March 19, 2024

అమ్మమ్మ – 35

రచన: గిరిజ పీసపాటి

కొన్ని విషయాలు మనం ఎంత దాచాలనుకున్నా దాగేవి కావు కనుక అన్ని విషయాలూ ఒక్క తమ ఆర్థిక ఇబ్బందులు తప్ప ప్రసాద్ గారితో వివరంగా చెప్పింది నాగ.

జరిగినదంతా విన్నాక ఆయన చాలా బాధపడి “అయ్యో! మీరు పిల్లలు ఇంత బాధలో ఉన్నారని తెలియదు మేడమ్! ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో అవసరమైతే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. సర్ వచ్చేస్తారు. మిమ్మల్ని పిల్లల్ని వదిలి వారు మాత్రం ఎన్నాళ్ళని ఉండగలరు? మీకభ్యంతరం లేకపోతే నేను అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చా?” అనడిగారు.

“తప్పకుండా రావచ్చు. కానీ ఇంక మీకా అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే నేను రేపటి నుండి షాపుకి వచ్చేస్తాను” అంది నాగ.

“మంచి విషయం చెప్పారు మేడమ్. పనిలో పడితే మీరు కూడా మానసికంగా కాస్త తేరుకుంటారు. రేపు షాప్ లో కలుద్దాం. ఇలా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లైతే మన్నించండి. వెళ్ళొస్తాను మేడమ్” రెండు చేతులూ జోడిస్తూ అన్నారాయన.

“నాటెటాల్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్!” అంటూ తనూ చేతులు జోడించింది నాగ.

కృష్ణ మూర్తి గారు ఇచ్చిన డబ్బులతో కావలసిన సరుకులు గిరిజ చేత తెప్పించి “వసంతా! కిరాణా షాప్ ఆంటీకి ఇవ్వాల్సిన బియ్యం ముందు బదులు తీర్చెయ్. మిగిలిన బియ్యంతో ఒక్క పూటే వంట చెయ్యు. మళ్ళీ నాకు జీతం వచ్చేవరకు ఎలా గడపాలో తెలియట్లేదు” అంది నాగ దిగులుగా.

“ఇప్పుడు కుష్ట మామ వచ్చి డబ్బు ఇస్తారని మనం అనుకున్నామా అమ్మా! అలాగే ఎలాగోలా వస్తాయిలే. నువ్వు షాప్ కి వెళితే నెల్లాళ్ళకయినా జీతం వస్తుంది. ఇంట్లో ఉంటే అది కూడా ఉండదు కదా! మనం అలోచించాల్సిన విషయం ఇంకొకటుంది. నువ్వు మర్చిపోయినట్లున్నావు” అంది వసంత.

“ఏమిటది?” అయోమయంగా అడుగుతున్న తల్లితో “రేపో ఎల్లుండో హౌస్ ఓనర్ అద్దె అడగడానికి వస్తారు. ముందు ఆయనకి ఇవ్వాల్సిన అద్దె డబ్బుల గురించి నేనాలోచిస్తున్నాను” అన్న కూతురి మాటలకు ఒక్కసారిగా ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్లు కుర్చీలో కూలబడిపోయి, “ముందు కాస్త మంచినీళ్ళు ఇవ్వు పాపా!” అంది దీనంగా.

పెద్ద కూతురు ఇచ్చిన మంచినీళ్ళు తాగుతుండగానే ఉప్పెన ముంచుకొచ్చనట్లు ఉధృతంగా ముంచుకొచ్చిన దుఃఖాన్ని ఆపులోలేక ఒక్కసారిగా పిల్లలు ముగ్గురినీ దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.

తల్లి ఏడుపుకి బెదరిపోయిన నాని, గిరిజ కూడా ఏడవసాగారు. వసంత మాత్రం తల్లిని ఓదారుస్తూ “ఊరుకో అమ్మా! ఏడిస్తే సమస్యలు తీరతాయా!? అలా అయితే నలుగురం రోజంతా ఏడుస్తూ కూచుందాం. ఇప్పుడు బాగా రాత్రి అయిపోయింది. ముందు వంట చేస్తాను. ముగ్గరం కాస్త ఎంగిలి పడితే ఆలోచించడానికైనా ఓపిక వస్తుంది. తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. తమ్ముడు, చెల్లి కూడా ఏడుస్తున్నారు చూడు! ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి” అంది.

“ఇలా మనల్ని నట్టేట్లో వదిలేసి వెళ్లిపోవడానికి ఆయనకు మనసెలా వచ్చిందో! అసలు ఎక్కడున్నారో!? ఎలా ఉన్నారో!? నువ్వు నమ్మవు పాపా! మనం భోజనం చేస్తున్న ప్రతీసారి ఆయన తిన్నారో లేదోననే ఆలోచన వచ్చి అన్నం తినబుద్ధి కావట్లేదు. అసలే శీతాకాలం. వంటి మీద ఉన్న జత తప్ప బట్టలు కూడా పట్టుకెళ్ళలేదు. ఇది గుర్తొస్తే నిద్ర కూడా పట్టట్లేదు” సజల నేత్రాలతో దిగులుగా చూసింది కూతురి వైపు.

“అలాగేం జరగదు లేమ్మా! ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గరే ఉండి ఉంటారు. నువ్విలా డీలాగా మారిపోతే ఎలా? తాత స్నేహితులు, శిష్యులు అందరూ నాన్నకు బాగా తెలిసిన వాళ్ళే. ఆయన శుభ్రంగా ఉన్నారని నా మనసు చెప్తోంది. ముందు నువ్వెళ్ళి ముఖం కడుక్కో” అంటూ కాస్త మందలిస్తున్నట్లుగా అంది వసంత.

అరగంటలో వంట పూర్తి చేసి, భోజనాలు వడ్డించింది. భోజనాలు అవ్వగానే హాల్ లోనే బొంతలు పరుచుకుని నలుగురూ పడుకున్నారు. గది బాగా చిన్నది కావడంతో కేవలం వంట చేసుకోవడానికి మాత్రమే సదుపాయంగా ఉంటుంది.

చెల్లి, తమ్ముడు నిద్రలోకి జారుకోగానే నిద్ర పట్టక పక్క మీద అస్థిమితంగా కదులుతున్న తల్లిని చూసి బాధగా నిట్టూరుస్తూ “అమ్మా!” అని పిలిచింది మెల్లిగా.

“ఏంటమ్మా! మంచినీళ్ళు కావాలా?” ఆప్యాయంగా అడిగింది కూతుర్ని. మనసులో మాత్రం ‘అసలే డయాబెటిక్ పేషెంట్. ఇన్సులిన్ ఇంజక్షన్లు కొనలేకపోవడంతో నీరసం వచ్చి ఎంత ఇబ్బంది పడుతోందో. ఎంత బాధైనా పళ్ళ బిగువున భరిస్తోందే గానీ బయటపడదు పిచ్చి పిల్ల. షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఆకలి, దాహం ఎక్కువై పోయుంటాయి. సరైన తిండి ఎలాగూ లేదు. మంచినీళ్ళైనా కడుపు నిండా తాగు తల్లీ’ అనుకుంటూ.

“మంచినీళ్ళు కావాలంటే నేనే వెళ్ళి తాగేదాన్ని కదమ్మా! మనం ఇంటద్దె కట్టడం గురించి ఇందాక అనుకున్నాం కదా! నాకో ఆలోచన వచ్చింది. అంతకు మించి మరో మార్గం కూడా లేదేమో అనిపిస్తోంది కూడా” అంది.

“చెప్పమ్మా! నువ్వు ఏ సమస్యనైన అన్ని కోణాల్లోంచి చూసి, పరిష్కారం కోసం బాగా ఆలోచించిస్తావని నాకు తెలుసు” అంది

“మరేంలేదమ్మా! అన్నపూర్ణ అంటీ వాళ్ళు, మన హౌస్ ఓనర్కి బాగా దగ్గర బంధువులే కదా! మనం రేపు ఉదయాన్నే అన్నపూర్ణ అంటీ దగ్గరకు వెళ్ళి, మన ఇబ్బంది వాళ్ళకు చెప్పమని చెప్పి, ఇంటి అద్దె రెండు నెలలు ఇవ్వలేమని చెప్పమందాం”.

“ఆయన విజయనగరం నుండి కేవలం మన ఇంటి అద్దె వసూలు చేసుకోవడానికే వస్తారు. తీరా వచ్చాక చెప్తే బాగోదు కదమ్మా! ముందే మనం మూర్తి అంకుల్ కి చెప్పి ఆయనకు ఫోన్ చేసి చెప్పమందాం. దాని వల్ల ఆయనకు డబ్బు ఖర్చు, శ్రమ తప్పడమే కాక, టైం కూడా సేవ్ అవుతుంది కదా!” అంది.

“నిజమే వసంతా! మంచి సలహా చెప్పావు. రేపు ఉదయాన్నే అన్నపూర్ణ ఆంటీని, మూర్తి అంకుల్ ని కలిసి మాట్లాడదాం. ఇక పడుకో పెద్ద తల్లీ!” అంటూ కూతురి తల నిమిరి, నుదుటి పైన ముద్దు పెట్టుకుంది. ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని పడుకున్నారిదగదరూ.

మర్నాడు ఉదయం రోజూలానే అన్నపూర్ణ గారు వీధి గుమ్మం దగ్గరా, మూర్తి గారు లోపలి డ్రాయింగ్ రూమ్ లోనూ కూర్చుని పేపర్ చదువుకుంటుండగా నాగ, వసంత తమ గుమ్మం వాకిలి బయటకు వచ్చి నిలబడ్డారు.

వీళ్ళను చూడగానే పేపర్ మడత పెట్టి పక్కన పెడుతూ “ఎలా ఉన్నారు వదిన గారూ! కళ్ళు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రి మళ్ళీ ఏడ్చారా!” అడిగారు బాధగా.

“అదేం లేదు అన్నయ్యగారూ! కొంచెం నిద్ర పట్టక, వేడి చేసి అలా ఉన్నాయేమో!” అంది నాగ.

“నిజంగా అంతే కదా! అలా అయితే పరవాలేదు. ఇంకేమిటి సంగతులు? అన్నయ్య గారి గురించి ఏమన్నా తెలిసిందా?” అని ప్రశ్నించిన అన్నపూర్ణగారికి ‘లేద’న్నట్లుగా తల అడ్డంగా ఊపింది నాగ.

“ఇంత చక్కని పిల్లల్ని, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఆయనకు మనసెలా వచ్చిందోనని నేను, మీ అన్నయ్య గారు రోజుకు పదిసార్లైనా అనుకుంటాము. ఎన్నోసార్లు మీకు కూడా వంట చేసి ఇద్దామనుకునుకున్నాను. కానీ మీ ఆత్మాభిమానం మాకు తెలుసు కనుక ఆగిపోయాను. అప్పడూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సంకోచించకుండా చెప్పండి” అన్నారు ఆంటీ.

“ఇప్పుడు మీ సహాయం కోసమే వచ్చాము వదిన గారూ!” అంది నాగ.

“అవునా! రోజూలాగే మామూలుగా వచ్చారనుకుని నా ధోరణిలో నేను మాట్లాడేస్తున్నాను. లోపలికి రండి” అంటూ డ్రాయింగ్ రూమ్ లోకి ఆహ్వానించారావిడ. అదే మొదటిసారి వాళ్ళింట్లోకి వెళ్ళడం. ఎప్పుడూ గుమ్మం దగ్గర మాట్లాడుకోవడమే.

“కూర్చోండి. వేడి వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అంటూ లోపలికి వెళ్ళబోతున్న ఆవిడతో “ఇప్పడవేం వద్దు వదిన గారూ!” అంటూ వారించింది. నాగ ఉద్దేశం వేరు. భర్త వెళ్ళిపోయాక కాఫీ తాగడం పూర్తిగా మానేసారు. ఇక్కడ తను, వసంత కాఫీ తాగేస్తే పాపం ఇంట్లో ఉన్న గిరిజ, నానికి ఎవరిస్తారని ఆ తల్లి బాధ.

కానీ అన్నపూర్ణమ్మ గారు నాగ వారించినా వినకుండా “ఫిల్టర్ లో డికాక్షన్ ఉంది. రెండు నిముషాలలో తెస్తానుండండి” అంటూ వంటింటి వైపు వెళ్ళారు.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *