెగించి ఒక్కసారి సెక్స్ కార్యం జరిపితే… తీవ్రమైన కోరిక నెరవేరుతుంది… అగ్ని చల్లారుతుంది.. ఒక కొత్త అనుభవం గురించిన రుచి తెలుస్తుంది. ‘అన్న ఉత్సుకత. తహతహ.
ఉష మౌనాన్ని అంగీకారంగా వ్యక్తపరిస్తే.. శరత్ తెలుగు సినిమాల్లో దిక్కుమాలిన హీరోలా రెచ్చిపోయి,
ఆ స్వేచ్ఛాయుతమైన రాత్రి.. ఓ నాల్గైదుసార్లు తృప్తి.
ఇది తప్పు.. ఇది శీలం పోవుట.. ఎవరో ఎవర్నో లొంగదీసుకొనుట.. అంతా ట్రాష్ అనుకుంది ఉష. ఉష కించిత్తుకూడా బాధపడలేదు.. తనుకూడా కావాలనుకుంది.. చేసింది. సింపుల్ గా చెప్పాలంటే.. ’అంతే. ’
ఒకసారి జరిగిన క్రియను.. తప్పును.. మళ్ళీ.. మళ్ళీ పదే పదే చేసినా.. పెద్ద తేడా పడేదేముండదన్న తెగింపు.
చాలాసార్లే జరిగి. ,
అప్పుడు.. ఆ రాత్రి.. ఆ వెన్నెల రాత్రి అన్నాడు శరత్.. “నువ్వు చాలా చాలా బాగా పాడుతావు ఉషా.. ఒక్కసారి ఆ పాటను పాడవా ప్లీజ్” అని.
ఉష వెంటనే పాడింది.. శరత్ పాడమన్నందుకు కాదు. పదే పదే తను నిజంగానే మంచి సింగర్ నేనా.. అని నిర్ధారించుకునేందుకు.
ఆ రాత్రి ఉష.. దేవుడు తనకిచ్చిన ఈ “ఏక సంతాగ్రాహి” లక్షణాన్ని ఏ రకంగా జీవితంలో శక్తివంతంగా ఉపయోచుకోవాలా అని మొట్టమొదటిసారిగా.. కొత్తగా ఆలోచించింది.
ప్రేమలు. శీలాలు. త్యాగాలు. దేన్నో కోల్పోయినట్టు రోదించడాలు.. అన్నీ మరిచి.. ఉష తన కళ్ళముందున్న తెరలనూ,ముసుగులనూ తొలగించుకుంది తెలతెలవారుతూండగా. శరీరాన్ని ఆయుధంలా ఎక్కుపెట్టి.. ఒళ్ళు విరుచుకుని.. ఆవులించి.. కళ్ళు తెరిచింది ఉద్యుక్త ఔతూ.

*****

ఉష జీవితంలోకి అవినాశ్ ప్రవేశం ఒక పెద్ద మలుపు. లైబ్రరీలో పరిచయమై ఒకరోజు ఒక పుస్తకమిచ్చాడు అతడు. అది”మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి”.
ఆ వర్షం కురుస్తున్న రాత్రే ఆ పుస్తకాన్నంతా చదివింది తను.
SWOT. . అనాలిసిస్. . S. . అంటే స్ట్రెంగ్త్. . నీ బలాలు.. W.. అంటే వీక్నెసెస్.. బలహీనతలు.. O అంటే.. ఆపర్చునిటీస్.. అవకాశాలు.. T అంటే థ్రెట్స్.. అవరోధాలు.
ఎప్పుడైనా ఒక కాగితం తీసుకుని నీ ఆలోచనలనన్నింటినీ దానిపై రాయమని చెప్పాడు మేనేజ్ మెంట్ పితామహుడు.. ఎఫ్. డబ్ల్యు. టేలర్.
రాసింది తను. మూడు పేజీలు నిండాయి.. క్రోడీకరిస్తే.. తన బలం.. ఒక్కటే అని తేలింది. అది.. ఒక్కసారి వింటే చాలు.. ఆ ధ్వనిని మళ్ళీ సరిగ్గా అలాగే పునరుత్పత్తి చేయగల తన దైవదత్తమైన సామర్థ్యం. . తన బలహీనత.. తన బీదరికం.
చాలా మంది తను ఎదగడానికి తమ బీదరికం.. తగు స్థాయిలో డబ్బు లేకపోవడమే కారణమని అనుకుంటారు.. కాని అది పూర్తిగా తప్పు అని సెల్ఫ్ మేనేజ్ మెంట్ సిద్ధాంతకర్త స్మిత్ ఎప్పుడో చెప్పాడు. దేన్నైనా సాధించడానిక్కావలసింది.. స్పష్టమైన లక్ష్యం.. దాన్ని చేరి అనుకున్నది సాధించాలన్న సంకల్పం.. పట్టుదల.. ప్రతిభ.
ఊష అనే తను ఇక.. ‘ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి ‘ అని బయలుదేరింది ఒక రోజు.. హైదరాబాద్ కు. హైదరాబాదే తన కార్యరంగమని తెలుసుకుందామె.
తన ఆయుధం పాట.
పాటకు ప్రాచుర్యమివ్వగలిగింది సినిమా ఒక్కటే.
తను ఒక ప్రసిద్ధ గాయని ఐ ఒక వెలుగు వెలిగి పోవాలి.. అందుకు కావల్సింది ‘అవకాశం. ‘
‘మనిషికి దేనికైనా ఒక అవకాశం రావాలి. వచ్చినప్పుడు తెలివిగా దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి. అవకాశం రానపుడు ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. ’
తనకు అవకాశాలు వచ్చే అవకాశం అస్సలే లేదు.. కాబట్టి అవకాశాన్ని తనే సృష్టించుకోవాలి.
ఎలా.. ఎలా.. ఎలా.. అన్వేషణ. సరియైన రీతిలో చేయినందించి నడిపించగల వ్యక్తికోసం.. సమర్థునికోసం.. అన్వేషణ.
మార్కెట్ స్టడీ.. ప్రస్తుత మ్యూజిక్ రంగంలో.. ఉన్నతుడూ.. మార్కెట్ ఉన్నవాడు ఎవరు.. ఎవరు.. ఎవరు. ?
ఉష అనే తనకు.. ఒక నిర్దుష్ట దృష్టితో.. శాస్త్రీయంగా.. దూసుకుపోతున్నకొద్దీ.. మన దగ్గర ప్రతిభ ఉంటే.. తనపై తనకు విశ్వాసముంటే.. గమ్యాన్ని చేరడం సుళువే అని తొందరగానే అర్థమైంది. వెదికి వెదికి.. పట్టుకుంది ఓ మనిషిని.. అతని పేరు.. గణేశ్ శాస్త్రి.
గుర్రపు పందెంలో గెలవాలంటే తనకెంత సామర్థ్యమున్నా సరియైన గుర్రాన్ని ఎంచుకోవడం ఒక అత్యంత ప్రధానమైన మెలకువ. ఆ పందెపు గుర్రం ఇప్పుడు గణేష్ శాస్త్రి.
ఒక మనిషికి చేరువై.. అతనితో మనం అనుకున్న పనిని సాధించేందుకు ముందు అతని అత్యంత వ్యక్తిగతమైన జీవితాన్ని అధ్యయనం చేయాలి. కొందరికి తిండి బలహీనత. కొందరికి డబ్బు. కొందరికి స్త్రీ. ఇంకొందరికి స్తుతి. కొందరికి కానుకలు. కొందరికి అధికార హోదాలు.. ఏదో ఒక మత్తు. వ్యామోహం. ఇవన్నీ బలహీనతలే. యుక్తిపరుడు ఇవన్నీ గ్రహించి.. ఒంటరిగానే కావలసిన వ్యక్తికి చేరువై.. కార్యరంగంలోకి దూసుకుపోయి అంతిమంగా లక్ష్యాన్ని సాధిస్తాడు.
గణేశ్ శాస్త్రి బలహీనతలను పసిగట్టి సరియైన దిశలోనే కలిసింది తను.. చాలా మంది పురుషుల్లో ఉన్న బలహీనతే అతనిక్కూడా ఉంది. మందు.. మగువ. మందుకు కొదువలేదతనికి. తను తాగగలడు.. వేరే వాళ్ళెవరైనా ప్రతిరోజూ అతను తాగగలిగినంత తాగించగలరు. ఐతే తాగుబోతులకు.. వేరేవాడెవడైనా తాగిస్తే బాగుండుననే దుగ్ధ ఒకటుంటుంది. అదే ఉంది శాస్త్రిగారిక్కూడా. శాస్త్రి గారికి మ్యూజిక్ చేయవలసిన సినిమాలు కనీసం ఓ పదుంటాయి చేతిలో ఎప్పుడూ.. వివిధ భాషల్లో.
ఒక రాత్రి.. ఒక సంగీత విభావరి తర్వాత కలిసింది తను ఒక ఫైవ్ స్టార్ హోటెల్లో శాస్త్రిగారిని.. కొన్ని సుమబాణాల్లాంటి చూపులనూ.. కొన్ని తళుకులీనే శరీర కదలికలనూ ధరించి.. తప్పించుకోలేని మధుర ధరహాస చంద్రికలనూ వలలా వేసింది.
జీవితమంటేనే వ్యాపారమనీ.. వ్యాపారమే జీవితమనీ.. కదా ఎం బి ఎ లో పాఠం చెప్పేది.
శాస్త్రిగారికీ.. తనకూ రోజురోజుకూ దూరం తగ్గుతూ.. సాన్నిహిత్యం పెరుగుతూ.. పరస్పరం అర్థంకావడం మొదలై. ,
కొన్నింటిని అడిగితేగాని ఇవ్వొద్దు.. మరి కొన్నింటిని అడుగకముందే ఇచ్చి పిచ్చెక్కించి పరవశింపజేయాలి. ఇంకొన్నింటిని.. మరీ మరీ అడిగించుకుని.. బ్రతిమాలించుకుని మాత్రమే ఇవ్వాలి.
‘ నేను పాట పాడుతా.. నువ్విను ‘ అంటే వినడువాడు. వాడే ‘ ప్లీజ్.. ఒక్కసారి ఒక పాటపాడవా. ‘ అని బతిమిలాడినప్పుడు పాడుతే బహుబాగా వింటాడు.. ప్రశంసిస్తాడు.
మంచి మేనేజర్.. తననుకున్న జవాబును ఎదుటివాడు వానంతట వాడే చెప్పేట్టు చేసుకుంటాడు.
శాస్త్రిగారు.. ప్రక్కమీదున్నపుడు.. కొన్నిసార్లు బతిలాడగా బతిలాడగా ఒక పాటను అద్భుతంగా పాడి వినిపించి గిలిగింతలు పెట్టింది తను. ఫ్లాటయ్యాడు ముసలోడు. ముఖ్యంగా ఒక్కసారే విని తను ధారణ చేసి మళ్ళీ వెన్వెంటనే వినిపించే తన ప్రతిభకు షాక్ అయ్యాడు. ఒకానొక తన్మయ స్థితిలో ” ఉషా.. రేపే నీ పాట రికార్డింగ్ “అన్నాడు. అని ఆగకుండా.. ” చూస్తూండు నువ్వు.. నిన్ను భారతదేశ అత్యుత్తమ లేడీ సింగర్ ను చేస్తా రెండేళ్ళలో. నీది ఒక విలక్షణమైన మధుర స్వరం” అన్నాడు. శాస్త్రి గారు తనకు లొంగిన మాట సత్యమే కాని.. నిజానికి ఆయన ఒక అత్యున్నత స్థాయి సంగీతకారుడు.
ఒక రోజన్నాడు శాస్త్రిగారు.. ” నిజానికి కళలన్నీ మనిషికి దైవదత్తంగా సంక్రమించేవే.. కె ఎల్ సైగల్ కు శాస్త్రీయ సంగీతమే రాదు. కాని అద్భుతమైన శాశ్వతమైన జీవవంతమైన గీతాలను అందించాడుగదా. శాస్త్రాలేవైనా మనిషి అనుభవాలనుండీ.. అధ్యయనాలనుండే పుట్టాయిగాని.. అనుభవాలు శాస్త్రాలనుండి పుట్టలేదు. నువ్వు ఒక సహజ గాయనివి ఉషా” అని.
నిజానికి ఆయన తనను కావాలని పట్టుపట్టి ఒక ప్రపంచస్థాయి గాయకురాలిని చేశాడు. ఈ పన్నెండేళ్లలో శాస్త్రిగారు పెట్టిన భిక్షే ఈ తన వైభవ ప్రాప్తి. ఆయనను వెదికి పట్టుకోవడం తన తెలివి.
ఐతే.. గాయనిగా.. ఒక విలక్షణమైన గొంతు ఉన్న దానిగా పొందిన గౌరవాలు,అనేకానేక సత్కారాలు,విజృంభించి అధిరోహించిన అత్యున్నత శిఖరాలు.. అన్నీ ఇప్పుడు.. ఒక మాయవలె.. విడిపోతున్న మంచు తెరలవలె.. ఒక దీర్ఘ భ్రాంతివలె,
ప్రశ్నలు.. జీవితంలో.. ఆ తర్వాత.. అటు తర్వాత.. ఆ ఆ తర్వాత.. అని.. ప్రశ్నలు.
ప్రశ్నలు.. రాలుతున్న ఎండుటాకులవలె.. ప్రశ్నలు.. కూలిపోతున్న సౌదాలవలె.. ప్రశ్నలు చెదిరి విరిగిపోతున్న నీడలవలె.
పెరుగుతున్నకొద్దీ.. లోపల విశాలమైపోయిన ఎడారి.. ఎక్కడా.. సుదూర ప్రాంతమంతా.. మనుషుల జాడలే కానరాని ఎడారి. తత్వవేత్తలన్నట్టు.. ఎప్పుడైనా మనిషి కొంత పొందుతున్నాడూ.. అంటే కొంత కోల్పోతున్నట్టే లెఖ్ఖనా. ?

*****

అమ్మ.. రజియా జ్ఞాపకమొచ్చింది ఉషకు. అమ్మ జ్ఞాపకంతోపాటే ఆపుకోలేని దుఃఖం.
తను ఎదుగుతూ.. ఇంకా ఇంకా ఎదుగుతూ పైకి వెళ్తున్నకొద్దీ.. ” అమ్మా.. రా నా దగ్గరకు.. నాతో.. నాతోపాటే ఉండిపోవమ్మా.. అమ్మా రజియా.. నా దేవత అమ్మా.. రా వచ్చి నా తలను నీ ఒడిలోకి తీసుకుని.. నన్నొక్కసారి నీ పరిష్వంగంలో.. నీ అమృతహస్తాలతో,”
కాని అమ్మ రాలేదు. చనిపోయిన తమ్ముడు షకీల్ జ్ఞాపకాల్లో కనలిపోతూ, చావక ఇంకా మిగిలి ఉన్న నాన్న లక్ష్మణ్ తో.. అదే తోపుడు బండి. అదే జీవితం. అమ్మది.
అసలు జీవితం ఏమిటి. ?
బిగ్గరగా రైలు కేక. భయంకరంగా. వికృతంగా.
అసలు తనిక్కడిలా కూర్చున్నట్టు ఎవరికీ తెలియదు. తెలిస్తే. క్షణాల్లో ఇసుకపోస్తే రాలనంతమంది అభిమానులు చొచ్చుకొస్తారు.
ఒక అంతర్జాతీయ స్థాయి గాయనిప్పుడు.. ఉష.
కాని.. కాని,
లేచి.. ఉష శాలువాను శరీరం చుట్టూ సవరించుకుని,
ఎ-వన్.. కంపార్ట్ మెంట్.. తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్.. లో.. ముప్పది రెండో నంబర్.
కిటికీలోనుండి బయటకు చూస్తూండగానే రైలు మెల్లగా కదుల్తూ.. బయటంతా చీకటి. నల్లగా.
కొద్ది నిముషాల్లోనే ఢిల్లీ మహానగరం కనుమరుగౌతూ,
‘ విజయవాడలో దిగగానే.. పరుగు పరుగున అమ్మ దగ్గరికి పరుగెత్తి.. చుట్టుకుపోయి… అమ్మ.. అమ్మ.. రజియా.. అమ్మ. ,’
ఎందుకో చటుక్కున ఉష చేయి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ముఖేశ్ పాటను వింటానికి టచ్ ఫోన్ తెరను తడిమింది.
” జుబాపే దర్ద్ బరీ దాస్ తా చలీ ఆయీ
బహార్ ఆనేసే పహలే ఖిజా చలీ ఆయీ.. ” స్వర ఝరి అది.. గాలిలో తేలుతూ.
ఒక మహాద్భుత విషాద గీతంలో ఎక్కడని వెదుక్కుంటావు.. పోగొట్టుకున్న హృదయాన్ని. ?
రైలు వేగాన్ని పుంజుకుంటోంది చీకట్లో.

*****

1 thought on “తాత్పర్యం – దిగడానికి కూడా మెట్లు కావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *