April 25, 2024

జీవితం-జీతం-మనుగడ

రచన: రాజ్యలక్ష్మి బి

 

“ఈ వుద్యోగం చెయ్యాలంటే విసుగ్గా వుంది, ఎలాగైనా వదిలించుకునే మార్గం చెప్పండి” అంటూ తోటివుద్యోగి శివని అడిగాడు రామం!

“రామం గారూ నా వల్ల కాదు, మీ నాన్న మన ఆఫీసర్ ఫ్రెండ్స్! మీ నాన్న మిమ్మల్ని యిక్కడ వుద్యోగంలో కుదిర్చింది యిక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి! ఆమ్మో! నా వుద్యోగం వూడగొట్టుకోను బాబూ “అంటూ శివ తన ఫైళ్లల్లో తల దూర్చాడు.

అసలు విషయం యేమిటంటే పుల్లయ్యగారికి ఒక్కడే కొడుకు రామం.  గారాబంగా పెంచడం వల్ల చదువంటే విసుగు,  పనులు చెయ్యడం అంటే విసుగు.  అయినా తండ్రి పట్టుబట్టి నయానాభయానా బెదిరించి మొత్తానికి కొడుకును డిగ్రీ దాకా లాక్కొచ్చాడు.  ఏదైనా.  వుద్యోగం ప్రయత్నం చెయ్యమన్నాడు తండ్రి! కానీ రామానికి వుద్యోగమంటే బానిసబ్రతుకని అర్ధం! పోనీ స్వంతం గా యేదైనా పెట్టిద్దామంటే అదీ చెయ్యనన్నాడు రామం.  చివరకు విసుగేసి తన ఫ్రెండ్ ఆఫీసుకు తీసుకెళ్లి బలవంతం గా వుద్యోగం లో పెట్టించి ఫ్రెండ్ తో రామం పట్ల.  కఠినం గా వుండమన్నాడు పుల్లయ్య.

మొత్తానికి రామం ఉద్యోగ పర్వం మొదలయ్యింది.  ఆఫీసరుగారు రామానికి ఫైళ్ల డ్రాఫ్టింగ్ వంచిన తల యెత్తలేనంత యిచ్చారు.  లంచ్ టైం తప్ప యిక తీరికే లేనంత బిజీ అయ్యాడు రామం.  తోటి వుద్యోగి శివకి యిదంతా తెలుసు.  అందుకే రామం విషయంలో జోక్యం చేసుకుంటే తనకే ముప్పని గ్రహించాడు.  రామం యెలాగైనా ఆ వుద్యోగం వదిలిచుకోవాలనుకున్నాడు.

ఒకరోజు ఆఫీసుకు త్వరగా వచ్చాడు.  కాసేపు తన బల్లమీదున్న ఫైళ్లను కలగాపులగం చేసాడు.  డ్రాఫ్ట్ వ్రాయాల్సిన ఫైల్ తీసి ఒక కాగితం మీద పెన్సిల్ తో రెండు బొమ్మలు వేసి వాటికి మెరుగులు దిద్ది ఆ ఫైల్లో పెట్టి ప్యూను కోటయ్యకిచ్చి ఆఫీసరుగారికివ్వమన్నాడు.  రామం వూహించింది యేమంటే,  ఆఫీసరుగారు బొమ్మలు చూసి చీవాట్లేసి వెంటనే తనల్ని వుద్యోగంలోనించి తొలగిస్తారనీ,  తాను హాయిగా యింటికి వెళ్లిపోవచ్చనీ! అందుకే ఆఫీసరుగారి పిలుపు కోసం యెదురు చూస్తున్నాడు.  మధ్యాహ్నం మూడైనా పిలుపు రాలేదు.  చివరకు కోటయ్యను పిలిచి ఫైలు గురించి అడిగాడు.  కోటయ్య ఫైలు తెచ్చిచ్చాడు.  బొమ్మల కాగితం లేదు,  బదులుగా నీట్ గా డ్రాఫ్ట్ చేసిన కాగితం,  ఆఫీసరుగారి సంతకం వుంది.  రామానికి ఆశ్చర్యమేసింది,  యెవరు చేసారు!శివ తప్ప అందరూ కొత్తే. పైగా శివకే చెప్పాడు తన గోడంతా! శివే కాగితం మార్చాడని గ్రహించాడు.

మర్నాడు కూడా ఆఫీసరుగారి సంతకానికి వెళ్లాల్సిన డ్రాఫ్ట్ అంతా తప్పులు వ్రాసి పంపించాడు.  మధ్యాహ్నం సమయానికి తను పంపిన ఫైలు కాగితం బదులు నీట్ గా వ్రాసిన డ్రాఫ్ట్ ఆఫీసరు గారి సంతకంతో తిరిగి తన బల్ల మీద పెట్టాడు కోటయ్య.

“కోటయ్యా,  నా ఫైలు నేరుగా ఆఫీసరు గారి దగ్గరకు తీసికెళ్ళడం లేదా ?”కోటయ్యని అడిగాడు రామం

“శివ గారు ముందుగా మీ ఫైలు తన దగ్గరకు తెమ్మన్నారు “అన్నాడు కోటయ్య.

రామానికి కోపం వచ్చింది.  మర్నాడు డ్రాఫ్ట్ అంతా కొట్టివేతలూ,  బోలెడు అక్షర దోషాలతో వ్రాసి కోటయ్య చేతిలో పెట్టి “కోటయ్యా యీ ఫైలు నేరుగా ఆఫీసరుగారికే యివ్వు “అన్నాడు రామం.  ఈ రోజు తన వుద్యోగం పోవడం ఖాయం అనుకున్నాడు రామం.  హాయిగా యింట్లో వుండొచ్చు.  చాకిరీ పని లేదింక అనుకుంటూ ఆఫీసరు పిలుపు కోసం యెదురు చూస్తున్నాడు.  సాయంకాలం అవుతున్నా పిలుపు రాలేదు.  కోటయ్యను పిలిచాడు.

“ఆఫీసరు గారు వెళ్లిపోయారండీ, వాళ్లమ్మగారికి సీరియస్ గా వుందిట. వారం రోజులు సెలవులో వెళ్లిపోయారు“ అన్నాడు కోటయ్య.

రామం నీరు కారిపోయాడు.  ఆయనొచ్చేదాకా తనకీ శిక్ష తప్పదు అనుకున్నాడు.  దిగులుగా యింటికొచ్చాడు.  అక్కడ పరిస్థితి చూసి అర్ధం కాక అమ్మ వైపు చూసాడు.  ”అమ్మ నాన్నను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.  నాన్న వరండాలో నేలమీద తల ప్రక్కకు వాల్చి కళ్లుమూసుకున్నాడు!

“రామం నాన్నగారు వరండాలో వెళ్తూ తూలిపడిపోయారు, సుమారు గంట అయ్యింది.  నాకు అంతా కొత్త! పిలిస్తే పలకడం లేదురా!” అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది.  రామానికి అమ్మను నాన్నను అలా చూడడం అదే మొదటిసారి! గబగబా ఆటో తెచ్చాడు! నాన్నను మెల్లగా అమ్మ సాయంతో ఆటోలో కూర్చోబెట్టాడు.  సీతమ్మగారు పర్సు పట్టుకుని.  యింటికి తాళం వేసి ఆటో ఎక్కారు.  డాక్టరుగారు అన్ని పరీక్షలు చేసి,  పుల్లయ్యగారికి ఎడమ వైపు పక్షవాతం వచ్చింది,  క్రమంగా తగ్గుతుంది,  మాట పడిపోయిందని చెప్పారు.

రామం యింటికి వచ్చాక నాన్నను మంచం మీద పడుకోబెట్టి కాసిని మంచినీళ్లు నెమ్మదిగా తాగించాడు.  సీతమ్మ గారు అమాయక గృహిణి.  భర్తా,  పిల్లాడు రామం తప్ప మరో ప్రపంచం తెలియదు.  రామానికి మొదటిసారి యెవరూ చెప్పకుండానే తన బాధ్యత తెలిసింది. నాన్నను చూసుకోవాలి,  అమ్మను కాపాడుకోవాలి,  అన్నిటికన్నా ముఖ్యం తన వుద్యోగం నిలబెట్టుకోవాలి.

రామంలో బాధ్యతలు మార్పు తెచ్చాయి.  అనవసరంగా వుద్యోగం వదులుకుంటున్నాడు.  తను మూర్ఖుడు.  ఆ రోజు త్వరగా ఆఫీసుకు వెళ్లాడు.  కోటయ్యను పిలిచి తను ముందురోజు పంపిన ఫైలు తిరిగి తెప్పించుకున్నాడు.  డ్రాఫ్టింగ్ నీట్ గా వ్రాసి తిరిగి ఆఫీసరుగారి బల్ల మీద పెట్టించాడు.  రాత్రంతా పడ్డ క్షోభ తొలిగిపోయింది.  హాయిగా వూపిరి పీల్చుకున్నాడు.  భగవంతుడే అతనికి పాఠం నేర్పాడు.  మధ్యతరగతి కుటుంబాలలో జీవితం,  జీతం మనిషి అనబడే నాణానికి రెండువైపులా యెన్నటికీ చెదరని భాగాలే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *