March 29, 2024

అవును.. గాలిమేడలే.. అయితేనేమి..?

రచన: ముక్కమల్ల ధరిత్రిదేవి

ఊహలకు రెక్కలొచ్చి
ఊసులు వేనవేలు ఎగసి ఎగసి
నింగిని చేరి కడతాయి
మేడలు… గాలి మేడలు !
పునాదులే లేని ఊహాజనితపు కట్టడాలు!
అంతులేని భావవీచికలు
అందంగా మలిచి ఆశల తోరణాలతో
అలంకరించిన ఆకాశహర్మ్యాలు !!
అవును… అవి కలలే.. గాలిలో మేడలే !
నిజాలై కళ్లెదురుగా ఎన్నటికీ
నిలవని వాస్తవ దూరాలే !
ఆ కలలన్నీ కల్లలే… ఎప్పటికీ కలలే !
తెలిసినా మారాం చేస్తూ మది వినదే !
ప్రతీసారీ కూలిన ఆ గోడల వంక
చూస్తుంది ఆశగా…! మరింత ప్రేమగా…
అంతే, మళ్లీ మొదలు ! మరో రంగుల మేడ !!
మూసిన రెప్పల మాటున
మౌనంగా కరుగుతూ….
అదీ కలిసి పోతుంది
శూన్యంలో మాయమౌతూ..అయితేనేమి?
అలుపన్నదెరుగక మనసుతో మమేకమై
కలలు కంటూనే ఉంటాయి ఈ కళ్ళు !
ఆ కలలు ఊరడిస్తాయి
సాంత్వనవచనాలతో చప్పున
చల్లబరుస్తాయి నిరాశానిస్పృహల్ని !
నలిగిన హృదిని శాంతపరుస్తూ
అందిస్తాయి జవసత్వాలు !
అవును… అవి గాలిమేడలే…అయితేనేమి?
అద్వితీయ అనుభూతికి ప్రతిబింబాలు !
ఇంధనాలై శక్తి నొసగే అద్భుత ‘టానిక్కులు ‘!
మనో నేత్రానికే దర్శనీయమౌ అపూర్వ నిర్మితాలు !
మదిని క్షణ కాలమైనా
రంజింప జేయగల ఆశాసౌధాలు!! నిజమే…
అందమైన అశాశ్వతమైన అనుభవమే !
ఒసగే ఆనందం తాత్కాలికమే…
సహజత్వానికి సుదూరమే… కావచ్చు !
అది క్షణమైతెనేమి గాక…
కల్పిత కథ అయితేనేమిగాక.. !
మధురం.. అతి మధురం.. అనిర్వచనీయం !
ఇంకా… శాశ్వతం ! పదిలం ! నిజమే కద !!

🌷🌷🌷🌷🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *