March 4, 2024

చిగురించిన శిశిరం

రచన: డా. జల్లా నాగరాజు

“అనుకున్నంత పనీ జరిగింది. మన అనిల్ ఇంటర్ తప్పాడు!”
ఫోను టేబుల్ మీద పెట్టి భారంగా అన్నాడు ప్రభాకర్. “అయ్యో రామా”! దిగ్భ్రాంతిగా చూసింది ప్రభాకర్ భార్య సంధ్య. నుదురు రుద్దుకున్నాడు ప్రభాకర్. ఇప్పటి పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. వాడికసలు లెక్కలు మొదట్నుంచి ఇష్టం లేదు. బావ బలవంతంగా ఎంపీసీలో చేర్పించాడు.
“మనం వెళ్దాం పద. చెల్లాయి రమ్మంది. బావ వూళ్ళో కూడా లేడు. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడ?”
“వాడి గదిలోనే ఉన్నాడు పిలవండి” అంటూ వెళ్ళటానికి సిద్ధమవుతోంది సంధ్య. ప్రభాకర్ కొడుకు గది తలుపు తీసి చూస్తే లొపల కిరణ్‌ ఇయర్ ఫొన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు.
“తలుపు నాక్ చెయ్యాలిగా డాడ్…” ఊగుతూనే అన్నాడు కిరణ్‌.
“ మరేమీ ఫర్లేదు లేవోయ్‌. అత్తయ్య వాళ్ళింటికి వెళ్తున్నాం పద!” గంభీరంగా అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ కి కొడుకు వరస ఏమీ అర్ధం కావటం లేదు. కిరణ్‌ ఎంబియే చేసాడు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు దాకా కూర్చుని చేసే ఉద్యోగం నా వల్ల కాదంటాడు. రొజంతా ఫ్రెండ్స్ తో తిరగటమే పని. నా గమ్యం ఇంకా దొరకలేదు అంటాడు. ఇవన్నీ ఆలొచించుకుంటూ ప్రభాకర్ కుటుంబంతో కారులో చెల్లెలు ఇంటికి చేరెటప్పటికి అతని చెల్లెలు సుశీల ముక్కు చీదుతూ ఏడుస్తోంది.
సంధ్య సుశీలను ఊరడించింది. “బావెప్పుడు వస్తున్నాడు క్యాంప్ నుంచి?” అడిగాడు ప్రభాకర్.
“ఎల్లుండు వస్తున్నారు…” దిగులుగా చెప్పింది సుశీల. “బావను అట్టే చిందులు వెయద్దని చెప్పు. అనిల్ ఎక్కడ?” అంటూ లోనికి వెళ్ళాడు ప్రభాకర్.
బెడ్రూంలో బిక్క మొహంతో అనిల్, పక్కనే పెద్ద అమ్మాయి చిత్ర కూర్చుని ఉన్నారు. చిత్ర ఇంజినీరింగ్ చదువుతోoది. అనిల్ కళ్ళు బాగా ఎర్రగా ఉన్నాయి. బాగా ఏడ్చినట్లున్నాడు.
“ఏం దిగులు పడకురా. పరీక్ష పోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ అంతం అయిపొలేదు. మళ్లీసారి రాసుకుందాం లే. ఈసారి బాగా చదువు!” భుజం తట్టాడు. బయటికి ఎటైనా తీసుకెళ్తే కాని వాడి మూడ్ మారదనిపించింది.
“ఛలో మనం బయటికి వెళ్దాం!” అంటూ అనిల్ ని, కొడుకు కిరణ్‌ ని తీసుకుని బయల్దేరాడు. దగ్గర్లో ఉన్న ఓ ఫన్ పార్క్ కి వెళ్ళి షాపింగ్‌, గేమ్స్‌ అంటూ రెండు గంటలు తిరిగాక, “ మావయ్యా ఆకలేస్తొంది..” అన్నాడు అనిల్. “డాడ్. పక్కనే మెక్ డొనాల్డ్ ఉంది” సలహా ఇస్తున్నట్లు చెప్పాడు కిరణ్‌. “మీకు మంచి టిఫిన్ పెట్టిస్తా పదండి” అంటూ నగరంలో మంచి పాపులర్ అయిన అన్నపూర్ణ రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. అప్పటికే రాత్రి దాదాపు తొమ్మిది దాటుతోంది. ఆ హోటల్‌ జనంతో రద్దీగా ఉంది. బయట చాలామంది వేచి చూస్తున్నారు.
“మనకి టేబుల్‌ దొరకాలంటే ఓ అరగంట పడుతుంది” చిరాగ్గా చెప్పాడు కిరణ్‌. “నేను ముందే ఫోనులో టేబుల్‌ బుక్ చేసానోయి…!” అంటూ లోనికి తీసుకెళ్ళాడు ప్రభాకర్.
హోటల్‌ వంటకాల ఘుమఘుమలతో, వాటిని ఆరగిస్తున్న కస్టమర్లతో నిండుగా ఉంది. వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఇడ్లీ-సాంబార్‌, ఉల్లి దోశ తినిపించాడు. కిరణ్‌ టిఫిన్ తింటూ వాట్సాప్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాకర్ తాను తెప్పించుకున్న మైసూర్ బజ్జీ తింటుండగా హొటల్లొకి తెల్ల లాల్చీ, పంచ కట్టుకున్న ఒక ముసలాయన ప్రవేశించాడు. చేతిలో ఠీవిగా కర్ర, కళ్ళకు గాంధీ కళ్ళజోడు. వయసు దాదాపు డెబ్భై ఉండొచ్చు. కానీ మనిషి ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్నాడు. హోటల్‌ సిబ్బంది అయనకు నమస్కారాలు చెప్తున్నారు. ఇద్దరు కుర్రాళ్ళు ఆయన్ని పలకరిస్తూ భోజనం పాకెట్ల సంచులతో లోనుంచి బయటకు వెళ్లారు.
తన పక్కనుంచి వెళ్తున్న అయనకు లేచి నమస్తే చెప్పాడు ప్రభాకర్. ఆయన ప్రభాకర్ భుజం తట్టి, పిల్లల వంక చూసి నవ్వి, నేరుగా వంటగదిలోకి వెళ్ళాడు. పిల్లలిద్దరికీ అయనెవరో అర్ధం కాలేదు.
“ఆయన రామలింగయ్యగారు. ఆయనే ఈ హోటల్‌కి ఓనర్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో..” చెప్పాడు ప్రభాకర్.
అయిదు నిమిషాల్లో పెద్దాయన, పక్కనే ఓ కుర్రాడు రెండు పెద్ద సంచులతో కిచెన్ లోంచి బయటికి వచ్చారు. ప్రభాకర్, పిల్లలు టిఫిన్ ముగించి బిల్లు కడ్తున్నారు. బండిదాకా సంచులు తెస్తానంటున్న కుర్రాడ్ని వారిస్తూ, “నాకింకా ఒపిక ఉందిరోయ్” అంటూ రామలింగయ్య వాటిని తీసుకుని బయట ఉన్న తన స్కూటీ దగ్గరకెళ్ళాడు.
“మనం ఆయన్ని ఫాలో అవుతున్నాం పదండి..” చెప్పాడు ప్రభాకర్. పిల్లలకేమీ అర్ధం కాలేదు. ముగ్గురూ స్కూటీని అనుసరిస్తూ వెనుక కారులో బయల్దెరారు. రోడ్డుపై ట్రాఫిక్ తగ్గింది. గాలి బలంగా వీస్తోంది. స్కూటీ మీద నెమ్మదిగా వెళ్తోన్న రామలింగయ్యకి కళ్ళజోడు ఉన్నా కూడా రోడ్డు మసగ్గా కనిపిస్తోంది. చేతులు వణుకుతున్నాయి. ఒంటి మీద శాలువా గాలికి అడ్డంగా లేస్తూ ఇబ్బంది పెడుతోంది. అయినా కూడా అతని కళ్ళు చురుగ్గా దేనికోసమో వెతుకుతున్నాయి. అల్లంత దూరంలో ఓ షాపు ముందు పడుకున్న పడుకున్న కొంతమందిని చూసి అతని కళ్ళు మెరిసాయి. బండి అక్కడ ఆపి, సంచిలో ఉన్న భోజనం పాకెట్లు వాళ్ళకు పంచాడు. వాళ్ళు దండాలు పెడుతూ అవి అందుకున్నారు. వెనుక కారులో అసక్తిగా గమనిస్తున్నారు ముగ్గురూ.
“ఈ వయసులొ ఆయనికెందుకంత శ్రమ. వాళ్ళ వర్కర్స్ కిస్తే వాళ్లు పంచేస్తారుగా…? అన్నాడు సునీల్. “వర్కర్స్ తో పాటు ఆయన స్వయంగా ఇస్తేనే ఆయనకు ఆనందం.” చెప్పాడు ప్రభాకర్. మళ్ళీ బయల్దేరాడు రామలింగయ్య. కొంతదూరం వెళ్లాక ఒక సందులో రోడ్డు వారగా పడుకున్న శాల్తీలు కొన్ని కనిపించాయి. అక్కడ బండి ఆపిన రామలింగయ్యని చూసి అక్కడ పడుకున్నవాళ్ళు లేచి కూర్చున్నారు. వాళ్ళళ్ళో చాలామంది పండుముదుసలులు, కొంతమంది చిన్న పసికందులు కూడా ఉన్నారు. రామలింగయ్య భోజనం పాకెట్లు తీస్తుండగా వెనుక నుంచి ఆయన్ని సమీపించారు ముగ్గురూ. వాళ్ళని చూసి ముందు కొంచెం కంగారుపడ్డా, ప్రభాకర్ ని గుర్తు పట్టాడు ఆయన.
“సార్. పిల్లలు కూడా పంచాలని ఉత్సాహంగా ఉన్నారు” చెప్పాడు ప్రభాకర్. వాళ్ళ పేర్లు చెప్పి ఆయనకి పరిచయం చేసాడు. ఆయన నవ్వుతూ సంచులు కిరణ్‌, అనిల్ కి ఇచ్చాడు. తటపటాయిస్తూనే భోజనం పాకెట్లు పంచారు ఇద్దరూ. వాళ్ళు ఎంతో ఆకలితో వాటిని అందుకుంటుంటె కిరణ్‌ కి ఏదో తెలియని అనుభూతి కలిగింది. అనిల్ కి ఇదంతా ఏమీ అర్ధం కాలేదు.
“రేపు వీళ్ళని తీసుకుని వస్తున్నావుగా…?” ప్రశాంతంగా అడిగాడు రామలింగయ్య. తల వూపాడు ప్రభాకర్.
“నన్ను ఆ హోటల్‌ లో చేర్పిస్తున్నావా మావయ్యా…?” బెరుగ్గా అడిగాడు అనిల్, రామలింగయ్య వెళ్ళిపోయాక.
పెద్దగా నవ్వాడు ప్రభాకర్. “భయపడకోయ్. అలాంటి ప్రోగ్రామ్ ఏమీ లేదు. ఈ వయసులో కూడా అయనెలా పని చేస్తున్నాడొ మీకు చూపిద్దామనే తీసుకొచ్చాను…!”
“ ఆయనెందుకిలా పంచుతున్నాడు…?” ఆసక్తిగా అడిగాడు కిరణ్‌.
“ రేపటిదాకా ఆగు. నీకే తెలుస్తుంది…”

మరుసటి రోజు ఉదయం కిరణ్‌ కి పేపర్ లో న్యూస్ చూపించాడు ప్రభాకర్. దాని సారాంశం ‘అన్నపూర్ణ హోటల్ గ్రూప్ యజమాని రామలింగయ్యకు సామాజిక సేవారంగంలో రామన్ మెగసెసే అవార్డు ప్రదానం”. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు పన్నెండున్నరకి ప్రభాకర్ అనిల్ ని, కిరణ్‌ ని తీసుకుని రాజేశ్వరి అనాధ శరణాలయానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ప్రెస్ మీటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక హాలులో కొంతమంది విలేఖర్లు, ఫోటొగ్రాఫర్లు కూర్చుని ఉన్నారు. విషయం తెలుసుకుని నగర మేయర్, స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ అనుచరులతో అక్కడ హడావిడిగా ఉంది.
ఒకతను పక్కతనితో చిన్నగా గొణిగాడు “ఇంటర్యూ ఇక్కడ పెట్టారేమిటి? నేనింకా వాళ్ళ హోటల్ ఆఫీసులో పెడతారనుకున్నా?”
పక్కతను అన్నాడు “ఈ శరణాలయం కూడా వీళ్ళే నడుపుతున్నారట. బహుశా ఇది కూడా మీడియాకు చూపించాలనేమో…!!!”
ప్రభాకర్ తన పిల్లలతో వెనుక వరసలో కూర్చున్నాడు. “మనం ఇక్కడికెందుకు వచ్చాం మావయ్యా…?” అమాయకంగా అడిగాడు అనిల్. కిరణ్‌ వాట్సాప్ లో బిజీగా ఉన్నాడు.
“ఆ పెద్దాయన జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వే చూడు…”
ఇంతలో రామలింగయ్య వంటి పైన ఏప్రాన్ తో అక్కడికి వచ్చాడు. ముఖం మీద చెమట చెప్తోంది అయన ఇప్పటిదాకా కిచెన్ లో ఉన్నాడని.
“అందరికీ నమస్కారం. నా విన్నపాన్ని మన్నించి ఇక్కడకు వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ముందు మనం భోజనాలు పూర్తి చేసాక మీరు మీ ప్రశ్నలు అడగవచ్చు. అయితే దాని కన్నా ముందు, మీ నుంచి ఒక చిన్న సాయాన్ని కోరుతున్నాను. దయచేసి నాతో రండి…” అంటూ అందరినీ లోపలి గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళాడు.
అప్పుడే ఓ గంట మోగింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, గదుల నుంచి మరి కొంతమంది ఉత్సాహంగా గ్రౌండ్ చివరలో ఉన్న హాలులోకి పరుగెట్టారు. పిల్లలు శుభ్రమైన దుస్తులలో చక్కగా ఉన్నారు. రామలింగయ్య అందరినీ ఆ హలులోకి తీసుకువెళ్ళాడు. పిల్లలందరూ రెండు వరుసలుగా ఉన్న టేబుల్, స్టూళ్ళపై బుధ్దిగా కూర్చున్నారు. అక్కడ ఒకాయన పిల్లలతో ప్రార్ధన చేయించాడు. హాలు చివర కిచెన్ ఉంది. అక్కడ కుర్రవాళ్లు వంట పాత్రలు మధ్య నున్న బల్లమీద పెడ్తున్నారు.
“మనం మొదటి ముద్ద దేవుడికి పెడతాము. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఇక్కడ పిల్లలకి వడ్డించడంలో మీరు కూడా ఒక చేయి వేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడ్తారు” అంటూ ఆ పాత్రలు పాత్రలు వాళ్ళకి అందించాడు రామలింగయ్య. వాళ్ళు ముందు కొంచెం ఆశ్చర్యపడ్డా, తర్వాత ఆనందంగానే అవి అందుకుని పిల్లలకు వడ్డించారు. ప్రభాకర్ పిల్లలను కూడా ముందుకు తోశాడు. తటపటాయిస్తూనే కిరణ్, అనిల్ కూడా వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు భోంచేశాక అందరికీ చేతులు జోడించి నమస్కరించారు. రామలింగయ్య అందరినీ తీసుకుని గ్రౌండ్ మధ్యలో పెద్ద రావి చెట్టు కింద వేసిన టెంటు లోకి తీసుకువచ్చాడు. అక్కడ అరిటాకులపై అందరికీ మంచి విందు భోజనం చేయించాడు. చివరలో జిలేబీలు, కిళ్ళీలు తిన్నాక మళ్ళీ అందరూ మీటింగ్ హాలులోకి వెళ్లారు. అందరికీ ఆవులింతలు వస్తున్నాయి.
మేయర్, ఎమ్మెల్యే పూల దండలతో, బోకేలతో రామలింగయ్యని అభినందించి, కాసేపు ప్రసంగించి కూర్చున్నారు. ఇక అడగమన్నట్టు చూశాడు రామలింగయ్య.
“గత ఇరవై ఏళ్లుగా పలు నగరాల్లో ‘అన్నపూర్ణ’ భోజనం హోటళ్ళను అతి తక్కువ రేట్లతో నడుపుతూ అనాథలకు, బిచ్చగాళ్ళకు ఉచితంగా భోజనం మూడుపూటలా అందిస్తూ సేవలు అందిస్తున్నారు. మీ సంస్థ అందిస్తున్న సేవలకు పద్మశ్రీ అవార్డు ప్రకటించటం పట్ల ఈ సంస్థ అధ్యక్షులుగా మీరెలా ఫీల్ అవుతున్నారు?” ఒక విలేఖరి ఉత్సాహంగా అడిగాడు.
“ఇది నా ఒక్కడి వాళ్ల సాధ్యమయ్యే పని కాదు. నేను, నా స్నేహితులు ఒక ఐదు నగరాల్లో మాత్రమే ఈ సంస్థను నడుపుతున్నాం. మిగతా నగరాలలో ఎందరో యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ సంస్థ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే కొంతమంది దాతృత్వం. ఇది సమిష్టి కృషి ఫలితం” అన్నాడు రామలింగయ్య.
“కాని ఇలా మీరు చేయటంవల్ల బెగ్గింగ్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారని మీకు అనిపించటం లేదా…?” మరో విలేఖరి ప్రశ్న సంధించాడు.
“ప్రతి మనిషికి మంచి ఆరోగ్యం, స్వయం సంపాదన లేక మరో ఆర్థిక ఆసరా, మరీ ముఖ్యంగా తనవాళ్ళ తోడు, ఉంటే మన సమాజంలో ఇక బిచ్చమెత్తుకునేవాళ్ళు కనిపించరు. వీళ్ళకు మేము ఒక నీడని ఇవ్వలేకపోవచ్చు. కాని మాకున్నంతలో వీళ్ళను ఆకలితో చనిపోకుండా చేయడానికే మా ఈ ప్రయత్నం. వీలున్నంతలో కొంతమంది ఉదారులైన డాక్టర్ల సాయంతో ఉచిత ఆరోగ్య సహాయం కూడా చేస్తున్నాం!”
“అసలు ఇలా రోడ్డుమీద అనాధలకు రొజూ భోజనాలు పంచాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది?”
“ఈ ఆలోచనకు బీజం ఇక్కడే పుట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అనాధ పిల్లల శరణాలయం ఒకప్పుడు ఓల్డేజ్ హోమ్.. అలాగే నాకూ, మా ఆవిడకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు!” రామలింగయ్య సాలోచనగా కళ్ళ జోడు తీసి తుడుచుకుంటూ అన్నాడు.
అందరూ ఒక నిమిషం తృళ్ళిపడ్డారు. ‘ఎంతో పేరున్నఈ పెద్దమనిషి ఒకప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాడా?’ వాళ్లకేమీ పొంతన కుదరలేదు.
రామలింగయ్య చేతికర్రతో నడుచుకుంటూ హాలు కార్నర్లో ఉన్న ఒక రూము తలుపు తెరిచి చూపించాడు. “ ఇదే మేమున్న గది..”
ఫోటోగ్రాఫర్లు ఆ గదిలో ఫోటోలు తీయటానికి ముందుకు వెళ్లారు. గదిలో ఒక పాత మంచం, పక్కన ఒక షెల్ఫ్, టేబుల్-కుర్చీ ఉన్నాయి. గోడ మీద దండతో ఒక పెద్దావిడ ఫోటో ఉంది. ఫోటోని చూపిస్తూ తడి చేరిన కళ్ళతో చెప్పాడు రామలింగయ్య.
“తనే నా భార్య రాజేశ్వరి. చివరి రోజులు తను ఈ మంచం మీదే గడిపింది కొడుకును తల్చుకుంటూ”.
ఆశ్చర్యంగా వింటున్నారు అందరూ.
“మాది సంతోషంగా గడుపుతున్న చిన్న మధ్య తరగతి కుటుంబం. నేను మెడికల్ రిప్రెజెంటేటివ్ ని. మాకు ఒక అబ్బాయి. వాడు బీటెక్ లో ఉండగా మా కుటుంబానికి ఒక సంఘటన శరాఘాతంలా తగిలింది. జాగింగ్ లో ఓ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. లేచి చూస్తే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. డాక్టర్ నేను పలకలేని జబ్బు పేరు చెప్పాడు. దాదాపు క్యాన్సర్ లాంటిది. ముందు చూపు కొరవడి మెడికల్ ఇన్సూరెన్స్ చేయించకపోవడంతో దాచుకున్నదంతా వైద్యానికే ఖర్చయింది. ఉన్న ఇల్లు, ఊళ్ళో స్థలం అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. ఉద్యోగం పోయింది. దాదాపు ఎనిమిదేళ్లు మంచం మీదే గడిపాను. కానీ నా అర్ధాంగి నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నేను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి నా చుట్టూ ప్రపంచమే మారిపోయింది. కొడుకు పెళ్లి తర్వాత ఉద్యోగం బదిలీ మీద ఢిల్లీ వెళ్లిపోయాడు. మమ్మల్ని ఈ శరణాలయంలోనే చేర్పించాడు. వాడి మీద బెంగతోనే రాజేశ్వరి ఈ గదిలోనే నన్ను వదిలి వెళ్లిపోయింది..” గద్గద స్వరంతో చెప్తూ ఆగిపోయాడు రామలింగయ్య. అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. అతని కళ్ల ముందు ఇరవై ఏళ్ల కిందటి సంఘటన దొర్లింది.
ఆ రోజు రామలింగయ్య భార్య కన్ను మూసిన మరుసటి రోజు. కొడుక్కి కబురు పంపినా ఇంకా రాలేదు. కారక్రమాలు అన్నీ పూర్తి చేసేటప్పటికి సాయంత్రం అయింది. స్నేహితులని పంపించేసిన రామలింగయ్య ఎటు నడుస్తున్నాడో తెలియకుండా ఒక విరాగిలా వెళ్తున్నాడు. వర్షం హోరున కురుస్తోంది. అతని కళ్ల నుంచి కారుతున్న కన్నీరు వర్షంలో కలిసిపోతోంది. నడిచి నడిచి రోడ్డు పక్కన ఒక చెట్టు కింద పడిపోయాడు. రాత్రయింది. కాసేపటికి వర్షం తెరిపి ఇచ్చింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు రామలింగయ్య. ఏడ్చిన కళ్ళు మసకగా ఉన్నాయి. వర్షానికి తడిసిన శరీరం వణుకుతోంది. ఇంతలో ఎవరో తన చేతిలో రెండు ఇడ్లీలు ఉన్న చిన్న ఆకు పెట్టారు. కళ్ళు చికిలించి చూశాడు. ఎదురుగా పదేళ్ళ పాప. పక్కనే ఒక బుట్టతో ఒక పెద్దావిడ. నుదుటి మీద పెద్ద బొట్టు. పాప చెంగున పరిగెడుతూ అక్కడ దూరంగా ఉన్న కొందరు బిచ్చగాళ్లకు ఇడ్లీలు పంచడానికి వెళ్లింది. ఆ పెద్దావిడలో లీలగా తన తల్లి రూపం కనిపించింది రామలింగయ్యకి. “అమ్మా” అని అరుస్తూ దబ్బున కింద పడ్డాడు. ఆమె ఆందోళనగా అతని చేయి పట్టుకుంది. అతని వళ్ళు జ్వరంతో కాలిపోతోంది.
రామలింగయ్య లేచేటప్పటికి తెల్లరింది. నుదుటి మీద తడిగుడ్డ ఉంది. ఓ గుడిసెలో చాప మీద పడుకుని ఉన్నాడు. నెమ్మదిగా లేచాడు. ఇంతలో తలుపు తెరుచుకొని లోనికి వచ్చింది రాత్రి తనను ఆదుకున్న పెద్దావిడ. “లేచావా బాబూ. రాత్రంతా జ్వరం. కషాయం తాగించాను” అంటూ నుదుటి మీద చేయి పెట్టి చూసింది.
“జ్వరం తగ్గింది బాబూ. లేచి ముఖం కడుక్కో. ఏమైనా తిందువుగాని.. ” అంటూ వేప పుల్ల ఇచ్చి ఆమె బయటికి వెళ్లింది. బైటికి వచ్చి చూశాడు. అక్కడ చిన్న బండి మీద వేడి వేడి ఇడ్లీలు, దోశలు వేస్తోంది. పక్కన ఒక కుర్రాడు అవి సప్లయి చేస్తున్నాడు. దాదాపు ఓ పదిమంది దాకా నిలబడి తింటున్నారు. ఆవిడతో మాట్లాడాక తెలిసింది ఆవిడ పేరు అన్నపూర్ణ. టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. వాళ్ల ఊళ్ళో భర్త పోయాక పొలం మరిదులు లాగేసుకుంటే, ఉన్న దాంతో పిల్లల్ని పెంచి, వాళ్ల పెళ్లిళ్లు చేశాక తను పట్నం వచ్చేసింది. ఆమె కొడుకు ఈవూళ్లోనే మెకానిక్ గా ఉంటున్నాడు. ఈమె ఈ ఊరొచ్చాక, టిఫిన్లు, భోజనాలు చేసుకుంటూ గడుపుతోంది. సూరి అనే ఒక పనివాడు ఆమెకు సాయపడ్తుంటాడు. ఆమె పిల్లల దగ్గర ఉండదు. ఓపిక ఉన్నంత కాలం పని చేసుకుంటూ తానే వేరేవాళ్ళకి ఆసరా ఉండాలి అంటుంది. కొడుకు, కూతురు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు తీసుకెళ్తుంటారు. రాత్రి తను చూసిన పాప ఒక అనాథ. దాని బాగా చదివించాలని పెద్దావిడ కోరిక. పాపని దగ్గర్లోని చిన్న బడికి పంపుతోంది. రాత్రిపూట మిగిలిన భోజనాలు, టిఫిన్లు చీకట్లో రోడ్డు మీద పడుకున్న అనాథలకు పంచుతుంది.
“నన్ను నీ అసిస్టెంట్ గా పెట్టుకో అమ్మా. నేను కూడా వంటలు బాగా చేస్తాను” అన్నాడు రెండు రోజుల తర్వాత కొంచెం తేరుకున్న రామలింగయ్య గిన్నెలు కడుగుతూ.
ఆవిడ వద్దంటున్నా నెమ్మది నెమ్మదిగా పెద్దావిడకు సాయపడుతూ అక్కడే ఉండిపోయాడు రామలింగయ్య. రాత్రిపూట ఆరుబయట నవారు మంచం మీద పాపకు కథలు చెప్తూ పడుకునేవాడు. రామలింగయ్య కూడా వంటల్లో నేర్పుకలవాడు. క్రమంగా వీళ్ళకి కస్టమర్లు బాగా పెరిగారు. రాత్రుళ్లు అన్నపూర్ణమ్మ, పాపతో పాటు అతను కూడా రోడ్ల మీద ఉండే అన్నార్తులకు భోజనాలు పెట్టేవాడు. ఆమెని అప్పుడప్పుడు అడిగేవాడు.
“ఈ వయసులో ఎందుకమ్మా ఇంత కష్టపడతావు. నీ బిడ్డల దగ్గర ఉండొచ్చు కదా?” దానికి ఆమె చాలా నిబ్బరంగా బదులిచ్చేది. “నాకు ఓపిక ఉన్నంత కాలం పని చేయటం నాకు చాలా ఆనందం ఇస్తుంది బాబూ. ఒకళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బరువుగా మనం ఎందుకు వుండాలి? మనకి శక్తి ఉన్నంతకాలం కష్టపడాలి…శక్తి లేని వాళ్ళకి ఎప్పుడూ సాయం చేస్తూ ఉండాలి’’. ఆమె ఫిలాసఫీ రామలింగయ్యకి చాలా నచ్చింది.
ఆరునెలలు గడిచిన తర్వాత అన్నపూర్ణమ్మ నిద్రలోనే వెళ్లిపోయింది.ఎంతో ప్రసన్నంగా నవ్వుతూ. వాళ్ల పిల్లలు వచ్చారు. కార్యాలు అయ్యాక పాపని అన్నపూర్ణమ్మ బంధువులు తీసుకెళ్ళబోతే రామలింగయ్య వారించాడు. ఆ రోడ్డు చివర ఉన్న పచారీ దుకాణం ఓనరు గుర్నాధం రామలింగయ్యని, అన్నపూర్ణమ్మ బంధువులని తన షాపుకి పిలిపించాడు. ఆయన పెద్దావిడ వ్యాపారంలో పెట్టుబడికి అప్పు, కిరాణా సామగ్రి ఇస్తుండేవాడు. గుర్నాధం ఓ కాగితం రామలింగయ్యకి, పెద్దావిడ పిల్లలకి చూపించాడు. దాని ప్రకారం అన్నపూర్ణమ్మ ఆయనకి అన్నీ కలిపి ఒక వేయి రూపాయల బాకీ పడింది. అది చూసి ఆమె కొడుకు, కూతురు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. రామలింగయ్య దృష్టి గుర్నాధం దుకాణం పార్టిషన్ చేసి పక్కన ఉన్న స్టోర్ రూమ్మీద పడింది. గుర్నాధాన్ని ఒప్పించి అది అద్దెకు తీసుకుని, మరో మూడువేలు అప్పుగా తీసుకుని అక్కడ చిన్న టిఫిన్ సెంటర్ తెరిచాడు. సూరికి టిఫిన్ బండి ఇచ్చి పంపించి, ఇంకొక పనివాడిని టిఫిన్ సెంటర్లో పెట్టుకున్నాడు. తన అనుభవాన్ని, మార్కెటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాపారం పెంచాడు. బయట టిఫిన్ బండ్లు పెరిగాయి. గుర్నాధం తన దుకాణాన్ని ఖాళీ చేసి రామలింగయ్యకిచ్చి భాగస్వామిగా మారాడు. పార్టిషన్ ని తీసేసి ఒకే హోటల్ చేశాడు రామలింగయ్య. బయట ‘అన్నపూర్ణ హోటల్’ అని బోర్డు పెట్టాడు. క్రమంగా బిజినెస్ పెరిగింది. పాత స్నేహితుల సాయంతో హోటల్ వ్యాపారాన్ని విస్తృతం చేశాడు.

———

ఆసక్తిగా వింటున్నారు విలేఖర్లు, మిగతావాళ్లు.
“అన్నపూర్ణమ్మ నేర్పిన పాఠం నేను ఎన్నడూ మరువలేదు. ఓపిక ఉన్నంతవరకు పని చేస్తూనే ఉండు. సాయం చేయగల్గినంత వరకు ఇతరులకు సాయపడు అని ఆమె చెప్పింది. నేను అదే పాటిస్తున్నాను. ఒకరి ఆకలి తీర్చితే కలిగే ఆనందం మాటల్లో చెప్పేది కాదు. అది అనుభూతి చెందితే కానీ మనకు తెలియదు.. నేను సంపాదించినదానిలో వచ్చే లాభాలు ఈ భోజనం పాకెట్ల పంపిణీకి వినియోగిస్తున్నాం. ఒకప్పుడు ఈ ఓల్డేజ్ హోంలో ఉండేవాళ్లందరూ ఇప్పుడు మా కార్యక్రమాలలో భాగస్వాములే. వాళ్ళందరూ ఇప్పుడు బైట తమ తమ అద్దె లేదా స్వంత ఇళ్ళలో ఉంటున్నారు. ఈ ఓల్డేజ్ హోంని అనాథ పిల్లల సంరక్షణ గృహంగా మార్చాం. అలాగే నాలాంటి భావాలు కలిగిన మరికొంతమంది స్నేహితులు మాతో కలిశారు. మాలాగా మరికొంతమందిని ఇలాంటి పనుల్లోకి పురికొల్పటమే మేము నిజంగా సాధించిన విజయం…!!!”
రామలింగయ్యకళ్ళనుంచి ఆనందభాష్పాలు జారుతున్నాయి. హాలంతా చప్పట్లు మోగాయి. కిరణ్ లేచి ఆయన దగ్గరికి వెళ్లి చెప్పాడు “ అంకుల్. నేను మీతో జాయిన్ అవుతాను….!”
అనిల్ కి భుజం మీద చేయి వేసి చెప్పాడు ప్రభాకర్. “ చూశావా ఆయన ఎంత కష్టాలు పడినా, అన్నీ ధైర్యంగా ఎదుర్కొని ఎంత ఎత్తుకు ఎదిగాడో. అదికూడా ఆ వయసులో. ఫెయిల్ అయ్యానని ఎప్పుడూ దిగులు పడకు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే వుండు. గెలుపు నీదే అవుతుంది. ఇప్పుడు అర్ధం అయిందా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చానో….”
నవ్వుతూ తల వూపాడు అనిల్.

———

ఈ కథకి ప్రేరణ:

1. తమిళనాడులో వడివేలంపాళ్యం గ్రామంలో ముప్పై యేళ్లుగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ శ్రమకి మరో రూపంగా నిలిచిన 85 యేళ్ళ ‘కమలాతల్’. ఈమె పొద్దున్నే నాలుగింటికి లేచి తన దినచర్య ప్రారంభిస్తుంది. ఈమె కిరోసిన్ స్టవ్ మీద ఇంతకుముందు ఇడ్లీలు వండేది. ఈమె శ్రమకు అబ్బురపడిన మహీంద్రా కంపెనీ అధినేత 2019 లో ఈమెకు గ్యాస్ స్టవ్ తో పాటు ఉచిత సిలిండర్ సప్లయి అందచేశారు.

2. బెంగుళూరులోని మహిత తన మిత్రులతో కలిసి ప్రారంభించిన Feed Your Neighbour (FYN) ద్వారా అనాథలకు, రోడ్లపై ఉండే ఇల్లు లేని పేదవాళ్ళకి, బిచ్చగాళ్లకు భోజనాలు అందిస్తూ సేవ చేస్తున్నారు.

3. ఢిల్లీలోని అంకిత్ తన మిత్రులతో కలిసి ప్రారంభించిన Feeding India ప్రస్తుతం 20 నగరాల్లో గూడులేని నిరుపేదలకు భోజన సాయం అందిస్తోంది.

4. పలాసలో ముగ్గురు తెలుగు ఆర్మీ జవాన్లు స్థాపించిన వివేకానంద సేవా సమితి వీలైనంతలో అక్కడి నిరుపేదలకు కడుపు నింపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *