June 25, 2024

కంభంపాటి కథలు – మతి”మెరుపు”

రచన: కంభంపాటి రవీంద్ర

ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూంటే , తను చెప్పింది, “పక్క ఫ్లాట్ లో కొత్తగా ఓ ఫ్యామిలీ వచ్చేరు . మళయాళీ వాళ్ళట !”
“ఊహూఁ”
“ఊహూఁ అనడం కాదు… అతను మీ కాలేజీయేనట”
“మా కాలేజీ అంటే…అందులో ప్రతీ ఏడాదీ ఓ బ్యాచ్ బయటకి వస్తూంటుంది… అందులో అతను ఏ ఏడాది బ్యాచో”
“ఏ ఏడాదో అయితే… మీకెందుకు చెబుతాను? మీ బ్యాచేనట”
“అవునా? అతను చెప్పేడా ?”
“లేదు… ఆవిడ చెప్పింది”
“సరేలే… మా బ్యాచ్ అంటే నాకు తెలిసే ఉండాలి… అతని పేరు?”
“కృష్ణ ప్రకాశన్”
ఎందుకో ఒక్కసారి నవ్వొచ్చేసింది…”అతనా ??.. ఇంకా భార్యని మర్చిపోలేదన్నమాట !” అన్నాను
“ఏం? ఇంకా భార్యని మర్చిపోలేదన్నమాట ! అంటే ?” కుతూహలంగా అడిగింది
“అంటే… అతనికి… చదువు విషయం తప్ప… వేరేమీ గుర్తుండవు”
“మతిమరుపన్న మాట”
“అలా అని కాదు… అతని గురించి కొంచెం వివరంగా చెబుతాను… మతిమరుపో కాదో నువ్వే చెప్పు…ఎప్పుడూ చదువు మీదే ధ్యాస… అది ఎంతవరకూ వెళ్లిందంటే… ఓసారి ఏదో సబ్జెక్టు గురించి ఆలోచించుకుంటూ… టాయిలెట్ కి వెళ్లి ప్యాంటు తియ్యకుండానే కూచుండిపోయేడు”
“బాబోయ్… ఛీ ఛీ..”
“ఇంకోసారి దసరా సెలవులయ్యేక… శనివారం ఉదయాన్నే ఊరినుంచి హాస్టల్ కి వచ్చేడు… రూమ్ తాళం చెవి సూట్ కేసులో పెట్టుకున్నాడు… ఆ సూట్ కేసుకి నెంబర్ లాక్ ఉంది… ఆ నెంబర్ మర్చిపోయేడు…”
“మరేం చేసేరు?”
“ఏముందీ… వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నాం… కానీ అతనికి వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ గుర్తు లేదు… పోనీ హాస్టల్ వార్డెన్ దగ్గర ఉన్న రికార్డ్స్ లోనుంచి చూద్దాం అనుకుంటే, వార్డెన్ గారు ఆ శని , ఆదివారాలు శెలవు పెట్టి ఊరెళ్ళేడు”
“సూట్ కేసు బద్దలగొట్టాల్సింది”
“చివరికి అదే చేసేం… కానీ. ఆ సూట్ కేసు బద్దలగొట్టేక , అందరూ ఒకటే నవ్వులు”
“ఏం? ఏమయ్యింది ?”
“ఏముందీ… ఆ సూట్ కేసులో… ఓ ఏ 4 షీటు సైజు కాయితం కనబడింది… అది వాళ్ళ నాన్నగారు వీడి రూంమేట్ కి రాసిన ఉత్తరం… “మా వాడు పొరబాటున సూట్ కేసు లాక్ నెంబర్ మర్చిపోతే, 000 అని ట్రై చెయ్యండి… వచ్చేస్తుంది ” అంటూ రాసేరు… వీడు ఆ ఉత్తరాన్ని సూట్ కేసులో పెట్టి తాళం వేసేసేడు!”
“ఇదెక్కడి మనిషండీ బాబూ?
“కానీ… అలా అని అన్నీ మర్చిపోడు… వాడు చదివిన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో ఏ కాన్సెప్ట్ గురించి అడిగినా, వీడి కన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఇంకొకడు దొరకడు… అలాగే… త్యాగరాయ కీర్తనలు”
“త్యాగరాయ కీర్తనలా?”
“అవును… ఉదయాన్నే ఐదింటికే లేచి… ఓ పంచె కట్టుకుని, ఇంత విభూతి నుదుటిన రాసుకుని, మంచి శ్రుతిలో త్యాగరాయ కీర్తనొకటి పాడుకుంటూ… మా హాస్టల్ కి రెండు కిలోమీటర్ల దూరం లోనున్న కృష్ణుడి గుడికి వెళ్ళిపోయేవాడు… వీడా గుడికి వెళ్లే టైముకి పూజార్లు కూడా వచ్చేవారు కాదు… అయినా కూడా… ఆ గుడి బయటే కూచుని, వాడికొచ్చిన త్యాగరాయ కీర్తనలు పాడుకుంటూ ఉండి, దర్శనం చేసుకుని వచ్చేవాడు”
“గొప్పవాడే!”
“ఇంకో హైలైటు… ఓసారి మా క్లాస్మేటు… అనిత… వీడంటే ఇష్టపడి… వీడి దగ్గరికి వెళ్ళి… “నువ్వంటే చాలా ఇష్టం… మన చదువైపోయేక, నీక్కూడా ఇష్టమైతే… మనం పెళ్లి చేసుకుందాం” అంది… వీ
డు ఆ అమ్మాయికేసోసారి చూసి, “అసలు ఎవరు నువ్వు? ఏ బ్యాచ్ ?” అన్నాడు”
“మరి… ఆ అమ్మాయి ఏడ్చిందా?”
“లేదు… హాయిగా నవ్వింది… ఆ తరువాత కొన్నేళ్ళకి… అతన్నే పెళ్లి చేసుకుంది”
“అంటే… అతని భార్య కూడా మీకు బ్యాచ్ మేట్ అన్న మాట… మరి అతనితో మీరు టచ్ లో లేరా?”
“అతని లోకంలో అతనుంటాడు… పైగా ఉద్యోగం, పెళ్ళి అయ్యేక, ఎవరి లోకంలో వాళ్ళుంటారు…ఇవన్నీ కాదుగానీ… ఆ కృష్ణ ప్రకాశన్ గురించి అసలైన హైలైట్ విషయం ఇంకోటుంది”
“ఏంటదీ?”
“మా బ్యాచ్ లో చాలా మంది ఇంజనీరింగ్ డిగ్రీ చదివేరు… కొంత మంది పీజీ చేసేరు… అతి తక్కువ మంది డాక్టరేట్ చేసేరు…”
“కృష్ణ ప్రకాశన్ డాక్టరేట్ చేసేరు కదూ”
“ఒట్టి డాక్టరేట్ కాదు… డబుల్ డాక్టరేట్”
“ఇందులో హైలైట్ ఏముందీ? డబుల్ డాక్టరేట్ చేసిన చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు”
“నువ్వు పూర్తిగా వినాలి… ఇతను ముందో థియరీ ఆపాదిస్తూ… ఓ డాక్టరేట్ చేసేడు”
“ఊఁ…”
“ఆ తర్వాత… అదే థియరీ తప్పని ఇంకో డాక్టరేట్ చేసేడు”
“ఏమిటీ ???… తన మొదటి డాక్టరేట్ కోసం చేసిన థీసిస్ తప్పని , మళ్ళీ వేరే థీసిస్ చేసి, రెండో డాక్టరేట్ సంపాయించేడా ?”
“అవును!”
“మరి యూనివర్సిటీ వాళ్ళు ఏమీ గొడవ పెట్టలేదా?”
“లేదు… ఇతని గట్స్ ని మెచ్చుకున్నారు”
“ఇందాక మీ కృష్ణ ప్రకాశన్ కి మతిమరుపు అని అనవసరంగా అన్నాను… అది కరెక్ట్ పదం కాదు”
“మరి?”
“కృష్ణ ప్రకాశన్ కి మతి”మెరుపు”… ఇదే కరెక్ట్ !”

*****

3 thoughts on “కంభంపాటి కథలు – మతి”మెరుపు”

  1. నిజం. నిజం. అది గుర్తు లేక పోవడం కాదు. దాని మీద దృష్టి పెట్టకపోవడం అంతే. చాలా బావుంది కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *