April 23, 2024

మోదుగ పూలు – 10

రచన: సంధ్య యెల్లాప్రగడ

సూర్యుడు పశ్చిమం వైపుకు సాగుతున్నాడు. అడవిలో కాలిబాట మీద జాగ్రత్తగా తోలుతూ రాము ఒక కూలిపోతున్న కోట దగ్గర ఆగాడు.
అప్పటికి వాళ్ళు ‘చెట్టు దేవర’ దగ్గర్నుంచి బయలుదేరి తూర్పు దిశకు వచ్చి దాదాపు నాలుగు గంటలయ్యింది.
ఒక చెట్టు క్రింద బండి ఆపి దిగారు మిత్రులిద్దరూ.
తమతో తెచ్చుకున్న బ్యాగు లోంచి చక్కినాలు తీసి తిన్నారు ఇద్దరూ. చెట్టు దగ్గర పట్టుకున్న నీరు త్రాగారు.
“ఇది దేవరకోట. ఇది దాటాక మనకు దగ్గరలో ఒక చిన్న తండా ఉంది.‌ దాని పేరు బొట్టెజాల. మనం ఈ రాత్రికి అక్కడ ఉందాం. రేపు నా రీసెర్చు మెటీరియల్‌ కలెక్టు చేసుకుంటా. ఆ బొట్టెజాల దాటాక లోయపాటర్‌గుట్ట వస్తుంది. మనం ఆ లోయలో ఉన్న జైతూర్‌పెన్ తాండకు ఒక రోజులో చేరగలం” అన్నాడు రాము.
“ఈ కోట ఎవరిదో? ఏ రాజులు ఏలారో ఇది. చాలా పాడుబడింది” అన్నాడు వివేక్‌ కూలిపోతున్న కోటను చూస్తూ.
“అవును. మనము ఇందులో తిరగొచ్చు. నేను ఇంతకు కూడా ముందు ఇటు వచ్చాను. ఇది గోండు రాజులది” అంటూ లోపలికి నడిచాడు రాము, అడ్డం వస్తున్న ముళ్ళచెట్లను చేతి లోని కర్రతో తీసివేస్తూ, చకచకా నడుస్తూ.
చెట్టు మీద పిట్టల కువకువలు, కోతుల కిచకిచలతో నిశబ్ధాన్ని నిలవనీయ్యటములేదు. ఇద్దరూ ఆ కోట ముందుకు చేరారు.
కోట పైభాగము లేదు. కాని కోట మాత్రం చుట్టూ గోడలతో విశాలమైనదని, పురాతనమైనదని చూడగానే తెలుస్తోంది. అది తన పూర్వపు వైభవాన్ని చాటే ప్రయత్నంలో విఫలమవుతూ కనపడుతున్నది.
“గోండులా?”
“అవును! మన గోండులు పూర్వం ఇదంతా పరిపాలించారు. ఐదు, పది కాదు కొన్ని వందల ఏళ్ళు…” అంటూ అటు ఇటూ చూస్తూ నడవసాగాడు రాము.
“ఆహా! రాజ్యం అంటే అడవి రాజ్యం కాదని ఈ కోటను చూస్తే తెలుస్తోంది కదా” ఆశ్చర్యంతో వివేక్‌.
“అవును. గోండులు విస్తరించిన భూమిని గోండ్వానా అంటారు. ఇది కూడా మాండ్లా, నార్తు గోండ్వానా, మధ్య గోండ్వానా, సౌత్తు గోండ్వానా అని విభజించారు. వాళ్ళు 1240- 1750 వరకూ అంటే దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. మధ్య భారతమంతా వాళ్ళ ఏలుబడే. మన ఆదిలాబాదు, కొమరంభీం జిల్లాకూడా వ్యాపించే ఉన్నారు. అందుకే చూడు మనకు గోండ్లు ఎక్కువ.”
“అవునవును” అన్నాడు వివేక్‌ స్కూల్లో గోండ్లు పిల్లలను గుర్తు చేసుకుంటూ.
“వీళ్ళ రాజ్యం ఎలా పోయిందో కదా?” అంటూ ఆలోచనగా ఆ రాళ్ళని తడుతూ నడుస్తున్నాడు వివేక్. నిజానికి ఆ కోట పైన కప్పులేదనే కాని, పెద్ద పెద్ద బండరాళ్ళుతో గట్టిగానే నిలబడి ఉంది. ప్రతి గదికి గదికీమధ్య వెళ్ళటానికి ఆర్చులు ద్వారాలు, విశాలమైన హాల్ వంటివి చూస్తూ లోపలికి నడిచారు. అదంతా తిరిగి బయటకు రావటానికి దాదాపు గంట పట్టింది.
“ఈ వైభవం గురించి మన చరిత్ర ఎందుకు కప్పిపుచ్చిందో కదా?” అన్నాడు కోటంతా తిరిగాక వివేక్‌
నెమ్మదిగా బండి వైపు నడుస్తూ …
“హా! మనకు అసలు చరిత్ర దాచి పాఠాలు చెప్పారు తెల్లవాళ్ళు. స్వత్రంతమొచ్చినా మార్చలేదు. మనం మిడీవల్ హిస్టరీయే కదా చదివేది. ఈ గోండ్లలో వెరైటీలు ఉన్నారు. నాలుగు తెగలు. నా రీసెర్చుకు పనికిరాదు కానీ నీవు వీళ్ళ భాష ద్రావిడ భాషా లేక ఆర్య భాషా అని రీసెర్చు చెయి. కొందరు ద్రావిడ అంటారు. కొందరు ఇండో ఆర్యన్ అంటారు” అని సలహా ఇచ్చాడు రాము.
“నాకు వాళ్ళ గురించి తెలిసినది శూన్యము. నేను చేసేదేముంది? ముందు నేను గోండు భాష నేర్చుకుంటాను. నెలలో నీతో మాట్లాడుతాను చూడు” అన్నాడు వివేక్ వాళ్ళ వివరాలేమిటో, ఆ ఆదివాస గోండుల రాజ్యమెలా ఉండేదో ఆలోచిస్తూ…
“చెప్పాగా. వీళ్ళు నాలుగు ఉపతెగలు. కానీ ఇది చాలా పెద్ద గ్రూపు తెలుసా. మనకు గోండులు భారతదేశములో చాలా చోట్ల వ్యాపించి ఉన్నారు. రాజ్‌గోండు, మురియాగోండ్‌, మరియాగోండ్‌, దుర్వేగోండ్‌లు. వీళ్ళకే seven brothers, six brothers, five brothers, four brothers phratry అంటారు. Phratry అంటే గోత్రం. వీళ్ళు అడవులలోంచి వచ్చి గ్రామాలలో నివసించటం మొదలెట్టారు కూడా. బహుశా నీవు గోండువే అయ్యింటావు” అన్నాడు నవ్వుతూ రాము.
“నేనెమిటో తెలిస్తే నీకు కావలసినదిస్తాను. సరియా” అన్నాడు వినోదంగా వివేక్‌.
వాళ్ళు చతురలు మాట్లాడుకుంటూ బయలుదేరారు.
***

చెట్ల మీది పిట్టల రొద పెరిగింది. సాయంత్రమైనదన్న గుర్తుగా, అవి వాటి గూళ్ళు చేరి రోజు ముగుస్తోందని చెబుతున్నాయి. అది మట్టి రోడ్డే కానీ దాని మీద అసలు ట్రాఫిక్ లేదు. రాము బండి ఆ రోడు మీద నెమ్మదిగా నడుపుతున్నాడు. సమీపంలో చిన్న గ్రామం చూసి బండిని స్పీడు తగ్గించాడు.
“వచ్చాం బొట్టెజాల. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉందాం!” అన్నాడు వివేక్‌ వినేలా.
“ఆ ఊరిలో ఎవరన్నా తెలుసా? ఎక్కడ ఉందాం?” అన్నాడు వివేక్
“చెబుతా…” అంటూ స్లో అయ్యాడు.
నెమ్మదిగా ఆ గ్రామంలోకి ప్రవేశించారు. ఆ గ్రామంలో వంద ఇళ్ళు ఉన్నాయేమో. చాలా మటుకు ఇళ్ళు తడికలతో ఉన్నవే. కొన్ని మాత్రం గుడిసెలు. గుడిసెలు ఎర్రని రంగులతో, వాటిపై తెల్లని ఇడ్‌సింగులతో ఆ గ్రామము ఆదివాసి తండా అని తెలుపుతున్నాయి. అన్నింట్లో కొద్దిగ్గా పెద్దదైన ఇంటి ముందు బండి ఆపాడు రాము.
అప్పటికే చాలా మంది బయటకొచ్చి చూస్తున్నారు. ఆ ఇంటి ముందు మంచం మీద కూర్చున్న ఒక పెద్దాయన లేచి వచ్చాడు. ఆయన చిన్న పంచె గోచీకట్టులా కట్టుకున్నాడు. తలపై తలపాగా.భుజంపై టవలు ఉంది. ముఖాన నుదిటిన గీతల పచ్చ. ముక్కుకు మూడు రింగులు. మెడలో ఒక గొలుసు.
చేతులకు దండి కడియాలు, వెండివి కాబోలు ఉన్నాయి.
రాము ముందుకు నడిచి కొలామిలో “రాం రాం. సోయ్‌ అన్సతివా? అన్నెత్‌ ఆత్రం.అన్నెత్ మామిడిపల్లి. అన్నెత్ రామసామి.” (నమస్కారం. బావున్నారా? నేను ఆత్రం కుటుంబానికి చెందిన వాడిని. మామిడిపల్లి గ్రామము నాది. పేరు రామసామి) అంటూ తన గురించి వివరించి, ఆ రాత్రికి ఉండటానికి అనుమతి అడిగాడు. పెద్దాయన తల ఊపాడు.
సాదరంగా వారిని తీసుకొచ్చి మంచం మీదను కూర్చోపెడ్డాడు. వాళ్ళకి నీరు ఇచ్చి త్రాగమన్నారు.
చుట్టు చేరిన వారు పురుషులు దాదాపు అలాంటి వేషధారణే కలిగి ఉన్నారు.
వారు వివిధప్రశ్నలు సంధించారు. స్త్రీలు కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళు మూడు రంగుల చీరలో , చీర భుజం మీద ముడి వేసి కట్టారు. జాకెట్టు లేదు. వంటి మీద పచ్చబొట్లు, మెడలో దండలు, చేతికి గాజులు, దండి కడియాలు. దాదాపు వారి డస్సు అందరికీ అలాగే ఉంది.
ఎక్కడ్నుంచి వచ్చారు, ఏమి పని? వంటివి. అన్నింటికీ సమాధానమిచ్చాడు రాము. వివేక్ కు ఆ భాష అర్థమవుతుంది. కానీ మాట్లాడలేడు కాబట్టి మాట్లాడలేదు. వాళ్ళిద్దరికీ తినటానికి రొట్టె పెట్టారు. వాళ్ళు తిని అక్కడే మంచం మీద పడుకున్నారు.
ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ వివేక్‌ తండ్రి ఫోటో కూడా చూపారు కానీ, ఆ ఊరి పెద్ద పెదవి విరిచాడు.
రాత్రి ఏడు దాటాక సద్దిమణిగింది.
“వీళ్ళు ఆతిథ్యమిస్తారని ఎలా ఊహించావు?” అడిగాడు వివేక్
“ఇది మనలో ఉన్న సాంప్రదాయం. వచ్చిన వాడు ఎవరైనా బస అడిగితే కాదనరు. కాని ఆ అడగవలసినది ఊరి పెద్దను.” అన్నాడు.
“ఈయన ఊరి పెద్ద అని నీకెలా తెలుసు?”
“ఇల్లు బట్టి, ఇంటి మీద ఉన్న ఇడ్‌సింగులు బట్టి. మిగిలిన వారి ఇంటి మీద ఉట్టి ముగ్గులు, జంతువులు. వీళ్ళ ఇంటి మీద బాణం వెయ్యటము, ఊరి పెద్ద సమావేశం చూసావా” అన్నాడు.
“అవునా!” అంటూ తల ఊపాడు వివేక్.
“మనం లోయపాటర్‌గుట్టకా రేపు వెళ్ళేది?” తిరిగి ప్రశ్నించాడు.
“రేపు ఈ పెద్దోళ్ళని కొన్ని ఇంటర్యూలు చేసి బయలుదేరుదాం. ఇప్పటికి పడుకుందాం” అంటూ నిద్రకుపక్రమించాడు రాము.

***

ఉదయమే ఊరిలోని పెద్దోళ్ళందరినీ పిలిచాడు ఊరిపెద్ద. అందరూ వచ్చి ఊరు మధ్యన ఉన్న చెట్టు క్రింద కూర్చున్నారు.
రాము తన రికార్డుర్‌ ఆన్ చేసి వాళ్ళను ఇంటర్యూ చెయ్యటము మొదలెట్టాడు.
వివేక్‌ ఆ ఊరు చుట్టూ తిరిగిరావటానికి వెళ్ళాడు.
బొట్టేజాల అడవి మధ్యలో ఉంది దాదాపుగా.
ఆ ఊరి స్త్రీలు పురుషులు ఉదయమే అడవిలోని పొలం కెళ్ళిపోతున్నారు. వాళ్ళను ఆపి, పిల్లల చదువుల గురించి అడిగాడు వివేక్. వాళ్ళు ఊరిబయట పడిపోయిన గదిని చూపారు. అది ప్రభుత్వ పాఠశాల. అడవులలో ప్రభుత్వము నామ మాత్రము బడిని పెడుతుంది. దాని పేరు మీద ఫండును తీసుకునేవారు వేరే ఉంటారు. ఆ బడిలో మధ్యహ్నం భోజనం కూడా నడుస్తూ ఉంటుంది రికార్డులలో. కాని నిజానికి ఆ గది కూలిపోయి, పిల్లలు వీధులలో ఆడుతూ కనపడుతారు.
అక్కడికి వారానికి ఒకరోజు టీచరు వస్తాడని చెప్పారు.
వివేక్ వాళ్ళను మామిడిపల్లి గురుకుల పాఠశాలలో వారి పిల్లలను చేర్చమని చెప్పాడు.
రాము ఇంటర్యూలు అయ్యాక, ఊరి వాళ్ళు వాళ్ళకిద్దరికీ జొన్నరొట్టెలిచ్చారు. పండు మిరపకాయ పచ్చడితో ఆ రొట్టెలు వివేక్‌కు చాలా రుచిగా అనిపించాయి. తిన్న తరువాత మిత్రబృందం లోయపాటర్‌గుట్ట కేసి సాగారు.
అడవి చిక్కబడుతోంది. రాత్రి బాగా వాన కురిసిందిలా ఉంది ఆ లోయలో. అది బాగా వెదురునిచ్చే లోయ. ఆదివాసులు వెదురును నరికి సంతకు తెచ్చి అమ్ముకుంటారు. అక్కడా దళారిల గోల తప్పదు వాళ్ళకి. ఆ విషయము చెబుతూ “ఎన్ని పోరాటాలు జరిగినా, నేటికీ గిరిజనులకు అందవలసిన ఫలమందదు” అన్నాడు రాము దిగులుగా.
“ఎన్ని పోరాటాలు జరిగాయి?” అడిగాడు వివేక్.
“చాలా జరిగాయి. మన కొమరం భీం మొదలుగా ఇలాంటి పోరాటాలు చాలానే. అసలు భీంకు మంత్రాలు అవీ కూడా వచ్చుట. మన పెద్దోళ్ళు చెబుతారు” అన్నాడు రహస్యం చెబుతున్నట్లుగా.
“అవునా…బహుశా అది మధ్యలో పుట్టిందేమో. నాకు తెలిసిన గిరిజన వీరుడు అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు. అతనికీ మంత్రాలు అవీ వచ్చని పోలీసులు భయపడిపోయేవారట. అతను వస్తున్నాడంటే తుపాకులు వదిలేసి పారిపోయేవారట” అన్నాడు వివేక్.
“అయ్యిండొచ్చు. వీళ్ళంతా జరిపిన పోరాటము మన అడవితల్లిని మన నుంచి దూరం చెయ్యనీయ్యవద్దని…”
ఇలా మాట్లాడుతూ గుట్ట ఎక్కిస్తున్నాడు బండిని రాము.
ముందు రాత్రి వాన బాగానే కురిసినట్లుగా ఉంది. అస్సలు ఎండ కూడా లేదు. పూర్తిగా తడిగా ఉన్న మట్టిరోడ్డు మీద బండి సాగటంలేదు. చాలా బురదగాకూడా ఉంది. కాబట్టి బండి కూరుకుపోతోంది. డ్రైవింగు కష్టమవుతోంది. బలంగా యక్సిలరేటర్‌ తొక్కాడు రాము. ఆ బలానికి బురుదనుంచి బయటపడుతుందని…
బండి మరింతగా బురదలో కూరుకుపోయింది.
గట్టిగా తొక్కాడు యాక్సిలరేటర్‌ని. పెద్ద కుదుపుతో బండి ముందుకు సడన్‌గా తోసుకుపోయి ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దేసింది.
వెనక ఉన్న వివేక్ ఎగిరిపడ్డాడు రోడ్డు ప్రక్కకు. పడటంలో తనను తాను కాపాడుకోవటానికి ఎడమ చేయిని నేలకాన్చాడు. ఆ ఆన్చటంలో శరీరం బరువంతా మణికట్టుపై పడింది. పట్‌ మన్న శబ్ధం వచ్చి చేయి విరిగింది.
రాము ముందుకు ఎగిరి వెళ్ళి చెట్టుకు కొట్టుకున్నాడు. అతని తలకు బలమైన గాయమైయింది. రక్తం కారటం మొదలెట్టింది.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *