April 16, 2024

పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

డాక్టర్. కె.వివేకానందమూర్తి (యు.కె)

ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్ధం గుండె బ్రద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి. బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది.
డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి, బండి దెబ్బతింది’.
కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకపైపు వెలికివచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో మాట్లాడుతున్నాడు. ఓ ముసిలాయన కండక్టర్ని అడిగేడు – ‘రిపేరీ వచ్చిందేవిటి?’
‘మరేనండి’
‘ఇప్పుడప్పుడే కదల్దేవిటి?’
‘కదల్దండి’ కండక్టరు ఏదో హామీ యిస్తున్నట్లు చెప్పేడు.
‘అసలేవైందేవిటి?’ మళ్ళీ అడిగేడు ముసిలాయన.
‘ఎనక సెక్రాలు దెబ్బతిన్నాయ్ – నాలుగు గజాలు ఎదరకెలిపోస్తే బండి తిరగబడి పోయేది. లేచినేళ మంచిది.’
‘సైడు మిర్రర్లోంస్సూసేను. రెండు ఎలిపికొచ్చీసేయ్’ డ్రైవరు తన సామార్ధ్యాన్ని ప్రకటించుకున్నాడు. ముసిలాయన ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆయన భార్య కాబోలు – గుండెల మీద చెయ్యి పెట్టుకుంది. ఆ చెయ్యి కింద మంగళసూత్రాలున్నాయి.
ఎవరో మరో వ్యక్తి అన్నాడు. ‘ఎంత ప్రమాదం తప్పింది!’
‘ఇప్పుడేఁవిటి చెయ్యడం?’ మరో ఆసామీ ప్రశ్నించేడు.
‘సెక్రాలు ఫిరాయించాలండీ’ డ్రైవరు జవాబు చెప్పేడు.
‘ఎంత సేపవుతుంది?’ నేనడిగాను.
‘సెప్పలేనండీ, యిటేపొచ్చే లారీ ఏదన్నా ఆపుసేసి వొయిజాగెల్లి హెడ్డాపీసుకి రిపోర్ట్రిస్తే, స్పేరు బండో, జీపో రిపేరీకి తోల్తారు. నేనెల్లాలి – ఆళ్లు రావాలి. ఫిటింగిచ్చాక బండి కదలాలి. ఏటి సెత్తాం లెండి? నయ్యం! పేణాలు దక్కేయ్!’ డ్రైవరు జవాబు చెప్పేడు.
మళ్ళీ ఎవరో విద్యార్థి అడిగేడు – ‘మరయితే అందాకా రాంభజనే అన్నమాట?’
‘మరి తప్పదండి. లేటవుద్ది సేనా’ అన్నాడు కండక్టరు.
అప్పటికే జనం చాలా మంది చుట్టూరా చెట్ల క్రిందికీ, పచ్చిక మీదికి చెదిరిపోయేరు. రాంభజన చేస్తానన్న విద్యార్థి కూడా మరో నలుగురు మిత్ర బృందంతో కలిసి కాస్త దూరంలో మెత్తటి గడ్డిమీద బైఠాయించాడు. భజన మొదలు పెట్టేందుకేమో – జేబుల్లోంచి చిడతలు తీస్తారులా వుంది అనుకున్నాను. కాని పేక తీసి ఆట పరిచేరు – చప్పుడు లేని భజన!
వొంటరి ప్రయాణీకుణ్ణవడం వల్ల నాకేమీ తోచడం లేదు. కాస్సేపటి క్రితం బస్సులో కూర్చుని మరో రెండు గంటలకల్లా విశాఖపట్నంలో కాఫీ త్రాగొచ్చుననుకున్నాను. తీరా యిప్పుడు కాఫీ త్రాగడం కోసమే ప్రాణాల్తో మిగిలినట్టయింది. చేతి వాచీ చూసుకొన్నాను. నాలుగైంది. సాయంత్రపు చల్లదనం కొంచెం కొంచెం తెలుస్తోంది. ఎండలో తారురోడ్డు ఎంచక్కా మెరుస్తుంది. రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లూ, పొలాలూ, పొదలూ, దూరాన
ఎత్తుగా కొండలూ, యింకా ఎత్తుగా వంగిన ఆకాశం – ప్రకృతి అందం ప్రయాణంలో బాగా కనబడుతుందనుకుంటా.
రుమాలుతో ముఖం తుడుచుకుని దూరంగా చూశాను. చెట్ల మధ్య ఏదో చిన్న పల్లెటూరు కనబడింది. దాదాపు మైలు దూరం వుండొచ్చు. ఎలాగో అలా నాకూ కాలహరణం చెయ్యాలనుంది. మెల్లగా కదిలేను. పిల్లగాలి పీలుస్తూ, పిల్లకాలువ గట్లు దాటుకుంటూ నెమ్మదిగా నడిచేను. అరగంట నడిచేసరికి ఆ వూళ్ళోకి అడుగుపెట్టేను.
బాగా చిన్న వూరులా ఉంది. బహుశా వెయ్యి గడప వుంటుందేమో. ఇళ్ళన్నీ దాటుకుంటూ మట్టిరోడ్డు మీద మరో నాలుగు నిమిషాలు నడిచాక చెరువొకటి కనబడింది. చెరువుకివతలగా ఒంటిగా, వెలివేయబడినట్టున్న ఒక పాత పెంకుటిల్లు జబ్బు మనిషిలా నిలబడి వుంది. దానికెదురుగా చిన్న ఖాళీ స్థలం ఉంది. స్థలమంతా పచ్చిక మొలచింది.
బాగా నడవడం వల్ల కాళ్ళు పీకుతున్నాయి. అక్కడికి పోయి కాస్సేపు కూర్చుందామనిపించింది. అటువైపు కదిలేను. పచ్చికలోకి అడుగుపెట్టగానే స్థలం మధ్యగా ఏదో నా దృష్టి నాకర్షించింది. చకచక అక్కడికి వెళ్ళాను. అది ఏదో మహాశిల్పం తాలూకు అవశేషం. మోకాళ్ళ క్రిందికి విరిగిపోయి మిగిలిన పాదాల జంట అది. రాతి మీద చెక్కారు. అందమైన ఆభరణాల్ని, క్రిందికి జారిన వస్త్రాన్ని ఆకర్షణీయంగా అలంకరించి మలిచేరు. అది ఏనాటి శిధిలమో! దానిలో యింకా నాజూకుతనం తొణికిసలాడుతోంది. పవిత్రత వుట్టిపడుతుంది. ఎవరో మహత్తర శిల్పస్రష్ట చేతుల్లో సృష్ఠింప బడినట్టుంది అది. ఇంతకు ముందు నేను మొహంజోదారో, హరప్పా శిధిలాలు చూశాను. అజంతా ఎల్లోరాలు చూశాను. మల్లీశ్వరి సినిమా కూడా చూశాను – నాకు శిల్పాలంటే పిచ్చి. ఆ పాదాల్ని చూడగానే, నేనింతవరకూ చూడని గొప్ప శిల్పితనం నాకు వాటిలో కనబడింది. ఇష్టంగా వాటిని చేతుల్తో ముట్టుకు చూశాను. అరగంటసేపు చూశాను. – నడిచినంత సేపు. ఆ స్త్రీ మూర్తి పాదాలు నాకెంతో నచ్చాయి. నాకప్పుడనిపించింది. ఆ పాదాలు భరించే పూర్తి విగ్రహం చూడగలిగితే ఎంత బాగుణ్ణో కదా – అని. కాని, ఆ అవకాశం నాకు దక్కలేదు. కేవలం శిధిలం మాత్రమే చూడగలిగాను. అది నా మనసులో ముద్ర వేసింది. దాని పూర్తి స్వరూపాన్ని చూడలేకపోయినా, కనీసం దాన్ని మలిచిన ‘మహాశిల్పి’ నేనా చూసి తీరాలనిపించింది. ఆయనది బహుశా ఈ ఊరే అయ్యుంటుంది. ఆయనిక్కడివాడే అయ్యుంటాడు – అనే ఊహలు నాలో కలిగాయి. ఆయన్ని కలుసుకుని మనసారా అభినందించే భాగ్యం కలిగితే బాగుణ్ణనుకున్నాను.
వంగినవాణ్ణి లేచి నిలబడ్డాను. వూళ్ళో వాకబు చేద్దామని వెనక్కి తిరిగేను. ఎదురుగా పాత పెంకుటింట్లో ఎవరో నివాసం ఉన్నట్టు తోచింది. ముందు అక్కడికి పోయి అడిగిచూస్తే సరి – అనుకుని ఆ ఇంటివైపు దారితీశాను. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ నా మనస్సు నీడలో ఆ శిధిలం యింకా స్థిరపడుతోంది. దగ్గరకొచ్చాను. ఇల్లు కూడా శిధిలావస్థలోనే వుంది విరిగిపోయిన నాగరికతా చిహ్నంలా, చితికిపోయిన అంతస్తుకి ప్రతీకలా కనబడింది. వానొచ్చినప్పుడు కాళ్ళు బురదకాకుండా యింటి ముందు నాపరాతి ముక్కలు పరిచేరు. నేల బాగా వున్నా వాటి మీదుగానే నడిచి, అరుగుల మధ్య మెట్లెక్కేను. తటపటాయించేక తలుపు తట్టాను. సమాధానం లేదు. నెమ్మదిగా నెట్టాను. దగ్గరగా జేరవేసిన తలుపు చిన్న శబ్ధంతో తెరుచుకొంది. తల ముందుకు వొంచి లోపలికి చూశాను. చాలా పెద్ద గది. హాలనుకుంటా, జీర్ణావస్థలో ఉంది. గోడలకి అక్కడక్కడ బెల్లులూడిపోతే మట్టి రాశారు. ఓ పక్కగా చాంతాడుతో దణ్ణెం కట్టారు. దాని మీద వెలిసిన చీరె, ఒక వెలవని జాకెట్టు, యింకా ఏవో పాత బట్టలూ, పేద బట్టలూ పడేసి వున్నాయి. ఏవో నాలుగైదు అందమైన శిల్పాల్ని గోడలు భరించగలుగుతున్నాయి. క్రింద గోడ వార బల్లలు పరిచేరు. ఆ బల్లల మీద పెద్దవి, చిన్నవి రకరకాల చక్కటి శిల్పాలెన్నో వున్నాయి. వాటిలో చాలా భాగం స్త్రీమూర్తులు. మిగతా వాటిలో రెండు ముసిలి గాంధీలు, నాలుగు పడుచు గోపికలు – మధ్య ఒక చిలిపి కృష్ణుడు. హృదయం లేకుండా తల మాత్రమే వున్న హిట్లరు, చెయ్యి విరిగిన ఛత్రపతి శివాజీ, జూలు మాసిన సింహమూ మొదలైనవి వున్నాయి. క్రిష్ణుడి చేతిలో పిల్లనగ్రోవి లేదు, విరిగి పోయిందనుకుంటా. డ్యాన్సు చేస్తున్నట్టున్నాడు. సింహం నోట్లో బూజు పట్టింది. ఒక గోపికకి రొమ్ముల మధ్య లోయగా జారినచోట బీట తీసింది – క్రిష్ణుడి మీది ప్రేమకి గుండెలో చోటు చాలక హృదయం పగిలినట్టు. అన్ని శిల్పాలు అద్భుతంగా వున్నాయి నాకు. అపూర్వమైన ఆ శిల్ప సంపదను కాపాడేందుకని తాపత్రయంతో మిగిలినట్టుగా ఉంది హాలు. రుతుపవనాల తాకిడికీ, సూర్యుడి విసిరిన నిప్పులకి ధైర్యంగా ఎదురు నిలిచి, చివరికి జనం విడిపోగా ఆ సందర్భంగా క్రిందికి వొదిగిన యింటి పైకప్పు నడుం విరిగిన పాక్ సిపాయిని గుర్తు చేస్తోంది.
నేననుకున్న యిల్లు యిదే అయిఉంటుందని నిశ్చయించుకొని లోపలికి అడుగెట్టేను. విసనకర్ర శబ్ధం వినిపించింది. హాల్లోకి సన్నటి పొగలు ప్రవేశిస్తున్నాయి. లోపల వంటగదిలో ఎవరో పొయ్యి రాజేస్తున్నట్టుంది. తల పక్కకి తిప్పేను. వీధి వైపున గోడవార కిటికీ పక్కగా నున్న పాత మంచం మీద ఒక వ్యక్తి పడుకుని ఉన్నాడు. బహుశా నే చూడాలనుకునే ‘మహాశిల్పి’ యీ వ్యక్తేనేమో! నన్నాయన గమనించలేదు. తెరచిఉన్న కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు. దాదాపు అరవై ఏళ్ళ వయసుండొచ్చు. ఇంటిలాగే తనూ శుష్కించి వున్నాడు. సాయంత్రపు వెలుగులో ఆయన పెద్ద గడ్డం వెండిలా మెరుస్తోంది. మీసాలకీ, గడ్డానికీ నడుమ దాగివున్న సన్నటి పెదాల కలయికలో అనుభవాలు మిగిల్చిన గర్వం ఏదో వొంపు తిరిగినట్టుంది. లోతైన ఆయన కళ్ళలో లోయల్లో దాగిన ప్రశాంతత కనబడుతోంది. అంత వయసొచ్చినా, ఆ కళ్ళలో చురుకుదనం చచ్చిపోనందుకు కాస్త ఆశ్చర్యమేసింది. అలా ఒక్క క్షణం చూసేక నాకాయన అంపశయ్య మీద పడుకున్న భీష్ముడిలా అగుపించేడు.
ఇంకా అక్కడ నా ఉనికి గుర్తింపబడక పోవడంలో నా ‘మహాశిల్పి’ మీద నాకు ఆతృత పెరిగింది. చిన్నగా దగ్గేను. ఆయనకు వినబడినట్లుంది. ‘ఎవరూ?’ అంటూ తల నాకేసి తిప్పి చూసేడు. నేను మంచం దగ్గరికి నడిచి ‘నేనండీ!’ అని పేరు చెప్పాను. ఆయన ఇంకా ప్రశ్నార్ధకంగానే చూశాడు. నేను మళ్ళీ చెప్పాను – ‘నేనీ ప్రదేశానికి చాలా కొత్తవాణ్ణి. విశాఖపట్నం వెళ్తుంటే దారిలో ఈ వూరి దగ్గర హఠాత్తుగా బస్సు పాడయింది. రిపేరు చేస్తున్నారు. నాలుగ్గంటలు పైగా ఆలస్యం ఉందిట. ఎందుకో ఈ వూరు చూసిపోదామని సరదా పుట్టింది. ఇలా వచ్చాను. ‘వచ్చాక’ అని నేను యింట్లోకి ప్రవేశించిన కారణం చెప్పబోయేంతలో , ఆయన ‘అలాగా అబ్బాయ్! చాలా సంతోషం!’ అన్నాడు. ‘అమ్మాయ్! కాసిని మంచినీళ్ళు పట్టుకురామ్మా!’ అంటూ కూతుర్ని కాబోలు – పిలిచి నా వైపు తిరిగాడు. ముఖంలో ఎంతో అనుభవం, పరిజ్ఞానం, స్వచ్ఛత వుట్టిపడుతున్నాయి. ఏదో గొప్ప కుటుంబంలో పుట్టి, చివరికి చితికి పేదవాడై పోయిన వ్యక్తిలా వున్నాడాయన. కూర్చోమని చెప్పేడు. మంచం పక్కనే వున్న పాత కుర్చీలో కూర్చున్నాను.
శిల్పాలకేసి చూస్తూ నేనన్నాను.. ‘నిజంగా యీ రోజు నేను చాలా అదృష్ట వంతుణ్ణి. ఇక్కడ మీ యింట్లో అద్భుతమైన శిల్పాలెన్నో చూడగలిగాను. నాకు శిల్పాలంటే చచ్చే పిచ్చి. మొదట్లో బయటినుంచి యీ యిల్లు చూసినప్పడు, యీ లోపల యింత శిల్ప శోభ వుంటుందని వూహించలేదు. అపూర్వంగా వున్నాయవి. ఇవన్నీ చూస్తుంటే – ప్రయాణీకుల బస్సులు యిలాగా అప్పుడప్పుడు పాడవుతూ ఉండాలనిపిప్తోంది నాకు.
ఆయన భళ్ళున నవ్వేడు. ఆ నవ్వులో సంతోషం కంటే గర్వమూ, తృప్తీ కలిసి కనిపించేయి. నాకెందుకో యిల్లు కూలిపోతుందమోనని భయమేసింది. కప్పుకేసి చూశాను.
ఆయన నవ్వు పూర్తి చేసి, నా మోకాలి మీద చెయ్యి బలంగా మోపేడు. ‘బాగుందబ్బాయ్! ఇన్నాళ్లకి నా శిల్పాల గొప్పతనం చవిచూడగలిగిన మనిషి నా దగ్గరికి వచ్చినందుకు నాకు పరమానందంగా వుంది’ అన్నాడు. ‘నా కళ నాలాగే ముసిలిదై పోయిందనుకున్నాను. లేదు అదింకా పడుచుగా బ్రతికే వుంది. ఎప్పటికీ అలాగే వుంటుంది. చరిత్రలో నా శిల్పాలు నాలుగు కాలాల పాటు నిలుస్తాయి చాలు. అది చాలబ్బాయ్! అదే నాక్కావలసింది.’ ఆయనలో వుద్రేకం కనబడింది.
వెంటనే నాకు ‘మహాశిల్పి’ యీ వ్యక్తేనని తెలిసింది. ఆయన మీద పూజ్యభావం ఏర్పడింది. నాలో ఆయనంటే ఎంతగానో ఆసక్తి పెరిగింది. సాటిలేని తన అభిమాన తార దర్శనభాగ్యం అభించిన మూడవ తరగతికి ప్రేక్షకుడికి కలిగే అనుభూతిలాంటి అనుభూతి యీ క్షణం ఆయన సమీపంలో నాకు కలిగింది. నా జన్మ చరితార్ధమైనట్లు భావించాను. మీకు నవ్వు రావొచ్చు. కాని నాకు శిల్పాలంటే అంత పిచ్చి! –

ఇంతలో ‘మహాశిల్పి’ కూతురు మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది. ఆమె లోపలికి తిరిగి వెళ్తున్నప్పుడు చూస్తే ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న శిల్పం ఏదో కదిలినట్లనిపించింది నాకు. మెరిసేలా తోమిన గ్లాసు మీద కదలిపోయే ఆమె రూపం చిత్రంగా సాగి మెరిసింది.
ఆమె లోనికి వెళ్లాక, ఆయన్ని పేరడిగాను. చెప్పేడు. మనిషికి తగ్గపేరు – నరసింహాచార్యులు.
మంచినీళ్లు త్రాగుతూ అనుకున్నాను – ప్రతి గొప్ప కళాకారుడి సృష్టి లోనూ అతడి కష్టమూ – యిష్టమూ, ఓర్పు – నేర్పూ అన్నింటిని మేళవించుకొని వెలిసిన కళాఖండం ఏదో వొకటి వుంటుంది. అలాగే యీ నరసింహాచార్యులు గారికి కూడా ఏదో ఒక మాస్టర్ పీస్ వుండే వుంటుంది అనిపించింది. మంచినీళ్ళ గ్లాసు కింద పెట్టి, ఆయనకి నా వుద్దేశ్యం తెలియజెప్పే ధోరణిలో ‘చూడండీ’ అంటూ అడగబోయేను.
వెంటనే ఆయన ‘నేను చూడలేనబ్బాయ్’ అన్నాడు.
ఒక్కసారిగా నా ఆలోచనా ప్రవాహం ఆగిపోయింది. నాలో ఆయన జవాబు రగిల్చిన ఆశ్చర్యం గుండెను ఝల్లుమనిపించింది.
ఇందాకే నాకు నరసింహాచార్యులు గారి శిల్పచాతుర్యమంతా ఆయన కళ్లల్లో కొట్టొచ్చినట్లు కనబడింది. ఇంతవరకూ, గొంతుక విని చూచాయగా నా వయస్సు పసిగట్టిన ఆయన యొక్క గ్రుడ్డితనం తెలీక – ఆ కళ్ళు చెప్పని భావాలెన్నో నాలో వూహించుకున్నాను. పొరపాటు జరిగిపోయిందని కించపడ్డాను.
నా మౌనం ఆయన తెలుసుకున్నట్టుంది. మాటలు కదిపేడు. – ‘ఇంత సేపూ నాకు కళ్లున్నాయనుకున్నావ్ కదూ?’ నవ్వేడు. ‘‘ఎందుకు లేవూ, వున్నాయ్. కాని యివి శిల్పాలు చెక్కడానికి పనికి రావే. వెలుతురు చూడలేవు. అడపా తడపా వుద్రేకాలొస్తే కాసిని కన్నీళ్ళు కారుస్తాయంతే. అంతకు మించి వీటికేపనీ చేతకాదు. నేనూ అంతే. నడవలేను. కళ్లు పోయినప్పుడే కాళ్లూ పోయాయి. అప్పట్నించీ యీ మంచమే నా జీవితం’’ ఆయన ఆగాడు.
నేను మళ్ళీ యిందాకటిలాగే చలించేను. ‘ఆ మహాశిల్పి’ అంధుఢూ, అశక్తుడూ అయిపోయినందుకు తీరని జాలితో నా మనస్సు రెపరెపలాడింది. ఆయనకేసి చూశాను. శరీరమూ, జీవితమూ కలసి మిగిల్చిన కష్టనష్టాలకి తగినంత బాధ నరసింహాచార్యులు గారిలో నాకు కనిపించలేదు. ఆయనే చెప్పాడు. ‘కళ్ళు పోయాయని కానీ, కాళ్లు పోయాయని కానీ నాకేమాత్రం విచారం లేదు. ఎందుకో తెలుసా? ఈ చేతుల్తో ఈ మహత్తర శిల్ప సృష్టి ఏనాడో పూర్తి చేసేశాను. నా జీవితంలోనే సాధిద్దామనుకున్న మహాఫలితం ఏనాడో సాధించేశాను. అదేమిటనుకున్నావ్? కళాఖండం. నేను చెక్కిన శిల్పాలన్నీ వొక ఎత్తు. అదొక్కటీ ఒక ఎత్తు. చూపులక్కూడా ఎత్తయిందేలే – 24 అడుగులు’ నరసింహాచార్యులు నిర్విచారంగా మాట్లాడేడు. నాకు వెంటనే ఆ కళాఖండాన్ని తనివి తీరా చూడాలనిపించింది. కానీ, ఆయన తన కళాఖండం ఎంత గొప్పదో చెప్పేడేగాని, ఎలా వుందో, ఎక్కడుందో చూడమని మాత్రం చెప్పలేదు. అంచేత నేనే కలుగజేసుకుని – ‘‘ఏదీ? ఎక్కడుందీ మీ కళాఖండం?’’ అని ఆతృతగా, ఆసక్తిగా అడిగేను.
నరసింహాచార్యులు గారు నా ప్రశ్న విని మోచేతుల మీద సగం లేచేరు. మంచం మీంచి లేచి క్రింద పడతారేమోనని భయం వేసింది. పట్టుకోడానికి సిద్ధపడాలనుకున్నాను. కాని సగం లేచేక ఆయన అలాగే వుండిపోయి మొదలెట్టారు. ‘చూడబ్బాయ్! నువ్వు అశోకుడి గురించి చదివేవుంటావు. షాజహాను గురించి కూడా చదివేవుంటావు-’
నాకు చిరాకేసింది- కళాఖండం చూపించకుండా మాట మారుస్తాడేమిటా? అని. ఒక వేళ సస్పెన్సు కలిగిద్దామనుకుంటున్నాడేమో? హిచ్ కాక్ గడ్డం పెంచుకుంటే యిలాగే ఉంటాడేమో! అనుకున్నాను. ఏమైనా చేసేదిలేక వినడం మొదలెట్టాను. ఆయన చెబుతున్నాడు. ‘‘చెప్పుకోవడం కాదు గానీ నాకూ ఉంది పెద్ద చరిత్ర. నన్నడిగితే నాకున్న గతం హాజహానుక్కూడా లేదంటాను. చూడబ్బాయ్! ఒక్క సంగతి. యిన్నాళ్ళకి నేనంటే అభిరుచితో వచ్చిన మనిషివి నువ్కొక్కడివి కనబడుతున్నావ్. బహుశా మనిద్ధరికీ ఏదో పూర్వజన్మ సంబంధం వున్నట్టుగా ఉంది. సమయం వొచ్చింది కాబట్టి చెబుతున్నా విను. అసలు సంగతేమిటంటే –
అప్పట్లో నాకు పాతికేళ్ళ వయస్సూ, పాతికెకరాల భూమీ వుండేవి. నిత్యవూఁ శిల్పాలు చెక్కాలనే ధ్యాస తప్ప నాకు మరో దృష్టి వుండేది కాదు. ఆ రోజుల్లో ఈ చేతుల్తో నేను ముట్టని మట్టిగానీ, కొట్టని రాయిగానీ లేదు. చాలా మట్టి బొమ్మలు చేశాను. కనిపించిన రాయినల్లా తెచ్చి ఖరారైన బొమ్మలెన్నో ఖచ్చితంగా చెక్కాను. ఆ మీదట దేశంల గొప్ప శిల్పాలన్నింటికీ మించిన మహా మహా శిల్పాలు చెక్కాలనుకున్నాను. అంతే, వెంటనే బయల్దేరి దేశమంతా తిగిగాను. చూశాను. చాలా చూశాను. హంపీ శిధిలాలు, అజంతా ఎల్లోరాలు, ఆగ్రా ఢిల్లీలు గొప్ప గొప్ప కోటలు, దేవాలయాలు, మసీదులూ ఓహ్! వొహటేమిటి? సమస్తవూఁ చూశాను. తిరిగొచ్చాకనే అనుకున్నంతపనీ చెయ్యగలిగాను. గర్వపడుతున్నాననుకునేవ్! అప్పుడీ ఆగ్రహారం చుట్టుపక్కల నేనంటే తెలియని మనిషి లేడు. అద్భుతమైన శిల్పినని అంతా మెచ్చుకునే వారు. అయినా నాకెందుకో తృప్తి వుండేది కాదు. ఎన్ని మలిచినా కూడా, నేచెక్కాల్సిన శ్రేష్ఠమైన శిల్పం యింకా తయారు కాలేదనే అనిపించేది. అలాగే రోజుల తరబడి చెక్కేవాణ్ణి. దాంతో ఆదాయం లేకపోగా ఆస్తంతా హరించుకు పోవడం మొదలుపెట్టింది. అప్పుడిక లాభం లేదని, నన్నేదో బాగుచేస్తారంటూ మా పెద్దలంతా కలిసి నాకు పెళ్ళి చేసేశారు. కాని పెళ్ళయ్యాక నా ధోరణి మరీ ఎక్కువైపోయింది. కారణం ఏమిటో తెలుసా? – మా ఆవిడ అచ్చం అప్సరసే అనుకో. ఈ కాలం పిల్లలు దాని అందం ముందెందుకూ పనిచెయ్యరు. ముసిలి పీనుగ పెళ్ళాం సొగసు వల్లిస్తున్నాడనుకునేవ్. నా మాటల్లో అసలు ఉత్ప్రేక్షలు ఉండవు. ఉన్నదున్నట్టే, నే బొమ్మ చెక్కినా అంతే. అయిందా అప్పుడేం చేశాను?’’ అంటూ పక్కకి వొత్తిగిల్లారాయన.
‘ఏం చేశారు?’
‘శిల్పం చేశాను. అమరశిల్పం. మా ఆవిడ శిల్పం. అచ్చం అప్సరసని అప్సరసలా చెక్కేశాననుకో. పోలికలన్నీ పోతపోసినట్టు తీసుకొచ్చాను. కానీ, కానీ యిప్పుడది లేదు. చచ్చిపోయింది. ఉంటే చూసుకుని ఎంత మురిసిపోయేదో! నన్నెంత మెచ్చుకునేదో-’ నరసింహాచార్యులు గారి కంఠం బొంగురుపోయింది. ముందు చెప్పినట్లుగా ఆయన చూడలేని కళ్ళు చెమర్చాయి. ఆయనలో బాధ చూశాను. నరాలు గిజగిజ లాడేయి.
అంతలోనే ఆయన అనుభూతిని మార్చుకున్నాడు. మామూలు ధోరణి తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించి, గొంతు సర్దుకుంటూ అన్నాడు.
‘చూడబ్బాయ్! షాజహాను పెళ్ళాన్ని ప్రేమించేకదూ తాజమహలు కట్టించేడు? కాని, నన్ను చూడు – నేనూ ప్రేమించాను నా భార్యని. షాజహాను కంటే అమితంగా ప్రేమించానేమో కూడా. ప్రేమించడమే కాదు – ప్రపంచంలో అందాన్నంతా ధిక్కరించేలా ఉన్న ‘ఆమె’ రూపాన్ని అపురూపంగా మలిచాను. పెళ్ళాన్నంత ప్రేమించీ షాజహాను తాజమహలు తనుగా తను కట్టలేకపోయాడు. ఎవరిచేత్తో కట్టించాడు. కాని నేను, నా చేతుల్తో నేను మలిచాను. దాన్ని ఇప్పుడు చూడు! పెద్ద కొండరాయి వుండేదక్కడ. దొలిచి ప్రాణాలు పోశాను. అదే నా కళాఖండం!’ గర్వంగా కిటికీ వేపు చాచిన చేత్తో సూచిస్తూ చూపించాడు. తటాలున నేను ఆత్రంగా వంగి చూశాను. బాగా చూశాను. నాకేమీ కనిపించలేదు. ఇందాక నే నిలబడ్డ పచ్చగడ్డి స్థలం. దాని వెనక పొలాలూ, దూరాన కొండ అంచులూ తప్ప మరేమీ కనిపించలేదు.
నరసింహాచార్యులు గారింకా మాట్లాడుతున్నారు – ‘నేను గొప్పవాణ్ణి కాదా? షాజహాను కంటే గొప్ప చరిత్ర పురుషుణ్ణి కాదూ? చెప్పబ్బాయ్?’
నాకేం మాట్లాడాలో తెలియలేదు. నరసింహాచార్యులుగారు ఏదో గొప్ప కళాఖండాన్ని చూపిస్తాడనుకున్నాను. చూస్తాననుకున్నాను. ఫలితంగా నాలో గొప్ప నిరుత్సాహం కదిలింది. నరసింహాచార్యులు గారికి పిచ్చేమోనన్న అనుమానం కూడా కలిగింది. నాకేమీ కనిపించడం లేదని చెబుదామనిపించింది. నా కళ్ళు ఆయనవి. ఆయన కళ్ళు నావి అయినట్టుగా ఉంది. నెమ్మదిగా కూర్చున్నవాణ్ణి లేచాను. పెదవి కదిలేంతలో పెద్ద శబ్ధం వినబడింది. వెనక్కి తిరిగి చూశాను. నేల విడిచిన నీటిగిన్నెను పైకెత్తుకుంటూ, జారవిడిచిన పైటను మెడచుట్టూ తిప్పుకొంటోంది – ‘మహాశిల్పి’ కూతురు.
ఆయన పిలిచాడు – ‘అమ్మాయ్ నువ్వేనా? ఒక్కసారి యిలా రామ్మా!’
ఆమె గిన్నె క్రిందబెట్టి గబగబా వచ్చింది. ఎందుకో కంగారుపడుతోంది. నిటారుగా నిలబడింది. ఆమె నడిచి వచ్చిన సవ్వడి విన్నాక ఆయన – చూడమ్మా! ఇతన్ని అలా తీసుకువెళ్ళి మీ అమ్మ బొమ్మని చూపిస్తావూ!’ అన్నాడు.
‘రండి’ అంటూ కదిలింది. ఆమె మాట్లాడడం మొదటిసారిగా విన్నాను. ఆమెను అనుసరించేను. ఇద్దరం గుమ్మం దాటి మెట్లు దిగాం. నాపరాళ్ళ మీదుగా నడిచాం. మరోక్షణానికల్లా – చాలా సేపటి క్రితమే నేను తాకి చూసిన, రాతి పాదాల దగ్గరికి నడిచి ఆమె ఆగిపోయింది. నేనూ ఆగాను.
‘చూడండి!’ ఆమె రెండవసారి మాట్లాడింది.
నేను చూశాను. ఇప్పటికిగాని నా మెదడు పనిచెయ్యలేదు. కళాఖండం వూహలోపడి శిధిలాన్ని విస్మరించేనని మెలకువ కలిగింది. నివ్వెరపోయాను. ఇదా నా ‘మహాశిల్పి’ కళాఖండం! ఇదా నరసింహాచార్యులు గారి చరిత్ర చాలే కళాఖండం! దీనికోసమేనా కనబడలేదని నిరుత్సాహపడ్డాను! దీనికోసమేనా నరసింహాచార్యులు గారికి పిచ్చివుందని అనుమానించాను! – అనిపించింది. గుండె బరువెక్కినట్టయింది. మనస్సు మరోసారి రెపరెపలాడింది. కళాఖండపు ఖండాన్ని మరోసారి చూశాను. విరిగిన పాదాలు – మెత్తగా, సుకుమారంగా అనిపిస్తున్నాయి. పాదాల దిగువకి జారిన పలుచని వస్త్రభాగం చిరిగిన కలువరేకులా వుంది. ఏవేవో ఆభరణాలు, నగిషీలు – పనితనమంతా పాదాల్లోనే వుపయోగించేసినట్టుంది. మిగిలిన శిల్పమంతా చూడగలిగితే ఎంత బాగుణ్ణు! – యింత క్రితం చూసినప్పటిలాగే అనుకుంటున్నాను. మరోలా అనుకోడం తెలియడం లేదు.
ఆమె అడిగింది ‘చూశారా?’
‘వచ్చే ముందే చూశాను. యిది రెండవసారి’ క్షణం ఆగాను. ‘మీ అమ్మగారి పాదాలు యిలాగే వుండేవనుకుంటాను’
‘అవును’
‘ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది?’
‘పదేళ్ళు షుమారు.’
‘ఎలా పోయారు పాపం.’
‘నాన్న చంపేశాడు.’
హఠాత్తుగా అదిరిపడ్డాను. వణికాను. ‘ఎందుకు?’ అని మాత్రం అనగలిగేను.
‘అమ్మలాంటి బొమ్మని చెయ్యాలని నాన్నెంతో కష్టపడ్డాడు. అమ్మని ఎదురుగా కూర్చోబెట్టి, రోజుల తరబడి ఎన్నో బొమ్మలు చెక్కాడు. ఏవీ అమ్మకి నచ్చలేదు. ప్రతి శిల్పం లోను ఏదో ఒక వంక చూపించేది. నాన్నికి పట్టుదల హెచ్చు. మానలేదు. ఇంకా ఎన్నెన్నో చెక్కాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. చివరికి అమ్మ విసుగెత్తిపోయింది. తన కోసం దరిద్రాన్ని కొని తెస్తున్నారంది. తనలాంటి శిల్పం తయారుచెయ్యడానికి అన్నాళ్ళూ అన్ని రాళ్లూ పాడుచెయ్యాలా అనడిగింది. ఆఖరికి నాన్నకి శిల్పాలు చెక్కడమే చేతకాదంది. పైగా పాడుబొమ్మలు చెక్కి పచ్చటి బ్రతుకంతా పాడుచేస్తున్నారని ఆ బొమ్మలన్నీ పగలకొట్టింది. నాన్నకప్పుడు విపరీతంగా కోపం వచ్చింది. ఆయనకెప్పుడూ కోపం రాలేదు. అదే మొదటిసారి. నాన్నకి తన చేతిమీద నమ్మకం ఎక్కువ. తన శిల్పాలే ఆయన ప్రాణాలు. తన నేర్పునీ, తన శిల్పాన్నీ కించపరచడం నాన్న సహించలేకపోయాడు. అమ్మతో ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణలో చేతనున్న ఉలిని అమ్మ మీదికి కోపంగా విసిరాడు. కణతకి తగిలింది. రక్తం కారింది. అంతే అమ్మ చచ్చిపోయింది.’ ఇలా చెప్పినంతసేపూ ఆమెలో నిర్లిప్తత తప్ప మరే భావం లేదు. బహుశా పాత భావాలన్నీ ఘనీభవించి గుండెని రాయిచేసి వుంటాయి. కళ్ళునప్పుడు నరసింహాచార్యులు గారికి తెలిస్తే కూతురి గుండెని కూడా శిల్పంగా చెక్కేవాడేమో!’
ఆమె చెప్పడం అయిపోలేదు. ‘అమ్మ పోయాక నాన్న కోపమూ పోయింది. ప్రాణం లేని రాళ్లకి ప్రాణం పోసిన ఉలితో, ప్రాణం ఉన్న అమ్మ ప్రాణం కాస్తా బలి తీసుకున్నానని కుమిలిపోయాడు. చాలా రోజులు విచారంతోనూ, పశ్చాత్తాపంతోనూ గడిపాడు. చివరికి అమ్మ జ్ఞాపకార్ధం అయిదేళ్లు రాత్రీ పగలూ కష్టపడి యీ శిల్పం చెక్కాడు. అమ్మ బ్రతికి ఉంటే దీనికి వంక పెట్టేది కాదు. అంత బాగా చెక్కాడు. నిజం చెప్పాలంటే అమ్మలాంటి బొమ్మని అమ్మపోయాకే తయారు చెయ్యగలిగాడు నాన్న’ ఆమె ఆగింది. పరాయి వ్యక్తితో ఆమె యింత సేపు నిర్భయంగా, ధారాళంగా మాట్లాడగలిగిన మనిషి అని నేను మాత్రం వూహించలేదు. చీరకొంగుతో చెంపల్ని తుడుచుకొని అంది – ‘కాని శిల్పమంతా పూర్తయ్యాక, అమ్మ భుజాల మీద నిలబడి – తలపాపిట సవరిస్తూ చివరి మెరుగులు చెక్కుతూంటే కాలుజారి నాన్న క్రిందపడిపోయాడు. తలకి పెద్దగాయం తగిలింది. మెదడు దెబ్బతిందట. అప్పట్నించి నాన్న చూడలేడు. నడవలేడు. అమ్మని చంపినందుకు శిక్షనుకుని అస్తమానం కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
మగాడిలా మాట్లాడే స్త్రీ ఎప్పుడూ తెలియదు నాకు. ఆమె మాటలు వింటోంటే ‘మహాశిల్పి’ కూతురు కాక, కొడుకు మాట్లాడుతున్నాడనిపించింది నాకు. నేనడిగాను. ‘మీరు మగాడిలా ఎందుకు మాట్లాడుతున్నా’రని కాదు.
‘మరయితే ఎందుకిదిలా శిధిలమైపోయింది?’
‘ఎవరో గొప్ప వ్యక్తిట. ఆ మధ్య యీ ఊరొచ్చాడు. స్వాములవారో, సన్యాసో – తెలీదు నాకు, దేశమంతా కాలినడకనే నడుస్తాట్ట. ఏదో వుపన్యాసాలిచ్చాడు. మునసబుగారు ఈ ప్రదేశాన్ని ఆయనకు భూదానం చేశాడు. అప్పుడాయన యీ విగ్రహాన్ని చూశాడు. అసహ్యించుకున్నాడు. అమాయకులైన ప్రజల్లో యిలాంటి శిల్పాలు చెడ్డ ఆలోచనల్ని ప్రేరేపిస్తాయట. శృంగార వాంఛల్ని రేకెత్తిస్తాయట.’ ‘బహుశా అప్పుడు ఆయనలో అలా రేకెత్తి ఉండవచ్చు. ఏమో! శిష్యులతో కలిసి విగ్రహాన్నంతా ఛిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయాడు. కోపంలో అమ్మని చంపేసినా – యీ బొమ్మ చెక్కి నాన్న మళ్ళీ అమ్మకి ప్రాణం పోశాడు. కానీ రెండవసారి కూడా అమ్మ చంపబడింది. నేనడ్డుపడ్డాను. ఏడిచాను. తల బాదుకున్నాను. లాభం లేకపోయింది. పైగా – మా అమ్మని చంపకండి – అని ఏడిస్తే అందరూ నన్ను అపహాస్యం చేశారు. సిగ్గు భరించలేక నేను కూడా చచ్చిపోయాననుకున్నాను. ఇక నేను చేయగలిగిందల్ ఆ క్షణంలో ఒక్కటే మిగిలింది. ఈ అమానుష విషయం నాన్నకు తెలియకుండా జాగ్రర్తపడ్డాను. తెలిస్తే నాన్న గుండె పగిలేది. పాపం – యింకా యిక్కడ అమ్మ శిల్పం వుందనుకుంటున్నాడు. ఆ ఆసరాతోనే నాన్న బ్రతికున్నాడు.’ రెండు సెకన్లు ఆగింది. ‘ చూడండి, లోపలికి వెళ్ళాక నాన్న మిమ్మల్ని అడుగుతాడు, అమ్మ శిల్పం ఎలా ఉందని? – దయచేసి బాగుందని చెప్పండి! – నాన్న కోసం. నాకీ ప్రపంచంలో నాన్న తప్ప ఎవరూ లేరు. నాన్న పరపతి తప్ప మాకు మరో బ్రతుకు తెరువు లేదు. నాన్నని నేను కాపాడుకోవాలి. కాదు మీరే కాపాడాలి, ఇంతకంటే నాకు మరో మార్గం లేదు. నాన్నని కాపాడిపెట్టండి. నాన్నని కాపాడి పెట్టండి! మా బ్రతుకు నిలబెట్టండి! అమ్మ బొమ్మ బాగుందని చెప్పండి. చిన్న అబద్ధం – చెబుతారు కదూ?’ ఆమె గొంతులో దైన్యం, వేడికోలు నా మనస్సుని కదిపేయి. నేను చాలా చాలా చలించేను. అంతా నాకో చిత్రమైన అనుభూతిలా వుంది. ‘అలాగే’ అన్నాను. ఆమె చేతులు కలిపి నమస్కారం చేసింది. కృతజ్ఞత అనుకుంటా.
‘పదండి వెళ్దాం’ అంది.
ఆమె వ్యక్తిత్వంలో తెలియని వైరుధ్యమేదో వుంది. నాకర్థం కాలేదు. ఇద్దరం వెనక్కి తిరిగి నడిచేం. సాయంత్రం పలుచని చీకటిరాకని చూచాయగా సూచిస్తోంది. నాకు ప్రయాణం గుర్తొచ్చింది. త్వరపడాలనిపించింది.
ఆమెతో ఇంట్లోకి ప్రవేశించాను. లోపల బాగా వెలుగు తగ్గింది. నరసింహాచార్యులు గారి మంచం కేసి నేను వడివడిగా నడిచేను. ఆయన రెండు చేతులూ కలిపిపట్టుకున్నాడు. లేని వుత్సాహోద్రేకాలని సృష్టించుకున్నాను. అన్నాను –
‘ఆచార్యులు గారూ! నిజంగా యీ రోజు నా జన్మ తరించింది. అసమానమైన శిల్పకళ దర్శించే భాగ్యం నాకు కలిగించేరు. మీలాంటి మహాశిల్పులు నూటికీ కోటికీ ఎక్కడో ఏ వొక్కరే వుంటారు. పొగడ్త అనుకోకండి. నాకు పొగడ్డం చేతకాదు. అసలు నా అనుమానం మీరేదో దైవాంశతో పుట్టి వుండాలని, ఇంత అద్భుతమైన కళాఖండం ఎప్పుడూ, ఎక్కడా, చివరికి కలలో కూడా నేను చూడలేదు.’
నేను అప్పుడప్పుడు శ్రవ్య నాటికల్లో పాల్గొన్నాను. బాగానే అనగలిగేను. ఎంచేతనంటే నా మాటలకి నరసింహాచార్యులుగారిలో ఎదురుచూసిన ప్రతి భావాలన్నీ ఎంతో బాగా కనిపించేయి. తెగని సంతోషం, తృప్తీ నరసింహాచార్యులుగారి గ్రుడ్డి కళ్ళల్లో నీటిని తిప్పేయి. గిల్టీగా ఫీలయ్యేను.
నరసింహాచార్యులు గారు పొంగిపోయేరు. మంచి వుత్సాహాన్నీ, మంచి కృతజ్ఞతనీ మాటల్లో చెప్పేరు – ‘చాలా సంతోషమబ్బాయ్! చాలా సంతోషం! నాకీ రోజు నా చిన్నప్పటి దీపావళి పండుగంత హాయిగా వుంది. నా కళాఖండాన్ని బాగా చూశావు కదబ్బాయ్! ఆ కళ్ళూ, ముక్కూ, శంఖంలాంటి మెడా, గుండ్రంగా జారిన భుజాలూ, వాటి మీంచి జారిపడి కళ్ళూ, కాళ్ళూ పోగొట్టుకున్నాను – అంత నునుపుగా చెక్కేను దాన్ని – బాగా చూశావు కదూ! నే చెప్పిందంతా అక్షరాలా నిజమే కదూ…’
ఇంకా ఏదో అంటున్నాడు. నాకేమీ వినిపించడం లేదు. వినిపించినా అర్ధం కావడం లేదు. కాళ్ళ క్రింద పుట్టుకొచ్చిన పుణ్యభూమి తొలుచుకు పోతున్నట్టుగా ఉంది.
‘ఈ పాటికి బస్సు దాదాపు బాగయిపోయి ఉంటుంది. ఆలస్యమైతే అందుకోలేను. విశాఖపట్నం వెళ్ళాలి. ఇక సెలవు తీసుకుంటానండీ!’ అన్నాను.
‘మంచిదబ్బాయ్! క్షేమంగా వెళ్ళు! ఎప్పుడన్నా వీలుపడితే ఇటుకేసో చూపు చూడు.’
‘ఎంతమాట. వస్తానండీ!’ అని ఆయన చూడలేకపోయినా, నరసింహాచార్యులు గారికి నమస్కారం పెట్టి కదిలేను. ఆమె వీధి గుమ్మం దగ్గర నిలబడి కనబడింది. కృతజ్ఞతని చిరునవ్వుగా తయారు చేసి పెదాల మధ్య చూపించింది. ఇప్పటికి గాని నాకు ఆమె అందం కేసి మనసు పోలేదు. కాని టైము తక్కువగా వుండడం వల్ల ఒకే మాట ‘వస్తానండీ!’ అని చెప్పి మెట్లు దిగేను.
నాపరాతి ముక్కల మీద నడుస్తున్నాను.
పాపం! కండలు కరిగించుకుని కళాఖండం మలిచిన నరసింహాచార్యులు గారు తన ప్రేమకథకి చరిత్రలో షాజహాను కంటే వున్నతస్థానం వుంటుందనుకున్నాడు. కళ్ళు పోగొట్టుకొని పిచ్చిగా వూహించుకుంటున్నాడు. కాని ఆయనకి తెలియదు. ఊహల్ని కాదనే నిజం వుంది. కళాఖండమూ, ప్రేమా, చరిత్రా ఏవీ ఆయనకు దక్కలేదు. అవును. ఎలా దక్కుతాయి. నరసింహాచార్యులు లేనివాడు. అతి సామాన్యుడు. సామ్రాజ్యాధినేత కాడు. రాజకీయనాయకుడూ కాడు. కేవలం ఒక పేదశిల్పి. పేదవాళ్ళ ప్రేమలో ఎంత బలం వున్నా ప్రయోజనం లేదు. మహాధనవంతుడైన షాజహాను చక్రవర్తి అపూర్వమూ, అద్భుతమూ అయిన తాజ్ మహల్ కట్టించి నరసింహాచార్యులు గారి లాంటి పేదవాళ్ళ ప్రేమకి విలువ లేకుండా చేశాడు. ఎవడో రాజకీయ సన్యాసి మహాశిల్పాన్ని నాశనం చేసి ఆయన చరిత్ర నిలువకుండా నిర్జింపచేసేడు. ఛీ ఛీ! – వీళ్ళా భారతదేశం మనుషులు! గురజాడ కవి దేశమంటే మట్టి కాదు, మనుష్యులే అని చెప్పేడు గానీ – నా కిప్పుడు యిలాంటి మనుషులు పుట్టే దేశాన్ని వొఠ్ఠి ‘మట్టే’ అనుకుంటేనే బాగుణ్ణనిపిస్తోంది. లేకపోతే కొన్నాళ్ళకి దేశం మీద ఏవగింపు కలిగి, నాలో వుందనుకునే కొద్దిపాటి దేశాభిమానం చచ్చిపోతుందేమోనని భయం కూడా వేస్తోంది.
అలా ఆలోచనలు పేర్చుకుంటూ కొంతదూరం నడిచేక, ఎందుకో వెనక్కి తిరిగి చూడాలనిపించింది. చూశాను! నరసింహాచార్యులుగారి పాత పెంకుటిల్లు చిన్న అట్ట సెట్టింగులూ కనబడింది. నాలో యిప్పుడు – ఒక గొప్ప కళాఖండాన్ని చూడలేకపోయాననే దిగులు తొలగిపోయి, నా ‘పేద మహాశిల్పి’ నరసింహాచార్యులు గారి ప్రేమనీ, తృప్తినీ, చరిత్ర స్థానాన్ని కాపాడగలిగానన్న సంతోషభావం కమ్మగా, తియ్యగా కలిగి పెరిగింది.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *