June 24, 2024

మోదుగపూలు – 12

రచన: సంధ్యా యల్లాప్రగడ

గిరిజన గ్రామంలో అందరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది గోండుల సంస్కృతిలో భాగం. గ్రామంలో పెళ్లిళ్లు, పండుగలు అందరూ కలిసే చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక గ్రామానికి, మరో గ్రామానికి మధ్య తగవులు వస్తాయి. మాములుగా వారి తగవులు వారు తమ గ్రామపంచాయితిలో తీర్చుకుంటారు. గ్రామాల మధ్య గొడవలకు కూడా మార్గం ఉంది. పది పన్నెండు గ్రామాలకి ఒక రాజు ఉంటాడు. వారి తగవులు తీరుస్తాడు ఆ రాజు. ఈ చిన్న రాజ్యాలతో కలసి ఒక పెద్ద రాజ్యం ఉండేది.
అలా గోండు రాజుల రాజ్యాలతో పాటు వారి వద్ద కొలాములు ప్రధానులుగా ఉండేవారు.
ఈ గోండులు భీమసేనునికి, హిడింబికీ పుట్టినవారని నమ్మకము. భీముని కుమారుడైన ఘటోత్కచుని పిల్లలు గోండులు. కాబట్టి వాళ్ళు రాజులు. ఘటోత్కచుని తమ్ముని కుమారులు కొలాంలు. వీరు గోండులకు ప్రధానులుగా ఉండేవారు.
14వ శతాబ్దం వరకు గోండుల వైభవం ప్రభ నడిచింది. అటుపై గోండుల మీదికి మరాఠీలు దండెత్తి వచ్చారు. కారణం మరాఠీలు, మొఘలాయిలను ఎదిరించడానికి కొంత సాయం కావాలి.
మొఘలాయిలతో యద్ధంలో కనుక ఓడితే అడివిలో ఆశ్రయం కావాలి. తిరిగి రాజ్యం సంపాదించుకోవటానికి వారికి సహాయం కావాలి. ఈ రెంటి కారణాల వలన వారు గొండులపై దండెత్తారు. గోండులు అలా మరాఠీలకు సామంతులైనా, సాయం అందించినా, అడవిలో సర్వ స్వతంత్రంగానే ఉన్నారు.
ఇలా సామంతులుగా మారిన గొండులకు మరాఠీలో ఏ ఇబ్బంది కలగలేదు, నిజాం రాజ్యం వచ్చేవరకు కూడా.
తదనంతరము భూస్వాములు, జమీందారులు వచ్చారు. బ్రిటీషువారు వచ్చారు. వీరందరి కన్ను అడవి మీద పడింది. అడవి కల్పతరువు. అటవీసంపద అపారం. ఆ అడవిలో కలప ప్రపంచం వ్యాప్తంగా నాణ్యత కలిగినదని పేరు పొందింది. అటువంటి కలప కోసం ఆటవికులకు అన్యాయం చెయ్యటం, మోసం చెయ్యటం నాగరికులకు సర్వ సాధారణమైంది.
గోండుల సంస్కృతి ప్రకారం గ్రామంలోని ప్రకృతి వనరులు, నీరు, భూమి, అడవి గ్రామం సొత్తు. వాటి నిర్వహణ, అధికారం బాధ్యత కేవలం ఆ గ్రామానిది, ఆ ఆదివాసులది. అయితే నిజాం ప్రభుత్వం వచ్చాక అధికారం నిజాంది, ఆయన ఏర్పాటు చేసిన గ్రామాధికారిదిగా మారింది. ఇది గిరిజనులకు మొదటి దెబ్బ.
అప్పడు సర్వ స్వతంత్ర గోండులు ఈ రెవిన్యూ అధికారికి బానిసగా మారుతారు. ఇలా చేసినా గిరిజనులు సహనం పాటించినా, భూస్వాములకు ఓపికలేదు.
వారికి గిరిజన భూముల మీద కన్ను పడింది. పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు వారి వ్యవసాయం మీద పన్ను కట్టమని వారిని పీడించటం మొదలు పెట్టారు. కాదంటే వారిని తరిమి వెయ్యటం, రికార్డ్స్ లో అవన్నీ ప్రభుత్వ భూములని కానీ, భూస్వామివి అని కానీ రాయటం పరిపాటిగా మారింది. వారు రాసినవేమిటో ఈ గిరిజనులకు తెలియదు.
ఇదీ కాక వారి వద్దనుంచి అడవులు తీసెయ్యటానికన్నట్లుగా 1920 నుంచి రిజర్వు ఫారెస్ట్ అని ప్రకటించటం మొదలు పెట్టారు ప్రభుత్వాలు. సహజ అడవులతో పాటు నివాసయోగ్యం కాని అడవులను కూడా రిజర్వు క్రింద ప్రకటించారు. ఈ విధానం వలన గిరిజనులను అడవి నుంచి తరలించే యత్నం జరిగింది.
తాత ముత్తాతల కాలము నుంచి ఆ అడవినీ, ఆ నేల తల్లిని నమ్ముకున్న వీరిని, ఆ భూములు వదిలి వెళ్ళిపోమన్నది ఆనాటి ప్రభుత్వం. ముక్కుపచ్చలారని పసికందులను తల్లి ఒడి నుంచి లాగినట్లుగా ఈ ఆదివాసులను వారికి తెలిసిన అడవి నుంచి లాగివేసింది ఆనాటి ప్రభుత్వం. ఆ గిరిజనులకు ప్రత్యామ్నాయ ఏర్పాటులేవీ జరగలేదు. వారికి పునరావాసము కలిగించలేదు.
1940లో సంకేపల్లి అడవుల నుంచి వారిని వెళ్ళిపోమన్నారు. ఆ అడవులను రక్షితాడవులుగా ప్రకటించారు. గిరిజనులు సుర్దేపల్లికి తరలిపోయారు. వారిని అక్కడ్నుంచి కూడా పొమ్మని గెంటేశారు. గిరిజనులు ఈ గొడవలు భరించలేక జోడేఘన్‌గుట్టుల మీదికి వెళ్ళిపోయారు. అక్కడికి నరమానవులు కాలు పెట్టలేరు. కొన్ని దినాల తరువాత ఆ గుట్టల మీద కూడా ఉండకూడదని నిజాం హుకుం జారీచేశాడు.
గిరిజనులు కొమరం భీం నాయకత్వములో ప్రభుత్వం మీద తిరగపడ్డారు. “మా గ్రామం మా రాజ్యం” అన్న నినాదంతో కొమరం భీం గిరిజనులను ఏకం చెయ్యటానికి ప్రయత్నించాడు. అంతకు పూర్వమే మన్యంలో సీతారామరాజు చేసిన పోరాటం అతనిని ఈ తిరుగుబాటుకు ప్రోత్సహించింది. అతను గిరిజనులను ఏకం చేశాడు. కేవలం గోండులు, కొలామీలే కాదు అందరు ఆదివాసులు ఏకం కావాలని చెప్పేవాడు.
పన్నెండు ఊర్ల గిరిజనులు ఏకం అయి తమ మానాన తాము బ్రతుకుతామని తిరుగుబాటు చేశారు.
వారికి పట్టాలిస్తామన్నది ప్రభుత్వము. పట్టాలు కాదు తాము నిజాం పాలనను అంగీకరించమని ప్రకటించారు గిరిజనులు. వారిని చర్చలకని పిలిచారు. కొమరం భీం తోపాటు కొందరు వస్తే వారిని చంపారని అంటారు.
వారు ప్రభుత్వ సైనికులను ఈటేలు, బరిసెలు తుపాకులతో ఎదిరించారంటారు. మొత్తానికి బాబేఝరి కురుక్షేత్రమైనది. జరిగిన పోరులో కొమరం భీం నెలకొరిగాడు. తరువాత గిరిజనులలో అలజడి రేగింది.
నిజాం ప్రభుత్వము ఆదివాసులను అణచలేమని తలచి ఆంగ్లేయుడైన మానవపరిణాము శాస్త్రవేత్త హెమన్‌డార్ఫను నియమించింది. ఆయన గిరిజనులతో తిరిగి, వారి మేలు కోసము ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచించారు. ఆ సూచనలు ఎన్ని పాటించారన్నది ప్రశ్న. ఆనాటి నుంచి గిరిజనులలో ఎదురుబాటుకు, ధైర్యానికి గుర్తుగా కొమరం భీంని కొలుస్తారు గిరిజనులు.
వివేక్‌ ఈ విషయాలను చొప్పిస్తూ హృద్యంగా మూడు అంకాలుగా నాటకం రాశాడు. అతను గోండు భాష వాచకం సహాయం తీసుకొని తను రాసిన నాటకాన్ని గోండులోనికి తర్జుమా చెయ్యటానికి ప్రయత్నించాడు. దానిని రాముకు చూపితే, అతను చూసి కొద్ది మార్పులు చేసి, సరి చేసి ఇచ్చాడు.
పాఠశాల పిల్లలు ఆ నాటకం చదివి ముచ్చటపడ్డారు. గిరిజనుల భాషకు లిపి లేనందున్న అది తెలుగులిపిలో రాశాడు వివేక్‌.
పిల్లలు ఎంతో ఉత్సాహంగా నాటకానికి ప్రిపేర్‌ అయ్యారు. రాజుసారుకు నాటకం ప్రదర్శించటానికి అనుమతి కూడా వచ్చినందున వివేక్ పిల్లలతో మరింతగా రిహర్సల్ వేయించటం మొదలెట్టాడు.
దీపావళి పండుగ వచ్చి వెళ్ళింది. ఊరిలో గుసాడి నృత్యాలు, ఆర్భాటాలు పండుగ వాతావరణం వివేక్‌ను ఎంతో ఉత్తేజపర్చింది.
అతనికి దీపావళి టపాసు తప్ప ఈ నృత్యగానాదులును సంగతి తెలియదు కాబట్టి అతనికి అన్నీ వింతలే.
పండగ రోజు టీచర్లు అందరూ మామిడిపల్లి ఊరి మధ్యనే గడిపారు, అవి చూస్తూ. పండగ హడావిడి ముగిసింది.
చలి పెరుగుతోంది. మామిడిపల్లిలో చలి ఎక్కువగా ఉంది, సిటీలో కన్నా. వివేక్‌కు స్వెట్టరు వేసుకోక తప్పటం లేదు. అతను స్వెట్టరు కూడా ఆదివారం సంతలోనే కొన్నాడు.
ఉదయం పూట తొలిమంచు పెరుగుతోంది. సూర్యుడి రాకను ఎంతగానో స్వాగతిస్తున్నాడు అతనందరిలాగానే. అతనికి గోండుల గురించి, కొలామిల గురించి తెలుసుకొని, వారి భాషను నేర్చుకోవటం వలన ఆత్మవిశ్వాసం పెరిగింది.
తన తండ్రి విషయం తెలుసుకోలేదన్న బెంగ మాత్రం పోలేదు.
***
డిసెంబరు పది తరువాత వివేక్‌, మధుసారుతో కలసి పిల్లలను తీసుకొని అంతర్జిల్లా పోటీలకు హైద్రాబాదు వెళ్ళాడు. వారంతా స్కూలు బస్సులో వెళ్ళారు. పిల్లలెంత ఎగ్జైటు అవుతున్నారో వివేక్‌ కూడా అంతగా ఎగ్జైటు అయ్యాడు. అతను మొదటిసారి గోండుభాషలో నాటకం రాయటం ఒకటైతే, అది ప్రదర్శనకు రావటం మరోఎత్తు, ఎలా అవుతుందో అన్న ఆందోళనా మరో కారణం.
పోటీలన్నీ రవీంద్రభారతిలో జరిగాయి. వారం రోజుల కార్యక్రమం అది.
మొదటి రోజున పిల్లలు చేసిన గుసాడి డ్యాన్సుకు ఎంతో ఆదరణ లభించింది. ఆ రోజు పత్రికలన్నీ ఈ నృత్యము గురించే రాశాయి. చివరి రోజున నాటకాలు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి గోండు భాషలో ఆడుతున్న నాటకమని అందరి దృష్టిని ఆకర్షించింది. గిరిజనుల భాషయని, ఇంత వరకూ చెయ్యని ప్రయోగమని ఎంతగానో మొదటి రోజు నుంచి దాని గురించి ఎంతో ప్రచారం జరిగింది. గిరిజన శాఖా మంత్రి, గిరిజన శాఖా సెక్రట్రీ కూడా హజరవుతున్నారు. వివేక్, మధుసార్‌ ఆ రోజు ఆడిటోరియములో వస్తున్న అందరికీ నాటకము డైలాగులు తెలుగు తర్జుమాతో ఉన్న కాపీలు పంచారు. ప్రసాదరావుసార్‌ కూడా వచ్చారు.
మంత్రి కూడా వచ్చేశాడు. ఇంక నాటకము మొదలవటమే తరువాయి.
తెర తీశారు.

మొదటి అంకంలో
ఉపోద్ఘాతము.
గిరిజనుల గురించి వారి ఆచార వ్యవహారాల గురించి. వారికి అడవి ఎంత ముఖ్యమైనదో… వివరిస్తూ కొన్ని డైలాగులు చెప్పారు.
గిరిజనులు అడవుల్లో సంతోషముగా ఉంటారు. వారికి వృధాగా చెట్టు కొట్టటము, అన్యాయం చెయ్యటము రాదు. చెట్టును, పుట్టను, పక్షిని ప్రేమిస్తాడు ఆదివాసి.

రెండవ అంకం మొదలవుతుంది.
అడవిలో సంపదకు చాలా డిమాండ్ ఉందని, కాని గిరిజనులు ఆ అడవి కలపను తాకనివ్వరని భూస్వాములు, నిజాం మాట్లాడుకుంటారు. ఆదివాసులను తొలగించాలని, కొత్త చట్టాలు తెస్తారు. బ్రిటీషు వాళ్ళు నిజాంతో కలసి ఆదివాసులను గెంటేస్తారు.
ఆదివాసులు చిన్నపిల్లలతో, ముసలివారితో ఏడుస్తూ మరోచోటకు వెడతారు. ఆ సంఘటనను ఒక పాట హృదయవిదారకమైన సంగీతము మధ్యన నటించారు.
వారిని తిరిగి తిరిగి గెంటుతూ ఉంటే వారిలో ఒక నాయకుడు ఉద్భవిస్తాడు.
“అందరం తిరగబడుదాం. రండి “మన గ్రామం-మన రాజ్యం” అంటాడు.
మాడవ అంకం
గ్రామస్థులలో మాటలు. అందరూ ఏకం కావటం, నిజాం పోలిసులతో మాటలు.
యుద్ధంలోకి మరలుతుందది.
అటు నుంచి ఇటు నించి తుపాకులు. సైన్యం అందర్ని కాల్చి వెళ్ళిపోతుంది.
కొమరం భీం “మన గ్రామం- మన రాజ్యం” అంటూ నేలకొరుగుతాడు.
“కొమరం భీం నేలకొరిగాడు. వేలాది గోండు ప్రజల కలలరూపం భీం నేలకొరిగాడు.. ఆదివాసుల ఊపిరి భీం నేలకొరిగాడు… భూమిని ప్రేమించినోడు, ప్రజలను ప్రేమించినోడు నేడు భీం నేలకొరిగాడు… గోండు వీరుడు నేలకొరిగాడు… అన్యాయం అంతం కావటానికి తుపాకీ తప్పదన్న వీరుడు నేలకొరిగాడు… అంటూ తెర వెనుకగా గంభీరమైన కంఠం గోండు భాషలో పలికింది…
“భీమకు చావు లేదు… గోండు వీరుడు భీం అంటే మనిషి కాదు… భీం అంటే ఒక్క మనిషి కాదు. భీం అంటే పన్నెండు గ్రామాలు కాదు… భీం అంటే ఆదివాసులు… భీం అంటే గోండు జాతి… భీం అంటే నాగలి దున్నే రైతు… ఆకాశం… గాలీ… అడివితల్లి…జలపాతం.. భీం అంటే ఎగిరేజండా… భీం అంటే మోదుగపూలు..
భీంకు చావులేదు…” అంటూ నాటకం సమాప్తం అయింది. తెర పడింది.
ఆడిటోరియంలో ఒక ఉద్వేగపూరిత నిశబ్ధం అలుముకుంది.

ఇంకా వుంది

2 thoughts on “మోదుగపూలు – 12

  1. ఇది చదువుతుంటే మావూరి చుట్టూ ఉన్న గోండు పల్లెలే యాది కొస్తున్నయ్. మాది ఆదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామం. పాత తాలూకా. మా భూములు ఎక్కువ గోండులే దున్నేవాళ్ళు. నా పెళ్ళైనప్పటి నుంచి, 41సంవత్సరాల నుంచి వాళ్ళు మాపొలాలు చేయడం, ఇంట్లో పనికి ఉండటంతో .. మాకు వాళ్ళు బాగా తెలుసు..మా మామ వాళ్ళకు భూములు కూడా ఇచ్చిన్రట..! ఇక మా ఆయన వాళ్ళకు పెళ్ళిళ్ళకు , పురుళ్ళకు, దవాఖానాకు పైసలు ఇచ్చిన్రు. ఆ కృతజ్ఞతతో ఇప్పటికీ మా ఇంటికి ప్రతి దీపావళికి “గోసాయిలు”వచ్చి చాలా సేపు ఎగిరి.. వాళ్ళు అడిగినన్ని పైసలు ఇస్తే పోతరు. మా చిన్న కొడుకు పెళ్లి లో వాళ్ళను పిలిచి డాన్స్ కూడా చేయించినం.అందరికీ బాగా ఇష్టం అయింది.!! వాళ్ళే బాహుబలి సినిమా లో కూడా చేసిన్రు.!!!

  2. విశాఖ ఏజన్సీ ప్రాంతానికి దగ్గర్లో పుట్టి పెరగటం వల్ల కోయ,సవర ఇంకా ఇతర ఆదివాసుల జీవన విధానం గురించీ,అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటు గురించి మా నాన్నగారు చెప్పగా చిన్నప్పటినుంచి కొంత పరిచయం ఉంది. “మిరపకాయ టపా” అందుకున్న కే.డీ.పేట (కృష్ణదేవి పేట)లోనూ,కొయ్యూరు, అంతకు ముందు ఐదారు సంవత్సరాల క్రింద అరకు లోయలోనూ పని చేసిన మా నాన్నగారికి అక్కడి సామాజిక జీవితంతో కొంత పరిచయం కలిగి ఎన్నో ఉత్తరాల్లో రాసేవారు వాళ్ళగురించి.(కుటుంబ ఆరోగ్య దృష్ట్యా తనొక్కరే అరకులో ఉండి పని చేశారు).అదే విధంగా ఎక్కిరాల కృష్ణమాచార్యగారి పాడేరు అనుభవాలు చదవటం ద్వారా కూడా కొంత అవగాహన ఉన్నా ఆ భాషలు నేర్చుకోలేదు. అక్కడ ఉంటేనే కాని నేర్చుకోటం సాధ్యం కాదు.ఈ కథ ఆ నేపధ్యంలోది,రాజమౌళి ఆరారార్ సినిమా లాగే ఉంది.ఐతే సినిమాని ఈ చరిత్ర నేపధ్యంలో తీసి వాళ్ళక తోచిన మార్పులు వాళ్ళు చేసుకున్నారు అది వేరేవిషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *