March 29, 2024

సాఫ్ట్‌వేర్ కథలు – తైర్ సాదమ్

రచన: కంభంపాటి రవీంద్ర

అర్ధరాత్రి ఒంటి గంటకి మా మేనేజర్ నుంచి మెసేజ్.. మర్నాడు ఉదయాన్నే ఆఫీసులో కలవమని. చాలాకాలం నుంచి అతనితో పని చేస్తున్నానేమో , మెసేజ్ లో వివరాలు లేకపోయినా ఎందుకు కలవమన్నాడో సులభంగానే ఊహించగలను. కొత్త ప్రాజెక్ట్ ఏదో వచ్చినట్టుంది, నన్ను టేకప్ చెయ్యమని అడుగుతాడు.
నిజమే..నేను ఊహించినట్టే ..ఉదయం కలవగానే , “కొత్త ప్రాజెక్ట్ వచ్చింది , నన్ను టేకప్ చెయ్యమని” చెప్పేడు. ఆ తర్వాత రెండు రోజులూ ప్రాజెక్టు స్కోప్ అంతా చదివేను. చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ , క్లయింట్ సిస్టంలో కొత్త కొత్త ఫైనాన్షియల్ కంట్రోల్స్ పెట్టాలి , సరైన టీమ్ లేకపోతే కుదరదు.
ఇదే విషయం అతన్ని కలిసి చెప్పేను, “ఒక పది మంది టీం కావాలి.. అందులో కనీసం ముగ్గురైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రోగ్రామర్లు కావాలి.. అందరికీ ఫైనాన్షియల్ డొమైన్ తెలిసి ఉండాలి”
“మనం ఎన్నో కావాలనుకుంటాం.. అన్నీ జరగవు కదా” అన్నాడు నవ్వుతూ
“సరే.. మీ ఇష్టం.. గోధుమలు ఇచ్చి బిర్యానీ వండమంటే కుదరదు కదా” అన్నాను
చురుగ్గా చూసి, “సరే.. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రోగ్రామర్ ని ఇస్తాను.. మిగతా అందరూ ఫ్రెషర్లు.. వీలైనంత త్వరగా వీళ్ళందరినీ ట్రైన్ చెయ్యి నువ్వు..” అన్నాడు
“అందరికీ ట్రైనింగ్ నేనే ఇచ్చుకుని , ప్రాజెక్టు ప్లానింగ్ నేనే చేసుకుని , కోడ్ రివ్యూలు నేనే చేసుకోవాలంటే , నాకు ఇరవై నాలుగుగంటలు సరిపోవు” అన్నాను
“ఈ విషయం నేను ఇంక డిస్కస్ చెయ్యను.. రెండు మూడు రోజుల్లో టీం మెంబెర్స్ నీకు రిపోర్ట్ చేస్తారు.. ఇవాళ్టి నుంచీ మీటింగ్స్ లాంటివి ప్లాన్ చేసుకో” అనేసి తన కంప్యూటర్లో మొహం దూర్చేసేడు !
అనుకున్నట్టుగానే మూడు రోజుల్లో కొత్త టీం మెంబర్స్ వచ్చి రిపోర్ట్ చేసేరు. అందరినీ పరిచయం చేసుకున్నాను , మా మేనేజర్ మాట ఇచ్చినట్టే ఒక్క అమ్మాయి తప్ప , మిగతా అందరూ రెణ్ణెల్ల క్రితం కాలేజ్ నుంచి ఫ్రెష్ గా జాయిన్ అయినవాళ్లే. మాంచి ఉత్సాహంగా ఉన్నారు , ఇదీ ఓ రకంగా మంచిదే.. ఎలాగూ చెయ్యాల్సిన పని బోలెడున్నప్పుడు , టీంలో ఎనర్జీ , ఎగ్జైట్మెంట్ ఉంటేనే బావుంటుంది.
మా కొత్త టీంలో వెంకటేశన్ అనే కుర్రాడున్నాడు. మిస్సమ్మ , పెళ్లి చేసి చూడు సినిమాల్లో ఎన్టీఆర్ లా ఉన్నాడా కుర్రాడు. అదే మాట అతనితో చెప్పేను. ఆ వెంకటేశన్ నవ్వుతూ , “ఇదే మాట మా నాన్న అంటూంటారు సర్ , మేము తమిళియన్స్ అయినా మాకు పాత తెలుగు సినిమాలు తెలుసు” అన్నాడు.
ప్రాజెక్ట్ మొదలైంది , అందరూ చాలా కష్టపడుతున్నారు , ఉదయం ఎనిమిదింటికి ఆఫీసుకి రావడం..మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియని పరిస్థితి. అందరిలోకీ వెంకటేశన్ ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఆరు నెలలయ్యేసరికి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రోగ్రామర్ లా పని చేసేస్తున్నాడు.
టీం మధ్య బాండింగ్ పెరగడానికి , ఎలాగూ అర్ధరాత్రి వరకూ ఆఫీసులో ఉంటున్నాం కాబట్టి , డిన్నర్ అందరం కలిసి కాంటీన్ లో చేద్దామని టీంకి చెప్పేను. అందరూ సరేనన్నారు, కానీ వెంకటేశన్ మొహంలో చిన్న నిరాశ కనిపించింది.
కాసేపు తర్వాత వచ్చి నన్ను కలిసేడు. “రాత్రి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అనే మీ ఐడియా బావుంది సర్.. కానీ నేను రాలేను” అన్నాడు
“ఏం?”
“ఏం లేదు సర్… రోజూ రాత్రి మా నాన్నగారు నా కోసం డిన్నర్ తీసుకుని వస్తారు.. ఇద్దరం పార్కింగ్ లాట్ లో కూచుని తింటాం”
“పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ అందరితో కలిసి నువ్వు భోజనం చెయ్యొచ్చు కదా ?” అడిగేను
“ఆయన నాకు తినిపించకపోతే ఇబ్బంది ఫీల్ అవుతారు సర్… ఒక్కణ్ణే కొడుకుని ఆయనకి.. అది కూడా ఆయనకి నలభయ్ ఐదో ఏట పుట్టేను.. ఇప్పుడు ఆయనకి అరవై ఏడేళ్లు.. నాతో వీలైనంత టైం స్పెండ్ చేద్దామనుకుంటారు.. అందుకే” అంటూ నసిగేడు
“రోజూ ఏమేం ఐటమ్స్ పట్టుకొస్తారేంటి?” నవ్వుతూ అడిగేను
“ఐటమ్స్ ఏమీ ఉండవు సర్.. ఇంట్లో అందరం రాత్రి తైర్ సాదం తింటాం.. అంతే.. అదే తీసుకొచ్చి తినిపిస్తారు” అన్నాడు
“సరే.. నీ ఇష్టం వెంకటేశన్.. నిన్ను టీంతో రమ్మని ఇబ్బంది పెట్టను” అన్నాను
“ఇంకో రిక్వెస్ట్ సర్” అన్నాడు
“చెప్పు ?”
“ఏమీ లేదు సర్.. మా నాన్న మన ఆఫీస్ దగ్గర ఉన్న మురుగన్ టెంపుల్లో ఎలక్ట్రీషియన్ గా చేసి రిటైర్ అయ్యేరు.. జీవితంలో సుఖం తెలీదాయనకి.. ఈ ఏడాది మీరు నన్ను హెచ్ వన్ బి వీసాకి రికమెండ్ చేస్తే , వచ్చే ఏడాది నాతో అమెరికాకి తీసుకెళ్తాను” అన్నాడు
“నువ్వు చాలా బాగా పని చేస్తున్నావు.. వీసా కోసం నీ పేరు రికమెండ్ చెయ్యడం నాకేం అభ్యంతరం లేదు” అన్నాను
మొహం వెలిగిపోయింది వెంకటేశన్ కి. “థాంక్ యూ వెరీ మచ్ సర్” అనేసి వెళ్ళిపోయేడు!
ఓ ఆదివారం ఉదయం కొంచెం ఖాళీగా ఉండి, వడపళనిలో ఉండే మురుగన్ కోవెలకి వెళ్ళేను. దర్శనం చేసుకుని , ఆ కోనేటి దగ్గర కూచుంటే , “సర్” అనే పిలుపు వినిపించింది. ఎవరా అని చూస్తే , ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ‘సర్ ‘ అని పిలుపు.. ఈసారి జాగ్రత్తగా చూస్తే , దూరం నుంచి ఆ కోనేట్లో ఈదుకుంటూ వస్తున్నాడు వెంకటేశన్. గట్టునున్న మెట్ల దగ్గరికి వచ్చి, తుండు చుట్టుకుని గబగబా నా దగ్గిరకి వచ్చి , “హలో సర్.. మా నాన్నగారిని పరిచయం చేస్తాను” అంటూ “అప్పా.. అప్పా” అంటూ అరిచేసరికి , ఆ కోనేటి నీళ్లలోనుంచి మెల్లగా ఓ ముసలాయన నడుచుకుంటూ వచ్చేరు. “వణక్కం సార్!” అంటూ నాకు నమస్కారం పెట్టబోతే, “నా తండ్రిలాంటి వారు.. మీరు నాకు నమస్కారం పెట్టకూడదు సర్” అంటూ వారించేను.
వెంకటేశన్ చెప్పేడు , “ప్రతీ ఆదివారం నేనూ , మా నాన్నా ఇలా ఇక్కడికి వచ్చి ఈత కొడుతూంటాం సర్.. చిన్నప్పుడే నాకు ఈత నేర్పించేరు.”
“వీడి చిన్నప్పుడు సినిమాలకి , షికార్లకి తీసుకెళ్లేంత స్తోమత లేదు సార్ నాకు.. అందుకే.. నాతో ఈ గుడికి తీసుకొచ్చేసేవాడిని.. మురుగన్ సామికి జరిగే సేవలు , ఈ ఈత.. ఇవే వీడికి ఆటవిడుపు” అంటూ ఆ పెద్దాయన చెబుతూంటే , నాకెందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగేయి.
“అన్నట్టు.. వెంకటేశన్.. నీకో గుడ్ న్యూస్.. నీకు హెచ్ వన్ బి అప్రూవ్ అయ్యింది.. ఇంక వీసా స్టాంపింగ్ అయిపోతే , నీ అమెరికా ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు” అన్నాను
“థాంక్ యూ సర్..” అన్నాడు వెంకటేశన్.. వెంటనే తండ్రికి విషయం చెప్పేడు. నేనింక బయలుదేరి వచ్చేసేను.
మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తయ్యింది. టీం అందరం వేర్వేరు ప్రాజెక్టుల్లోకి వెళ్ళిపోయేము. ఓ రోజు ఉదయాన్నే , వెంకటేశన్ వచ్చి కలిసేడు, “సర్.. ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్తున్నాను.. చెబుదామని వచ్చేను” అన్నాడు
“వెరీ నైస్.. మరి నీతోబాటు మీ అమ్మానాన్నలని తీసుకెళ్తున్నావా ?”
“ఒక మూడు నాలుగు నెలల్లో తీసుకెళతాను సర్.. కొంచెం వాళ్ళ వీసా ప్రాసెసింగ్ కి మీ సాయం కావాలి” రిక్వెస్ట్ చేసేడు.
“నువ్వేమీ వర్రీ అవ్వకు.. అవన్నీ నేను చూసుకుంటాను” హామీ ఇచ్చేను !
వెంకటేశన్ అమెరికా వెళ్లిన ఆరు నెలల తర్వాత, అతని తల్లితండ్రులకి అమెరికా వీసా వచ్చింది. ఇద్దరినీ నేనే అమెరికన్ కాన్సులెట్ కి తీసుకెళ్ళేను. దార్లో అతని తల్లి “వాడిని కలిసేదాకా తైర్ సాదం తినకూడదని ఇద్దరం ఒట్టు పెట్టుకున్నాం.. వాడి కోసం , తైర్ సాదం కోసం ఇద్దరం మొహం వాచిపోయున్నాము” అనేసరికి , “అయ్యో.. మీ ప్రయాణం ఎలాగూ గేరంటీగా జరిగి తీరుతుంది… ఆమాత్రం దానికోసం ఇలా మీరు రోజూ తినే తైర్ సాదం తినడం మానేయాలా ?” అన్నాను
“వాడిని చూడ్డం కోసం మేము మొహం వాచిపోయున్నాము. ఆ గుర్తుగా ఇలా” అన్నారు వెంకటేశన్ తండ్రి
ఇంక నేనేమీ మాట్లాడలేదు !
ఆ రాత్రి ఒంటి గంటకి మా మేనేజర్ మెసెజ్ చేసేడు , “ఇప్పుడు మాట్లాడొచ్చా అని”. నేను పని చేస్తున్న ప్రాజెక్ట్ లో ఏదైనా ఇబ్బందేమోనని వెంటనే అతనికి ఫోన్ చేసేను.
ఆయన చెప్పడం మొదలెట్టేడు ,”నీకు వెంకటేశన్ వాళ్ళ ఫ్యామిలీ బాగా తెలుసు కదా.. రేపు ఉదయాన్నే వాళ్ళని కలవాలి నువ్వు.. ఇందాకే ఫోన్ వచ్చింది.. అమెరికా లో ఏదో లేక్ లో స్విమ్మింగ్ చేద్దామని ఆ వెంకటేశన్ దూకాడట.. రాంగ్ యాంగిల్ లో దూకడంతో కార్డియాక్ అరెస్ట్ వచ్చి వెంటనే పోయేడట..” అంటూ ఇంకా ఏదో చెబుతున్నాడాయన.. నా చెవులూ ,బుర్రా పనిచేయడం మానేసేయి !

9 thoughts on “సాఫ్ట్‌వేర్ కథలు – తైర్ సాదమ్

  1. ఎదిగిన కొడుకు.. ఒకే ఒక్కడు. ఈ విధంగా దూరమవ్వడం పాఠకుల గుండెల్నే పిండేసింది.. మరి ఆ ముసలి తల్లిదండ్రులూ…

  2. ఎందుకిలా ఎప్పుడూ
    ఒక్కసారి కూడా దేవుడు మంచి చూపు చూడడా?

  3. నాకూ sixth sense చెప్తోంది చివర్లో మెలిక ,పాఠకులు తట్టుకోలేనిది అని .ముఖ్యంగా తైరుసాదం ,ఈత క్లూస్ .కానీ ఈ ఒక్క మారైనా మంచివాళ్ళకు మంచి జరగితే ఎంత బాగుంటుంది అని .కథైతే మార్చచ్చు జీవితాన్ని కాదు .

  4. అన్యాయం రవీ. వెంకటేశం ఎంత ఘోరంగా వెళ్ళిపోయాడు. ఆ తల్లితండ్రులు ఎప్పటికీ తైరుసాదం తినరేమో ఆ కొడుకును తలుచుకుంటూ కుమిలిపోతూ. జర్మనీలో ఇలాగే ప్రాజెక్ట్ పనిమీద వెళ్ళి, హాట్ వాటర్ షవర్ ఫుల్ హీట్ లో తెలీక ఆన్ చేసి… మెదడంతా కాలిపోయి చచ్చిపోయిన నా స్టూడెంట్ గుర్తొచ్చాడు. పేరెంట్స్ ది ఇదే నేపధ్యం!

  5. ఇది నిజంగా జరిగిందా రవీంద్ర గారూ ?
    కాకపోతే బావుంటుంది.. కానీ మీరు నిజం చెప్పిండి.

  6. చివరి పేరాలో సస్పెన్స్ తెలిసిందే అయినా
    గుండె పట్టేసినట్లయింది
    ఆ వయసులో అంత కష్టం తట్టుకోగలరా ఆ ముసలి దంపతులు

Leave a Reply to Sasikala Volety Cancel reply

Your email address will not be published. Required fields are marked *