September 25, 2022

శ్రీగణేశ చరిత్ర

రచన: నాగమంజరి గుమ్మా

101
ముల్లోకమ్ముల జనులకు
కల్లోలము సేయుచున్న కర్కశ దనుజుల్
ఉల్లము దలచిన కదిలెడు
ఇల్లులు గట్టుకు తిరుగుచు నిడుముల పెట్టెన్

భావం: మూడు లోకాలలో ఉన్న ప్రజలను బాధలు పెడుతున్న రాక్షసులు మనసులో తలచుకోగానే కదిలే ఇళ్లు కట్టుకుని నానా కష్టాలు పెడుతున్నారట.

(త్రిపురాసురుల వృత్తాంతం)

102 వ పద్యం

అసురుల బాధల కోర్వక
వెసవెస వేల్పులు కదిలిరి వెన్నుని కొలువన్
అసురుల కిచ్చిన వరములె
లసకమ్మౌ సమయమిదని లచ్చిమగడనెన్

భావం: రాక్షసుల బాధలు పడలేని దేవతలందరూ విష్ణువును వేడుకున్నారు. “వారికి ఇచ్చిన వరాలే వారిని ఆటాడిస్తాయని, సమయం రానున్నదని” విష్ణువు వారిని ఊరడించాడు.

లసకము: నృత్యము, కౌగిలింత, ఆటాడునది

103 వ పద్యం

పుడమియె రథమయ్యెను చం
ద్రుడినుడు రథ చక్రములు చతుర్వేదమ్ముల్
వడి గల అశ్వములయ్యె న
పుడు చేబూనె గిరివిల్లు పురశాసనుడున్

భావం: భూమి రథముగా, చంద్రుడు, సూర్యుడు రథ చక్రాలుగా, నాలుగు వేదాలు గుఱ్ఱాలుగా మారగా, పర్వతాన్ని విల్లుగా చేసుకుని ధరించాడు… ఆ మూడు పురాల భవిష్యత్తును శాసించబోయే శివుడు.

104 వ పద్యం

చతురానను సారధిగా
శితికంఠుడు తేజరిల్లి చివ్వకు బోయెన్
నుత గణపతి ధ్వజమున జయ
పతాకమై యెగురుచుండ పటలము కదిలెన్

భావం: బ్రహ్మ సారధి కాగా ఈశ్వరుడు యుద్దానికి బయలుదేరెను. అందరిచేత పూజించబడిన విఘ్నేశ్వరుడు ఆ రథానికి , సేనకు జయపతాకమై నిలవగా త్రిపురాసుర సంహారానికి సైన్యం కదిలింది.

(వినాయక వ్రతం కథలో కార్య సాఫల్యం కొరకు ఎవరెవరు వినాయక వ్రతం చేసారో వివరించబడింది)

105 వ పద్యం

శివుడు శరము సంధించెను
దివిజులు తమ శక్తులన్ని దిట్టము సేయన్
భువనమ్ములు ముదమొందగ
భవుని శరము సోకి దైత్య భంజనమయ్యెన్

భావం: దేవతలందరూ తమతమ శక్తులన్ని శరములో నిక్షిప్తం చేయగా, శివుడు బాణము సంధించి మూడు పురాలను దగ్ధం చేసెను.
(మూడు పురాలు వేరు వేరు వేగాలలో తిరుగుతాయి. మూడింటిని ఒకే సరళరేఖలో వచ్చినపుడు ఒకే బాణంతో కొట్టాలి. అది కూడా ఎన్నో షరతులతో… రాక్షసులు ధర్మం తప్పనంత వరకు పురాల వేగంలో మార్పు రాదు. అప్పుడు విష్ణువు బుద్ధునిగా అవతారం ధరించి పాషండ మతాన్ని ప్రోత్సహించి యజ్ఞాలు , వేదపఠనం ఆపిస్తాడు. అదే పురాణ బుద్ధుని అవతారం. అప్పుడు మూడు పురాల వేగంలో మార్పు వచ్చింది. సంహారం సాధ్యమయ్యింది)

106 వ పద్యం

లంబోదర వందనమిదె
అంబాసుత విఘ్ననాశు డంజలి నీకున్
రంబాది ఫలమ్ములు హే
రంబుడ నీకిత్తు నీవె రక్ష గణేశా

భావం: పెద్ద బొజ్జ కలిగినవాడా నీకు నమస్కారము. పార్వతి కుమారుడా, విఘ్నాలను నాశనం చేసేవాడా నీకు నమస్కారము చేస్తున్నాను. అరటి మొదలైన ఫలాలను నీకు ఇస్తాను. నన్ను రక్షించు గణేశా

107 వ పద్యం

యక్షుని కొమరు డనింద్యున
కక్షయమగు విద్యలన్ని అర్యము డొసగెన్
లక్షిత ఫల గర్వమునన్
యక్ష సుతుడు నంబ గొల్వ యశమును పొందెన్

భావం: కుబేరునికి కుమారుడిగా జన్మించిన *అనింద్యుడు* జన్మతః అనేక విద్యలు సంపాదించుకున్నాడు. అతడికి బ్రహ్మ గాయత్రీ మంత్రోపదేశం చేసాడు. కుబేరుని కోరికపై సూర్యుడు (అర్యముడు) విద్యనేర్పాడు. ఒక రోజు దేవతలంతా మణి ద్వీపానికి వెళ్లి పూజించు సమయంలో అనింద్యుడు చేసిన స్తోత్ర పాఠం అందరి ప్రశంసలను పొందింది.

108 వ పద్యం

అంబ తనచేత నిల్పిన
జంబూనద పాత్ర గాంచి జ్ఞానామృతమున్
వెంబరమతి మూషిక రూ
పంబరసి రయమున జేరి పానము జేసెన్

భావం: అమ్మవారి చేతిలో బంగారు పాత్రలో ఉన్న జ్ఞానామృతమును చూసి, మూషిక రూపం ధరించి, చాటుగా వెళ్లి కాస్త తాగేసాడు. (అనింద్యుడు గత జన్మలో ఎలుక. ఒక బ్రాహ్మణుని వ్రత ప్రసాదాన్ని ఏడాదిపాటు దొంగిలించి తిన్నాడు. నైవేద్యం కావడం వలన యక్ష కుమారునిగా, జన్మతః కొన్ని శక్తులు లభించినా, దొంగతనంగా తినడం వలన ఆ మూషిక లక్షణాలు అలాగే ఉండిపోయాయి)

109 వ పద్యం

మూషిక రూపున చేసిన
దోషమున కినిసి భవాని దోపరి మాయా
వేషమునన్ చూషణ చే
మోషకుడైతి విదె నీకు మోఱక ఫలమౌ

భావం: ఎలుకగా మారి దొంగతనంగా జ్ఞానామృతమును తాగినందుకు అమ్మవారు కోపించింది. “మాయావేషము చే తాగినందుకు నీకు మంచి ఫలము లభించదు. మూర్ఖపు ఫలమే లభిస్తుంది” అని తెల్పినది.

కినిసి : కోపించి
దోపరి: దొంగ
చూషణ చేయుట : పీల్చుట
మోషకుడు: దొంగ
మోఱకము : మూర్ఖత్వం

110 వ పద్యం

అసురుని రూపున నుందువు
మెసవిన జ్ఞానామృతమది మేల్ కాదనియెన్
కుసిలిల్లుచు జ్ఞానము లే
క సంకట పడుమనె దేవి కఠినపు వాక్కున్

భావం: “రాక్షసుడవై పడి యుండు. నువ్వు తిన్న జ్ఞానామృతము నీకు ఉపయోగపడదు, బుద్దిలేని వానిగా బతుకమ”ని అమ్మవారు అనింద్యుని చూచి కఠినంగా పలికింది.

111 వ పద్యం

నిన్ను జయించిన వారికి
మిన్నగ కలుగును త్రిలోక మిక్కట మనియెన్
చిన్నారి గణపతియె తన
పన్నిరిచి పరిఘను చేసి పాతకు నణచెన్

భావం: “నీవు మూడులోకాల లోనూ పూజ్యుడవు కావాలని, దొంగతనంగా అమృతం తాగావు కానీ నీకు ఆ వరం ఫలించదు. నిన్ను ఎవరైతే జయిస్తారో వారికే ఆ ఫలితం చెందుతుంది” అని అమ్మ పలికింది. ఉపనయన మహోత్సవంలో శాపవశాత్తూ రూపం పొందిన ఆ మూషికాన్నే (అనింద్యుని) తన దంతం పీకి ఆయుధంగా మార్చి అణగదొక్కాడు విఘ్నేశుడు.
(అమృతం తాగినందున అనింద్యునికి చావులేదు)

112 వ పద్యం

దూర్వాంకుర మంజలి నిడి
సర్వేశుడ దర్భ బర్హి జయములనందెన్
దుర్వహము గరిక జన్మము
చర్వితమౌ పసుల కనుచు సజల నయనయెన్

భావం: ఒక గరిక పోచ విఘ్నేశునికి నమస్కరించి, “దేవా! దర్భ, బర్హి మొదలైన జాతులు అమృత స్పర్శ వలన పుణ్యకార్యాలకు అర్హత సాధించాయి. ఏమి జన్మము నాది? పశువులు తినడానికి తప్పితే ఎందుకు పనికొస్తాను?” అని కన్నీరు నింపుకుంది.

113 వ పద్యం

గరికవు పేరుకు చిన్నవు
గరిమయె నీ మేలు ప్రజకు ఘనమగు నాకున్
శరణ నిరువదొక్కటి యై
పరగి సమర్పణము జేయ ఫలితము హెచ్చున్

భావం: “చూపుకు చిన్నదానివైనా నీవు చేసే మేలు ప్రజలకు చాలా ఎక్కువ. నీ పోచలు 21 చొప్పున నాకు భక్తి పూర్వకంగా సమర్పిస్తే నేను అధిక ఫలితమిస్తాను” అని గరికకు అభయమిచ్చాడు గణేశుడు.

114 వ పద్యం

విద్దెల నెఱుఁగని మొద్దును
సుద్దులిడి వినాయకుండు సుపథము జూపెన్
పద్దెములమరగ శతకము
నొద్దికతో వెలువరచితి నొప్పిదమవగా

భావం: పెద్దగా భాషాజ్ఞానం కానీ, వ్యాకరణ జ్ఞానం , పురాణ జ్ఞానం కానీ లేదు. విఘ్నేశుడు దయచూపి, తన చరిత్రను నూరు పద్యాలలో రాయించుకున్నారు. చేతనైనంతవరకు రాసాను.

115 వ పద్యం

మనమున కొలిచితి సుముఖుని
కనుగొని శతకంద పద్య కమలోత్తరమున్
దినమునకొక పద్దెమనుచు
చనమున మది తలచుకొనుచు సామజవదనున్

భావం: వంద దాటిన పద్య కమలాలతో రోజుకొకటిగా మనసులోనే గణపతిని ధ్యానిస్తూ అర్చించుకొన్నాను.

116 వ పద్యం
ఫలశ్రుతి

చదివిన రాసిన వార్కిని
పదనుగ పాడి వినినట్టి వారికినిచ్చున్
సదయుడు విఘ్నేశ్వరుడును
ముది రోగము రాని బతుకు ముప్పేట సిరుల్

భావం: శ్రీగణేశ చరిత్ర చదివిన, రాసిన, పాడిన , వినిన వారలకు ఆ విఘ్నేశ్వరుడు ముసలితనం, రోగము లేని జీవితమును, ఎనలేని సంపదలనిచ్చును.

117 వ పద్యం
మంగళ హారతి

మంగళము విఘ్ననాయక
మంగళము భవానిపుత్ర మంగళమయ్యా
మంగళ మీశ కుమారుడ
మంగళము తొలుత కొలుపుడ మంజరి వినుతా

భావం: విఘ్ననాయకుడైన మీకు మంగళమగుగాక. పార్వతీదేవి కుమారుడు, శివుని కుమారుడు , మొదట పూజలందుకొనే దేవుడు అయిన మీకు మంగళమగుగాక. ఇప్పుడు మంజరిచే నుతించబడుచున్న మీకు మంగళము.

శ్రీగణేశ చరిత్ర సంపూర్ణము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *