March 4, 2024

ధృతి పార్ట్ – 12

రచన: మణి గోవిందరాజుల

కాలేజీ వార్షికోత్సవ వేడుకలు దగ్గరికొస్తున్నాయి. ఇదే ఇక ఆఖరు సంవత్సరం అని ధృతి కూడా అన్నిట్లో ఉత్సాహంగా పేరు ఇచ్చింది. క్లాస్మేట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ చేసిన డ్యాన్సే మళ్లీ చేయమని వెంటపడ్డారు. కాని ధృతికి అందరికీ గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ప్రదర్శన ఇవ్వాలని ఉన్నది. ఎప్పటిలానే స్పోర్ట్స్ ఒక రోజు, మధ్యలో ఒక రోజు రెస్ట్ ఇచ్చి కల్చరల్ ఆక్టివిటీస్. కాలేజీ మొత్తం వెల్ నోటెడ్ అయిన ధృతికి ఇది అఖరి పెర్ఫార్మెన్స్ అని కాలేజీ మొత్తం చర్చనీయాంశం అవడమే కాక, అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూడసాగారు.
దక్షకు ఇది చాలా కంటగింపుగా మారింది. ఈ ఒక్క సంవత్సరంతో ధృతి చదువు అయిపోతుంది. తనకు పోటీ ఉండదని ఆనందంగా ఉందాము అంటే తండ్రి వల్ల ఆ ఆనందం కాస్తా ఆవిరి అయిపోతున్నది. ధృతి చదువు ఎప్పుడు అయిపోతుందా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మొన్నీ మధ్య మాటల్లో మళ్లీ చెప్పాడు ఈ సంవత్సరం ఎలాగైనా వెళ్ళి అడుగుతాను అని. చదువు కాకపోతే కాలేజీలో, చదవయ్యాక ఇంట్లో నాకీ పోరు తప్పేట్లు లేదు” కసిగా అనుకున్నది దక్ష. కోపంలో నుండి వచ్చే ఈర్ష్య అసూయలకు విచక్షణా జ్ఞానం ఉండదు. “ఈ పోరు తప్పాలంటే ఏదో చెయ్యాలి. ఏదన్నా చేసెయ్యాలి. ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలి?” ఆలోచనలో పడిన దక్షకు ఏదో ఐడియా వచ్చినట్లుగా పెదవుల మీదకు ఒక కౄరమైన నవ్వు చేరింది.
“అమ్మా! ఈ సంవత్సరం నాకు ఆఖరు. నాలుగేళ్ళు తెలీకుండానే గడిచిపోయాయి. ఏదో కాస్త మంచిపేరు కూడా తెచ్చుకుని మీకు పేరు తెచ్చాను. బి ప్రౌడ్ మాం… అన్నట్లు ఏదో నాకు పెళ్ళి చేసి పంపిస్తే మీ పని అయిపోతుంది” వంటింట్లో తల్లి దగ్గర కూర్చుని కబుర్లు చెప్తున్న ధృతి లోపలికి వస్తున్న ఆర్తి కార్తీలను చూసి కన్ను కొట్టింది చిలిపిగా.
“పోవే నువ్వూ నీ కబుర్లూనూ… ఇందాక మేము మాట్లాడుకున్న మాటలు విన్నావని నాకు అర్థమయిందిలే. ఏమి చేస్తాం చెప్పు? ఈడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే తలితండ్రులు అదే ధ్యాసలో ఉంటారు”
“అమ్మా! నువేమీ కంగారుపడకు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది. ఎలా జరగాలో అలా జరుగుతుంది ఆ దేవుడి నిర్ణయం చేసే పంపుతాడు. ఆ నిర్ణయాన్ని కాదనడానికి మనమెవరం? అంతా ఆ దేవుని దయ” పైకి చేతులు చూపిస్తూ దండం పట్టింది.
“నీ కోతి వేషాలు చాల్లే… “
“కోతి వేషాలు కాదు. నేను ఓకే చెప్పేలోపల నా పెళ్ళి గురించి మీరు ఆందోళన పడితే నా మీద నాకే డౌట్ వస్తున్నది. ఇంకా అలాగే ఆలోచిస్తే ఇక్కడితో చదువు ఆపేసి మీరు చూసిన వాడితో తాళి కట్టించుకుంటాను. ఇక చదువూ, గిదువూ ఏమీ ఉండదు. హాయిగా ఇంట్లో కూర్చుంటాను. మీకెలా ఇష్టమైతే అలా”
“అదేంటే అంత మాట అనేసావు?”
“అమ్మా! అందుకే చెప్తున్నాను. నేను ఎమ్మెస్ చేసాక ఆలోచించండి. అప్పటి వరకు వద్దు. నాకేమి కావాలో నాకు తెలుసు. అయినా నన్ను చేసుకోబోయేవాడు నన్ను వెతుక్కుంటూ రావాలి కాని మనం వెతుక్కోవటం ఏంటమ్మా?” అల్లరిగా నవ్వింది.
“ఎవరన్నా…” కంగారుగా అడిగింది పూర్ణిమ.
తల్లి భయానికి నవ్వొచ్చింది. “అమ్మా! భయపడకు. అలాంటిదేమీ లేదు. అన్నట్లు అమ్మా! మంచి డ్యాన్స్ చెప్పు. మళ్ళీ కాలేజీ ఆన్యువల్ డేకి చేయాలి. ఇదే ఆఖరని స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు” మాట మార్చింది.
ఆర్తీ కార్తీ కొత్తగా వచ్చిన సినిమాల్లోని పాటల గురించి చెప్పారు. అక్కడే ఉన్న పనిమనిషి, అప్పుడే వచ్చిన దినేష్ ఏవో చెప్పారు. కానీ ఏవీ అంతగా నచ్చలేదు ధృతికి. “విశ్వనాధ్ సినిమాలు నీకు చాలా ఇష్టం కదా? అందులో నుండి ఏవన్నా తీసుకుని చేయి” అన్నది పూర్ణిమ.
“నిజమే సప్దపది అన్నీ డాన్స్ పాటలే. అందులో నుండి రెండు మూడు పాటలు తీసుకుని ప్రాక్టీస్ చేస్తాను” ఫైనల్ గా డిసైడ్ అయింది.
“ఉండు… బామ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి” ఫోన్ అందుకుంటూ అన్నది.
“ట్రింగ్… ట్రింగ్” కాలింగ్ బెల్ మోగింది.
“ఈ టైం లో ఎవరు?” అనుకుంటు వెళ్ళి తలుపు తీసిన ధృతి “సర్! మీరా?!!!” అన్నది ఆశ్చర్యంగా.
“లోపలికి రానా?” అడిగారు శేఖరంగారు చిరునవ్వుతో.
బయటి మాటలు విని వచ్చిన దినేష్, పూర్ణిమ వచ్చిన వారెవరో తెలీకపోయినా ధృతి ఎక్స్ ప్రెషన్ చూసి, ఆయన అడిగిన విధానం చూసి…ఎవరో ధృతికి తెలిసిన వాళ్ళై ఉంటారని అనుకున్నారు.
“అయ్యో! లోపలికి రండి. కూర్చోండి సర్…” మర్యాదగా లోపలికి పిలిచి సోఫా ఆఫర్ చేసింది. “నాన్నా వీరు మా కాలేజీ ఫౌండర్ రాజశేఖరం గారు. సర్… మా అమ్మా, నాన్నా” పక్కనే మొహమాటంగా నిల్చున్న తమ్ముణ్ణీ చెల్లెల్నీ పిలిచింది. “వీళ్ళిద్దరూ మా తమ్ముడూ చెల్లి. నా ప్రాణాలు” ఆయన ఎందుకు వచ్చారో అర్థం కాక, ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటూ, ఎందుకో అలా చెప్పేసింది.
డ్రైవరు పెద్ద పళ్ళ బుట్ట తీసుకుని లోపలకు వచ్చాడు.
“తీసుకోమ్మా… మన తోటలోవే” చెప్పాడు పూర్ణిమతో.
“ఎలా జరుగుతున్నదమ్మా… మీ ప్రాక్టీస్? ఈ సారి నీ పెర్ఫార్మెన్స్ గురించి కాలేజీ మొత్తం ఎదురు చూస్తున్నదని విన్నాను. మీ అమ్మాయి మా కాలేజీకే పెద్ద అస్సెట్” మెచ్చుకున్నారు.
ఏమి మాట్లాడాలో తెలియక నవ్వి ఊర్కున్నాడు దినేష్.
“మీరు మాట్లాడుతుండండి. నేను కాఫీ కలుపుకుని వస్తాను” లేచి జనాంతికంగా చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది పూర్ణిమ.
అక్కడ ఎవరికీ అర్థం కావటం లేదు ఆయన ఎందుకొచ్చారో.
“ఏదో చేస్తూనే ఉన్నాను. కానీ డాన్సే ఇంకా డిసైడ్ అవలేదు సర్. అవే మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము”
“నువ్వేది చేసినా అది బెస్ట్ అవుతుంది” రావడం అయితే వచ్చారు కానీ అసలు సంగతి ఎలా ఎత్తాలో అర్థం కావడం లేదు. “మీ కుటుంబాన్ని చూస్తే ముచ్చటగా ఉన్నది. అందమైన, కుదురైన ఫామిలీ” పూర్ణిమ ఇచ్చిన కాఫీ అందుకుంటూ అన్నారు.
అక్కడున్న అందరికీ అది ఇబ్బందిగానే ఉన్నది. అంత గొప్పాయన ఇంటికొచ్చారు. కంగారుతోటే సగం మాట పెగలటం లేదు. “మా ధృతి మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుందండీ” అన్నాడు దినేష్.
“మీతో ఒక విషయం మాట్లాడదామని నేను వచ్చాను. నేను మీ ధృతిని మొదటి సంవత్సరం చూసినప్పటినుండి ఇప్పటివరకు గమనిస్తూ వచ్చాను. అందం, అణకువ, గొప్ప వ్యక్తిత్వం కలబోత మీ అమ్మాయి” దినేష్ పూర్ణిమల వదనాలు కాంతి పుంజాలయ్యాయి, కూతురి గురించి అంత గొప్ప వ్యక్తి మెచ్చుకుంటుంటే.
“నాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి మన కాలేజీలోనే బీఈ మూడో సంవత్సరం చదువుతున్నది. నాకు ఈ కాలేజీ కాక ఇతరత్రా కొన్ని వ్యాపారాలున్నయి. అన్నీ కూడా మంచిగానే రన్ అవుతున్నాయి” తెల్లమొహమేసాడు దినేష్. “పొద్దున్న పొద్దున్నే ఈయనకి ఏమైంది?మా ఇంటికి వచ్చి ఆయన కుటుంబ వివరాలు, ఆస్తి వివరాలు చెప్తున్నాడు?”
“మీ అమ్మాయికి ఒక గొప్ప కార్పోరేటర్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నాయి”
“ఓహో!! ఉద్యోగం ఆఫర్ చేస్తున్నారేమో. మరి నా కూతురా మజాకానా?” పూర్ణిమ మనసులో సంతోషపడింది.
“నేను ఎందుకు వచ్చానో అర్థం కాక మీరు ఆలోచనలో పడ్డట్లున్నారు. అసలు సంగతి చెప్తాను. నా వ్యాపార సామ్రాజ్యాన్నంతా మీ అమ్మాయి చేతుల్లో పెట్టి నేను విశ్రాంతి తీసుకుందాము అనుకుంటున్నాను”
దినేష్ అయోమయంలో పడ్డాడు. “నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదండీ మీరేమమంటున్నారో? చిన్నపిల్ల… అంత పెద్ద బాధ్యత నిభాయించలేదేమో… అయినా ఇప్పుడే ఉద్యోగం చేయనంటోంది. పై చదువులకు వెళతానంటొందండీ”
శేఖరంకి కూడా తాను కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేదు అనిపించింది. “దినేష్ గారూ. నేను మీ అమ్మాయికి జాబ్ ఆఫర్ ఇవ్వడం లేదు. మా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తున్నాను. మా అబ్బాయి అని చెప్పుకోవడం కాదు కాని, చాలా బుద్ధిమంతుడు. ఇంతవరకు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. నేను ధృతిని గమనిస్తున్నకొద్దీ మా ఇంటి మహలక్ష్మి ఈ అమ్మాయే అని నా మనసు పదే పదే చెప్తున్నది” వింటున్న ముగ్గురూ బిగుసుకు పోయారు.
“మీరు ఇప్పుడే నాకు ఏమీ చెప్పనవసరం లేదు. ఆలోచించుకున్నాకే మీ అభిప్రాయం చెప్పండి. సెలవు మరి” లేచాడు శేఖరం.
షాక్ నుండి తేరుకోని దినేష్ మౌనంగా లేచి ఆయన్ని గేటు దాకా సాగనంపి వచ్చాడు.
లోపలికి వచ్చేవరకు కూడా ఇంకా పూర్ణిమ తేరుకోలేదు. ధృతి టీవీ పెట్టుకుని కూర్చుంది. ఆర్తీ కార్తీ ఏదో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.
“పూర్ణీ!” పిలిచాడు దినేష్.
“ఏమండీ ఎంత మంచి సంబంధం మన ధృతికి? నేను అస్సలు ఊహించలేదు.ధృతీ నువ్వన్నట్లే అయిందేమే. ఇందాకే అంటున్నదండీ… వాళ్లే వస్తారు నన్ను వెతుక్కుంటూ. అన్నట్లే వచ్చారు” సంతోషంగా అన్నది . పూర్ణిమ ఒక సగటు ఇల్లాలు. అందుకే అలా సంతోషపడుతున్నది.
ధృతి ఏమీ జరగనట్లే మామూలుగా కూర్చొని టీవీ చూస్తున్నది. కాలేజీలో జరిగే ప్రతి సంఘటనా రోజూ తల్లికీ తండ్రికీ ఇద్దరికీ చెప్తుంది. ఆ విధంగానే వాళ్ళకు ఫౌండరు కూతురు దక్ష గురించి కూడా చెప్పేది. ఆ సంగతులు దినేష్ కి బాగా గుర్తున్నాయి.
“ఆయన కూతురు సంగతి తెలిసి కూడా అలా ఎలా సంతోష పడుతున్నావు పూర్ణా?” ఆశ్చర్యంగా అడిగాడు దినేష్.
“పెళ్ళైవెళ్ళే పిల్ల ఎలా ఉంటే మనకెందుకు? ఆ తర్వాత అంతా ధృతి చూసుకుంటుంది కదా?” నాలుక చప్పరించింది పూర్ణ.
“నా కూతుర్ను అక్కడికి పంపే ప్రసక్తే లేదు” కచ్ఛితంగా అన్నాడు దినేష్.
అప్పటివరకు మౌనంగా ఉన్న ధృతి తండ్రి మాటలు వినగానే థమ్స్ అప్ చూపించి నవ్వింది.
“ఇంకేమి? తండ్రీ కూతుళ్ళు ఒకటయ్యాక చేసేదేమున్నది?” నిష్టూరంగా అన్నది పూర్ణిమ. “అయినా ఇప్పుడు వద్దంటే ఆయనకు కోపం వస్తేనో?” మనసులో ఉన్న అనుమానం బయట పెట్టింది పూర్ణిమ.
“అలా ఏమీ జరగదు అమ్మా? అవతలి వాళ్ళ వ్యక్తిత్వం గౌరవించే వాళ్ళు అంత చీప్ గా ప్రవర్తించరు” ప్రశాంతంగా అన్నది ధృతి.
“ఆయన సమయం తీసుకోమన్నారు కదా? ఈ సంవత్సరం అయ్యాక ఏ సంగతీ చెప్తామని టైం తీసుకుందాము” అన్నాడు దినేష్. కాసేపు వాళ్ళిద్దరూ ఎలా చెప్పాలి అన్నది డిస్కస్ చేసుకున్నారు. ధృతి వాళ్ళ సంభాషణలో కల్పించుకోలేదు. ఆర్తీ,కార్తీలను తీసుకుని లోపలకు వెళ్ళింది.
ఆ రాత్రి విశ్వకు జరిగినదంతా మెసేజ్ చేసింది. “ఒప్పుకుంటావా?” కంగారు పడ్డాడు విశ్వ.
“అంతటి వాడు వచ్చి అడిగితే కాదంటే బాగుండదు కదా?” కొంటెగా బదులిచ్చింది.
“చీటింగ్ ఇది… నువు నీ చదువయ్యేదాకా ఎవరికీ కమిట్ అవనన్నావు. మాట తప్పుతున్నావు” కినుకగా అన్నాడు.
“మాటెక్కడ తప్పాను? నా చదువయ్యాకే యెస్ అంటాను” మరింత ఉడికించింది.
కొద్దిసేపు అటునుండి ఏమీ సమాధానం రాలేదు. “హల్లో” పింగ్ చేసింది ధృతి. “ఏంటి సైలెంట్ అయ్యావు?”
“ఏమీ లేదు. ఇండియాకు టికెట్స్ చూస్తున్నాను. డైరెక్ట్ గా వచ్చి వాళ్ళతోనే తేల్చుకుంటాను” బదులిచ్చాడు విశ్వ.
“అయ్యా! తొందరపడకు మహానుభావా… నా మనసులో ఏమీ లేదు. ఊర్కెనే అన్నాను. హాయిగా ఆఫీసుకు వెళ్ళు. ఓకే గుడ్ నైట్” చెప్పేసి ఫోన్ పక్కన పడేసింది నవ్వుకుంటూ.

*********

మర్నాడు కాలేజీకి వెళ్ళాక శేఖరంగారు వచ్చారని తెలుసుకుని వెళ్ళి కలుసుకున్నది. “సర్ మీతో కొంచం మాట్లాడాలి. పర్మిషన్ ఇస్తారా?” రిక్వెస్ట్ చేసింది.
“ష్యూర్ అమ్మా!… ఇక్కడేనా గార్డెన్ లోకి వెళ్దామా?” ప్రసన్నంగా అడిగారు.
“పర్లేదండీ… ఇక్కడయినా…” చుట్టూ చూసింది. ప్యూన్ కాక, ఇంకో స్టాఫ్ ఉన్నారు. వాళ్ళిద్దరి వేపూ వెళ్ళమన్నట్లుగా చూసారు. వాళ్ళకు ఇది అలవాటే. ఎప్పుడూ ఏదో ఒక సమస్య తీసుకొచ్చి అది పరిష్కారమయ్యేదాకా తిరుగుతుంది ధృతి. అందుకే వాళ్ళు కూడా ధృతిని పలకరించి బయటకు వెళ్ళిపోయారు.
“ఇప్పుడు చెప్పమ్మా”
“సర్! నిన్న మీరు చెప్పిన విషయం గురించి” కాస్త మొహమాటంగా అన్నది.
“పర్లేదమ్మా ఏదైనా సరే భయపడకు” చెప్పమని ప్రోత్సహించారు.
“కారణాలు చెప్పలేను. మీ అంతటివారొచ్చి అడిగితే కాదనడం సాహసమే అవుతుంది. అలాగని నన్ను నేను మోసం చేసుకుని అవును అనలేను. ఐయాం సో సారీ… మిమ్మల్ని కాదంటున్నందుకు”
ఒక నిరాశా వీచిక కదలాడింది శేఖరం మనసులో. ఇప్పుడే చేసుకోను అంటుందేమో అనుకున్నారే కాని పూర్తిగా వద్దంటుందని అనుకోలేదు.
“తొందర పడకమ్మా. మీ పేరెంట్స్ తో ఆలోచించావా?”
“లేదండీ… కానీ నాకు ఆ స్వాతంత్ర్యం ఉన్నది. నా ఇష్టానికి వ్యతిరేకంగా దేనికీ ఒత్తిడి చేయరు”
తల్లి మనసులోని అనుమానం చెప్దామా అనుకున్నది ఒక్క క్షణం. మళ్లీ వద్దులే అని తల విదిలించుకుని లేచి నిలబడింది. “వస్తానండి. మరి సెలవా?” లేచి వినయంగా నమస్కారం చేసి బయటకు నడిచింది.
దీని పర్యవసానం ఏంటో కాలమే నిర్ణయించాలి….

********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *