April 20, 2024

చంద్రోదయం – 29

రచన: మన్నెం శారద

సారథి గుంటూరు నుంచి తిరిగొచ్చేడు.
స్వాతి అతని చేతిలోని సూట్‌కేస్ అందుకుంటూ “అందరూ బాగున్నారా?” అంది ఆత్రంగా.
“ఆ!” అన్నాడు సారథి లోపలికి వస్తూ.
సారథి మాటలకి నానీ పక్కమీంచి లేచి అతని వడిలోకి దూకేడు.
“డాడీ! ఎప్పుడొచ్చేవు?”
“ఇప్పుడే” అన్నాడు సారథి నానీని ముద్దు పెట్టుకుంటూ.
స్వాతి కాఫీ తీసుకొచ్చింది.
సారథి కప్పు అందుకుంటూ “థాంక్యూ” అన్నాడు.
స్వాతి ఆశ్చర్యంగా సారథి ముహంలోకి చూసింది. అదే క్షణం అతను కూడా ఆమెని గ్రుచ్చి చూసేడు.
క్షణకాలం వారిద్దరి చూపులూ కలుసుకుని విడిపోయాయి.
“కూర్చో! నీకో విషయం చెప్పాలి!” అన్నాడు సారథి నవ్వుతూ.
నానీ యిద్దర్నీ మార్చి మార్చి చూస్తున్నాడు.
సారథి నానీ వంక చూసి. “వాణ్ని ముఖం కడుక్కోమను” అన్నాడు స్వాతి వైపు చూస్తూ.
స్వాతి అర్థం చేస్కుని పనిపిల్లని పిలిచింది.
“వీణ్ని తీసుకెళ్లి ముఖం కడిగింది స్నానం చేయించు” అంది.
పనిపిల్ల నానీని తీసుకెళ్లింది.
స్వాతి సారథి వైపు చూసింది చెప్పమన్నట్లు.
అతనో క్షణం మౌనం వహించి “నేను చెప్పే విషయం ఆవేశపడకుండా అర్ధం చేసుకోవాలి” అన్నాడు వుపోద్ఘాతంగా. స్వాతి మాట్లాడకుండా చూసింది.
“జ్యోతి పెళ్లి చేసుకుంది” అని స్వాతి ముఖంలోకి చూసేడు. స్వాతి నమ్మలేనట్లుగా చూసింది. ఆమె నిర్ఘాంత పోయినట్లు ఆమె కళ్లు వెడల్పయ్యేయి.
సారథి మళ్లీ చెప్పడం ప్రారంభించేడు. “పెళ్లి కొడుకు క్రిస్టియన్. షాక్ తినకు. ఈ రోజుల్లో ఇదేం వింత కాదు. అమ్మ గాభరాపడి టెలిగ్రాం యిచ్చింది. అతని పేరు విజయ్‌కుమార్. లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. వెళ్లి అతన్ని కలుసుకున్నాను.
అతను నన్ను చూసి లేచి వచ్చేడు.
“నా పేరు సారథి. జ్యోతికి బావను” అని చెప్పేను.
అతను నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి వాళ్ల ఇంటికి తీసికెళ్లాడు. చాలా నీట్‌గా వుంది.
విజయ్‌కుమార్ తల్లిని, తండ్రిని, అక్కాచెల్లెళ్లని పరిచయం చేసేడు.
తల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సు. తండ్రి స్కూల్ టీచర్‌గా రిటైరయ్యాడు. అక్క వుమన్స్ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్. చెల్లి మెడిసిన్ చదువుతోంది. వాళ్లందరూ నన్ను జ్యోతి బావగా పరిచయం చేయగానే ఎంతో గౌరవంగా చూసేరు స్వాతీ”
“మీరీ వివాహాన్ని సీరియస్‌గా తీసుకొన్నారనుకుంటాను. వాళ్లిద్దరికీ యిష్టం అయింది. కలిసి బ్రతకాలనుకున్నారు. కాదనటానికి మనమెవరం? ఏసు ప్రభువు నిర్ణయం అది” అంది విజయ్‌కుమార్ తల్లి.
“జ్యోతి మంచి పిల్ల. మాలో అప్పుడే కలిసిపోయింది.” అన్నారు జ్యోతి మామగారు జోసెఫ్.
“జ్యోతి భలే నవ్విస్తుంది. భలే సందడి మనిషి” అన్నారు ఆడపడుచులు.
“ఆ అరగంటలో నాకు అర్ధమయింది ఒక్కటే. మతాంతర వివాహం చేసుకున్నా జ్యోతి ఎన్నుకొన్న కుటుంబం అన్ని విధాలా ఆదర్శవంతమయిందని, సంస్కారానికి మారుపేరుగా వున్న ఆ కుటుంబ సభ్యుల్ని చూసేక, మనిషికి జాతి, మతం కాదు ప్రధానం అనిపించింది.
జ్యోతి నన్ను చూసి భయపడుతూ నిలబడింది.
మెరుస్తోన్న కళ్లు, ఎర్రబడిన ఆమె బుగ్గలు, ఆమె ఎంత ఆనందంగా వుందో నేనూహించగల్గాను.
ఇక నేను చేసేదేముంది అక్కడ?
జ్యోతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చేసేను.
నేను వచ్చేటప్పటికి అమ్మ ఆత్రుతగా గుమ్మంలో నిలబడింది.
“ఏం జరిగింది?” అంది ఆదుర్దాగా.
నేను నవ్వి జరిగిందంతా చెప్పేను.
అంతా విని కూడా అమ్మలో ఏదో అసంతృప్తి.
“అమ్మా! చదువుకోకపోయినా నువ్వెంత ఆదర్శవంతురాలివో నాకు తెలుసు. జ్యోతి విషయంలో సంకుచితం కావడం నాకిష్టం లేదమ్మా. తల్లీ, తండ్రి లేనివాళ్లని నువ్వే ఆదరించాలి. ఆ దంపతుల్ని రేపు భోజనానికి పిలుస్తాను. వాళ్లని దీవించు” అన్నాను.
అమ్మ అంగీకరించింది.
మర్నాడు జ్యోతి, విజయ్‌కుమార్‌లు వచ్చేరు. అమ్మ కాళ్లకి నమస్కరించి ఆమె దీవెనలందుకున్నారు.
“ఇంత ప్రేమ, అభిమానం కేవలం చిన్న పట్టింపుతో ఎంత మూసుకుపోతాయో కదా!” అనిపించింది నాకు.
జ్యోతి వెళ్లిపోతూ “స్వాతక్కని క్షమించమని చెప్పు బావా” అంది. “అదేం మాట, వీలు చూసుకుని మీ యిద్దరూ వైజాగ్ రండి” అన్నాను నవ్వుతూ. “తప్పకుండా వస్తాం” అని వీడ్కోలు తీసుకున్నాడు విజయ్‌కుమార్.
వాళ్లు కంపిస్తున్నంతసేపూ తృప్తిగా చూసూ ఉండిపోయాను.
ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని వేషాలు, కేవలం మనల్ని విడదీసి ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకుని దూరంగా వుంచటానికే కదా వుపయోగపడుతున్నాయి.
ఇదీ జరిగిన సంగతి” అని ఆపి స్వాతి వైపు చూసేడు సారథి.
స్వాతి నిట్టూర్చింది. “జ్యోతి ఎంత పెద్దదయింది” అని మాత్రం అనగలిగింది.
“మనకన్నా చిన్నవాళ్లు ఎప్పుడూ చిన్నగానే వుండిపోరు” అన్నాడు నవ్వుతూ.
“తనకన్నా పెద్దది వసుధ వుండగా యెలా పెళ్లి చేసుకుందో?” అంది ఆలోచనగా.
“అదే పొరపాటు. ఏ హృదయం ఎప్పుడు స్పందిస్తుందో ఎవరికి తెలుసు. వసుధకి ఇప్పుడు చదువే ప్రపంచం. ఆవిడగారికి పెళ్లి మీద కోరిక కలిగి చేసుకునేదాకా, జ్యోతి తన మనసుకి మూత వేసి వుంచాలంటే సాధ్యమా? వసుధ డాక్టరయి తనకిష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటుంది.” అన్నాదు సారథి తేలిగ్గా.
స్వాతి మరింక మాట్లాడలేనట్లు చూసింది.

*****

రాత్రి పది గంటలు దాటుతోంది. చల్లని గాలి కిటికీలోంచి దూసుకొస్తోంది. గుమ్మం దగ్గర గాజుల చప్పుడుకి తల తిప్పి చూసేడు సారథి.
స్వాతి నిలబడి వుంది.
“నానీ నిద్రపొయేడా?”
“ఆ!” అంది స్వాతి మెల్లిగా.
“రా, కూర్చో!” అన్నాడు సారథి.
స్వాతి మంచానికి చివరగా కూర్చుంది.
“సునందకి బాబు పుట్టేడట. అమ్మ రాసింది” అన్నాదు.
“మళ్లీనా!” అంది స్వాతి ఆస్చర్యంగా.
“అంటే?” ఆశ్చర్యంగా చూసేడు సారథి.
స్వాతి తడబడింది. “అబ్బే! అది కాదు. ఇదివరకు కూడా బాబే కదా! అందుకని” అంది.
ఆమె తడబాటుకి సారథి నవ్వుకున్నాడు.
ఆమె అతని పాదాలవైపు చూస్తూ”కాలికి ఆ కట్టేమిటి?” అంది ఆశ్చర్యంగా.
“ఏదో చిన్న మేకు గుచ్చుకొంది” అన్నాడు తేలిగ్గా.
ఆమె తల్లడిల్లిపోతూ చూస్తూ “మేకా?” అంది.
“అవును” అన్నాడు సారథి.
“యాంటి టెటనస్ ఇంజక్షన్ తీసుకున్నారా?” అంది గాభరాగా.
“లేదు!”
స్వాతి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.”దయచేసి వెంటనే తీసుకోండి. నిర్లక్ష్యం చెయ్యొద్దు” అంది అతని చేతులు గట్టిగా పట్టుకుంటూ.
సారథి ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూసేడు.
స్వాతి కళ్లనుండి నీటి బిందువులు ముత్యాల్లా రాలిపోతున్నాయి.
“ఎందుకలా బాధపడ్తావు స్వాతీ” అన్నాడు అనునయంగా.
ఆమె అతనికెంతో దగ్గరకొచ్చేసింది. ఆమె తల అతని ఛాతీకి ఆనుకొంది.
“నేను దురదృష్టవంతురాల్ని. నేను తాడనుకొన్నది పాముగా మారి కాటేస్తుంది. మీరు వెంటనే ఇంజక్షన్ తీసుకోండి.” అంది ఉద్వేగంగా.
సారథికి అర్ధమైంది. శేఖర్ మరణానికి కారణం టెటనెసే! అందుకే స్వాతి అంతగా భయపడిపోతోంది.
సారథి స్వాతి తల నిమురుతూ మౌనంగా వుండిపోయేడు.
స్వాతి చాలాసేపటికి తేరుకొంది అతనికి దూరంగా జరగబోయింది.
సారథి ఆమెని అదిమిపట్టేడు.
స్వాతి అతని కౌగిలిలో గువ్వలా ఇమిడిపోయింది.
ఏవేవో కారణాలవల్ల, పరిస్థితుల వల్ల ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు వుండి కూడా దూరంగా వుండిపోయిన ఆ జంట మనసులు పరవశించి, మమతలు వెల్లివిరియగా ఒక్కటయ్యేరు. ఆ క్షణం అన్ని బాధలకి అతీతమైంది.
సారథి తమకంగా “ఐ లవ్ యూ!” అన్నాడు స్వాతిని గుండెలకు హత్తుకొని.
“ఎప్పణ్నుంచి?” అంది స్వాతి చిలిపిగా.
“నిన్ను చూసిన మొదటి క్షణం నుండీ” సారథి ఆమె ముంగురులు సవరిస్తూ చెప్పేడు.
“మరీ ప్రేమని ఇన్నాళ్లూ ఎందుకు దాచుకున్నారు?” స్వాతి ప్రశ్నకు భారంగా నిట్టూర్చేడు సారథి.
“నీ కోసం వెతికి వేసారేను. కాని విచిత్రం చూసేవా? నీ పెళ్ళి సంబంధం వచ్చినప్పుడు శేఖర్ నన్ను చేసుకోమని ఎంతగానో బ్రతిమాలేడు. నేను నువ్వని తెలియక ఒప్పుకోలేదు. తీరా నిన్ను చూసినప్పుడు ఎంత పొరపాటు చేసేనో అర్థమయింది. కాని శేఖర్ నిన్ను చూసి ఇష్టపడ్డాడన్న విషయం గ్రహించి మాట్లాడలేకపోయేను. శేఖర్ నా జీవనజ్యోతి. అతని కోసం ఎంత బాధనైనా దిగమ్రింగడానికి సిద్ధపడ్డాను” అన్నాడు.
“నేను పెళ్లిచూపుల నాడు మిమ్మల్నే పెళ్ళికొడుకుగా భావించి సంబరపడ్డాను” గుసగుసగా చెప్పింది స్వాతి.
“ప్రామిస్!” కళ్లు పెద్దవి చేసేడు సారథి.
స్వాతి బదులుగా అతని గుండెలో తల దాచుకుంది.
“స్వాతి, నాది ఒక్కటే బాధ. నీకు చెబితే అపార్థం చేసుకోవు కదూ”
ఆమె తల అడ్డంగా వూపింది.
“ఒక విధంగా శేఖర్ మరణానికి నేనే బాధ్యుణ్ని అనిపిస్తోంది” స్వాతి చివ్వున తలెత్తి అతనివైపు చూసింది.
“నీకోసం ఎంతగానో వెతికేను. కాలేజీల చుట్టూ తిరిగేను. నీ జాడ తెలియలేదు. కాలం గడిచిపోతోంది. నా ఆశ చావలేదు. నిన్ను మరచిపోలేకపోయేను. ఆ బాధలో యేమనుకొనేవాణ్ణో తెలుసా? నీకు పెళ్ళి కాకూడదనీ, ఒక వేళ అయినా అతను.. అతను .. చచ్చిపోవాలని కోరుకునేవాణ్ని. నేను చాలా దుర్మార్గుణ్ని కదూ!” సారథి స్వాతివైపు ఆవేదనగా చూసేడు.
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
“నా దుష్టమైన కోరికే శేఖర్ని బలి తీసుకుందని ప్రతిక్షణం మూగగా బాధపడుతుంటాను. చెప్పు. నేను పాపాత్ముడిని కదూ!”
స్వాతి నిరాశగా నవ్వింది. “గతాన్ని మరచిపోండి. మీకు నా మీద కల్గిన ప్రేమ అలా అన్పింపజేసింది. మీరతను శేఖరని తెలిసి అనుకోలేదుగా” అంది అనునయంగా.
“స్వాతీ! ఈ రోజునుండి నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరం నానీకి. ఇంక పాత విషయాలు మరచి నవ్వుతూ, ఆనందంగా వుండాలి. నేను చాలా అలసిపోయేను, మారే బాధల్ని భరించే శక్తి నాకు లేదు” అన్నాడు సారథి అలసటగా కళ్లు మూసుకుంటూ.
సారథిని గమనిస్తూ నిద్రలోకి జారుకొన్న అతని తలని ఆప్యాయంగా నిమిరిందామె.
ఎన్ని రోజులుగానో ఒకే యింట్లో భార్యాభర్తలుగా మసలుతూ మానసికంగా, శారీరకంగా ఒకరికొకరు దూరంగా వుండిపోయిన ఆ దంపతుల మధ్య ఆ రాత్రి పూలజల్లు కురిసింది. తెలివెన్నెల కాసింది.
‘భగవాన్! నాకీ సంతోషాన్ని దూరం చేయకు. ఇక యెలాంటి బాధల్నీ తట్టుకోగల శక్తి నాకు లేదూ అనుకొంది స్వాతి.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *