April 19, 2024

అమ్మమ్మ – 37

రచన: గిరిజ పీసపాటి

తల్లి చెప్పిన విషయం మొత్తం విన్నాక వసంత తోక తొక్కిన త్రాచులా పైకి లేచింది. “అసలెందుకీ దాగుడుమూతలు? ఇక్కడాయనకి ఏం లోటు జరిగిందని వెళ్ళిపోయారో నాకర్ధం కావడం లేదు. కుష్ట మామ అబద్ధం చెప్తున్నారని నాకప్పుడే అనుమానం వచ్చినా, ఢీల్లీ మామ కూడా వెళ్ళొచ్చి ఆయన మన ఊరిలో లేరనేసరికి నిజమే అనుకున్నాను. చిన్నప్పటి నుండి మన ఇంట్లో మనిషిలా ఉంటూ ఢిల్లీ మామ కూడా అబద్ధం చెప్తాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా!?” అడిగింది తల్లిని.
అసలే పెద్దపెద్ద కళ్ళేమో కోపంతో మరింత పెద్దగా, ఎర్రబడిపోయాయి వసంత కళ్ళు. “కోపం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదు వసంతా! కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయినా ఇందులో ఆలోచించడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు మన ముందున్నవి రెండే దారులు. ఒకటి, రాముడువలస వెళ్ళిపోవడం. రెండు, ఇక్కడే ఉండి మన బతుకులు మనం బతకడం. ప్రస్తుతానికి ఈరెండు మార్గాలే కనిపిస్తున్నాయి” అంది నాగ.
“రాముడువలస వెళ్తే తాత మనకు హారతిచ్చి స్వాగతం పలుకుతారనుకుంటున్నావా అమ్మా?” తీవ్రమైన స్వరంతో అడిగింది వసంత.
చిన్నగా నవ్వి “అలా ఎందుకనుకుంటాను పాపా! మనం చెయ్యని తప్పులేవో మన మీద రుద్ది ఖచ్చితంగా తిడతారు. కానీ, పెద్దవాళ్ళు. వాళ్ళు తిడితే మాత్రం పడకూడదా చెప్పు? అయినా వాళ్ళు తిట్టడానికి కారణం కూడా మీ నాన్నే కదా! కన్న కొడుకు మీద ప్రేమతో వారి స్థానంలో ఎవరున్నా తిడతారు. అలాగని పంతాలకు పోతామా చెప్పు” తిరిగి కూతుర్ని ప్రశ్నించింది.
వసంత కూడా మరేమీ మాట్లాడకుండా “సరేనమ్మా! నీ ఇష్టం. నువ్వెలా అంటే అలాగే” అంది అయిష్టంగానే.
మర్నాడు ఉదయం షాప్ కి వెళ్ళి తన పని తాను చేసుకోసాగింది నాగ. ఇంతలో కృష్ణమూర్తి గారు వచ్చి నాగను ఉద్దేశించి “చెల్లీ! ఈరోజు బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాల్సిన చెక్స్ ఇస్తే వెళ్ళి డిపాజిట్ చేసొస్తాను” అన్నారు.
ఆయన వంక కూడా చూడకుండా మౌనంగా చెక్స్ తీసి టేబుల్ మీద పెట్టి, అవి ఎగిరి పోకుండా పేపర్ వెయిట్ పెట్టింది నాగ. ఎప్పుడూ తన చేతికి అందించే చెల్లెలు ఈరోజు అలా టేబుల్ మీద పెట్టడం, ముభావంగా ఉండడం గమనించిన కృష్ణమూర్తి గారు “ఎమైంది చెల్లీ!? అదోలా ఉన్నావు. ఏం జరిగింది?” అనడిగాడు ఆదుర్దాగా.
ఆయనకు సమాధానం ఇవ్వకుండా తన పని తాను చేసుకోసాగింది. “ఆరోగ్యం బాగోలేదా? పిల్లలు కులాసానా?” అని నాగను ప్రశ్నిస్తూనే “మూర్తీ! నాకు, మేడమ్ గారికి టీ ఇవ్వు” అని పురమాయించారాయన.
రెండు గ్లాసులలో టీ పోసి వీళ్ళ ముందు ఉంచాడు మూర్తి. “మూర్తీ! నీకు ఇదివరకే చెప్పాను కదా! మళ్ళీ నాకు టీ ఎందుకు ఇచ్చావు? తిరిగి ఫ్లాస్కులో పోసెయ్. రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వస్తే ఇవ్వొచ్చు” అంది నాగ.
మూర్తి కామ్ గా నాగ ముందున్న గ్లాస్ లోని టీ తీసుకెళ్ళి తిరిగి ఫ్లాస్కులో ఒంపేసాడు. “టీ ఎందుకు వద్దంటున్నావు? అసలేం జరిగిందంటే చెప్పవేం?” అడిగాడాయన విసుగ్గా.
“కొత్తగా వేరే ఏం జరగాలన్నయ్యా? అవతల నా పిల్లలు ముగ్గురూ ఐదు రోజులుగా మంచినీళ్ళతో కడుపు నింపుకుంటుంటే ఇక్కడ నేను టీ ఎలా తాగగలను?” అంది దుఃఖ భారంతో వణుకుతున్న స్వరంతో.
“అరెరే. . . నిజమా! పిల్లలు, నువ్వు భోజనం చేసి ఐదు రోజులయిందా? నాకు ఓ మాట చెప్పాలి కదా? నన్ను పరాయివాడిలా చూస్తున్నావా చెల్లీ? నేను నీ సొంత అన్నయ్యనే అయితే ఇలా నాకు చెప్పకుండా ఉండేదానివా?” అన్నాడు ఆయన కూడా బాధపడుతూ.
“నిన్ను సొంత అన్నయ్యలా భావించబట్టే రాముడువలస వెళ్ళి, అక్కడ మీ బావ ఉన్నారో లేదో చూసి రమ్మని చెప్పాను అన్నయ్యా! వెళ్ళావు, చూసావు, వచ్చావు. ఆయనక్కడ లేరని నువ్వు చెప్పిన మాటలు నిజమో, అబద్ధమో నీకు తెలియదా!? నువ్వు నా సొంత అన్నయవి అయితే అలా చేసేవాడివా? నువ్వే చెప్పు. నువ్వు పరాయివాడిలా ప్రవర్తించావో లేక సొంత అన్నయ్యలా ప్రవర్తించావో!” సూటిగా తన వంకే చూస్తూ ప్రశ్నించిన నాగ చూపులను తట్టుకోలెక తల దించేసుకున్నాడాయన.
ఆయన సమాధానం కోసం నిరీక్షిస్తూ ఇంకా ఆయన వంకే చూస్తోంది నాగ. తల దించుకుని కూర్చున్నా ఆ విషయం ఆయనకు తెలుస్తూనే ఉంది. “సారీ చెల్లీ!” అన్నాడు మెల్లిగా.
“నాకు కావలసింది ‘సారీ’ కాదన్నయ్యా! నువ్వెందుకలా చెప్పావన్న నిజం. ఎందుకంటే మీరంతా‌ బంధువులు కదా! నేను పరాయి చోటు నుండి వచ్చినదాన్ని. వాళ్ళు చెప్పమన్మట్లు చెప్పకపోతే నిన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కలుపుకోరు. నాకు అబద్ధం చెప్పినా నా తరఫున నిన్ను నిలదీసే వాళ్ళు ఎవరున్నారు కనుక” అంది పేలవమైన నవ్వుతో.
“నేను చేసింది తప్పే చెల్లీ! ఒప్పుకుంటున్నాను. అందుకు నన్ను క్షమించు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. ఎలా తెలిసినా, ఎవరి వల్ల తెలిసినా వాడు అక్కడే ఉన్నాడనే నిజం నీకు తెలిసింది. వాడు ఏమయ్యాడోనన్న బెంగతో ఇన్నాళ్ళు నువ్వు ఎంద వేదన అనుభవించావో. ఇప్పుడైనా నిశ్చింతగా ఉండు”.
“ఇక నేను నీకు అబద్ధం ఎందుకు చెప్పానంటే, వీడక్కడికి వెళ్ళి మీ గురించి ఏం చెప్పాడో గానీ మీ మామగారే కాదు, మా అప్ప (పాపమ్మ గారు కృష్ణమూర్తి గారికి వరుసకు అక్క అవుతారు. అటుపక్క అక్కని అప్ప అంటారు) కూడా నీ మీద, పిల్లల మీద చాలా కోపంగా ఉన్నారు”.
“ఆ పరిస్థితిలో నువ్వు, పిల్లలు వాళ్ళకు ఎదురుపడడం మంచిది కాదని, కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళు వేడి తగ్గి ఆలోచిస్తారని అనుకున్నాను. కానీ మొన్న ఆదివారం నాడు మళ్ళీ రాముడువలస వెళ్ళొచ్చాను. వాళ్ళ కోపం ఏమాత్రం తగ్గలేదని అర్ధమైంది. అందుకే నీకు ఊరు వెళ్ళొచ్చిన విషయం కూడా చెప్పలేదు” అన్న ఆయన మాటల్లోని నిజాయితీని గమనించిన నాగ కూడా ఇంకేం మాట్లాడలేకపోయింది.
కాసేపు మౌనంగా ఉన్న తరువాత మెల్లని స్వరంతో “నేను, పిల్లలు మన ఊరు వెళ్ళిపోదామనుకుంటున్నాము అన్నయ్యా. ఆయన ఎక్కుడుంటే మేమూ అక్కడ ఉండడమే మర్యాద. పైగా ఎదిగిన ఇద్దరు ఆడ పిల్లలను పెట్టుకుని నేనిక్కడ ఉండడం కూడా భావ్యం కాదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను” అంది.
“తొందరపడకు చెల్లీ‌! మరో రెండు నెలల్లో ఆడపిల్లలిద్దరికీ ఇంటర్ ఫైనలియర్, నానికి టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు హఠాత్తుగా అక్కడికి వెళ్ళిపోతే పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. ముఖ్యంగా మగపిల్లాడైన నాని భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు” అన్నడాయన.
“ఎలాగూ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారు కదా అన్నయ్యా! ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ పరీక్షలకు వస్తారులే. ఈ పరీక్షల కన్నా జీవితం ముఖ్యం కదా!” అంది.
“ఆడపిల్లలిద్దర్నీ ఇంటర్మీడియట్ లో జాయిన్ చెయ్యడానికి మీ మామగారితో వసంత కెజిహెచ్ లో ఉన్నప్పుడు పెద్ద యుద్ధమే చేసావు. మర్చిపోయావా? వాళ్ళ చదువు కోసం అంత పోట్లాడి, ఆయన్ని వప్పించిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు?” అన్నాడు.
“అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయి కదా అన్నయ్యా! పరిస్థితులను బట్టి నడుచుకోక తప్పదు కదా!” అంది నిర్వేదంగా.
“ఒక్క మాట చెప్తాను. వింటావా?” అన్న కృష్ణమూర్తి గారి వైపు చూసి ‘వింటాను’ అన్నట్లు తలూపింది నాగ.
“ఇన్నాళ్ళు ఓపిక పట్టావు. మరొక్క ఆరు రోజులు ఓపిక పట్టు. మీ మామగారు మరో ఆరు రోజులలో, అంటే వస్తున్న ఆదివారం నాడు ఇక్కడ ఏదో నాటకం ఉందని వస్తున్నాడు. నువ్వు, పిల్లలు వెళ్ళి ఆయన్ను కలవండి. జరిగిన విషయాలన్నీ ఆయనకు వివరంగా చెప్పండి. ఆయన ఎలా చెప్తే అలా చెయ్యండి” అన్నాడు.
“కానీ, ఆయనను వెళ్ళి కలవాలన్నా ఇక్కడ ఎవరి ఇంట్లో ఉంటారో తెలియదు కదా అన్నయ్యా. పైగా పరాయి వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషయాలు మాట్లాడడం ఆయనకూ చిన్నతనమే కదా! బాగోదేమో!” అంది.
“అదీ నిజమే! పోనీ, ఒక పని చెయ్యండి. ఆయన ఆరోజు ఉదయం పాసింజర్ బండికి వస్తున్నాడు. నువ్వు, పిల్లలు సరాసరి రైల్వే స్టేషన్ కి వెళ్ళి కలవండి. అక్కడ స్టేషన్ లో పది మంది ముందూ అరవడం, తిట్టడం చెయ్యలేడు. లోపల ఎంత కోపమున్నా పైకి ప్రశాంతంగా మాట్లాడతాడు. ఇంతకు మించి‌ మరో మార్గం నాకు తోచడం లేదు” అంటూనే‌ “బ్యాంక్ టైమ్ అయిపోతోంది. నేను ముందు ఇవి డిపాజిట్ చేసి వస్తాను” అన్నాడు చేతిలోని చెక్స్ ని చూపిస్తూ‌.

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *