May 25, 2024

పరవశానికి పాత(ర) కథలు – చావు

రచన: డా.వివేకానందమూర్తి (యు.కె)

శ్రీనివాసులుకి చచ్చిపోదామనిపించింది. ఇదివరకు ఇలా చాలాసార్లు అనిపించింది. కష్టమొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదామనుకుంటాడు. అతనికి కష్టాలు చాలాసార్లు వచ్చాయి. అందుకని చాలాసార్లు చచ్చిపోదామనుకున్నాడు.
శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు, శారీరకంగా చచ్చిపోదామనుకుంటాడు. కష్టాలొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు; చావు మీది కోరికని అతనికి మనస్సు నేర్పింది. శ్రీనివాసులి మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ వుంటుంది. కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెదుక్కున్నప్పుడు శ్రీనివాసులుకి ‘చావు’ సమాధానంగా నిలుస్తుంది.
శ్రీనివాసులికి ఇప్పుడు బ్రతుకు చావులా ఉంది. అతనికి చచ్చిపోవాలని లేదు. బ్రతకాలని వుంది. బ్రతుకుతుంటే చచ్చిపోయినట్టు వుంది. కనుక చచ్చి పోతే బ్రతకవచ్చుననిపించింది శ్రీనివాసులికి,
శ్రీనివాసులికి చిన్నప్పట్నుంచీ డాల్ఫిన్స్ నోస్ కొండ మీది నుంచి సరదాగా దూకాలని, సినిమా రిజర్వుడు క్లాసుకి ఒకసారి వెళ్ళాలని, ముష్టివాడి వేషం వెయ్యాలని, ‘షాంపేన్’ తాగాలని, రాజకీయ నాయకుడు అవ్వాలని కోరికలుండేవి. పెళ్ళవక మునుపు రొండోదీ, మూడోదీ తీర్చేసుకున్నాడు. భయం వేసి నాలుగో పని చెయ్యలేదు. ఆఖరిది తనకి అందుబాటులో లేదు కనుక ఆశ అనుకున్నాడు – తీరేవన్నీ కోరికలు, తీరనివన్నీ ఆశలు – అనుకుంటాడు శ్రీనివాసులు ఎప్పుడూ.
మొదటిది మాత్రం ఆలోచించవలసిన విషయం అనుకుని జ్ఞాపకంగా అట్టే పెట్టుకున్నాడు.
పదేళ్ళ క్రితం నుంచీ అతని జీవితంలో ‘చావు’ అన్న పదానికి ‘త్రిప్పట’ ఎక్కువైంది. దానికి కారణం – పదేళ్ళ క్రితం శ్రీనివాసులికి పెళ్ళయింది. ఇలా పదేళ్ళుగా అతన్ని కష్టాలు, మనస్సు, చావు మీది కోరికా క్షోభపెడుతున్నాయి. వీటిల్లో ఏ వొక్కటి చంపుకోవాలన్నా తను చచ్చిపోవాలి. ఈ పదేళ్ళ జీవితం శ్రీనివాసులికి చెప్పిన నిర్వచనం యిది: పెళ్ళితో ఆడదాని జీవితము, మగవాడి కష్టములు ప్రారంభమగును అని. అతని కష్టాలెప్పుడూ అతని సహనాన్ని కొలుస్తాయి. సహనం ఆడవాళ్లకంటే ఎక్కువగా మగవాళ్ళకే వుందని నిరూపంచగలడు శ్రీనివాసులు.
శ్రీనివాసుని భార్య పేరు జానకి. సన్నంగా, అల్పంగా, ఎండుటాకులా వుంటుంది. కుంపటి అంటించడంలో సర్వస్వం తగులబడి ఖర్చయిపోయిన కాగితపు అవశిష్టంలా ఉంటుంది – పదేళ్ళ సంసారం వెలిగించడంలో, పిల్లల్ని కనడంలో ఖర్చయిపోయిన జానకి ఎవరో పేరు తెలియని వ్యక్తి ఓ సన్నటి కర్రష్టాండు మీద చీరా, రవికా పారేసుకుపోయినట్లు ఉంటుంది. శ్రీనివాసులి భార్య జానకి, పదేళ్ళ సంసారంలో ఆమె ఎనిమిదేళ్ళు తొమ్మిదిమంది పిల్లల్ని కనడానికి, మిగిలిన రెండేళ్ళు రోగాల్ని భరించడానికి వాడుకుంది. ఎప్పుడేనా తోచనప్పుడు దేవుడు శ్రీనివాసులి కష్టాల్లో ఓ కష్టాన్ని పిలిచి “కష్టమా! కష్టమా! తొమ్మిదిమంది పిల్లల్ని శ్రీనివాసులి పెళ్ళాం ఆ జానకే కన్నదా” అని అడిగితేకష్టం, దేవుడితో “నీకేం మతి లేదా? సన్నంగా, అల్పంగా, ఎండుటాకులా, రాజకీయనాయకుడి మంచితనంలా ఉన్న జానకి తొమ్మిది మంది పిల్లల్ని కంటుందని ఎలా ఊహించావ్? ఆ పిల్లల్ని శ్రీనివాసులే కన్నాడు” అంటుంది.
ఇవేం పట్టని శ్రీనివాసులు వాళ్ళ ఆవిణ్ణి చూసుకున్నప్పుడల్లా ప్రత్యేక దూరప్రయాణాల కోసం గవర్నమెంటు వారు డీలక్స్ బస్సుని కేటాయించి నట్లు, ప్రత్యేకం పిల్లల్ని కనడం కోసం వాళ్ళావిణ్ణి దేవుడు ఈ భూమ్మీద పుట్టించడాని అనుకుంటాడు. వాళ్ల పెరట్లో నందివర్ధనం మొక్క పువ్వుల్ని పూసినట్లు, ఎండాకాలం మద్దినాల వేళ నడినెత్తిన సూర్యుడు నిలబడి ఎండ కాసినట్లు తన భార్య రోగాల మధ్య నిలబడి పిల్లల్ని కంటోంది అని కూడా అనుకుంటాడు.
శ్రీనివాసులు గుమాస్తా. శ్రీనివాసులు గుమాస్తా అనడం కంటే శ్రీనివాసులి పేరు గుమాస్తా అంటే బాగుంటుంది. గుమాస్తా పేరు శ్రీనివాసులు అంటే ఇంకా బాగుంటుంది. ఇట్లు గుమాస్తా అయిన శ్రీనివాసులికి రక్తం, మాంసం లేవు. వాటిని అతని టేబుల్ మీద రోజూ ప్రత్యక్షమయ్యే కాగితాలు, అతని హెడ్ గుమాస్తా కలిసి స్వాహా చేశారు. ఇప్పుడు శ్రీనివాసులుకి మిగిలినవి ఒక ఎముకల పోగు, ఒక గుండె.
శ్రీనివాసులికి పెళ్లాం, పిల్లలూ తప్ప మరెవ్వరూ లేరు. రెండునెలల క్రితం వరకూ అతనికి ఒక ముసిలి అమ్మమ్మగారు, ఒక పడుచు మరదలు ఉండేవారు. రెప్డేళ్ళ క్రితం ముసిలి అమ్మమ్మగారు రోగం బాధపడలేక ప్రాణాలు తీసుకుని చచ్చిపోయింది. పడుచు మరదలు పడుచుతనం బాధపడలేక ప్రాణాలు తీసుకుంటానని యింట్లో చెప్పి ప్రకాశాన్ని తీసుకుని లేచిపోయింది. పదేళ్ళక్రితం ఆలోచన తన భార్యకు కలగలేదని శ్రీనివాసులు వాపోయాడు. ఇక ఇప్పుడు శ్రీనివాసులు, రోగిష్టి పెళ్ళాం తొమ్మిది మంది పిల్లలూ తప్ప ఎవ్వరూ లేరు ఆ కొంపలో.
* * *
తెల్లవారింది. క్రితం రాత్రి శ్రీనివాసుని భార్య సన్నంగా, అల్పంగా ఎండుటాకులా వున్న జానకి పడే ప్రసవ వేదన చూసి ఆకాశం గుండె పగిలేలా ఏడిచింది.
రాత్రంతా కుంభవృష్టి కురిసింది.
ఈ రోజు – నిన్న పన్నెండు దాటింతర్వాత – పదోసారిగా నొప్పులు పడి చచ్చిన పిల్లవాణ్ణి కని, చచ్చిపోయింది జానకి, శ్రీనివాసుని భార్య. భార్య బ్రతికున్నప్పుడల్లా అతనికి నిండుతనం తెలిసేది కాదు. ఇప్పుడు భార్య పోయింతర్వాత అతనికి నిండుతనం అర్థం తెలుస్తోంది. మనస్సు వెలితిని గుర్తు చేస్తోంది.
పదహారేళ్ళ సిగ్గుపడే జానకి అతని కళ్ళముందు మెదిలింది. కార్యం నాడు ఊపిరి సలపనివ్వకుండా కళ్ళల్లో కళ్ళు, మొహంలో మొహం పెట్టి కౌగిలించుకొన్నప్పుడు – సంతోషం, తృప్తి, కృతజ్ఞతా, అనురాగం మేళవించిన నవ్వు గుండెల్లోకి విరిసిన జానకి నొప్పుల్తో బాధపడుతూ తనకేసి పొడి పెదవులతో జాలిగా చూసిన జానకి, తనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు నిద్రకి దూరమయిపోయిన జానకి, ఎప్పుడూ ఏమీ కనీసం మల్లెపువ్వులైనా కొనిపెట్టమని అడగని జానకి, నిన్నరాత్రి కన్నీరు, కష్టాలు తనకు మిగిల్చి పోతున్నానని బాధపడిన జానకి, తెల్లవారకట్ల చచ్చినపిల్లవాణ్ని చూసినప్పుడు మాతృహృదయం పగిలిపోగా ఏడవడాని క్కూడా ఓపికలేక ఎండిన కళ్ళతో జాలి చూపు చూసిన జానకి, సుఖం అంటే తెలియని జానకి, సన్నంగా, అల్పంగా, ఎండుటాకులా వున్న జానకి, పదేళ్ళు తనతో కలిసి బ్రతికిన జానకి ఇక లేదు. తన భార్య. తన సర్వస్వం. తనకు తృప్తినిచ్చిన కష్టం ఇక లేదు. నిన్నటి అనుభవం ఈ రోజు చావులేని ఓ బలమైన పెద్ద జ్ఞాపకమై పోయింది. కంటి ముందు కనిపించేది మనస్సులో మిగిలిపోయింది. జానకి చావులో ఇంత బలం వుందా? అనిపించింది శ్రీనివాసులికి.
శ్రీనివాసులు తెల్లవారేవరకూ, వర్షం వెలిసే వరకూ భోరున ఏడిచాడు. తెల్లవారింది. వర్షం వెలిసింది. శ్రీనివాసులు ఏడుపు మానేశాడు. ఒకసారి వీధి అరుగుమీదికొచ్చి చుట్టూ చూశాడు. అప్పుడే తలంటు పోసుకుని, జుట్టు విరబోసుకుని వొళ్ళు విరుచుకున్న స్త్రీలా వుంది. ఊరు. పెళ్ళయిన కొత్తలో ఒక్కసారి మాత్రం వాళ్ళావిడ అలా కనిపించింది. మనిషిగా శ్రీనివాసులు సంతోషపడిన రోజు అదొక్కటే.
శ్రీనివాసులి గుండె పగిలింది.
లోపలికి వెళ్ళి పెళ్ళాం శవం మీదపడి మళ్ళా భోరు భోరున ఏడిచాడు. సాయంకాలమైంది. అంతా అయిపోయింది.
పిల్లలు ఏడుస్తున్నారు. హృదయవిదారకంగా.
శ్రీనివాసులు చచ్చిపోదామనుకున్నాడు. నిజంగా చచ్చిపోదామనుకున్నాడు. నిన్న రోగిష్టి పెళ్ళాం బాధ చూసి చచ్చిపోదామనుకున్నాడు. ఇప్పుడు బ్రతకలేక చచ్చిపోదామనుకుంటున్నాడు. తనొక్కడూ తొమ్మిది మంది పిల్లలో, నెలకు డైభ్బై అయిదు రూపాయల జీతంతో సంసారాన్ని ఎలా నెట్టుకురావడం? తను బ్రతకలేక చావాలి. అందుకని చచ్చిపోయి బ్రతుకుదామనుకుంటున్నాడు.
చచ్చిపోయే ముందు ఎప్పుడూ కాఫీ త్రాగి చచ్చిపోవాలనుకుంటాడు శ్రీనివాసులు. అలాంటి చావు కాఫీలు శ్రీనివాసులి గొంతులో పదేళ్ళుగా పాతబడిపోయాయి.
కొచ్చిన్ కేఫ్ లో కాఫీ త్రాగి సముద్రం వొడ్డున నడుస్తున్నాడు.
సముద్రం వొడ్డు వంకరలు ఎప్పుడూ అతనికి భార్య శరీరాన్ని గుర్తు చేస్తాయి. అందుకే అతనికి బీచ్ అంటే ఎంతో ఇష్టం. కెరటాలు వొడ్డు మీద పడుతున్నాయి – రోగాలు భార్య మీదపడి వేధించినట్టు మనస్సులో బాధ కదిలి కళ్ళల్లో నిర్వేదం నింపింది. తలెత్తి చూస్తే నల్లటి డాల్ఫిన్స్ నోస్ భయానికి ప్రతిరూపంలా, పరాయిలోకానికి పాస్పోర్టులా కనిపించింది.
డింగీ ఎక్కి పాయదాటి కొండదిగువ భాగం చేరుకున్నాడు.
గతం మనస్సుని మింగి, కాలాన్ని తిని వేసింది. పొద్దు వాలింది. శ్రీనివాసులు శిఖరానికి వచ్చేసరికి లైట్ హౌస్ తళుక్కున మెరిసింది. ఒక్క క్షణం మనస్సులో పిల్లలు మెదిలారు. జేబులో రూపాయి కాసు, కొంత చిల్లర వుంది. అయ్యో! పిల్లలకేనా యిచ్చాను కాదు అనుకున్నాడు. కొండ అంచుకి వచ్చేశాడు. కళ్ళు మూసుకుని, చిన్నప్పుడు హైస్కూల్లో హైజంపు దూకినట్టు గెంతితే, రెండు నిమిషాలు శరీరం పిచ్చిగా పరిభ్రమించి, మరోక్షణంలో కాఫీని, బీచ్ ని, పిల్లల్ని వదిలిపెట్టేస్తుంది. మరచిపోతుంది. తన మొదటి కోరికకి అవకాశం యిన్నాళ్ళకి, శ్రీనివాసులు నిజంగా చచ్చిపోదామనుకున్నాడు. మరుక్షణంలో చచ్చిపోతా ననుకున్నాడు.
సన్నటి గాలి రివట రివ్వున వీచి, పదేళ్ళ తర్వాత జీవితంలో ఆఖరిసారిగా సుఖాన్ని గుర్తు చేసింది.
ఒక్క క్షణం ఎందుకో తెలియని భయం వేసింది.
శ్రీనివాసులు కళ్ళు మూసుకున్నాడు.
ఉన్నట్టుండి ఓ చల్లటి చెయ్యి మెడపట్టుకుని వెనక్కి లాగింది.
తను వెనక్కి తూలి నిభాయించుకున్నాడు. ఎదురుగా నెరసిన తల, మాసిన తెలుపు గడ్డం, నోట్లో చుట్ట, మడచి కట్టిన పాతపంచెతో ఓ ముసలివాడు నవ్వుతూ కనిపించాడు.
శ్రీనివాసులు స్తంభించి పోయాడు.
పిడుగుల వర్షం రాబోయి ఆగిపోయినట్టు, ఏదో పేరు తెలియని ప్రపంచ ప్రయత్నం విఫలమయినట్టు, సముద్రం పొంగి దేశాన్ని ముంచేసినట్టు, లేక దేశం చైనావాళ్ళ హస్తగతమైపోయినట్టు, దేవుడు మరణించినట్టు అయింది శ్రీనివాసులికి. ఎవరో తన స్వేచ్చని ఉరితీశారు.
ముసిలివాడు అద్దంలో మొహం చూసుకున్నట్టు చూస్తున్నాడు. తనవైపు మనస్సు, లోతుల్ని కాలుస్తున్నాయి అతని కళ్ళు.
“ఇలా చెయ్యొచ్చునా బాబూ!”
కూతురి భర్త కోరికతో తన్ను కౌగిలించుకున్నప్పటి అత్తగారి ప్రశ్నలా వుంది – శ్రీనివాసులుకి ముసిలివాడి ప్రశ్న, ఆ అనుభవం తనకి తెలుసు. సిగ్గుతో చచ్చిపోయాడు. తను – వెధవ ‘చావు’, మాటల్లో తప్ప పనికిరాడు. ఏమీ చెయ్యలేక నిస్సహాయుడై “నన్నెందుకు ఆపావ్?” అన్నాడు.
ముసిలివాడు నవ్వాడు.
“పిచ్చి బాబు!” అని మళ్ళా నవ్వాడు.
శ్రీనివాసులు క్షణం సేపు చిన్నవాడైపోయాడు.
“నా కంటే తర్వాత పుట్టావ్. నాకంటే ముందు ఎలా సచ్చిపోతావ్!”
“అలాగని ఎక్కడా రూలు లేదు. కావాలంటే ముందు నిన్ను తోసేసి, తర్వాత నేను దూకేస్తాను. నీ తర్వాత నేను. నా ముందు నువ్వు చచ్చిపోవచ్చు.”
“నేను పోలీసుని” అన్నాడు ముసిలాడు.
“విట్లేస్తున్నావా? నిన్ను తోసేసి దూకటం మానేస్తాను.”
“మనసు బాగా లేకపోతే ఎందుకు బాబూ ఊరికే కంగారుపడతావ్? ఊళ్ళోకి రా, కూసింత కాఫీ తాగితే మనసు కుదుటపడుద్ది.”
కాఫీ పేరు చెప్పేసరికి శ్రీనివాసులుకి బ్రతకు మీద ఆశపుట్టింది. కాని వెంటనే పిల్లలు, సంసారం, జీవితం జ్ఞాపకానికి వచ్చాయి.
“నాకు కాఫీ వద్దు. చావు కావాలి” “రమ్ము కావాలా?”
వెంటనే శ్రీనివాసులుకి షాంపేన్ మనసులో మెదిలింది. అతనికి ఆ పేరొక్కటే బాగా తెలుసు. తన పాత స్నేహితుడొకడు షాంపేన్ గురించి లెక్చర్లిచ్చేవాడు. షాంపేన్ త్రాగని జీవితం శ్రీనివాసులి చావులో అసమగ్రతని గుర్తు చేసింది.
“రమ్ము కాదు. నాకు షాంపేన్ కావాలి”
ముసలివాడు పొట్టచెక్కలయ్యేలా నవ్వి “అలాగే, నడు” అన్నాడు.
“నిజంగా షాంపేన్ తాగిస్తావా?”
“ఆం”
“అది తాగింతర్వాత చచ్చిపోనిస్తావా?”
“సావనివ్వను. అయినా చాంపేన్ మొదటిసారి తాగనేక సత్తావ్!”
శ్రీనివాసులికి వొళ్ళు మండింది.
“బ్రతికే వున్నాను”
తను కోపంగా చూశాడు. ముసిలాడు గడ్డం ఊడిపోయేలా నవ్వాడు. వాడు నవ్వుతుంటే శ్రీనివాసులికి కోపం రెచ్చిపోతోంది. వాడి నోట్లో విడివిడిగా వున్న రెండు పళ్ళు ఎందుకో తన మూడో కుర్రవెధవనీ, ఆరో పిల్ల ముండనీ గుర్తు చేస్తున్నాయి.
“నోరుముయ్యి?”
“మరి వత్తావా?”
“రాను”
ముసిలాడు మళ్ళా నవ్వాడు. వొళ్ళంతా కుదుపుకుంటూ, తనకి మళ్ళీ కోపం వచ్చింది. భయం వేసింది. ఆ పళ్లని చూసేసరికి. దొంగవెధవ, తన రహస్యం వాడికి తెలిసిపోయింది. అందుకే నవ్వి సాధిస్తున్నాడు. వీడెవడో తిమ్మరుసులా వున్నాడు. రూపులోనూ, చేతల్లోనూ కూడా. కత్తులతోటీ తుపాకులతోటీ గాక వీడు నవ్వుతో భయపెడుతున్నాడు. ఈ మాత్రం దానికి వెధవ కొండ ఎక్కలేక చచ్చాను. ఎక్కి బ్రతికాను. ఇప్పుడీ వెధవ చంపేస్తున్నాడు. అనుకుని ముసలివాడ్ని అనుసరించాడు శ్రీనివాసులు.
బాగా చీకటి పడింది.
నడుస్తూంటే కాళ్ళ క్రింద ఎండుపుల్లలు విరుగుతున్నాయి.
“ఎవర్నేనా లవ్ సేశావేటి?”
“ఏం!”
“అది సచ్చిపోనా దేటి?”
“అసలేమిటి నీ ఉద్దేశం?”
“ఉద్దేశాని కేటుంటది. ఓర్తినా లవ్వూనే ఆ పైన గరభం సేసొగ్గేసినావేమో, అది టుపుక్కుమని సచ్చేసరికి నువ్వుకూడా సద్దామనుకున్నావేమో అని.”
“అఘోరించినట్టే వుంది.”
“మరేటి కత – చుట్ట కావాలా?”
“వద్దు”
“మరి సెప్పు.”
శ్రీనివాసులి మొహంలో బలహీనత స్పష్టమవుతోంది. ఈ ముసిలివాడు ఎవరు? తనంటే వీడికెందుకింత తాపత్రయం? అనుకున్నాడు.
“నీకెందుకు చెప్పాలి. నువ్వు నాకేమవుతావ్?”
“ఏటవుతాను, బతికించినోణ్ణి రచ్చకుణ్ణి. సెప్పవయ్యా ఎర్రి బాబూ.”
“చెప్పేందు కేముంది. నిన్నటి వరకూ వున్న పెళ్ళాం తెల్లారేసరికి చచ్చిపోయింది. డెబ్బై ఐదు జీతం. విశాఖపట్నంలో ఎల్లా బ్రతకడం?”
ముసిలాడు మళ్ళా నవ్వాడు. వాడి నవ్వుకి ఆ చుట్టుపట్ల పొదల్లోనూ చెట్ల మీదా పాకుతున్న పాములన్నీ పరిగెట్టుకువచ్చి కరిచేస్తాయేమోనని భయపడ్డాడు – ఈ వెధవకి నవ్వు తప్ప మరో యావలేదేమిటి? తనకి ఉక్రోషం వచ్చింది.
“నువ్వు కనవా పిల్లల్ని?”
“ఓసది కాదో వెర్రోడా? సచ్చిపోనానికి యింత సిన్ని కారణమా అని. పిల్లల్ని పెంచలేనోడివి ఎందుక్కన్నావ్ మరి?”
శ్రీనివాసులు వెర్రిమొహం వేసుకుని చూశాడు.
“ఇదుగో అబ్బాయ్ – ఓ మాట యిను. మనం బతకలేనప్పుడు సచ్చిపోవాలి. బగవంతుడు మనల్ని సచ్చిపోమని పుట్టించలేదు. బతకడం నేరుచుకోమని పుట్టించాడు. తెలిసిందా! సావంటే నీకేటి తెల్పు? సచ్చే సావు – సడేలే నడు,” అన్నాడు గంభీరంగా ముసిలాడు.
ముసిలివాడి మాటల్లో శ్రీనివాసులికి వేదాంతం కనిపించింది. ఆశ్చర్య పడ్డాడు. ముసిలివాడి మీద ఆప్యాయత, బ్రతుకుమీది ఆశలతో అతడి హృదయం సంత్రప్తమయింది.
కొండదిగి అవతలివైపు దాటి మసీదు వీధి కొచ్చేశారు. చలివేస్తోంది. మెదడు వేడెక్కిపోతుంది.
పెద్ద పోస్టాఫీసు దగ్గర పదోనెంబరు చివరి బస్సు హారన్ మోగింది.
హార్బరు రోడ్డులో ముసిలికుక్క మూలుగు వినిపిస్తోంది.
సోల్జర్ పేట సందులోకి తీసుకుపోతున్నాడు ముసిలివాడు.
ఒక సన్నటి గొందిలోకి నడిచి నాలుగో ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు ముసిలివాడు. పెంకుటిల్లు బాగా శిథిలావస్థలో వుంది. ఇంటి ముందు నుండి ఓ పెద్ద మురికి కాలువ పారుతోంది. ఒక నాపరాయి పలక ఇంటి గుమ్మంలో వంతెనగా వేయబడింది.
తలుపు తెరుచుకుంది. ముసిలివాడి వెనకే శ్రీనివాసులు లోపలికి నడిచాడు. పదిహేను కాండిల్స్ దీపం వెలుగులో పచ్చటి చీర కట్టుకున్న పద్దెనిమిదేళ్ళ స్త్రీ కనిపించింది. శ్రీనివాసులు ఒక్క క్షణం కన్నార్పలేదు. తను లీలామహల్లో ఇదివరకు చూసిన ఓ పాత ఇంగ్లీషు చిత్రం మనస్సులో మెదిలింది. ‘క్లియోపాట్రా’ అని గొణుక్కున్నాడు. పెదాల వెనుక. ముసిలివాడు పక్క గదిలోకి దారితీస్తూ, “ఇల్లారా సిన్నోడా!” అని పిలిచాడు.
శ్రీనివాసులు వెళ్ళాడు. ఈ గది ముందుగది కంటే చిన్నదిగా వుంది.
ఓ పక్క నవారు మంచం, కొంచెం ఇటుగా రెండు పాతకుర్చీలు, ఒక చిన్న స్టూలు వున్నాయి. మూలగా ఆల్మేరా వుంది.
కూర్చోమని కుర్చీ చూపించాడు. ఇద్దరూ కూర్చున్నారు. ముసిలివాడు చుట్ట వెలిగించాడు. “అమ్మాయ్, మూల గూట్లో మందు సీసా పట్రా” అన్నాడు.
“ముందు మందు కొట్టేద్దాం”
“ఏం మందు?” ఖంగున నవ్వాడు. మళ్ళా మూడో వెధవా, ఆరోపిల్ల జ్ఞాపకానికొచ్చారు.
“ఎర్రోడా – రమ్ము – అదేలే షాంపీను?”
శ్రీనివాసులికి భయం, సంతోషం వేశాయి. ఇందాకటి ఆమె సీసా రెండు గాజు గ్లాసులు తీసుకువచ్చి టేబులు మీద పెట్టింది. కాంగో అడవుల్లో గంధర్వకన్యలా కనిపించింది. ఆమె వొంగున్నప్పుడు పమిటజారి వక్షోజాలు పడమటి కొండల్లా ఏపుగా కనిపించాయి. ఆమె సర్దుకొని గదిలోంచి వెళ్ళింది.
“మా అమ్మాయ్. పేరు రాణి. తల్లి లేదు. ఇంకా పెళ్ళి సెయ్యనేదు.” గ్లాసులోకి రమ్ము వంపాడు. శ్రీనివాసులు షాంపేన్ వంపాడు అనుకున్నాడు. ఇప్పుడు కూతురు పెళ్ళి గొడవ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? ముసిలివాడు. ‘ముసిలివాడు’ అనుకున్నాడు శ్రీనివాసులు.
నువ్వే కన్నావా? లేక దొరికిందా? అని అడగాలనిపించింది. చచ్చిపోయే లోపుగా ఈ పీనుగ ఒక్క మంచిపని చేశాడు అనుకున్నాడు రాణిని చూసిన శ్రీనివాసులు.
“ఈ యిల్లు నీదేనా?”
“అబ్బే! అద్దెకొంప, ఈ రొండే గదులు. నలభై అద్ది, మేం యిద్దరవేగా సరిపోతుంది. పట్టించు గిలాసు” “నువ్వేం చేస్తావ్?”
సీసాకేసి చూపించి సీసా పగిలిపోయేలా నవ్వాడు.
శ్రీనివాసులు కొంచెం తాగాడు. గొంతు మండింది. ముసిలివాడు మళ్ళా గ్లాసు నింపాడు. శ్రీనివాసులు ఇక తాగలేకపోయాడు. ఓ క్షణం కడుపులో తిప్పింది. తమాయించుకున్నాడు.
ముసిలివాడు పేలాపన మొదలుపెట్టాడు.
“యమ్ టి వోడు కుష్నుడు, నాస్రావు అర్జినీడు ఏసిన సినిమా చూశావ్?” అని అడిగాడు. కాసేపు గవర్నమెంటుని తిట్టాడు. హైద్రాబాదు వెళ్ళిపోయి పబ్లికున మందుకొట్టు తెరిచి మజాకా చేస్తానన్నాడు. ఇంకెంతలే అన్నాడు. శ్రీనివాసులు ఏదో చెప్తున్నాడు. అతని మనస్సు మాత్రం పక్క గదిలో ముసిలాడు కూతురు ‘రాణి’ మీదే వుంది. విచిత్రం! తొమ్మిదిమంది పిల్లల్ని కన్నా మనస్సులో వేడి తగ్గలేదు. రాణి ఎంత అందంగా వుంది. ఇంత అందమైన దానికి పెళ్ళి చేస్తా, అందంలేని వాళ్ళకిగాని అందమైన వాళ్ళకెందుకూ పెళ్ళి? ఎవ్వరూ కోరుకోరన్న బాధ వున్నప్పుడే పెళ్ళి. అందాన్ని అనుభవించే హక్కు ఒక్కడికేనా? అది వెన్నెల్లా అందరూ అనుభవించేలా అందుబాటులో వుండాలి. అప్పుడే అందం విలువ, గొప్పతనమూనూ. తనే దేవుడైతే అందమైన వాళ్ళకి పెళ్ళిళ్ళు లేకుండా చేసి, చకోరాలకి వెన్నెలమల్లే ధారపోసేవాడు.
ఏమైనా ఇంత మంచి అందాన్ని వదిలిపెట్టకూడదు. చచ్చిపోయేది ఎలాగూ చచ్చిపోతున్నాను. బాధపడేందుకు ఇప్పుడు భార్య లేదు. రేపు తనూ ఉండడు. ఆఖరి క్షణాల్లో ఆనందాన్ని నింపుకోవాలి. అసలు ఇందుకేనేమో దేవుడు తన చావుని వాయిదా వేశాడు. తాగిన శ్రీనివాసులి మనస్సు ఇలా ఆలోచనల మధ్య గంతులు వేస్తోంది.
ముసలివాడు పేలాపన ఆపేశాడు. నిద్ర వస్తున్నట్టుంది. “నడు. మనిద్దరం ఆ గదిలో పడుకుందాం”
క్రింద చాప మీద పక్క పరిచింది రాణి. ఇద్దరూ పడుకున్నారు. రాణి చిన్న గదిలోకి వెళ్ళిపోయింది.
శ్రీనివాసులికి నిద్ర రావడం లేదు.
ఊరంతా చీకటి వొళ్ళు విరిచింది.
నిశ్శబ్దం గుండె మీద చర్చి గంట రెండు నిట్టూర్పుల్ని విడిచింది.
ముసిలివాడు నిద్రలో మునిగిపోయాడు. గుర్రు పెడుతున్నాడు.
చీకట్లో శ్రీనివాసులు పక్కకి తిరిగి ముసిలివాడి ముఖంకేసి చూశాడు. ఇప్పుడప్పుడే లేవడని నిర్ధారణ చేసుకున్నాడు. ఏమైనా సరే సాహసం చెయ్యాలి. తర్వాత సంగతి చూసుకోవచ్చు అనుకున్నాడు. మెల్లగా లేచాడు. రాణి గది తలుపు దగ్గరగా చేరవేసి ఉంది. శరీరం వేడెక్కిపోయింది. చెవుల్లోంచి వేడి గాలి వస్తోంది. నెమ్మదిగా నెట్టాడు. లోపలికి ప్రవేశించి తలుపు గడియ పెట్టాడు. మంచం మీద అలికిడయింది. తటాలున వెళ్ళి మంచం మీది కురికి ఆమె నోరు మూశాడు. “అరవకు”. చీకట్లో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. చేతుల్తో ఆమె చెంపలు రాసింది. శ్రీనివాసులికి స్వర్గం కనిపించింది. మనస్సు కుదుటపడింది. ఆమె నోటి మీద అణచిన చెయ్యి తీసివేశాడు. ఎన్నో గంటలపాటు వాళ్ళిద్దరూ సుఖానికి నిర్వచనాలయ్యారు.
ఇన్నేళ్ళ శ్రీనివాసులి జీవితానికి ఆరాత్రి ఆ క్షణాలు పరాకాష్టలా అనిపించాయి.
చావబోయేవాడిని ముసిలివాడు ఆపడం, ఇంటికి తీసుకువెళ్లి రమ్ము తాగించడం, సుఖం తన్ను వెదుక్కుంటూ రావడం విచిత్రమనిపించింది శ్రీనివాసులికి. కాసేపు సీజరులా ఫీలయ్యాడు. ముసలివాడిమీద జాలేసింది. సహాయం చేసిన వాణ్ణి, అందునా ముసిలివాణ్ణి మోసం చేస్తున్నానే అని.
“ఇంక చాలు. లెగండి” అంది రాణి.
తను లేచాడు. ఆమె శ్రీనివాసులి జేబు తడిమింది.
“ఏం కావాలి?”
“కొత్త పాసింజరుకు మల్లే అడుగుతావేమిటి?” అని అతని జేబులో వున్న చిల్లరంతా చొరవగా తీసుకుంది. “బేవార్సు సరుకనుకొన్నావేటి?”
ఒక్కసారి శ్రీనివాసులు విచలితుడయ్యాడు. నిషా దిగిపోయింది. క్షణంలో పరిస్థితి అర్ధమయింది. ఎంత మోసం, ముసిలివాడి మీది కోపంతో శ్రీనివాసులి మనస్సు ఉడికిపోయింది. చావబోతే పాపం వెనక్కి పిలిచింది.
విసురుగా తలుపు తెరుచుకుని ముందు గదిలోకొచ్చాడు. ముసిలివాడు చుట్ట కాలుస్తూ నవ్వుతూ కనిపించాడు. దాంతోటి శ్రీనివాసులు అగ్గిబరాటా అయిపోయాడు.
మీదికి లంఘించి ముసిలివాడి గొంతు పట్టుకున్నాడు. ముసిలివాడు నవ్వు మానలేదు. రాణి వచ్చి లైటు వేసింది.
“మోసం చేశావు ” క్రౌర్యం నిండిన కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
“యిదిలి పెట్టోశి. ఎర్రోడా?” శ్రీనివాసుల్ని విదిలించాడు. ‘నన్ను, నా పిల్లని పోషించుకోవడం మోసమా? నీకు మళ్ళే కడుపున కన్న పిల్లల్ని పోషించుకోనేక సచ్చిపోయి గతిమాలినోన్నవను.”
శ్రీనివాసులికి షాక్ తగిలినట్టయింది.
“బతకాలంటే చాలా వున్నాయ్ దార్లు, కన్నపిల్లల్ని పోషించుకోడం శాతకాక పోతే సావమనా సదుంకున్న సిన్నోడా? అడుక్కు తినేనా బ్రతకాలి. నీ కోసరం కాదు. పిల్లల కోసం తెలిసినా? ఏదో బతుకు బతికి జీయితం గడపాలి. దయిర్యం ఉండాలి. శావ కావాలి. యెల్లెల్లు నీకేది మంచిదని తోత్తే ఆరకంగా బతుకు. నాకుమల్లే మందు- పిల్ల ఏపారం పెట్టాలనుకుంటే పెట్టుకో, నేకపోతే ఆ గుమత్తా పనే సూసుకో యెల్లెల్లు! ఎర్రోడా! అంతేకాని సావమోక. మొగోడివి. ఇందాక నువు సేసిన గనకార్యానికి మొగోన్ననుకోమాక, నువ్వు సత్తే ఆ పిల్లలేమయిపోతారని ఆలోచించనేదేటి? యెల్లు!”
ముసిలివాడి ముఖంలో నవ్వు లేదు. చూపుల నైశిత్యం శ్రీనివాసులు వివశుణ్ణి చేసింది. అంతే – ఇక మారు మాట్లాడలేదు. రాణికేసి ఒక్క చూపు చూశాడు. వెనక్కి తిరిగి వీధినపడ్డాడు.
తెల తెల్లారుతోంది. పేరు తెలియని పక్షులు ఆకాశంలో అరుస్తున్నాయి. శ్రీనివాసులు గుండెలో మహారణ్యం తగులబడిపోతోంది.
శ్రీనివాసులు నడుస్తున్నాడు వేగంగా.
దార్లో చంకని పిల్ల నెత్తుకున్న, వేళాపాలాలేని ఓ ముష్టిది కనిపించి, “బాబూ! పిల్ల ఆకలో మండిపోతోంది. రెండ్రోజుల మట్టి తిండి లేదు. ధర్మం సెయ్ బాబూ!” అని అడిగింది.
శ్రీనివాసులు జేబులు తడుముకున్నాడు. ఖాళీ! ముందుకు నడిచాడు. నడక వేగం మరింత హెచ్చింది.
తను చావబోయి బ్రతికాడు. తను చావకూడదు. బ్రతకాలి. పిల్లలకోసం – పిల్లలకోసం శ్రీనివాసులు బ్రతకాలనుకున్నాడు. నిజంగా బ్రతకాలనుకున్నాడు. చెంగల్రావుపేట సందు లోంచి ఆత్రంగా ఇంటి వేపు పరుగెత్తుకుపోతున్న శ్రీనివాసులు ‘పిల్లలు – పిల్లలు’ అని గొణుక్కున్నాడు. ఇప్పుడతని కంటిముందు పిల్లలు, మనస్సులో బ్రతుకు మీది ఆశ తప్ప మరేమీ లేవు.
ఉన్నట్టుండి తల మీద వెయ్యి గొడ్డళ్ళతో మోదినట్లయింది.
కంటి ముందు చీకటి పేరుకుంది.
వొళ్ళు తూలింది.
ఆలోచనలు ఆగిపోయి మెదడు పనిచేయడం మానుకుంది.
సృష్టి స్తంభించినట్టయింది. అంతే తెలుసు శ్రీనివాసులికి.

* * *

మర్నాడు దేశంలోని వార్తాపత్రిక లన్నిటిలో పేజీ మూలల, విశాఖపట్నం సందుల మధ్య లారీ ప్రమాదంలో శ్రీనివాసులు అనే వ్యక్తి మరణించాడని ప్రకటించబడింది. ఆనవాలు తెలీని శవాన్ని అతని హెడ్ గుమస్తా గుర్తుపట్టి చెప్పాట్ట.
మనిషి ముఖం చీలిపోయి, కళ్ళూ, ముక్కూ మమేకమై పోయినా తొమ్మిదిమంది పిల్లల పోషణకోసం, పెళ్ళాం రోగాల మందుల కోసం వినయ పూర్వకంగా, శ్రద్ధగా, కష్టించి పనిచేసిన చేతివేళ్ళు, పొంగిన నరాలు – అతని హెడ్ గుమస్తాకి బాగా గుర్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *