May 26, 2024

మోదుగ పూలు – 11

రచన: సంధ్య యెల్లాప్రగడ

వివేక్‌ లేచి కూర్చున్నాడు. చేయి విపరీతంగా సలుపుతోంది. రామును చూస్తే అతని తల నుంచి రక్తం కారుతోంది. క్షణం పాటు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. లేచి బండికున్న బ్యాగులోంచి ఒక టవల్ తీసి రాము తలకు కట్టు కట్టాడు. ముందు రక్తం కారటం ఆగాలి. అతని తలకు కట్టాక, మరో టవల్ తీసుకొని చేతికి కట్టుకున్నాడు.
“దగ్గరలో మనకు ఆసుపత్రి ఉంటుందా?” అడిగాడు ఊపుతూ రాముని.
“ఆ… ఆ రోడ్డు సీదా పో!” కళ్ళు మూతలు పడుతుండగా చెప్పాడు.
“లే. కళ్ళు మూసుకోకు…. ” అంటూ రాముని బండి ఎక్కించి వెనకకి త్రిప్పాడు. కొండ దిగటము, కాబట్టి బండి వేగం పుంజుకుంది. ఒక్క చేత్తో బ్యాలెన్సు చేస్తూ గంటలో జనగాం చేరారు.
‘బండి ట్రబుల్ ఇవ్వలేదు అదృష్టం కొద్ది!’ అనుకున్నాడు వివేక్ .
కానీ అతని చెయి వాచిపోయింది బాగా . జనగాంలో ఎంటరైన వెంటనే ఎదురుపడ్డ ఒక ప్రవేట్‌ హస్పిటల్ వెళ్ళాడు. బండిని నిలబెట్టి రాముని దింపి నడిపిస్తూ ఉంటే నర్సులు సాయం కొచ్చారు పరుగున. రామును తీసుకుపోయారు లోపలికి. రాముకు తలపై కుట్టు వేసి కట్టు కట్టేరు. ఆ రోజు జ్వరం కూడా వచ్చింది రాముకు.
వివేక్ చేతి విరిగినదని క్యాస్టు వేసారు. రెండో రోజుకు కొద్దిగా తేరుకున్నాడు రాము.
ఇద్దరివి పెయిన్‌కిల్లర్సు తీసుకొని, ఆటో ట్రాలీ మాట్లాడుకొని, దానిలో బండి వేసుకొని, మామిడిపల్లి వచ్చి పడ్డాడు వివేక్. రాముని వారింటికి చేర్చాడు.
అలా అడ్వేంచరస్‌గా చేద్దామనుకున్న యాత్ర మూడు రోజులకే ఇంటికి చేర్చింది. చాలా మూడ్‌ చెడింది వివేక్‌కు. ‘ఎంతో అనుకున్నా అది కాస్త ఇలా ప్రమాదంలో పడ్డామే’ అని మనస్సులో మధన పడ్డాడు.
“ఇది టైం కాదని చెట్టుదేవర ఆపిందిలే తమ్ముడూ!” అన్నాడు రాము నవ్వుతూ.
రాము తండ్రి మాత్రం వివేక్‌కు వేలవేలసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రాము బ్రతకటం కేవలం వివేక్‌ మూలంగానేయని, లేకపోతే ఊహించలేమని…
వివేక్‌కు నిరుత్సాహంగా ఉన్నా, మిత్రుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని సంతోషించాడు.

***
వివేక్‌ విరిగిన చేయి అతకటానికి రెండు నెలలు పట్టింది. విరిగినది ఎడమ చేయి కావటాన రాయటానికి ఇబ్బంది పడలేదు. రాముకే తల దెబ్బ ఒక పట్టాన తగ్గలేదు. రాము నాయన అతనికి నాటు వైద్యము కూడా చేశాడు. రోజూ పసరులు త్రాగించేవాడు. అతనికి జ్వరము కూడా చాలా రోజులే ఉంది. కుట్లు మానాయి కాని తలనొప్పి వచ్చేది. దాంతో అతని రీసెర్చును కొద్దిగా వాయిదా వేసుకున్నాడు.
వివేక్ రాము చదువుతున్న మెటీరియల్ వీలైనన్ని తెచ్చుకునేవాడు. కుదిరినంత చదువుదామని. గోండు, కలామీ కూడా మాట్లాడటం ప్రాక్టీసు చేస్తున్నాడు. బడి పిల్లలకు వాళ్ళ టీచరుకు నేర్పటం తెగ సరదాగా ఉండేది. వాళ్ళు ప్రతి మాటకు చెప్పటం, నవ్వటం. వాళ్ళని చూస్తే అడవిలో మోదుగపూలు గుర్తుకువస్తాయి వివేక్‌కి. ‘ఈ పువ్వుల్లా వీళ్ళు కళకళలాడాలి నిత్యం!’ అనుకునేవాడు ఎప్పుడూ.
గిరిజనులు కాలాన్ని ఋతువులతో కొలుస్తారు. ఆ ఋతువులలో పండగలను వేడుకగా చేసుకుంటారు.
అడవిలో కాలం మార్పు చాలా స్పష్టంగా తెలుస్తోంది వివేక్‌కు. వాన పడినప్పుడు ఆకుల చప్పుడు, తెల్లవారు జామున నడకలో ఫ్రెష్ గా కనపడే మార్పులు చాలా ఉత్సాహంగా గమనించేవాడు.
ఆ వానా కాలం దాటాక వచ్చే దసరా సెలవల కోసము పిల్లలు తెగ ఎగబడుతున్నారు. ఆ సెలవల తరువాత అంతర జిల్లా కళా పోటీలకు తయారు కావాలని ప్లాను వేసుకుంటున్నారు. ఆ పోటీలు డిసెంబరులో ఉంటాయట. దానికి వెళ్ళాలని తమ స్కూలుకు కప్పు తేవాలని వాళ్ళు చాలా కాలంగా కబుర్లు చెబుతున్నారు. వివేక్‌కు వాళ్ళు చెప్పే కబుర్లు ఆ పోటీల గురించే.
ఈ విషయము టీచర్ల స్టాఫ్ రూములో కూడా చాలాసార్లే ప్రస్థావనకు వచ్చింది. ‘టీచర్లు కూడా అది గొప్ప ప్రతిష్టగా తీసుకుంటున్నారని’ అనుకున్నాడు వివేక్‌.
అప్పుడే తెలిసింది అతనికి ఆ పోటిలలో కప్పు తెచ్చుకోవడము ఎంతో ముఖ్యమో పాఠశాలలకు. ఆ గురుకులము వారు యోగాలో కప్పు తెస్తున్నారు కానీ నృత్య పోటీలలో తెచ్చుకోలేకపోతున్నారు. అందుకే వారు చాలా పట్టుదలగా ఉన్నారు ఈ ఏడు.
వారి గిరిజన నృత్యంతో పాటూ సినిమాపాటలకు కూడా డాన్సు చేయాలన్న విషయముపై చాలా రోజులుగా మాటలు నడుస్తున్నాయి. వివేక్‌కు ఇదంతా విచిత్రంగా ఉంది. అతను అన్నీ గమనించటం తప్ప ఎవ్వరికీ ఏ విషయమై సలహా ఇవ్వగలిగే అనుభవంలేదు. అందుకే కేవలము మధు సార్‌కు సహాయకునిగా పని చెయ్యటం, కొత్తవి నేర్చుకోవటమే సరిపోతోంది.
ఒక రోజు ఉండబట్టలేక కొలామీలో గానీ, గొండులో కానీ ఎదైనా నాటకం ప్రదర్శించమని సలహా ఇచ్చాడు. మిగిలిన టీచర్లు తేలికగా తీసుకున్నారు.
“అది ఎవరికీ అర్థం కాదు. జడ్జులకు అర్థం కాకపోతే మనకేమి బహుమతి వస్తుంది” అని కొట్టిపడేశారు మిగిలిన టీచర్లు.
“మనం సంస్కృత భాషలో, షేక్సఫియర్ ఇంగ్లీషులో నాటకాలు ఎగబడుతూ నటిస్తాము. మరి గోండుల స్వాతంత్ర పోరాటం నాటకముగా వెయ్యవచ్చు కదా? మన బడిని నిలబెట్టినట్లుగా ఉంటుంది. పిల్లలకు వారి మాతృభాషలో కాబట్టి సహజంగా ఉంటుంది” అంటూ ప్రపోజ్ చేశాడు.
ఆ రోజు మీటింగులో ఆ విషయం చర్చకొచ్చింది. చాలా సేపు దాని మీద మాట్లాడారు.
“ఆ నాటకం చూసేవారికి అర్థం కాదు కదా. ఎందుకు వెయ్యటం?” అన్నది సుధా టీచరు.
“మనము తెర వెనుకగా జరగబోయే అంకంను తెలుగులో, ఇంగ్లీషులో వివరిద్దాం. ఈ నాటకము వలన మనకు తప్పక బహుమతి వస్తుందని నా నమ్మకము!” అన్నాడు వివేక్.
“ఏ విషయంపై నాటకము వెయ్యవచ్చు?” అన్నాడు రాజుసార్.
“కొమరం భీం!” చెప్పాడు వివేక్.
“మనకు నాటకం దొరకాలిగా. అదీ గోండు భాషలో…” అన్మాడు చైతన్యసార్.
“నేను రాయగలను!” చెప్పాడు వివేక్.
“ఎప్పుడు నేర్చావు నీవు గోండు?” అడిగాడు రాజు.
“నేర్చుకుంటున్నా. కాని నేను ప్రిపేర్ చెయ్యగలను!” నమ్మకంగా చెప్పాడు.
“మనకు రెండు నెలలే టైం ఉంది మరి. నేను ప్రసాదరావు సార్‌ పర్మిషన్ తీసుకోవాలి. నీవు నాటకం రాయి ముందు…” చెప్పాడాయన.
వివేక్ వెంఠనే తల ఊపాడు అంగీకారంగా.

***

దీపావళి ఆదివాసులకు గొప్ప పండుగ. ఆ దీపావళికి చాలా ముందుగా వారి ఉత్సవాలు మొదలవుతాయి. చలికాలము ప్రారంభంలోనే వారి చేతికి పంటలు వచ్చి ఉంటవి. కందులు, జొన్నలతో ఇళ్ళు నిండుతాయి. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళ తేడా లేకుండా అంతా పంచుకుంటారు. కొత్త కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు, పూసల దండలు జమచేసుకుంటారు.
నృత్యాలకు కావలసిన నెమలీకలు, జింక చర్మము సంపాదించుకుంటారు.
దీపావళికి పదిరోజులు ముందుగా ‘భోగి’ పండుగ జరుపుకుంటారు. భోగి పండుగ నుంచి కొలబోడి పండుగ వరకూ దండారి బృందాలు వివిధ గ్రామాలు సందర్శిస్తూ ఉంటాయి.
పండుగ రోజు గుసాడి టోపిలను పూజ చేస్తారు.
గుసాడి టోపీలను నెమలి ఈకలతో చేస్తారు. ఎంత ఎక్కువ ఈకలు పెట్టుకుంటే అంత గొప్ప.
గుసాడి నృత్యము అత్యంత సుందరమైనది. ఇది చాలా భక్తిగా చేస్తారు. యువకులు ముందుగా దండాడి నృత్యము మొదలెడుతారు. ఆ నృత్యానికి డప్పులతో వాయిద్యాలతో ఊరేగింపుగా వస్తారు.
గుసాడి నృత్యము చేసే వారు దేవుని ప్రతినిధులుగా గిరిజనులు కొలుస్తారు. వారు ఈ వేషం కట్టటానికి ముందుగా వంటి నిండా బూడిదలాంటిది రాసుకుంటారు. లేదా నల్లరంగు పూసుకుంటారు. గీతలు గీసుకుంటారు. మెడలో పూసల దండలు, చర్మపు మీసాలు, గడ్డాలు ధరిస్తారు. మొలకు తెల్లని వస్త్రం కానీ, రంగు వస్త్రంకానీ ధరిస్తారు. నడుముకు చిరు గజ్జెలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. చేతిలో కర్ర ఒకటి పట్టుకుంటారు. వారు ఈ గుసాడి నృత్యము నాలుగైదు రోజులు చేస్తారు. ఆ ఐదు రోజులు ఎంతో నిష్ఠగా ఉంటారు. కొన్ని కఠినమైన నియమనిబంధనలు పాటిస్తారు. దివాడి(దీపావళి) అయ్యేవరకూ కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన పడుకుంటారు. భోగి నుంచి కొలబోడి వరకూ స్నానం చెయ్యకుండా దీక్షగా ఉంటారు. కాళ్ళకు చెప్పులు వేసుకోరు.
భుజానికి జింక చర్మము ధరించి, చేతులలో కర్రతో వాళ్ళు ప్రక్క ఊరుకు పయనమవుతారు. వీరు చేతిలో ధరించే కర్రను రోకల్ అంటారు.
వీరు ఊరి పొలిమేరకు వచ్చిన తరువాత ఆగి, గ్రామంలోని వారికి కబురుచేస్తారు. గ్రామ ప్రజలు గుసాడి నృత్య కళాకారులను డప్పులతో, కోలాటం నృత్యముతో, వాయిద్యాల నడుమ స్వాగతిస్తూ ఊరి మధ్యకు తీసుకుపోతారు. అక్కడ వీరి చేతి దండం, డప్పులకు పూజలు చేస్తారు. దండం పట్టిన గుసాడిని కూడా పూజించి నమస్కరిస్తారు. కృష్ణుని ప్రతినిధి ఆ దండమని వారి భావన.
ముందుగా దండారి కోలాటం మొదలెడతారు యువకులు.
దండారి ఆటలో సాధారణముగా పాడే పాటలు
“పోరోపాటర్‌ దనేగావ్‌ అగా నివిడి కీతోర్‌ కోయగంతోర్‌ పహాండి కూపర్‌ లింగాల్‌…. . ” అంటూ సాగుతుంది.
ఈ పాటకు అర్థము “పహాడి కూపర్ లింగాల్‌ అనే గోండు ఆధ్యాత్మిక గురువు పారో పాటల్‌ దనేగావ్‌ అనే ప్రదేశంలో గోండు జాతి, మత, ఆచారాలు సంస్కృతి, సాంప్రదాయాలు ఆవిర్భవించటానికి కృషి చేశాడు. 16 రకాల ఆటలు, 18 సంగీత వాయిద్యాలు, నాలుగు దిక్కులా నాలుగు జండాలు, దేవతలతో ఆయన గోండు సమాజానికి పునాది వేశాడు. మనము ఆకాడి పండుగ చేసుకొని దండారి ఆట ఆడుదాం రండి” అని.
వారు జోరున కోలాటం ఆడుతుండగా తలపై నెమలిఈకల కిరీటముతో, కాళ్ళ గజ్జలు ఘల్లుఘల్లు మంటుండగా చేత దండము, భుజాన మేక/ జింక తోలు తగిలించుకు గుసాడిలు ప్రవేశిస్తారు. వీరి ప్రవేశముతో చూసేవారికి ఉత్సాహం వెల్లివిరుస్తుంది.
దండారిలు వీరిని చూసి తప్పుకుంటారు. ఇక గుసాడిలు ఆడుతారు. అలా వీరి నృత్యము చాలా సేపు సాగుతుంది. అది దీపావళి పండుగ ప్రత్యేకము. పాఠశాలలో గిరిజన బాలబాలికలు ఈ నృత్యాని ప్రదర్శిస్తూ ఉంటారు. చివరి రోజు సాయంత్రం గుసాడిలు చెంచిభీమల్ దేవత దగ్గరకు పోయి తమ వంటి మీద రంగులు కడుక్కుంటారు. పర్థానులు ధెమ్సా ఆట, ధోల్, పిప్రి వాయిస్తారు. దండారి మూలంగా గిరిజనులలో స్నేహం పెరుగుతుంది. ఒక గ్రామం నుంచి మరో గ్రామం వెళ్ళి నందు వలన వారికి సంబంధాలు కూడా కుదురుతాయి.
కోలాటం కూడా గిరిజనుల నృత్యాలలో ఒకటి. దాదాపు ప్రతి పండుగకు కోలాటమాడటం వీరికలవాటు.
గిరిజన పాఠశాల పిల్లలు యోగాతో పాటు గుసాడి నృత్యము సమర్పిస్తూ ఉంటారు సాధారణముగా స్కూల్లో. కాని వారితో ఎలాగైనా వారి మాతృభాషలో నాటకం వేయించాలని చాలా పట్టుదల కలిగింది వివేక్‌కు.
అందుకే ఆ నాటకం ముందు తెలుగులో రాసి దాన్ని గోండులోకి తర్జుమా చేద్దామని సంకల్పించాడు. దాని కోసము కొమరం భీం మీద పుస్తకం సంపాందించాడు వివేక్‌.

ఇంకా వుంది

1 thought on “మోదుగ పూలు – 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *