March 30, 2023

పెద్ద కొడుకు

రచన : ముక్కమల్ల ధరిత్రీ దేవి

వంటకాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకు చేర్చి, అన్నింటినీ ఓ సారి పరకాయించి చూసింది పావని.
” అమ్మయ్య! అన్నీ పెట్టేసాను. . ” అనుకుంటూ నిట్టూర్పు విడిచి, ఓ నిమిషం అక్కడే చైర్ లో కూర్చుని పైటకొంగుతో మొహమంతా తుడుచుకుంది.
సంక్రాంతి పండక్కి వచ్చిన మరిది, ఆడపడుచులు ఊర్లో బంధువుల్ని కలిసొస్తామంటూ వెళ్లారు. భర్త వెంకటరెడ్డి పొలంలో పని ఉందంటూ ఉదయమే వెళ్లాడు. పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. నెమ్మదిగా లేచి వాళ్ల కోసం ఎదురు చూస్తూ గేటు దాకా వెళ్ళింది పావని.
పావని ఓ మధ్య తరగతి ఇల్లాలు. పల్లెకు ఎక్కువా, పట్టణానికి తక్కువా అన్నట్టుండే ఓ మోస్తరు ఊర్లోని ఓ రైతు కుటుంబంలోకి కోడలిగా పదిహేనేళ్ల క్రితం అడుగు పెట్టింది. భర్త వెంకట రెడ్డి ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకంటే తల్లిదండ్రులకు అతనో వరం, ఆ కొడుకన్న వాడికి అదో పెద్ద శాపం అన్న తీరున ఉంటుంది అతని పరిస్థితి !
అతను ఇంటర్ చదువుతుండగా తండ్రి హఠాత్తుగా మరణిస్తే, కుటుంబ భారంతో పాటు ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడి బాధ్యత కూడా ఆ లేత వయసు లోనే అతని భుజాలపై పడిపోయింది. చదువుకు స్వస్తి పలికి బలవంతాన తల్లి తో పాటు
కుటుంబాన్ని లాగాల్సి వచ్చిందతనికి. ఫలితంగా, బాధ్యతగల కొడుకు, ఇంటికి పెద్ద దిక్కు, మంచివాడు అన్న బిరుదులైతే వచ్చేశాయి గానీ అన్నింటి నడుమ ఏళ్ళు గడుస్తున్నకొద్దీ తన ఉనికినే మరచిపోయే అయోమయ స్థితిలో పడిపోయాడతను!
అతనిచే తాళి కట్టించుకున్న పావని భర్తకు తగ్గ ఇల్లాలే అనిపించుకుంది. ఆమెను చూస్తే ఓ స్త్రీకి సహనం, మంచితనం, ఓపిక అన్నవి మరీ హద్దులు మీరి ఉండరాదనే సత్యం ఏ కాస్త గడుసుదనం గల ఆడదానికైనా ఇట్టే అర్థమైపోతుంది. కానీ పాపం పావనికి అర్థమవడానికే పన్నెండేళ్ళు పైనే పట్టింది. ఇద్దరు పిల్లలు పుట్టాక, వాళ్లు పెరిగి పెద్దవుతున్న కొద్దీ, ఇంటి పరిస్థితుల్లో వచ్చిన మార్పులు చూసే కొద్దీ ఆమెకు తన మీద తనకే జాలి పుట్టుకొచ్చేసింది. ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయి, క్రమంగా ఆమెలో అసహనం చోటు చేసుకోసాగింది.
ఇద్దరు ఆడబిడ్డలు విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి ల పెళ్లిళ్లూ, ఆ తర్వాత మరిది మాధవరెడ్డి పెళ్ళీ జరిగిపోయి, వాళ్ళ సంతానం హైస్కూళ్లలో చదివే వయసు కూడా వచ్చేసింది. అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళకంటూ పట్నాల్లో సొంత ఇళ్లు ఏర్పరుచుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ లూ బాగానే కూడబెట్టుకున్నారు. అన్న మాత్రం ఎలా ఉన్న వాడు అలానే ఉన్నాడు.
బాధాకరమైన విషయం, అతని కష్టంతో ఎదిగిన వాళ్ళు కనీసం అతని గురించీ, అతని పిల్లల గురించీ ఏమాత్రం పట్టించుకోక పోవడం! వాళ్ల ఎదుగుదలకు అతన్నో నిచ్చెనగా మాత్రమే వాడుకున్నారన్న భావన వెంకటరెడ్డి లో ఏ మూలనన్నా పొడసూపిందా అన్న ప్రశ్న పావనిని ఈ మధ్య ఎందుకో తొలిచేయసాగింది. ఆమెకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం. కొడుకు కష్టాన్ని పసితనం నుండీ చూస్తున్న తల్లి రాధమ్మ కూడా అతన్ని గుర్తించకపోవడం! పైగా అదేదో అతని బాధ్యత అనీ, ఇందులో ఏముందీ అందరూ చేసేదేగా అన్న అభిప్రాయంలో ఆవిడ ఉండిపోవడం! అది పావనిని మరీ వేధిస్తున్నదీ మధ్య.
పెళ్లయి ఇన్నేళ్లయినా ప్రతీ పండక్కీ ముఖ్యంగా సంక్రాంతికి, ఉగాదికి, దసరాకు క్రమం తప్పకుండా ఇద్దరాడపడుచులూ, భర్త పిల్లలతో సహా దిగి పోతారు. వాళ్లతో పాటు మరిది కుటుంబమూను. వాళ్లందరికీ వండి వార్చడం, అన్నీ దగ్గరుండి వాళ్లకు కొత్త చుట్టాలకు మల్లే మర్యాదలు చేయడం, ఏ మాత్రం లోపం జరిగినా రాధమ్మ కోడల్ని విసుక్కోవడం, ఆడబిడ్డలు సణుక్కోవడం, మూతులు ముడుచుకోవడం. !
వెంకటరెడ్డి అన్నీ గమనిస్తూనే ఉన్నా, అతని మౌనం పావనికి అర్థం కాదు. భర్త మంచివాడైతే భార్యకు సంతోషమే. కానీ అతని మంచితనం భార్య అనే దాని కష్టాలకు మూలమయితేనే సమస్య. ఆ విషయం ఈ మనిషి ఎందుకు గ్రహించడు?
ఆలోచనల్తో సతమతమవుతున్న పావని బయట అలికిడి వినిపించి లేచింది. బంధువుల ఇంటికి వెళ్ళిన వాళ్లంతా బిలబిలమంటూ లోనికి వచ్చేశారు. పది నిమిషాల్లో అంతా డైనింగ్ టేబుల్ దగ్గర చేరిపోయారు. ఇద్దరాడపడుచులూ, వాళ్ల భర్తలు, పిల్లలు, మరిది, అతని కుటుంబం. వాళ్లతో పాటు అత్తగారు మహదానందంగా చేరిపోయింది. అంతా కబుర్లాడుకుంటూ భోజనాలకుపక్రమించారు. పొలానికి పనిమీద వెళ్ళిన భర్త కోసం చూస్తూ బయట కూర్చుంది పావని.

** ** ** **

వారం గడిచింది. పండగ సందడి, ముచ్చట్లు తీరాయి. అంతా సర్దుకుని ఎవరి ఊళ్లకు వాళ్ళు బయలుదేరారు. వెళ్లేముందు అంతా రాధమ్మ కాళ్లకు దండం పెట్టి, ఇద్దరు కూతుళ్లు, చిన్న కోడలు ఆవిడ చేతిలో తలా ఒక చీర పెట్టారు. అడపాదడపా ఇలాంటి కానుకలతో ఆవిణ్ణి సంతోషపెట్టడం వాళ్లకదో అలవాటుగా మారిపోయింది. అవి పుచ్చుకున్న అత్తగారి మొహం వెలిగిపోయేది. ఎన్నో సంవత్సరాలుగా చూస్తోందీ తతంగాన్ని పావని. కష్టమొకరిది, ఫలితమేమో మరొకరిది అన్నట్టు గొడ్డు చాకిరీ చేసేది తనైతే కానుకలేమో అత్తగారికి!అలాగని వాళ్లిచ్చే వాటికోసం ఎన్నడూ ఏమాత్రం ఆశించలేదు పావని. అదామె స్వభావం కూడా కాదు. కానీ అందరిలో ఏ ఒక్కరికీ వచ్చేటప్పుడు తన పిల్లలిద్దరికీ ఏ పండ్లో, స్వీట్లో తీసుకురావాలన్న ఇంగితం ఏమాత్రం లేకపోవడం ఆమెకు మహబాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రతీ సంవత్సరం వెళ్లేటప్పుడు వాళ్ళ వాటా పొలం తాలూకు డబ్బులు చేతిలో వేసుకునే వెళ్తారు. వాటి తాలూకు బాధ్యతంతా నెత్తినేసుకుని చేసేవాడేమో తన భర్త!
కాపురానికొచ్చినప్పట్నుంచీ చూస్తోంది, పొలం పనుల కోసం భర్త ఎంత శ్రమ పడుతున్నదీ. అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా పొలాలకు నీళ్లు పెట్టాలంటూ వెళ్లడం, ధాన్యానికి కాపలా కోసం అక్కడే పడుకుండి పోవడం, మరోవైపు కూలీలు దొరక్క తక్కువైన నాడు వాళ్లతో పాటు తనూ ఓ కూలీలా ఒళ్ళు వొంచి పని చేయడం. ! వీటన్నిటితో నలిగిపోతూ తన ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టడం! అంతకన్నా బాధపెట్టే విషయం తనతో రెండు మాటలు మాట్లాడే తీరిక గానీ, పిల్లలతో కాసేపు సరదాగా గడపడం గానీ తాము ఎరక్క పోవడం ! ఇదంతా అవసరమా? ఇలా ఎంతకాలం? ఈమధ్య తనకీ ఇంటెడు చాకిరీ చేయలేక నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తోంది.
అలాగని భర్త తోబుట్టువులు మంచి వాళ్ళు కాదు అని ఆమె ఉద్దేశం కాదు. కాకపోతే, చిన్నతనం నుండీ అంతా అమ్మ, అన్న చూసుకుంటారులే అనుకుంటూ ఓ సౌకర్యవంతమైన స్థితిలో పడిపోయి ఇప్పటికీ అందులో నుండి బయటకు రావాలని వాళ్లకనిపించకపోవడమే పావనికి కొరుకుడు పడని విషయం !
ఎప్పటిలా మనసంతా చేదుగా అయిపోయింది పావనికి. గత రెండేళ్ల నుండీ ఈ బాధ ఆమెను తొలిచేస్తూ ఉంది. కానీ ఏం చేయగలదు?
మరో అరగంటలో ఇల్లంతా ఖాళీ అయిపోయి, తాము మాత్రమే మిగిలారింట్లో.

** ** **

సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. మరో ఉగాది, మరో దసరా వచ్చి యధావిధిగా జరిగిపోయాయి. మళ్లీ సంక్రాంతి రాబోతోంది. ఆ సాయంత్రం రాధమ్మ బయట కూర్చున్న కొడుకు వద్దకు చేరి, మెల్లిగా గొంతు విప్పింది.
” వెంకటరెడ్డీ, రెండు వారాల్లో పండగొస్తోంది. చెల్లెళ్లకు, తమ్ముడికీ ఫోన్ చేసి పండక్కి రమ్మంటూ ఓ మాట చెప్పేయరా. . ”
” చెప్పాలేమ్మా . పండక్కి కాదు, రేపు ఆదివారం నాడు రమ్మని ముగ్గురికీ ఫోన్ చేసి చెప్పేశాను. ఎల్లుండి వస్తామన్నారు”
అన్నాడు వెంటనే అందుకొని వెంకట్ రెడ్డి.
” ఎల్లుండా. . ? అదేమిట్రా. పిల్లలకు అప్పుడే సెలవులు ఇస్తారా?. . ”
” పిల్లలతో కాదు లేమ్మా, వాళ్లు ముగ్గుర్ని మాత్రమే
రమ్మన్నాను. వాళ్లతో మాట్లాడి కొన్ని సెటిల్ చేయాల్సిన పనులున్నాయి . అందుకని. ”
” పండక్కి వచ్చాక మాట్లాడొచ్చు కదరా, ఈ లోగానే ఎందుకూ అని?. . ”
” లేదు లేమ్మా. పండక్కి మేము ఇక్కడ ఉండటం లేదు. పావని, పిల్లల్ని తీసుకుని ఓసారి హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నాను. ”
విస్తుపోయి రాధమ్మ నిటారుగా అయిపోయింది.
” మీరు హైదరాబాద్ వెళ్తే ఎలా రా? వాళ్లు పండగకి ఇక్కడికి వస్తుంటే?. . అయినా ఇప్పుడు హైదరాబాదు ఎందుకని వెళ్లడం ఇలా హఠాత్తుగా. . ? ”
” వాళ్లు రారు లే అమ్మా. . దాని గురించి మాట్లాడడానికే వాళ్లను రమ్మన్నాను. ”
” అది కాదు రా. ”
” అమ్మా, ఇక నువ్వేమీ మాట్లాడకు. . ”
ఆమెకు మరి మాట్లాడే అవకాశం ఇవ్వక లేచి బయటకు వెళ్ళిపోయాడు వెంకట్ రెడ్డి. లోపల ఉన్న పావనికి అంతా వినిపిస్తూనే ఉంది. కానీ భర్త మాటలు ఆమెకర్థం కాలేదు. కానీ ఏదో జరగబోతోందని మాత్రం ఆమె మనసు గ్రహించింది.

** ** ** **

తల్లితో అలా మాట్లాడాడు గానీ ఆ క్షణం నుండీ వెంకటరెడ్డి మనసు మనసులో లేదు. ఫోన్ అయితే చేసి చెప్పాడు గానీ, వాళ్లొచ్చాక విషయం ఎలా ప్రస్తావించాలో అతనికి బొత్తిగా బోధపడడం లేదు. ఎంతో సున్నితమైన విషయం. వాళ్లు నొచ్చుకోకుండా చెప్పగలగాలి. తన ఆలోచనని వాళ్లు సమర్థిస్తారా? అర్థం చేసుకుంటారా? అలాకాక అపార్థం చేసుకుంటే ఇన్నేళ్లుగా తాను పడ్డ కష్టం, శ్రమ వృథా అయిపోదా! అదే జరిగితే ఇంతకాలం ఎంతో సహనంగా భరించిన తాను వాళ్ల దృష్టిలో చులకనై పోడా! ఆ విధంగా ఎంతో ఒత్తిడికి లోనవసాగిందతని అంతరంగం. ఏది ఏమైనా గానీ అనుకున్న ప్రకారం చేయక తప్పదు అనుకుంటూ తనను తాను సముదాయించు కున్నాడు.

** ** ** **

” అన్నా, ఏంటన్నా ఇది. . ? ఎప్పుడైనా అడిగామా ఇలా పంచివ్వమని?. . ”
ఒకింత కినుకగా, నొచ్చుకుంటూ అడిగాడు తమ్ముడు మాధవరెడ్డి.
అనుకున్న ప్రకారం వచ్చిన చెల్లెళ్లు విజయలక్ష్మి, రాజ్యలక్ష్మినీ, తమ్ముడు మాధవ రెడ్డినీ, మరో పక్క తల్లినీ కూర్చుండబెట్టి , మెల్లిగా మొదలెట్టాడు వెంకటరెడ్డి. మొదట తడబడ్డా నెమ్మదిగానే అయినా క్రమంగా నిశ్చలంగా సాగింది అతని మాట.
మాధవ రెడ్డి అన్న మాటతో చెల్లెళ్లిద్దరూ ఏకీభవిస్తూ బాధగా అన్నారు,
” మాధవ చెప్పింది రైటే కదన్నా. మేమటుంచి మీ బావగార్లు కూడా ఏనాడూ మాకు ఇస్తామన్న పొలాల గురించి అడగలేదు కదా. ”
అన్నారు ముక్తకంఠంతో.
” మీరడిగారని కాదమ్మా, . . పాతికేళ్లుగా ఒక్కడినే ఈ భారం మోస్తున్నాను. ఇకపై నావల్ల కాదనిపించింది. అందుకే ఇలా చేయాల్సి వస్తోంది. మీకు బాధనిపిస్తే మన్నించండి. ”
క్షణమాగి కొనసాగించాడు,
“ కౌలు కిద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా, పంటలు లేవంటూ కౌలు డబ్బులు సరిగా ఇవ్వడం లేదు. రైతుల పరిస్థితి మీకు తెలియనిదా ఏమి? అంతా నేనే చేయాలంటే, ఈమధ్య కొంతకాలంగా నాకున్న శక్తి సరిపోవడం లేదు. అందుకే కాస్త అయినా ఈ భారం తగ్గితే బాగుంటుందన్న ఆలోచనతో ఇలా చేయాలనిపించింది. పోతే మరొక విషయం కూడా మీకు చెప్పాలి. ”
“పోయిన సారి పండక్కి వచ్చినప్పుడు మీరంతా చెప్పుకుంటుంటే విన్నాను, మీ పిల్లల చదువుల గురించీ, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికల గురించీ. . అప్పుడు తట్టింది నాకు, తండ్రిగా నా పిల్లలకు నేనేం చేస్తున్నానని! చెప్పాలంటే ఆరోజు మీ మాటలే నేనిలా ఆలోచించడానికి పురికొల్పాయి. నేనెలాగూ చదువుకో లేకపోయాను. నా పిల్లల్నయినా చదివించు కోవాలి కదా! ఈ పొలాల బాదరబందీలో పడి అసలు వాళ్ళు ఏంచేస్తున్నారో, ఏంచదువుతున్నారో కూడా తెలీడం లేదు నాకు. ఇంతవరకు చేసింది చాలు, ఇక నుంచైనా నా కూతురు, కొడుకు గురించి పట్టించుకోవాలనిపించింది. ఇది మిమ్మల్ని చూశాకే నేర్చుకున్నాను. నాది స్వార్థమనుకోండి, మరేదైనా అనుకోండి”అని, తల్లి వైపు తిరిగి,
“ అమ్మా , నాన్న చనిపోయినప్పుడు మనకున్నది పన్నెండు ఎకరాలు. ప్రతీ సంవత్సరం వీళ్ళకివ్వాల్సింది ఇస్తూ, పొదుపుగా సంసారాన్ని నడుపుతూ మరో నాలుగెకరాలు కొన్నా. అదంతా నీ పేరిటే ఉంది, నీకు తెలుసు. చెల్లెళ్లకు పసుపుకుంకాల కింద ఇస్తామన్నది ఇచ్చేస్తే మిగిలింది నీ పేరిట, మాధవ పేరిట మార్పించేయమ్మా. అప్పుడు వాళ్లకూ బాధ్యత, అందులో లోటుపాట్లూ తెలుస్తాయి. నిన్ను వేడుకుంటున్నాను. . నీతో ముందుగా సంప్రదించకుండా ఇలా మాట్లాడుతున్నందుకు కోపగించక అర్ధం చేసుకో. నీ వాటా పొలం బాధ్యతంతా నేనే తీసుకుంటాను. ఒప్పుకోమ్మా. మాధవా, అమ్మ, మీరూ కూర్చుని మాట్లాడుకుని రేపటికంతా మీ నిర్ణయం చెప్పేయండి. ”
నోట మాట రాక చూస్తున్న వాళ్ల హావభావాలు పట్టించుకోకుండా కొనసాగించాడు వెంకటరెడ్డి.
“ మీ ఇష్టం. మీ వాటా పొలాలు కౌలుకే ఇచ్చుకుంటారో, లేదా అమ్మేసుకుంటారో. . అదంతా మీకే వదిలేస్తున్నా. . నేను మాత్రం ఇకమీదట ఈ భారం మోయలేను. అర్థం చేసుకోండి. “లేచి నిలబడ్డాడు వెంకటరెడ్డి.
” ఆగరా! నాతో ఒక్క మాటయినా చెప్పకుండా ఇలా చేస్తున్నావేంట్రా?అయినా వాళ్ళకేం తెలుసని పొలాల గురించి, ఉన్నపళాన నీవిలా చేస్త? ”
హఠాత్తుగా కొడుకు నోటెంట వచ్చిన మాటలు విని, దిగ్గున లేచింది రాధమ్మ.
” నా గురించి నీవు ఏమి ఆలోచిస్తున్నావనమ్మా అన్నీ నీకు చెప్పి చేయడానికి? నిజానికి నీకుగా నీవే ప్రస్తావించ వలసిన విషయమిది. వాళ్ళకేం తెలుసని అంటున్నావు, నాన్న చనిపోయినప్పుడు నా వయసెంతో ఓసారి గుర్తు తెచ్చుకోమ్మా. అప్పుడు నాకేం తెలుసని నామీద అంత భారం మోపావు?. . ”
అవాక్కయిపోయింది రాధమ్మ.
“ అప్పుడు వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి సరే అనుకున్నా. ఎల్లకాలం చిన్నవాళ్లుగానే ఉంటాం అంటే ఎలా చెప్పమ్మా? హక్కులు అనుభవిస్తామ నుకుంటున్నప్పుడు బాధ్యతలు కూడా పంచుకోవడానికి సిద్ధపడాలి కదా ! ఎవరైనా ఎంతకాలమని ఒక్కరే భారం మోయగలరు? తల్లివి నీకా విషయం తట్టదు. వాళ్లేమో ఆ ఊసే ఎత్తరు. ”
” చెల్లెళ్లను మంచి ఉద్యోగస్తులకిచ్చి పెళ్లిళ్లు చేశాం. తమ్ముణ్ణి బాగా చదివించాం. ఇప్పుడు వాడు పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ”
“ సరే! ఆరోజు నీవు నీ పిల్లల గురించి ఆలోచించావు. ఈరోజు నేనూ నా పిల్లల గురించి ఆలోచించాలా వద్దా? ఈ ఊళ్లో ఈ వానాకాలం చదువులతో వాళ్ల భవిష్యత్తు ఏమైపోవాలి?. ”
కాస్త తమాయించుకుని, అటుతిరిగి ముగ్గురి వేపు చూస్తూ,
” మీరు బాధ పడతారని తెలుసు. కానీ తప్పనిసరై ఇలా మాట్లాడాల్సివస్తోంది. మళ్లీ చెప్తున్నా. . అర్థం చేసుకోండి. ”
అప్రయత్నంగానే వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
” మరో మాట. . మాధవా, నేను మీ వదిననీ, పిల్లల్నీ తీసుకుని రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. పుట్టి బుద్ధెరిగాక పిల్లలు ఈ ఊరు దాటి ఎరుగరు. అదో కారణమైతే, కొంతకాలంగా మీ వదిన ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. తనని ఓ మంచి డాక్టర్ కు చూపించాలి.”
అంతవరకూ స్థిరంగా బాగానే మాట్లాడగలిగిన వెంకటరెడ్డి గొంతు గాద్గదికంగా మారి ఆపై మాట్లాడలేక అక్కడే ఉన్న మంచం మీద కూలబడిపోయాడు. రాధమ్మ కంగారుగా లేచింది. మాధవ రెడ్డి, చెల్లెళ్ళు గబగబా అన్న దగ్గరికెళ్లి పట్టుకున్నారు. లోపలున్న పావని ఒక్కసారిగా బయటికి వచ్చేసింది.
కాసేపటికి తేరుకున్న వెంకట రెడ్డి, పర్వాలేదంటూ మెల్లిగా లేచి నిలబడి,
“అమ్మ మాతో వస్తానంటే సరే, లేకుంటే మాధవా, రేపు వెళ్లేటప్పుడు నీతో పాటు తీసుకుని వెళ్ళు. మేం తిరిగి వచ్చాక, పిల్చుకుని వస్తాను. ”
వెంటనే అందుకుంది రాధమ్మ. .
” ఒరేయ్ వెంకట్ రెడ్డీ, నేనెక్కడికీ రాలేను, ఎక్కడికీ వెళ్ళను కూడా. ”
“సరేనమ్మా, నీకు తోడుగా ఇంట్లో ఎవరైనా ఉండేలా ఏర్పాటు చేసి వెళ్తాను. ”
ఆమె మరో మాట మాట్లాడేలోగా ముందుకు కదిలి వెంటనే ఏదో గుర్తొచ్చి, వెనుదిరిగి
“ఈ విషయంలో మీ వదిన ప్రమేయమేమీ లేదు. అంతా నా ఆలోచనే. అమ్మతో పాటు తనకీ ఇప్పుడే ఈ విషయం తెలిసింది. . ”
అంటూ బయటికి నడిచాడు. జరుగుతున్న దాంట్లో భార్య భాగస్వామ్యం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం వాళ్లకు రాకుండా ఓ హెచ్చరికలా ఆ మాట అన్నాడన్న విషయం వాళ్లకు స్పష్టంగానే అర్థమైంది.
మృదువుగా, ఆప్యాయంగా తప్ప ఏనాడూ కంఠంలో విసుగు కూడా ధ్వనింపజేయని తమ అన్న ఇలా మాట్లాడి వెళ్లడం ఆ ముగ్గురికీ మింగుడు పడలేదు చాలాసేపటి వరకూ. మెల్లిగా వాళ్లలో కదలిక మొదలై ఆలోచనలో పడ్డారు. ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్నారు అన్నని, కష్ట పడటం తప్ప ఎవరినీ నొప్పించని మనస్తత్వం అతనిది. ఈనాడిలా ఆయనలో కలిగిన మార్పుకి కారణం ఎవరు? తామేనా?
నిజమే ! ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి, ఉగాది, దసరా అంటూ, పుట్టిల్లు అంటూ తామిక్కడికి రావడమే గానీ ఏనాడూ అన్నా వదినల్ని, వాళ్ళ పిల్లల్ని తమ ఇంటికి ఆహ్వానించలేదెవ్వరూ ! వదిన కూడా ఓ ఇంటి ఆడపడుచే. కానీ తామంతా ఇక్కడికి వస్తే చేసే వాళ్ళు ఎవరని అమ్మ ఆమెను పుట్టింటికి పంపేది కాదు. వదిన సహనం, అన్న మంచితనం. ఈ రెండింటినీ అమ్మ తో పాటు తాము ముగ్గురూ కూడా బాగా వాడుకున్నారిన్నాళ్లూ. అటు మాధవరెడ్డీ అంతే. కొడుకుగా బాధ్యతలు పంచుకోవాల్సిన ధర్మం తనకూ ఉందన్న సంగతి ఏమాత్రం పట్టించుకోక భారమంతా అన్న భుజాలపై పడేసి తాను మాత్రం నిశ్చింతగా ఉంటున్నాడు. అలా మాధవ రెడ్డి లో కూడా అంతర్మధనం మొదలైంది.

** ** ** ** **
ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టక అసహనంగా అటూ ఇటూ కదులుతోంది రాధమ్మ. మొదట్లో కొడుకు ప్రవర్తన వింతగా అనిపించినప్పటికీ క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారిపోతున్న కొద్దీ వాడి వాదనలో నిజం ఎంతో ఉందనిపించసాగిందామెకు. చాలా కాలం తర్వాత పాతికేళ్లు వెనక్కి వెళ్లి గతంలోకి తొంగి చూసిందామె. ఎన్నడూ జిర్రున చీది ఎరుగని తన భర్త అకాల మరణం! నడి సముద్రంలో నావ! పరామర్శించి పోయే చుట్టాలే తప్ప అండగా ఎవరూ ఉండలేని దుస్థితి!ఎటు కదలాలో దిక్కుతోచక తల్లడిల్లుతున్న తనకు చుక్కానియై దారి చూపించాడు తన పెద్ద కొడుకు. వాడి తర్వాత ఇద్దరూ ఆడపిల్లలు. చిన్నవాడు మాధవరెడ్డికి అప్పుడు పదకొండేళ్లవయసు. గడప దాటి పొలాల వైపు ఏ రోజూ వెళ్ళని తనకు ధైర్యం చెప్పి, బ్రతుకు బండి కావడి తన భుజాలపై వేసుకుని తనను ముందుకు నడిపించిన తన పెద్ద కొడుకు ఓర్పు, నేర్పు ఆమె కళ్ళముందు కదలాడాయి. తనకెంతో ఇష్టమైన చదువును పక్కన పెట్టేయడానికి ఎంత బాధ పడి ఉంటాడు! వాడే లేకపోయుంటే తనేమైపోయుండేదో !
కానీ తనేం గుర్తించింది గనుక ! అందుకేనేమో, సహనం పేరిట గూడుకట్టుకున్న ఆ అగ్ని గుండం ఇవాళ ఇలా ఒక్కసారిగా బద్దలైంది. ఏ చిన్న విషయం తనను అడక్కుండా అడుగు ముందుకేయని వాడు ఈరోజు ఇలా మాట్లాడాడంటే ఎంత నలిగి పోయుంటాడు ! అదీ తన కోసం కాదు, తనదీ అనుకుంటున్న కుటుంబం కోసం! నిజమే కదా, ఆరోజు తన కుటుంబం కోసం తను ఆలోచించింది. ఈరోజు వీడూ అదే చేశాడు. అది స్వార్థం ఎలా అవుతుంది? వాడన్నది అక్షరాలా నిజం. నేనే ప్రస్తావించాల్సిన విషయమిది. మనసంతా కుంచించుకుపోయిన ఆమెలో అపరాధ భావన! మొదటిసారిగా ఆమెలోని తల్లి మనస్సు మేల్కొని కొడుకుపై అవ్యాజానురాగం మొదలైంది.
“అయినా అవసరం తీరాక కూడా భారమంతా వాడే మోయాలనుకోవడం ఎంతవరకూ భావ్యం ! ఇంతవరకూ నాకా విషయమే తట్టకపోవడం నా అవివేకమే. . నాది చాలా పొరపాటు. సరిదిద్దాల్సిన బాధ్యతా నాదే. ”
“ఇంతకాలంగా నోటిమాటగా చెప్పిందే సాగుతూ వస్తోంది. ఇక అలా వద్దు. ఆడ పిల్లలకు ఇచ్చేయాల్సింది ఇచ్చేసి, కొడుకులిద్దరికీ వాళ్ళ వాటా వాళ్లకు రాసిచ్చేస్తాను. నాదేముంది? పెద్ద కొడుకు నీడలో నిశ్చింతగా కాలం వెళ్లమారిపోతుంది. ”
ఆలోచనలోకొలిక్కి వచ్చి స్థిరంగా నిర్ణయించేసుకుంది రాధమ్మ. అంతదాకా ఆవరించుకున్న మబ్బులు వీడి ఆమె మనసంతా నిర్మలంగా అయిపోయింది.

** ** ** ** **
అవతల వంటిల్లు సర్దుకుంటూన్న పావనిలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి ! భర్త మౌనం తనకు అర్థం కావటం లేదనుకుంది కానీ, ఆ మౌనం వెనుక తన పట్ల, పిల్లల పట్ల దాగి ఉన్న ప్రేమ, శ్రద్ధ ఈరోజే చూసింది.
పండగలకొచ్చినప్పుడల్లా ఆడపడుచుల ఇంకా మరిది పిల్లలతో తన పిల్లలను పోల్చుకుని చాలా బాధపడేది. కానీ తండ్రిగా పిల్లల ఉన్నతి కోసం భర్త పడే తపన, అది తీరే మార్గం కోసం ఇప్పుడాయన తీసుకున్న నిర్ణయం అతని లోతైన ఆలోచనల్ని స్పష్టం చేసింది. ఇన్నాళ్ల తన నిరీక్షణ ఫలించిందన్న సంతోషం ఆ ఇల్లాల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ముఖ్యంగా ఆయన తన గురించి అన్న మాటలు.
” కొంతకాలంగా మీ వదిన ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. తనని ఓ మంచి డాక్టర్ కు చూపించాలి. . ”
పదే పదే గుర్తొచ్చి పులకించిపోయింది. ఓ సగటు భార్య భర్త నుండి అంతకన్నా ఏం ఆశిస్తుంది !
పనులన్నీ ముగించుకొని గదిలోకి అడుగు పెట్టబోతూ ఆగింది పావని. అక్కడ కింద పరచుకున్న చాప మీద వెంకటరెడ్డి ! ఇరువైపులా పిల్లలిద్దరూ ! నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
” నాన్నా, ఈ సంవత్సరం నాది సెవెంత్ అయిపోతుంది. ఎయిత్ క్లాస్ ఈ ఊర్లో లేదు కదా
నన్నెక్కడ చేర్పిస్తావు? ”
అడుగుతోంది పాప.
” నాన్నా, ఓసారి మమ్మల్ని హైదరాబాదు తీసుకెళ్లి, అన్నీ చూపిస్తానన్నావు కదా, ఎప్పుడెళ్తున్నాం?. . ”
బాబు ప్రశ్న ! ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని నవ్వుతూ జవాబు చెప్పబోతున్నాడు వెంకటరెడ్డి.
ఇదివరకెన్నడూ ఎరగని ఆ మనోహర దృశ్యం కంటబడేసరికి, మనసంతా చెప్పలేని ఆనందంతో నిండిపోయి తృప్తిగా నవ్వుకుంది పావని.

**************

1 thought on “పెద్ద కొడుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2022
M T W T F S S
« May   Jul »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930