April 22, 2024

మోదుగపూలు – 13

రచన: సంధ్య యల్లాప్రగడ

ఆడిటోరియంలో ఏర్పడిన ట్రాన్సు లాంటి నిశబ్ధం తెర వెనుక ఉన్న మధును, వివేక్‌ను, విద్యార్థులను కంగారు పెట్టింది.
“ఏంటి ఒక్కరు చప్పట్లు కొట్టరు?” అన్నాడు మధు సార్‌.
“ఎవరికీ అర్థం కాలేదా?” విచిత్రమైన డైలమాలో పడిపోతూ అన్నాడు వివేక్‌.
“మేము మీరు చెప్పినట్లే చేశాము కదా సార్” అంటూ పాత్రలు వేసిన పిల్లలు చుట్టూ చేరారు.
“ప్రసాదరావుసార్‌ కూడా చప్పుడు చెయ్యడా? లేక మనకు వినపడటంలేదా?” అన్నాడు వివేక్ కంగారుగా..
“చూద్దాం. ముందు మనం తెర ఎత్తించి పిల్లలందరము వెళ్ళి నమస్కారం చేద్దాం. రండి. అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. కమాన్” అంటూ మధుసార్‌ వేదిక మీదకు పోయాడు.
మూసిన తెర పెకెత్తబడింది.
వరుసగా పిల్లలందరూ మధుసార్ చేయి పట్టుకొని వచ్చారు.
చిట్టచివరన వివేక్‌.
అప్పటి వరకూ ఒక దీర్ఘ మౌనములో ఉన్న ఆటిటోరియం దద్ధరిల్లింది. చప్పట్లు విజిల్స్ తో. అందురూ లేచి నిలబడి అప్‌లాజ్‌ ఇచ్చారు.
మంత్రిగారు, సెక్రట్రీ, లేచి వేదిక మీదకు వచ్చారు. వెంట ప్రసాదరావుసారు కూడా.
మంత్రిగారు వేదికమీదకు రాగానే పిల్లలకు షేక్‌హ్యాండులిస్తూ భీంగావేసిన పదవ తరగతి విద్యార్థిని కౌగిలించుకున్నాడు.
నాటకం రాసింది వివేక్‌ అని చెప్పగానే వివేక్‌ను గట్టిపట్టుకొని “గ్రేట్‌ వర్క యంగ్‌మెన్!” అంటూ అభినందించాడు.
ఆయనకి మైకు అందించారు ఎవరో.
“నేను ఒక గిరిజన మంత్రిని. గిరిజనుల, ఆదివాసుల కష్టాలు నాకు తెలుసు. నేను ఆదిలాబాదు నుంచే ఎన్నికైనాను. ఈ నాటకం గోండు భాషలో చూస్తూంటే మా ఇంటికి పోయినట్లు ఉంది. ఇది చూస్తుంటే నాకు ఆ రోజులలో వారి కష్టాలు కళ్ళ ముందు నిలచి కన్నీరొచ్చింది. చక్కగా నటించన పిల్లలకు నా అభినందనలు. ఈ నాటకం రాసిన వివేక్‌కు ప్రత్యేకమైన అభినందనలు. మీరు ఇంకా ఇలాంటి మంచి నాటకాలు వేసి ఆదివాసుల భాషను వృద్ధిచేయ్యాలని కోరుకుంటున్నా.” అని చెప్పి పిల్లలందరిని తన నివాసంకు తీసుకురమ్మని ఆహ్వానించాడు.
ప్రసాదరావు సార్‌తో “మీరందరూ రేపు టీకి రండి. ఉంటున్నారా? వెళ్ళిపోతున్నారా?” అడిగారు మంత్రివర్యులు.
“మీరు పిలిస్తే తప్పక వస్తాం సార్. ఉంటాం. రేపు మిమ్ముల్ని కలిశాకనే వెళ్ళిపోతాం” అన్నాడు ప్రసాదరావు.
ఫలితాలు కూడా మర్నాడే.
ఆరోజు మిగిలిన నాటకాలు, డ్యాన్సులు చూస్తూ కూర్చున్నారు విద్యార్థులు.
వీరా వచ్చి వివేక్‌ను గట్టిగా వాటేసుకున్నాడు.
“సూపర్ రా! నీకు దండలేసి ఎత్తుకు తిరగాలి” అన్నాడు సంతోషంతో.
* * *
మరుసటి నాడు బహుమతి ప్రదానం జరిగింది. ఈసారి మామిడిపల్లి గిరిజనపాఠశాలకు యోగా, నృత్యము మరియు నాటకంలో ప్రథమ బహుమతి వచ్చింది.
పేపర్ల వాళ్ళు పిల్లలతో, వివేక్, మధుసార్‌లతో ఇంటర్యూ తీసుకున్నారు. అందరివీ కలిపిన ఫోటోలతో మెయిన్‌ ఎడిషన్‌ పేపరు వెనక పేజీ నిండా ‘ఢంకామ్రోగించిన ఆదివాసీలు’ అంటూ ఆర్టికల్స్.
ఆ రోజు సాయంత్రం మంత్రి గారి దగ్గరకు వెళ్ళారు. అందరినీ కూర్చోపెట్టి, అందరికీ సమోసా, చాయ్‌ ఇప్పించాడాయన.
పిల్లలందరికీ ఐదు వందల రూపాయుల బహుమతి, పుస్తకాలు, పెన్నులు ఇచ్చారు.
“బట్టలు కుట్టించుకోండి!”అన్నాడాయన నవ్వుతూ “ఎందుకుసార్ ఇవ్వన్నీ!” అన్న మాటకు.
అందరితో ఒక గ్రూపుఫోటో తీసుకున్నారు.
ప్రసాదరావుసార్‌ మంత్రిగారిని మామిడిపల్లి గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించమని ఆహ్వానించాడు. మంత్రిగారు “సరే. తప్పక వస్తాను. మీ డాన్సులు చూసి, మీ స్కూలు చూసి వెడతా. నేను నా జిల్లా పర్యటనలో ఈ సారి వస్తాను” అని మాట ఇచ్చారు.
అందరూ మంత్రిగారికి నమస్కారం పెట్టి వెనుతిరిగారు. ఆ సాయంత్రం మామిడిపల్లి మర్లారు.
పిల్లల సంతోషం చెప్పనలవికాదు. మధు సార్ కూడా పుల్‌కుష్ గా ఉన్నాడు. ప్రసాదరావు సార్‌ వాళ్ళతో వచ్చాడు. వివేక్ కూడా వచ్చేశాడు. ఎందుకంటే అతను ఆ వారము మధ్యలో ఒకరోజు ఇంటికెళ్ళి తల్లితో ఉండి వచ్చేశాడు కాబట్టి.
మామిడిపల్లి చేరినా వారిలో గెలుపు తాలూకు సంతోషం తగ్గలేదు.
ఒక వారం రోజులు వారంతా ఆ గెలుపు గురించే మాట్లాడుకున్నారు.
***
“కొమరం భీం” గోండు భాష నాటకానికి చాలా పేరు వచ్చింది. అన్ని పత్రికలు ఈ నాటకం గురించి, పాత్రధారులైన బాలబాలికల గురించి ఎంతగానే పొగడుతూ రాసాయి. జిల్లాలోని మిగిలిన గిరిజన స్కూల్సు నుంచి ఆ నాటకము తాము కూడా వేసుకోవటానికి అనుమతి కోరుతూ మామిడిపల్లి పాఠశాలకు విజ్ఞప్తులు వచ్చాయి. జిల్లాలో స్కూలు ‌ పేరు, వివేక్‌ పేరు మ్రోగిపోయింది.
మరిన్ని నాటకాలు గోండు భాషలో రాయమని అతనిని మిత్రులు, గిరిజన హితులు అడిగారు.
***
ఒక నెల తరువాత తన జిల్లాపర్యటన వేసుకున్నారు మంత్రిగారు. ఆ పర్యటనలో మామిడిపల్లి స్కూలుకు వస్తున్నారు మరి ఇచ్చిన మాట ప్రకారం.
ఆయనకు స్కూలు బయట ఒక అర కిలోమీటర్ల ముందే స్వాగతం సిద్ధం చేశారు పాఠశాల వారు, ఊరివారు కలసి.
డప్పులతో, వాయిద్యాలతో, గుసాడి నృత్యాలతో, కర్రలు కట్టిన కాళ్ళతో నడుస్తూ కొందరు, కోలాటం ఆడుతూ స్త్రీలు మంత్రిగారికి ఘనస్వాగతమిచ్చి పాఠశాలకు తీసుకువచ్చారు.
ఆ స్వాగతానికి ఎంతగానో సంతోషపడ్డాడు మంత్రివర్యులు.
ఆయన ఆ స్కూలు ఇన్‌ఫ్రాస్టక్చర్ చూసి ముచ్చట పడ్డాడు.
టీచర్ల నిబద్ధతా, పిల్లల చురుకుదనం ఆయనను విశేషంగా ఆకర్షించాయి. మెయిన్ రోడ్డు నుంచి కనీసము స్కూలు వరకన్నా రోడ్డు సాంక్షన్‌ చెయ్యమని రాజుసార్ తన విజ్ఞాపనలో అడిగాడు.
స్కూలు రిపోర్టు గురించి చెబుతూ ఎందరికో మార్గదర్శకమైనదని, చుట్టు ప్రక్కల ముప్పది తాండాల ప్రజలకు జ్ఞానదీపికగా ఈ స్కూలు ఉందని వివరించాడు.
మంత్రిగారి ముందు గుసాడి నృత్యాలు చేశారు పిల్లలు. కోలాటం ఆటలు సాగాయి.
పెద్దలు కూడా స్కూలు గ్రౌండులో కోలాటము ఆడారు. మగవారు గజ్జే కట్టి డప్పులతో నృత్యం చేశారు. వారు మంత్రిగారిని కూడా తమతో స్టెఫ్ వెయ్యమని లాగారు. ఆయన కూడా వచ్చి వారితో కలసి రెండు స్టెప్స్ వేసి వచ్చి కూర్చున్నాడు.
అందరూ ఆయన నృత్యం చూసి కేరింతలు కొట్టారు.
స్త్రీలు దింస్సా నృత్యము, బతకమ్మ ఆడారు.
గ్రామ సర్పంచు వచ్చి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యమిప్పించమని అడిగాడు.
గిరిజనులు ఎందరెందరో మంత్రిగారిని చూడటానికి వచ్చి, సాంప్రదాయబద్ధంగా పూసల దండలతో ఆయన మెడను అలంకరించారు.
ఆ వేడుకంతా గిరిజన పాఠశాలలో జరిగింది.
అటుపై ఊరి పెద్దకు, టీచర్లుకు మంత్రిగారితో కలిసి విందు. స్కూలు డైనింగు హాల్ లో జరిగింది.
ఆయన విందు చేసి, చెయ్యగలిగినన్ని పనులు చేస్తానని హామి ఇచ్చి వెళ్ళాడు.
***
మంత్రిగారు వేళ్ళాక వాన వెలిసినట్లుగా అనిపించింది వాతవరణం. అంత వరకు కెమేరా, టీవీవారు, పత్రికా విలేఖరులు, జిల్లా యంత్రాగం, కలెక్టరూ ఎంతో మంది దాదాపు ఇరువై వాహానాలలో వచ్చి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తరువాత టీచర్లుకు ఊపిరి తిరిగి ఆడటం మొదలైయింది.
ఊరి స్త్రీలు ఇంకా బతకమ్మ ఆడుతూనే ఉన్నారు. వారు బడి నుంచి ఊరి మధ్యకు నడిచారు ఇప్పుడు. ఆ బతకమ్మ తరువాత మళ్ళీ పురుషులు గజ్జే కడుతారు. గిరిజనులకు ప్రతీదీ పండుగే. వారికి వారిని చూడటానికి మంత్రి వచ్చాడని చెప్పనలవికాని ఆనందములో ఉన్నారు.
స్టాఫ్ రూములో కూర్చున్న వివేక్‌కు ప్రక్కన ఉన్న టీచర్ల మాటలు వినపడుతున్నాయి.
“చాలా హాడావిడి పడ్డాము పది రోజులుగా. ఇంక నేను ఒక రోజు సెలవు పెట్టి పడుకోవాలి” అన్నది సుధా మేడమ్.
“నాగలక్ష్మి వచ్చింది చూశారా?” అన్నది మణి టీచర్‌.
“అవునా. నే చూడలేదే!” అన్నది సుధా మేడమ్.
“నాగలక్ష్మి ఎవరు మేడమ్?” అడిగాడు ప్రక్కనే ఉన్న వివేక్.
“ఆమె లొంగిపోయిన నక్సలేట్. ఐదేళ్ళ క్రితం అక్కడ కలెక్టరు దగ్గర తుపాకీ ఇచ్చి లొంగిపోయింది. అప్పట్నించి చాలా హెల్పు చేస్తుంది జనాలకు. మన స్కూలుకు కూడా కావల్సిన సాయం చేస్తుంది. వచ్చి కూరగాయాలు తరగటం నుంచి ఏ హెల్పు కైనా ముందుకొస్తుంది…” చెప్పింది మణి మేడమ్.
“ఆమెను నేను కలవచ్చా?” అడిగాడు వివేక్.
“బతకమ్మ ఆడుతోంది. అయ్యాక రమ్మంటే సరి” అన్నారు వాళ్ళు.
“నేనే వెడతా ఆమెను కలవటానికి!” అంటూ వివేక్ బయటకు నడిచాడు.
***
వివేక్ ఊరి నడిమికి వెళ్ళే సరికే స్త్రీలు ఇంకా బతకమ్మ ఆడుతున్నారు.
అతను ప్రక్కగా కూర్చొని చూస్తున్నాడు. కొందరతనిని చూసి మంచం మీద కూర్చొమని మంచం వేశారు.
వివేక్‌ కూర్చొని ప్రక్కనున్న వారిని “నాగలక్ష్మి ఎవరు అందులో?” అన్నాడు.
వాళ్ళు బతకమ్మ ఆడుతున్న స్త్రీలలో పసుపురంగు చీర కట్టిన ఆమెను చూపారు.
నాగలక్ష్మికి యాభై సంవత్సరాలు ఉంటాయేమో. మనిషి ధృడంగా ఉంది. ఎలాంటి కష్టమైనా నాకేంటి అన్న ధీమా కనపడుతోంది ఆమె కదలికలలో.
వారి ఆట ఆగింది. ఇక పురుషులు మొదలెడుతున్నారు.
వివేక్ ఆమెను పిలిచాడు.
“అమ్మా! నీవేనా నాగలక్ష్మివి?” అడిగాడు.
“అవును సారూ! నీవేనంటగదా గోండు కొమరం భీం దాదా మీద నాటకం రాసింది. ఇంకా మస్తు మంది ఉన్నరు. వాళ్ళ మీద కూడా రాయి. ప్రజలకు తెలుస్తుంది. ఇట్ల పాటలతో, నాటకాలతోనే మన వాళ్ళను ప్రపంచానికి చూపాలి” అన్నది.
ఆమె సూటిగా చూస్తూ మాట్లాడటంలో మనిషిలోని నిజాయితి తెలుపుతోంది. ‘కష్టనష్టాల కోర్చిన మనిషి ఈవిడ’ అనుకున్నాడు వివేక్‌ ఆమెను చూసి.
“అమ్మా! తప్పక రాస్తా. నీవు వాళ్ళ చరిత్రలు చెప్పు. ముందు ఇది చెప్పు నీవు లొంగిపోయిన నక్సలేట్‌ వని చెప్పారు. నిజమేనా?”
“నా మీద కూడా రాస్తావా?” అంటూ గలగల నవ్వింది ఆవిడ.
“రాయాలి. నీధైర్యం ప్రజలకు తెలియాలి. నిన్ను చూసి వాళ్ళూ ధైర్యపడటం తెలుసుకోవాలిగా!”
“సరేలే పట్టు. నీకు మా రాజుల గురించి చెబుతాను పట్టు…” అన్నదామె.
“నీవు మా హస్టల్‌కు రా. అక్కడ నా నోట్సులు ఉన్నాయి. నీవు చెప్పేది రాసుకోవాలిగా!”
“సరే ఇప్పుడు రానా?”
“సరే నీ ఇష్టం” అన్నాడు లేస్తూ.
“వస్తా! వీళ్ళ డాన్సు ఆగాక” అంది నాగలక్ష్మి కూర్చుంటూ అక్కడే.
వివేక్ వచ్చేస్తుంటే రాము వచ్చి కలిశాడు. “అభినందనలు మిత్రమా! నీ పుణ్యానా ఈ ఊరికి మంత్రి వచ్చాడు. రోడ్డు కూడా వస్తే మనకు కొంచం బెటరుగా ఉంటుంది!” అంటూ.
నవ్వాడు వివేక్.
ఇద్దరూ స్కూలు వైపు సాగారు.
“ఇప్పుడే నాగలక్ష్మిని కలిశాను. ఆమె లొంగిపోయిన నక్సలేట్ అంటగదా!” అన్నాడు వివేక్‌.
“అవును. నక్సలేట్స్ ఎట్లా వచ్చారో అడుగు చెబుతుంది ఆమె. ఆమెది ఫస్టుహ్యాండు ఇన్‌ఫర్మేషను కదా!”
“సరే!” అంటూ స్కూలు ప్రాంగణములోకి ప్రవేశించాడు. రాము సాగిపోయాడు ముందుకు.

ఇంకా వుంది..

1 thought on “మోదుగపూలు – 13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *