April 25, 2024

దేవశర్మ పత్ని- రుచి

రచన: శ్యామసుందర రావు

ఈ కధను భీష్ముడు అంపశయ్య మీద ఉండగా తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకు అనేక నీటి సూత్రాలు , ధర్మబోధ చేస్తూ చెపుతాడు.
ఆడవాళ్ల కోసము యుద్దాలు జరగటం అనేది చరిత్రలో సర్వసాధారణంగా జరిగేదే మనము ఎప్పటి నుంచో వింటున్నదే. చివరకు మేధావులు ఆడదాని మనస్సును తెలుసుకోవటం కష్టము అని సింపుల్ గా తేల్చేశారు. దీనికి ఉదాహరణగా పురాతనకాలములోని భారతములోని కథ చెప్పుకుందాము. పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణుడికి రుచి అనే సౌందర్యరాశి భార్యగా ఉండేది. ఇంద్రుడు ఆవిడ అందానికి దాసుడై, ఆవిడను మోహించాడు. ఇలా ఉండగా దేవ శర్మ ఒక యాగము చేయటానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వెళ్లేముందు తన శిష్యుడైన విపులునికి ఇంద్రుడు తన భార్య అయినా రుచి మీద దృష్టి ఉన్నది కాబట్టి, అతని దుష్ట ఆలోచనలనుండి నా భార్యను, ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పాడు. అప్పుడు విపులుడు,”గురువుగారు ఇంద్రుడు మాయావి ఏ వేషములోనైనా రావచ్చు ఎలా నేను గుర్తు పట్టేది?”అని అడుగుతాడు. దానికి దేవశర్మ,”నీవు చెప్పినది నిజమే ఇంద్రుడు ఏ రూపములోనైనా రావచ్చు.అదృశ్య రూపములో కూడా రావచ్చు. నీవు నీ తెలివితేటలను యోగ శక్తిని ఉపయోగించి ఆ మాయావి కుట్రలను కనుక్కోవాలి”అని చెప్పి వెళ్ళిపోయాడు విపులుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారము ఆశ్రమాన్ని గురుపత్నిని కాపలా కాస్తూ ఉన్నాడు.
విపులుడు తన యోగ శక్తితో రుచి శరీరంలోకి ప్రవేశిస్తే గురుపత్నికి ఎక్కువ రక్షణ కలుగజేయవచ్చు అన్న ఉద్దేశ్యముతో రుచి శరీరంలోకి ప్రవేశించాడు. రుచి కోరికలు లేని నిష్కామిగా తయారు అయింది. ఇంద్రుడు వచ్చి విపులుడి శరీరాన్ని చూసి నిద్రపోతున్నాడని భావించి రుచి దగ్గరకు చేరి తట్టి లేపి , “సుందరి నన్ను నీ బాహు బంధాలలో బంధించి నా కొరకే తీర్చు విపులుడు నిద్రపోతున్నాడు. ఇక్కడ ఎవరు లేరు, నీవు భయపడనవసరము లేదు” అని బ్రతిమాలటం మొదలుపెట్టాడు. ఆవిడ శరీరములో ఉన్న విపులుడు,”ఇంద్రా! ఆవిడ స్పృహలో లేదు కాబట్టి మాట్లాడలేదు” అని చెప్పి రుచి శరీరమునుండి బయటకు వచ్చి తన శరీరములో ప్రవేశించి,”ఇంద్రా! నీవు ఒకసారి గౌతమ మహర్షి భార్య అహల్యను మోహించి, గౌతమ మహర్షి శాపాన్ని పొందావు, అయినా నీ బుద్ధి మారలేదు. ఇంద్రుడివి అయి ఉండి కూడా నీ కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నావు. ఇతరుల భార్యలను మోహిస్తున్నావు. ఈ సంగతి మా గురువుగారికి తెలిస్తే నిన్ను భస్మము చేస్తాడు జాగ్రత్త. నేను కూడా నిన్ను భస్మము చేయగలను కానీ, మా గురువుగారి ఆజ్ఞ లేకుండా నేను ఆ పని చేయను కాబట్టి నీవు బ్రతికి పోయావు. ఇక్కడి నుండి వెళ్ళిపో “అని హెచ్చరించాడు వెంటనే ఇంద్రుడు భయముతో పారిపోయాడు
దేవశర్మ వచ్చినాక విపులుడు గురువుగారికి రహస్యముగా జరిగిన విషయము (రుచి శరీరములో ప్రవేశించటం తప్ప) చెపుతాడు. దేవశర్మ చాలా సంతోషించి విపులునికి ఒక అపూర్వ వరము ప్రసాదిస్తాడు గురువుగారి అనుమతితో విపులుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఒక రోజు రుచి తన ఆశ్రమములో తిరుగుతుండగా, ఆకాశములో ఒక అప్సరస విహరిస్తూ ఉండగా, ఆవిడ చేతినుండి జారిన ఒక అద్భుత పరిమళము కలిగిన పుష్పము నేలరాలింది. రుచి ఆ పుష్పము యొక్క అమోఘమైన అందానికి, సువాసనకు మురిసి తలలో తురుముకుంటుంది. అదే సమయములో అంగదేశాధిపతి చిత్రరధుడు సతీసమేతముగా దేవశర్మ ఆశ్రమానికి వస్తాడు. చిత్రరధుని భార్య రుచికి చెల్లెలు. ఆవిడ తనకు కూడ అటువంటి పుష్పము కావాలని అడిగితే దేవశర్మ తన శిష్యుడైన విపులునికి ఆ పుష్పము తెచ్చే బాధ్యత అప్పజెపుతాడు.
విపులుడు రుచి ద్వారా ఆ సుగంధ పుష్పాల వివరాలు తెలుసుకొని వాటిని సాధించటానికి ప్రయత్నము మొదలుపెట్టి, గురువు అశీస్సులు, తన యోగ శక్తి వలన ఆ పుష్పాలను సాధించి తీసుకొని వస్తుండగా అతనికి ఒక అద్భుత దృశ్యము కనిపిస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గుండ్రముగా తిరుగుతున్నారు. కాసేపటికి వారిలో వారు నీ అడుగు తప్పింది అంటే నీ అడుగే తప్పింది అని వాదించుకోవటం మొదలుపెట్టారు. స్త్రీ,”నీవు మితిమీరిన వేగముతో పరిభ్రమిస్తున్నావు ” అంది. “నిజమే! నా నియత గతిని తప్పితే విపులుని వలె పరలోకములో దుర్గతి పొందాల్సి వస్తుంది”అన్నాడు. ఆ మాటలు విన్న విపులుడు నిర్ఘాంతపోయాడు. అలాగే కొంతదూరము వెళ్లినాక అక్కడ ఆరుగురు జూదమాడుతూ, వారిలో వారు తగువులాడుతూ వాళ్ళుకూడ విపులుని వాలే దుర్గతి పొందగలవని తీవ్రముగా శపించుకున్నారు. ఇది కూడా విన్న విపులుడు తీవ్ర మనస్థాపము చెంది తనను తానూ సమీక్షించుకోవటం ఆరంభించాడు
విపులుడు తాను గురువు గారికి జరిగిన విషయాలు చెప్పేటప్పుడు గురుపత్ని రుచి శరీరంలోకి ప్రవేశించటం చెప్పకపోవటం దోషముగా భావించి, దాని ఫలితముగా తానూ దుర్గతి పొందుతానా? అని బాధపడ్డాడు. ఆశ్రమము చేరి తను తెచ్చిన సుగంధ పుష్పాలను గురువుగారికి అందజేస్తే, అయన తన మరదలికి ఇచ్చాడు ఆవిడ చాలా సంతోషించింది. ఆ తర్వాత దేవశర్మ విపులునితో,”నాయనా విపులా! నీవు మార్గమధ్యములో వాదులాడుకొనే ఇద్దరు స్త్రీ పురుషులను, మరొకచోట ఆరుగురు జూదరులను చూసావు కదా? వారెవరో తెలుసుకున్నావా? ఒకటి మాత్రము నిజం. నీవు చేసినది మంచి పని అయినా ఇంద్రుని కట్టడి చేయటానికి రుచి శరీరములో ప్రవేశించి నాకు ఆ విషయము చెప్పకపోవటం, వాళ్ళు నేరముగా తలచి ఆ విధముగా మాటలాడి ఉంటారు| నీకు కనిపించిన స్త్రీ పురుషులు రాత్రి- పగలు ఆరుగురు జూదరులు ఆరు ఋతువులు. నీకు ఏ పాతకము అంటదు ” అని గురువైన దేవశర్మతన యోగ శక్తితో జరిగిన విషయాలన్నీ చెప్పగా, విపులుడు సిగ్గుతో తలవంచుకున్నాడు.
“విపులా! అహోరాత్రాలు, ఋతువులు మానవుల చర్యలను అన్నింటిని గమనిస్తూనే ఉంటాయి. ఎవ్వరికి తెలియదు, నన్ను ఎవ్వరు చూడటము లేదు, గమనించటం లేదు అనుకోవటము చాలా పొరపాటు. ఎటొచ్చి నీవు నన్ను, నా గౌరవాన్ని, నా వంశాన్ని నీ తెలివితేటలతో యుక్తిగా కాపాడావు కనుక బాధపడకు నీకు ఏ పాపము అంటదు “అని దేవశర్మ శిష్యుడైన విపులని ఓదార్చాడు.
ఈ కథలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు గురువులకు మనము ఏదైనా విషయము దాచిన వారికి తెలియదు అనుకోవటం పొరపాటు అన్న నీతిని చెపుతాడు. ఈ కథతో పాటు స్త్రీలలో రకాలను వారిలో ఉన్నత లక్షణాలు కలిగిన స్త్రీలవల్ల భూమి సక్రమముగా ఉంటున్నదని చెపుతాడు. ఆ తరువాత ధర్మరాజు భీష్ముడిని వరునికి వధువును వెతికే సందర్భములో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అడుగుతాడు. భీష్ముడు ఐదు రకాల వివాహాలను వాటిలో మొదటి మూడు ధర్మబద్ధమైనవిగానూ, మిగిలిన రెండు ఆధర్మమైనవిగా వివరిస్తాడు. ఆ విధముగా వివాహ వ్యవస్థలోని ధర్మ సూక్ష్మాలను భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. అలాగే పుట్టిన సంతానములోని 12 రకాల సంతతిని కూడా వివరిస్తాడు. దేవశర్మ, ఆయన భార్య రుచి, శిష్యుడు విపులుని కథ ద్వారా భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూత్రాలను వివరిస్తాడు.“భీష్మ పితామహ గోదానము చేసినవారు ఎక్కడ ఉంటారు, ఆ ప్రదేశము ఎక్కడ ఉంటుంది?” అని ధర్మరాజు భీష్ముడిని అడుగుతాడు.“ఓ ధర్మరాజా! గోలోకము అనే ప్రదేశము ఉంది. అక్కడ కాలము ఉండదు. జబ్బులు ఉండవు. ముసలితనము ఉండదు. ఆకలిదప్పులు ఉండవు. అక్కడి వారు సుఖసంతోషాలతో ఉంటారు. ధర్మరాజా! అన్ని దానాలలో కెల్లా గోదానము గొప్పది. అది కూడా స్వంతముగా సంపాదించిన ధనముతో గోదానము చేయాలి. కాబట్టి నీవు కూడా గోదానము చేసి పుణ్యము సంపాదించుకో” అని భీష్ముడు ధర్మరాజుతో చెపుతాడు.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *