March 19, 2024

*శ్రీ గణేశ చరిత్ర* 81 – 100

రచన: నాగమంజరి గుమ్మా..

 

82.

 

బాలుని మూడవ పిలుపును

ఆలించిన రావణుండు హా వలదన్నన్

నేలందించెను లింగము

జాలిగ చూచిన శివుడు నిజసదన మేగెన్

భావం: బాలుడు మూడవ పర్యాయము కూడా పిలిచేసరికి “వస్తున్నా ఆగు” మని రావణుడు ఎంతగా చెబుతున్నా వినకుండా బాలుడు లింగాన్ని నేలకు దించేసాడు. ప్రాణలింగము లోని శివుడు బయటకు వచ్చి రావణుని ప్రయత్నం విఫలమైనందుకు జాలిగా చూసి, తన ఇంటికి చేరుకున్నాడు.

(భూకైలాస ఆలయం పేరుతో కోల్కతా, తెలంగాణ, కర్ణాటక (గోకర్ణం) లో ఆలయాలు ఉన్నాయి)

 

83.

 

మన్నును తాకిన లింగము

కన్నుల కెదుటే నిలిచెను కదలక, కంటన్

కన్నీరొలికెను రాజుకు

నన్ని ప్రయత్నములు బాసి యాసలు క్రుంగెన్

భావం: నేలపై దించిన లింగము ఎన్నిప్రయత్నాలు చేసినా కదలలేదు. ఆత్మ లింగాన్ని తీసుకువెళ్లాలన్న తన ఆశ అడియాస కాగా రావణుడు కన్నీరు కార్చాడు.

 

84.

 

శంకరుడు చేరె హిమగిరి

లంకకు చేరె నసురుండ లభ్యఫలముతోన్

నింకెరముగ నిజవాసము

శంకర సుతుగూడి సురలు సాగిరి వేడ్కన్

భావం: శివుడు హాయిగా హిమాలయాలకు వెళ్ళాడు. రావణాసురుడు పని విఫలమై లంకకు వెళ్ళాడు. దేవతలందరూ వినాయకునితో సహా సంతోషంగా తమ తమ ఇళ్లకు వెళ్లారు.

 

85.

 

పలువురు నీ పూజవలన

పలునిడుములు దాటి మంచి ఫలితము వడయన్

కలియుగమున మేలొనరగ

వెలసితివి వినాయకుండ విఘ్నములధిపా

భావం: ఎంతో మంది నీ పూజ చేసి తమ కార్యాలలో విఘ్నాలు లేక జయమును పొందారు. ఈ కలియుగంలో అందరి మేలును కాంక్షిస్తూ వెలసినావు వినాయకుడా

 

86.

 

వందనము గజాననునకు

వందనమిదె గరిక పూజ వందితునకునున్

వందనము విఘ్నపతికిని

వందనము లుమా సుతునకు వందనమిడెదన్

భావం: ఏనుగు ముఖం గలిగిన వారికి , గరిక చే పూజించబడే వారికి, విఘ్నాలకు అధిపతి అయిన వారికి, ఉమాదేవి కుమారుడు అయిన గణపతికి నమస్కరించుకున్నాను.

 

87.

 

గంగను భూమికి తెచ్చుట

కుం గాను భగీరధుండు కొలిచెను నిన్నున్

నింగిని జారి శివుని సిగ

పొంగి సగర కొమరుల గతి పొల్పగ సాగెన్

భావం: గంగను భూమికి తెచ్చినపుడు , కార్యం నిర్విఘ్నంగా జరగడం కోసం భగీరథుడు నిన్ను కొలిచాడు. గంగ ఆకాశం నుండి శివుని తల మీదకు, అక్కడ నుండి పాతాళా నికి పయనించి, సగరకుమారులకు ఉత్తమ గతులు కలుగజేసింది.

 

88.

 

పాల సముద్ర మధన వే

ళన్ లంపటులు తొలగంగ లంబోదరునిన్

మేలుగ పూజలు సేసిరి

వేలుపు లుదధి చిలుకంగ విఘ్నము తొలిగెన్

భావం: పాలసముద్రాన్ని చిలికి, అమృతాన్ని తీసుకువచ్చే సమయంలో ఆటంకాలు ఏర్పడగా, విఘ్నేశుని పూజించిరి. ఆటంకాలు తొలిగి అమృతము లభించెను

 

89.

 

బాహుద నది తీరమ్మున

వాహితముగ కాణిపాక ప్రాకారమునన్

ఈహితములు నెరవేర్చుచు

సాహస్ర వివాదములకు సాక్షివి సుమ్మీ

భావం: బాహుదా నదీ తీరంలో బావిలో వెలసిన శ్రీ కాణిపాకం ఆలయంలో భక్తుల కోర్కెలు తీర్చుచున్నావు. వివాదాలు వచ్చినపుడు కాణిపాకం ఆలయంలో ప్రమాణాలు చేసి నిజం నిరూపించుకుంటారు. ఆ విధంగా అనేక వివాదాలకు కాణిపాక గణపతి సాక్షిభూతుడవుతున్నాడు.

 

90.

 

ఇరువది యొక్క గణేశుల

కరుణయె మనపై కురియగ కలియుగమందున్

వెరపేటికి విఘ్నమునకు

శరణాగతి నాకు నీవె శరణు గణేశా

భావం: గణపతి సమూహంలో 21 గణపతులు ఉంటారని ప్రతీతి. వారందరి కరుణ మనపై ప్రసరిస్తూ ఉండగా పనిలో ఆటంకాలు ఎదురవుతాయని భయం అవసరం లేదు. నేను ఎల్లప్పుడూ శ్రీ గణేశుని శరణు వేడుతూ ఉంటాను.

 

91.

 

అంగారకునకు విద్యల

బంగారుగ నేర్పినట్టి బాలగణేశా

మంగళమూర్తివి నేర్పున

మంగళు గాచిన వరదుడ మానసవంద్యా

భావం: కుజుడు లేదా మంగళునికి గణేశుడు విద్యాబుద్ధులు నేర్పించాడు. కనుకనే చాలా గణేశ దేవాలయాల్లో మంగళవారం నాడు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంకష్టహర చతుర్థి మంగళవారం కలిసి వస్తే , ఆరోజు పూజలు చేయిస్తే, ఋణ విమోచనం అని కూడా ప్రతీతి.

 

92.

 

రక్కసి మూకల మాయలు

ముక్కలు చేయు కొరకై నముచిసూదనుడున్

చక్కెర విలుకాడు కదిలి

చక్కగ నీ పూజ చేసి చాతుర్యమునన్

 

భావం: రాక్షసుల మాయలు తొలగించడానికి, వారిని సంహరించడానికి ముందు ఇంద్రుడు, మన్మధుడు కూడా నీ పూజచేసారు. (తర్వాతి పద్యంతో అన్వయం)

నముచిసూదనుడు: నముచి అనే రాక్షసుని చంపిన ఇంద్రుడు.

చక్కెర విలుకాడు: మన్మధుడు

 

93.

 

శంబర వృతాది యసురుల

నాంబూడిద సేయు వేళ నాశ్రితులకునున్

యింబడరగ తోడుపడిన

అంబాసుత నీకు సాటి అర్చితుడేడీ

భావం: శంబరుని సంహరించడంలో ప్రద్యుమ్నునకు (మన్మధుడు) , వృత్తాసుర సంహారం చేయునపుడు ఇంద్రునకు ఆటంకములు తొలగించి , సహాయపడిన విఘ్నేశా మిమ్ము మించిన దేవతలు ఇంకెవరున్నారు?

 

94.

 

భండాసుర గర్వమణచ

చండిక చేబూనె శక్తి సమధిక యుక్తిన్

దండెత్తెను రక్కసుపై

అండగ విఘ్నేశ యంత్ర మసురుని గూల్చెన్

భావం: భండాసురుడు అనే రాక్షసుడు లోకాలను బాధించగా, అమ్మవారు మహావిఘ్నేశ యంత్ర సహాయంతో ఆ రాక్షసుని సంహరించింది.

 

95.

 

ఏ కార్యమైనను తొలుత

శ్రీకరముగ నీదు పూజ సేసిన చాలున్

నీ కరుణ జూపి విఘ్నము

లేకనె కార్య ఫలమిచ్చి లీలలు జూపున్

భావం: ఏపని అయినా నీ పూజ చేసి మొదలు పెడితే చాలు నీ ఆశీర్వాదం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యం సఫలమవుతుంది.

 

96.

 

హాలాహల బిందువొకటి

కోలాహలముగ సముద్ర కుహరము చేరన్

పాలకడలి నురుగులుమిసె

వేలుపులందరు నలువను వెరపున జేరెన్

భావం: అమృతం కొరకు పాల సముద్రం చిలికినపుడు హాలాహలం పుట్టింది. దానిని పరమేశ్వరుడు స్వీకరించాడు. కానీ ఒక బిందువు పొరపాటున పాల సముద్రంలో పడింది. పాలసముద్రంలో నురుగులు రావడం చూసిన దేవతలు ఏమిటి ఈ విపరీతమో అర్ధం కాక బ్రహ్మ దగ్గరకు పరుగెత్తారు.

 

97.

 

ఫేనము నందలి గరళము

సూనము నయ్యె చపలములు సుడివడిపోవన్

ఏనుగుమొగపు కొలుపు తన

యానతి చేతను నిలిపెను హాలాహలమున్

భావం: నురుగులో ఉన్న విషం సముద్రంలో ఉన్న జీవులకు మృత్యువు అవడం చేత అవన్నీ మరణిస్తున్నాయి. అప్పుడు గజముఖుడు ఆ నురుగును (విషమును) వ్యాపించకుండా ఆనతి ఇచ్చాడు.

 

98.

 

ఎటుపోయిన కటువయ్యెను

ఎటులైనను దీని బాపి ఎడ్డమి తీర్చన్

తటి జేర్చెను విఘ్నేశుడు

విటపము శ్వేతార్క ముద్భవించెను పుడమిన్

భావం: ఆ నురుగును ఎటు తీసుకువెళ్లినా అటు వైపు కల్లోలం చేస్తోంది. జాగ్రత్తగా ఆ నురుగును ఒడ్డుకు చేర్చాడు విఘ్నేశ్వరుడు. నేల తగిలేసరికి ఆ విషం ఒక మొక్కగా మారింది. అదే శ్వేతార్కం, తెల్ల జిల్లేడు మొక్క అయినది.

 

99.

 

శ్వేతార్కము విషహారిణి

శ్వేతాంబరు రూపు వెలసె వేరుకు మొదటన్

జాతక దోష నివారణ

నూతన గృహ హోమమందు నుఱిమెను సమిధై

 

భావం: విషం నుంచి పుట్టిన జిల్లేడు విషం తీసేసే శక్తి కలిగింది. ఆ వేరుకు మొదట విఘ్నేశ్వరుని రూపు నిలిచిఉంటుంది. జాతక దోషాలను తొలగించడానికి, నూతన గృహప్రవేశ సమయంలో చేసే హోమాలలో అర్క సమిధలు వేస్తారు. జిల్లేడు గింజ నీటి బొట్టు ఆకారంలో ఉంటుంది. పై నుంచి పడిన బిందువుకు తార్కాణంగా…

 

100.

 

విఘ్నేశుని దయ చేతను

విఘ్నమ్ముల నధిగమించి విశ్వములోనన్

నిఘ్నుడనై వర్తించెద

నగ్ని ముఖమ్ము నని పలికె నర్కము స్థితమై

భావం: విఘ్నేశుని దయచేత నేను ఈ రూపున నిలిచేను. అందుచేత ఏ విఘ్నాలైనా సరే నేను లొంగి ఉంటాను అని జిల్లేడు అగ్ని సాక్షిగా నిశ్చయించి పలికింది. నిఘ్నుడు: లోకువ అయినాడు స్థితము: నిశ్చయింపబడినది, ప్రతిన చేయబడినది

 

1 thought on “*శ్రీ గణేశ చరిత్ర* 81 – 100

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *