February 22, 2024

కంభంపాటి కథలు – భూలోక రహస్యం

రచన: కంభంపాటి రవీంద్ర

బాప్టిస్టు చర్చికి ఎడమ పక్కకి తిరిగితే వచ్చే వీధిలోని మూడో ఇల్లు అచ్యుతమణి గారిది. ఆ ఇంట్లోని నాలుగు వాటాలూ అద్దెకిచ్చేయగా, ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఓ మూలనున్న ఎర్ర మందార చెట్టు పక్కనున్న చెక్కల బడ్డీ భూలోకంగాడిది.
అచ్యుతమణిగారి ఇంట్లోని ఓ వాటాకి, ఈ చెక్కల బడ్డీకి కలిపి నెలకి యాభై రూపాయలు అద్దిస్తూ, ఐదేళ్ల నుంచీ అక్కడే గడిపేస్తున్నారా భూలోకంగాడి కుటుంబం. అప్పట్లో ఆ వీధికే కాదు, ఆ పేట మొత్తానికీ భూలోకంగాడి దొక్కటే మంగలి కొట్టు!. ఓ కర్ర కుర్చీ, ఆ కుర్చీ వెనక ఓ పెద్ద అద్దం, రెండు మూడు పాత దువ్వెనలూ, కొబ్బరి నూనె సీసా, మూడు కత్తెర్లూ, రెండు కత్తులూ, ఓ గిన్నెడు నీళ్ళూ, భూలోకంగాడి కష్టం. ఇవే పెట్టుబడి, అంతే !
ఆ భూలోకంగాడు తన పనులన్నీ కానిచ్చి ఉదయం ఏడింటికి కొట్టు తెరిచి పదకొండు గంటలకల్లా మూసేస్తాడు. వెనకే ఉన్న ఇంటికెళ్ళి, భోంచేసి నిద్దరోయి మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకి తెరిచి, రాత్రి ఏడింటికల్లా కొట్టు కట్టేస్తాడు.
కొట్టు తెరిచిన ఆరేడు గంటలూ భలే సందడిగా ఉంటుంది ఆ ప్రాంతమంతా. నడిచెళ్లేవాళ్ళూ, సైకిళ్ళమీదెళ్ళేవాళ్ళే కాకుండా వెస్పా స్కూటర్ మీద తిరిగే డిప్యూటీ తాసీల్దార్ దిబ్బల్రావు గారు, మోపెడ్ మీదెళ్ళే కృష్ణమూర్తి మాస్టారి దాకా అందరూ. ఆ భూలోకంగాడి కొట్టు ముందరోసారి ఆగి అద్దంలో చూసుకుని, క్రాఫు చూసుకుని, మీసాలు తిప్పుకుంటూ పోయేవారు !
ఆ ఏడాది సంక్రాంతి పండక్కొచ్చిన అచ్యుతమణి గారి అల్లుడు చిట్టిబాబు, ఉన్న పదిరోజులూ భూలోకంగాడి కొట్టుని చూస్తూనే ఉన్నాడు. తిరిగి ఊరెళ్ళిపోయే ముందు రోజు రాత్రి తన పెళ్ళాం వీరలక్ష్మితో అచ్యుతమణిగారికి చెప్పించేడు, ‘‘మా ఆయన ఈ ఊళ్ళో అదేదో సెలూనంట. అదెడతానంటున్నారు. ఓ పదివేలు కావాలంట ‘‘
‘‘అదేంటే. కాలవ పక్కన అరెకరం భూమి కొనిస్తానన్నాను కదా. మళ్ళీ ఇదేంటీ ?. నాకు తెలవకడుగుతాను. సెలూనంటే ఏంటే పాపా ?’‘ ఆశ్చర్యంగా అడిగింది అచ్యుతమణిగారు
‘‘ఏమోనే అమ్మా. సెలూనంటే మన భూలోకంగాడి కొట్టు మాదిరేనంట ‘‘ అంది వీరలక్ష్మి
‘‘హోస్. ఆ మాత్రం దానికి పదేలెందుకూ ? భూలోకంగాడిని ఇల్లు ఖాళీ చేయించేత్తే సరిపోద్ది కదా. అయినా. అల్లుడుగారికి ఈ మంగలేషం ఎయ్యాలనే ఎదవ బుద్దేమిటే ?’‘ అంటూ బుగ్గలు నొక్కుకుంది అచ్యుతమణి !
అంతవరకూ ఆ గది బయటే నిలబడి ఈళ్ళ మాటలు వింటున్న చిట్టిబాబు చప్పున లోనికొచ్చి ‘‘నేనేం మంగలేషం వెయ్యడం లేదు. యాపారం పెడదావంటున్నాను. ఈ భూలోకంగాడు చేసే కటింగ్ పనికి మా రాజమండ్రిలో కనీసం నాలుగు రూపాయలు తీసుకుంటారు. ఓ గెడ్డం గీకితే చాలు. రెండు రూపాయలిస్తారు. ఇక్కడ ఆ రెంటికీ కలిపి ముప్పావలా తీసుకుంటున్నాడు భూలోకం. పైగా ఈ మద్దెన స్టెప్ కటింగ్ అనొకటొచ్చింది. అమితాబ్బచ్చనూ, మన సూపర్ స్టార్ కృష్ణల టైపు కటింగన్నమాట. కుర్రాళ్ళు తెగ చేయించుకుంటున్నారు. అది కూడా పెట్టేమంటే. ఐదు రూపాయలు లాగెయ్యొచ్చు. మన వీధి ముందున్న చర్చి సెంటర్లో ఓ షాపు అద్దెకి తీసుకుని, అద్దాలు, కుర్చీలతో కాస్త హడావిడి చేసి, రాజమండ్రి నుంచి ఇద్దరు కుర్రాళ్ళని పెట్టుకున్నామంటే, మన పని రోజూ డబ్బులెక్కెట్టుకోవడమే ‘‘ అంటూ తన ప్లాను చెప్పుకొచ్చేడు !
అంతా విన్న అచ్యుతమణి గారు, ‘‘నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది గానీ. ఈ ఊరోళ్లు అంతేసి డబ్బులిచ్చి జుట్టు కత్తిరించుకుంటారా బాబూ ?’‘ అంది
‘‘మీరు భలేవోరండీ… ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటీ ? ఎడ్ల బళ్ళున్నాయి కదా అని బస్సులొద్దనుకున్నారా జనం ? మనం ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసేవంటే పరిగెత్తుకొచ్చేస్తారు ఎర్రి జనాలు ‘‘ అన్నాడు చిట్టిబాబు
‘‘అర్ధ రూపాయి తో పోయేదానికి. నాలుగు రూపాయలెడతారా ? మా ఊరి జనాలు మరీ అంత ఎర్రోళ్ళంటావా ?’‘ సాలోచనగా అడిగింది అచ్యుతమణి
‘‘మీ ఊరనేకాదండి. ఏ ఊరైనా. జనం ఇంతేనండి. ఆళ్ళ ఎర్రితనం గురించి ఇంకోసారి మాటాడుకుందాం గానీ. మీరు పెట్టుబడి పెడతారో లేదో చెప్పలేదు ‘‘ అంటూ చిరాగ్గా అడిగేడు చిట్టిబాబు
‘‘సరే. అలాక్కానీ. నీ సరదా ఎందుక్కాదనాలి ?’‘ అంది అచ్యుతమణిగారు !
ఆ ఉగాదికి మొదలైంది శ్రీ వీరలక్ష్మి హెయిర్ స్టయిల్స్. ఆ ఏరియా వార్డు మెంబరు అమ్మాజీగారు కొబ్బరికాయ కొడితే, ఆ అమ్మాజీ భర్త గారైన దేవసహాయం రిబ్బను కత్తిరించేడు. షాపుకి అటూ ఇటూ అమితాబ్బచ్చనూ, కృష్ణ బొమ్మలు గీయించి పెట్టేరు. బోర్డు కింద చిన్న అక్షరాల్లో ‘‘ఇక్కడ సరసమైన ధరకు స్టెప్ కటింగు చేయబడును ‘‘ అని కూడా రాయించి, పక్కనే హెయిర్ డ్రయర్ బొమ్మ కూడా గీయించేరు. షాపులో పని చేయడానికి రాజమండ్రి నుంచి నెల జీతం మీద ఇద్దరు కుర్రాళ్ళు వచ్చేరు.
రెండు నెలలైంది. ఎప్పుడో ఒకడూ అరా తప్ప ఆ వీరలక్ష్మి హెయిర్ స్టయిల్స్ లోపలికి ఎవడూ వెళ్ళడం లేదు, అప్పటికీ షాపు ముందు చిట్టిబాబు ‘‘కటింగ్ చేయించుకున్నవారికి షేవింగ్ ఉచితం. సీలింగ్ ఫ్యాన్ సౌకర్యం కలదు ‘‘ అని కూడా బోర్డెట్టించేడు. అటువైపు వెళ్ళే జనాలు ఎప్పుడేనా షాపులోకోసారి తొంగి చూసెళ్ళిపోతున్నారు తప్ప లోపలికెవ్వడూ వెళ్ళడం లేదు.
చిట్టిబాబుకి ఏమీ అర్ధం కావడం లేదు. అసలు తన షాపుకేం తక్కువ ? ఆ భూలోకం గాడి చెక్కల కొట్టు కన్నా కోటి రెట్లు నయం. అయినా కూడా జనం రావడంలేదేంటీ అనుకున్నాడు. ఆ వారం రాజమండ్రెళ్ళినప్పుడు జనాలు పిచ్చెక్కినట్టు చిరంజీవి వేసిన ఖైదీ సినిమా చూడ్డం గమనించేడు. వెంటనే ఊరొచ్చి తన షాపు ముందు అమితాబ్బచ్చను బొమ్మ చెరిపించేసి, చిరంజీవి బొమ్మ గీయించేడు. అయినా కూడా ఊళ్ళో కుర్రాళ్లు ఆ డిప్ప కటింగ్ చేసే భూలోకం గాడి దగ్గిరకే తప్ప తన షాపేపు రావడం లేదు.
అచ్యుతమణి గారు చెప్పేరు ‘‘బాబూ. ఇంత చేసినా జనాలు మన షాపుకి రాకుండా ఆ భూలోకం దగ్గిరకే వెళ్తున్నారంటే. మన దగ్గిర లేనిదేదో ఆడిదగ్గర ఉండుండాల. ఓసారి.ఆడి షాపుకి వెళ్ళి చూసి రావచ్చు కదా ?’‘
‘‘భలేవారే. మనం ఇంత షాపెట్టుకుని ఆడి దగ్గిరికి వెళ్తే. మరీ ఎదవలమైపోతాము. కానీ మీరన్నదీ నిజమే. ఉండండి చెబుతాను ‘‘ అని రాజమండ్రిలోనున్న తన ఫ్రెండు కాపారపు బాబ్జీగాడికి కబురంపేడు చిట్టిబాబు.
ఆ తర్వాతి రోజు సాయంత్రానికి ఊళ్ళో దిగిన బాబ్జీగాడికి విషయం చెప్పేసరికి ‘‘ఓసోస్. ఈ మాత్రం దానికేనా అంతలా కంగారడిపోయేవు. ఇట్టే తేల్చేస్తానుండు‘‘ అనేసిన బాబ్జీగాడు ఆ మర్నాడు ఉదయం భూలోకంగాడి కొట్టుకెళ్ళి జుట్టు కత్తిరించడమే కాకుండా, గెడ్డం కూడా చెయ్యమన్నాడు.
భూలోకంగాడు పని చేస్తున్నంత సేపూ ఆ కొట్టంతా చూస్తున్న బాబ్జీగాడికి అర్ధం కాలేదు. అసలేముందని ప్రతి ఒక్కడూ ఈ కొట్లోకి దూరుతున్నాడు ? ఎంత ఆలోచిస్తున్నా అర్ధం కావడం లేదు.
తనకి గెడ్డం చేసిన తర్వాత మొహం మీద మురిగ్గానున్న తువ్వాలుతో భూలోకం తుడుస్తూంటే, షాపులోకి వచ్చిన కానిస్టేబుల్ అప్పల్రాజు అద్దంలోకి చూసుకుంటూ మొహం చాటంత చేసుకుని క్రాఫు సర్దుకుంటున్నాడు.
ఈ ఫేసుకి అద్దంలో చూసుకుని మురుసిపోయేంత ఏముందా అని ఆలోచిస్తున్న బాబ్జీగాడికి విషయం అర్ధమైంది.
గబుక్కున భూలోకం చేతిలో ఓ రూపాయి బిళ్ళడేసి బయటకి పరిగెత్తేడు, వెనక నుంచి భూలోకంగాడు ‘‘చిల్లర తీసుకోండి బాబూ ‘‘ అని అరుస్తున్నా పట్టించుకోకుండా !
వీరలక్ష్మి హెయిర్ స్టయిల్స్ షాపుకెళ్ళిన బాబ్జీగాడు, కౌంటర్లో కూచుని ఈగలు తోలుకుంటున్న చిట్టిబాబుకి చెప్పేడు ‘‘నువ్వర్జంటుగా. ఈ కుర్చీల ముందు పెద్ద అద్దం పెట్టించు. అంటే అద్దంలో చూసుకుంటూంటే కనిపించేలా… రెండు మూడు జయమాలిని ఫోటోలు పెట్టించు. !’‘

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *