June 24, 2024

వెంటాడే కథలు 11 – బేబీ సిట్టర్

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

*********************************

అది ఒక ప్రైవేట్ బ్యాంకు.
ఖాతాదారుల హడావుడితో సందడి సందడిగా ఉంది. వాళ్ళు ఆ కౌంటర్ నుంచి ఈ కౌంటర్ కు ఈ కౌంటర్ నుంచి ఆ కౌంటరుకు పరుగులు తీస్తున్నారు. ఉద్యోగులతో కొందరు కటువుగా మాట్లాడుతుంటే మరికొందరు గౌరవంగా
మాట్లాడుతున్నారు.

ఉద్యోగులూ అంతే! కొంతమందిపై అరుస్తున్నారు. ఇంకొందరితో మర్యాదగా వ్యవహరిస్తున్నారు.
ఏమైతేనేం? ఎవరికి వారు అందరూ తమ తమ పనుల్లో హుషారుగా మునిగితేలుతున్నారు. సహోద్యోగులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు..
ఎవరిలో చూసినా ఉత్సాహం ఒక్క ఉషా భాటియాలో తప్ప!
విపరీతమైన తలనొప్పితో ఆమె కణతలు నొక్కుకుంది. అరగంట క్రితం మింగిన మాత్ర ఏమాత్రం జవాబు చెప్పలేదు. ..బామ్ పట్టించినా ప్రయోజనం లేకపోయింది.
ఉషా భాటియా ముంబై మహానగరంలో సర్కార్ రోడ్ లో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్.
భర్త రమేష్ భాటియా పెద్ద ప్రైవేటు కంపెనీలో డివిజనల్ మేనేజర్. నెలలో సగం రోజులు క్యాంపుల మీద దేశాలు, నగరాలు తిరుగుతుంటాడు.
వారిద్దరి జీవితంలోకి ఎనిమిది నెలల క్రితం ముద్దులు మూటగట్టే ఒక బాబు వచ్చాడు. వాడంటే ఇద్దరికీ పంచప్రాణాలు. మెటర్నటీ లీవ్ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కేర్ టేకర్ కమ్ బేబీ సిట్టర్ ను ఇంట్లోనే ఉంచి ఉష బ్యాంకుకు వస్తోంది.
బేబీ సిట్టర్ గా కుదిరిన రేష్మ కూడా మంచి అమ్మాయి. వయసు పదహారేళ్లు. కళగల మొహం. మనిషి కూడా శుభ్రంగా ఉంటుంది.. కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. మాతృభాష కనుక మరాఠీలో రాయడం చదవడం నేర్చుకుంది. చేరిన నెల రోజులకే నమ్మకస్తురాలిగా యజమానుల మనసు చూరగొంది.
బాబు తినడానికి రకరకాల ఖరీదైన బిస్కెట్లు, పండ్లు, చాక్లెట్లు, ఇతర తినుబండా రాలు, డ్రైఫ్రూట్స్, పళ్ళ రసాలు, పాలు అన్నింటినీ అందుబాటులో ఉంచి ఉష బ్యాంకుకి వస్తూ ఉంటుంది.

ఏమిటో ఇవాళ ఉదయం నుంచి ఒకటే తలనొప్పి! రమేష్ క్యాంపుకి వెళ్ళాడు. నాలుగు రోజుల దాకా అతని దర్శనం ఉండదు. పోనీ సెలవు పెడదామంటే బ్యాంకులో బండెడు చాకిరీ! తన సహోద్యోగి అమృత కరంజియా డెలివరీకి వెళ్ళడంతో ఉషకు డ్యూటీకి రాక తప్పడం లేదు.
పసివాడు ఎట్లా ఉన్నాడో అనుకుంది. భయం లేదులే.. రేష్మ తెలివైన పిల్ల.. మంచి పిల్ల! బాబుని ప్రాణప్రదంగా చూసుకుంటుంది. ఆ ధైర్యంతోనే కదా తను తిరిగి ఉద్యోగంలో చేరింది. అక్కడికీ రమేష్ చెప్పాడు పోనీ జాబు కొన్నాళ్లు మానేయొచ్చు కదా అని. లేదంటే లాంగ్ లీవ్ పెట్టమన్నాడు. కానీ తనే ఒప్పుకోలేదు. వచ్చే జీతాన్ని వదులుకోవడం ఎందుకు? నాలుగు రూపాయలు ఈ వయసులో వెనకేసుకుంటే భవిష్యత్తులో బాబు చదువుకి, తమ భద్రతకి ఉపయోగంగా ఉంటుంది అని అతనితో వాదించి మొండిగా తిరిగొచ్చి ఉద్యోగంలో చేరింది.
‘అబ్బా ఏమిటీ తలనొప్పి ఇలా పట్టుకుంది? ఇందాక బాయ్ తో కాఫీ కూడా తెప్పించుకునే తాగింది. మాత్ర మింగినా ఫలితం కనపడలేదు. తల పగిలి పోయేలా ఉంది. అంత నొప్పితో పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతోంది.
ఇక లాభం లేదనుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని మేనేజర్ గదిలోకి నడిచింది ఉష.
ఏమిటన్నట్టు చూసాడు ఆయన.
”సార్ ఉదయం నుంచి తలనొప్పి. తగ్గిపోతుందిలే అనుకుని వచ్చాను తగ్గకపోగా పెరిగిపోయింది సార్! టెంపరేచర్ కూడా ఉందనిపిస్తోంది ప్లీజ్ ఇంటికి వెళ్తాను సార్” అంది దీనంగా.
బాధతో వేలాడిపోతున్న ఆమె ముఖం చూసి మేనేజర్ పరిస్థితి అర్థం చేసుకుని వెళ్ళమన్నట్టు తల ఊపాడు.
ఆయనకు నమస్కారం చేసి తన లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పార్కింగ్ ప్లేస్ కి వచ్చిందామె.
కార్లో కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి లంచ్ చేసింది. నీళ్లు తాగింది. కాస్త ఓపిక వచ్చినట్టు అనిపించింది. తర్వాత మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలు దేరింది. అక్కడికి ఆమె ఇల్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిషోర్ కుమార్ పాటలు తక్కువ శబ్దంతో వింటూ డ్రైవ్ చేస్తోంది ఉష. ఆ సమయంలో కూడా విపరీతమైన ట్రాఫిక్! మెల్లగా ట్రాఫిక్ ను చీల్చుకుంటూ కారు ముందుకెళ్తోంది.
ఆజాద్ మియా కేఫ్ చౌరస్తాకి వచ్చేసరికి రెడ్ లైట్ పడింది. కారు ఆగింది. కళ్ళు మూసుకుని పాటలు వింటూ కూర్చుంది ఉష. ఇంతలో అద్దం ఎవరో తట్టిన చప్పుడు! కళ్ళు తెరిచి చూస్తే బిచ్చగాడు.. ధర్మం చేయమని దణ్ణం పెడుతున్నాడు. ఆశగా ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు
కిటికీ అద్దం దించి హ్యాండ్ బ్యాగ్ లోంచి చిల్లర తీసి అతని చేతిలో వేస్తూ అనుకోకుండా ట్రాఫిక్ లైట్ పోల్ దగ్గర ఉన్న ఒక బిచ్చగత్తెను చూసింది ఉష. ఆ బిచ్చగత్తె చేతిలోని ఓ పసివాడికి ఒళ్ళంతా రక్తం ఓడుతూ ఉంది.
‘అబ్బా ఎలాంటి మనుషులు వీళ్ళు! అడుక్కోడానికి కూడా పసిపిల్లల్ని ఎండలో తిప్పుతారు. ఒళ్లంతా ఎర్రటి రంగో రక్తమో రాస్తారు. ఎందుకు? ఇదంతా ఎందుకు ఎదుటివారి మనసులని కరిగించడం కోసమే కదా? నాలుగు రూపాయల సంపాదనకే కదా?’ అనుకుంది. కానీ ఆ బిడ్డను చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. పసికందు పూర్తిగా కనపడట్లేదు బిచ్చగత్తె కొంగు అడ్డం ఉండటం వలన!
‘సరేలే ఇలాంటి వాళ్లు ఇంతే! ఈ బిచ్చగాళ్లు మారరు.. ఈ సమాజం మారదు.. ఈ దేశం మారదు..’ అనుకుని నిట్టూర్చి పచ్చ లైట్ పడటంతో కారు స్టార్ట్ చేసింది ఉష.
సరిగ్గా ముప్పావు గంట తర్వాత ఇంటికి చేరిన ఉష అలసిపోయి శోష వచ్చినట్టు అయిపోయింది.
నిలుచునే శక్తి లేక గోడ మీద వాలిపోయి కాలింగ్ బెల్ కొట్టింది.
ఎంతకీ తలుపు తెరుచుకో లేదు. రేష్మ బాత్రూం కి వెళ్ళిందా? లేక నిద్ర పోతోందా? లేకపోతే బాబుకు పాలు పడుతోందా? అనుకుంటూ ఐదు నిమిషాలు అలాగే నిలబడి ఉంది. అంతలో మెల్లగా కిటికీ తలుపు తెరుచుకుంది. వెలుపల ఉన్న తనను చూసి రేష్మ ముఖంలో రంగులు మారడం ఉష గమనించింది.
సాయంత్రం ఎప్పుడో రావలసిన యజమాని ఒంటి గంటకే రావడం వల్ల కంగారు పడింది అనుకుంది ఉష.
తలుపు తీసింది రేష్మ. ఆమె ముఖంలో భయం జాడలు స్పష్టంగా దోబూచు లాడుతున్నాయి. అలసటతో వచ్చి సోఫాలో కూలబడ్డ యజమానురాలి కోసం ఫ్యాన్ వేసి లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది రేష్మ.
చల్లటి మంచినీళ్ల గ్లాసు అందుకుంటూ “బాబు పడుకున్నాడా?” అడిగింది ఉష.
అవునన్నట్టు తల ఊపింది రేష్మ.
చల్లటి మంచినీళ్లు తాగడంతో ఉషకు కాస్త ఊపిరి లేచి వచ్చినట్టయింది.
”కాస్త ఒక కప్పు టీ పెడతావా?” అడిగింది రేష్మను.
అలాగే అన్నట్టు తలూపి కిచెన్లోకి చరచరా నడిచింది రేష్మ.
ఈలోగా హాల్లో ఉన్న వాష్ రూమ్ కి వెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి టీ కోసం సోఫాలో కూర్చుంది ఉష.
సాధారణంగా ఆఫీస్ నుంచి వచ్చిన డ్రెస్ తో ఆమె ఎప్పుడూ బాబు దగ్గరికి వెళ్ళదు.
అందుకే టీ తాగి బట్టలు మార్చుకుని వెళ్ళాలనుకుంది.
కానీ ఇవాళ ఎందుకో బాబును ఒకసారి చూడాలనిపించింది. మెల్లగా లేచి గదిలోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద బాబు లేడు. ఉయ్యాలలో కనిపించలేదు. దాంతో కంగారుపడి ”రేష్మ.. రేష్మ” అంటూ పిలిచింది. కాదు భయంగా హాల్లోకి వచ్చి గట్టిగా అరిచింది.
పాలిపోయిన మొహంతో రేష్మ వచ్చి ఆమె ఎదుట నిలబడింది.
“బాబు పడుకున్నాడన్నావ్ ఏడి? ఎక్కడ? ” ఆడపులిలా చూస్తూ అడిగింది ఉష.
రేష్మ తలవంచుకుని నిలబడింది కానీ జవాబు చెప్పలేదు.
ఉషకు కోపం నషాలానికి తాకింది.
“అడిగేది నిన్నే ఏం చేశావు నా బాబుని?” అని ఆమెను గట్టిగా కుదిపేస్తూ అడిగిందాకన్నతల్లి.
రేష్మ దిక్కులు చూస్తూ నిలబడింది తప్ప పెదవి విప్పలేదు. జవాబు చెప్పలేదు.
జరగరాని దేదో జరిగిందని భయపడుతున్న ఉష కోపాన్ని పట్టలేక “చెప్పవే రాక్షసీ .. నా బిడ్డ ఏది? ఏం చేశావు?” అంటూ ఎడాపెడా చెంపలు వాయించేసింది.
”వాళ్లు సాయంత్రం తెస్తారమ్మ”
నూతిలో నుంచి మాటలు వచ్చినట్టు మెల్లగా అంది రేష్మ.
“ఎవరు వాళ్ళు? సాయంత్రం తేవడం ఏంటి? ఇంతకీ ఎవరికిచ్చావు నా బాబును.. ముందది చెప్పు? అసలు ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ తంతు? నా కొడుకుని ఏం చేశావు? ఎవరికిచ్చావు?” హిస్టీరియా వచ్చిన దానిలా అరుస్తూ రేష్మను ఎడాపెడా కొట్టింది ఉష.
ఈ అలజడికి ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళు అక్కడికి చేరారు.
బాబు మాయమయ్యాడని తెలిసి నివ్వెర పోయారు.
రేష్మను బండ బూతులు తిట్టారు.
భాటియా నేల కూలబడి ఏడుస్తూనే ”నా కొడుకుని ఏం చేసావు చెప్పవే నీకు దండం పెడతాను.. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎక్కడున్నాడో చెప్పు చాలు.. నేనే వెళ్లి నా కొడుకుని తెచ్చుకుంటా” అంటూ రేష్మ పాదాలపై పడింది.
”ఆ పాడుముండ కాళ్లపై మీరు పడడం ఏమిటి మేడం? పోలీసులకు అప్పజెబితే వాళ్ళే కుళ్ళబొడిచి దాంతో నిజం కక్కిస్తారు” అన్నాడొకాయన.
పోలీసుల మాట అనగానే రేష్మకి భయం వేసింది.
”అమ్మా పోలీసులొద్దు.. బాబుకు ఏమి కాదు.. ఇంకాసేపట్లో వచ్చేస్తాడు” అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ.

అసలేం జరిగింది అన్న ప్రశ్నకు –
రేష్మ చెప్పిన విషయం విని ఉష గుండెలు గుబగుబలాడాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా తెల్లబోయారు.
రెండు రోజులుగా ఉష, ఆమె భర్త ఆఫీసులకు వెళ్ళగానే ఆ ఇంటికి ముసలిది ఎవరో వచ్చి పసిబాబుని తీసుకెళ్తుందోట. అందుకు గాను ప్రతిరోజు రేష్మకు రెండొందలు ఇస్తానని, బాబుని మళ్ళీ క్షేమంగా సాయంత్రం వేళ తల్లి తండ్రులు వచ్చేలోగా తిరిగి తెచ్చి ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుందట.
రెండొందల రూపాయలంటే మాటలా? రోజుకు రెండొందలు అదనంగా వస్తాయని ఆశపడి ఆమెకు బాబును ఇస్తున్నానని ఆమె ఎవరో తెలియదని నిన్న కూడా అలాగే పట్టుకెళ్ళి సాయంత్రం వేళ ఉష రాకముందే తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పింది రేష్మ.
ముసల్ది బాబును సాయంత్రం తెచ్చివ్వగానే శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించి ఫ్రెష్ డ్రెస్ వేస్తున్నానని కూడా ఆమె చెప్పింది.
”ఇంతకీ ఆ ముసల్ది ఎవరు? దాని పేరేంటి ? ఎక్కడ ఉంటుంది ? ” ప్రశ్నలకు రేష్మ దగ్గర జవాబులు లేవు. అందుకే నేల చూపులు చూస్తూ నిలబడింది.
“ఇంకెవరు? అది బిచ్చగత్తో లేదంటే సినిమా షూటింగులకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే మనిషో అయి ఉంటది” అని ఇరుగుపొరుగు జనాల్లో ఒక పెద్దాయన అన్నాడు.
రోదిస్తూనే ఇదంతా వింటున్న ఉష మళ్ళీ ఉగ్ర కాళికలా మారింది.
”ఏమే దొంగ ముండా కనీసం ఆ ముసలావిడ ఎక్కడుంటుందో పేరేమిటో ఎందుకు తీసుకెళ్తుందో కూడా అడిగి చావలేదా? నీకేం పోయేకాలం వచ్చిందే? నీకు అడిగినంత జీతం నెల నెలా దోసిట్లో పోస్తూనే ఉన్నాం కదా? ముష్టి రెండొందల కోసం కక్కుర్తి పడి పసికందును పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే నీ చేతులు విరిగిపోను!” అంటూ మరోసారి రేష్మ మీద పడి కొట్టేసింది ఉష.
ఏ కన్నతల్లి బాధయినా అలాగే ఉంటుంది కదా?
అంతలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చౌరస్తాలో కనిపించిన దృశ్యం గుర్తొచ్చి చటుక్కున లేచిందామె.
రేష్మను, ఇరుగుపొరుగుల్లో ఇద్దరు యువకుల్ని తన కారు ఎక్కించుకొని ఇందాక తనకు అనుమానాస్పదంగా కనిపించిన ఆజాద్ మియా కేఫ్ చౌరస్తాకు బయలు దేరింది ఉష.
రేష్మ పారిపోకుండా యువకులిద్దరూ వెనక సీట్లో ఆమెకు చెరో పక్క కూర్చున్నారు.
పదిహేను నిమిషాల్లో కారు ఆజాద్ మియా కేఫ్ చౌరస్తాకు చేరుకుంది.
చౌరస్తాకు ఒక పక్కగా కారు ఆపి, వెనక సీట్లో వాళ్ళని దిగవద్దని చెప్పి అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న బిచ్చగాళ్ళ దగ్గరికి ఒంటరిగా తనే వెళ్ళింది ఉష. దొరసాని డబ్బులేయడానికి వస్తోందేమో అనుకున్న బిచ్చగాళ్ళు చేటల లో ఉన్న పసికందుల్ని ఆమె ముందుకు చాచి ”అమ్మ ధర్మం.. దొరసాని ధర్మం” రణగొణగా అడుగుతున్నారు.
వాళ్ళల్లో ఒక ముసలి దాని చేటలో ఉన్న తన బిడ్డ ఉద్ధవ్ ని గుర్తించింది ఉష.
అంతే! శివంగిలా ఒక్క ఉదుటన ఆ ముసలి దాని చేటలోని తన బిడ్డను లాక్కుని హృదయానికి గట్టిగా హత్తుకుంది. బిడ్డను ఆ దుస్థితిలో చూసి ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్లు కారాయి. వాడి వంటికి అంటించిన రక్తపు మరకలు, రంగులు అన్ని శుభ్రంగా తుడిచేసింది.
అప్పటిదాకా దొరసాని పైసలిస్తుందని ఆశపడిన ఆ ముసలిది ఆ ఛాయలు ఏమీ కనబడకపోవడంతో నోటికి పని చెప్పింది.
“ఏంటమ్మా నీ దౌర్జన్యం? నా బిడ్డని లాక్కున్నావ్ ఏంటి.. ” అని ఉష మీద తిరగబడింది.
అక్కడ ఉన్న బిచ్చగాళ్లందరూ కూడా ఆ ముసలి దాన్ని సపోర్ట్ చేయసాగారు.
వాళ్ళ గోలలో ఉష గొంతు ఎవరికీ వినిపించని పరిస్థితి!
అంతలోనే అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి విజిల్ వేసి ”ఏంటి ఈ గోల?” అని గట్టిగా అరిచాడు.
ఉష అందాకా తాను అనుభవించిన దుఃఖం.. బిడ్డను చూసిన తర్వాత కలిగిన ఆనందం కారణంగా జరిగిన విషయాన్ని కానిస్టేబుల్ కు వివరించి చెప్పలేకపోతోంది. గొంతు పెగలడం లేదు.
బిచ్చగాళ్ళు అందరూ కలిసి ఉష చేతులోని బిడ్డను లాక్కుపోబోయారు.
పైగా అందరూ ఆ కన్నతల్లిని బూతులు తిడుతున్నారు.
పోలీసుకు కూడా ఏమి అర్థం కాక నిశ్చేష్టుడై చూస్తున్నాడు
ఇదంతా దూరం నుంచి కారులో కూర్చుని గమనిస్తున్న ముగ్గురు పరిస్థితి విషమిస్తోందని గ్రహించారు.
కారు దిగి అక్కడికి వచ్చారు.
అప్పటిదాకా ఉషను బండ బూతులు తిడుతున్న ముసలి దానికి – రేష్మను చూడగానే ముఖంలో రంగులు మారాయి. మెల్లగా అక్కడి నుంచి జారుకోవడం మొదలుపెట్టింది.
అది గమనించి రేష్మ ”మేడం.. ఆ ముసలిది పారిపోతోంది” అని అరిచింది.
వెంటనే ఉష కానిస్టేబుల్ వంక చూసింది సాలోచనగా. ఉషతో పాటు కారులో వచ్చిన యువకులు ముసలిదాని వెంటపడి ఒడిసి పట్టుకున్నారు. బిచ్చగాళ్ళ గుంపు కూడా విషయాన్ని అర్థం కావడంతో వడివడిగా అక్కడ నుంచి వెళ్లిపోవడం మొదలెట్టారు.
ఆ తర్వాత పోలీసులు సమక్షంలో ఆ ముసలిది చెప్పిన విషయాలు విని విలేకరులతో సహా అందరూ కొయ్యబారిపోయారు.
బేబీ సిట్టర్లుగా పనిచేస్తున్న కొందరు యువతులను డబ్బుతో ఆకట్టుకుని ఆయా ఇళ్లల్లో ఉన్న పసికందుల్ని తీసుకుని వెళ్లి ఎండలో పడుకోబెట్టి చౌరస్తాలో డబ్బు అడుక్కుంటున్న బిచ్చగాళ్ల గుంపులు నగరంలో ఎన్నో ఉన్నాయట. కొందరు సినిమా జూనియర్ ఆర్టిస్టులకు పసివాళ్లను గంటకు ఇంత అని అద్దెకిస్తారట. సినిమా వాళ్ళు తమ కథకు తగినట్లు వాళ్ళను గిచ్చి ఏడిపించడం వంటివి ఎన్నో చేస్తారట. ప్రొడ్యూసర్ ఐదువేలో ఆరువేలో పారితోషికంగా ఇస్తే బేబీసిట్టర్ కి రెండు వందలు ఇచ్చి మిగతా డబ్బు జేబులో వేసుకునే ఘనులు చాలామంది ఉన్నారని చెప్పింది.
పిల్లల్ని షూటింగ్ కి ఇస్తే ఆ పూట స్టూడియోలోనే వీళ్ళకి కాఫీ టిఫిన్లు భోజనాలు ఉచితంగా దొరుకుతాయని కూడా చెప్పింది. ఇలాంటి పసికందులను ఎండలో పడుకో పెట్టినప్పుడు ఏడవకుండా ఉండటానికి వాళ్లకి ఏదో ఇంజక్షన్ ఇస్తారని కూడా చెప్పింది. కొంతమంది పిల్లలు కేరుమని ఏడ్చేలా గిచ్చి వాళ్ళ ఏడుపును జాలిగా మార్చి డబ్బు చేసుకుంటారని ఆ ముసలి వివరించింది.
మర్నాడు ఈ వార్త పత్రికల్లో పతాక శీర్షికలలోకి ఎక్కిందని చెప్పక్కర్లేదు కదా?
రెండొందలకు ఆశపడిన రేష్మ ఉద్యోగం ఊడింది.
తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.
పోలీస్ యంత్రాంగం బిచ్చగాళ్ల మాఫియా మీద ఒక కన్నేసింది నిఘా పెట్టింది.
దయగల మహారాజులు కూడా బిచ్చగాళ్లను అనుమానాస్పదంగా చూడడం మొదలెట్టారు.
డబ్బు కన్నా బిడ్డ ముఖ్యమని గ్రహించిన ఉషా ఉద్యోగానికి రాజీనామా చేసింది.

నా విశ్లేషణ:

ఇలాంటి కథలు ఇప్పుడు మనకు ఏ దినపత్రికలో చూసినా సర్వసాధారణం అయ్యాయి. ఇదీ మనం సాధించిన ప్రగతి అని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ మూడు దశాబ్దాల క్రితమే ఇలాంటి ఉదంతాలు ముంబైలో మొదలయ్యాయి అంటే అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ప్రపంచంలోని అన్ని నగరాలకు పాకాయి. కిడ్నాపులతో డబ్బు గుంజటం, పిల్లలను అడ్డం పెట్టుకుని మాదక ద్రవ్యాలు విక్రయించడం, ఖరీదైన హోటళ్లలో వ్యభిచారం, ఆన్లైన్ మోసాలు, వైట్ కాలర్ మోసాలు హద్దు అదుపు లేకుండా సాగిపోతున్నాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం, సమాచార వికేంద్రీకరణ, సీసీ కెమెరాలు, ఖరీదైన సెల్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు వంటివి ఎన్ని అందుబాటులోకి వచ్చినా జరిగే ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇంట్లో కూర్చున్న బేబీ సిట్టర్లలో కొందరు పిల్లలకు పెట్టాల్సిన డ్రై ఫ్రూట్స్, జ్యూస్, బిస్కెట్లు, స్వీట్లు, తాము తింటూ పిల్లల కడుపులు మాడుస్తుంటారు. ఇళ్లలో కదల లేని వృద్ధులకు సహాయకులుగా వచ్చే వారిలో కొందరు ఆ నిస్సహాయులను నానా హింసలు పెడుతున్న వార్తలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. అన్నింటి కన్నాఘోరం అభం శుభం తెలియని పసికందుల్ని ముష్కరుల చేతికి అందిస్తున్నారంటే మనుషులు ఎంత దురాశకి లోనవుతున్నారో ఎంత నిర్దయులుగా మారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రాణం లేని రంగు కాగితాల కోసం మనిషి ఎంతగా దిగజారుతున్నాడో చూస్తుంటే ‘మనిషి’ అన్నవాడికి ఎవడికైనా గుండె నీరవడం ఖాయం. ఒకప్పుడు మనిషి ప్రకృతికి భయపడేవాడు. జంతుజాలానికి, విషసర్పాలకు భయపడేవాడు. ఇవ్వాళ వీటన్నింటికన్నా తోటి మనిషికే భయపడాల్సిన రోజులలోకి విజయవంతంగా వచ్చేశాం.

9 thoughts on “వెంటాడే కథలు 11 – బేబీ సిట్టర్

 1. చంద్ర ప్రతాప్ గారు, ఇది అసలు సిసలైన వెంటాడే కథ. నలభై ఏళ్ళు దిల్లీలో నివసించిన మేము ఎన్నో రకాల గ్యాంగులు, ముఠాలు అవతరించడం, వినూత్న రీతుల్లో మోసాలు మనందర్ని మోసం చేయడం విన్నాం, చదివాం కానీ ఈ కథకి మూల వస్తువైన కొత్త కోణం గురించి మొదటిసారి చదువుతున్నాను. చేయడానికి పెద్ద తప్పుపనైనా, రోజు సాయంత్రం బాబుని తప్పక అప్పచెబుతారన్నది గొప్ప నమ్మకం పై ఈ దందా సాగడం ఆలోచించదగ్గ విషయమే. అదే మనని ఈ కథ గురించి వెంటాడిస్తుంది. కృతజ్ఞతలు. టి. సంపత్ కుమార్, దిల్లీ.

  1. సంపత్ గారు మీరు చెప్పింది సత్యం. ఒక నమ్మకంతో సాగే వ్యాపారం కానీ ఇందులో ఎంతో అమానుషం దాగి ఉండటం బాధాకరం అందుకే ఇది మీరన్నట్టు ఎప్పటికీ వెంటాడే కధే

 2. చాలా మంచి ప్రయత్నం అండి ..తెలుగులో ఇదివరకు ఇలా ఎవరూ చేసి ఉండరు ..ఆ కథ, దాని విశ్లేషణ, ఎవరికైనా గుర్తుందా అన్న పరిశోధన .. అన్నీ కలగలిపి ఉన్నాయి ..అభినందనలు అండి ..కొనసాగించండి ..

  ముకుంద రామారావు
  హైదరాబాద్

  1. చాలా మంచి ప్రోత్సాహం అందించారు మీరు. మీలాంటి సాహితీవేత్తల ప్రోత్సాహం నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వడం ఖాయం ముకుంద రామారావు గారు.

 3. కథ చదువుతున్నప్పుడు కథ మనకి అర్థం అవుతున్నా చివర్లో తల్లి అపోహపడుతుందేమో నిజం కాదేమో అని ఎదురు చూస్తుంటాము. కారణం పేదవారు అలా చేయరు, ఉన్నతం అనుకుంటున్న వారిలో సంస్కారం వుండదు అని చెప్పటానికి ప్రయత్నిస్తాం. కానీ ఇలా జరుగుతుంది అంటే జీర్ణించుకోవడం కష్టం అయినా కూడ ఆ కన్నతల్లి కన్నా మనకే ముందు ఒళ్ళు గగుర్పాటుకి గురై కోపం వస్తుంది. సెంటర్ లో బిచ్చగాళ్ళని చూస్తే ఈ వెంటాడే కథ మనల్ని వెంటాడుతుంది. అంత బాగా రాసారు. ఏ భాష రచనోగానీ రచించిన రచయితకు, ఇక్కడ అందించిన మీకు ధన్యవాదాలు.

  1. సంపన్నులు దుర్మార్గులని పేదవాళ్లు నిజాయితీగల వారని భావించడం లోక సహజం. ముఖ్యంగా సాహితీ రంగంలో. అది అర్థసత్యమే దుర్మార్గం మంచితనం వారి వారి మనసును బట్టి ఎదిగిన వాతావరణం బట్టి పరిస్థితులను బట్టి ఉంటాయి మంచి సమీక్ష చేసినందుకు ధన్యవాదాలు

 4. కధ చాలా హృదయ విదారకంగా ఉంది. ‘Fact is stranger than Fiction’అనే ఆంగ్ల నానుడి కి అద్దం పట్టింది ఈ కధ. ఒక ఉద్యోగస్తురాలైన తల్లి తప బిడ్డ గురించి పరితపించే విధానం రచయిత చాలా బాగా వర్ణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *