April 18, 2024

మకరద్వజుడు

రచన: శ్యామసుందర రావు

హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారి అని భక్తులు విశ్వసిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఉదంతము రామాయణములో ఒక ఆసక్తికరమైన వృత్తాంతము.
ఈ వృత్తాంతానికి మూలం లంకాదహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం పొందటానికి సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించు కుంటాడు.హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిన తను వెళ్లిపోతాడు.
కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజుడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అంతేకాదు! అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు.

రోజులు గడుస్తున్నాయి. రామరావణుల మధ్య రాయబారాలు బెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్నకొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకు పోయి బంధించమంటూ కోరుతాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురినీ బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామ లక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. రాక్షసుల బారినుంచి రామలక్ష్మణులను రక్షించడానికి తనకు దారిని వదలమని తనను అడ్డుకోవద్దని హనుమంతుడు మకరధ్వజుడుని ఆడుగుతాడు. అయితే, మకరధ్వజుడు హనుమంతుడికి దారివ్వడానికి అంగీకరించడు. తన తండ్రని తెలిసిన తరువాత కూడా హనుమంతుడికి అడ్డు తగులుతాడు. తన యజమాని అహిరావణ ఆజ్ఞను ధిక్కరించడానికి మకరధ్వజుడు అంగీకరించడు.
మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. ఆ పై అతని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలువనియ్యదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేననీ, ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చిచెబుతాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు. తన కుమారుని స్వామిభక్తికి అచ్చెరువొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు. సుదీర్ఘ కాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు. ఆ పై కోట లోపలికి ప్రవేశించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుని నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకేగుతారు.

కాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు, హనుమంతుడి వీర్యం నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి. మరికొన్ని కథనాలు, లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువన్నమచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చారని అంటారు. థాయ్, కేంబోడియాన్ రామాయణ కథనాల ప్రకారం రావణసైన్యంతో జరుగుతున్న ఒకానొక యుద్ధంలో హనుమంతుడు సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో కనిపించాడు. భీకర యుద్ధం తరువాత హనుమంతుడు తన వద్దనున్న ఆయుధాలతో తన ప్రత్యర్థిని డీ కొనడానికి సంసిద్ధమవుతాడు. ఇంతలో ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం మిలమిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైనా సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువన్నమచ్చ ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియచేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకరినొకరు గుర్తుపడతారు. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించాడు.

ఇప్పటికీ క్షత్రియులలో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తన భక్తిని చాటుకున్నారు కూడా! రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గరలో, గుజరాత్‌లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం మకరధ్వజడు హనుమంతుడి కొడుకుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి.
ఇదీ మకరధ్వజుని వృత్తాంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *