May 25, 2024

ధృతి – 11

రచన: మణికుమారి గోవిందరాజుల

స్వాతీ… చెప్తే అర్థం చేసుకో… ఆ అమ్మాయి చాలా తెలివితేటలు కలది. అదే కాక మనవాడికి తగినజోడి అవుతుంది కూడాను” అప్పటికి చాలా సేపటినుండి నచ్చ చెప్తున్నాడు శేఖరం.
“అంత మాత్రం జోడీ మనవాడికి ఎలానూ దొరుకుతుంది. ఇలా చిన్నపిల్లను ఒప్పుకుని వయసొచ్చేదాకా ఎదురు చూడక్కరలేదు. ఎట్టి పరిస్తితుల్లోనూ నేను ఒప్పుకోను” ఖరాకండిగా చెప్పింది స్వాతి.
“ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి మన కాలేజ్ లో మూడేళ్ళుగా టాపర్ గా ఉంటున్నది. ఎన్ని కల్చరల్ సోషల్ ఆక్టివిటీస్ లోనో చాలా చురుగ్గా ఉంటుంది. మన కాలేజీకే గొప్ప పేరు తీసుకువస్తుంది. ఈ ఏడాది ఆగు. నువే ఒప్పుకుంటావు” చిరాగ్గా బయటికి వెళ్ళిపోయాడు శేఖరం.
“ఏంటి అర్థమయ్యేది? ఎందులోనూ తమతో సరితూగని ఆ అమ్మాయిని చేసుకునే ఖర్మ నా కొడుక్కెందుకు?” కోపంగా గొణుక్కున్నది స్వాతి.
అక్కడే ఉండి ఆ సంభాషణ వింటున్న దక్ష “అమ్మా ఎవరి సంబంధం గురించి” అడిగింది.
“మీ కాలేజీలో చదువుతున్నదే ధృతి అని, ఆ అమ్మాయిని మీ అన్నయ్యకు అడగాలని మీ నాన్న కోరిక”
ఒక్కసారిగా అదిరిపడి లేచింది దక్ష “ఏంటీ ఆ ధృతినా? అమ్మా! నేనస్సలే ఒప్పుకోను” కోపంగా అన్నది.
“నేను మాత్రం ఒప్పుకుంటున్నానా? మీ నాన్నకు ఆ పిల్ల మీద బాగా ఉన్నది. ఆ అమ్మాయి కాలేజీలో చేరినప్పటినుండి ఆ పొగడ్తలు వినలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడేమో ఆపిల్లను తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోపెడతారట”
“అమ్మా! కాలేజీలో కూడా ఆ అమ్మాయి ఏది చెబితే అది వెంటనే ఓకే చేస్తారు నాన్న. కాలేజీలో టాపర్ కదా, యూనియన్ లో లేకపోయినా అది ఇచ్చిన సజెషన్స్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు” అక్కసుగా అన్నది దక్ష.
“ఇక ఇంట్లో చేరిందంటే మన మాట కూడా వినరు మీ నాన్న. ఇది జరిగేది కాదులే… నువు కంగారు పడకు”
దక్షకు కాలేజీలో చేరిన కొత్తల్లో జరిగిన గొడవ గుర్తొచ్చింది.
అప్పటికి కాలేజీ మొదలయ్యి వారం గడిచింది. రాగింగులూ అవీ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక అదే చివరి రోజు. ధృతీ వాళ్ళ బ్యాచ్ రాగింగ్ ని ఎక్స్ట్రీం కాకుండా మానిటరింగ్ చేస్తున్నారు. అందరూ కూడా పరిధిలోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో అప్పుడే వచ్చిన దక్ష మీద పడింది వాళ్ళ దృష్టి.
“హే దక్షా! ఆగు… ఇప్పుడు మేము చెప్పినట్లు నువు చేసి వెళ్ళాలి. ఒక సీనియర్ దక్షను ఆపాడు.
“నన్ను ఆపటానికి మీరెవరు? నేనెవరో తెలుసా? ఒక్క మాట చెప్పానంటే అందరూ ఇంటి ముఖం పదతారు” తనంతటి దాన్ని ఆపారని కోపంగా అన్నది దక్ష. అంతకు ముందు రాగింగ్ చేసినపుడు బానే ఎంజాయ్ చేసింది. కాని ఆ రోజు అక్కడే కూర్చుని చాక్లెట్ తింటూ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తున్న ధృతిని చూడగానే, ఆమె గురించి అందరూ చెప్పుకుంటున్న మాటలు గుర్తొచ్చి, ధృతి ముందు తన ప్రతాపం చూపించాలని అలా మాట్లాడింది.
సాధారణంగా కాలేజీలో కొత్తగా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు చేరితే వాళ్ళ బయోడేటా అంతా కలెక్ట్ చేసి ఉంచుకుంటారు స్టూడెంట్స్. అదీ కాక తన ఐడెంటిటీ దాచుకోవాలని దక్ష అనుకోకపోవడం వల్ల కూడా ఆమె ఎవరో కాలేజ్ మొత్తం తెలుసు.
చాక్లెట్ తింటున్న ధృతి “లెట్ హర్ గో” అన్నట్లు సైగ చేసింది.
“ఇది రాగింగ్ టైం అమ్మా! మేము చాలా సింపుల్ వే చేయమని అడుగుతున్నాము. ఓకే ఇష్టం లేకపోతే యు కాన్ గో” పక్కకి తొలిగారు అందరూ.
దక్ష ఇగో దెబ్బతిన్నది. వాళ్ళేదో భయపడి కాసేపు బతిమాలుతారు అనుకున్నది. అదీ కాక ధృతి సైగతో వాళ్ళు వదిలేసరికి ఇంకా ఫీల్ అయింది. “హూ…” అంటూ కదలబోయింది. ఫాస్ట్ గా తిరగడం లో అక్కడ కూర్చున్న ఒక అబ్బాయి కాలు తగిలి కిందపడబోయి నిలదొక్కుకున్నదే కాని చేతిలోని హ్యాండ్ బ్యాగ్ కింద పడింది. ఒకళ్ళిద్దరు కిసుక్కుమన్నారు మంచిపనయిందని. వాళ్ళ నవ్వులకు కోపం వచ్చిన దక్ష తనకు కాలు పిల్లాడిని ఈడ్చి చెంపమీద కొట్టింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకున్నది అక్కడ. చెంపదెబ్బ తిన్న పిల్లాడు నిర్ఘాంతబోయి చెంప పట్టుకుని నిల్చుండిపోయాడు.
“యూ బ్రూట్… నా జోలికి రావొద్దని చెప్పినా ఎందుకు వచ్చావు? రేపు కాలేజ్ మొహం చూడకుండా చేస్తాను” అన్నది కోపన్నంతా కళ్లతో చూపిస్తూ.
నిజానికి ఆ పిల్లాడు ఫ్రెషర్. అందరితో పాటు రాగింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ మాటలకు భయపడిపోయి బిక్కమొహమేసి “నేనేమి చేయలేదు. మీ కాలే నాకు తగిలింది” చెప్పాడు.
“డోంటాక్… రేపు చూడు” తర్జని చూపిస్తూ బెదిరించి కదలబోయింది. అదంతా చూస్తున్న ధృతి “మిస్ దక్షా ప్లీజ్… లిజెన్ హిమ్. అతనేమి చేయలేదంటున్నాడు కదా. ఇంతటితో ఇది వదిలేయ్. ఆ అబ్బాయి కొత్తగా చేరాడు. పాపం భయపడిపోతున్నాడు” నచ్చచెబుతున్నట్లుగా మాట్లాడింది.
అసలే ధృతి మీద కోపంగా ఉన్న దక్ష ధృతి మాటలకు మరింత మండిపడింది. “నువ్వెవరే నాకు చెప్పటానికి” మాట తూలి ముందుకు కదిలింది. అందరూ షాక్ తిన్నారు. ధృతి అంటే కాలేజీలో అందరికీ ఒక రెస్పెక్ట్. అదీకాక సీనియర్ ని పట్టుకుని అలా అనేసరికి కొందరికి కోపం కూడా వచ్చింది. వెళ్ళబోతున్న దక్షని ఆపి ఏదో అనబోయారు. అంతా చూస్తున్న ధృతి వాళ్ళను ఆపింది. “దక్షా! అనవసరమైన గొడవ అవుతుంది. ప్లీజ్ అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నువెళ్ళు” అన్నది అనునయంగా.
ఏదో అనబోయి తమాయించుకుని విస విసా వెళ్ళిపోయింది.
నీరసపడ్ద అందరినీ ఉత్సాహపరచింది ధృతి.
అది అంతటితో ఆగిందనుకున్నారు అందరూ. కాని మర్నాడు ఆ అబ్బాయికి నోటిస్ వచ్చేసరికి భయంతో ఏమి చేయాలో తెలీక ఎవరో చెప్తే ధృతి దగ్గరికి పరుగునా వచ్చాడు ఆ నోటీస్ పట్టుకుని. వెంటనే ధృతి యూనియన్ లీడర్ ని తీసుకుని మేనేజ్మెంట్ ని కలిసింది. అదే సమయం లో అక్కడికి వచ్చిన శేఖరం గారు విషయం తెలుసుకుని ఆ నోటీస్ క్యాన్సిల్ చేసారు. తనకు చెప్పకుండా తన కూతురైనా సరే అలాంటి నిర్ణయాలు తీసుకుంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ఆఫీస్ స్టాఫ్ ని మందలించారు. అది మొదటి దెబ్బ దక్షకు. ఆ తర్వాత కూడా అలా ఇగో హర్టయ్యే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
“ధృతీ! కాలేజీలో నీతో పడుతున్న అవమానం చాలట్లేదని ఇంట్లో కూడా తయారవుదామని అనుకుంటున్నావా? నేను నిన్ను ఎట్టి పరిస్తితుల్లోనూ రానివ్వను” మనసులోనే శపధం చేసుకున్నది దక్ష.

*******************

విశ్వ ధృతితో కాంటాక్ట్ లోనే ఉంటున్నాడు. రెండేళ్ళ చదువు పూర్తి చేసుకున్న విశ్వ అక్కడే పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీతో జాబ్ లో జాయిన్ అయ్యాడు. జాబ్ లో చేరే ముందు ఇండియా వచ్చినపుడు మళ్ళీ అడిగాడు విశ్వ ధృతిని. ఎట్టి పరిస్తితుల్లో డిగ్రీ పూర్తయ్యేదాకా ఏమీ చెప్పను అని ధృతి కచ్చితంగా చెప్పేసరికి ఇక ఆ విషయం ఎత్తలేదు. మంచి స్నేహితులుగా వాళ్ళ స్నేహం చక్కగా కొనసాగుతున్నది. మెయిల్స్ లో అతని భావుకత, హద్దులు దాటని అతని సంభాషణ ధృతిని ప్రతిసారీ మంత్ర ముగ్ధురాలిని చేస్తూనే ఉన్నది.
ఆఖరి సంవత్సరం లో ఉన్న ధృతి కాలేజీలో మంచి పేరు తెచ్చుకున్నది. రకరకాలుగ ధృతి ఇస్తున్న సలహాలను మేనేజ్మెంట్ అంగీకరించి ఆచరణలో పెట్టడంతోకాలేజీకి కూడా గొప్ప పేరు వచ్చింది. ధృతి కంటే ఒక ఏడు తర్వాత చేరిన దక్షకు అది అస్సలు కొరుకుడు పడటం లేదు. కాని ఏమి అనడానికి లేకుండా తండ్రి సపోర్ట్ బాగ ఉన్న ధృతిని ఏమీ చేయలేకపోతున్నది. ఒక రకంగా అసూయా ఈర్ష్యలు ఆమెని బాగా ఆక్రమించుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు దానికి తగ్గట్లుగా తండ్రి ఆమెని కోడలుగా తెచ్చుకుంటాననడం దక్ష కోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఆ కోపం దేనికి దారితీస్తుందో కాలమే చెప్పాలి.

*********************

సశేషం

1 thought on “ధృతి – 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *