April 23, 2024

(వ్యంగ్యల్పిక) ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు!

రచన:-కర్లపాలెం హనుమంతరావు

‘ప్రేమే దైవం! యువతే లక్ష్యం!’
‘ఇదివ రకు ఓన్లీ ఒన్ సేవే లక్ష్యం అన్నట్లు గుర్తు?’
‘అది ముగిసిపోయిన పార్టీ పొట్టి కేప్షన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొస్తోన్న పార్టీ కొత్త స్లోగన్. మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు లవ్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల ఉత్తుత్తి ప్రేమ పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?’
‘మర్చి పోదగ్గ మహానుభావుడట్రా బాబూ! పాఠాలు చెప్పమని పెద్దబళ్లో పంతులుద్యోగ మిస్తే .. ప్రేమ పాఠాలు వల్లించి మరీ ఆడ శిష్యులను ఏకంగా పెళ్లి పీటల మీదకు ఎక్కించిన మన్మథుడు! అప్పట్లో అదో పెద్ద సంచనలం. చాలా ఘన సన్మానాలు గట్రా కూడా జరిగినట్లు గుర్తు .. పాత చెప్పులు వగైరా గజమాలలతో!’
‘చెప్పు పడ్డంత మాత్రాన గొప్పతనమేమన్నా చెరిగిపోతుందా బాబాయ్? ఆ మాటకొస్తే ఇప్పుడున్న గొప్పవాళ్లల్లో చెప్పు మీద పడని నేతలు ఎవరున్నారో చెప్పు?’
‘సర్సరే! ఇప్పుడీ పాత చెప్పుల పురాణాలన్నీ ఎందుగ్గానీ.. నువ్ చెప్పాలనుకొనే ఆ కొత్త కహానీ ఏదో చప్పున చెప్పిపోరాదా నాయనా నీకు పుణ్యముంటుంది!’
‘ఆ మాధుర్ చౌధురి గూరూగారే అప్పట్లో ప్రేమపేరుతో ఓ పార్టీ పెట్టేసి ‘ఆఠిన్ ‘ గుర్తుతో బరిలోకి దిగి ఎంతో మందిని అల్లల్లాడిచేసాడు! రాబోయే ఎన్నికల్లో మేమూ అదే మోడల్లో మరో ‘రతీ మన్మథ’.. సింపుల్ గా ‘ర.మ రాజ్యం పార్టీ’ తో ఓటర్ల గుండెల్ని దడదడలాడించబోతున్నాం బాబాయ్! ఇప్పట్నుంచే దేశమంతా టూర్లతో హోరెత్తించే ప్రయత్నాల్లో ఉన్నాం’
‘ఎన్నికల జాతర్లు. కనుచూపు మేరలో ఉండె. ఇట్లాంటి గారడీలు ఇంకెన్ని చూడాల్నో! ఇన్నాళ్ల బట్టి జనాల గోడు అసలు పట్టించుకోకుండా.. ఇవాళ పరగడుపునే పక్క దిగేసొచ్చేసి హఠాత్తుగా ఇట్లా జడివాన ప్రేమలు కురిపించేస్తానంటే తడిసి ముద్దయేందుకు జనాలేమన్నా సి సెంటర్లకెళ్లి సినేమాలు చూసే కెళ్లే పిచ్చిప్రేక్షకులట్రా! బడా బడా నేతలు.. బడబడవాగే అధినేతలకే చుక్కలు చూపించే తెలివి తేటలు రోజూ చూట్టంలా!’
‘బాబోయ్! టీవీ చర్చా కార్యక్రమాలకి మల్లె ఆ భాషేంటి బాబాయ్.. ఇంత వయస్సు మీద పడింతరువాత కూడా! షష్టిపూర్తి చేసుకున్న నీకే వంట్లో ఇంత పులుసుంటే.. ఇహ కోడెవయసు మీదున్నోళ్లం.. మేం మాత్రం ఎట్లా నోళ్లు మూసుక్కూర్చుంటాం!’
‘నా సంగతులు ఇప్పుడెందుగ్గానీ.. మీ ప్రేమ పార్టీ ఊడబొడిచే ఘనకార్యాలేంటో కొద్దిగా ముందది విప్పి చెప్పు బాబూ.. విని తరిస్తాం!’
‘దేశాన్నిప్పుడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలేంటీ?’
‘బాగుందిరా! మహా భారత గాథని పది ముక్కల్లో పూర్తిగా చెప్పాలన్నట్లుంది నీ చమత్కారం. ‘అ’ ఫర్ ఆవినీతి.. ‘ఆ’ ఫర్ ఆశిత్రులకు ఫర్.. ‘ఇ’ ఫర్ ఇష్టారాజ్యప్పాలన.. ‘ఈ’ ఫర్ ఈశా అల్లా ఏసులు అంటూ తన్నులాటలు! ఇట్లా ‘బండి రా’ దాకా ప్రతీ అక్షరానికో పది బండ ఆరాటాలు తడబాటులేం లేకుండా ఏకరువు పెట్టేయచ్చు. ఈ పీకులాటలేవీ వద్దు.. టూకీగా ఓ టూ వర్డ్స్ ఓకే అంటే. రెండే రెండు ప్రారబ్దాలు.. కూడూ.. గూడూ!’
‘ఒకే ఒక్క ఓటుతో ఆ రెండు ప్రారభ్దాలని పటాపంచలు చేయబోతోంది బాబాయ్ మా ప్రేమరాజ్యం పార్టీ! ప్రణయానికి ఆకలీ దప్పికలుండవంటారు కదా! తిండి తిప్పలు ఇహ ఒహ సమస్యగానే ఉండబోవు మా ‘ర.మ’ రాజ్యం పాలనలో. రూపాయిక్కిలో బియ్యం, పండగ పబ్బాలొచ్చి పడితే ఆ అన్న సంచులూ, ఈ అమ్మి అపరాల్లాంటి గారడీలింకేమీ చెయ్యక్కర్లేదు. తాగు నీరో.. సాగు సీజనుకు సరిపడ్డా నీరో.. అంటూ ఉన్న కుంచెడు గుంతల్లో నీటి వాటాల కోసం గడ్డపారల్తో కాట్లాడుకు చచ్చే చీపు పాలిటిక్సుకి మా రతీ మన్మథుల పార్టీ పాలనలో చోటుండదు. ముందెప్పటికో పొదల మాటున చేరి చేసుకునే ప్రేమకలాపాలకని ఇప్పట్నుంచే చెట్లు చేమలంటూ రోడ్లంట పడి మొక్కలు నాటే నాటు పథకాలుండవు. ప్రేమలో పడ్డవాళ్లంతా ఎదుటి వాళ్ల గుండెల్లో కాస్తింత చోటు దక్కితే ‘అదే.. పది వేల’ని పొంగిపోతారు కదా! ఇంకీ గులాబీ రంగు డబుల్ బెడ్రూంలు, పసుపు పచ్చ కలర్ ఒంటి స్తంభం మేడలు అంటూ రాష్ట్రాలు, సర్వం సత్వరం కమలమయం అయిపోవలన్న కేంద్రం పెద్దల ఆవాస యోజన ప్రయాసలకు వీసమెత్తైనా విలువ మిగలని స్వర్ణయుగం ర.మరాజ్యం పరిపాలనంటే. ప్రేమలో పడ్డవాళ్లకి మన మామూలు భాషల్తో పని నడవదు కదా! వాళ్లవన్నీ మూగ సైగలు! గాయకుడు సైగలు కాలం నాటి బొంగురు గొంతు విరహ వ్యవహారాలు. ఆ లాగుడు పాటల కేసెట్లో సూటుకేసులో పోసిస్తే సరి.. ఇహ ఆ బెళగావుఁ-సతారా మార్కు భాషా తగువులన్నీ ఇట్టే సమసిపోతాయ్. తమిళమా.. తెలుగా ఏది ప్రాచీన భాష? అన్న కీచులాటలన్నీ పక్కన పెట్టేస్తారు. దేశమంతటా అప్పుడు వాడుకలో ఉందేది ఒకే ఒక భాష. అదే ఆడమ్ అండ్ ఈవ్ పుట్టుకతో పాటు పుట్టుకొచ్చిన ఘోష. అదే అత్యంత ప్రాచీనం.. అంతకన్నా అధునాతనం. ఏ మరాఠాకు బీహారీకి మధ్యన పనికిమాలిన పొరపొచ్చలు రావు. త్యాగం మినహా మరేదీ కోరుకోదు అసలు సిసలు ప్రేమ! జనాలను కొల్లగొట్టి తరాలకు సరిపడా కూడబెట్టుకోవాలన్న తాపత్రయం దానంతటదే పెద్ద ప్రయత్నమేం లేకుండానే పెద్దమనుషుల మనసుల్లో నుంచీ సులువుగా సమసిపోతుంది. కుంభకోణమంటే అప్పుడు జనలాలకు తటాలుమని తట్టేది తమిళనాడులోని ఊరు పేరు మాత్రమే! ప్రస్తుతం పాలిటిక్సులో ప్రతీ క్షణం మోతెక్కిపోతోన్న కుంభకోణాల ఊసులకు ఇహ ఆస్కారమే ఉండదు. వారసులే దేశాన్నేలుతున్నారన్న రుసరుసలు ఇహ ఏ సైడు నుంచి వచ్చినా ఓటరు చెప్పుతీసుకుంటాడు. నిజంగా పెద్దపండుగే కదా బాబాయ్! .కుంభకోణాలు, కుమ్ములాటలు, వెన్నుపోట్లు, వెన్నముద్దలు రాయడాల్లాంటివన్నీ ఇహ గత పాలకుల ఖాతాల్లోనుంచి హఠాత్తుగా నిద్ర లేచొచ్చే పిశాచాలు కాబోవు. ర.మ రాజ్యం పార్టీ లక్ష్యం విస్తరించే కొద్దీ ‘అది కావాలి.. ఇది కావాలి’ అనే డిమాండ్లు వాటంతటవే అణిగిపోతాయి. పై పెచ్చు ‘ఇదిచ్చేస్తాం.. అదిచ్చేస్తాం! పుచ్చుకోకుంటే చంపి పాతరేస్తాం’ లాంటి త్యాగనినాదాలే కర్ణభేరులదిరి పోయేటట్లు మిన్నుముట్టేస్తాయి. రామరాజ్యంలో కూడా సాధించలేని ఇంకెన్నో ఈ తరహా చమత్కారాలన్నీ మా ‘ర.మ రాజ్యం’ పాలనలోకొస్తే సులువుగా సాధించుకోవచ్చు బాబాయ్! ఇప్పుడు జరిగే హక్కుల పోరాటాలన్నీ ఠక్కుమని ఒక్కసారే మూతబడితే.. ధర్ర్నా చౌకులో ఖాళీ అయిన ప్రతీ అంగుళమూ ప్రేమ పక్షులకు కేటాయించేటందుకు సులువవుతుంది. ప్రేమ మాత్రమే తప్పించి పగ, కక్ష, కార్పణ్యాల్లాంటి దులక్షణాలేవీ మచ్చుక్కైనా కంటబడని ఆ భయంకరమైన శాంతి భద్రతల అదుపుకు నీ లాంటి సీనియర్ సీజనల్ పొలిటీషియన్సు పాపం.. తట్టుకుంటారో .. లేదో! వుయ్ పిటీ యూ బాబాయ్!’
‘గురజాడగారి గిర్రాయి టైపు లెచ్చర్ల తంతును మించిపోయిందిరా నీ వాగ్ధాటంతా! ఇన్నేసి న్యూసు పేపర్లు, న్యూసెన్సు టీవీ ఛానల్సు క్రమం తప్పకుండా చూసే నాకే నిర్గుండె పడేటట్లుందే నీ భావి భారత రాజకీయ ఊహా చిత్రం! ఇహ తన మానానికి తాను కామ్ గా తిని తొంగునే ఆమ్ ఆద్మీ పాపం మీ ప్రేమగాళ్ల ధాటికి ఎట్లా తట్టుకుంటాడో ఏంటో.. పాపం! ఐ పిటీ ది ఓటర్! మూవీ, టీవీ మార్కెట్లకంటే ఈ ప్రేమలూ.. దోమలూ ఓ .కే! మూడు పూటలా మెక్కేందుకు కూడు.. మంచమెక్కి తెల్లారే దాకా తొంగునేందుకు ఓ గూడు ఉంటే చాలు.. అబ్బో అదే ఓ పెద్ద పండుగని సంబరపడిపోయే బక్కోళ్లకు ఈ ప్రేమలూ, చీమల పార్టీలెందుకబ్బీ.. చీదర కాకపోతే! పిచ్చాళ్లన్ని మదపిచ్చాళ్లను చేసేసి మీ పబ్బం గడుపుకునేందుకు ముందుకు తెచ్చిన ఎత్తుగడలా ఉందే ఈ కొత్త తరహా పార్టీ!’
‘ఏళ్ల బట్టీ బూర్జువా పార్టీల తత్వం బాగా వంటబట్టిన నీ బోటి ముసలి డొక్కులకి ప్రేమంటే ముందులో కాస్తంత డోకే వస్తుందిలే! బట్ వుయ్ డోంట్ కేర్! బోల్డుగా చెప్పాలంటే నేటి జనాలకి మా ‘రతీ మన్మధ రాజ్యం’ దే ది బెస్ట్ మ్యానిఫెస్టో! ఇప్పుడు నడిచేవన్నీ పక్కా కుల రాజకీయాలకు పక్కలు పరిచే పార్టీలే కదా బాబాయ్? కులం కత వదిలేయ్.. ఉపకులం ఊసైనా ఎత్తకుండా మంత్రాంగ నడపలేని పార్టీలే కదా మీవన్నీ? ప్రేమజీవుల కసలు కుల మతాలనే సతమతాలేవీ ఉండవు. జాతి అడ్డూ ఆపూ లేకుండా పురోగమించాలంటే మా రతీ మన్మథ రాజ్యం పార్టీ లక్ష్యాలే చివరికి గతి’
‘ఏంటి బాబూ అంతలావు మీ లక్ష్యాలు?’
‘ప్రేమ కోసం జీవితాలను ఫణం పెట్టిన అమర జీవులు దేవదా, పారు; ఏంటొనీ క్లియోపాట్రా; సలీం అనార్కలీ. ఆ ప్రేమ జూవుల విగ్రహాలని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించాలి. పసివగ్గులక్కూడా ప్రేమకథలను గూర్చి ఉగ్గుపాలతో మరీ రంగరించి గొంతులో పోయాలి. సిగ్గు ఎగ్గుల్లేకుండా ప్రేమించుకోవాలంటే ప్రాధమిక దశ నుంచే లైలా మజ్నూల్లాంటి లవ్ బర్డ్స్ చరిత్రలు పాఠ్యప్రణాళికల్లో చేర్చి తీరాలి. ప్రేమ కథాచిత్రాలను మాత్రమే నిర్మించే విధంగా సినిమాటోగ్రఫీ చట్టాలలొ సవరణలు చేపట్టాలి. ప్రేమను కించపరిచే ఏ కళారూపాన్నైనా పర్మినెంటుగా బహిష్కరించే సెక్షన్లు ఐ.పి.సి కోడుల్లో చొప్పించాలి. ప్రేమ విరోధులకు విధించే శిక్షలు తతిమ్మా ప్రణయద్వేషులకు వణుకు పుట్టించేటంత కఠినాతి కఠినంగా ఉండి తీరాలి. ప్రేమ వివాహాలను ప్రభుత్వాలే స్వంత ఖర్చుతో భారీగా జరిపించాలి. ప్రేమపక్షుల విహారానికి అనుకూలమైన స్థలాలను ప్రభుత్వాలే సమీకరించాలి. ప్యారిస్ పార్కుల్ని తలదన్నే పార్కులుగా అభివృద్ధి పరచాలి. విఫల ప్రేమికులకు సరికొత్త ప్రేమికులు దొరికే వరకు ప్రభుత్వాలే ‘వియోగభత్యం’ కింద మందూ..మాకులకు నెల నెలా ఇంతని చెల్లించాలి. ప్లాపైన ప్రేమ చిత్రనిర్మాతలకు ఉద్దీపన పథకాలు.. రేంటింగు తగ్గిన ప్రేమ సోపులకు భారీ సబ్సిడీలు.. బడ్జెట్లల్లో కేటాయించాలి. విఫల ప్రేమికులు పునఃప్రేమకు తాము చేసే సర్వ ప్రయత్నాలు పునః విఫలమై, పూర్తి విరక్తితో ఆత్మాహుతి తలపదితే .. దూకి చచ్చేందుకు సరిపడా లోతైన కాలువలు తవ్వించాలి. తల పెట్టుకుని పడుకునేందుకు ప్రత్యేక రైలు పట్టాలు ఏర్పాటు చేసి, వేళకు రైళ్లు ఆ ట్రాకుల మీదుగా పోయే ఏర్పాట్లు చేసితీరాలి. ప్రేమికుల చేత పళ్లు రాలగొట్టించుకొనే ఔత్సాహిక ప్రేమికులకు ‘ప్రేమశ్రీ’పథకం కింద ఉచిత చికిత్సలు, దంత వైద్యశాలలు తక్షణమే ఏర్పాటు చేసితీరాలి. అన్నట్లు నూతన ప్రేమికులకు పరిమితిలేని ఉచిత సెల్ ఫోన్ కాల్స్ సౌకర్యం విధిగా ప్రభుత్వాలే కల్పిస్తే మరీ మంచిది.’
‘బాగుందిరా అబ్బాయ్ నీ ప్రేమ పార్టి సంబడం. కానీ నాదో బుల్లి సందేహం. ఈ ప్రేమా.. దోమా.. వాలకం చూస్తుంటే ఇదేదో మొన్నటి గురువారం నాటి ప్రేమికుల దినోత్సవ తర్వాతొచ్చిన పూనకంలాగా ఉందే! మరా రోజు నుంచే మీరీ పార్టీ అట్టముక్కలూ,, జెండా గుడ్డపీలకలు పట్టుకు రోడ్ల మీదకొచ్చిపడుండాలి కదా! మధ్యలో ఈ రెండు రోజుల సందూ ఎందుకు తీసుకున్నట్లో?!’
‘అర్థమవుతూనే ఉందిలే బాబాయ్ నీ వెటకారపు కూతలూ! సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు బొత్తిగా లేదు. కానీ సైలెంటుగా ఉండిపోతే అసలే అలుసుగా చూసే మీ పెద్దోళ్లకి మరీ పులుసులో ముక్కలక్కిందక్కూడా పనికిరాకుండా పోతామనే బదులిస్తున్నా! మాది మీ లాంటి ‘కావలి కుక్కల’ బాపతు పార్టీ కాదు. కావలింతల పార్టీ. ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎంత గాఠ్ఠిగా వాటేసుకోవాలో.. ఎవర్ని ఎట్లా చూసీ చూడనత్లు దాటేసుకు ‘అలా ముందుకు పోవాలో’ .. ఆ ప్లానింగూ పాడుతో రవ్వంత ఆలీసెం అయింది.. అంతే!’
‘కొయ్!.. కొయ్ రా నా రాజా! ప్రేమికుల రోజునే మీ అట్టముక్కలు, గుడ్డపీలికల హంగామాతో ఏ పార్టీ దొడ్డిగోడ చీకట్లో దూకుతూ పట్టుబడిపోతే ఆ భజరంగ భళులూ, రాంబంటు దళాలా.. ఆ గుంపులెవో నిజంగానే మీ ఇద్దరికీ అక్కడికక్కడే పొత్తు కరిపించేసి కొంపలు ముంచేస్తారన్న కదట్రా బెంగ! హ్హా.. హ్హా.. హ్హా! ప్రేమల పార్టీ ఒహ వైపూ! దొంగప్రేమల పార్టీలు మరో వైపూ! ఏడు దశాబ్దాల బట్టి ఇద్దరి మధ్యన నలిగి చస్తున్నది మాత్రం పాపం.. మనసులో ఏముందో బైటికి గట్టిగా చెప్పుకునే శక్తి లేని మన పౌరుడు!
ఐ పిటి దిస్ ఓటర్.. రా అబ్బీ!’
***

2 thoughts on “(వ్యంగ్యల్పిక) ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *