March 19, 2024

సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

రచన: రవీంద్ర కంభంపాటి

శైలజ ఇంటికి వచ్చి, బయట చెప్పులు విప్పుకుంటూంటే, ఇంట్లో నుంచి అత్తగారి మాటలు వినిపిస్తున్నాయి. ‘అవును.. శైలజ కి కూడా అమెరికా కి వీసా వచ్చింది.. ఊహూ.. అఖిల్ కి డిపెండెంట్ గా కాదు.. వాళ్ళ కంపెనీ వాళ్ళే చేయించేరు.. ఒకవేళ వీసా రాకపోయినా ఊరుకోడుగా.. తన డిపెండెంట్ గానైనా తీసుకుపోతాడు ‘ అంటూ ఆవిడ ఎవరితోనో చెప్పుకుపోతూంది.
లోపలికి వచ్చిన శైలజ ని చూసి, ‘పాపం వాడు ఇంకా ఆఫీస్ లోనే ఉన్నాడా ?’ అని, శైలజ బదులు చెప్పబోయేంతలో ‘ఏమిటో కష్టమైన ప్రాజెక్టులు అన్నీ వాడికే ఇస్తారు ‘ అంటూ మళ్ళీ ఆ ఫోన్ సంభాషణలోకి వెళ్ళిపోయింది.
శైలజ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెషయ్యి, వంటపని మొదలెట్టింది. ఈవెనింగ్ వాక్ ముగించుకుని మావగారు వచ్చినట్టున్నారు, హాల్లో టీవీలో రాజకీయ చర్చల సౌండు విని శైలజ అర్ధం చేసుకుని, గబగబ కాఫీ కలిపి ఆయన చేతికిచ్చి, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది.
బెండకాయలు తరుగుతూ ఆలోచనలో పడింది ‘ఇద్దరూ ఒకే కంపెనీ లో పని చేస్తున్నారు. ఇద్దరికీ కంపెనీ అమెరికా వీసా చేయించింది. ఇద్దరిలోకీ ముందు అఖిల్ వీసా అపాయింట్మెంట్ వచ్చింది.. అప్పుడు కూడా ఇంతే.. “వీడు బాగా కష్టపడి పనిచేస్తాడని వీడి కంపెనీ వాళ్ళు ఆ అమెరికా వాడికి చెప్పి ఉంటారు.. అందుకే వీడికి ముందుగా అపాయింట్మెంట్ దొరికింది ” అనేసిందావిడ. చిత్రం ఏమంటే అఖిల్ కూడా ‘అలా కాదమ్మా’ అని చెప్పడు ! త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తే, తన ప్రాజెక్ట్ ఈజీ ప్రాజెక్ట్ అని వీళ్ళసలు ఎలా నిర్ణయించేస్తారు ? అఖిల్ అరగంట లో రాయాల్సిన కోడ్ గంటన్నర సేపు రాస్తాడు.. మధ్యమధ్యలో ఇంటర్నెట్ సైట్లు చూస్తూ, అన్ని రకాల వార్తలు, సినిమా రివ్యూలు చదువుతూ పని చేస్తే, ఐదింటికి అవ్వాల్సిన పని రాత్రి తొమ్మిదింటికి అవుతుంది.. మళ్ళీ ఇంటికి వచ్చి, “చాలా టఫ్ కోడ్.. ఏమిటో అంతా నా నెత్తి మీద పడేస్తారు” అంటూ బిల్డప్ ఒకటి! ‘
ఇంకో రెండు మూడు నెలల్లో ఇద్దరూ అమెరికా ప్రయాణం చేయాల్సి ఉంది. అదృష్టం ఏమంటే, ఇద్దరి ప్రాజెక్టులూ చికాగో పరిసరాల్లోనే ఉన్నాయి కాబట్టి, ఒకే ఊళ్ళో ఉండొచ్చు, కలిసి ఉండడానికి ప్రాజెక్ట్ మారాల్సిన పని లేదు.
ఇంతలో అఖిల్ నుంచి ఫోన్, ‘ఇందాక మా మేనేజర్ చెప్పేడు.. టూ వీక్స్ లో ట్రావెల్ చెయ్యాలట.. క్లైంట్ సైట్ లో ఎవరో రిజైన్ చేసేరు.. అతన్ని రీప్లేస్ చెయ్యడానికి ఇమ్మీడియేట్ గా ట్రావెల్ చెయ్యాలి ‘ అంటూ చెబుతూండగానే, అత్తగారు కిచెన్ లోకి వచ్చేరు.
‘ఏవంటున్నాడు వాడు? పాపం ఇంకా ఆలస్యమవుతుందటా ?’ అని ఆవిడ అడిగితే శైలజ విషయం చెప్పింది. వెంటనే ఆవిడ మొహం వెలిగిపోయి, ‘ వాడి కష్టం ఊరికే పోదని ఎప్పుడూ చెబుతూంటాను కదా.. నేనన్నదే నిజమైంది.. చూసేవా ముందు వాడినే అమెరికా పంపిస్తున్నారూ ‘ అంటూ ఆవిడ చెప్పుకుపోతూంటే, హాల్లోంచి మావగారు ‘అవున్నిజమే.. వాడిది చిన్నప్పటి నుంచీ అలా కష్టపడి పనిచేసే తత్త్వం.. ‘ అంటూ మొదలెట్టేరు.
వీళ్ళకి చెప్పినా అర్ధంకాదు,కాబట్టి విని ఊరుకోవడమే మంచిది.. మనకి టైం వచ్చినపుడు ఇచ్చుకుందాం అని మనసులో అనుకుంది శైలజ.
ఆ రాత్రి అఖిల్ ఇంటికి రాగానే, అతని తల్లిదండ్రులు తెగ సందడి చేసేసేరు. చుట్టాలందరికీ ఫోన్లు చేసి అమెరికా ప్రయాణం గురించి చెప్పడం మొదలెట్టేరు.
అసలు తను అఖిల్ కన్నా ముందు ట్రావెల్ చెయ్యాల్సింది, కానీ అతని ప్రాజెక్ట్ డిలే అవుతూందని తెలిసి,తన మేనేజర్ ని రిక్వెస్ట్ చేసి, ఇద్దరూ కలిసి ఒకేసారి వెళ్ళేలా తన ట్రావెల్ పోస్టుపోన్ చేయించుకుంది. ఈ విషయం అఖిల్ కి తెలుసు కానీ ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, అతను చెప్పనప్పుడు తను చెబితే బాగుండదని శైలజ కూడా ఊరుకుంది. అతని గురించి తల్లిదండ్రులుగా సంతోషపడడం మంచిదే… కానీ రాజు భార్య మంచిదన్నట్టు, మాటిమాటికీ తనని అన్యాపదేశంగా టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడడం నచ్చడం లేదు. వీళ్ళకి చెప్పినా అర్ధంకాదు,కాబట్టి విని ఊరుకోవడమే మంచిది.. మనకి టైం వచ్చినపుడు ఇచ్చుకుందాం అని మనసులో అనుకుంది శైలజ.
రాత్రి పడుకునే ముందు చెప్పింది అఖిల్ తో, ‘నేను కూడా మా మేనేజర్ ని రిక్వెస్ట్ చెయ్యనా ? నేను ట్రావెల్ చెయ్యడానికి రెడీగా ఉన్నానని ?’
‘వద్దు.. ఓ రకంగా ఇదీ మంచిదే.. నేను వెళ్ళి మనకి ఇల్లు, కారు సెట్ చేసి ఉంచుతాను.. నువ్వు టూ మంత్స్ లో వచ్చేసేయి ‘ అన్నాడు.
శైలజ కి ఇది కరెక్ట్ గానే తోచింది, పోన్లే ఇద్దరం వెళ్లి కష్టపడేకన్నా, తను ముందే వెళ్లి ఇల్లూ అవీ చూసి ఉంచడం మంచిదే అనుకుంది.
మర్నాడు మధ్యాహ్నం శైలజకి అఖిల్ మెసేజ్ చేసేడు ‘ఇవాళ మా మేనేజర్ బాంబ్ వేసేడు.. అక్కడ ఎవరైతే రిజైన్ చేసేడో, అతను రెజిగ్నేషన్ వెనక్కి తీసుకున్నాడట.. నేను ట్రావెల్ చెయ్యడానికి ఇంకో త్రీ మంత్స్ పడుతుందట ‘
వెంటనే శైలజ ఫోన్ చేసింది ‘అయ్యో.. అలాగా ? నేనింకా నీకు ఇప్పుడే హ్యాపీగా ఫోన్ చేద్దామనుకుంటున్నాను.. మా మేనేజర్ నన్ను ఈ నెలాఖరుకి ట్రావెల్ చెయ్యమన్నాడు.. పోనీ నేను కూడా నా ట్రావెల్ పోస్ట్ పోన్ చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యనా ?’
‘వద్దు.. నువ్వు వెళ్ళి, అక్కడ ఇల్లు అన్నీ సెట్ చేసి ఉంచు.. అప్పటికి నేను వచ్చేస్తాను.. పైగా ఇద్దరిలో ఎవరో ఒకరు అక్కడ ఉండడం మొదలెడితే, ఎంతో కొంత డబ్బులు సేవ్ చెయ్యొచ్చు కదా ‘ అని అఖిల్ అంటే సరేనని ఒప్పుకుంది శైలజ !
అఖిల్ కన్నా తను ముందు అమెరికా కి వెళ్తూంది.. ఇవాళ మరి అత్తగారు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనుకుంటూ, “అప్నా టైం ఆగయా” అని పాడుకుంటూ ఇంటికి వెళ్ళిన శైలజకి, ‘ఏం చేస్తాం.. కలికాలం.. కష్టపడి పనిచేసేవాళ్ళకి రోజులు కావు.. మా కోడలి దిష్టే వాడికి తగిలేసుంటుంది.. అందుకే వాడి అమెరికా ప్రయాణం వాయిదా పడింది ‘ అంటూ అత్తగారు ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించేయి !

5 thoughts on “సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

  1. అబ్బ! ఏం బతుకు బాబూ, ఈ శైలజది? నేనే అయితేనా, …..
    రచయిత మాత్రం బాగా రాశారు ఆ డబ్బా మనుషుల గురించి, శైలజతో కలిపి.

  2. సున్నితమైన పాయింట్. చాలా బావుంది. శైలజ కి టైం వచ్చే అవకాశం లేనట్టే. ఒకవేళ వచ్చినా అర్ధం చేసుకునేవారేరి

  3. అత్తా, కత్తీ మెత్తగా ఉండవు, పైగా అత్తనే కత్తికి రెండు వైపులా పదునే..

  4. అప్నా టైం ,అభీ నహీ అభీ నహీ కథ.
    సాఫ్ట్వేర్ కాకపోయినా బాధ్యత పక్కవారికి నెట్టేసేవారు ఎప్పుడూ వుంటారు.
    రంగుటద్దాల్లో చూసేవారు తమ దృష్టి కోణం మార్చుకోరు .

  5. ఎంతచదివినా అత్తవారింట అప్పలమ్మే! పాపం కదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *