April 16, 2024

వెంటాడే కథలు – 8

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!

ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

-చంద్రప్రతాప్ కంతేటి

విపుల / చతుర పూర్వసంపాదకులు

******************************************************************************

*అబీనా

దక్షిణాఫ్రికాలోని ఓ చిన్నపట్టణం!
సమయం సాయంత్రం 6:00 గంటలు దాటుతోంది.
లోకం మీదికి మెల్లగా చీకటి తెరలు దిగుతున్న వేళ..
జోలాకి మాత్రం సమయం చాలా చిన్నగా గడుస్తోంది.
ఆమె ఆ గదిలో అరగంట నుంచి గోడకానుకుని అలాగే బొమ్మలా కూర్చుని ఉంది.
పూర్తిగా ఆలోచనల్లో మునిగి తేలుతోంది. ఆలోచనల నిండా ఆమె కన్నబిడ్డ అబినానే!
చిట్టితల్లికి ఎలా ఉందో ఏమిటో?
ముందు గదిలో ఆడవాళ్ళ నవ్వులు జోలా కర్ణపుటాలకు సోకుతూనే ఉన్నాయి.
విసుగు కలిగిస్తున్నాయి. చీదర పుట్టిస్తున్నాయి. అయినా తనేం చేయగలదు..?
తాను కూర్చున్న అదే గదిలో యజమానురాలి గారాల పట్టి ఆరేళ్ల క్యాథెరిన్ బొమ్మలకు రంగులు వేస్తూ ఆనందంగా కూని రాగాలు తీస్తోంది..
జోలా ఆఫ్రికన్ మహిళ. ఆ ఇంట మాత్రం పనిమనిషి. ఇంటి పని, వంట పని, చిన్నారి క్యాథెరిన్ పని అన్నీ ఆమె చేయాలి. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఆమె పని చేయాలి.
క్షణం తీరుబడి లేని పని.
అంత చాకిరీకి ఆమెకు ముట్టేది నెలకు కేవలం పదిహేను ర్యాండులు.
(ర్యాండులు దక్షిణాఫ్రికా కరెన్సీ)
యజమానురాలు లిండా మంచిదే కానీ చాలా పిసినారి మనిషి.
మధ్యాహ్నం లంచ్ కి పాచిపోయిన రొట్టెలు, కూర మాత్రమే జోలాకు ఇస్తుంది.
జోలా నిరుపేద కుటుంబ పరిస్థితుల గురించి తెలిసినా పైసా కూడా విదల్చదు.
పైగా పొరపాటున ఆమె చేతిలో పగిలిపోయిన పింగాణి ప్లేట్లు, గ్లాసులకు నష్ట పరిహారం కట్టి నిర్దాక్షిణ్యంగా జీతం నుంచి కోత పెడుతుంది.
జోలా కళ్ళలో ఆమె ఆరు నెలల కూతురు అబినా మరోమారు మెదిలింది.
తను ఉదయం పనికి వచ్చే టప్పుడు జ్వరంతో కూతురు ఒళ్ళు కాలిపోతోంది.
‘పనికి డుమ్మా కొడదామా’ అంటే ఆమ్మో యజమానురాలు చండశాసనురాలు. ఇల్లు పీకి పందిరి వేస్తుంది. కోపం వస్తే స్వయంగా తమ ఇంటికి వచ్చి తనను జీపుకు కట్టి ఈడ్చుకు పోయే రకం. అదీగాక ఈ వేళ ఎలాగైనా లిండా నుంచి రెండు ర్యాండులు అయినా తీసుకుని వెళ్లాలి. ఆ డబ్బుతో ఏదో ఒక మందు కొని చంటిదానికి పోయాలి ..
పాపం చిన్నతల్లి ఎలా ఉందో? జ్వరం తగ్గిందో లేదో ?
పక్కింట్లో ఉన్న తన తల్లికి, పిల్లను అప్పగించి వచ్చింది తను.
తన చంకలో నుంచి తల్లికి ఇస్తుంటే వెళ్లనని పిల్ల ఒకటే ఏడుపు!
బరువుగా నిట్టూర్పు విడిచింది జోలా.
“ఏయ్ ఎక్కడ చచ్చావే. తొందరగా అందరికీ చల్లని జ్యూసులు తీసుకురా ”
ముందు గది నుంచి లిండా కేకలు వినిపించడంతో ఉలిక్కిపడి లేచింది జోలా.
”వస్తున్నా అమ్మ. ఇప్పుడే తెస్తా ” అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిందామె.
జ్యూస్ చేయడం కోసం జోలా పండ్లను కోస్తుంటే చిన్నారి క్యాథెరిన్ ఇల్లు అదిరిపోయేలా గట్టిగా కేక పెట్టింది.
“మామ్ నా రెడ్ కలర్ బ్రష్ కనిపించడం లేదు.”
“హేయ్ జోలా… పాప బ్రష్ కనిపించడం లేదంట! ముందు అది ఎక్కడుందో వెతుకు”
లిండా హాల్లో నుంచే ఆర్డర్ వేసింది.
”అలాగేనమ్మా… అలాగే” అంటూ కిచెన్లో నుంచి రోబోలా తిరిగి క్యాథెరిన్ ఉన్న గదిలోకి పరుగున వచ్చింది జోలా.
ఐదు నిమిషాలు వెతికితే కానీ పాపకు కావలసిన బ్రష్ కనబడలేదు.
అది క్యాథెరిన్ పాప కూర్చున్న బెడ్ షీట్ కిందనే ఉంది.
దాన్ని పాప చేతికిచ్చి మళ్ళీ కిచెన్ లోకి పరుగుతీసింది జోలా.
ఐదు నిమిషాల్లో జ్యూస్ లు సిద్ధం చేసి ట్రేలో పెట్టుకుని హాల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ సర్వ్ చేసింది.
లిండా స్నేహితులందరూ తలోగ్లాసు తీసుకుని ఆస్వాదించడం మొదలుపెట్టారు.
మరో చేతిలో యధావిధిగా పేక ముక్కలు..
కబుర్లు.. నవ్వులు.. వేళాకోళాలు!
లిండా ఒక ఆంగ్లేయ అధికారి భార్య. ఆ కాలనీలో సుమారు ఇరవై ఆంగ్లేయ కుటుంబాలు ఉన్నాయి. వారందరిదీ రాజవైభోగం. అధికార బాధ్యతలతో భర్తలు క్యాంపులకు వెళ్లడం లేదా ఆఫీసులకు వెళ్లడంతో ఈ మహిళామణులకు ఏమి తోచుబాటు కాదు. అందుకే తమస్థాయి ఇరుగు పొరుగుని పిలిచి పేకాటలు లేదా చెస్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు. అప్పుడప్పుడూ ఖుషీ కోసం పని మనుషులతో నృత్యాలు కూడా చేయించి వినోదిస్తుంటారు.
లిండాని అడ్వాన్స్ జీతం డబ్బు అడగాలని ఉదయం నుంచి జోలా ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఆమె ఒంటరిగా దొరికితే కదా? ఎప్పుడూ ఎవరో అతిథులు, పనివాళ్ళు, దిగువ తరగతి అధికారులు ఇంట్లో తచ్చాడుతూనే ఉన్నారు. సాయంత్రం అడుగుదామంటే సాయంత్రం నాలుగున్నర దాటిందో లేదో ఈ ఇంగ్లీష్ మహిళలు బిలబిలమంటూ దిగిపోయారు.
ఒక రౌండ్ కాఫీలు, స్నాక్స్ అయ్యాక పేకాటలో పడ్డారు అందరూ.
రెండో విడత ఇప్పుడే తను జ్యూస్ లు సర్వ్ చేసి వచ్చింది.
‘అయ్యో అప్పుడే సమయం ఏడు దాటుతోంది. తన ఇల్లు అక్కడికి పది కిలోమీటర్లు! చీకటిలో అడవి మార్గం గుండా ఒంటరిగా పోవాలి. ఇప్పటికిప్పుడు తను బయలుదేరినా ఇంటికి చేరేసరికి తొమ్మిది దాటిపోతుంది.
మందు ఎప్పుడు కొనాలి? పిల్లకు ఎప్పుడు వేయాలి” మనసులో ఆవేదన చెందుతోంది జోలా.
ఆవేదన ఫలితమో ఏమో గానీ కళ్ళు నీళ్లతో చిప్పిల్లాయి..
డబ్బు అడుగుదామంటే యజమానురాలు హాలు దాటి గదిలోకి రానే రాదాయే! ఏం చేయాలి ఇప్పుడు?
జోలా మనసు దుఃఖంతో నిండిపోతోంది.
చంటి దానికి జ్వరం ఎలా ఉందోనని ఆ మాతృహృదయం తల్లడిల్లిపోతోంది..
ఇదంతా గుర్తించేది ఎవరు?
ఆ ఇంట్లో ఎవరికి మాత్రం ఆ అవసరం ఉంది.
మరో అరగంట భారంగా గడిచింది.
హాల్లో సందడి సద్దుమణిగింది.
హమ్మయ్య! అమ్మలక్కలంతా వెళ్లిపోయారన్నమాట.
హాల్లోకి తొంగిచూసిన జోలాకు కళ్ళు మూసుకుని ఈజీ చైర్ లో అలసటగా పడుకున్న లిండా కనిపించింది.
ఇదే సమయం అనుకుని యజమానురాలిని సమీపించింది.
”అమ్మా…” భయంభయంగా పిలిచింది జోలా.
లిండా కళ్ళు తెరవలేదు.
”అమ్మా …” ఈసారి కొంచెం గట్టిగా పిలిచిందామె.
కళ్ళు తెరిచింది లిండా.
“ఏంటి నువ్వు ఇంకా ఇంటికి వెళ్లలేదా? చీకటి పడిపోయింది కూడా.. సరే మంచిదే అయింది.. తల పగిలిపోతోంది కాస్త వేడి వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తావా?” అడిగింది లిండా.
“అలాగేనమ్మా క్షణాల్లో తెస్తాను” వడివడిగా కిచెన్లోకి పరుగెత్తింది జోలా.
యజమానురాలి ప్రసన్నత సాధించాలంటే ఈ అదనపు సేవలు తప్పవు మరి.
ఐదు నిమిషాల్లో వేడి వేడి కాఫీ కప్పు, చల్లని మంచి నీళ్ల గ్లాసు ట్రేలో పెట్టుకొని లిండా దగ్గరకు వచ్చింది ఆమె.
కాఫీ కప్పు అందుకుని “థాంక్స్ జోలా” అంది లిండా మనస్ఫూర్తిగా.
అదే సమయం అనుకుని – “అమ్మా చంటిదానికి ఒకటే జ్వరం.. ఇవ్వాళ రెండు రాండులు ఇవ్వండమ్మా.. జీతంలో బిగపట్టుకుందురు గాని..”
ఆమె మాట పూర్తికాకుండానే లిండా కళ్ళు ఎర్రబడ్డాయి.
“ఏంటి నాటకాలా? ఈ నెల జీతంలో అప్పుడే సగం తీసుకున్నావు.. ఇంకా ఇప్పుడు రెండు రాండులు అడుగుతున్నావు సిగ్గులేదా .. నెల కాకుండానే అడగడానికి! పైగా మొన్ననే బంగారంలాంటి పింగాణీ జగ్గు పగలగొట్టావు. నీ చేతుల్లో అసలు బలమే ఉండదు ఇలాగైతే ఎలా? సగం జీతం నువ్వు పగులగొట్టిన సామానుకే కట్టాల్సి వస్తోంది.. అదంతా నేనెంతో మోజుపడి ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకున్న ఖరీదైన సామాను”
“అమ్మ చంటి దానికి ఉదయం నుంచి ఒళ్ళు కాలిపోతోంది. ఇప్పుడు మీరు డబ్బిస్తే ఏదో మందుకొని తీసుకెళ్ళి వేస్తా.. లేదంటే బిడ్డ అన్నాయంగా సచ్చిపోద్దమ్మా.. నీ కాళ్ళు పట్టుకుంటా తల్లీ! ఈ పైసలు జీతంలో కోసేసుకోండమ్మా నన్ను నమ్మండమ్మ” వెక్కివెక్కి ఏడ్చింది జోలా.
లిండా మనసు కొంచం కరిగింది.
”ఏం నమ్మంటావు నిన్ను? నువ్వు నేను చెప్పింది ఒక్కటి కూడా చేయవు. పిల్లకి చీటికీ మాటికీ జ్వరం ఎందుకు వస్తోంది? దానికి పౌష్టికాహారం పెట్టమని నీకు ఎన్నోసార్లు చెప్పాను.. చెప్పానా లేదా? అలాగే నీ చేతులకు బలం రావాలని పళ్లరసాలు తాగమని పదేపదే చెప్పాను కనీసం ఒక్కసారైనా తాగావా ? ఖరీదైన టానిక్కులు తాగమన్నాను.. నామాట అసలు విన్నావా? నిన్ను ఇంకా ఎలా నమ్మమంటావు?” అంది నిష్ఠూరంగా.
తమది పళ్లరసాలు తాగే స్థాయి కాదని, కడుపుకు నాలుగు మెతుకులు దొరకడమే గగనమనీ యజమానురాలికి ఎలా చెప్పాలో జోలాకు అర్థం కాలేదు..
అయినా ఇప్పుడు ఇదంతా అనవసర ప్రసంగం అందుకే మళ్లోసారి బతిమిలాడింది
“రెండు రాండులు నా మొహాన కొట్టండమ్మా .. చచ్చి మీ కడుపున పుడతానమ్మా.. అమ్మ దయ చూడండమ్మా.. పసిబిడ్డ చావు బతుకుల్లో ఉందమ్మా” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.
లిండా లేచి గదిలోకి వెళ్ళి రెండు రాండులు తీసుకువచ్చి ఆమె చేతిలో పెడుతూ –
”మొన్న పగలగొట్టిన పింగాణి జగ్గు డబ్బు కూడా మినహాయించుకున్నాను రేపు ఒకటో తారీఖున నీకు ఇచ్చేది ఇక కేవలం ఐదు ర్యాండులే గుర్తుపెట్టుకో. ఇక పో ” అంది మొహం చిట్లించుకుని.
రెండు చేతులు ఎత్తి ఆమెకు దండం పెట్టి పరుగులాంటి నడకతో గేటు దాటి బయటకు వచ్చేసింది జోలా.
పది కిలోమీటర్లు అడవి మార్గంలో చీకటిలో ఒంటరిగా ఆ తల్లి ఎలా ప్రయాణం చేసిందో ఏమిటో ఆమెకీ ఆ దేవుడికే తెలియాలి. పరుగెత్తి పరుగెత్తి.. గస.. చాలీ ఆయాసం.. ఆమెను చుట్టుముడుతున్నా ఎక్కడా ఆగలేదు. వేగం తగ్గించలేదు.. ఆ పరుగులో అనేకసార్లు తూలి పడింది.. అయినా సరే మళ్ళీ లేచి పరుగు అందుకుంది. తన గుండెలు బిడ్డ కోసం ‘అబీనా అబీనా’ అని కొట్టుకుంటూనే ఉన్నాయి.
ఎలాగైతేనేం రాత్రి పది గంటలకు తమ గూడెం చేరుకుంది జోలా.
ఇంటి సమీపంలో కి వెళ్ళగానే అంతా నిశ్శబ్దంగా ఉంది.
జోలా మనసు కీడు శంకిస్తోంది..
బిడ్డను పట్నం ఏమన్నా తీసుకుపోయారా తమవాళ్లు? అనుమానపడింది.
అంతలో తమ ఇంటి వీధి అరుగు మీద మూటలా ఏదో ఉన్నట్టు మసక మసకగా కనిపిస్తోంది..
పక్కనే తన తల్లి కాబోలు మోకాళ్ళలో తలపెట్టుకుని బొమ్మలా కూర్చుని ఉంది.
జోలా మనసుకి ఆ దృశ్యం ఏదో చెప్పేసింది.
దగ్గరకు పరుగుతీసింది.
అది మూట కాదు .. అబీనా మృతదేహం!
బిడ్డను గుండెకు హత్తుకుంది.
కనుల నుంచి ధారాపాతంగా నీళ్లు కాలువలు కడుతున్నా శబ్దం మాత్రం రావడం లేదు.
ఆమె రాకను గమనించి కాబోలు ఇరుగు పొరుగు గుడిసెల నుండి బిలబిలా వచ్చారు జనం పెద్దపెట్టున ఏడుస్తూ.
“అమ్మా నీ బిడ్డకు మనతో రుణం తీరిపోయిందమ్మ. సాయంత్రం నాలుగు గంటలకే ప్రాణాలు పోయాయి తల్లీ” అంటూ ఏడుస్తున్న తన తల్లి చెబుతున్న మాటలు జోలాకు వినబడడం లేదు.
మెదడు మొద్దుబారిపోయింది ఆమె రొంటిలో ఉన్న రెండు రాండులు బాకుల్లా ఆమె పొట్టలో గుచ్చుకోసాగాయి.
పిచ్చిదానిలా తన బిడ్డ శవాన్ని అలా చూస్తూ కూర్చుండి పోయిందామె.

–0–

నా విశ్లేషణ:
ఇది ఆఫ్రికా కథ. ‘ఇంతేలే నిరుపేదల బతుకులు ఇవి ఏనాడు బాగుపడని అతుకులు’ అని కవి చెప్పిన మాటలు ఏ దేశంలో నైనా పేదలకు వర్తించేవే. పేదల గోడు పేదలది. చాలామంది వారి పరిస్థితులను, స్థితిగతులను అర్థం చేసుకోలేక ఈ కథలో లిండా అన్నట్లే మీరు పౌష్టికాహారం తీసుకోండి బలానికి పళ్లరసాలు తీసుకోండి అని సలహాలు చెబుతూ ఉంటారు. పట్టెడు మెతుకులే దొరకని అభాగ్య జీవులకు అవి అందని మాని పండ్లని వారికి ఎప్పటికీ తెలియదు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బులోనే జీవితాంతం గడిపేవారికి ఏ దేశంలోనైనా సరే నిరుపేదల బాధలు ఎప్పటికీ అర్థం కావు. నిజానికి పేదరికమే ఒక పెద్ద జబ్బు. మందులేని మాయ రోగం. ఈ రోగాన్ని రూపుమాపడానికి ఏ దేశము ఏ పాలకులు కృషిచేయరు.. వీరిలా రాలిపోతూ ఉండాల్సిందే!

-చంద్ర ప్రతాప్
8008143507

18 thoughts on “వెంటాడే కథలు – 8

  1. కొందరు డబ్బున్న వాళ్ళు బీదవాళ్ళని, పని వాళ్ళని చిన్న చూపు చూడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.అది ఒక మానసిక బలహీనత…మరికొందరు పని వారిని వాళ్ళ ఇంటిమనుషుల్లాగ చూసుకోవడం కూడా నేను చూశాను.
   ఏది ఏమైనా అందరినీ ప్రేమగా చూసుకోవాలి…ఇది ఆలోచింప చేసేకథ.

 1. మనసు కదిలించింది.

  ఒక ప్రశ్న , విపుల ,చతుర పాత సంచికలు online లో చదివేటందుకు ఎక్కడ లభ్యం అవుతాయి., దయచేసి చెప్పిండి.

  Please bring out all old vipilula , chatura magazines as books, for purchasing

  1. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు రవీంద్ర గారు.
   విపుల చతుర పాత సంచికలు ఇప్పుడు లభ్యం కావడం కష్టమే. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే బాగుంటుందన్న మీ సూచన బాగుంది. యాజమాన్యానికి ఈ సూచన అందజేస్తాను నమస్సులతో.

 2. టైటిల్ కు తగ్గట్లే వెంటాడే కథ సార్… చాలా బాగుంది…. ముఖ్యం శైలి

  1. చాలా కృతజ్ఞతలు సూర్య ప్రకాష్ గారు నిజంగా ఇలాంటి కథలు ఎప్పటికీ మరపునకు రావు. నమస్సులతో

 3. మంచి మానవత్వం ఉన్న కథను పరిచయం చేశారు. పేదవారి సమస్యలు ఏ దేశంలో ఐనా ఒకలాగే ఉంటాయేమో.

  1. సత్యం చెప్పారు శేషు గారు. పేదవాడు పేదవాడే ధనవంతుడు ధనవంతుడే. ధన్యవాదాలు

 4. నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు says:

  ఈ కధ దక్షిణాఫ్రికా ప్రజల బానిసత్త్వ జీవితానికి నిలువుట్టద్దం. కధ తెలుగు భాష లోకి అనువాదం చేసిన విధానం బాగుంది. పాత్రలను చక్కగా మలిచారు రచయిత. ఇంత మంచి కధ అందించినందుకు మీకు ధన్యవాదాలు.

  1. చాలా బాగా చెప్పారు యోగానందు గారు.. దేశం ఏది అయినా నిరుపేదల బతుకులు ఇలాగే ఉన్నాయి

 5. చాలా హృద్యమైన కథ… ఇలాంటి కథ చదివినప్పుడు మనసు కన్నీరు కారుస్తుంది.. ఇక కథ లోకి వస్తే… ఏ దేశంలోనైనా ప్రజలు ప్రశ్నించనంతవరకు మార్పు రాదు… అలాంటి చోట ఆకలికేకలు, పేదరికం, నిస్సహాయతలు పెరిగిపోతాయి… ఇలాంటి వాటిని కాలానికి వదిలేయకుండా అందరూ కలిసికట్టుగా గొంతు కలపాలి.. అన్యాయాన్ని ప్రశ్నించాలి.. శ్రామికుల దినోత్సవం రోజు మంచి కథను చదివేలా చేసినందుకు నమస్సులు సార్…

  1. ఎంత బాగా కథలోని హృదయాన్ని పట్టుకున్నార్తu. అభినందనలు తల్లి

 6. నిజమే సర్, మనుషుల్లో మార్పు రానంత వరకు పాలకుల్లో ఎలా మార్పు వస్తుంది?చాలా దీన కధ కళ్ళు చెమర్చాయి… నమస్సులు

  1. అవును సోదర.. రాస్తున్నప్పుడే హృదయం ద్రవించి పోయింది నాకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *