June 25, 2024

చంద్రోదయం – 31

రచన: మన్నెం శారద

“రేపు నేను విజయవాడ వెళ్తున్నాను. ఒక్కర్తివీ వుండగలవా?” అన్నాడు సారథి భోజనాల దగ్గర.
“ఎందుకు? అంది.
“శేఖర్ వాళ్ల నాన్నగారు అర్జెంటుగా రమ్మని టెలిగ్రాం ఇచ్చేరు.”
“మీతో ఏం పని?” భ్రుకుటి ముడిచి అడిగింది.
“ఏమో నాకెలా తెలుస్తుంది?”
ఆమె అన్నం కెలుకుతూ కూర్చుంది.
“ఏం అలా అయిపోయేవ్?” అతను అనునయంగా అడిగేడు.
“మీరు వెళ్లకపోతేనేం?” ఎదురు ప్రశ్నించింది.
“బాగుండదు. శేఖర్ పోయి వాళ్లెంతగానో కృంగిపోయి వుంటారు. ఎందుకో అవసరముండే రమ్మని వుంటారు. ఒక్కసారి వెళ్లి కన్పించడం శేఖర్ స్నేహితుడిగా నా ధర్మం అనుకుంటున్నాను.”
ఆమె కాస్సేపు మాట్లాడలేదు. ఏవో వూహలు ఆమెను తల్లడిల్లజేస్తుంటే నీళ్ళు నిండిన కళ్లని వాల్చుకుంది.
సారథి ఇదంతా గమనిస్తూనే వున్నాడు.”ఎందుకలా బాధపడుతున్నావ్? నాకు చెప్పరానిదా?” అన్నాడు.
“నాకు తెలుసు. వాళ్లు నానీని యివ్వమని అడగడానికే పిలుస్తున్నారు. నువ్వెలాగూ పెళ్లి చేసుకున్నావ్. నీకెలాగూ పిల్లలు పుడతారు. వాణ్ని యిచ్చేయ్ అంటారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తోంది” అంది ఆవేదనగా.
ఆమె ముఖం దుఃఖం ఆపుకోవడాన ఎర్రబారిపోయింది. సారథి ఆమెవంక అయోమయంగా చూసేడు.
“ఈ రోజు నీ ప్రవర్తన విచిత్రంగా వుంది. ఎందుకలా యేదేదో లేనిపోనివి వూహించుకుని ఊరికే బాధపడతావ్. నానీని యిమ్మంటే దానం చెయ్యటానికి ఏదయినా వస్తువనుకున్నావా? నానీ నీ ఒక్కర్తికే కొడుకనుకోకు. వాడు నాకూ కొడుకేనన్న సంగతి నువ్వు మరచిపోతున్నావు” అన్నాడతను చెయ్యి కడుక్కుంటూ.
సారథి బాల్కనీలోకొచ్చేటప్పటికి నానీ హోంవర్కు చేస్తున్నాడు.
అతను కాస్సేపు నాని దగ్గర కూర్చొని వాడికి ఆ రోజు చెప్పిన పాఠాల సంగతి కనుకొన్నాడు.
నానీ ప్రొగ్రెస్ కార్డు తీసి సారథికి చూపించేడు.
నానీకి ఫస్టురేంక్ వచ్చింది. సారథి సంతకం చేస్తూ “గుడ్! కీపిటప్!” అన్నాదు.
“డాడీ! నాకు ఒక రూపాయి కావాలి” అన్నాడు నానీ గోముగా.
సారథి నానీని దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకుంటూ “ఎందుకు?” అన్నాడు.
“రేపు మాకు ఫిలిమ్ షో వుంది” అన్నాడు కళ్లు తిప్పుతూ.
“సరే! గ్రాంటెడ్!” అన్నాడు సారథి వాణ్ణి గట్టిగా ముద్దుపెట్టుకుని వదిలేస్తూ.
స్వాతి బెడ్‌రూంలోంచి అంతా గమనిస్తోంది.
“పద, పడుకుందాం. మమ్మీకీరోజు బాగుండలేదు” అన్నాడు సారథి.
ఇద్దరూ గదిలోకొచ్చి స్వాతి కిరువైపులా కూర్చున్నారు.
“అమ్మా, నీకు జ్వరమటగా! కాళ్ళు పట్టనా?” నానీ అమాయకంగా అడిగాడు.
ఆమె నానీని దగ్గరగా తీసుకొంది.
“చూసేవా? మా ఇద్దరికీ నీ మీద ఎంత ప్రేమో? నువ్వే అర్ధం చేసుకోలేవ్?” అన్నాడతను కినుకగా.
ఆమె అతని మాటలకి చిరునవ్వు నవ్వింది. మాటల్లోనే నిద్రపోయిన నానీని ప్రక్కకు పడుకోబేట్టి, “ఇప్పుడు చెప్పు. నీకు ఒంట్లో ఎలా వుంది?” అన్నాడు లాలనగా ఆమె ముంగురులు సరిచేస్తూ.
“బాగానే వుంది”
“ఏమో, నువ్వలాగే అంటావ్. ఆ ముఖం చూడు, రెండురోజులకే ఎలా తీసిపోయిందో”
“మీకు నా మీదున్న ప్రేమవల్ల అలా అనిపిస్తోంది. అంతే!” అందామె.
“అంతేనా?” సారథి ఆమెని గట్టిగా కౌగిట్లో బిగించేసేడు.
ఆమె మౌనంగా అతని కౌగిలిలో యిమిడిపోయింది.
“ఇందాక యేమన్నావ్?” గుసగుసగా అడిగేడు.
“ఏమన్నాను?” ఆశ్చర్యంగా అడిగింది స్వాతి.
“అదే మనకు మళ్ళీ పిల్లలు పుడతారని అన్నావుగా? నిజమా?”
సారథి ఆమె కళ్లలోకి చిలిపిగా చూసేడు.
స్వాతి ముఖం తిప్పుకుంది.
“ఏం! సిగ్గా?”
ఆమె మాట్లాడలేదు.
“జవాబు చెప్పవేం?” సారథి ఆమె ముఖాన్ని తనవేపు తిప్పుకున్నాడూ.
“మీకు కావాలా?” ఆమె సూటిగా అడిగింది.
“ఏం, నీకు అక్కరలేదా?”
ఆమె మౌనంగా చూసింది.
“మనకెంతమంది వున్నారని. నానీ ఒక్కడేగా? నీలాంటి ఆడపిల్లను కను, చాలు”అన్నాడతను చిలిపిగా.
స్వాతి అతని కళ్లలోకి ఆశ్చర్యంగా చూసింది.
“స్వాతీ, పిల్లలంటే నాకెంత యిష్టమో తెలుసా? వాళ్ళున్న యిల్లు దేవాలయంలాంటిది. సంతోషాన్ని, సందడిని వేరే కొనుక్కో నవసరం లేదు. వాళ్లు చేసే చిలిపి పనులతో, అల్లరి వేషాలతో కాలక్షేపం అయిపోతుంది. అందుకే మరో చిన్నారిపాప మన యింట్లోకి రావాలి. మన యిల్లు కళకళలాడాలి. ఏమంటావ్?” సారథి నిద్రపోయేంతవరకూ పిల్లల గురించే మాట్లాడుతుంటే వింటూ పడుకుంది స్వాతి.

***
ఆ మర్నాడు ప్రొద్దుటే సారథి విజయవాడ వెళ్లాడు.
స్వాతి లేవలేక అలాగే పడుకొంది.
నానీ పనిపిల్ల సాయంతో తయారై స్కూలుకి బయలుదేరేడు.
“అమ్మా నా చాక్లెట్” నానీ స్వాతి దగ్గరకొచ్చి చెయ్యి చాపేడు.
స్వాతి మెల్లిగా లేచి సీసాలో చాక్లెట్ వాడి చేతిలో పెట్టింది. వాడు బదులుగా ఆమె బుగ్గన ముద్దుపెట్టి క్రిందకొచ్చి రిక్షా ఎక్కేడు. వాడు కనిపించినంత దూరం వాణ్ని చూస్తూ, లోపలికొచ్చి పడుకుంది స్వాతి
ఆమె ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి.
రాత్రి పిల్లల గురించి సారథి మాట్లాడిన మాటలు పదేపదే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
అతనికి పిల్లలంటే ఎంత ఇష్టం.
నిజంగా అతనన్నట్లూ ఇంట్లో ఓ ఆడపిల్ల తిరుగుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది.
ఆ పిల్లకు చక్కగా రకరకాల ఫ్రాకులు తొడగొచ్చు. గొలుసులు వెయ్యొచ్చు. రిబ్బన్లు కట్టొచ్చు. నానీలో కలిసి ఆడుకుంటుంది.
స్వాతి కల అకస్మాత్తుగా చెదిరిపోయింది. ఆమె కళ్లలో నానీ దిగులుగా, ఒంటరిగా నిలబడ్డ దృశ్యం కనిపిస్తోంది.
సారథికి పిల్లలు పుడతారంటేనే ఎంత ఆనందంగా వుంది. నిజంగా పుడితే వాళ్లని ఒక్క క్షణం వదులుతాడా? ఎంతైనా రక్తసంబంధం. ‘తన’ అనే దానిపై వెర్రి వ్యామోహం మనుషులకి. స్వార్థం అన్నింటినీ జయించేస్తుంది. తనదంటూ సంతానం ఏర్పడితే నానీ మీద అతనికున్న ప్రేమ, సూర్యకిరణం సోకిన పొగమంచులా విడిపోతుంది. కేవలం తన స్నేహితుడి కొడుకన్న జాలితో తనకంటూ వేరే సంతానం లేకపోవటం వల్లనే నానీని అంత ప్రేమగా చూడగల్గుతున్నాడు. నానీకోసమే కదా నిజానికి తను ఈ పెళ్లి చేసుకొన్నది. నానీకి తల్లి, తండ్రి అంటూ వుండాలని, వారిద్దరి మధ్య అతను ఆత్మస్థయిర్యంతో పెరగాలనే కదా తను ఆశించింది. అలాంటిది ఈ రోజు మరొకరు తమ జీవితాల మధ్య ఉద్భవించి, తమ బ్రతుకుల్ని అల్లకల్లోలం చెయ్యటానికి వీలు లేదు.
స్వాతి గట్టిగా నిర్ణయించేసుకుంది.
పనిపిల్ల చేత జానకమ్మని రమ్మని కబురు చేసింది.
జానకమ్మ గాలికన్నా వేగంగా పరిగెత్తుకొచ్చేసింది.
“ఏంటి స్వాతి రమ్మన్నావట!” అంది ఆత్రుతగా.
“అవును పిన్నిగారూ! మీరు చెప్పినట్లే చేయదలచుకున్నాను” అంది స్వాతి తల దించుకుని.
“ఈనాటికి నాకు నచ్చేవు!” అంది జానకమ్మ సంతోషంగా.
“కాని… నాకేమిటో భయంగా వుంది పిన్నిగారూ”
“పిచ్చిపిల్లా! ఇందులో భయపడాల్సిందీ, బాధపడాల్సిందీ ఏమీ లేదు. నువ్వేం తప్పు చేయటం లేదు. నీ పిల్లవాడి క్షేమం కోసం నీ శ్రమ నువ్వు పడుతున్నావ్. అంతేననుకో” అంది ధైర్యం చెబుతోన్నట్లు.
జానకమ్మ పనిపిల్లని అవతలకి పొమ్మని తరిమేసింది.
“ఇలాంటి విషయాలు మాట్లాడుకొనేటప్పుడు ఎవరూ వుండకూడదు సుమీ!” అంది రహస్యంగా.
స్వాతి అలాగే భయంగా నిలబడింది.
“నీకేం భయం లేదు. నెలలు ముదిరితే కష్టం గాని లేకపోతే వెంటనే యింటికొచ్చేయొచ్చు.. పద, పద” అంటూ అన్నీ సిద్ధం చేసేసింది జానకమ్మ.
స్వాతి తప్పు చేస్తున్నాననే భయంతో ఓ పక్క వణికిపోతూనే జానకమ్మ మాటలకి లొంగిపోయింది.
నానీ మీద వున్న విపరీతమైన మమకారం ఆమెలోని ఇంగితాన్ని చంపేసింది.
ఆమె మారుమాట్లాడకుండా జానకమ్మ వెంట బలిపశువులా నడిచింది.
*****
సారథి వస్తూనే మంచంలో నీరసంగా పడుకొని వున్న భార్యని చూసి ఖంగుతిన్నాడు.
సూట్‌కేస్ విసిరేసినంత పని చేసి “ఏమయ్యింది?” అన్నాదు కంగారుగా ఆమె ప్రక్కన కూర్చుంటూ.
స్వాతి బలవంతంగా నవ్వి, “మీరు వెళ్ళేటప్పటికే బాగుండలేదుగా, మీరెళ్లాక ఇంకాస్త ఎక్కువయ్యింది. అంతే” అంది.
డాక్టరు దగ్గరకు వెళదామంటే నా మాట వినవు. ఇలా మొండితనంతో కొంపమీదకు తెస్తావని నాకు తెలుసు” విసుక్కున్నాడు సారథి.
“మీరేం గాభరా పడొద్దు. జానకమ్మగారు తీసికెళ్ళేరు లెంది డాక్టరు దగ్గరికి”అంది స్వాతి.
సారథి కళ్లెగరేస్తూ “వెటర్నరీ డాక్టరు దగ్గరకా?” అన్నాడు.
ఆమె వస్తున్న నవ్వు ఆపుకుని “నేను మీకు జంతువులా కనిపిస్తున్నానా?” అంది బుంగమూతి పెట్టి.
“అవును మై డియర్ స్వీట్ వైఫ్‌గారూ” అన్నాడు ఆమె నుదుట ముద్దు పెట్టుకుని.
“అది సరే! మీరు వెళ్ళిన పనేమిటి?” అనడిగింది.
“ఆ విషయాలు చెప్పాలనే కదోయ్ నేను ఉషారుగా వచ్చింది. తీరా నిన్ను చూసి అంతా మరిచిపోయాను.”
“ఫర్వాలేదు చెప్పండి. నాకేమంత సీరియస్‌గా లేదు” అంది ఆత్రుతగా.
“శాంతమ్మా, గంగాధర్ గార్లు తీర్థయాత్రలకు వెళ్ళేరు”
“అయితే?” అంది అర్థం కాక.
“అలా కంగారుపడితే నేనేం చెప్పను. వాళ్లు వెళ్లిపోతూ ఆస్థి అంతా నా పేరున రాసేసారు.”
“అదేమిటి?” అంది ఆస్చర్యంగా.
“అదే నాకూ అర్థం కాలేదు. మీరు ఇలా రాయటం భవ్యం కాదని, నాకు ధనవ్యామోహం లేదని యెంతగానో చెప్పేను. వాళ్లేమన్నారో తెలుసా?. ‘ధనవ్యామోహాం లేదని తెలుసు కాబట్టే నీ పేరున రాసేం. నీవిప్పుడు నానీకి తండ్రివి. వాడి బాగోగులన్నీ నువ్వే చూడాలి. నిన్ను కాదని వాడి పేరు పెట్టి నిన్ను అవమానించలేము. అంతే కాదు. రేపు వాడు పెద్దవాడయి, ఆస్తి తన పేరున వుందనే గర్వంతో చెడిపోవచ్చు. నా ఉద్ధేశ్యంలో యీ ఆస్తి ‘నానీ’ఒక్కడి సొంతమేమీ కాదు. నీవు, నానీ, స్వాతి, రేపు నీకు పుట్టబోయే సంతానం అందరూ దీన్ని సమానంగా అనుభవించొచ్చు. ఈ రకంగానయితేనే మీ కుటుంబం ఒక త్రాటిమీద నడుస్తుంది. నా మాట కాదనక యీ విల్లు తీసుకో’ అంటూ ప్రాధేయపడ్డారు. వాళ్లమాట కాదంటే వాళ్లు బాధపడ్తారని అంగీకరించాల్సి వచ్చింది” అన్నాడు సారథి.
స్వాతి అతన్ని పరిశీలనగా చూసింది.
“ఏమిటలా చూస్తున్నావ్?” నవ్వుతూ అడిగేడు అతను.
“మీకు లక్ష్మీకళ వచ్చేసింది” స్వాతి వ్యంగ్యంగా అంది.
“అంటే?” అర్థం కానట్లు చూసేడు సారథి.
ఆమె నిరసనగా నవ్వింది.”అంత ఆస్తి ఆయాచితంగా కలిసి వచ్చేసరికి మీకు సంతోషం తన్నుకొచ్చి ముఖం కళకళలాడి పోతోందంటున్నాను” అంది వత్తి పలుకుతూ.
“అంటే నన్ను ధనాశాపరుడిగా జమకడ్తున్నావన్నమాట” సారథి విసురుగా అడిగేడు.
“కాదని మీరు నిరూపించుకోలేదుగా!”
“కేవలం డబ్బుమీద పిచ్చికొద్దీ నేను ఒప్పుకున్నానంటావ్. ఇదేనన్నమాట నువ్వు యిన్నాళ్లుగా నన్నర్థం చేస్కున్నది” సారథి బాధగా అన్నాడు.
ఆమె మాట్లాడకుండా గోడకేసి చూస్తూ కూర్చుంది.
అతనిలో బాధ వెల్లువలా పొంగింది.
అతను నిష్టూరంగా అన్నాడు. “అస్తికి నిజమైన వారసురాల్ని నిన్ను పెట్టుకొని నాకు రాయటంలో వాళ్లు తప్పు పనే చేసేరు. నీవు కోపం కొద్దీ అంగీకరించవని వాళ్లీపని చేసేరు. రేపే విల్లు నీ పేరు మీద మార్పించేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో!” సారథి మాటల్లో ఆవేదన బయటకి వచ్చేసింది.
స్వాతి గబుక్కున లేచి కూర్చుంది.
“క్షమించండి. శేఖర్ పట్ల వాళ్లు ప్రదర్శించిన కఠినత్వం గుర్తొచ్చి, మీరు విల్లు అంగీకరించటం సహించలేక అలా మాట్లాడేను. ఆస్తి మీ పేరునున్నా, నా పేరునున్నా ఒకటే. దాని గురించి నాకేం ఆసక్తి లేదు. నా అస్థి మీరు, నానీ అంతే. ఆ విషయం మర్చిపోదాం” స్వాతి అతని గుండెలపై వాలిపోయింది.
సారథి మౌనంగా ఆమె వీపు నిమురుతూ కళ్లు మూసుకున్నాడు.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *