March 4, 2024

వెంటాడే కథలు – 10

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

*********************************

ప్రవృత్తి

వాస్తవానికి ఇది ఒక ‘చందమామ’ కథ.
సుమారు ఐదు దశాబ్దాల క్రితం చదివినా ఇప్పటికీ హృదయంలో అలాగే నిలిచిపోయింది. తరచూ మనసును వెంటాడుతూనే ఉంటుంది. దీని తర్వాత ఇలాంటి కథలు చాలా వచ్చినందున బహుశా ఇందులో మీకు కొత్తదనం దొరకకపోవచ్చు కానీ సందేశం మాత్రం అద్భుతం. . అనిర్వచనీయం!
అడవిలో తపస్సు చేసుకునే ఒక ముని మంచి నీళ్లు తెచ్చుకోవడానికి కడవ తీసుకొని నదికి వెళ్ళాడు. నదిలో నీళ్ళు పట్టుకునే వేళ ఆ పక్కనే పొదల్లో ఎవరో ఒక మనిషి స్పృహ లేని స్థితిలో పడి ఉండడం గమనించాడాయన. ఆ వ్యక్తికి ఒంటి నిండా గాయాలు. . తీవ్రంగా రక్తస్రావం అవుతోంది.
ముని అతనిపై జాలిపడి, అతి కష్టం మీద భుజం మీద ఎత్తుకుని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు. శుశ్రూషలు చేశాడు. గాయాలు కడిగి, పసరు మందులు వేసి కట్లు కట్టాడు. ఎలాగైతేనేం? కొన్ని గంటల తర్వాత అతనికి స్పృహ వచ్చింది. తాను ఒక ముని ఆశ్రమంలో ఉన్నట్టు గ్రహించి అతను మునీశ్వరుడికి నమస్కరించాడు.
తాను ఒక బాటసారినని, అడవిలో దారితప్పిన తనను కొన్ని అడవి మృగాలు వెంటాడి దాడి చేయడంతో
గాయపడ్డానని చెప్పాడు.
”సరే ఎప్పుడు తిన్నావో ఏమో భోజనం చేస్తావా? ” అతన్ని ఆప్యాయంగా అడిగాడు ముని.
కడుపు నకనకలాడుతూ ఉండడంతో చేస్తానన్నట్టు తల ఊపాడు ఆ బాటసారి.
వెంటనే అతనికి క్షణాలమీద పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనం వడ్డించాడు మునీశ్వరుడు.
ఆకలి మీద ఉన్న బాటసారి ఆవురావురంటూ తిని మంచి నీళ్లు తాగాడు.
తర్వాత అతనికి ఒక సందేహం వచ్చింది.
ఈ నట్టడవిలో ఈ ముని అతిథికి పంచ భక్ష్య పరమాన్నాలు క్షణాలమీద ఎలా సమకూర్చాడు అని.
అదే విషయం మునిని అడిగాడు.
ముని చిరునవ్వు నవ్వుతూ ”నా దగ్గర ఒక అక్షయపాత్ర ఉన్నది. . అది కోరుకున్న ఆహారం ఇస్తుంది. దాని సాయంతోనే నీకు విందు భోజనం పెట్టగలిగాను అని దాపరికం లేకుండా చెప్పాడు.
స్వామి “దానిని నేను ఒకసారి చూడవచ్చునా? ” కుతూహలంగా అడిగాడు బాటసారి.
”అదెంత భాగ్యం? ఇదిగో చూడు. . ” అంటూ దాన్ని తెచ్చి అతనికి చూపి, తిరిగి వెళ్ళి మేకుకు ఉన్న తన జోలెలో పెట్టుకున్నాడు ముని.
నిజానికి ఆ ఆగంతకుడు బాటసారి కాదు, ఒక దొంగ.
రక్షకభటులు వెంటపడి కొట్టడంతో గాయాల పాలై నదిలో పడి దూరంగా కొట్టుకుపోయాడు కాబట్టి బతికి బయటపడ్డాడు.
నాలుగు రోజులపాటు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక వెళ్తానని అతను మునితో చెప్పాడు.
నాలుగు రోజులు అక్షయ పాత్ర ద్వారా కమ్మని విందు భోజనం లభించడంతో అతనికి ఒంట్లో శక్తి చేకూరింది. కానీ అతని మనసులో ఆలోచన వేరుగా ఉంది. ఎలాగైనా ఆ అక్షయపాత్ర కొట్టేస్తే తన దరిద్రం తీరిపోతుంది అనుకున్నాడు. ఆ రాత్రి ముని నిద్రపోయాక అతను జోలెలో అక్షయపాత్రను తీసుకుని ఆశ్రమం నుంచి పారిపోయాడు. ముని తనను ఎక్కడ వెంటాడి పట్టుకుంటాడోనని రాత్రంతా నడిచి చాలా దూరం వెళ్ళాడు.
మర్నాడు ఉదయానికి ఆకలి వేసింది.
అడవిలో తీరు బడిగా ఒక బండ మీద కూర్చుని అక్షయ పాత్ర బోర్లించి తనకు కావలసిన ఆహారం కోరుకున్నాడు. కానీ ఏమీ రాలేదు. ఏంటి ముని ఇలాగే కదా అక్షయపాత్ర బోర్లించి కావలసిన ఆహారం కోరేవాడు. తనకు ఎందుకు రావడం లేదు అని ఆశ్చర్యపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అక్షయ పాత్ర అతనికి ఆహారం ఇవ్వలేదు.
సందేహ నివృత్తి కోసం మళ్లీ అతను కాళ్ళీడ్చుకుంటూ ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్షయపాత్రను ముని పాదాల ముందు ఉంచి, “స్వామి నన్ను మన్నించండి. . నేను నిజంగా బాటసారిని కాదు దొంగను. రాత్రి మీ అక్షయపాత్రను దొంగిలించుకుపోయా, కానీ ఇది నాకు ఆహారం ఏమీ ప్రసాదించలేదు ఎందుకో చెబుతారా? ” అని అడిగాడు.
ముని కోపం తెచ్చుకోలేదు.
”అక్షయ పాత్ర పని చేయాలంటే దానికి ఒక మంత్రం ఉంది అది జపించాలి” అన్నాడు చిరునవ్వుతో.
”ఆ మంత్రం ఏమిటో చెప్పండి స్వామి” అడిగాడు చోరుడు.
“చెబుతా. . కానీ బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావ్. . భోజనం చేస్తావా? ” అడిగాడు ముని.
తను దొంగని తెలిశాక కూడా అయన తనను అంతే ఆదరంగా భోజనం చేస్తావా అని అడగడం దొంగకు ఆశ్చర్యం కలిగించింది.
మరోపక్క కడుపులో ఎలుకలు పరుగెడుతూ ఉండేసరికి చేస్తాను అన్నట్టు తల ఊపాడు.
అక్షయపాత్రను బోర్లించి మంత్రం పఠించి ముని అతనికి మరోసారి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టాడు. తర్వాత ఆయన కూడా భోజనం చేసి, అతన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి సమిధల కోసం అడవికి వెళ్ళాడు.
మంత్రమేదో తెలిసిపోవడంతో దొంగ ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు. ముని అటు వెళ్ళగానే ఇటు పాత్రను తీసుకుని పారిపోయాడు. సాయంత్రానికి ఆశ్రమానికి చాలా దూరంగా వచ్చాడతను.
కడుపులో ఆకలి పెరగడంతో ఒక చెట్టు కింద కూర్చుని అక్షయపాత్రను బోర్లించి మంత్రం పఠించి కావలసిన ఆహారం కోరుకున్నాడు.
ఆశ్చర్యం! మళ్లీ అతనికి ఆ పాత్ర సహకరించలేదు. మూడు సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
తిరిగి దాన్ని చేత పట్టుకుని ముని ఆశ్రమానికి అర్థరాత్రి వేళకి చేరుకున్నాడు దొంగ.
ఆ అలికిడికి నిద్ర లేచాడు మునీశ్వరుడు.
వచ్చీ రాగానే ముని కాళ్లపై పడి క్షమించమన్నాడు.
మంత్రం పఠించినా తనకు పాత్ర పని చేయలేదని చెప్పాడు.
”దానికి ఒక కారణం ఉందిలే. . నేను ప్రాణాలతో ఉండగా ఆ పాత్ర ఇతరులకి పనిచేయదు. . అది సరే ఎప్పుడు తిన్నావో ఏంటో ఆకలి మీద ఉన్నట్టున్నావు భోజనం చేస్తావా? ” ఆప్యాయంగా అడిగాడు ముని.
సిగ్గుపడుతూనే తింటానని తల ఊపాడు దొంగ.
ముని పాత్ర బోర్లించి మంత్రం పఠించి దొంగకు కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ తెప్పించి వడ్డించాడు.
కడుపునిండా ఆహారం తిని దొంగ అక్కడే ఆశ్రమంలో నిద్ర పోయాడు. మరో చాపమీద మునీశ్వరుడు నిద్రించాడు. తెల్లవారుజామున నిద్ర లేచిన దొంగ- ముని గాఢనిద్రలో ఉన్నాడని గ్రహించి పాత్రను మరోసారి తస్కరించాలని భావించాడు. ముని బతికి ఉండగా అది పని చేయదు కనుక మునిని చంపాలనుకున్నాడు.
అందుకే ముని నీళ్లు తాగే కమండలంలో విషం కలిపి ఏమీ తెలియనట్టు పడుకున్నాడు.
నిద్రలో ఒకటి, రెండుసార్లు లేచి మంచి నీరు తాగే అలవాటు గల ముని విషం కలిపిన నీళ్ళు తాగి స్పృహ తప్పాడు. ఆయనలో చలనం లేకపోయే సరికి చనిపోయాడని భావించాడు దొంగ.
‘హమ్మయ్య పీడా పోయింది మునీశ్వరుడు చచ్చిపోయాడు ఇక భయం లేదు’ అనుకుని దొంగ అక్షయపాత్రను సంగ్రహించుపోయాడు. అలా నడిచి నడిచి నడిచి చాలా దూరం వెళ్ళాక ఆకలి వేసి భోజనం చేయాలనుకుని ఒక చెరువు ఒడ్డున పచ్చికలో కూర్చున్నాడు. పాత్ర బోర్లించాడు. నిష్టగా మంత్రాన్ని జపించాడు. తర్వాత తనకు కావలసిన పదార్థాలు కోరుకున్నాడు. .
ఊహుఁ ఒక్క పదార్థం కూడా రాలేదు. .
చిరాకు వచ్చేసింది. . ‘మునిని చంపేసి వచ్చాక కూడా ఇది పనిచేయకపోవడం ఏమిటి? ‘ కోపంగా పాత్ర విసిరికొట్టాడు. కాసేపు ఆలోచించాడు. సరే ఈ పాత్రని ఆ ఆశ్రమంలోనే పడేసి వస్తాను, తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అనుకుని తిరిగి ఆశ్రమం వైపు నడక సాగించాడు.
అతను ఆశ్రమం సమీపంలోకి రాగానే అతనికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.
అతను చనిపోయాడు అనుకున్న మునీశ్వరుడు గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
దొంగ రావడం గమనించి ప్రేమగా ఆహ్వానించాడు ముని.
”ఈసారి కూడా నీకు పాత్ర పనిచేయలేదా? ” అని అడిగాడు.
”లేదు స్వామీ. అయినా మీరు ఇంకా బతికి ఉన్నారేంటి? మీరు తాగే నీటిలో విషం కలిపాను కదా? ” నిర్మొహమాటంగా అడిగేశాడు దొంగ.
”అదంతా తర్వాత చెప్పుకుందాం. . ఆకలి మీద ఉన్నట్టున్నావ్. . భోజనం చేస్తావా? ” అడిగాడు ముని.
దొంగ తల ఊపడంతో- పాత్ర బోర్లించి అతనికి కావాల్సిన పదార్థాలు వడ్డించాడు మునీశ్వరుడు.
దొంగకు సిగ్గుగా ఉంది. ముద్ద నోట్లో పెట్టుకోబోయే సరికి అతనికి దుఃఖం పొంగుకొచ్చింది.
చివరికి తను చంపడానికి ప్రయత్నించినా ఈ మునికి కోపమే లేదు. . ఇప్పుడు కూడా ‘ఆకలి మీద ఉన్నావ్ భోజనం చేస్తావా? ‘ అన్నాడు.
అతని పరిస్థితి గమనించి మునీశ్వరుడు చిరునవ్వుతో అన్నాడు.
”నేను నిత్యం యోగా, ప్రాణాయామం చేస్తాను. సూర్య నమస్కారాలు చేస్తాను. . ఎలాంటి విషమూ నన్నేమీ చేయలేదు. . అందుకే ప్రాణాలతో ఉన్నాను” అంటూ తన జీవ రహస్యం చెప్పాడు.
దొంగ ఒక్కసారిగా భోజనం ముందు నుంచి లేచి ముని రెండు కాళ్ళు పట్టుకుని కన్నీటితో పాదాభిషేకం చేశాడు.
”స్వామీ నేను ఇన్ని సార్లు మీకు హాని తలపెట్టినా, చివరికి మీ ప్రాణాలు తీయడానికి తెగించినా మీకు కోపం రాలేదు. పైగా వచ్చినప్పుడల్లా కడుపునిండా భోజనం పెట్టేవారు. . ఏ రహస్యం దాచుకోకుండా నాతో పంచుకునేవారు. . ఒక్కసారి కూడా మీకు నా మీద కోపం రాలేదా? ” అని అడిగాడు.
”దానికి సమాధానం నువ్వే చెప్పాలి? ” అన్నాడు ముని చిద్విలాసంగా.
అర్థం కానట్టు చూశాడు దొంగ.
”ఇన్నిసార్లు మేలు చేసినా నువ్వు ఏదో రకంగా నాకు హాని తల పెడుతూనే ఉన్నావు. . నా మీద ఒక్కసారి కూడా ఇసుమంత దయ కలగలేదా? నాతో మంచిగా ఉండాలి అనిపించలేదా? ” అడిగాడు ముని.
చకితుడై చూశాడు దొంగ.
”అవును. . . మేలు చేసినవారికి కీడు చేయడం నీ తత్త్వం. కీడు చేసిన వారికైనా మేలు చేయడం నా తత్త్వం. . నీ తత్త్వం నువ్వు వదులుకోనప్పుడు నా తత్త్వం నేను ఎందుకు వదులుకోవాలి? ‘చెడు’ను నమ్ముకున్న నువ్వే అంత నిష్ఠగా నీ మనస్తత్వాన్ని మార్చుకోనప్పుడు, మంచిని నమ్ముకున్న నేను మరింత నిష్ఠగా నా ప్రవృత్తిని కాపాడుకోవాలి కదా? ” అన్నాడు ముని కరుణా దృక్కులతో.
దొంగ కన్నీటి చెరువై అతని ముందు దోసిలి ఒగ్గి నిలబడి ఉన్నాడు.
ముని బోధతో అతని మనసు పూర్తిగా ప్రక్షాళనం అయింది.

******

నా విశ్లేషణ:

ఈ కథలో గొప్ప సందేశం ఉంది. దుర్మార్గులు, దుష్టులు తమ పంథాలు మార్చుకోవడం లేదు కనుక మేము కూడా అలాగే మారతాం. . అందులో తప్పేముంది? అని కొందరు సజ్జనులు హింసామార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. కుక్క మనని కరిచిందని కుక్కను మనం కరుస్తామా? విచక్షణా రహితంగా కొందరు ప్రవర్తించారని మనం విచక్షణ విడుస్తామా ? సంఘ మర్యాదలు, మానవత్వం మరచిపోతామా? అప్పుడు గుర్రం గాడిద ఒకటే కాదా?
అశాంతి తీవ్రంగా ప్రబలిన నేటి మన సమాజంలో శాంతి మంత్రమే శిరోధార్యం.
‘కంటికి కన్ను సిద్ధాంతం అమలు చేస్తే ప్రపంచం గుడ్డిదవుతుంది అన్న బాపూజీ మాటలే ఇవ్వాళ మనకు శరణ్యం.
ఎక్కడైనా నిప్పు రాజుకుంటే ఆర్పడమే సత్ పౌరుల లక్ష్యం కావాలి గాని దాన్ని మరింత పెద్దది చేసేలా ఉండకూడదు. మంచి గొప్పదా ? చెడ్డ గొప్పదా? అన్న ప్రశ్న మీకు మీరు వేసుకోండి. . కులమతాలకతీతంగా మంచే గొప్పది మానవత్వమే గొప్పది అని మీరు నమ్మినప్పుడు ఈ కథలో మునీశ్వరుడిలా దాన్ని ఎప్పుడూ పాటించండి. క్షణికావేశాలకు లోను కాకండి.
ఇంతకు మించిన గొప్ప కథ ఏముంటుంది?

6 thoughts on “వెంటాడే కథలు – 10

 1. పిల్లలకు, పెద్దలకు కూడా నైతిక విలువలు నేర్పే ఈ కధ ఎంతో అద్భుతంగా ఉంది ప్రతాప్ గారూ

 2. Really great story, never forgettable. Should not forget. Thank you sir for rewriting such great stories

  1. ధన్యవాదాలు సింహ ప్రసాద్ గారు మంచిగ చెప్పారు. ధన్యవాదాలు

 3. నమస్కారం సర్. ‘ప్రవృత్తి’ కథ చాలా బాగుంది. రచయితకు, కథను పరిచయం చేసిన మీకు పాదాభివందనములు.
  కథలో మంచి సందేశం ఉంది. మీ విశ్లేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉంది. ఇలాంటి కథలను జీవితంలో మర్చి పోలేము.
  ధన్యవాదాలు సర్.

  1. ధన్యవాదాలు సుదర్శన్ గారు మీ సమీక్ష చాలా బాగుంది చక్కగా అర్థం చేసుకున్నారు కనుక బాగా రాశారు ఇవాళ సమాజానికి కావలసింది శాంతం సహనం మాత్రమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *