April 25, 2024

అమ్మమ్మ – 36

రచన: గిరిజ పీసపాటి

అన్నపూర్ణ గారు రెండు కాఫీ గ్లాసులు తెచ్చి వసంత చేతికిచ్చి “తమ్ముడికి, చెల్లికి ఇచ్చి రామ్మా!” అనడంతో మారు మాట్లాడకుండా గ్లాసులందుకుని, తమ ఇంట్లోకెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వచ్చింది వసంత.

మరో రెండు గ్లాసుల కాఫీ తెచ్చి తల్లీకూతుళ్ళకి ఇచ్చారావిడ. మౌనంగా కాఫీ తాగేసి తాము వచ్చిన విషయం చెప్పింది నాగ. ఆవిడ ఎప్పటిలాగే ప్రశాంతంగా అంతా విని “తప్పకుండా మీ అన్నయ్య గారు ఆయనకు ఫోన్ చేసి చెప్తారు. మీరు దిగులు పడకండి” అని వీళ్ళకు హామీ ఇస్తూ, భర్త వంక చూసారు.

అక్కడే కూర్చుని అంతా విన్న మూర్తి గారు వెంటనే ఫోన్ రిసీవర్ అందుకుని, ఫోన్ మాట్లాడి “ఆయన ఒప్పుకున్నారమ్మా! రెండు నెలల వరకు అద్దె కోసం ఆయన రారు. మీరు నిశ్చింతగా ఉండండి” అన్నారు.

ఆ దంపతులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసి, తమ ఇంటిలోకి వచ్చేసారు ఇద్దరూ. పావు తక్కువ తొమ్మిది గంటలక్లా పిల్లలకు జాగ్రత్తలు చెప్పి షాప్ కి బయలుదేరింది నాగ.

షాప్ కి వెళ్ళగానే తాను రానన్ని రోజులూ ఆ పనంతా అలాగే పెండింగ్‌లో ఉండడం గమనించి పనిలో పడిపోయింది.

డాక్టర్ కాల్స్ పూర్తి చేసుకుని వచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని పలకరించి, ఏ ఏరియాలో ఏ డాక్టర్ ఏ మందులను ఎక్కువ రాస్తున్నారో కనుక్కుని, ఆ వివరాలను నోట్ చేసుకోసాగింది. ఇంతలో అటెండర్స్ లో ఒకరైన మూర్తి వచ్చి “మేడమ్! లంచ్ టైమ్ అయ్యింది. భోజనానికి వెళ్ళరా!?” అని అడిగాడు.

”అప్పుడే లంచ్ టైమ్ అయిందా?” అంటూ వాల్ క్లాక్ వంక చూస్తే సమయం ఒంటి గంటా పది నిముషాలు చూపించింది. వెంటనే చేస్తున్న పని ఆపి, దగ్గరుండి షాప్ కి తాళం వేయించి, తాళ చెవులు హేండ్ బేగ్ లో వేసుకుని, చకచకా నడుచుకుంటూ, పావుగంటలో ఇంటికి చేరుకుంది.

ఇంటికి రాగానే “కిరాణా ఆంటీకి బియ్యం ఇచ్చేసావా వసంతా!?” అంటూ ప్రశ్నించింది. “ఇచ్చేసానమ్మా! నువ్వు ఫ్రెష్ అయి వస్తే భోజనం చేద్దాం” అంది. భోజనం అయాక తిరిగి షాప్ తెరవాల్సింది నాలుగు గంటలకు కనుక, మిగిలిన సమయం విశ్రాంతి తీసుకుని, తిరిగి బయలుదేరి షాప్ కి చేరుకుంది.

నిజంగానే పనిలో పడితే మిగిలిన విషయాలేవీ గుర్తు రాకుండా ప్రశాంతంగా రోజులు గడిచిపోసాగాయి. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే. ముందుగా అనుకున్నట్లే పగలు మాత్రమే తింటూ, రాత్రిళ్ళు పస్తులుంటూ రోజులు గడిపారు. వారం రోజులు గడవగానే మళ్ళీ మొదటికొచ్చింది పరిస్థితి.

ఈసారి నాలుగు రోజుల పాటు తిండి లేకుండా గడిపారు. ఐదవ రోజు ఆదివారం కావడంతో సాయంత్రం అందరూ మేడ మీద కూర్చు‌నుండగా వీళ్ళింటికి వస్తూ కనిపించాడు ఢిల్లీ అని పిలువబడే లక్ష్మణరావు.

మేడ మీద నుండి ఢిల్లీ రావడం చూసిన నాగ “గిరీ! ఢిల్లీ మామ వస్తున్నాడు. కిందకి వెళ్ళి తలుపు తీసి, మేడ మీదకి వచ్చెయ్యమని చెప్పు” అంటూ చిన్న కూతురిని పంపింది.

వీళ్ళ మేడ మెట్లు ఇంటి లోపలి గది కి ఆనుకుని ఉన్న చిన్న ఓపెన్ ప్లేస్ నుండి ఉంటాయి కనుక మేడ ఎక్కాలన్నా, దిగాలన్నా ఇంటి బయటకు వెళ్ళక్కర్లేదు. దానివల్ల వేరే వాళ్ళు మేడ మీదకు వచ్చే అవకాశం కూడా లేదు.

ఢిల్లీ మేడ మీదకు రాగానే “అమ్మ, నాన్న బాగున్నారా తమ్మూ!” అంటూ ప్రశ్నించింది. “బాగున్నారక్కా!” అంటూనే “బావ గురించి ఏమైనా తెలిసిందా?” అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అందరి నుండి వినీ వినీ విసిగిపోయారు తల్లీ, పిల్లలు కూడా.

దాంతో “అందరూ ఆయన గురించి అడిగేవారే గానీ పస్తులుంటూ కూడా ఉద్యోగం చేస్తున్న అమ్మ, అనారోగ్యం మనిషినైన నేను, అసలే‌ సుకుమారి, నీరస ప్రాణి అయిన చెల్లి, చిన్నవాడైన తమ్ముడు ఎలాగున్నామని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే తిన్నా, తినకపోయినా పైకి మాత్రం పిడికుచ్చుల్లా కనిపిస్తాం కదా!” అంది వసంత.

“ఏమిటి పాపా ఆ కోపం? ఆయన ఆచూకీ తెలిస్తే మనం సంతోషంగా ఉంటామనే కదా మామ అడుగుతున్నాడు?” అంటూ మందలించింది నాగ.

“ఆయన ఆచూకీ ఇన్నాళ్ళు మనకు తెలియకుండా ఉందంటేనే అర్థం కావట్లేదా అమ్మా! ఇక్కడ మనం రోజూ ఒక పూట చొప్పున తిన్నా, ఐదు రోజుల నుండి మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుంటున్నాం” అంది కంట నీరు తిరుగుతుండగా.

వాతావరణం బరువుగా మారడంతో పిల్లలు ముగ్గురినీ “పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కాస్త ఆ విషయం కూడా ఆలోచించండి. కిందికి వెళ్ళి మీరు చదువుకుంటూ ఉండండి. నేను మామతో కాసేపు మాట్లాడి వస్తాను” అన్న తల్లి మాటలకు “ఇప్పుడు చదువొక్కటే లోటయింది మరి” అని గొణుక్కుంటూ మిగిలిన ఇద్దరితో కలిసి కిందకు వెళ్ళిపోయింది వసంత.

వాళ్ళు కిందకు వెళ్ళగానే “ఏంటక్కా! పాప అన్నది నిజమేనా!? మీరు భోజనం చేసి ఐదు రోజులయిందా?” అని ప్రశ్నించాడు ఢిల్లీ. అవునన్నట్లుగా తలూపింది నాగ.

“నన్ను క్షమించక్కా!” అంటూ నాగ చేతులు పట్టుకున్న ఢిల్లీని అయోమయంగా చూస్తూ “మధ్యలో నువ్వేం తప్పు చేసావు తమ్మూ! దేనికలా అంటున్నావు?” అంది నాగ.

“బావ విషయంలో నీకు నేను అబద్ధం చెప్పానక్కా! నేను సంక్రాంతి పండుగ నాడు రాముడువలస వెళ్ళేసరికి బావ అక్కడే ఉన్నాడు. నేనొచ్చానని చాలాసేపు బయటకు రాలేదు. కానీ పీసపాటి మామ ‘వాడిక్కడే ఉన్నాడు. కానీ ఈ విషయం మీ అక్కకు, పిల్లలకు చెప్పకు’ అంటూ బావని పిలిచాక అప్పుడు బయటకు వచ్చి నాకు కనిపించాడు.

“నిజమా! ఎలా ఉన్నారు? అక్కడే ఉంటే లేరని ఎందుకు చెప్పమన్నారు? మేమెలా ఉన్నామని అడిగారా? నువ్వు మా పరిస్థితి చెప్పావా?” భర్త క్షేమంగా ఉన్నాడన్న ఆనందం, అసలు ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసుకోవలన్న ఆతృతతో ప్రశ్న మీద ప్రశ్న వేసింది నాగ.

“బావ అక్కడ శుభ్రంగా ఉన్నాడొదినా! పండుగ కదా! కొత్త బట్టలు కూడా వేసుకున్నాడు. మామ కుట్టించారట. పాపమ్మత్త చాలా పిండివంటలు చేసింది. ఆరోజు మధ్యాహ్నం నేను అక్కడ భోజనం చేసాకే బయలుదేరాను.”

“మీరేమో ఇక్కడ లేని పూట ఎలాగూ లేదు. ఉన్నపూటైనా బావ ఎలాగున్నాడోనని కడుపు నిండా తినకుండా బాధ పడుతున్నారు. మరో విషయం అక్కా! కుష్టన్నకు కూడా బావ అక్కడ ఉన్న విషయం తెలుసు. ఆయన కూడా మీకు అబద్ధమే చెప్పాడు. నీకు అబద్ధం చెప్పినందుకు మరోసారి నన్ను క్షమించక్కా!” అమ్నాడు ఢిల్లీ.

చాలాసేపు ఏం మాట్లాడలేక స్థాణువులా ఉండిపోయింది నాగ. ‘తండ్రి ఎలానూ లేడు. తల్లి ఎక్కడో హైదరాబాదులో ఉంది. అప్పుడప్పుడూ ఆవిడ వచ్చి తమని చూసి వెళ్ళడం తప్ప తను, పిల్లలు ఏనాడూ హైదరాబాదు వెళ్ళలేదు.’

‘ఆవిడ ఉంటున్నదే షేరింగ్ రూమ్ లో. తాము వెళ్తే వసతికి ఇబ్బందని ఏనాడూ తల్లి తమని రమ్మని కూడా అనలేదు. తోబుట్టువులు లేరు. ఒకవిధంగా తను అనాధ. అలాంటి తనపైన ఎందుకు ఇంత కక్ష? తను నమ్మిన వాళ్ళే మోసం చేస్తుంటే ఏమనుకోవాలి?’

‘అయినా ఈ మనిషికి ఇదేం బుద్ధి? కట్టుకున్న దాని కోసం కాకపోయినా కన్న బిడ్డల కోసమైనా రావాలనిపించలేదా?’ ఇలా ఆలోచనల్లో పడి చుట్టూ చీకట్లు కమ్ముకోవడం కూడా తెలియలేదా ఇల్లాలికి.

“అమ్మా! అమ్మా!” అంటూ వసంత గట్టిగా తట్టి పిలవడంతో ఎడతెరిపి లేని ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లయి ఉలిక్కిపడి చూసింది కూతురి వైపు.

“ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటమ్మా! ఏంటంత దీర్ఘాలోచన? ఏం జరిగింది?” అనడిగిన కూతురికి జవాబియ్యకుండా “ఢిల్లీ మామ ఏడీ?” అనడిగింది.

“మామ వెళ్ళి అరగంట పైనే అయింది. చీకటి పడినా నువ్వు కిందికి రాకపోయేసరికి నేనే వచ్చాను. ఇంతకీ ఏం జరిగింది?” అని రెట్టించింది వసంత.

“కిందకి పద. ముగ్గరికీ కలిపి ఒకేసారి చెప్తాను” అంటూ కూతురితో కలిసి మేడ దిగి ఇంట్లోకి వచ్చింది. కిందికి రాగానే పిల్లల్ని ముగ్గురినీ కూర్చోపెట్టి, ఢిల్లీ తనకు చెప్పిన విషయాలన్నీ చెప్పి “ఇప్పుడు ఏం చేద్దామంటారు?” అనడిగింది.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *