May 26, 2024

పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

రచన: డా. వివేకానంద మూర్తి

ఎవరన్నారో, ఎందుకన్నారో తెలీదుగానీ, అలా నోరు నెప్పిజేసి దవళ్ళు వాచేలా – అనగా అనగా ఒక రాజు అప్పుడే సాయంత్రాన్ని సాగనంపేసిన ఒక రోజు ప్రపంచాన్ని చల్లగాను, ప్రేమికుల్ని వేడిగానూ పరిపాలించటం ప్రారంభించేరు. ఆ రాజుగారి చూపులు విస్తృతంగా విస్తరించి విశాలంగా, విలాసంగా వున్నాయి. అది విశాఖపట్నంలో “లాసన్స్ బే’ తీరంలో వున్న శాంతి ఆశ్రమంలోనికి కూడా చొచ్చుకుని, అక్కడ ఏపుగా పెరిగిన సరుగుడు చెట్లని వొరుసుకుంటూ వచ్చి నేల మీదికి జారేయి. అప్పుడా చెట్ల మధ్య ఓ చెట్టునానుకుని రీవిగా రాజాలా కూర్చున్న సారధి కూడా ఆ రాజులాగే ఎంతో అందంగా వున్నాడు.
ఆ రాజు నెలరాజు.
ఆ రోజు పున్నమిరోజు.
ఆ చూపులు వెన్నెల తూపులు.
ఆ సారధి మెడికల్ కాలేజీలో ట్యూటరు.
ప్రస్తుతం శాంతి ఆశ్రమంలో సరుగుడు చెట్టు క్రింద కూర్చున్న సారధి చేతుల్లో ఒక అందమైన మాసపత్రిక వుంది.
శ్రద్దగా అందులో సీరియల్ చదువుకుందామని సాయంత్రం అయిదింటి కల్లా సారధి అక్కడికి వచ్చేడు. కాని సీరియల్ సగం చదివేసరికి సారధికి ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరం కూడా ముందుకి సాగలేదు. కారణం ఆ పేజీలో హఠాత్తుగా హీరోయిన్ బామ్మ మరణించింది. సారధికి వెంటనే తన బామ్మ గుర్తుకొచ్చింది. చేతిలో పుస్తకం మూసి, గతంలోకి జరిగి సారధి తన బామ్మ గురించి చాలా సేపు ఆలోచించేడు. సంధ్య గడిచేవరకూ ఆలోచించేడు. కాస్సేపు సారధి కంటిముందు బామ్మ బింబం తొణికిసలాడింది. చుట్టూరా వెన్నెల బామ్మ ధరించే తెల్ల పట్టుబట్టలా కనబడింది. తలెత్తి చూస్తే చందమామలో బామ్మ-పూజ చేసుకొచ్చి పూజ్యగాంధీలా నవ్వుతూ నిలబడింది. ఆకాశంలో నక్షత్రాలు బామ్మచేసుకునే వత్తుల్లా మెరిసేయి. ఒక్కసారి కళ్ళు చెమర్చిన సారధి తనకు తానే బరువుగా, బాధగా “బామ్మా!’ అనుకున్నాడు. ‘భగవాన్’ ఎంతలో ఎంత మార్పు జరిగెను! కాలచక్రము కారు చక్రము వలె తిరిగెను కదా! అని కూడా అనుకున్నాడు.
నాలుగేళ్ళ క్రితం వరకూ బామ్మ చేతుల్లో పెరిగిన సారధి మనస్సు చాలా పొదుపుగా పనిచేసి అతన్ని చాలా అదుపులో వుంచింది. అందుచేత అతనెక్కడా పరీక్ష ఫేలవకుండా, ఎంచక్కా ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుని, ఏ రోజు గడ్డం ఆ రోజు గీసుకుని చకచకా డాక్టరయాడు. అలా బామ్మ హయాంలో ప్రపంచానికి పాతికేళ్ళ పాతబడిన పార్ధసారధి చాలా మందికి మడిగట్టుకున్న మడిసారధిలా కనిపించేవాడు. సారధి బామ్మ అతన్నెంతో క్రమశిక్షణలో పెంచింది. రోజూ ప్రొద్దున్నే చద్దన్నం తినిపించి అతన్ని మెడికల్ కాలేజీకి పంపింది. సాయంత్రం అతని రాకకి గంటముందే వీధిగుమ్మంలో కూర్చుని, వొత్తులు చేసుకుని అవి కళ్ళల్లో వేసుకుని ఎదురుచూసేది. కాని యిదంతా నాలుగేళ్ళ క్రితం వరకే సాగింది. ఆ తర్వాత సారధి వొంటరివాడై పోయాడు. అతనికప్పుడు బామ్మ లేదు. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం తనూ, బామ్మా వొకేసారి పాసైపోయేరు – తను యం.బి.బి.యస్సూ, బామ్మ జీవితమూ, సారధిలో ఆ క్షణం నుంచీ గుర్తించదగ్గ మార్పులెన్నో వచ్చేయి. మడిసారధి మడి ఆనాడే మబ్బులా విడిపోయింది. క్రమశిక్షణ పోయింది. అతని మనస్సు పరిధులు దాటి పరిపరివిధాల పోయింది. ఎన్నో సరదాలకేసి పోయంది. ఎన్నో కోరికలకేసి పోయింది. అవును మరి – బామ్మ పోయింది.
అంతకాలం కాల్టెక్సు కంపెనీలో వుద్యోగం చేసినట్టు సారధికి కలెక్టరాఫీసులో కొత్త వుద్యోగం దొరికినట్టయింది. బామ్మ ఆసరాగా వున్నంతకాలం అతనికి ఏ వెలితీ కనిపించలేదు. కాని బామ్మతో అసరాలన్నీ పోయినట్లయి, సారధికి జీవితంలో వెలితి అంటే ఏమిటో తెలిసింది. ఎవరేనా మంచి నేస్తం, తన జీవితంలో కాలు మోపి, అంతవరకూ ఆసరాగా నిలిస్తే బావుణ్ణనిపించిందతనికి.అప్పట్నుంచే అతనిలో క్రమంగా మార్పు వచ్చింది. నాలుగేళ్లలో పార్థసారధి ఎంతగానో మారాడు. అతని మార్పు చెడ్డదనీ చెప్పలేం – మంచిదనీ చెప్పలేం. అదొక చిత్రమైన మార్పు. ఎప్పుడూ క్లాసు పుస్తకాలు తప్ప మరే యితర పుస్తకం ఎరుగని సారధి గొప్ప ఆధునిక తెలుగు సాహిత్య పిపాసిగా మారాడు. ఇప్పుడతను చదవని తెలుగు నవలగానీ, కథగానీ ఏదీ లేదు. చంద్రుడి కోసం చాతకపక్షిలా నెలనెలా, వారం వారం పత్రికల కోసం ఎదురుచూసి చదివిన సారధికి కొన్ని సీరియల్ నవలలు కంఠోపాఠంగా వచ్చు.
ఇటీవలే సారధికి తను ఎంతగానో యిష్టపడిన ఒక సీరియల్ నవల్లో హీరోలా తయారవాలనే కోరిక కలిగింది. అందుచేత అతనీ మధ్య ప్రతిరోజూ కొంత సేపు చిత్రలేఖనం ప్రాక్టీసు చెయ్యడానికి, కొంత సేపు ఫిడేలు వాయించడానికీ, కొంత సేపు గొంతెత్తి పాడటానికి కేటాయించుకొని దీక్షగా సాధన చేస్తున్నాడు. ఏదో ఒకనాడు తన సాధన ఫలించి సాధనాలాంటి అమ్మాయెవరైనా తన్ను వలచి వరించకపోతుందా అని సారధి ఉద్దేశం.
సరుగుడు తోపుకి దూరంగా యిసుకలో నడుస్తూ జాలరివాడెవడో కూని రాగం తీసుకుంటూ పోతున్నాడు. వాణ్ణి చూసేసరికి చల్లగాలీ, సముద్రమూసమయము. అన్నీ కలిసి ‘పాడ’మని తన్ను అదేపనిగా బలవంతం చేస్తున్నట్టు ఫీలయ్యాడు, ఒక్కసారి చుట్టూ చూసేడు. పాట పాడేందుకు ఇంతకంటె మంచి వాతావరణమూ, మంచి ఆవకాశమూ ఏం కావాలి గనుక; వినేందుకు నలుగురూ లేకపోయినా, వున్నారనుకునే పాడాలనుకున్నాడు సారధి. గొంతు సరిచేసుకుని ప్రేమగీతం ఒకటి గట్టిగా ఎత్తుకున్నాడు. రెండు చరణాలు పాడగానే అతనికి సరుగుడు చెట్ల మధ్య, పారుతున్న సెలయేటి గలగల వినిపించి, దాహం వేసింది. వెంటనే పాట ఆపుచేసి లేచి నిలబడ్డాడు. ఎడారిలో షోడాలు దొరకినట్లు ఎంచేతనో యీ శాంతి ఆశ్రమంలో సెలయేరు పుట్టింది. బహుశా తన గాన మాధుర్యాన్నికిక్కడ నాపరాళ్ళు కరిగి వుంటాయి అనుకుంటూ చెట్ల మధ్యకి నడిచేడు. కాని శబ్దాన్ని సమీపించాక సారధికి ఆశ్చర్యం ఎదురైంది. తన పాట వినేందుకు నలుగురూ లేరనుకున్న సారధికి వెన్నెల నీడలో వేడుకగా నవ్వుతూ ముగ్గురు వ్యక్తులు మసగ్గా కనిపించారు. సారధికి కోపం వచ్చింది. లేచి నిలబడ్డాడు. వేగంగా అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి నడిచాడు. తీరా చూస్తే వాళ్ళెవరో కాదు. తన లేడీ స్టూడెంట్సు – శాంతిప్రియ, శాంతిలత, శాంతిసిరి – వెన్నెల నీడలో కలువరేకుల్లా గున్నారు. సారధి తత్తరపడ్డాడు. అంతలో శాంతిప్రియ నవ్విన పెదాలు మాట్లాడేయి. ‘నిలబడి పోయారేం సార్! కూర్చోండి!
మళ్ళా ముగ్గురూ గలగల కిలకిలా సెలయేరై నవ్వేరు. సారధి యాంత్రికంగా కూర్చున్నాడు.
‘మీరు పాడతారని మాకింతవరకూ తెలియదు సుమండీ?’ శాంతిలత మాట్లాడింది. వాళ్ళు మళ్ళా నవ్వులు విసిరారు. ఈ మారు సారధి కూడా ఒక వెర్రినవ్వు నవ్వి అడిగాడు – ‘మీరు విన్నారా?’ మిగిలిన నవ్వుని పెదాల వెనుక దిగతొక్కుకుంటూ ముగ్గురూ అవునన్నట్టు తలలూ పేరు.
‘బాగా పాడానా?’ సారధి భావనలో అమాయకత కనబడింది.
శాంతిత్రయం మళ్ళీ అవునన్నట్టు తలలు పంకించేరు.
‘మరేందుకు నవ్వేరు?’
ఈ ప్రశ్నకి వాళ్ళ నవ్వులు శ్రుతిమించాయి. ఆశ్రమమంతా ఆక్రమించాయి.
సారధికి కష్టం తోచింది. ఎందుకిలా నవ్వుతారు వీళ్ళు? నవ్వితే తనకెందుకిలా బాధనిపిస్తోంది? అందమైన అమ్మాయిల నవ్వులు కూడా బాధ కలిగిస్తాయా? ఏమిటో – వెన్నెల నీడలా నవ్వుల బాధ! అయినా తనెందుకు బాధపడాలి! వాళ్ళేం తప్పు చేసారు? – నవ్వేరంతే. అవును నవ్వడం, పిల్లల్ని కనడం ఆడవాళ్ళ జన్మహక్కు, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారంతే. ఈ మాత్రానికి తనెందుకూ బాధపడటం. ఎదుటి వారి హక్కులను గౌరవించుట పౌరుని విధి. కాబట్టి తనిప్పుడు వారి నవ్వులను గౌరవించవలెను’ – అని ఆలోచించుకుని సారధి వాళ్ళను మెచ్చుకున్నాడు. ‘మీకు నవ్వడం బాగావచ్చు’
‘బాగా అంటే?’ శాంతిలత.
‘అందంగా’
ఈసారి శాంతిత్రయం నవ్వలేదు. మెరిసే కళ్ళతో సారధిని చిత్రంగా చూసారు. అందమైన ఆడపిల్లలు తనని అలా సూటిగా చూడటం సారధికదే తొలి అనుభవం. క్షణంపాటు చక్రవర్తిలా ఫీలయ్యాడు.
నిజం చెప్పాల్సొస్తే సారధికి పాటలు పాడడం రాదు. మనస్సులో కోరికని చంపుకోలేక పాడినా విన్నవాళ్ళకి పాటలమీదే కోరిక చచ్చిపోతుంది. ఏమైనా సారధికి మాత్రం తన పాట మీద గొప్ప నమ్మకం వుంది కాని. యిప్పుడు శాంతిత్రయం ప్రవర్తన ఆ నమ్మకాన్ని కాస్త సడలించినట్లయింది. “నేను బాగా పాడలేదూ భగవాన్!” అనుకున్నాడు. ‘అసలు వీళ్ళక్కడున్నారని తెలిస్తే యింకా బాగా పాడేవాణ్ణే ” అని కూడా అనుకున్నాడు.
వెన్నెల షికారులన్నా, వేళాకోళాలన్నా శాంతిత్రయానికి బహుసరదా. రెండు క్షణాలపాటు గురువుగారి అందాన్ని తన్మయంగా చూసేక, సారధి అమాయకత్వాన్ని చొరవగా తీసుకున్న శాంతిత్రయం మరింత చనువుగా వేళాకోళానికి దిగేరు.
శాంతిప్రియ అడిగింది – “ఒక్కరే వచ్చారా సార్?”
“అవును పాట పాడుకుందామని…” అతనిలో యిందాకటి అమాయకత యింకా అలాగే తొంగిచూస్తోంది.
సారధి పాట అనేసరికి శాంతిత్రయం మళ్ళీ గొల్లుమన్నారు.
“నవ్వేరంటే ఆబ్సెంటు మార్కు చేస్తాను.” మంచి జోకు వేసాననుకున్నాడు సారధి.
“మీరు బాగా పాడతారే అనుకుంటే, బాగా జోకుతారు కూడానూ?” శాంతిసిరి అంది.
“నిజంగా పాడుకోడానికి వచ్చారా సార్?” శాంతిలత అడిగింది.
సారధి బదులు చెప్పలేదు. ఇందాకే అతను వూహాలోకానికి వెళ్ళాడు. అప్పుడు శాంతిప్రియ అతన్నీలోకానికి లాక్కొచ్చి కూర్చొబెడుతూ గోముగా ‘ఒకపాట పాడండి సార్!’ అని అడిగింది.
“పాటా?” అన్నాడు పార్ధసారధి.
“అవును పాటే, పాడండి సార్! వినాలని వుంది.”
“పాట కాదు. ముందు నా మాట వినండి.”
“ఏమిటి సార్?” శాంతిత్రయం చెవులు రిక్కించేరు.
“ఏమీ లేదు. నేను పాడానని గాని, పాడతాననిగాని మీరు ఎవ్వరితోనూ చెప్పనని ప్రమాణం చెయ్యాలి” సారధి సీరియస్ గా అడిగేడు.
“బలేవారే-మీరెంతో బాగా పాడగలరని అందరితో చెప్పాలనుంది నాకు” అంది శాంతిలత.
“అడిగారు కాబట్టి అలాగే ప్రమాణం చేస్తాను” అంది శాంతిప్రియ.
“నేను ప్రమాణం చెయ్యను. మీరు ముమ్మాటికి ఎంతో బాగా పాడతారు. ఇందాక మీ పాట విన్నప్పట్నుంచీ నాకెన్నో సార్లు మీ చేత పాడించుకోవాలనిపిస్తోంది” అంది శాంతిసిరి.
ముగ్గురిలో శాంతిసిరి మాటలు సారధిని ఆకట్టాయి. తనపాట మీద అతనికెంతో నమ్మకం పెరిగింది. ఏదో ధీమా కలిగింది. అప్పుడు సారధి పాట పాడాడు. శాంతి ఆశ్రమంలో అశాంతి మజిలీ చేసినట్లు పాడాడు. అయినా శాంతిత్రయం మాత్రం ప్రశాంతంగా పార్థసారధి పాట విన్నారు. నిజం చెప్పాల్సొస్తే కేవలం వాళ్ళ చెవులు మాత్రమే పాట విన్నాయి. మిగిలిన ఇంద్రియాలన్నీ ఐంద్రజాలికుడి మాయకి లొంగిపోయినట్లు సారధి సురద్రూపానికి లొంగిపోయాయి.
సారధి పాట ముగిశాక శాంతిలత, “సార్! మీకింత చక్కగా పాడటం వచ్చు గదా! ఏ పార్టీలో నన్నా ఒక్కసారి పాడకూడదూ?” అనడిగింది.
“ఏదో పార్టీ దాకా ఎందుకూ? నేనే కొద్దిరోజుల్లో అందర్నీ పిలిచి ఒక పార్టీ ఏర్పాటుచేసి పాడి వినిపిస్తాను” అని చెప్పి, “అన్నట్టు వచ్చే మంగళవారం నా బర్త్ డే. నా ప్రోగ్రామ్ ఆ రోజున ఏర్పాటు చేస్తాను. ఆవేళ తప్పకుండా మీరు వద్దురుగాని. ఆ రోజు ఒక్క పాటేమిటి, ఫిడేలు కూడా వాయిస్తాను. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక, మీకు యిన్విటేషన్లు పంపిస్తాను” అన్నాడు.
అలా వాళ్ళ మధ్య ఎన్నో కబుర్లు నడిచేక, ఎన్నో క్షణాలు గడిచేక, శాంతిత్రయానికి సారధి గుడ్ నైట్ చెప్పేడు
* * *
.
ఆ రాత్రి మంచం మీద వెల్లకిలా పడుకొన్న పార్థసారధికి నిద్రపట్టలేదు. కిటికీలోంచి గుండ్రటి చంద్రుడు క్లోజప్లో ‘యూల్ బ్రిన్నర్’ లా కనిపించేడు. సారధికి సాయంత్రపు క్షణాలు పదేపదే గుర్తుకు వచ్చేయి. ఆ క్షణాలకంటే, ఆ క్షణాల గుర్తులోనే అతనికి మధురిమ మరింతగా కనబడుతోంది. అయితే ప్రేయసితో గడిపిన క్షణాలకంటే, ప్రేయసితో గడిపిన క్షణాల ‘గుర్తు’ యింకెంత తియ్యగా వుంటుందో- ఏమైనా అనుభవం కంటే ఆలోచన గొప్పది. నిజంగా ఈ రోజు తన జన్మ తరించింది. ఇన్నాళ్లూ వాళ్ళకి పాఠం చెప్పడమే మహాభాగ్యం అనుకుంటున్న తను, ఈ రోజు వాళ్ళకి పాట వినిపించేడు. తను వినిపించడమేమిటి? వాళ్ళే బలవంత పెట్టి తనచేత పాడించుకుని విన్నారు. ఒకరు కాదు ముగ్గురు. అందమైన అప్సరసలు సరసన కూర్చుని కావాలని మరీ విన్నారు. ఆ క్షణం శాంతిప్రియ తన కళ్ళలో దీపావళి చూపించింది. శాంతిలత తన చెక్కిలి నీడల్లో సాయంత్రాన్ని సర్దుకొంది. శాంతిసిరి పెదాల్లో ‘మా సారధి ఎంతో బాగ పాడగలరు’ అనే గర్వాన్ని దాచుకుంది. ఎంత బాగా విన్నారు వాళ్ళు. వాళ్ళకి వినడంలో కూడా అందమే వుంది. ముగ్గురికి ముగ్గురే. చిత్రమైన కలయిక, మాటల్లో, పేర్లలో, చూపుల్లో, అందంలో, అంతా గమ్మత్తయిన ఏకత్వం – మనస్సుల్లో కూడానేమో. పైగా ఎంత చనువు – తన పాట వినేందుకు ఎంత దగ్గరగా కూర్చున్నారు. పక్షుల్లో నెమలిలా, పువ్వుల్లో గులాబీలా, మానవుల్లో శాంతిత్రయం-యిదేనేమో సృష్టికర్త ప్రత్యేకత. ఇప్పుడు వాళ్ళల్లో ఒక్క శాంతి, ఒక్కగానొక్క శాంతి నన్ను ప్రేమిస్తే తనకీ భూమ్మీద మరి కోరికలుండవు. కానీ అది సాధ్యమా? సాధ్యమే అయితే… నిజంగా తను చక్రవర్తీ! అప్పుడు తను చక్కగా రోజూ తన శాంతిని పక్కన కూర్చోబెట్టుకుని తనకొచ్చిన ప్రేమగీతాలన్నీ ఫిడేలు వాయించి వినిపించవచ్చు. తల్చుకుంటేనే ఎంత బావున్నాయి తన ప్రేమ క్షణాలు. కాని తన ప్రేమ ఫిడేలు వాయించడం కోసం అంటే ఎవరూ నమ్మరు – ఇలా కాస్సేపు ఆలోచనలు సాగాక సారధి జ్వరం తగిలినట్టు ఫీలయ్యాడు. ఏదో బరువైన కోరిక తన హృదయం పట్టుకు వ్రేలాడుతున్నట్టుంది. ఏదో తియ్యటి బాధ తనలో నరాల్ని గిజగిజ లాడిస్తున్నట్టుంది. అందమైన అమ్మాయిల దగ్గర పాటపాడితే యిలాగే వుంటుంది కాబోలు. అయినా తన మస్తిష్కంలో యింకేదో విప్లవం జరుగుతోంది. క్షణక్షణానికి శాంతిత్రయం తన మనస్సుకి మరీ దగ్గరగా వచ్చేస్తున్నారు. ఏమిటో? సుఖంలో కూడా బాధ – ప్రేమంటే యిదేనేమో!
ఈ విధంగా చాలా రాత్రి గడిచేవరకూ సారధి మెదడులో ఎన్నో ఆలోచనలు పుట్టి, శాంతి ఆశ్రమంలో సరుగుడు వృక్షాల్లా-బలంగా, ఏపుగా, అసంఖ్యాకంగా పెరిగాయి. కాని, వృక్షాలు ఆశ్రమం చల్లదనానికి తోడైతే, ఆలోచనలు గుండెల్లో వేడికి తోడయ్యా యి.
క్రమంగా సారధి నిద్రలోకి జారాడు. నిద్రలో అతని ఆలోచనలన్నీ కలలుగా మారి అల్లరిచేశాయి. కలలో సారధి తన శరీరంలో రేగిన విప్లవాన్ని కళ్ళతో చూశాడు. అలా చూసుకున్నప్పుడు సారధికి తన గుండెలోపలి గదుల్లో రక్తం కనబడలేదు. కుడికర్ణికలో శాంతిప్రియ. కుడిజఠరికలో శాంతిలత కూర్చుని వొంట్లో వున్న జీవకణాలన్నిటినుంచి కొత్త వుద్రేకాల్ని, కొత్త కోరికల్ని రాబట్టి – ఎడమ కర్ణికలో కూర్చున్న శాంతిసిరికిస్తున్నారు. ఆమె వాటినన్నటినీ కలిపి, చిలికి శుభ్రమైన ప్రేమని తయారుచేసి, ఎడమ జఠరిక నిండా నింపుతోంది. తిరిగి ఎడమ జఠరిక నుండి శుభ్రమైన ప్రేమ – పదునైన వుద్రేకాలోనూ, పదునైన కోరికలోనూ ప్రవహించి కణకణానికి వ్యాపిస్తోంది. ఇలా ప్రేమ ప్రసరణం జరుగుతున్నప్పుడు పార్ధసారధి గుండె ‘ల ప్’ అని కొట్టుకోవడం మానేసి, ‘లవ్ హెర్’ అని కొట్టుకుంటోంది.
ఈ విధంగా – ఆవాల్టి వరకూ శాంతి ఆశ్రమంలా వున్న సారధి గుండె ఆ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలా మారింది.
* * *
మర్నాడు సారధి రోజూకంటే ఆలస్యంగా లేచాడు. వొళ్ళు బద్దకంతో బరువెక్కింది. కళ్ళు కలల బరువుతో ఎరుపెక్కాయి. నిలువెల్లా నీరసం నిలిచింది. అవయవాలన్నీ సత్యాగ్రహం చేసినట్టు మారాయి. మనస్సు ఆలోచనల బరువుకి క్రుంగిపోయినట్టయింది. ఇంతలో టేబులు మీద టైంపీసు, కాలేజీకి టైమయింది త్వరగా తయారవమని హెచ్చరించింది. సారధి స్థితిమాత్రం కాలేజీకి వెళ్ళగలిగేలా లేదు. కాని ప్రచండుడైన ప్రొఫెసరు గుర్తుకి రావడంతో సారధి త్వరపడక తప్పలేదు. గబగబా ఓసారి ‘చటర్జీ’ తిరగేసి చకచకా తయారయ్యేడు.
కాలేజీకి వెళ్ళేక, సారధి ఆ రోజు క్లాసు కూడా తీసుకోవాలిసొచ్చింది. లెక్చరు మధ్యలో, మధ్య వరసలో కూర్చున్న తన శాంతిత్రయాన్ని వెనుక బెంచీలో కూర్చున్న క్రానిక్ రిఫర్డ్ కాంతారావు అదే పనిగా విట్లేస్తూ తన శాయశక్తులా శాంతిత్రయాన్ని నవ్వించడం చూశాడు. ఒక్కసారి కోపం ముంచుకొచ్చింది. తన ప్రణయదేవతల్ని విట్టేసి నవ్విస్తాడా? ఎంత దురాగతం? అనుకుని కాంతారావుని నిండుబెంచీల మధ్య నిలబెట్టి పాఠంలో ప్రశ్నవేశాడు. కాంతారావు తప్పు చెప్పగానే వీలు చూసుకుని నాలుగూ దులిపేశాడు. ఛటర్జీ, చదివి చెడిపోయావన్నాడు. బి.టి. చదివి బాగుపడమన్నాడు. మాట్లాడకుండా కూర్చోమన్నాడు. కాంతారావు పాపం చేసేదిలేక పార్ధసారధిని గుడ్లురిమి చూసి కూర్చున్నాడు. పాఠం చెబుతున్నంత సేపూ సారధికి ఏదో మైకం కమ్మినట్టుండి, స్టూడెంట్సు గోలచేసినా వినబడలేదు. ఎదురుగా కూర్చొన్న శాంతిత్రయం తప్ప, క్లాసులో మరెవ్వరూ అతనికి కనబడలేదు. చివర్న “టైమయిపోయింది మావోయ్!” అని అబ్బాయిలంతా అరిచే దాకా సారధికి క్లాసు వదిలి రావాలన్న సంగతే గుర్తుకి రాలేదు.
ఆ మధ్యాహ్నం, స్టాఫ్ రూమ్ లో కూర్చొన్న సారధికి ప్రొఫెసరుగారి వద్ద నుంచి పిలుపురాగానే లేచాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, ఆలోచనలో ఆలోచన పేర్చుకుంటూ, ప్రొఫెసరు గారి గదిలోకి అడుగు పెట్టాడు. టేబులు వెనక కుర్చీలో ప్రొఫెసరుగారు సర్కసు పులిలా కూర్చుని పూరీలు తింటూ, ఛటర్జీ ముందేసుకుని, దీక్షగా ‘సి.ఎస్.ఎస్.’ బట్టీ పడుతున్నారు. సారధిని చూడగానే ఆయన పూరీ ప్లేటు చటుక్కున దాచేసి, చదివే పేజీల మధ్య గుర్తు కోసం ఒక పూరీవేసి, పుస్తకం మూసేసి, గాండ్రుమని దగ్గేరు. పులిగా మారినప్పుడల్లా యిలా ప్రొఫెసరుగారు ఆస్మా పేషెంటులా అల్లరి చేస్తారని డిపార్టుమెంటంతకీ బాగా తెలుసు.
సారధి కంటిముందు పడగానే ప్రొఫెసరుగారు యింగ్లీషులో యింగ్లీషు పులిలా గర్జించేరు – ప్రొద్దున్న ఏం తీసుకున్నావ్?”
సారధి సవినయంగా అన్నాడు ‘చపాతీ సార్.
‘ షటప్ ‘ చపాతీ కాదు నే నడిగింది’ ఈసారి ప్రొఫెసరుగారు గర్జించినపుడు సారధి మీద చినుకులు పడ్డాయి. (కండిషన్డ్ రిఫ్లెక్సు) ‘క్లాసులో తీసుకున్న సబ్జక్టేమిటి – చెప్పిన భాగోతమేమిటి అని అడుగుతున్నా?”
సారధి ఇంకా వినయం మానలేదు ‘భాగోతం కాదు సార్ – బ్లడ్!’
‘బ్లడ్డే బ్లడ్డు బ్లడ్లో ఏ టాపిక్కు?”
‘ఆర్. బి.సి. సార్!’
‘ఇంటి దగ్గర ప్రిపేరయ్యే వచ్చావా!’
‘అవును సార్! ‘మరయితే క్లాసులో ఆ పేలాపనేవిటి?”
‘తప్పు చెప్పానా సార్?’
ఒక్కసారి ప్రొఫెసరుగారు కుర్చీలోంచి లేచి వొళ్ళు దులుపుకున్నారు. ‘తప్పా! తప్పున్నరా? రక్తంలో ఎర్రకణాలేకాక ప్రేమకణాలు కూడా ఉంటాయా? వాటి పేరు శాంతికణాలా? అవి మూడు రకాలా! పైగా రక్తంలో అవి బాగా ఎక్కువగా తగులబడితే ‘పోలీ శాంతీ మియా వీరా’ అనే రోగం అఘోరిస్తుందంటావా?’ అంటూ దసరా పులి డ్యాన్సు చేశారు – పిమ్మట ఆయన యింకా యిలా డ్యాన్సు చేశారు.
ఆ ఎర్ర కణాలన్చెప్పి బోర్డు మీద ఆఠీను బొమ్మలేస్తావా? పైగా యివన్నీ, నేను చెప్పమన్నానని చెబుతావా? అసలేమిటి నీ వుద్దేశ్యం’ అంటూ ఆయాస పడ్డారు.
సారధి మెల్లగా ‘వొంట్లో బాగులేదు సార్’ అని గొణిగేడు.
‘ఒంట్లో బాగులేకపోతే యింట్లో అఘోరించాలి. అంతేగానీ క్లాసు కొచ్చి అవాకులు చెవాకులు చెబుతావా? వెళ్ళు. తిన్నగా ఇంటికి వెళ్ళు. వెళ్ళి మళ్ళీ వారం రోజులు పోయేవరకూ డిపార్టుమెంట్లో అడుగెట్టకు. గెటవుట్!’ అని చెడామడా దులిపేసారు. సారధికి తన బామ్మ తలంటు పోయడం గుర్తుకొచ్చింది.
రూమ్ కి తిరిగొచ్చి మంచం మీదికి బరువుగా వాలేక, నిద్రకి బదులు క్రమంగా తీరని అస్వస్థత అతన్ని ఆవహించింది.
* * *

నాలుగు రోజులు గడిచాక సారధి పుట్టినరోజు వచ్చింది. ప్రపంచాన్ని క్రమక్రమంగా మరిచిపోతున్న పార్ధసారధి, తన పుట్టినరోజు మాట కూడా మరచిపోయేడు. ఈ నాలుగు రోజులూ మంచి పుస్తకానికి చెదలు పట్టినట్టు అతడి మనస్సుని ఆలోచనలు పట్టి చాలా వరకూ తినేసాయి. అలా మిగిలిన చాలీచాలనీ మనస్సుతో ఆపసోపాలు పడుతున్న సారధికి ఆ సాయంత్రం మూడు ఉత్తరాలొచ్చేయి. ఆసరాలన్నీ కోల్పోయానని మధనపడే సారధికి ఆ ఉత్తరాలు మూడు దేవతల్లా కనిపించేయి. అతను వాటిని ఆత్రంగా విప్పి చూసుకున్నాడు. నిజంగా అవి అతని దేవతలు రాసిన ఉత్తరాలే శాంతిలత, శాంతిప్రియ, శాంతిసిరి అనే సంతకాల తేడా తప్ప మిగిలిందంతా ప్రతి దాంట్లోనూ ఒకే లాగున వుంది. అతను జాగ్రత్తగా చదువుకోడం మొదలు పెట్టేడు.
ప్రియమైన సారధి గారికి –
నమస్తే!
నాలుగు రోజులు మీరు కనబడకపోయేసరికి మనస్సుకి జ్వరం వచ్చినట్టుంది నాకు. కలలు కరిగిపోతాయంటారు. ఏమో ననుకున్నాను. కాని నిజంగా మీరిప్పుడు నా నాలుగు రోజుల కలల్నీ కరిగించి వేశారు. పుట్టినరోజన్నారు, పార్టీ అన్నారు. పాటన్నారు. పిలుస్తానన్నారు. ఏమీ జరగలేదు. నన్ను మరచి పోయేరల్లే వుంది. కాని – డియర్ సారధీ! మీరు నన్ను మరచిపోయినా, నేను మిమ్మల్ని నా జ్ఞాపకాల్లో భద్రంగా దాచుకోగల్గుతున్నాను. మీరు నన్ను పిలవకపోయినా, మీ పాట వినే భాగ్యం నాకు లేకపోయినా నాకు మీ మీద కోపం రాలేదు. మీరిలా చెయ్యడం వల్ల నాకు మీరింకా దగ్గరయి పోయినట్టనిపించింది. అంచేత ఈ రోజున పుట్టిన మీ కోసం నేనివ్వగలిగిన స్వల్పమైన కానుక ఒకటి మీకు సమర్పిస్తున్నాను. మీకిది కేవలం యీ వొక్క పుట్టిన రోజుకే కాదు – జీవితాంతమూ యిది మీ కానుకగా నిలిచిపోవాలని, ఈ కానుక పేరు శాంతిసిరి. దయతో తప్పక గ్రహిస్తారనే ఆశతో –
మీ,
శాంతిసిరి

మిగతా రెండు ఉత్తరాల్లో శాంతిసిరి అని వున్నచోట, ఒక దాంట్లో శాంతిప్రియ అనీ, మరోదాంట్లో శాంతిలత అనీ రాసుంది తప్ప మిగిలిన విషయం అంతా మక్కికి మక్కీ కాపీ చేసి రాసినట్టుంది. ఒకే ఉత్తరాన్ని మూడుసార్లు చదువుకున్నట్టు, ఆ మూడింటిని ఒక్కొక్కసారి చదువుకున్నాక సారధికి స్పృహ తప్పినట్టయింది. తను చదివే సీరియల్ నవల సగంలో సమాప్తమయినట్టయింది. శాంతిత్రయానికి అందంలోనే కాక ఆలోచనల్లో కూడా ఏకత్వమే కాబోలునని ఆశ్చర్యపోయాడు. వాపోయాడు. క్షణంలో సారధి గుండెలో జపానులో భూకంపంలా, తుఫానులో తేరుకంపంలా ప్రేమ గందరగోళం చెలరేగింది.
ఈ విపరీతాన్నిప్పుడు తను అదృష్టమనుకోవాలా? దురదృష్టమనుకోవాలా? ఏమిటీ దారుణం? చేతికందవనుకున్న అందాలు మూడూ హఠాత్తుగా పందాలు వేసుకుంటూ తన మనస్సు కేసి ఎందుకిలా పరుగులు తీస్తున్నాయి. ఇన్నాళ్లూ శాంతిత్రయం సరసన పాట పాడటమే మహాభాగ్యం అనుకున్నాడు తను. వారిలో వొక్కగానొక్క అమ్మాయి తన్ను వలచి వరిస్తే చాలనుకున్నాడు తను. కాని అనుకున్నదంతా అతి నిజమయిపోయింది. మహా నిజమయిపోయింది. హే! భగవాన్! ఏవిటీ యూనివర్సిటీ పరీక్ష! శాంతిత్రయం చూపులకే తట్టుకోలేక జ్వరం తెచ్చుకొన్న బలహీనమయిన మనస్సు యిప్పుడీ ధాటికి తట్టుకొనగలదా? మూడురేసు అశ్వములను కూర్చిన నా ప్రేమ రధమునకు నేనెట్లు సారధిని కాగలను? నా కర్తవ్యమేమిటి పరాత్పరా? అనుకుంటూ సారధి అదే పనిగా చాలా సేపు రోదించాడు. చివరికి ఏమీ తోచక ఏదో హిందీ సినిమాకి వెళ్ళాడు. తీరా చూస్తే- పాపం!- ఆ సినిమాలో హీరోకి కూడా తనలాంటి బాధే ఎదురయింది. కాని ఆ హీరో తనకంటే చాలా అదృష్టవంతుడిలా కనిపించాడు. తనలా అతడికి ఒకేరమైన అందం, తెలివితేటలు, మనస్తత్వంగల స్త్రీలు ఎదురుకాలేదు. అసలు వాళ్ళ ప్రేమదృక్పథంలోనే తేడా వుంది. అంచేత ఆ హీరో తన సమస్యని స్వల్ప శ్రమతోనే పరిష్కరించుకోగలిగేడు. కాని తను? శాంతిత్రయం ప్రేమల్లో ఎవరి ప్రేమ గొప్పదో ఎలా నిర్ణయించుకోవాలి? ఎవరి అందం గొప్పదనుకోవాలి? ఎవరి మనస్సు గొప్పదనుకోవాలి? – అయినా తనది జీవితం. అది సినిమా. తన జీవితం సినిమా అయితే ఎంత బావుణ్ణు? – అనుకుంటూ నెమ్మదిగా రాత్రి పదిగంటలకి రూము చేరాడు సినిమా చూసిన సారధి.
మంచంమీద నడుం వాల్చి కళ్ళు మూసుకు పడుకున్నాడు. అయినా అతనికి నిద్ర పట్టలేదు. పక్కకి తిరిగి చెయ్యి రేడియో వున్న టేబులు మీదికి పోనిచ్చి మెల్లగా రేడియో ట్యూన్ చేశాడు. వివిధభారతిలో విషాదగీతం వినబడింది. ఇన్నాళ్ళూ సిలోన్ పాటలా వున్న తన జీవితం యిప్పుడు వివిధభారతి పాటలా విషాదభరితమయిపోయింది. అసలు తన జీవితమే ఒక విషాద స్వరూపం, దాన్ని చూడాలని తను ప్రేమ అనే దీపాన్ని వెలిగించుకున్నాడు. దీపం వెలిగింది కాని జీవితం పూర్తి స్వరూపం అంతా కనబడలేదు. అంతా కనబడేలా చేసుకునే ప్రయత్నంతో దీపం కాస్తా ఆరిపోతుందేమో!
సారధి క్రమంగా ఇలా వేదాంత ధోరణివైపు జరిగి, మంచంలో కింద పడుతూండగా, పెద్ద పెర్సనాలిటీగల ఎదురింటి ప్రభాకరానికి ఏమీ తోచలేదు. తన 35వ ఏట ఎం.బి.బి.ఎస్., ఫైనలియరు చదువుతున్న ప్రభాకరం సారధికి పాత క్లాస్ మేటు. ఇప్పుడే కాదు-నాలుగు రోజుల నుంచీ ప్రభాకరానికి ఏమీ తోచట్లేదు. పైగా రాత్రిళ్ళు బాగా నిద్రపడుతోంది. ఎంచేతనంటే ఈ నాలుగు రోజులూ ప్రభాకరానికి ఫిడేలు చప్పుళ్లు వినిపించడం మానేశాయి. ఏమీ తోచని ప్రభాకరం అసలు సంగతి యిప్పుడే పసిగట్టగలిగేడు. వెంటనే అతను సారధి రూపములో కొచ్చాడు.
ఎదురుగా ఎత్తుగా ప్రభలా నిలబడ్డ ప్రభాకరాన్ని చూడగానే సారధికి ప్రాణం లేచివచ్చింది. అప్పుడు తను కూడా లేచొచ్చి ప్రభాకరాన్ని లోపలికి ఆహ్వానించాడు. ప్రేమకేసుల్లో పదేళ్ళుగా పాతబడిన ప్రభాకరం సారధి మొహం చూస్తూనే అతని బాధేమిటో చూచాయగా ఊహించేశాడు. తర్వాత రేడియో కేసి ఓ చూపు విసిరి ‘ముందా భారతి నోరు కట్టేయ్. ఆలిండియా రేడియో వింటే ఆరోగ్యం చెడిపోతుంది’ అని రేడియో ఆఫ్ చేయించి సారధిని మంచంమీద కూర్చోబెట్టి కుర్చీ వొకటి దగ్గరగా లాక్కుని తనుకూడా కూర్చుని మాట్లాడాడు.
“అసలు నీకు తెలుసో తెలియదో గానీ, ఈ రోజుల్లో మన పడుచువాళ్ళ మెదళ్ళని ఆడవాళ్లూ, ఆలిండియా రేడియో వాళ్లూ చెదపురుగుల్లా దొలిచేస్తున్నారు” అని సిగరెట్టు వెలిగించి సీరియస్ గా ఆలోచించి మళ్ళీ అన్నాడు – ‘నువ్వు సిక్కుపడి నాలుగు రోజులైంది కదూ?”
సారధి ఆశ్చర్యంగా చూశాడు. “నువ్వు ప్రేమలో పడి కూడా నాలుగు రోజులైంది కదూ?”
“ఎలా తెలుసు నీకు!” సారధి ఆశ్చర్యం ప్రశ్నగా మారింది. ప్రభాకరం చిరునవ్వు పొగలు కక్కింది. ఆ పొగల మధ్య తల పంకించి అన్నాడు.
“ఇందులో తెలిసేందుకేం వుంది బ్రదర్! నాలుగురోజులనుంచి నువ్వు ఫిడేలు సాము మానేసినట్టు వీధంతా కోడై గుడ్లు పెట్టడం కూడా మానేసి కూస్తోంది. నిన్నప్పుడు చూస్తే ఎలాగూ సిక్కుపడ్డావని తెలుస్తూనే వుంది. పైగా నీది కేవలం మానసిక సిక్కని నీ కళ్ళే చెబుతున్నాయి. ఇకపోతే నీ ఏజ్ లో ఏ మగాడైనా సిక్కు మనస్సుతో చిక్కి పోవడాన్ని ప్రేమ జ్వరం అంటారు.” అనుభవజ్ఞుడైన ప్రభాకరం మాటలు వినగానే సారధికీ కొండంత ఆసరా దొరకినట్టయింది. గబగబా శాంతిత్రయం రాసిన ఉత్తరాలు చూపించాడు. ప్రభాకరం వాటిని పరిశీలనగా చూసి అన్నాడు – “వీళ్ళు పరీక్షలు కూడా యిలాగే రాస్తారులా వుంది.”
“అప్పుడైతే అంతరంగంలో భరించలేని అలజడికి నేను బలై పోతూవుంటే ఏమిట్రా ఈ వేళాకోళం! నా జీవితం-” సారధి ఏదో మాట్లాడబోయాడు.
“ముసిలి నర్సులా చంపక ముందు అసలు సంగతి చెప్పు” లేచి సిగరెట్టు పారేసి, గదిలో అటూ ఇటూ బాతులా పచార్లు చేయడం ప్రారంభించాడు ప్రభాకరం.
అప్పుడు సారధి తన బాధనంతా చాలా సేపు వొలకబోసి- ‘యిన్నేళ్ళు డాక్టర్ చదివినా అసలు నేనెందుకిలా చిక్కి శల్యమైపోతున్నానో నా కర్ధం కావడం లేదు’ అని బావురుమన్నాడు. సారధి చెప్పిందంతా ప్రభాకరం మునిలా విని, పచార్లు మానేసి బకబక నవ్వేడు. “ఒరేయ్ సారధీ! నువ్వెంత అమాయకుడివిరా! మనకి ప్రేమ జ్వరం కోర్సులో లేదన్న సంగతి నీకు తెలియదూ! ఆఖరికి ఈ జ్వరం వచ్చిన పేషెంట్లకి హాస్పిటల్లో బెడ్స్ కూడా లేవు. ఈ జ్వరం రాని మిగతా పేషెంట్సుకే సరిగ్గా బెడ్సు లేవనుకో. అది వేరే సంగతి. ఆ మాటకొస్తే అసలీ ప్రేమవ్యాధికి క్యూరే లేదు – కేన్సరు లాగే. కాకపోతే ఒక్కటే తేడా. కేన్సరొస్తే చచ్చిపోతారు. ప్రేమజ్వరం వస్తే పెళ్ళి చేసుకుంటారు. అదే అమ్మాయి కాకపోవచ్చు. ఏమయితేనేంలే చికిత్స చేస్తే మంచి ఫలితాలే వున్నాయి దీనికి. కాబట్టి కంగారు పడకు. ఇప్పుడు నీకొచ్చిన ప్రేమజ్వరం కొత్త కోవకి చెందినది. దీన్ని ‘పోలీ శాంతీ మియా వీరా’ అందురు. శాంతిసిరి, శాంతిప్రియ, శాంతిలత – అనబడే ఈ ముగ్గురమ్మాయిలూ నీ రక్తంలో చేరి కణకణానికి వ్యాపించేశారు. ఇప్పుడు నీలో మితిమీరిపోయిన ఆ శాంతికణాలే యీ నీ అశాంతికి కారణం. ఇదే కణ్ కణ్ మెకాదలి! ఇషీమియా, రక్తం నిండా ప్రేమ! మరేం భయం లేదు. కోలుకోనే ఉపాయం నేను చెబుతాలే ” అని హామీ యిచ్చి ఊరడించేడు సారధిని ప్రభాకరం.
అయినా సారధి మనస్సుకి స్వాస్థ్యం చిక్క లేదు.
‘ఒరే ప్రభాకరం! ఇలాంటి పరిస్థితిని యింతవరకూ నా జీవితంలో నేనెప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి నువ్వే నాకిప్పుడు ఏదో ఒక తరుణోపాయం చూపించి నన్నీ ముగ్గురి బారినుండి కాపాడాలి. నన్ను శాంతి విముక్తుణ్ణి చెయ్యాలి’ అన్నాడు దీనంగా మంచం మీద యోగి వేమనలా కూర్చొని, అప్పుడు ప్రభాకరం మళ్ళీ యిందాకటి లాగే చిరునవ్వు నవ్వి తలపంకించి – ‘భయపడకు! అన్నిటికీ నేనున్నాను! నిన్నిప్పుడు తప్పించవలసింది ఆ ముగ్గురిని బారి నుండి కాదు. నీ ప్రేమ జ్వరం బాధనుంచి నిన్ను తప్పించాలి. తరుణీ మనస్కుడవైన నీకు సిసలైన తరుణోపాయం ఒకటి చెబుతాను విను’ అని టేబులు మీదినుంచి తెల్లకాగితం తీసి, గబగబా దాని మీద ఏదో రాసి సారధి చేతికిచ్చి, ఆకుచెప్పులు తొడుక్కుంటూ ‘వెంటనే దీనికి మూడు కాపీలు తీసి పొద్దుటే ముగ్గురికి పోస్టించు. వేళచూసుకుని మళ్ళా నేనే నీ దగ్గరికి వస్తా. భయపడకుండా బబ్బో!’ అని హామీ ఇచ్చి నిష్క్రమించాడు.
ప్రభాకరం వెళ్ళాక, చేతిలో కాగితాన్ని చూసుకున్నాడు సారధి.
‘డియర్ శాంతి,
మీ ఉత్తరం చూశాను కాని యిన్నాళ్ళు నేను మిమ్ముల్నొక సోదరిగా భావించాను. ఇప్పుడు మరోవిధంగా భావించుకోలేను. అసలు మరోలా భావించుకోడానికి నా మనస్సునెప్పుడూ తరిఫీదు చేసుకోలేదు నేను. కాబట్టి మీ కానుకని గ్రహించలేని స్థితిలో వున్నాను వీలైతే క్షమించండి.’
మీ
సారధి

ఇలా చదువుకున్నాక దీనికి సారధి మూడు కాపీలు తీశాడు. కాపీ చేసేటప్పుడు ఏదో విలువైన వస్తువును కోల్పోతున్నట్టు ఫీలయ్యాడు.
కాని అంతలోనే, మనస్సులో బెడద వదలిపోతున్నందుకు సమాధాన పడ్డాడు. సంబరపడ్డాడు. మర్నాడు పొద్దుటే వాటిని పోస్టు చేశాడు.
* * *

ఆ తర్వాత రోజు కిటికీ పక్కన వాలుకుర్చీలో కూర్చున్న సారధికి పోస్టమేన్ వచ్చి నిన్నటిలాగే మూడు ఉత్తరాలిచ్చాడు. ఉత్తరాలు అందుకుంటున్న సారధి ఊహించని శాంతిత్రయం రెస్పాన్సుకి కాస్త చిరాకు పడినా, తన ఆధిక్యత అంతగా పెరిగినందుకు కాస్త గర్వపడ్డం కూడా ఉచితం అనుకున్నాడు. అప్పుడతనికి కిటికిలోంచి కనిపించిన దూరంగా నడిచే పోస్టుమేన్ ‘హంస’లా అగుపించేడు. తర్వాత సారధి ఆ ఉత్తరాల్ని తీరిగ్గా చదువుకున్నాడు. అవి పాతవాటిలా ఒకే మూసలో పోసినట్టు లేవు. భిన్నంగా వున్నాయి. ఇలా వున్నాయి.
మొదటిది –
సారధిగారికి –
నమస్కరించి వ్రాసేది,
మీ అందం చూసి మిమ్మల్ని ప్రేమించాను. జీవితం చివరిదాకా మిమ్మల్ని గుండెల్లో కూచోబెట్టుకుని పూజల్చేసుకుందామనుకున్నాను. కాని నన్ను మీరు తిరస్కరించారు. నా ఆశల్ని అపహాస్యం చేశారు. నాలో ఏం తక్కువ నా కర్ధం కాకుండా చేశారు. ఎందుకో నాకు తెలియదనుకోండి. మీకు చాలా అందంగా వుంటాననే గర్వం బాగా వుంది. అందికే నన్నిలా చులకన చేశారు. చేస్తే చేశారు. పోనీండి. ఇక ముందైనా యితరుల విషయంలో యిలా చెయ్యడం మానుకోండి. మానుకోకపోతే మీకు జన్మలో పెళ్ళి కాదు. ఎందుకంటే తన అందానికి గర్వపడే మగాణ్ణి ఏ ఆడదీ ఎన్నుకోదు. ఒక్కమాట – నేను మీ నెచ్చెలి కావాలనుకున్నాను. కాని, మీ చెల్లెలు కావాలనుకోలేదు. కాబట్టి క్షమించండి.
సెలవ్,
శాంతిలత.
రెండోది –
ప్రియమైన సారధిగారూ, నమస్తే!
మీ ఉత్తరం అందుకుని చదివాను. మీతో కలిసి బ్రతికే భాగ్యం నాకు దక్క లేదు. కాబట్టి నేను చాలా దురదృష్టవంతురాల్ని. కాని ఎట్ ది సేమ్ టైమ్, నాలో కనీసం సోదరి అర్హత మీకు కనిపించినందుకు, అదృష్టవంతురాలిని. కృతజ్ఞురాలిని కూడా. దయచేసి మిమ్మల్ని ప్రేమించిన పొరపాటుకి నన్ను క్షమించండి.
మీ సోదరి,
శాంతిప్రియ.
మూడోది –
మీ ఉత్తరం చదివాను. నవ్వొచ్చింది. ఆశ్చర్యమేసింది. ఎందుకంటే మీ గురించి నాకంతా తెలుసుననుకున్నాను. నిజమే మరి. మగాడి గురించి తనకంతా తెలుసుననుకోడం అడదానికి తృప్తి. అడదాని గురించి తనకంతా తెలుసుననడం మగాడికి ఆనందంలాగ. నిజానికి ముగ్గురం కూడబలుక్కుని మిమ్మల్ని ఆడించాలనే ఉద్దేశ్యంతోనే ఆ ఉత్తరాలు రాశాం. కానీ మీ జవాబు అండాక నా మనస్సు నాకు తెలిసింది. మిమ్మల్ని ఎందుకు వేళాకోళం చెయ్యాలనిపించిందో, మీలో ఈ ఆకర్షణ ఏమిటో యింతవరకూ తెలియని నాకు మీ జవాబు సమాధానం చెప్పింది. మీ జవాబుతో అహం దెబ్బతిని వ్యక్తిత్వం బైటపడింది. నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు తెలిసింది. కాని మీరు నాలో సోదరిని చూశానన్నారు. అంతమాత్రం చేత నేను తల వెనక్కి తిప్పి మీకు దూరంగా వెళ్ళిపోను. నా కసలే పట్టుదల హెచ్చు. మిమ్మల్ని దక్కించుకోవాలనేదాకా నాకు నిద్రపట్టదు. మీరు నాలో సోదరిని చూసినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదు. నిజం చెప్పాలంటే భార్యలో – తల్లినీ, సోదరినీ, ప్రేయసినీ వూహించగల పురుషుడూ, భర్తలో- తండ్రినీ, తమ్ముళ్ళనీ, ప్రియుడినీ వూహించగల స్త్రీ- వాళ్ళు సుఖానికి ప్రతినిధులు. కాని ఈ జాబితాలో ఏవొక్క పేరో సాధారణంగా మిస్ అవుతూ ఉంటుంది. అందుకనే స్త్రీ పురుషుల చరిత్ర ఎప్పుడూ అసమగ్రంగా వుండిపోతోంది. కాబట్టి యిప్పుడు మనల్ని మనంగా అర్థం చేసుకుని, మన భావాల్ని పవిత్రంగా మలచుకోగలిగితే పరిపూర్ణత నిండిన ఒక జీవితానికి మనమూ ప్రతినిధులయ్యే అవకాశం వుంది. దయచేసి ఆలోచించండి. ఏమైనా నన్ను కాదనకండి. నాకు మీరు కావాలి. మీరే కావాలి. నేనెప్పటికీ మీ దాన్నే. త్వరలోనే పోజిటివ్ గా కలుస్తారని ఆశిస్తాను.
ఇట్లు,
ప్రేమంటే తెలిసిన పార్థసారధిగారికి
ప్రేమంటేనే తెలిసిన – శాంతిసిరి

ఉత్తరాలు మూడు చదువుకున్నాక సారధి పెదాలు అందంగా విరిసేయి. ఆ విరుపులో చిరునవ్వు మెదిలింది, అతని మనస్సులో ఆరోగ్యం కదిలింది. అప్పుడు సారధి మౌనంగా మూడో ఉత్తరాన్ని తీసి ప్రేమ రహస్యం చెప్పినట్లు మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత డైరీ తీసి ఆ రోజు పేజీలో దాన్ని యిష్టంగా దాచుకున్నాడు. సారధి అలా దాచుకుంటున్నప్పుడు గుమ్మం దగ్గర అలికిడి వినబడి తలతిప్పి చూశాడు. ఆరడుగుల ప్రభాకరం హడావుడిగా లోపలికొచ్చి, రుమాలుతో ముఖం మీది చెమట తుడుచుకొని, తెగని సంతోషాన్ని పౌడరు పులుముకున్నట్లు పులుముకున్నాడు. అప్పుడు అర్ధనిమీలిత నేత్రాలతో ఈజీ చైర్లోకి వాలిన పార్ధసారధి ఎడమ ఛాతీ మీదికి చెయ్యి పోనిచ్చి గుండె వెతుక్కుంటూ – ‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’ అనుకున్నాడు.

1 thought on “పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *