June 19, 2024

తాత్పర్యం – దృష్టి

రచన: రామా చంద్రమౌళి

డాక్టర్ నరేందర్ ఎం బి బి ఎస్. ఎప్పట్నుండో కిటికీలోనుంచి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
ఎదురుగా అప్పుడే సూర్యోదయమౌతోంది. ఎర్రగా. కాంతివంతంగా.
సూర్యుడుదయిస్తున్నపుడు అందరూ వెలువడే కాంతిని గమనిస్తారు. చూస్తారుగాని వెంట అవిభాజ్యంగా వెలుగుకిరణాలతోపాటు కలిసి వచ్చే ఉష్ణం గురించి ఎవరూ ఆలోచించరు.
ఎందుకో అతనికి కాళోజీ కవితా చరణాలు గుర్తొచ్చాయి చటుక్కున.
“సూర్యుడుదయించనే ఉదయించడనుకోవడం నిరాశ
ఉదయించిన సూర్యుడస్తమించడనుకోవడం దురాశ”
తన జీవితంలో సూర్యుడుదయించాడా.
సూర్యోదయాన్ని తను గుర్తించకముందే అస్తమించాడా.
వ్చ్. ,
తన చేతిలోని ఆ వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని మళ్ళీ చూశాడు పేజీలను తిరిగేసి. వేన్ డయ్యర్ బుక్”చేంజ్ యువర్ థాట్స్” అది.
‘అవకాశాలు రెండు విధాలు.
ఒకటి. వాటంతటవే యాదృచ్ఛికంగా వచ్చి మన ముందు నిలబడేవి.
రెండు. మనంతట మనమే సృష్టించుకునేవి. మనమే వెంటపడి రూపొందించుకుని చేజిక్కించుకునే అవకాశాలు మనకు జీవితంలో మాటలకందని తృప్తినీ, ఆత్మానందాన్నీ కలుగజేస్తాయి.
ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే. ప్రపంచంలో నూటికి తొంభై శాతం మంది తనకు నచ్చిన, తను కోరుకున్న ఉద్యోగాల్లో, వృత్తుల్లో కాకుండా ఒక అవకాశంగా దొరికిన వాటిలోనే సర్దుకుని అలా బతుకుతున్నారంతే. ఒట్టి యాంత్రిక. తప్పనిసరి జీవితాల్లో పడి కొట్టుకుపోతూ.
ఇక్కడ ఒక బహిరంగ రహస్యం ఉంది. అదేమిటంటే సృష్టిలో వెలుతురు ప్రక్కనే చీకటి. లోయ ప్రక్కనే శిఖరం ఉన్నట్టు నిరాశాపూరితమైన ఏ అవకాశాలూ లేని శూన్యత ప్రక్కనే నీకు అవసరమైన అపూర్వావకాశం చేయిచాపితే అందే దూరంలోనే ఉంటుంది. గుర్తించాలి. జాగ్రత్తగా వెదకాలి. వెదకాలి అంతే. ‘
ఔను. వెదకాలి. కళ్ళు నులుముకుని చూస్తూ వెదకాలి.
డాక్టర్ నరేందర్ అప్పటినుండి ఎర్రగా కనబడ్డ సూర్యున్ని మళ్ళీ చూశాడు. ఇప్పుడు కొత్త సూర్యుడు. మెరుస్తూ.
ప్రక్కింటిలోనుంచి మళ్ళీ ఆ వృద్ధుని మృత్యుక్షోభను తెలియజెప్పే వేదనాభరితమైన కేక వినబడింది. పాపం. నొప్పితో సుళ్ళుతిరిగిపోతూ చేస్తున్న ఆక్రందన అది. చాలా విదారకంగా ఉంది. రాత్రినుండి ఒకటే అరుపు. దాదాపు గత నెలరోజులనుండీ అదే యాతన. పొరుగువాడు ఒక ఇంజనీరింగ్ షాప్ వాడు. పంపులు, మోటార్లు, పైపులు, స్పేర్ పార్ట్స్ అమ్మే వ్యాపారం. రాజేందర్. రాజేందర్ ఉదయం పదింటికి దుకాణానికి వెళ్తే మళ్ళీ రాత్రి ఏ తొమ్మిదో పదో. ఇద్దరు కొడుకులు. షాప్ లోనే. ఒక్క కూతురు. పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో భార్య, ముసలి తల్లీ, తండ్రీ. ముసలామెకు ఆస్తమా. తండ్రికి పక్షవాతం. కేన్సర్. వీపుకు బెడ్ సోర్.
దీర్ఘకాల చికిత్స. నిరంతర సేవ.
నాల్గైదు నెలలైందేమో. ఈ యాతన తెలుస్తోంది ఇంటి ప్రక్కలవాళ్ళందరికీ. వినబడుతోంది తనకూ. కోడలూ. పిల్లలూ. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకూ. అందరూ. ‘ఎప్పుడు ఈ ముసలోడు చచ్చిపోతాడా’అని ఎదురుచూస్తున్నట్టు నిరీక్షణ.
వృద్ధులున్న ప్రతి కుటుంబంలోనూ బయటికి కనబడని అజ్ఞాత సమస్య ఇది. ,
దీనికి ఒక అర్థవంతమైన పరిష్కారం. ఉందా. ?
తన ఇంటికి ఇటుప్రక్క ఇల్లు. రాజయ్యది.
రాజయ్య. ఆటో డ్రైవర్. మొదటి భార్య చచ్చిపోయింది. ఆమె బాపతు ఒక కొడుకు. ఒక కూతురు. కొడుకు వీధుల్లో తిరిగే బలాదూర్. రాజకీయ నాయకుల వెంట ఉండే కుక్కలగుంపు వంటి పోషిత అనుచరగణంలో ఒక బానిస సభ్యుడు. కూతురు జానకి. తనతో మూడేళ్ళక్రితం సంప్రదించి డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసింది. కాని థర్డ్ క్లాస్. గవర్నమెంట్ జాబ్ రాదు. ప్రైవేట్లో. విజయ డయాగ్నిస్టిక్ సెంటర్ అండ్ హాస్పిటల్స్ లో. నెలకు ఐదువేలు. రాత్రింబవళ్ళు తేడాలేని నిరంతర వాడకం మనిషిని, మనిషి అవసరాన్ని ఎక్స్ ప్లాయిట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ దోపిడీ. ,
రాజయ్య రెండవ భార్య. యశోద. గయ్యాళి. ఇద్దరు పిల్లలు మళ్ళీ.
తను ఇంట్లో ఉంటే పాములపుట్టలో ఉన్నట్టు అతి వికృతమైన అనుభూతి జానకికి. ఎన్నోసార్లు చెప్పింది తనతో. అడిగింది. తన స్థితినుండి విముక్తి ఏమిటి. ? అని.
జవాబు లేదు.
అంతకన్నా వేరేవిధంగా. తృప్తిగా. ఉన్నతంగా బతికే అవకాశం లేదు.
తనూ. అంతే.
హోటల్ కార్మికుని కొడుకు.
చిన్నప్పటినుండీ. కసి. తన బీదరికంపైన. ఆకాంక్షలను సాధించుకోలేని అశక్తతపైన. ఎదగడానికి అస్సలే లేని అవకాశాలపైన. విపరీతమైన కసి.
అందుకే చిన్నప్పటినుండి కసిగా కష్టించి. తనూ హోటళ్లలో పని చేసి. కసిగా చదివి. పరిమితమైన వనరులతో ఒక్కో మెట్టు. ఎస్ ఎస్ సి. ఇంటర్. మెడిసిన్. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఎం బి బి ఎస్.
కాని తర్వాత. ఇంట్లో అమ్మ చచ్చిపోయింది. తమ్ముడు క్లీనరై. డ్రైవరై. చెల్లి కంగన్ హాల్లో సేల్స్ గర్లై. తండ్రి అదే హోటల్లో దోశలు పొసే బోయ్.
ఎం బి బి ఎస్ తర్వాత ఎం డి చేయంది ఆ డిగ్రీ వేస్ట్. ఈక్వివలెంట్ టు ఆర్ ఎం పి.
పరిమితమైన సీట్లుండే ఎం డి లో సీట్ రాదు. ప్రైవేట్ గా యాభై లక్షలు కట్టి తను చదువలేడు.
ఒకసారి. రెండుసార్లు. మూడుసార్లు. ఉహూ. రాలేదు ఎం డి సీట్.
తప్పనిసరై రాజీపడి. ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో డ్యూటీ డాక్టర్.
పైకి ఎం డి. సూపర్ స్పెషాలిటీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు బోర్డ్ పై. కాని నిజంగా దవాఖానలను నడిపేది. తనవంటి గ్రాడ్యుఏట్ డాక్టర్సే.
రాత్రుళ్ళు. పగళ్ళు తేడా లేదు. ఆల్వేస్ ఆన్ డ్యూటీ.
జీతం మాత్రం పన్నెండువేలే.
ఉన్నతమైన కల. సాకారం కాని స్వప్నం. ఏమాత్రం సంతృప్తినివ్వని వృత్తి.
మనిషికి కావలసింది కేవలం డబ్బు. హోదా. అంతస్తేనా. ? వాటికన్న అతీతమైన ఇంకెన్నో. వాటి సంగతి.
ఏమిటవి. తృప్తి. ఆత్మానందం. విలక్షణత. ప్రత్యేకత.
ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో తొంభై శాతం డాక్టర్లందరూ వచ్చేప్పుడు ఖాళీ జేబులతో వచ్చి నోట్లతో నిండిన టైట్ జేబులతో ఇంటికి వెళ్ళడం. రాత్రింబవళ్ళు ఒకటే ధ్యాస అందరికీ. తొందరగా సాధ్యమైనంత ఎక్కువ డబ్బు ఎలా సంపాదించడం. మేక్ మేక్. మేక్ మనీ. క్విక్.
తనిప్పుడు ఈ దిక్కుమాలిన నీతిహీనమైన వైద్యసేవల రంగంలో తనదైన ఆత్మసంతృప్తినివ్వగల మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలి. సమాజోపయోగకరమైన దిశలో తను తన స్వప్రయోజనకారకమైకూడా ప్రజాసేవ చేయగల అవకాశాలను ఎలా రూపొందించుకోవాలి. ?
సాహసం. ధైర్యం. వినూత్న లక్ష్యం. కొత్త చూపు. సరికొత్త దృష్టి.
” చీకటి ప్రక్కనే వెలుతురు. లోయ ప్రక్కనే శిఖరం. చూడగలిగితే. చేయి చాపితే అందే దూరంలోనే అవకాశాలు”
వెదకాలి. వెదకాలి. మెదడుతో, తెలివితో, మనసుతో కాదు హృదయంతో.
నరేందర్ ఆలోచిస్తున్నాడు. వెదుకుతున్నాడు. అన్వేషిస్తున్నాడు. ఒక మార్గంకోసం. తెరువుకోసం.
సూర్యుడు ఆకాశంపైకి ప్రాకుతున్నాడు.
సూర్యుడు అలసిపోతాడా. ? సూర్యుడు విశ్రమిస్తాడా. ?
నెవర్.
సూర్యుడికి అలసట లేదు. విరామం లేదు. అవిశ్రాంత గమనం.
గమనం. చలనం. దూసుకుపోవడం. అంతిమంగా. లక్ష్యాన్ని చేరడం.
ఒక మెరుపు మెరిసింది డాక్టర్ నరేందర్ మెదడులో.
నాట్ పేషంట్ గోయింగ్ టు ద హాస్పిటల్-బట్. లెట్ హాస్పిటల్ కం టు ద పేషంట్.
రాజేందర్ కు ఫోన్ చేశాడు. “రాజేందర్ గారూ. నేను డాక్టర్ నరేందర్. మీ ఇంటిప్రక్క. ఔను. ఆ నరేందర్నే మాట్లాడుతున్నాను. మీ నాన్నగారి యాతనను గమనిస్తున్నాను రోజూ. చాలా బాధగా ఉంది. ఒక ఆలోచన చేశాను. రేపటినుండి ఒక డాక్టర్ తన వెంట నర్స్ ను తీసుకుని మీ ఇంటికి వచ్చి నాన్న కండిషన్ ను చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చి. నర్స్ డ్రెస్సింగ్ చేసి. వుయ్ విల్ టేక్ కేర్. నామినల్ ఫీ ఇవ్వండి. నెలకు ఓ వేయి రూపాయలు. ”
” నరేందర్ గారూ. నిజమా. ఇలా చేయగలరా మీరు. ఇంట్లో అందరూ నాయిన మీద విసుక్కుంటున్నారండీ. పాపమనిపిస్తోంది. కాని ఏమీ చేయలేకపొతున్నా నిన్నాళ్ళూ. ఇప్పుడు మీకు దండం పెడుతున్నాను. ప్లీజ్. వెంటనే స్టార్ట్ చేయండీ సర్వీస్. మీకు కొండంత పుణ్యం కూడా కలుగుతుంది. వృద్ధుల సేవ దైవసేవే సార్. “చెప్పుకు పోతున్నాడు రాజేందర్. అతనికి తన పెళ్ళాం పోరుతప్పి తండ్రికి రవ్వంతైనా సేవచేసిన తృప్తి మిగిలుతుందని. ఊరట.
వెంటనే జానకికి ఫోన్ చేశాడు. ప్రక్కింట్లోనే ఊంది కదా. పరుగెత్తుకొచ్చింది.
వివరంగా చెప్పాడు.
“మనిద్దరం ఒక యూనిట్ ఇక నుండి. సాహసోపేతమైన జీవితాన్ని ఆరంభిద్దాం. నా అంచనా ప్రకారం. ఒక్క మన గోపాలస్వామి ఏరియాలోనే ఏ వందమందో వృద్ధ పేషంట్లు విరిగిన కుర్చీల్లా పనికిరాని సామాన్లను డంప్ రూంలో విసిరేయబడ్డట్టు అనారోగ్యంతో మగ్గుతున్నారు. వాళ్ళకు సేవలు చేయలేక వాళ్ళ కొడుకులూ బిడ్డలూ. బంధువులూ విసుక్కుకి వీళ్ళెప్పుదు చచ్చిపోతారోనని ఎదురు చూస్తున్నారు. పాపం నిస్సహాయులైన ముసలోళ్ళు మృత్యు బాధతో తల్లడిల్లిపోతూ నరకం అనుభవిస్తున్నారు. మనం రోజూ ఓ ఐదారు ఇండ్లు విజిట్ చేసి. నేను ట్రీట్మెంట్. నువ్వు నర్సింగ్. పర్సనల్ కేర్. నెలకు వంద కుటుంబాల సందర్శన. దాదాపు వందమంది వృద్ధుల సేవ. డబ్బు కూడా. వందా ఇంటూ వేయి. లక్ష రూపాయల ఆదాయం. మనిద్దరికి. పుణ్యానికి పుణ్యం. డబ్బుకు డబ్బు. సేవకు సేవ. మనకు మిగిలే గుండెలనిండా తృప్తి. “చెప్పుకు పొతున్నాడు నరేందర్.
జానకికి అంతా కొత్తగా. వింతగా. నమ్మలేనట్టుగా. మాయగా ఉంది.
నరేందర్ ముఖంలోకి కృతజ్ఞతగా చూచింది.
“ఇది ఎంత మంచి ఆలోచనో. ప్రక్కింటి ఆంటీకి చెబితే ఈ పూటనుండే రమ్మంటుంది”అంది జానకి.
ఆ క్షణమే నరేందర్ మొబైల్ ఫోన్ మ్రోగింది.
అటువైపునుండి రాజేందర్ “డాక్టర్ గారూ. ఇప్పుడే చెప్పాను. మా ఫ్రెండ్ విశ్వనాధం. వాళ్ళమ్మ కూడా ఎనభై ఏళ్ళు. బెడ్ రిడెన్. ఎల్లం బజార్. ఆమెనుకూడా దయచేసి మీరే చూడాలి. “చెప్పుకుపోతూ బ్రతిమాలుతున్నాడు.
నరేందర్ తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు.
సాహసం. వినూత్నత. ధైర్యం. స్వయంశక్తి. వైవిధ్యం.
జానకి కృతజ్ఞతగా అతని ఆలోచనను అభినందిస్తున్నట్టు. నరేందర్ వంక చూస్తూండగా,
నరేందర్ మళ్ళీ సూర్యుని దిక్కు చూపులు మళ్ళించాడు.
పొద్దెక్కింది.
వాకిట్లొ ఎర్రగా ఎండ.

• * *

ఓ రెండు గంటల తర్వాత,
“జానకీ వెళ్దామా” అన్నాడు నరేందర్.
“ఊ. “అందామె. అని అతనికి స్టెత్. మెడికల్ కిట్ ను అందించింది.
నడుస్తూ నాల్గు పాదాలు. ఇద్దరు మనుషులు. ఒకటే హృదయం.
మృత్యువాకిట నిరీక్షిస్తున్న వృద్ధులకు చికిత్స చేసి వస్తున్నపుడు. వాళ్ళ కృతజ్ఞతాపూర్వకమైన చూపులు. ,
ప్రతి సందర్భంలోనూ నరేందర్ ఒక చినుకు స్పర్శతో పులకించే చిగురుటాకై. ,
మన జీవితాన్ని మనమే నిర్మించుకోవచ్చుగదా. అని. ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *