May 25, 2024

చంద్రోదయం 30

రచన: మన్నెం శారద

స్వాతి బద్ధకంగా పడుకొంది.
సారథి ఆమె నుదుటమీద చెయ్యేసి “జ్వరం లేదే!” అన్నాడు.
“నాకేమిటోగా వుందండి” అంది అతనికి దగ్గరగా జరిగి పడుకొంటూ.
“పడుకొంటే అలాగే వుంటుంది. లే. లేచి కాఫీ త్రాగు. అదే పోతుంది.”
“అబ్బా! నన్ను కాస్సేపు పడుకోనివ్వండి. నాకిప్పుడే లేవాలని లేదు” అంది గారంగా.
“సరే! కాఫీ నేనే తెస్తానుండు”సారథి కాఫీ స్వయంగా కలుపుకొచ్చేడు.
ఆమె అయిష్టంగా త్రాగి వెంటనే వాంతి చేస్కుంది.
“అదేమిటి? లోపల జ్వరమేమో. రెడీ అవ్వు, డాక్టరు దగ్గరకు వెళదాం” అంటూ గాభరా పెట్టేసేడు సారథి.
“మరేం ఫర్వాలేదు. మీకు బ్యాంక్ టైమవుతోంది. మరీ బాగుండకపోతే సాయంత్రం వెళ్లొచ్చు”అందామె నీరసంగా నవ్వుతూ.
ఆమె మాటలకి సారథికి కోపం వచ్చేసింది. “నేనెప్పుడు పోతానా అని చూస్తావ్. నీకు బాగోలేదుగా, సెలవు పెట్టి సేవ చేద్దామని!” అన్నాడు బుంగమూతి పెట్టి.
“ఎప్పుడూ సెలవు పెట్టాలనే ధ్యాస. నా కోసం సెలవు పెట్టింది చాలు. ఇంక జాగ్రత్తగా ఉద్యోగం చెయ్యండి. నన్నెలాగూ ఉద్యోగం మానిపించేసారు. ఈ ఇంటికి తమరే ఆధారం” అంది నవ్వుతూ.
అతను విసుక్కుంటూనే తయారయి బయలుదేరేడు.
ఆమె బాల్కనీలోకొచ్చి “టాటా” చెప్పింది.
సారథి వెనక్కి తిరిగి చెయ్యి వూపి నవ్వుతూ వెళ్ళేడు.
జానకమ్మ అరుగు మీద కూర్చుని ఆ యిద్దర్నే మార్చి మార్చి చూస్తోంది.
స్వాతి అప్రయత్నంగా అటువైపు చూసింది.
“పనయ్యిందా?” జానకమ్మ పలకరింపు.
అయిందన్నట్లు తలూపింది స్వాతి.
అంతే, జానకమ్మ పైకొచ్చేసింది.
స్వాతికి ఏం తోచలేదు సారథి వెళ్ళిపోతే. నానీ కాన్వెంటు చాలా దూరం. రిక్షాలో వెళతాడు. సాయంత్రానికి కాని రాడు.
స్వాతి జానకమ్మని కూర్చోమని చెప్పి కాఫీ ఇచ్చింది. కాఫీ కప్పు ఆత్రంగా అందుకొని “నువ్వు తెచ్చుకోలేదేం?” అంది ఆప్యాయత గుమ్మరిస్తూ.
“నాకు సహించడం లేదండి పిన్నిగారూ. ప్రొద్దుట ఆయన బలవంతంగా యిస్తే వాంతి కూడా అయింది.”
జాంకమ్మ కళ్లు పెద్దవి చేసి చూసింది. ఆ వెంటనే “వేవిళ్లా?” అంది ఆరాగా.
స్వాతికి ఒళ్ళు ఝల్లుమంది. ఆ వెంతనే ఆలోచనలో పడింది. నిజమే. తనకెప్పుడూ వాంతులు కానే కావు. సరిగ్గా నానీ కడుపులో పడ్డప్పుడు సరిగ్గా యిలాగే వికారం మొదలయింది. అంటే మళ్ళీ ఇప్పుడు తను తల్లి కాబోతుందన్నమాట. సారథి వింటే ఎగిరి గంతేస్తాడు.
“ఏమిటి ఆలోచిస్తున్నావు? నే చెప్పింది నిజమే కదూ” అంది జానకమ్మ ఆలోచనలో పడ్డ స్వాతిని దీక్షగా చూస్తూ.
“నిజమేనండి. నాకూ అనుమానంగానే వుంది” అంది స్వాతి సిగ్గుపడుతూ.
“నీ తెలివితేటలు నా మొహంలా వున్నాయి. ఇదేవన్నా మొదటిసారా తెలియకపోవటానికి బావుంది వరస” అంది మూతి తిప్పుతూ జానకమ్మ.
స్వాతి ఆ మాటలకి సిగ్గుపడి తల దించుకొంది.
అంతసేపు ఆమెలో చోటు చేసుకొన్న ఆనందం రెక్కలు విప్పుకొని ఎగిరిపోయింది.
“చూస్తుంటే నీ వరస కనాలనే వున్నట్లుంది” అంది జానకమ్మ ఈసడింపుగా.
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
“అంటే?” అంది అమాయకంగా.
జానకమ్మ బుగ్గలు నొక్కుకుని గుమ్మంవైపు చూస్తూ “అబ్బాయి ఇప్పుడు రాడుగా?” అంది అనుమానంగా.
“రారు”
“నీ అమాయకత్వం కూల. ఇతగాడే శాశ్వతం అనుకుంటున్నావేమో. మోజు తీరేవరకు మగాళ్ళు అందలాలెక్కిస్తారు. ఆ తర్వాత పాతాళంలోకి గిరాటేస్తారు. అతనికి నువ్వూ, నీకు అతనూ అవసరం. అంతవరకే. పిచ్చిదానిలా పూర్తిగా నమ్మితే నీకూ, నీ కొడుక్కి చిప్ప యిచ్చి పంపుతాడు” అంది జాంకమ్మ చేతులు తిప్పుతూ.
“మీరు చెప్పేది నాకర్ధం కావటంలేదు పిన్నిగారూ!” అంది స్వాతి ఆందొళనగా.
“హవ్వ! ఇంకా విడదీసి చెప్పాలా? నీలాంటి తెలివితక్కువదానికి చెప్పకపోతే నిలువునా గోతిలోకి దిగుతుంది. నానీ అంటే నీకు ప్రేమేనా?” అంది జానకమ్మ సూటిగా.
“అదేం ప్రశ్న పిన్నిగారూ. వాడంటే ప్రాణం అని మీకు తెలియదూ?” అంది స్వాతి.
“అందుకే మరి చెబుతూంట. వాడికేమన్నా అయితే, వాడు అనాధలా బ్రతికితే నీ ప్రాణం ఒప్పుతుందా?”
స్వాతి కళ్లు ఆందోళనతో రెపరెపలాడేయి.
“చూసేవా. చిన్నమాటకే నీ తల్లి హృదయం యెలా తల్లడిల్లిపోతుందో? ఆడజన్మ ఎత్తేను. నాకు తెలుసే తల్లీ. కడుపుకోత” అని నిట్టూర్చింది జానకమ్మ.
జానకమ్మ చెప్పబోతున్నదేంటో స్వాతికి యెంత మాత్రమూ అర్ధం కాలేదు.
జానకమ్మ అకస్మాత్తుగా గొంతు తగ్గించేసింది. “నువ్వు పిల్లల్ని కనటం అతనికి బాగానే వుంటుంది. ఆ తర్వాత నానీ ముఖం చూస్తాడనుకున్నావా?. ఎంతయినా కన్న సంతానం మీద వున్న మమకారం సవతిపిల్లల మీద వుంటుందనుకున్నావా? అందులో మగవాళ్ళు కనపడరు! వాళ్లకున్నంత యీర్ష్య మరెవ్వరికీ వుండదు. నీ కళ్ళెదుట నానీకి ఒక భోగం, రేపు పుట్టేవాడికి మరో భోగం జరిగితే నువ్వు సహించగలవా?వాడు కుక్కలా ఓ పక్కకి ఒదిగుంటే నీ తల్లి ప్రాణం గిలగిలలాడదూ? ఇందులో ఎవర్ని కాదనగలవు. ఎవర్ని వదులుకోగలవు? నోరు మూసుకుని చూస్తూ వుండాల్సిందే. ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధా నీటిమీది రాతల్లా తేలిపోతాయి.ఆలోచించుకో. నేనెంతమందిని చూడలేదు, ఎన్ని వినలేదు?” అంది.
స్వాతి హృదయం తల్లడిల్లిపోయింది.
ఆమె కళ్లలో నానీ దిక్కులేనట్లు, దీనంగా నిలబడినట్లు కన్పించి ఆమె హృదయం బాధతో గిలగిలలాడింది.
అదే అదను చూసి ఆమె హృదయంపై గట్టి దెబ్బ కొట్టింది జానకమ్మ. “గుట్టుచప్పుడు కాకుండా తీయించేసుకో! లేకుంటే నే చెప్పిన గతే పడుతుంది” అంది ఠక్కున.
స్వాతి బెదిరిపోయినట్లు చూసి “ఆయనకి తెలిస్తే” అంది.
“నీ పిచ్చి కూలినట్టే వుంది. ప్రతీదీ మగమహారాజులకి చెప్పే చేస్తున్నారా దేశంలో ఆడవాళ్లంతా. చూస్తే మూడోనెల వచ్చినట్లు లేదు. చాలా తేలిక. నువ్వు ‘వూ’అంటే నాకు తెలిసిన డాక్టరమ్మ వుంది. ఆవిడకిదే పని. ఏ సంగతి రేపు చెప్పు” జానకమ్మ వెళ్లడానికి లేచింది.
స్వాతి జానకమ్మ వెళ్లినవేపే చూస్తూ అయోమయంగా కూచుంది.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *