March 4, 2024

యాత్రామాలిక – బెంగళూరులోని అమ్మవారి ఆలయాలు

రచన: రమా శాండిల్య

శ్రావణమాసం సందర్భంగా, బెంగుళూర్ లోని కొన్ని అమ్మవార్ల దేవాలయాలను గురించిన వివరాలు. అన్నీ నేను దర్శనం చేసుకున్న అమ్మవారి ఆలయాలను గురించి మాత్రమే వ్రాస్తున్నాను.
అవి, బనశంకరీ, గంగమ్మ, రాజరాజేశ్వరి, శృంగేరి శారదామాత కొలువైన శంకర మఠం, అన్ణమ్మ, సోమేశ్వరాలయంలో ఉన్న కామాక్షి అమ్మవారు, సుందరేశ్వర సమేత మీనాక్షి అమ్మవారు, సూర్య దేవాలయంలో ఉన్న వైష్ణవి మాత, గవి గంగాథరుడి ఆలయంలో కొలువైన పార్వతి, సప్తమాతృకలు, బందాకాళీ ఆలయాలను గురించి తెలుసుకుందాము.

***

1. బనశంకరీ మాత! ఈ ఆలయం వందల సంవత్సరాల క్రితమే ఉండేదట. అక్కడంతా పెద్ద అడివి ఉండేదట. అమ్మవారు, ఆ పచ్చని వనమంతా తిరుగుతూ అందరిని కాపాడుతూ ఉండేదట. ఆ వనాలలో తిరిగే పార్వతి అమ్మావారే ఈ వనశంకరీమాతగా ఉద్భవించిందనీ, ఆమె బనశంకరిగా నామాంతరం చెంది ఆ ప్రాంతం వారికే కాక కర్ణాటకలో ప్రజలందరి కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా ఉన్నదని చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని ఆమె పేరు తోనే బనసంకరీ అని పిలుస్తారు.
ఇక ఆలయంలోని అమ్మవారు ఏ సమయంలో దర్శించినా కూడా చాల ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడ రాహు, కేతు వుల గ్రహదోష నివారణార్థం శుక్ర, మంగళ వారాల్లో నిమ్మకాయ డిప్పల్లో దీపాలు వెలిగిస్తారు. చూడ రెండు కళ్ళూ సరిపోవనిపిస్తుంది.
అమ్మవారిని వెన్నతో అలంకరిస్తూ ఉంటారు. కర్ణాటకలో అమ్మవారి ఆలయంలో అమ్మవారిని అలంకరించే పద్ధతి చాలా బావుంటుంది.
బెంగుళూర్ వచ్చినవారు బనసంకరీ అమ్మవారిని తప్పక దర్శించుకోవాలి. ఈ ప్రాంతాన్ని, ‘బనశంకరి’ అనే పిలుస్తారు. మెట్రో స్టేషన్ లో స్టేషన్ పేరు కూడా బనశంకరి అనే చెప్పాలి.

***

2. గంగమ్మ దేవాలయం: ఈ దేవాలయానికి ఒక ముఖ్యమైన కారణంతో తప్పక మొక్కుకుని వస్తారుట… అదేంటంటే, ఇళ్లల్లో, పొలాల్లో నీరు సరిపోవటం లేదని బావులు, బోర్ బావులు, కాలువలు, చెరువులు మొదలైనవి మొదలు పెట్టాలనుకుంటే, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, ఆడ పిల్లలకు పెళ్లిచేసే ముందూ కర్ణాటక చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న వారుకూడా, ‘మల్లేశ్వరం లోని గంగమ్మ దేవాలయానికి’ తప్పకుండా వచ్చి దర్శించుకుంటారుట.
అమ్మవారిని చూడటానికి చాలా అదృష్టం ఉండాలట… అదికూడా ఉదయం, మధ్యాహ్నం హారతి ఇచ్చేసమయంలో అమ్మవారిని చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే, అమ్మవారికి హారతి ఇచ్చేసమయంలో అమ్మవారి కళ్ళు హారతి ఎటుతిరిగితే ఆమె చూపు ఆటే చూస్తున్నట్లు ఉంటుంది. అద్భుతంగా అనిపించింది.
ఈ ఆలయం బెంగుళూర్ లోని, ‘మల్లేశ్వరం’ అనిచోట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. నీటికి సంబంధించిన ఏ పనులువున్నా అమ్మవారికి ఒకమాట మనసులో అయినా చెప్పుకుంటే అవుతుందనే నమ్మకం ఇక్కడివారందరికి!!

***

3. శృంగేరి శారదా అమ్మవారు!
ఈ దేవాలయం పూర్తిగా శృంగేరిలో ఎలా పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయో అలాగే జరుగుతాయి. చాలా విశాలమైన ఆవరణతో, అందమైన గోపురాలతో ప్రతి అనువులోనూ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడే చాతుర్మాస దీక్షకోసం స్వామీజీ, రెండు నెలలపాటు ఉండి వెళ్లారు.
సౌందర్యలహరి, లాలితాసహస్ర పారాయణాలు చేసుకుంటూ కనిపిస్తుంటారు. తమిళనాడు, కర్ణాటక రాష్టాలలో స్త్రీలకు, ఒక మంచి అలవాటు ఉంటుంది. తమకొచ్చిన పాటో, పద్యమో, స్తోత్రమో అమ్మవారి ఎదురుగా నుంచుని గొంతెత్తి పాడతారు. అది చాలా నచ్చుతుంది.
బెంగుళూరు, చామరాజు పేటలోని, శంకరపురాలో ఉన్నది.

***

4. అన్ణమ్మ! ఈ దేవాలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఆవిర్భవించి, వెయ్యి సంవత్సరాలు పైనే అయింది. ఇక్కడి అమ్మవారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఉద్భవించిందని చెబుతారు.
ఆషాఢమాసం ఈ ఆలయదర్శనం చెయ్యని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ దిష్టి, బ్లాక్ మేజిక్ మొదలైనవి ఉంటే తగ్గించటానికి గుడి ముందు ఉప్పు వేస్తారు. ఇక్కడకు వచ్చేవారందరూ ఇళ్లనుంచి పెరుగన్నం తెచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ముఖ్యంగా చంటిపిల్లలను, బాలింతలు ఎత్తుకుని అమ్మవారి ఒడిలో పడుకోపెట్టి తెచ్చుకుంటారు.
ఇక్కడ ఆలయమంతా నిలువెత్తు అమ్మవార్ల విగ్రహాలతో నిండి ఉంటుంది. ఆ మూర్తులన్నింటికి కూడా పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. ఆ గుడిలోకి వెడుతుంటే ఎవరికైనా ఒక భక్తి భావం ఉంటుంది. ఆషాఢంలో మరీ ఎక్కువగా పూజలు అవుతూ ఉంటాయట.
ఈ ఆలయం, ‘చిక్ పేట’ అనే చోట ఉంటుంది.

***

5. రాజరాజేశ్వరి అమ్మవారు: RR Nagar లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న ఆ చోటు ఒకప్పుడు పెద్ద అరణ్యంలా ఉండేదట. ఈ ఆలయ నిర్మాణం మొదలు పెట్టిన తరువాత పెద్ద IT హబ్ గా మారి, ఇప్పుడు గోవు పాదమంత ఖాళీస్థలం కనిపించదిక్కడ. అనేక మెడికల్, ఇంజనీరింగ్ కాలేజ్ లు, మెట్రో రైల్ కూడా ఉన్నది. ఈ అమ్మవారి పేరుమీదనే మొత్తం అటుప్రక్క సిటీ అంతా డెవలప్ అయింది.
ఇక అమ్మవారి ఆలయం చాలా విశాలమైన ఆవరణతో, అనేకమంది అమ్మవార్ల నిలువెత్తు చిత్రపాతాలతో, శిల్పాలతో అతి సుందరమైన దేవాలయం. ఇక, అమ్మవారిని గురించి, ఆ వైభవం గురించి చెప్పనలవి కాదు. అంత దివ్యమంగళ విగ్రహము. ఆలయం లోకి వెళ్లి బయటకు రావటానికి ఎక్కువ రష్ లేకపోతే రెండుగంటల సమయం పట్టింది. ఆ ఆలయమంతా తిరగటానికి. వీలైనంతవరకూ తప్పకుండా, బెంగుళూర్ వచ్చిన వారు దర్శించాల్సిన ఆలయమిది.
ఈ ఆలయం బెంగుళూర్ లోని కెన్గేరి అనే ప్రాంతంలోని రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నది.

***

6. బన్ధే కాళీ మాత!! ఈ అమ్మవారిని ఆషాఢమాసంలో తప్పక దర్శించుకుంటారు. మంగళ వారం, శుక్రవారం విపరీతమైన రష్ ఉంటుంది. వెయ్యి సంవత్సరాల పైనే అయిందిట ఈ ఆలయం నిర్మించి. అమ్మవారు స్వయంభువు. కాళీ మాత కాకుండా ఇక్కడ కూడా చాలామంది అమ్మావార్లు, నాగదేవతలు కూడా ఉంటారు.
ఈ గుడి కూడా దిష్టి, చేతబడి, ఇంకా అలాంటివి తీసివేసి ఆలయం. గ్రహస్తితి బాగాలేనివారు కూడా ఇక్కడ పూజలు చేస్తుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషిలోని నెగటివిటి తీసివేసి పాజిటివ్ ని నింపే శక్తి ఉన్న దేవాలయమిది. అమ్మవారు చంటిపిల్లవాడిని ఎత్తుకుని బాలింతరాలిలాగా ఉండే మూర్తి, ఇక్కడవున్న అమ్మవారు. అంటే బిడ్డ జాదూసుకుని పేచీలు పెడుతుంటే ఊరుకోపెట్టే తల్లిలాంటిది. ఇక్కడికి వచ్చేవారందరూ ఏదో ఒక బాధలో వచ్చి అమ్మవారితో విన్నవించుకుంటారు. కోరిక తీరాక మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకొంటూ ఉంటారు.
అమ్మవారు ఒక కొండరాయిమీద వెలసింది. అక్కడే గుడి కట్టారు. ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా మనకు తెలియకుండా సమయం గడిచిపోతుంది. చాలా విశాలమైన ఆవరణతో అమ్మవారి ఆలయాలతో నిండి ఉంటుంది.
ఈ ఆలయం గవీ నగర్, కేంపెగౌడ అనిచోట ఉన్నది.

***

బెంగుళూర్ లోని ఆలయాలలో అమ్మవారులందరికి అలంకారం చేసే పద్ధతి చాలా బావుంటుంది. పూల అలంకారం చాలాబాగా చేస్తారు. ఇక్కడ వసంత నవరాత్రులు, ఆషాఢ, శ్రావణ మాసాలు, దసరా నవరాత్రులు చాలా బావుంటుంది. గుడిమొత్తం రంగురంగుల పువ్వులతో అలంకరిస్తారు. గుడిలో అర్చకులు, చెయ్యి జాపి అడుక్కోకుండా, భక్తుల గోత్రనామాలనడిగి మరీ అర్చన చేయిస్తారు.

ఎవరికైనా దేవాలయానికెళ్లామన్న తృప్తి ఉంటుంది.

లోకాసమస్తాసుఖినోభవంతూ

1 thought on “యాత్రామాలిక – బెంగళూరులోని అమ్మవారి ఆలయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *