May 26, 2024

బ్రహ్మ జ్ఞాని జాబాలి మహర్షి

 

రచన: శ్యామసుందరరావు

 

జాబాలి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో కనుపించే ఒక పాత్ర.   త్రేతాయుగంలో జాబాలి లేదా జాబాలి ఋషి, అనే వ్యక్తి హిందూ మతములోని ఒక పుణ్యాత్ముడు.  జబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వర ప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి.  జాబాలికి యుక్త వయసు రాగానే ఇతనిని తల్లి హరిద్రుమతుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకునేందుకు అప్పగిస్తుంది.   కొంతకాలానికి గురువు జాబాలికి ఉపనయనము చేసే సంకల్పముతో అతని కుల గోత్రములు అడుగగా, అవి తనకు తెలియవనుట వలన, మీ తల్లిని అడిగి తెలుసుకుని రావలసినదని పంపుతాడు.   ఆ సందర్భములో ఇంటి దగ్గర తన తల్లిని అడుగగా, తనకు భర్త లేని విషయము తెలుపుతూ, మన గోత్రం ఏమిటో నాకు తెలియదు.   నా యౌవనంలో దాసిగా అనేక చోట్ల తిరిగి పనిచేసాను.   అనేక మందికి సేవలు చేసి, నిన్ను కన్నాను.   కానీ నీ తండ్రి ఎవరో నాకు తెలియదు.   ఒక్కటి మాత్రం సత్యం.   నా పేరు జాబాల.   ఇంక నుండి నీ పేరు సత్యకాముడు అను జాబాలి అని చెప్పమని కుమారునితో చెప్పి గురువు దగ్గరకు తిరిగి పంపుతుంది.   గురువు తన దివ్య దృష్టితో అతని జన్మకథను తెలుసుకొని గాయత్రీ మంత్ర ఉపదేశము చేస్తాడు.   తదుపరి కాలములో “సత్యకామ జాబాలి” అని కూడా ప్రసిద్ధి చెందుతాడు.

 

బ్రహ్మ విద్యను అభ్యసించు అర్హత సంపాదించే వరకు గురువు జాబాలిని తన గోవులను మేపుతూ ఉండమని ఆదేశిస్తాడు.   గురుభక్తితో సత్య సంధుడై జాబాలి గురుగోవులను తోలుకొని వనమునకు వెళ్ళేవాడు.   ఇతని గురుభక్తికి, గోపూజపరతకు దేవతలు మెచ్చుకొని ఉపకారము చేయాలని సంకల్పిస్తారు.   ఒకనాడు వాయుదేవుడు ఒక వృషభములోనికి ప్రవేశించి, “నీవు సత్యనిష్టతో మమ్ములందరిని కాపాడుట వలన వేల మందిమి అయితిమి.   గురుగృహమునకు మమ్మల్ని తోలుకొని వెళ్ళితే, మేము నీకు చేతనయినంతా సహాయము చేస్తాము” అని అనుట వలన జాబాలి గోవులతో గురుగృహమునకు బయలు దేరాడు.   మార్గమధ్య దారిలో వృషభరూపములో ఉన్న వాయుదేవుడు జాబాలికి బ్రహ్మ జ్ఞానమునకు సంబంధించిన ఒక దివ్యమైన మంత్రపాదము చెప్పగా, అదేవిధముగా ఇంకొక వృషభ రూపంలో ఉన్న అగ్నిదేవుడు నేర్పించగా, మరొక వృషభములోనికి ప్రవేశించి సూర్యదేవుడు, చివరగా ” మద్గియ ” అను పక్షి కూడా మంత్రపాదములు బోధించగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడయ్యాడు.

 

గురువైన హరిద్రుమతుడు దివ్య తేజస్సుతో బ్రహ్మజ్ఞానము పొందిన జాబాలిని చూసి, నీవు ఇంక ఒక స్వంత ఆశ్రమము నిర్మించుకొని దివ్య జీవితము గడుపు మనగా, జాబాలి నిరాకరిస్తాడు.   గురుముఖముగా బ్రహ్మజ్ఞానము పొందినదే శాశ్వతమని తలంచి, ఆ సంగతి గురువుకు తెలియజేయగా, గురుభక్తితో ఉన్న అతనికి బ్రహ్మజ్ఞానమును గురువు తన ఆశ్రమము నందే యుక్తవయసు కాలమునకు ఉపదేశించి పంపాడు.  ఇతను నది ఒడ్డున ధ్యానంతో అనేక సంవత్సరాలు గడిపాడు.   తను నివసించిన ప్రదేశానికి, తరువాత కాలంలో ప్రస్తుత జబల్పూర్ గా నామకరణం చేశారు.   జాబాలి జబల్పూర్లో పాలరాతి శిలలు గల గుహ వద్ద తన ఆశ్రయాలలో ఒకటిగా చేసుకున్నాడు

 

జాబాలి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలను తెలుసుకున్నాడు.   జాబాలి పిప్పలాదునికి బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తాడు ఈయన పిప్పలాదునికి వివరించిన బ్రహ్మజ్ఞానాన్ని జాబాల్యుపనిషత్తు అని అంటారు.  అదేవిధముగా, ఇతని సత్యకామ జాబాలి కథ సామవేదము – చాందోగ్య ఉపనిషత్తులో చిత్రీకరించబడింది.  జీవులకు పశువులకు అన్నింటికీ ఈడ్వరుడే పతి అని చెప్పగా పిప్పలాదుడు అది ఎట్లు అని ప్రశ్నిస్తాడు జాబాలి పశువులు గడ్డి తిని యజమాని చెప్పినట్లు చేస్తూ యజమానికి కట్టుబడి ఉంటాయి అలాగే జీవులు సర్వేశ్వరుడికి కట్టుబడి ఉంతాయి కాబట్టి పశుపతియే ఈశ్వరుడు అని జాబాలి పిప్పలాదునితో చెపుతాడు.   పిప్పలాదుడు జ్ఞానము ఎలావస్తుంది అని అడుగ గా విభూతి ధారణ వలన వస్తుంది అని చెపుతూ విభూతి ని ఎలా ధరించాలో విభూతి రేఖ్ల పరమార్ధాన్ని కూడా పిప్పలాదునికి వివరిస్తాడు.   పంచబ్రహ్మ సూత్రాలతో భస్మాన్ని తీసుకొని అగ్నిరితి భస్మ అనే మంత్రముతో అభిమంత్రించి మానస్తోకే తనయ అనే మంత్రముతో నీటిని కలిపి నుదిటి మీద, వక్షంపై, భుజాలపైధరించాలి ఈ విభూతిధారణలో ఉన్న మూడు రేఖల అర్ధాన్ని కూడా జాబాలి వివరిస్తాడు.  మొదటి రేఖ గార్ష పత్యాగ్ని, అధిదేవత బ్రహ్మ, రెండవరేఖ దక్షిణాగ్ని అధిదేవత విష్ణువు, మూడవ రేఖ ఆహవనీయాగ్ని, మహాదేవుడు అధిదేవుడు ఈ విధముగా త్రిపుండ్ర ధారణా చేసిన వారికి మరో జన్మ అంటూ ఉందని జాబాలి పిప్పలాదునికి వివరిస్తాడు.

 

అరణ్యవాసానికి వెళ్లిన సీతారామ లక్ష్మణులను చిత్రకూట పర్వతము పై ఉన్నప్పుడు భరతుడు శ్రీరాముని తిరిగి రాజ్యానికి వచ్చి పాలించమని ప్రాధేయ పడతాడు.   కానీ శ్రీ రాముడు,14 ఏళ్ళు అరణ్యవాసము తరువాత వచ్చిరాజ్యపాలన చేస్తానని చేపుతాడు ఆ సందర్భముగా అక్కడ ఉన్న జాబాలి,” రామ నీవు కూడా సాధారణ మానవుని వలె మాట్లాడుతున్నావను తల్లిదండ్రులు ఏమిటి?వారికి మాట ఇవ్వటము ఏమిటి?చక్కగా రాజ్య పాలన చేసి ప్రజలను సంరక్షించాలి కానీ ఇలా అడవులకు వెళ్ళటం సబబు కాదు నీ తండ్రికి నీకు జన్మఇచ్చేనంతవరకే సంబంధము అయన చనిపోయినాక ఆయనకు ఇచ్చిన మాట నీవు పాలించ నవసరము లేదు “అని శ్రీరామునితో అంటాడు అప్పుడు శ్రీరాముడు,”మహర్షి నేను అలాచేస్తే ఇతరులకు ధర్మాన్ని బోధించే హక్కును కోల్పోతాను ప్రజలు తథారాజా తదా ప్రజా అని వాళ్ళు కూడా నీతి మంతులు గా ఉండరు” అని వినయముగా జాబాలికి వివరిస్తాడు.  ఇది అంటా విన్న జాబాలి,”శ్రీరామా నేను నిన్ను పరీక్షించటానికి అలా అన్నాను, నీవు సుగుణ రాముడివి మానవాళికి ఆదర్శ ప్రాయుడివి” అని శ్రీరామునికి నమస్కరించి వెళ్లి పోతాడు చిత్రకూట పర్వత ప్రాంతమున జాబాలి ఒక ఆశ్రమము నిర్మించుకొని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి పరతత్వ రహస్యాలను ఎన్నింటినో గ్రహించాడు.   ఈ సంఘటన ఆధారముగా నార్ల వెంకటేశ్వర రావు జాబాలి అనే పేరుతొ ఒక నాటకం వ్రాశాడు.   వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో కనిపించే జాబాలిని ఒక నిరీశ్వరవాదిగా చిత్రించాడాయన.   జాబాలిది చాలా పిరికి పాత్ర. .   వశిష్టుణ్ణి ఎదిరించే ధైర్యం లేదతనికి.   రాముణ్ణి అడవికి వెళ్ళకుండా ఆపటానికి విఫల ప్రయత్నం చేస్తాడని ఈ నాటకములో చిత్రీకరిస్తారు.   అంతలో వశిష్ఠుడు అక్కడికి రావటం చూసి అదంతా తను రాముడి నిశ్చయాన్ని పరీక్షించటానికే చేస్తున్నానని చెప్పి అక్కణ్ణుంచి పారిపోతాడు.   రాముడితో అతని సంభాషణ ద్వారా రాజ సభలో ఋషుల కుట్రలు, మోసాలు, అసూయలు బయటకు తెచ్చే ప్రయత్నమూ చేస్తాడు ఇదంతా కల్పితము కాబట్టి దీనిని గురించి పట్టించుకోనవసరం లేదు

 

తేజః పురానికి చెందిన ఋతంభరుడు అనే రాజుకు భార్యలు ఎంతమంది ఉన్నా సంతానము లేదు తన రాజ్యానికి వచ్చిన జాబాలి మహర్షిని ప్రార్ధించి తనకు సంతాన ప్రాప్తి కలిగే ఉపాయము చెప్పమని ఆరాధిస్తాడు అప్పుడు జాబాలి,” రాజా గోపూజ చేస్తే నీకు సంతానప్రాప్తి కలుగుతుంది ఆవు శరీరములో సమస్త దేవతలు నివసిస్తారు అవును ఏ రకముగా హింసించినా వారు ఎవరైనా నరకాన్ని పోతారు”, అని చెప్పగా ఆ రాజు గోపూజ చేసి అవును తీసుకొని వస్తుండగా ఒక సింహము అవును చంపేస్తుంది తానూ ఏమి చేయాలని జాబాలి మహర్షిని ఆ రాజు అడుగుతాడు అప్పుడు జాబాలి ఋతుపర్ణుడిని అడగమని అయన దగ్గరకు పంపిస్తాడు ఋతుపర్ణుడు రాజుతో మరొక అవును తీసుకొని రామ నామముతో పూజించి ఆ అవును ఒక బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలసినదిగా చెపుతాడు ఆ ప్రకారము చేసిన రాజుకు ఒక కొడుకు పుడతాడు అతని పేరే సత్యవంతుడు అతను గొప్ప రామభక్తుడు కూడ    .

 

తిరుమల అనే పవిత్ర ప్రదేశంలో జాబాలి మహర్షి నివసించి, తపస్సు సాధన చేశాడు ఆ ప్రదేశాన్ని జాబాలి తీర్ధము అని పిలుస్తారు.   జాబాలి తీర్థము.   శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు, వాయవ్య భాగమున ఉంది.   అనేక మంది ప్రజలు, తమ తీవ్రమైన గ్రహా దోషాలను పరిష్కరించబడతాయని హనుమంతుడు, వినాయకుని విగ్రహాలను  మంతుడు కూడా పూజించడంతో పాటుగా ఈ జాబాలి తీర్థం సందర్శించుకుంటారు

 

 

1 thought on “బ్రహ్మ జ్ఞాని జాబాలి మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *