June 25, 2024

ఆ చేత్తో..

రచన: కుమార్ జొన్నలగడ్డ

కాలం మారుతోంది. దశాబ్దాలు మారుతున్నాయి. సాంఘిక వ్యవహారాలు, పోకడలు మారుతున్నాయి. ఆర్ధిక అసమానతలు తగ్గుతున్నాయి. అంతా మారుతోంది అని అనుకున్నప్పుడు ఇంకా మారనిది సమాజంలో పాతుకుపోయినది ఏమిటంటే పురుషాధిక్య సమాజం. ఒక స్త్రీ యెంత యెత్తుకు యెదిగినా, ఇంకా ఒక స్త్రీ భావనలకి ప్రొత్సాహం ఇవ్వకుండా వారిని ఎప్పుడూ రెండవ తరగతి పౌరుల్లాగానే ఈ సమాజం చూస్తోంది. ఈ భావాలు మగవారిలోనే కాకుండా ఆడవారిలో కూడా ఉన్నాయి.అలాంటి సమాజంలో తనను తాను ప్రోత్సహించుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఆఫీసు బాధ్యతలు కూడా సమపాళ్ళలో నిర్వహిస్తూ నిర్విరామంగా శ్రమపడే అనేక మహిళామణులలో ఒకరు మన నిరుపమ.
*****
ఆ హాలు అంతా కరతాళధ్వనులతో మారుమ్రోగిపోతోంది. అక్కడ ఫ్యూచర్ సోలుషన్స్ వారి వార్షిక సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో కంపెనీ గత సంవత్సరంలో జరిగిన వ్యాపార వృద్ధిలో సమీక్షించుకుని దానికి కారణభూతులైన ఉద్యోగులని యాజమాన్యం సత్కరిస్తోంది.
“తదుపరి అవార్డు కేటగిరీ కస్టమర్ రిలేషన్స్…ఈ అవార్డుని అందుకోవడానికి శ్రీమతి నిరుపమగారిని సగౌరవంగా వేదిక మీదకు అహ్వానిస్తున్నాము” అన్న ప్రయోక్త పిలుపు విని నిరుపమ ఉత్సాహంగా వేదిక మీదకు వచ్చింది. కంపెనీ ప్రెసిడెంట్ అయిన శ్రీ అరవింద్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ వుండగా ఆ ప్రయోక్త “నిరుపమగారు ఒక గృహిణిగా ఉంటూ, కుటుంబ సభ్యుల మన్ననలు పొందుతూ, అలాగే తన సహోద్యోగులను కూడా కుటుంబసభ్యుల వలె ఆదరిస్తూ, అందరినీ కలుపుకుంటూ తనవి రెండు చేతులా లేక అమ్మవారిలా పలుచేతులా అన్నట్టుగా ఇచ్చిన పనులు సమర్ధవంతంగా ముగిస్తూ కంపెనీని లాభాల బాట పరుగెత్తించి అందరి మన్ననలు పొందారు. వారి కృషిని గుర్తించి కంపెనీ యాజమాన్యం వారికి ఈ చిరు సత్కారం అందిస్తోంది” అని నిరుపమ గురించి పరిచత వాక్యాలు చెప్పింది.
వేదిక మీద ప్రెసిడెంట్ అరవింద్ గారు పురస్కారం అందచేస్తూ “నిరుపమ గారి ప్రజ్ఞను అభినందిస్తూ ఆమెను మా మార్కెటింగ్ శాఖకు జనరల్ మేనేజర్ గా పదోన్నతి కల్పిస్తున్నాము. ఆమె ఈ బాధ్యతను సమర్ద్గవంతంగా నిర్వర్తించి కంపెనీని మరింత లాభాల బాటలో నడిపిస్తారని ఆశిస్తున్నాను “అనగానే సభలో కరతాళధ్వనులు ఆగకుండా మారుమ్రోగిపోయాయి.
తనకు ఇచ్చిన ఆ బాధ్యతలు స్వీకరించటానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి, తనను పొగడుతున్నవారందరికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి చేరేసరికి రాత్రి పదకొండు ఐయ్యింది.
కుటుంబ సభ్యుల పలకరింపులు అభినందనలు అందుకొని ఈజీ చైర్ లో నిస్త్రాణగా వెనక్కి వాలింది నిరుపమ.
*****
అది ఒక ఉమ్మడి కుటుంబం. నాయనమ్మ ఆద్వర్యంలో అన్నీ పనులు చక్క పెడుతూ ఇంటిల్లిపాదికి సమయానుకూలంగా అన్నీ అమర్చే అమ్మ. మేము ముగ్గురం. నేను, నా తరువాత చెల్లి, తమ్ముడు. ఇది కాక ఇంటికి వచ్చే పోయే బంధుజనం. ఇల్లు ఎపుడు కళకళలాడుతూ వుండేది. దానితో అటు పెద్ద, ఇటు చిన్నా కాని మా వయసు. నేను పదవ తరగతి ఐయ్యి, ఇంకా చెల్లి, తమ్ముడు చిన్న తరగతులలో వున్నారు.
“నలుగురు తిరిగే ఇల్లు. ఇంట్లో ఆడపిల్ల వున్నది అంటే అదో ఆనందం. తల్లికి సాయంగా ఉంటూ ఇంటి పనులలో సాయం అందిస్తూ వుంటే అన్నిపనులు చక చకా ఐపొతాయి. ఈ నీరు ఎప్పుడు అందుకుంటుందో ఏమో” అంటూ సాగే అమ్మ నిత్య సుప్రభాతం వింటూ నాకు తెల్లారింది.
ముగ్గురు పిల్లలమైన కుటుంబంలో పెద్దదానిగా పుట్టడం తప్పా అని నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని. ఏదో నేను ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్లు ఇంకా స్కూల్లో చదువుతున్నారు. మధ్య తరగతి కుటుంబ వ్యవస్థలో అమ్మాయి కాలేజీకి వచ్చింది అంటే ఏముంది అమ్మాయి అన్నీ పనులు నేర్చుకుని అమ్మకి చేదోడువాదోడుగా ఉంటూ అన్ని చక్క పెట్టాలి అని ఒక అభిప్రాయం.
మా అమ్మ మాటలకు వత్తాసు పలుకుతూ మా నాయనమ్మ ఒకటి ఒకటిగా తన అభిప్రాయాలు చెబుతూ మా కాలంలొ ఇలా చేసాము అలా చేసాము అంటూ ఫ్లాష్ బ్యాక్ రీల్ తిప్పుతూ వుంటుంది.
“ఇదిగో అమ్మాయి..అలా ఖాళీగా అటూ ఇటూ తిరిగే బదులు ఆ చేత్తొ బట్టలు మడత పెట్టవచ్చు కదా..ఒక సలహా” నాయనమ్మ ఉవాచ.
“నీరూ…అలా టీవీ చూస్తూ నోరు వెల్లబెట్టుకుని చూసే బదులు …ఆ చేత్తో కూరలు తరుగు..నాకు కొంచెం పని తగ్గుతుంది…” అమ్మ విసురులు.
“నీరూ…నువ్వు చదువుతూ ఆ చేత్తో తమ్ముడుని, చెల్లెలిని కూడ చదివించు…నీకు కూడ సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది” నాన్నగారి ఉవాచ.
ఇలా ఇంట్లో వాళ్ళ ఉచిత సలహాలు తీసుకుంటూ ఎప్పటికీ దేవుడా నాకు విముక్తి అని తలచుకుని బాధపడిన రోజులెన్నో. “ఇంకా ఇద్దరు ఉన్నారుగా వాళ్ళకి ఎందుకు పనులు చెప్పావు “అని నేను అమ్మకి చెబితే “వాళ్ళు ఇద్దరు ఇంకా చిన్నపిల్లలు. వాళ్ళతో నీకు వంతులు ఏంటి” అని అమ్మ అన్నీ పనులు నాకే చెప్పేది.
“ప్రతి సమస్యకి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. సామరస్యంగా మన సమస్యలు మనమే అధిగమించ వచ్చు” అని గాఢనిద్రలో నాకు ఒక ఆలోచన గురూపదేశంలాగా వినిపించింది.
“సాహసం సేయరా డింభకా..రాజకుమారి లభించును” అన్న ఎస్వీరంగారావు గారి స్పూర్తితో నేను చెల్లెల్ని తమ్ముడుని మచ్చిక చేసుకుంటూ పనులు నెర్పించి నా శ్రమ తగ్గించుకున్నాను.
డిగ్రీ అయిన తరువాత ఫైనాన్స్ల లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఒక ఫైనాన్సియల్ సలహాదారుగా ఉద్యోగంలో జాయిన్ ఐయ్యాను.
“అమ్మాయి వనజా.. నీరూ ఎలాగో ఉద్యోగంలో చేరింది కదా…ఆ చేత్తో పెళ్ళి కూడా చెయ్యండి..ఏదో ఇలా ఉన్నప్పుడు చేస్తే మేము కూడా ఇంకో తరం చూస్తాము..అదో ఆనందం” మా నాయనమ్మ తాతయ్యల సలహా. అలాగే బంధు రాబంధు గణాల ఉచిత సలహాలు, పెళ్ళి సంబంధాల పైరవీలు. ఎవరిని ఏమన్నా అందరికి అలకలు, సూటి పోటీ మాటలు.
పీయర్ ప్రెషర్ అని చదువుతూ వుంటే ఏమో అనుకున్నాను. ఇదే అన్నమాట అని నిరుపమ అనుకునే లోపు కళ్యాణ్ తో పెళ్ళి జరిగిపోయింది.
“పెద్ద కుటుంబంలోకి వెళుతోంది మా నీరూ..అంతా దాని అదృష్టం” అని అమ్మ మురిసిపోతూ అత్తవారింటికి సాగనంపింది.
నా అదృష్టం ఏమిటంటే అక్కడ కూడా నేనే పెద్ద కోడలు. “మా కోడలు బంగారం. అన్నీ పనులు చకచకా చేసెస్తుంది” అని మా అత్తగారు నా మెడలో రెండు వీర తాళ్ళు వేసి పక్కకు తప్పుకుని హాయిగా రిలాక్స్ ఐయ్యింది. నాకున్న ముద్దుల ఆడపడుచు వారి అందరి కుటుంబ సభ్యుల బాధ్యతలు నా మీద పడ్డాయి. స్థానం మారింది కానీ నా బాధ్యతలు మారలేదు. ఇంకా పెరిగాయి.
“అమ్మాయి నీరూ…అలా వస్తున్నపుడు ఆ చేత్తో కాసిని మంచినీళ్ళు పట్టుకుని రా” మామగారి అభ్యర్ధన లాంటి హుకుం.
“మా వదిన బంగారం. కొంచెం ఈ ఫాల్ కుట్టి పెట్టవా “ అని ఆడపడుచు సుతిమెత్తని పెత్తనం. అందరు నాకు చెప్పేవాళ్ళు.
“చరిత్ర పునరావృతము అవుతోంది. ఆ చేత్తో అన్న పదం సినిమాలో వినిపించె బ్యాక్ గ్రౌండ్ పాటలాగ నను విడవడం లేదు” అని మనసులో అనుకుంటూ నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను.
*****
“మనం ఒక కొత్త ప్రోడక్ట్ మీద వర్క్ చేయపొతున్నాము. ఇది మన కంపెనీకి చాలా ముఖ్యమైన ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు విజయం సాధిస్తే మన కంపెనీ మరింత పురోగతి సాధిస్తుంది. ఈ ప్రాజెక్టులో పని చేయడానికి చొరవ, నైపుణ్యం కావాలి. ఈ ప్రాజెక్టు లీడర్ గా నిరుపమని నియమిస్తున్నాను. నిరుపమగారు తన ప్రస్తుత ప్రాజెక్టులు చూసుకుంటూ అదే చేత్తో ఈ ప్రాజెక్టు కూడ చూడాలని కోరుకుంటున్నాను. ఇ నో షీ కన్ డూ ఇట్ “ అని నిరుపమని మునగ చెట్టు యెక్కించి యుక్తిగా తప్పుకున్నాడు వైస్ ప్రెసిడెంట్. పదిమంది వున్న టీమ్ లో అందరినీ కలుపుకుని మన పని మనం చేసుకోవడం వ్యక్తిగతంగా వీలుగా వున్నా, ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చేసరికి నా పేరే కనపడేది.
“నిను వీడని నీడను నేనే” అన్న పాట లాగా “ఆ చేత్తో “అన్న మాట నన్ను వదలకుండా వస్తోంది అని అనుకుంటూ నిరుపమ కళ్ళు తెరిచింది.
*****
“ అమ్మా…నా బుక్స్ ఎక్కడ పెట్టావు”కూతురి మెల్కొలుపు.
“నీరూ…నా ఆఫీసు ఫైల్స్ నువ్వు చూసావా “ పతిదేవుని పలకరింపు.
“అమ్మా..నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు విషయంలో నీ సహాయం కావాలి” ముద్దుల కొడుకు కోరిక.
“అమ్మాయ్..ఈ రోజు నేతి ఉప్మా చేసి, అదే చేత్తో మంచి చట్నీ చెయ్యి” అత్త మామగార్ల ఆర్డర్.
“మేడమ్…మీరు ఆఫీసుకి త్వరగా వస్తే కొన్ని కొటేషన్స్ ఫైనల్ చెయ్యాలి” ఆఫీసు నుండి ఫోన్.
ఈ గజిబిజి నిరంతర రణగొణ ధ్వనులలో తనను తాను సంభాళించుకుంటూ వీలైనంత టిఫిన్ బాక్స్ లో సర్దుకుని అదే చేత్తో అందరికీ సమాధానం ఇస్తూ ఆఫీసుకి బయలుదేరింది నిరుపమ.
*****
ఇంటి బాధ్యతలను ఆఫీసు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, అదే చేత్తో తమను తాము సమర్ధించుకునే నిరుపమ లాంటి నారీమణులందరికి ఈ కథ అంకితం.

1 thought on “ఆ చేత్తో..

  1. A woman can only balance the situations very firmly
    Story of many ,now undergoing this
    Thanks for recognizing,
    Marvellous

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *