April 16, 2024

అందమైన అనుబంధం

రచన: రాజ్యలక్ష్మి బి

“బావా, మన పెళ్లి జరగబోయే ముందు నీతో నా మనసులోని భావాలు పంచుకోవాలనుంది “అన్నది సరస్వతి కృష్ణవంశీతో.
“సరూ, నా దగ్గర మొహమాటమెందుకు? తప్పకుండా పంచుకుందాం. సాయంకాలం గుడి దగ్గర పార్కులో కలుద్దాం “అన్నాడు వంశీ.
ఇద్దరూ పార్కులో కలిసారు.
“బావా మనం చిన్నప్పట్నుంచి బావామరదళ్ళుగా పెరిగాం, అరమరికలు లేకుండా ఆడుకున్నాం, పాడుకున్నాం. నీ మనసేమిటో నాకు తెలుసు, నా మనసేమిటో నీకు తెలుసు. నా చదువు ఇంటర్మీడియట్ తో ఆగిపోయింది. నువ్వు పై చదువులకు మరో సిటీ వెళ్లిపోయావు. ఇప్పుడు మనం అమాయకమైన బాల్యంలో లేవు. మనలో మానసికంగా మార్పు వచ్చింది.. చిన్నప్పుడు మనం మొగుడూపెళ్లాల ఆటాడుకునేవాళ్లం, నేను నువ్వు చెప్పిన పనల్లా చెయ్యడం, నువ్వు కోప్పడితే తలొంచుకోవడం, నువ్వు నన్ను కాళ్లోత్తమనడం,, అపుడప్పుడు కసురుకోవడం. బావా యిప్పుడవన్ని ఆలోచిస్తుంటే నాకేదోలా వుంది. మనం పెరిగిన వాతావరణ మేగా కారణం !ఇప్పుడవన్నీ నాకు నచ్చడం లేదు. మార్పు కోరుకుంటున్నాను.” ఊపిరి తీసుకుంటూ ఆగింది సరస్వతి
“సరూ అసలేం చెప్పదల్చుకున్నావు?” అన్నాడు వంశీ.
“చిన్నతనంలో అమ్మా, బామ్మా మాటలు వింటూ. కట్టుబాట్లు చూస్తూ, ఆడపిల్ల మొగుడికి చాకిరీ చెయ్యడానికే పుట్టిందను కున్నాను. మొగుడంటే దేవుడనుకున్నాను. వాళ్లు చెప్పుకుంటుంటే విని. నాకెప్పుడు ఆ అదృష్టం వస్తుందా అనుకునేదాన్ని. కానీ యిప్పుడవన్ని మారిపోయాయి. భర్తగా నీ సహకారం కావాలి.”అన్నది సరస్వతి.
వంశీ సరస్వతి మాటలు విని ఆశ్చర్య పోయాడు. అమాయకమైన సరస్వతి యెంత మారింది ?
“సరూ ఏం సహకారం. కావాలి “అంటూ. ఆప్యాయంగా చెయ్యి నిమిరాడు.
“బావా నాకు వ్యక్తిత్వం వుంది. నా స్వతంత్రం నాకుండాలి, మొగుడిమీద ఆధారపడి బ్రతకలేను. నేను వుద్యోగం చేస్తాను. నా మనసులోని మాటలు చెప్పాను. నీకు యిష్టమయితే మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను బలవంతపెట్టను”అన్నది సరస్వతి.
“నీ వ్యక్తిత్వానికి భంగం రానియ్యను. కానీ వుద్యోగం చెయ్యాల్సిన అవసరం నీకు లేదు. నీ అవసరాలకు, ఖర్చులకు నేనిస్తానుగా” అన్నాడు వంశీ.
“అదిగో అదే నాకిష్టం లేదు, నాకు ఆర్ధిక స్వతంత్రం కావాలి. ”అన్నది సరస్వతి.
“సరే సరూ వుద్యోగం చెయ్యి, యిష్టం లేకపోతే మానెయ్యి” అన్నాడు వంశీ.
ఇంత మంచిబావ తనకు భర్త అవుతున్నందుకు యెంతో సంతోషించింది సరస్వతి. ఒక శుభముహుర్తంలో యిద్దరికీ పెళ్లి జరిగింది. కృష్ణవంశీ సరస్వతిని తనతో పాటు సిటీ తీసుకుపోయాడు. ఒక ఆఫీసులో క్లర్క్ గా చేరింది ! రోజులు అన్యోన్యంగా సాగిపోతున్నాయి.

* * * * *

నెమ్మది నెమ్మదిగా వుద్యోగానికి అలవాటు పడుతున్నది. ఉదయం వుషారుగా లేవడం, వంటా, బ్రేక్ఫాస్ట్ చేసెయ్యడం బాక్సులో సర్దుకోవడం, బస్సెక్కి వెళ్లడం సరదాగా వుంది సరస్వతికి. నవ్వుకున్నాడు కృష్ణవంశీ. మొదటి సంపాదన అందుకోగానే యిద్దరూ గుడికెళ్లారు ! హుండీలో వేసింది. భర్తకు మంచి డ్రెస్ కొన్నది ! ఇద్దరూ హోటల్లో భోజనం చేసి. సినిమా చూసి వచ్చారు. ఆ రోజు ఖర్చంతా తానే పెట్టుకుంది. పర్సులోనించి డబ్బులు తీసి యిస్తుంటే. తృప్తిగా ఫీల్ అయ్యింది.
ఒక సాయంకాలం బస్ యెక్కాలంటే చాలా రష్ గా వుంది, మగాళ్లు ఆడాళ్లను తోసుకుంటూ యెక్కుతున్నారు. వాళ్లను తిరిగి తొయ్యలేక సరస్వతి ఆ బస్ యెక్కలేదు. వాళ్లు అలా తనల్ని తాకుతుంటే చిర్రెత్తింది. ఆలస్యంగా యిల్లు చేరింది.
వంశీతో తన ఘోష చెప్పుకుంది. నవ్వాడు వంశీ “సమానహక్కులంటారుగా మీ ఆడవాళ్లు, నువ్వూ వాళ్లను. తోసుకుంటూ. యెక్కెయ్యి. ”అన్నాడు వంశీ.
“నాకలా తోసుకుంటూ తగులుకుంటూ యెక్కడం అసహ్యం”అంటూ కొంగు దోపుకుని వంటింట్లోకి వెళ్లింది. ఆ రోజు బాగా అలిసినట్టుంది వంటచెయ్యాలనిపించడం లేదు కానీ తప్పదుగా !
“సరూ విసుగ్గా వుందా, హోటల్ వెళ్దామా!” అన్నాడు వంశీ.
అసలే చిరాగ్గా వున్న సరస్వతి ఇంతెత్తు ఎగిరింది.
“మీకేం మగమహారాజులు, దర్జాగా కాలుమీద కాలేసి కూర్చుంటారు. బస్సులో సీటు దొరికి వచ్చేటప్పటికి తల ప్రాణం తోకకి వస్తుంది.” కోపంగా అంది సరస్వతి.
“ఎందుకొచ్చిన కష్టం నీకు, మనకేం తక్కువయ్యింది? వుద్యోగం మానెయ్యొచ్చుగా” అన్నాడు వంశీ.
“మీరు నేను యెప్పుడెప్పుడు వుద్యోగం మానుతానా అని యెదురు చూస్తున్నారు. నేను చచ్చినా మానను ! వంటమనిషిని పెట్టుకుందాం”అంది సరస్వతి.
వాదించి లాభం లేదని తెలుసుకున్నాడు. వంటమనిషిని పెట్టుకున్నారు.
ఒక రోజు ఆఫీసర్ సరస్వతిని పిలిచాడు “ఇంత నిర్ల్యక్షంగా వుంటే ఎలాగండీ! యీ ఫైల్లో అన్నీ తప్పులే! మనసంతా యింటిమీదే వుంటే వుద్యోగం యెందుకు చేస్తున్నట్టు?అందుకే మీ ఆడవాళ్లకు వుద్యోగాలివ్వకూడదు.”విసుక్కున్నాడు.
“సారీ, యికమీదట తప్పులు రానివ్వను “అంటూ కన్నీళ్లతో నమస్కరించింది.
“ఇదొక్కటి మీ ఆడవాళ్లకు బాగా చాతనవును. ఇప్పుడే ఫైలు కరెక్ట్ చేసివ్వండి” అంటూ ఫైలు విసిరేసాడు.
———-

ఆ రాత్రి వంశీతో ఆఫీసు కష్టాలు చెప్పుకుని. యేడ్చింది.
“సరేలే ఆఫీసరు కదా అతనికి ఆ అధికారం వుంది. అయినా తాళి కట్టిన భర్త. యేదైనా అంటే మహా రోషం మీ ఆడవాళ్లకు, మా మీద ఇంతెత్తు యెగురుతారు, ఆఫీసరు చీవాట్లేస్తుంటే చేతులు కట్టుకుని పడుతుంటారు” దెప్పిపొడిచాడు.
సరస్వతి ఏం మాట్లాడలేదు. మొదటిసారి ‘నిజమేగా’ అనుకుంది.
ఒకరోజు బస్ స్ట్రైక్ అని తెలిసి తోటి వుద్యోగినితో కలిసి నడిచివెళ్దాం అనుకుంది సరస్వతి. ఆటోవాడు యెక్కువ అడుగుతున్నాడు. మబ్బు పట్టింది, చిన్న సందులో నడుస్తున్నారు. వెనకాల యెవరో త్రాగుబోతు వస్తున్నాడు, సరస్వతికి భయం పట్టుకుంది వేగం పెంచారు. వాడు యింకా వేగంగా వచ్చి సరస్వతి భుజం మీద చెయ్యేసాడు. అంతే యిద్దరూ పెద్దగా కేకలేస్తూ పరుగెత్తారు. అందరూ పోగయ్యారు. వాణ్ణి తన్నారు. “అయినా మిమ్మల్ని యీ సందుల్లో యెవరు నడవమన్నారు! అంత ధైర్యం లేనివాళ్లు ఉద్యోగాలేం చేస్తారు ?వంట చేసుకుంటూ వుండక” అంటూ. హేళనగా మాట్లాడుతూ వెళ్లిపోయారు.
ఇంటికి రాగానే భర్తతో చెప్పింది. అతను కంగారుపడ్డాడు.
సరూ ఆఫీసర్ తో మాటలు పడడం, బస్ లో యిబ్బంది పడడం, చివరికి ఒకదానివి రావాలన్నా భయపడడం, యివన్నీ అవసరమా నీకు? ఇప్పుడు నీలో సౌకుమార్యం తగ్గుతున్నది చూసుకున్నావా, మన సంసారం నడవడానికి నా జీతం సరిపోతుంది. హాయిగా యింట్లో వుండి యింటిని స్వర్గతుల్యం చెయ్యి. అర్ధం లేని ఆవేశాలతో, సమానహక్కులనే భ్రమతో మీకు మీరే కాపురాలను ఛిద్రం చేసుకుంటున్నారు. కాస్త మనసుతో ఆలోచించు”అన్నాడు వంశీ.
“ఎందుకు మాటిమాటికి నా వుద్యోగం మీద విరుచుకు పడతారు? మీ మగాళ్లకు చాకిరీ చేస్తూ యింట్లో పడుండాలా !” కోపంగా అరిచింది సరస్వతి.
“పిచ్చిగా వాదించకు, వంట చెయ్యడం యిల్లు చక్కదిద్దుకోవడం మొగుడికి అన్నం పెట్టడం చాకిరా? అయితే నేను వుద్యోగం చేసి. యిల్లుకి సంపాదించడం కూడా చాకిరేనా? నేనెప్పుడూ ఆలా అనుకోలేదు. ఒక సంసారం నడవాలంటే ఒకరు బయటకెళ్లి డబ్బు సంపాదించాలి, ఒకరు ఆ డబ్బుతో యిల్లు చక్కదిద్దుకోవాలి! పురుషుడు మానసికంగా దైహికంగా బలవంతుడు. సమాజంలోని ఆటుపోటు తట్టుకుంటాడు. స్త్రీ శారీరకంగా సున్నితం. సౌకుమార్యం. ఆమె తన యిల్లు. దిద్దుకుంటే చాలు. భర్త యింటికి రాగానే అతనికి మానసిక ప్రశాంతత కావాలి, భార్యకు అంతకు మించిన తృప్తి వుంటుందా నువ్వే ఆలోచించు!”అన్నాడు వంశీ.
సరస్వతి ఏం మాట్లాడలేదు. అతని మాటల్లోని అర్ధాలను మనసుతో ఆలోచిస్తున్నది.

——————

వంటావిడ వంట సరిగా చెయ్యడం లేదు! అడిగితే నిర్ల్యక్షంగా జవాబు చెప్తున్నది ! పైగా గ్లాసులు, చెంచాలు మాయమవుతున్నాయి. సరస్వతికి విసుగ్గా వుంది. వంశీ మాటలు ప్రభావితం చేస్తున్నాయి కూడా. ప్రేమగా మురిపెంగా చూసుకునే భర్త, తన్ను అర్ధం చేసుకున్న తన బావకు తానే వంట చేసి రుచి రుచిగా పెడితే ఆ తృప్తి ముందు యీ వుద్యోగం యెందుకూ పనికిరాదు.
————

“సరూ యింకా తయారు కాలేదు ఆఫీసుకు సెలవు పెట్టావా? “యింకా తయారవ్వని సరస్వతిని చూస్తూ అన్నాడు వంశీ.
“నేను రిజైన్ చేస్తానండీ, వెళ్లి లెటర్ యిచ్చివస్తాను. నా వల్ల ఒక నిరుద్యోగి సంసారం నిలబడుతుంది. మీకు సేవ చెయ్యడం కన్నా మంచి వుద్యోగం నాకు వద్దండీ” అంటూ అతని గుండెలమీద వాలిపోయింది సరస్వతి. వంశీ సరస్వతిని దగ్గర తీసుకున్నాడు.

1 thought on “అందమైన అనుబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *