June 24, 2024

వెంటాడే కథలు – 9

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి.. ప్రాతఃస్మరణీయ శక్తి!

ఎందరో రచయితలు.. అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

… చంద్రప్రతాప్ కంతేటి

విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

 

***********

 

బతకనేర్చినవాడు

గజానన్ బాబు మనసంతా విచారంగా ఉంది.
ఉదయం లేచినప్పటి నుంచి నిరాశ, నిస్పృహ చీకటిలా కమ్మి అతని హృదయాన్ని కరకర నమిలేస్తున్నాయి.
మూడు నెలల క్రితం వరకూ తనది ఎంతటి వైభవోపేతమైన రాజకీయ జీవితం!
రాజధాని నుంచి నియోజకవర్గానికి వస్తుంటే ఎక్కడ చూసినా స్వాగతద్వారాలు, మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఊరూరా ఊరేగింపులు, ఎడతెగని పుష్పవృష్టి, ఖరీదైన పూల దండలు, రాజోచిత సత్కారాలు.. సన్మానాలు !
తన కాన్వాయ్‌లో కనీసం ఇరవై పైగా కార్లు ఉండేవి..
ఒకదాని వెనక ఒకటి అవి దుమ్ము లేపుకుంటూ వస్తుంటే తన నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలు గుమ్మాలలో నుంచుని విభ్రమంగా చేతులు జోడించి మరీ దేవుడిని చూస్తున్నట్టు చూస్తుండేవారు. కాన్వాయ్‌లో ఒక కారును తాను పత్రికా విలేకరుల కోసం కేటాయించడంతో వారంతా తనపట్ల ఎంతో కృతజ్ఞతతో మసలుకునేవారు. ఒకటి అరా తప్ప దాదాపు అన్ని దినపత్రికలు తన గురించి పాజిటివ్ గానే రాసేవి.
శీర్షికలలో ‘పేదల ఆశాజ్యోతి’, ‘బడుగుల బాంధవుడు’, ‘దీనబంధు’, దయా సింధు’ అంటూ విశేషణాలు గుప్పించి మరీ రాసేవారు విలేకరులు. తను కూడా వారి ‘అభిమానాన్ని’ ఎప్పటికప్పుడు ‘లెక్కగట్టి’ మూడో కంటికి తెలియకుండా నెల మొత్తాలు ముట్టచెప్పేవాడు.
కార్యకర్తలు, చోటామోటా నాయకులు తన కరస్పర్శ కోసం తహతహలాడేవారు. తొక్కిసలాడేవారు.
తను ఎటు కదిలితే అటు “గజానన్ బాబుకి జై! జై గజానన్ బాబు! జైజై గజానన్ బాబు! పేదల పెన్నిధి గజానన్ జిందాబాద్” అంటూ అడుగడుగునా జిందాబాద్ లు హోరెత్తి పోయేవి..
సీఎం గారు, గవర్నర్ గారు వంటి పెద్దలు కాక, తోటి ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు అందరూ తనంటే ప్రత్యేక అభిమానం చూపేవారు. ‘యువ నాయకుడు’ అని సంబోధిస్తూ సీఎం గారు తన భుజం మీద చేయి వేసి శాసనసభ ఆవరణలో నడిచిన రోజులు తనకింకా గుర్తున్నాయి. నిజంగా అదొక స్వర్ణయుగం.
సీఎం గారి దగ్గర తన పరపతి, పలుకుబడి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు పెరిగి పోవడం చూసి కొందరు సీనియర్ మంత్రులు సైతం తమలో తాము కుళ్లుకునేవారు. కానీ ఎవరు పైకి నోరు మెదపడం చేసేవారు కాదు.
ఇక జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం తన కనుసన్నల్లో నడుచుకునేది. ఇతరత్రా శాఖల ఉన్నతాధి కారులు తన చల్లని చూపు కోసం, ఆత్మీయ పలకరింపు కోసం అర్రులు చాస్తూ చకోర పక్షుల్లా తన చుట్టూ తిరుగుతూ ఉండేవారు. బదిలీలు, పదోన్నతులు కావాలని కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ తిరిగేవారు.
తను నియోజకవర్గానికి వచ్చాడు అంటే చాలు తన ఇంటి ముందు ప్రజలు బారులు తీరేవారు. తమ సమస్యలు తీర్చాలని అర్జీ పత్రాలతో తెల్లవారుజాము నుంచే గేటు దగ్గర పడిగాపులు పడేవారు. ఇంకొందరు ‘పేరు పెట్టమమం’టూ తమ పసికందులను తెచ్చి తన చేతికి అందించేవారు.
ఇవన్నీ ఫోటోల రూపంలో మర్నాడు దినపత్రికలలో వచ్చేవి.
ఇక తాను స్వగ్రామంలో ఉన్నన్ని రోజులూ ఊరి వారికి పండగలాగే ఉండేది. చాలామంది కార్యకర్తలు తన ఇంటి దగ్గరే తిని, అక్కడే పడుకునేవారు.. తనకు అంగరక్షకుల్లా మసలుకునేవారు.
ఇప్పుడేది ఆ వైభవం? క్షణాల్లో మాయమైనట్టయింది.
మొన్నటి ఎన్నికలలో అనూహ్యంగా తను ఓడిపోవడంతో అంతా తలకిందులైంది.. తన ఓటమికి కొందరు తమ పార్టీ వారే కారణమని తెలుసు. కానీ ఎవరిని నిందించాలి?
పార్టీ అధ్యక్షుడు, సి ఎం, గవర్నర్ లాంటి వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు తను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఒకవేళ మర్యాదకు ఎత్తినా ముభావంగా మూడు ముక్కలు మాట్లాడి పెట్టేస్తున్నారు.
మంత్రుల తీరూ అంతే! ఒకవేళ తను వెళ్లినా సాదా సీదా పలకరింపులే తప్ప వెనకటి గౌరవ మర్యాదలు లేవు.
ఒకప్పుడు తన ఇంటి ముందు మంత్రులు, అధికారులు, పోలీసుల కార్లు డజన్ల కొద్దీ నిలబడి ఉండేవి.
ఇప్పుడో ఒక్క అధికారి రావడం లేదు..
ఒక్క జర్నలిస్టు రావడం లేదు..
బోసిపోయిన పెళ్ళివారిల్లులా తన నివాసం మిగిలిపోయింది.
ఆలోచిస్తున్న కొద్దీ గజానన్ బాబుకు పిచ్చెక్కుతోంది.
అదీగాక పుండు మీద కారం చల్లిన చందంగా తమ పార్టీలో కొన్ని ప్రచారాలు వినబడుతున్నాయి. నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గానీ ఆ ప్రచారాలు గజానన్ బాబు చెవిలో సీసం కరిగించి పోసినంత బాధ పెడుతున్నాయి.
తనపై మూడొందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ గెలిచిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వికాస్ బాబు తమ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఒకవేళ అదే నిజమైతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రావడం కల్ల!
మనసు ఉడికిపోతోంది..
కుటుంబ సభ్యులు కాక వంటావిడ, పనిమనిషి, డ్రైవర్ తప్ప ఇప్పుడు తన మొహం చూసేవాళ్ళు లేకుండా పోయారు. కొడుకు, కూతురు అమెరికా వెళ్లడంతో వాళ్ళ కార్లు తన ఇంటి షెడ్ లో మూలుగుతున్నాయి బయటకు తీసేవారు లేక!
ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ..
అదే భరించలేక పోతున్నాడు గజానన్ బాబు!
అంతలో ఆ రోజు ఉదయం పది గంటల వేళ –
”ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” ఫోన్ మోగింది.
విసుగ్గా తీశాడు గజానన్ !
”హలో అన్నయ్యా! నేను ప్రశాంత్ బాబును”
”ఏంటి చెప్పు?” సీరియస్ గా అడిగాడు గజానన్.
”అమ్మ మనల్ని అందర్నీ విడిచి వెళ్ళిపోయింది అన్నయ్యా” భోరుమన్నాడు ప్రశాంత్.
”నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావ్?” తల్లి పోయిన దుఃఖం అన్నగారి గొంతులో వినిపించలేదు తమ్ముడికి.
”మన ఊరి నుంచే అన్నయ్యా! పోతూ పోతూ ‘గజా.. గజా’ అంటూ నీ పేరే కలవరించిందన్నయ్యా” మళ్ళీ శోకం ఎత్తుకోబోతే –
గజానన్ చిరాకుపడ్డాడు.
”ఇంకా చిన్న పిల్లాడిలా ఆ ఏడుపు ఏమిటి? తొంభై ఏళ్లు దాటిన ముసలిది ఛస్తే కూడా ఏడుపేనా?.. సరే నేను ఇప్పుడు ఊరికి వచ్చే మూడ్ లో లేను.. డబ్బులు పంపుతా ! ఆ కర్మకాండలు ఏవో నువ్వే సాయంత్రం కానిచ్చేయి.. సరేనా? ఊళ్ళో ఎవరైనా అడిగితే అన్నయ్య ఢిల్లీ క్యాంపు మీద వెళ్ళాడు అని చెప్పు” అని ఠపీమని ఫోన్ పెట్టేశాడు.
తల్లిపోవడం పదవి పోయిన బాధ కన్నా అతన్ని ఎక్కువగా బాధించలేదు..
అరగంట తర్వాత గజానన్ బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది.
వెంటనే తమ్ముడికి ఫోన్ చేశాడు.
చేయాల్సిందంతా చెప్పాడు.
తమ్ముడు ఆశ్చర్యపోతున్నాడు..
కానీ పైకి ఏమీ అనే ధైర్యం లేదు.
”అలాగే అన్నయ్యా” అంటూ ఫోన్ పెట్టేశాడు.
గజానన్ భార్యను పిలిచి తన తల్లి ఫోటో పాతది ఒకటి వెదికి ఇమ్మని ఆజ్ఞాపించాడు.
ఈలోగా ఫోటోగ్రాఫర్ ను, ఒక పెయింటర్ ను పిలిపించాడు.
వారు రాగానే తల్లి ఫోటో ఫోటోగ్రాఫర్ చేతిలో పెట్టి లైఫ్ సైజు ఎన్లార్జ్ చేయమని అవసరమైతే టచ్ అప్ చేయమని సాయంత్రానికల్లా తన చేతిలో ఒక డజను ప్రింట్లు ఉండాలని ఆదేశించాడు.
పెయింటర్ కు చెప్పాల్సిన విషయం చెప్పేసాడు.
ఇక తను ఫోన్ దగ్గర కూర్చుని సి ఎం గారికి డయల్ చేశాడు..
వారు రిసీవర్ ఎత్తగానే – భోరుమని ఏడ్చాడు.
”ఏమైంది గజానన్? ఏమైంది?” ఆయన ఆందోళనగా అడిగారు.
”మా అమ్మ చనిపోయింది సార్.. తల్లి లేని బిడ్డలమయ్యాము.. తండ్రి లాంటి మీకు చెప్పుకోవాలని చేశాను సార్.. ఇక మీరే మాకు తల్లీ తండ్రీ సార్! రేపు మధ్యాన్నం అంత్యక్రియలు చేస్తాం సార్. దయచేసి తమరు హాజరైతే ‘అమ్మ’ ఆత్మ కూడా శాంతిస్తుంది సార్” అని ఏడుపు కొనసాగించాడు.
”అయ్యయ్యో అంత పని జరిగిందా? ఐ యామ్ వెరీ వెరీ సారీ గజానన్.. నీ కుటుంబానికి వాటిల్లిన నష్టం ఇంతా అంతా కాదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లి పోతే జీవితమే పోయినట్టు. కన్సోల్ యువర్ సెల్ఫ్.. బికాజ్ యు ఆర్ ది ఎల్డర్ సన్ టు యువర్ మదర్.. యా మై కరెక్ట్? అయితే ఒక్క మాట ఏమీ అనుకోవద్దు.. రేపు ఢిల్లీలో పి ఎం గారితో అప్పాయింట్మెంట్ ఉంది.. క్యాన్సిల్ చేసుకునేందుకు వీలులేని సమావేశం! ఇంకో అరగంటలో ఫ్లైట్ ఉంది.. మన మంత్రివర్గ సహచరులను పంపిస్తాను. హోమ్ మినిస్టర్కి చెబుతాను.. వారు కూడా వస్తారు.. ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకి ఘనంగా అంత్యక్రియలు చేయించుదాం.. మరోసారి నీకు మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ” అంటూ పెట్టేశారు.
ఆయన మాట్లాడినంతసేపు ఈ వైపు గజానన్ ఎక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు.
సీ ఎం ఫోన్ పెట్టాక అతని పెదాల మీద ఓ చిరుదరహాసం మెరిసింది.
తర్వాత గవర్నర్ గారికి కాల్ చేసి సేమ్ రికార్డు పెట్టాడు.
వారూ ఓదార్చారు.. తాను తప్పకుండా వచ్చి తల్లికి నివాళి అర్పిస్తానని మాట ఇచ్చారు.
అనంతరం హోమ్ మంత్రి- ”గజానన్ జీవితంలో ఇవన్నీ మనం భరించాల్సిందే. పెద్దవాడిగా చెబుతున్నాను. కుంగిపోకు. రేపు నేను వస్తాను. మన పోలీసు అధికారులందరూ హాజరవుతారు.. సహచర మంత్రులు అందరూ వస్తారు. అధైర్య పడకు. నీకు మేమంతా ఉన్నాం. నువ్వు ఒంటరివి కావు. అమ్మను ఘనంగా సాగనంపుదాం” అని మాటిచ్చారు.
అప్పటికే ప్రశాంత్ తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచి పూలతో అలంకరించిన రథంలో నగరంలోని అన్నగారింటికి తరలించాడు. దానిపై ఆమె పెద్ద ఫోటో ఉన్నది.. దానికి ఎన్నో పూలమాలలు!
పత్రికలవారు అప్పుడే గజానన్ ఇంటికి చేరుకున్నారు.
తల్లి శవపేటిక పై బడి శోకాలు పెట్టాడు గజానన్!
”అప్పుడే నన్నొదిలి ఎందుకు వెళ్లిపోయావమ్మా. నువ్వు లేకుండా నేనెలా బతకాలి.” అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. పత్రికల వాళ్ళు ఆ ఫొటోలన్నీ తీసి ఈవెనింగ్ ఎడిషన్ లలో కవర్ చేశారు.
పార్థివదేహంతో పాటు ఊరి నుంచి వచ్చిన కొందరు చోటామోటా నాయకులు
‘విడిచి పోయిన తల్లి … కుళ్లుతున్న కొడుకు’
‘బడుగుల బాంధవుడిని కన్న పుణ్యాత్మురాలు తిరిగి రాని లోకాలకు … ‘ టైపు నినాదాలు రాసిన బానర్లు ఊరంతా కట్టారు.
ముఖ్యమంత్రి గారు గజానన్ భుజం మీద చేయి వేసి నడుస్తున్న ఫోటోలు వాల్ పోస్టర్లు గా వెలిశాయి.
సాయంత్రానికల్లా లైఫ్ సైజు ఫొటోలతో ఫోటో గ్రాఫర్ వచ్చాడు.
వీధి గుమ్మం వద్ద ఒకటి, శవపేటిక వద్ద ఒకటి అమర్చమన్నాడు గజానన్.
తమ ప్రాంతంలోని ముఖ్య కూడళ్లలో కొన్ని పెట్టమని ఆదేశించాడు.
తర్వాత వాటికి దండలు వేశారు.
మర్నాడు గవర్నర్, మంత్రులు హోమ్ మంత్రి వస్తున్నాడని తెలియడంతో విలేకరులంతా అక్కడే మకాం వేసి ఎవరెవరు ప్రముఖులు వచ్చారు?.. సామాన్య జనం సొంత కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నట్టు గుండెలవిసేలా ఎలా ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు ? వగైరా ఫోటోలు తీసి తమ కార్యాలయాలకు పంపుతున్నారు..
గజానన్ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది.
ఎటు చూసినా జనమే..
ఎమ్మెల్యే వికాస్ బాబు కూడా వచ్చి గజానన్ ను ఓదార్చి వెళ్ళాడు.

* * *

మర్నాడు సాయంత్రం పోలీసు అధికార లాంఛనాలతో గజానన్ తల్లిగారి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. స్వయంగా గవర్నర్ వచ్చి గజానన్ ను గుండెలకు హత్తుకుని ఓదార్చారు.. కెమెరాలు క్లిక్కు క్లిక్కు మన్నాయి. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. తర్వాత హోమ్ మంత్రి, సహచర మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ వచ్చి గజానన్ ను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వచ్చి ఓదార్చడంతో పాటు ముఖ్యమంత్రిగారి సంతాప సందేశాన్ని చదివి వినిపించారు..
పైకి దుఃఖం నటిస్తున్నా గజానన్ మనసు ఆనందంతో నృత్యం చేస్తోంది.. మళ్ళీ తన ఇంటి ముందు వందకు పైగా కార్లు, మీడియా వ్యాన్ లు, విపరీతంగా హాజరైన జనం.. ఊరు మొత్తం తన ఫోటోలు, సీఎం గారు భుజం మీద చేయి వేసి నడుస్తున్న వాల్ పోస్టర్ లు మళ్ళీ తన రాజకీయ జీవితం చిగురిస్తుందన్న ఆశలు రేపాయి..
తల్లి మరణించి కూడా తనకు వెనకటి ఖ్యాతి సంపాదించి పెట్టింది..
తననే కలవరిస్తోందని చెప్పినా, ఏనాడూ ఆమె బతికుండగా వచ్చి పలకరించని అన్నగారు – తల్లి అంత్య క్రియలు ఇంత ఘనంగా జరిపించడం తమ్ముడు ప్రశాంత్ బాబుకు పజిల్ గా మిగిలిపోయింది.

—000—

నా విశ్లేషణ :

నాకు గుర్తున్న మటుకు ఇది ఒడిశా లేదా బెంగాలీ కథ. రాజకీయ నాయకులు ప్రచారం లేకపోతే ఒడ్డున పడిన చేపల్లా ఎలా విలవిలలాడతారో తెలియచెప్పే కథ ఇది. ఏదో ఒక రూపంలో ప్రజల మధ్య ఉంటే మీడియాలో ఉంటేనే వారికి మనుగడ. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోరు. దానికి తల్లి మరణాన్ని తెలివిగా వాడుకున్నాడు గజానన్. సానుభూతి పేరుతో దూరమైనా పెద్ద తలకాయల సంబంధాలన్నీ పునరుద్ధరించుకున్నాడు. ఈ సానుభూతి ఒక రోజే కదా పనిచేసేది అని మీరు అనుకోవచ్చు. అది తప్పు. అతను రాజకీయ నాయకుడు. పదిరోజుల తర్వాత దినాలు, కర్మకాండల పేరుతో మళ్ళీ ఇంత హడావిడి చేస్తాడు. అన్నసంతర్పణలు చేయిస్తాడు. వాటన్నింటికీ మంత్రులని, అధికారుల్ని పిలుస్తాడు. ఆవిడ సంస్మరణ పేరుతో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇప్పిస్తాడు.. జనంతో నేతల తోటి సంబంధాలు తెగిపోకుండా జాగ్రత్త పడతాడు. గుప్పిట్లో ఉన్న మీడియా పక్షులకు మరిన్ని నూకలు వెదజల్లి తన పేరును జనం మరచిపోకుండా చూసుకుంటాడు..
చావులను కూడా రాజకీయ సోపానాలుగా వాడుకోగల గజానన్ లాంటి నేతలు ఇవాళ మన దేశంలో, రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. పరిశీలించి చూస్తే మీకే కనబడతారు.

11 thoughts on “వెంటాడే కథలు – 9

 1. I felt this story is the best example of Kaliyuga. Utilitarian society. The death of his mother has been used for his desires to come true.
  Very nice narration sir….

  1. చాలా బాగా చెప్పావు తల్లి.. ప్రస్తుత రాజకీయ నాయకుల జీవితాలకు నగ్న స్వరూపం ఈ కథ అన్న నీ మాట అక్షర సత్యం ధన్యవాదాలు

 2. ఇలాంటి కథే ముదిగంటి సుజాతా రెడ్డి గారి కథ (టైటిల్ గుర్తు లేదు) ఒకటి చదివాను సర్. తల్లి స్థానంలో కొడుకు. తన కొడుకును తనే చంపుకుని పూర్వ వైభవం తెచ్చుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు.
  మీ విశ్లేషణ ఎప్పటిలాగే చాలా బాగుంది సర్. ❤️

  1. కథను పోలిన కథలు చాలా ఉండవచ్చు తల్లి.. ఇది మాత్రం నేను చెప్పినట్టు ఒడియా లేదా బెంగాలీ కథ అని గుర్తు. మీ అభిరుచికి ధన్యవాదాలు

 3. సమకాలీన రాజకీయ నాయకుల కుటిలఅవకాశవాదానికి నిదర్శనం ఈ కధ. ఇది కధ కాదు. వర్తమాన లో కొందరు రాజకీయ ప్రముఖుల కొందరు తమకు జీవితం ప్రసాదించిన వారు ఈ విధంగా ప్రవర్తించారు అని కొన్ని ఫోటోలు,వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

  1. చాలా బాగా చెప్పారు యోగానంద గారు నేటి రాజకీయ పరిస్థితులు గురించి దశాబ్దాల క్రితమే సదరు రచయిత కళ్ళకు కట్టినట్టు రాయడం గొప్ప విశేషం కదూ

 4. నేటి రాజకీయ నాయకుల పదవీ వ్యామోహం కళ్ళకు కట్టినట్లు చూపించారు.బంధుత్వాలకన్నా పదవులకే ప్రాథాన్యత ఇస్తున్న నేటి రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలు బాగా వివరించారు

  1. చాలా బాగా విశ్లేషించారు భరత కుమారి గారు మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *