February 23, 2024

బద్ధకపు అలవాటు.

 

రచన: పంతుల ధనలక్ష్మి.

 

రమేష్ కుకుకుకుకుష్    కురుకురుకురు కుష్ శబ్దం వినగానే లేచి కూర్చుని ఫోనులో టైమ్ చూసాడు.  నాలుగుంపావు అయింది.  ఇప్పటినుండి ఎందుకు కాసేపు పడుకుందాము అనుకున్నాడు.

ఈలోపు టింగ్ మని శబ్దం.  వాట్సాప్ లో శుభోదయాలు ప్రారంభం అనుకున్నాడు.  తనకి మంచి మిత్రుడు ఈ మధ్యే రిటైరయ్యేడు. సరే చూద్దామని చూసాడు.  “మనిషికి అన్ని అనర్థాలకి కారణం బద్ధకం. దానిని వదిలించుకుంటే జీవనం చాలా బాగుంటుంది.” అని.  అలా ఒక్కొక్కటీ చదివి థంబ్ గుర్తులు కొన్ని కామెంట్స్ పెట్టి టైమ్ చూసేసరికి ఏడున్నర.  “అయ్యబాబోయ్ మూడుగంటలసేపు చూసానా” రేపటినుండి ఇంటిలో పనిచెయ్యడాలు లేవు.  ఆఫీసుకెళ్ళి పనిచెయ్యాలి.  సీత కూడ ఆఫీస్ కి వెళ్ళాలి.”అనుకున్నాడు.

సీత కూడ అదే పరిస్థితి.  రమేష్ లేచి ఫోను పట్టుకోగానే తను కూడ లేచింది.   బాల్కనీలో కూచుని ఫోను చూసుకుంటూ ఆన్ లైన్ షాపింగ్ లో ఏవి సేల్స్ లో పెట్టేరు? చీరలు,  మేచింగ్ సగం కుట్టిన జాకెట్లు చూస్తోంది. ఆ కలర్లు డిజైన్లు అన్నీ చూసి టైమ్ చూసింది.

“అమ్మో! నేను ఇవాళనుంచి ఆఫీస్ కి వెళ్ళి పనిచేయాలి.  మంచి నీళ్ళు పట్టాలి” అనుకొని  మంచినీళ్ల కుళాయి తిప్పింది.  నీళ్ళు రాలేదు.  “అయ్యో! ఇవాళ నీళ్ళు రాలేదా?” అంటూ శ్రీవారిని పిలిచింది.  అప్పటికే బింది కడుగుదామని ఉన్న నీళ్ళు వంపేసింది.

రమేష్ బాత్రూములో చూస్తే టాంకులో నీళ్ళు ఒక్క చుక్క లేవు.

“ సీతా!” కేకేసాడు.

“ఆంత వేగంగా లేచావు! టాంకు ఆన్ చెయ్యద్దా? ఇప్పుడు చూడు! ఒక్క చుక్క నీళ్ళు లేవు.  “ అన్నాడు.

వెంటనే వాచ్మెన్ కి ఫోను చేసి ”ఇవాళ నీళ్ళు రాలేదా?” అని అడిగాడు.

“ రాకపోడమేంటి? ఇయ్యాల నాలుక్కే ఇచ్చీసినాడు.  ఎక్కువిచ్చేడు.  ఏడు వరకు ఇచ్చేడు.  మీరు లెగలేదా? మీ యింట్లో బలుబు ఎలిగే వుందే ఆ టయానికి?”అన్నాడు.

మూడు నాలుగు రోజులనుండీ అపార్ట్ మెంట్ లో మంచినీళ్ళు,  టాంకులకు నీళ్ళు పట్టుకోకుండా అందరూ తననే అడుగుతున్నారని వాచ్ మాన్ గమనించి పక్కింటి వాచ్ మాన్ తో మాట్లాడి ఇద్దరూ కలిసి పెద్దవి సింటెక్స్ టాంకులు కొనుక్కొచ్చి టాంకులు నిండుగా వేస్టుగా పడే నీటిని ట్యూబులు పెట్టి ఎక్కించేసారు.  అవి కనిపించకుండా పైన డాబా మీద పెట్టి ట్యూబులు తగిలించి వుంచేరు. ఇంచుమించుగా ఎపార్ట్ మెంట్ లో అందరూ లేచి లేవంగానే ఫోను చూసుకుంటూ నీళ్ళు పట్టడం లేదు.

అప్పుడు వాచ్ మాన్ “బింది ఏభయ్ రూపాయలు.  పెద్ద బకెట్ 75 రూపాయలు.  మీ బాతురూమ్ లో టాంకు నింపాలంటే మూడులందల రూపాయలు.” కావాలంటే మోసుకొచ్చి కింద సెల్లార్లో ఎడతాను.  మీ టాంకులకి ట్యూబ్ తగిలిస్తే ఎక్కుతాయి” అని చెప్పాడు.

అందరూ ఆఫీసుల కెళ్ళాలని సరే అన్నారు.

వెంటనే పక్కింటి వాచ్మెన్ వ్యర్థంగా పట్టిన నీరు ఒక ట్యూబ్ ద్వారా ఈ అపార్ట్మెంట్ లిఫ్ట్ వరకూ తెచ్చి బిందెలు బకెట్లు నింపుతున్నాడు. ఈ వాచ్ మాన్ పక్క అపార్ట్ మెంట్ బిందెల్ను నింపుతున్నాడు. అందరూ లిఫ్టులో బింది బకెట్ తెచ్చి తమ గుమ్మం ముందు పెడితే లోపలపెట్టి డబ్బులిచ్చేసారు.

ఇద్దరు వాచ్ మాన్లు వాళ్ళు ఇచ్చిన నీళ్ళకి వచ్చిన డబ్బులు పంచుకున్నారు. హాయిగా పిల్లలకి స్కూలు ఫీజులు పుస్తకాలు కొనుక్కున్నారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *