April 24, 2024

శక్తిని భక్తిని చాటే మొగ్గలు

సమీక్ష: – బోల యాదయ్య

హనుమాన్ చాలీసా (మొగ్గలు)

తెలుగు సాహిత్యం లోకహితమై పుట్టింది. సాహిత్యం ఏదైనా ప్రజలకు మనోధైర్యాన్ని ప్రసాదించి వారిలో చైతన్యాన్ని నింపుతుంది. ప్రపంచ సాహిత్యం మొత్తం పరిశీలన చేసి చూస్తే, ఎందరో ఆదర్శనీయమైన ఆచరణాత్మకమైన జీవితాలను మన ముందుంచారు. అవి ఆధ్యాత్మికపరమైనవి కావొచ్చు. సామాజికపరమైనవి కావొచ్చు. ఎవరు ఏమి చెప్పినా, ఏది రాసినా ధర్మం, న్యాయం, నిలబడే విధంగా ప్రజాహితమైన సాహిత్యాన్నే రాస్తారు. అది వారికి నచ్చిన, మెచ్చిన ప్రక్రియలలో రాస్తారు. కాటేగారి పాండురంగ విఠల్ ఉద్యోగ జీవితానికి విరమణ చేసిన తర్వాత భిన్నమైన ప్రక్రియలలో సాహిత్య సృజన చేశారు. మణిపూసలు, సమ్మోహనాలు, పంచపదులు అలాగే డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సృష్టించిన మొగ్గలు ప్రక్రియలో శ్రీమద్రామాయణాన్ని 2000 మొగ్గలులో రాశాడు. అదే ప్రక్రియలో హనుమాన్ చాలీసా మొగ్గలు రాశాడు. హిందీ మాండలికమైన అవధి భాషలో తులసీదాసు రచించారు. వాటిని కాటేగారి పాండురంగ విఠల్ తెలుగులోకి మూలం యొక్క అర్థం మారకుండా చాలా అద్భుతంగా మొగ్గల ప్రక్రియలో అనువదించాడు.

శ్రీరాముడికి నమ్మినబంటుగా ఉన్నటువంటి హనుమంతుడి వినయం, భక్తి, ధైర్యం, సాహసోపేతమైన జీవిత నియమాలను మనముందుంచాడు.

జ్ఞాన గుణములయందు సాగరుడై
ముల్లోకాలకు ప్రకాశమందించును
జ్ఞాన గుణ తేజో ప్రధాత కపీశుడు

భక్తిలోనే కాదు, జ్ఞానమందు సముద్రమంతటివాడై మూడు లోకాల యందు వెలుగును ప్రసరింపజేసే ముల్లోకజ్ఞాని హనుమంతుడని కవి హనుమంతుడి మీద భక్తి పారవశ్యంతో మొగ్గల దండనల్లి అంజనీపుత్రుని మెడలో వేశాడు. నలబై ఎనిమిది మొగ్గలతో రాసిన హనుమాన్ చాలీసాలో హనుమంతుడి శక్తిసామర్ధ్యాలను, విశేషమైన భక్తితత్వాన్ని తెలిపాడు.

జగతిలో దుర్భేద్య కష్టమైన పనులన్నీ
నీ అనుగ్రహమ్మే ఉంటే సులభమౌను
రామభక్తులకు అండ అంజనీసుతుడు

శ్రీరాముడి భక్తులకు భక్తులకు బాధలు కష్టాలు కలిగినప్పుడు వాటిని తొలగించేందుకు ఎల్లప్పుడు హనుమంతుడి అండదండ ఉంటుందని, నమ్మినవారికి దుఃఖాన్ని దూరం చేస్తాడని కవి కాటేగారి పాండురంగ విఠల్ పై మొగ్గలో చెప్పాడు.

మొగ్గల ప్రక్రియలో పూసిన హనుమాన్ చాలీసా మొగ్గలలో భక్తిని, ధీరత్వాన్ని తెలిపాడు కవి. భయాందోళనకు గురైనప్పుడు నిత్యపారాయణంగా చదువుతారని తులసీదాసు చెప్పినట్లు, అందరికీ సులభంగా అర్థమయ్యేరీతిలో హనుమాన్ చాలీసాను తెలుగులో వ్యవహారిక భాషలో కాటేగారి పాండురంగ విఠల్ రచించడం అభినందనీయం. ఇతని సాహిత్యం మున్ముందు అందరిని రంజింపజేయాలని ఆశిస్తూ….శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *