May 25, 2024

తాత్పర్యం – గడ్డి తాడు

రచన:- రామా చంద్రమౌళి

 

రెండు ప్రశ్నలు.

ఒకటి..అందరూ చేస్తున్నట్టే తనుకూడా మనసుతో ప్రమేయం లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కేవలం శరీరంతోనే జీవించాలా.?

రెండు..రాజలింగం సార్ చెప్పినట్టు..ఒక విలక్షణమైన జీవితాన్ని అందరికంటే భిన్నంగా రూపొందించుకుని ఆశించినవాటిని ఆచరిస్తూ ,అర్థవంతంగా హృదయానందకరంగా జీవించాలా.?

ఇరవై నాలుగేళ్ళ రాము ఆలోచిస్తున్నాడు..చాలా రోజులుగా..దాదాపు ఓ నెలరోజులనుండి తీవ్రంగా.

విలక్షణంగా..భిన్నంగా..ప్రత్యేకంగా..జీవించడం..ఎలా,

చాలాసార్లే అడిగాడు రాము రాజలింగం సార్ ను.ఎప్పటికప్పుడు సార్ చాలా కరెక్ట్ గా..సరిపోయే సమాధానాలే చెప్పాడు.

‘అందరు పిల్లలు ఉదయం ఏ ఏడుగంటలకో నిద్ర లేస్తే ..నువ్వు మాత్రం ఉదయం ఐదు గంటలకే లేవాలి..చదువుకోవాలి.మీ నాన్న చిన్న నేతకార్మికుడు..కాబట్టి రోజూ రెండు గంటలన్నా మీ నాన్నకు పనిలో సహాయం చేయాలి. ఆ చేసే పనిని అప్పటిదాకా అందరూ ఎలా చేస్తున్నారో బాగా గమనించి అదే పనిని నువ్వుమాత్రం అందరికంటే భిన్నంగా ఎక్కువ నాణ్యతతో..తొందరగా పూర్తి చేయాలి.చేసే పని ఏదైనా  అందులో నైపుణ్యాన్ని సాధించాలి.ఆ పనిని నీకంటే ఇతరులెవ్వరూ ఇంకా బాగా చేయలేనంత అన్నమాట .చదువు..విద్య..జ్ఞానం..ఈ మూడూ ఒకటికావు..పూర్తిగా భిన్నమైనవి..అతి సూక్ష్మమైన వీటిమధ్యగల భేదాన్ని జాగ్రత్తగా గమనించి భవిష్యత్తును  రూపొందించుకోవాలి.పెరుగుతున్నకొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులను జాగ్రత్తగా గమనిస్తే..చాలా మంది వాళ్లకు నచ్చిన ఉద్యోగాలను చేయట్లేదనీ..అవకాశాన్ని బట్టి అప్పుడేది దొరికితే ఆ నౌకరీనే చేస్తూ విధిలేక తనకు నచ్చని జీవితాన్నే జీవిస్తున్నట్టూ..కేవలం తనకోసం..తన కుటుంబంకోసమే జీవిస్తున్నట్టు నీకర్థమౌతుంది.అలా జీవించేవాళ్ళు అతి సాధారణ పౌరులు.వాళ్ళు కేవలం శరీరంతో మాత్రమే జీవిస్తారు.ఇంకొందరు..తనకు నచ్చిన ఉద్యోగంకోసం..ఉపాధికోసం దొరికేదాకా ప్రయత్నిస్తూ నిరీక్షిస్తారు..వాళ్ళు విజ్ఞులు.ఇంకొందరు తనకు కావలసిన ఉద్యోగాన్నీ,ఉపాధినీ సృష్టించుకుంటారు..వాళ్ళు సాహసికులు.వాళ్ళు శరీరంతో కాకుండా హృదయంతో జీవిస్తారు. ‘

సార్..పదవతరగతిలో ఈ విషయాలను చెప్పినపుడు ఇవన్ని పూర్తిగా, స్పష్టంగా అర్థం కాలేదు..కాని తర్వాత్తర్వాత సార్ రెటైరై దూరమైన తర్వాత చాలా విస్పష్టంగా బోధపడింది.

రాజలింగం సార్ రూపం కదలాడింది రాము కళ్ళలో..ముఖం ఎప్పుడూ..నిండు చంద్రుడే..చెరగని నవ్వు.

‘ మనిషి ముఖంలో వర్చస్సూ,జీవకాంతీ మనిషి హృదయ నిర్మలతనుబట్టి ఉంటుందిరా..’ అన్నాడొకసారి సార్ ఎందుకో.

హృదయం..నిర్మల హృదయం..వర్చస్సు..జీవకాంతి.

రాము..అప్పుడు..ఆ క్షణం..ఆ వెన్నెల రాత్రి..ప్రశాంత గోదావరి నీటి చిరు అలలపై..తన చిన్న పడవ చెక్క చప్టాపై వెల్లగిలా పడుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు.

ఆకాశం నీలిరంగులో..నిర్మలంగా..పల్చని మబ్బులను తోసుకుంటూ..పరుగెత్తుతూ చంద్రుడు..సముద్రం కూడా నీలిగానే ఉంటుందికదా.

ఆకాశమూ..సముద్రమూ..రెండూ ఒకటేనా..నీలి..నీరు.

ప్రక్కనే ఒడ్డును తాకుతూ..ఒకరకమైన లయాత్మక శబ్దాన్ని చేస్తూ..అలలు..నీటి తలంపై అటూఇటూ ఊగుతూ  పడవ..ఒడిలో..తెడ్డు.

తెలంగాణాలో గోదావరి పుష్కరాల సంరంభం ముగిసి..పదవరోజు.అటు ప్రక్క ప్రభుత్వం నిర్మించిన తూ తూ మంత్రం సిమెంట్ మెట్లు..అప్పటికే..అంచులు విరిగిపోయి..పెళ్ళలు పెళ్ళలుగా ఇటుకలు ఊడిపోయి..అంతా నాసిరకం.కోట్లకు కోట్ల రూపాయల ఖర్చు..ప్రజా ధనం..నీటికంటే అధ్వాన్నంగా వాడకం..యూజ్..మిస్ యూజ్..ఎవనికందింది వాడు..లక్షలకు లక్షలు జనం..వేలం వెర్రి..ఒకన్ని చూచి ఒకడు..పోలోమని..బురదలోనే స్నానాలు..ఒకటే హడావిడి..పోలీసులు..వి ఐ పీ లు..రాజకీయ నాయకులు..మీడియా..అంతా ఓవర్ యాక్షన్.

హమ్మయ్య..అని ఊపిరి తీసుకుని..పుష్కరాలు ఐపొగానే ఒకటే పరుగు ఎక్కడివాడక్కడ.

స్నాన ఘట్టాలదగ్గర..అంతా చెత్త..అవశేషాలు..ప్లాస్టిక్ సంచులు..కాగితాలు..ఉచ్చ కంపులు..చెదారం.

ఒక బీభత్స క్రతువు తర్వాత మానవ నిష్క్రమణానంతరం..ఈ రోజు ప్రశాంతంగా,

ప్రశాంతతను అనుభవించాలనే దాహం..వెన్నెలను ఆస్వాదించాలనే తహతహ..ప్రశాంత గోదావరి ఒడిలో నీటి అలలపై  ఊయలలూగుతూ భాషకందని మహానుభూతి ఏదో..దాన్ని అనుభవించాలని తపించిపోవడం..అందుకే ఈ వెన్నెలరేయి..ఇక్కడ ..పడవపై.,

దూరంగా..ఏదో  చప్పుడు..మరో పడవ వస్తున్నట్టు అలికిడి.

తల తిప్పి చూశాడు రాము..ఔను..పడవే..ఆకుపచ్చరంగుది.లక్ష్మే..లక్ష్మి కూడా వస్తోంది తాము అనుకున్నట్టే.

ఇక ఒక నిర్ణయం తీసుకోవాలి.

నీటిఅలలచప్పుడు..లక్ష్మివేస్తున్నలయాత్మకతెడ్డుచప్పుడు..లక్ష్మిసన్ననిగాజులధ్వని ..వెరసిఒకఅద్భుతమైనప్రకృతిపరిమళంతోనిండినఒకయువతియొక్కమత్తెక్కించేఉనికి

ప్రక్కకు తిరిగి దూరంగా వస్తున్న లక్ష్మి దిక్కు చూస్తున్నపుడే రాము చేతికి ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ తగిలింది చల్లగా.అప్పుడుq స్ఫురించిందతనికి..దాంట్లో తన బి టెక్.ఎం టెక్ సర్టిఫికేట్లు ఉన్నాయని.

చిత్తు కాగితాలు..రూపాయల నోట్లు..సర్టిఫికేట్లు..డాక్యుమెంట్లు..అన్నీ కాగితాలే..కాని వాటి వెనుక దాగిఉన్న విలువలను బట్టి వాటి ప్రత్యేకత..ఇప్పుడు తన ఈ సర్టిఫికేట్లకు విలువ ఉందా..గౌరవం ఉందా..గుర్తింపు ఉందా.ఆ సర్టిఫికేట్లను పొందడం వెనుక వృద్ధి చెందవలసిన ఇంజనీర్ ప్రావీణ్యతలూ,నైపుణ్యాలూ,పరిజ్ఞానమూ ఉన్నాయా.అంతా ఒట్టి చెత్త.నిజానికి చిత్తు కాగితాలవి.

ఎందుకో..ఎవరో అదృశ్య వ్యక్తి ఫెడేళ్మని చెంపలపై ఒక్కటి బలంగా చరిచినట్టనిపించి ఉలిక్కి పడ్డాడతను.

క్యాంపస్ ఇంటర్వ్యూ..పైరవీలు..మేనేజ్ మెంట్ లంచాలు..అక్కడ వాళ్ళకు కూడా పోస్ట్ గ్రాడ్యుఏట్  ఇంజనీర్ల అవసరం..మొత్తం మీద ఒక సి ఎన్ సి ఆపరేటెడ్  రోబో మెషిన్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది.నెలకు మొదట్లో నలభై రెండు వేల జీతం.ఎద్దు మైలారం ఇండస్త్రియల్ ఏరియాలో.మెదక్ జిల్లా.

కాని..మొదటిరోజు..ఒక అసైన్ మెంట్ ఇచ్చారు.జి కోడ్ లో ప్రోగ్రాం రాసుకుని రోబట్ తో అనుసంధానించుకుని  హై టెంపరేచర్ వెల్డింగ్ చేయించాలి ఫర్నేస్ లో.ఉహూ..తెలియదు తనకది.అసలు ఒక మెకానికల్ ఇంజనీర్ గా తనకు వెల్డింగే తెలియదు.ఇక ప్రోగ్రామింగ్..ప్లాస్మా వెల్డింగ్..వాటి ఊసుకూడా తెలియదు.కాలేజ్ లో వాటి గురించి చెప్పిందెవడు.అవన్నీ తెలిసిన స్టాఫ్ ఎక్కడుందా కాలేజ్ లో.అసలా ల్యాబ్స్..పరికరాలు..సౌకర్యాలు..ఆ నైపుణ్యం గల ఉపాధ్యాయులు..ప్రొఫెసర్లు..టెక్నీషియన్స్,,శిక్షణా వసతులు ఎక్కడున్నాయి.అస్సలే లేవు.

ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గూండా కం రాజకీయ నాయకునిది.వాడికి ఓ ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజ్ లు..ఓ పదిపదిహేను బార్లు..ఐదారు  బ్రాండీ షాప్స్..ఐదారు రీఆల్టర్ కంపనీలు..నేషనల్ లెవెల్ ప్రభుత్వ రోడ్ కాంట్రాక్ట్ లు ఉన్నాయి.వాడి ముగ్గురు కొడుకులు ఓపెన్ టాప్ ఆడి కార్లలో ఇరుప్రక్కలా అందమైన అమ్మాయిలను వేసుకుని తను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ కు అలా వాహ్యాళికొనట్టు వస్తారు.అంతా బహిరంగ శృంగార రసాత్మక చర్యలే..కాలేజంటే వాళ్ళ ఎస్టేట్..అడిగేవాడెవ్వడూ ఉండడు.ప్రిన్స్ పాల్..లక్షలిచ్చి పోషించబడే దిక్కుమాలిన అప్రాచ్యపు స్టాఫ్ ఒట్టి   వెధవలు.ఒక్కనికీ పాఠాలు చెప్పరావు.వాళ్లకు మేనేజ్ మెంట్ కనుసన్నలలో ఉంటూ మస్కా కొట్టి బావుకోవడంతోనే సరిపోతుంది.ఇక   స్టూడెంట్స్..అడ్మిషన్స్..ఒక వ్యభిచార క్రీడ.ఎవడో ఒక బ్రోకర్..కన్సల్టెంట్..లేక పి ఆర్ ఓ అని చెప్పుకుంటాడు వానికి వాడు.. ఎలా  తెస్తారోగాని..వందలకు  వందల మంది స్టూడెంట్స్ ను చేర్పిస్తారు ఇంజనీరింగ్ కాలేజీల్లో..ఒక్క స్టూడెంట్ ను చేర్పిస్తే పదిహేను వేల రూపాయల  లంచం..సర్వీస్ చార్జ్..మేనేజ్ మెంట్ కు..ఒక్కో విద్యార్థికి ముప్పయి ఐదువేల ఫీ రీ ఎంబర్స్ మెంట్..నాలుగేళ్ళు.కోట్లకు కోట్లు రాబడి.మరి ప్రభుత్వాలు  ఎక్కడ మందుకొట్టి నిద్రపోతున్నాయోగాని..తను చదివిన రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్..రాఘవేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్..ఒకే క్యాంపస్ లో ఉన్న రెండు కాలేజీల్లో  ఒక్క ఫస్టియర్ లోనే ముప్పదిరెండు బ్యాచ్ లు.ముప్పదిరెండు ఇంటూ అరవై..ఇంటూ ముప్పయి ఐదు వేలు..కోట్లకు కోట్ల రూపాయలు.ఇక క్లాస్ లు..ఎవడి క్లాస్ ఎక్కడ నడుస్తోందో..ఎవరికి ఎవరు..ఎక్కడ పాఠం చెబుతున్నారో..ఎక్కడ ఏం జరుగుతోందో..ఆ బ్రహ్మక్కూడా తెలియదు.అంతా కో-ఎడ్యుకేషన్..ప్రతి క్లాస్ లో సగంకు పైగా అమ్మాయిలు..మిగతా అబ్బాయిలు.ఊరిబయట ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజ్ లన్నీ..ఏ ప్రక్కనున్న పొలాల్లోకో..తోటల్లోకో పోరగాండ్లు..పోరీలు పరార్..నానా బీభత్సం.

ఎవ్వడు బడికి రాడు..ఇంట్లో బయలుదేరుతాడు..మధ్యలోనే మాయం..ఒక్కొక్కడు ఎక్కడినుండి పట్టుకొస్తాడో ..మోటార్ సైకిల్..ప్రతి బండిపై ముగ్గురు ముగ్గురు..కాలేజ్ చుట్టు ప్రక్కలున్న బార్లన్నీ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పోరగాండ్లతోనే ఫుల్. విచ్చలవిడితనం..వికృత చేష్టలు.. అడ్డూ అదుపూ లేని స్వేచ్ఛ..ఎక్కడో తల్లిదండ్రులు..ఇక్కడ కిరాయి రూంలలో స్టూడెంట్స్ నివాసం..రాత్రింబవళ్ళు ఆడింది ఆట పాడింది పాట.బిడ్డ బుద్దిగా కాలేజ్ కు వెళ్తున్నాడని తల్లిదండ్రులు..నగరంలో రూంలో ఉంటూ చదువుకుంటున్నాడని..ఒక భ్రాంతి..అమ్మాయిలపై వలలు..వినకుంటే బెదిరింపులు..ర్యాగింగ్ లు..దాడులు..అమ్మాయిలుకూడా యూజ్ అండ్ త్రో టైప్ వెకిలి చేష్టలు.ఒక విశృంఖలతో నిండిన విచ్చలవిడితనం. ఆత్మ దగ్ధ..ఆత్మ హనన వికృత సంస్కృతి..ఇంజనీరింగ్ కాలేజీల్లో.

ఇక పంతుళ్ళు..చాలా మంది కూలికొచ్చిన ఎడ్యుకేటెడ్ లేబర్.వాళ్ళు ఎక్కడినుండొస్తారోగాని..ఎం టెక్ చేసి వస్తాడు..ఒక్క ఇంగ్లిష్ వాక్యం తప్పు లేకుండా మాట్లాడరాదు.బోర్ద్ మీద అర్థవంతంగా..స్పెల్లింగ్ తప్పులు లేకుండా.. నాల్గు వాక్యాలు రాయరావు.ఇంజనీరింగ్ విద్యకు ప్రాణప్రదమైన  స్కెచెస్..ఏ ఒక్కనికీ వేయరాదు.వెనుకటి అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజ్ లలోపనిచేసిన ఋషుల్లాంటి అధ్యాపక తరం పూర్తిగా  నశించిపోయినిశ్శేషమైపోయింది.అంతా పేడి తరం. పి హెచ్ డి ఉంటుంది..గడగడా నాల్గు తప్పుల్లేని ఇంగ్లిష్ మాటలు మాట్లాడరాదు. అంతా పే అండ్ యూజ్..యూజ్ అండ్ త్రో. ప్రతివానికి ఆ కాలేజ్ లో తాను ఎన్నాళ్ళు పని చేస్తాడో తెలియదు. చేస్తున్న ఆ ఉద్యోగం ఎప్పుడూడుతుందో తెలియదు..ఆ ఇచ్చే జీతాన్ని మేనేజ్ మెంట్ దయతలచి ఎప్పుడిస్తుందో తెలియదు. పరీక్షలు ఒక బోగస్..క్లస్టర్లు గా వేసుకున్న  కాలేజ్ లన్నీ కుమ్మక్కై బహిరంగ చూచి వ్రాతలు పరీక్షల్లో.విద్యార్థులందరి జేబుల్లో కట్టలక్కట్టలు జిరాక్స్ కాగితాలు. అప్పుడప్పుడు..డ్రాయింగ్ లాంటి పేపర్లకైతే సార్లే వచ్చి

బోర్డ్ పై సమాధానాలను గీయుట..పోరగాండ్లు వాటిని చూచికూడా గీయలేకపోవుట. అంతా ఒక క్రమశిక్షణాయుతమైన దోపిడి..ఒక తరం యొక్క ధ్వంసం.

ఇక ఇన్స్ పెక్షన్ లు..ఒక పెద్ద బూటకం..వాడు ఏ ఒక్కనాడూ ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కు చెప్పా చేయకుండా  ఇన్స్ పెక్షన్ కు వచ్చిన దాఖలాలు లేవు.మూడు నాల్గు రోజుల ముందే ‘ వస్తున్నాం మేం వస్తున్నాం’ అనిఢంకా భజాయించి చెబుతే..వీడూ వాడూ కుమ్మక్కై..ఎక్కడెక్కడినుండో లేని ఎక్విప్ మెంట్ ను అరువుకు తెచ్చి లేని స్టాఫ్ ను ఒక్కరోజు  కూలీకి నిరుద్యోగులను మాట్లాడుకుని..దొంగ ప్రదర్శనలు..దొంగ ఋజువులు..దొంగ  డాక్యుమెంట్ లు..వచ్చిన టీం కు..రేట్లు..కానుకలు..సత్కారాలు..బ్రీఫ్ కేస్ లు నింపడాలు..చివరకు ..అన్నీ..అంతా చాలా చాలా సవ్యంగానే ఉన్నాయి..విద్యాప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతున్నాయి అని రిపోర్ట్ లు..

ఇక ఎం టెక్ కోర్స్ లను నడిపే కాలేజ్ లైతే..మరీ అధ్వాన్నం.అసలు క్లాస్ లే నడుపుడు వుండదు.అడ్మిషన్స్ జరిపేటప్పుడే..బ్రోకర్ ద్వారా ముందే ఒక ఒప్పందం ఉంటుంది.క్యాండిడేట్ ఎప్పుడూ క్లాస్ లకు రాడు..అటెండెన్స్ అంతా మీరే చూచుకోవాలి..మిడ్ ఎగ్జాంస్..అంతా మీదే బాధ్యత.ఫుల్ మార్క్స్ వేసే పూచీ మీదే.అంతిమంగా విద్యార్థి డిస్ టింక్షన్ మార్కులతో పాస్ కావడానికి గ్యారంటీ ఇవ్వాలి.బ్రోకర్ కు సర్వీస్ చార్జెస్ మామూలే.రెండేళ్ళ కోర్స్ కు మనిషికో లక్ష కనీస ఆదాయం మేనేజ్ మెంట్ కు .సారాంశం ఏమిటంటే..జస్ట్..కాలేజ్ కు పోకుండానే..కాపీ కొట్టి  పరీక్ష రాసి..ఎం టెక్ డిగ్రీ తెచ్చుకుని..ఎగిరిపో చెత్తకుప్పపైకి.ఒక ఫేక్ యువకుడు..ఏ నైపుణ్యమూ లేనివాడు..అసలుదే ఐనా పనికిరాని,విలువలేని సర్టిఫికేట్ ను పట్టుకుని కాలేజ్నుండిబయటకువస్తాడు..పరిశ్రమల్లో పని చేయడానికి..రోడ్లు వేసి..వంతెనలు కట్టి..భారీ భవనాలు నిర్మించడానికి..ఈ దేశ భావి కట్టడాలనూ,ఉత్పత్తులనూ రూపొందించడానికి.ఇది ఎట్లాంటిదంటే..మనింటికి ఇల్లు కట్టడానికి ఒక తాపీ మేస్త్రీ వస్తాడు..కాని వానికి గోడ కట్టడం రాదు.

అందుకే అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ‘నాస్ కాం ‘ అంటోంది..ప్రతి సంవత్సరం మూడులక్షల పైచిలుకు తయారౌతున్న ఈ నాసిరకం ఇంజనీర్లలో నూటికి ఎనిమిదిమందికూడా ఉద్యోగాలు చేయదగ్గ నైపుణ్యాలు కలిగిలేరని.

సాంకేతిక యూనివర్సిటీలు నిరుద్యోగులను తయారు చేస్తున్న ఖార్ఖానాలుగా మారి..భ్రష్టు..భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ సమాజాన్ని..ప్రొడ్యూసింగ్ హూమన్ గార్బేజ్.

ఎవరో ఒకరు..ఈ దుష్ట వ్యవస్థను సమూలంగా మార్చాలి.అవినీతిపరులనూ..లంచగొండ్లనూ..జలగల్లా కోట్లకు కోట్ల ప్రజా ధనాన్ని పీల్చేస్తున్న ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ల విషపు పుట్టను ధ్వంసించాలి.లేకుంటే..ఈ పనికిరాని పేడి తరం విస్తరించి విస్తరించి..దేశ వ్యవస్థ తుప్పుపట్టిపోతుంది.

తన విషయంగా అదే జరిగింది..ఏదో ఒక కుల ప్రాతిపదికపై వచ్చిన ఉద్యోగాన్ని తాను నిర్వహించలేక..ప్రతిరోజూ ఒట్టి బేలగా దిక్కులు చూస్తూ నిలబడలేక..శోభనపు గదిలో నపుంసకునివలె..సిగ్గు..అవమానం..పోనీ..నేర్చుకుందామంటే..అసలు ఆ వ్యవహారపు తోకా మూతీ తెలియదే.కొంత తెలిస్తే ఇక మెరుగుపర్చుకోవచ్చు..కాని అస్సలే తెలియని సబ్జెక్ట్ ను ఇప్పుడు..ఉహూ..కాదు కాదు..

లోపల ఏదో అవమాకరమైన దుఃఖం..బాధ..క్షోభ..ఎవరికీ చెప్పుకోలేనిది..చెప్పరానిది.

బయటపడాలి..మనసునూ..ఆత్మనూ చంపుకుని..కేవలం జీతంకోసం రోశం లేకుండా కృంగిపోతూ పనిచేయడం తనవశం కాదు.

ఒక పదిరోజులు ప్రయత్నించి వచ్చేశాడు తను..ఉద్యోగానికి రాజీనామా చేసి..అవమాన భారంతోనే ఐనా..ఒక జైల్ నుండి బయటపడ్డ ఆనందంతో..బయటకు రాగానే స్వేచ్ఛ..పక్షి రెక్కలను విప్పుకుని అప్పుడే మొదటిసారిగా ఎగురుతున్న అనుభూతి.

రాని పనిని..ఇష్టం లేనిపనిని..ఆత్మకు ఆనందాన్ని కలిగించలేని పనిని.,

‘డోంట్ వర్రీ..కిక్ ఔట్ ద బాల్ ‘

‘ మళ్ళీ తనకు పర్ఫెక్ట్ గా వచ్చిన పనినే..తను నచ్చిన పనినే తను వెదుక్కోలేడా..సృష్టించుకోలేడా..తనలోనే మరో తనను కనుక్కోలేడా ‘

ఓటమి..ఓటమి..చాలా నిజాయితీగానే తను చదువుకోవాలని వెళ్ళాడు..కాని ఈ దుర్మార్గ నకిలీ వ్యవస్థ తనను ఒక పనికిరాని ఒక ఫేక్ మనిషిని తయారుచేసింది.

ఐనా ఫర్వాలేదు..ఓటమే విజయానికి పునాది..తనను తాను మళ్ళీ పునర్నిర్మించుకోవచ్చు.

అప్పటికే..అంటే తను బి టెక్ మూడవ సంవత్సరంలో ఉన్నపుడు..చేనేత కార్మికుడైనతన తండ్రి..ఆ కుగ్రామంలో యాతన పడీ పడీ..ఒకరోజు  ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.తల్లి కళ్ళముందే వ్యవసాయ కూలిగా మారింది.గ్రామీణ ఉపాధి పథకం..అమ్మ లేబర్..దగ్గరగా గమనించాడు తను ఆ పథకాన్ని.పథక ఉద్దేశ్యం ఎంతో గొప్పదే.కాని అమల్లో విపరీతమైన అవినీతి.దొంగ లెక్కలు..దొంగ అక్విటెన్స్ లు.ఇచ్చే కూలి వేరు..రాసుకునేది వేరు. అంతా మోసం.కోట్లకొద్ది ఫండ్స్ స్వాహా.

తనకు ఉన్నది మూడెకరాల పనికిరాని చెల్క..మంచాన బడ్డ అమ్మ..ఒంటరి తను..పుట్టి పెరిగిన,చిన్న యాభై కడపలున్న మారుమూల పల్లె.ఇటుపక్క దట్టమైన అడవి..అటుపక్క పారే గోదావరి.అడవికిపోవుడు..కొందరు నదిలో చేపలు పట్టుడు..కుమ్మరి కుటుంబాలు మూడు కుండల తయారీ..ఇద్దరు కమ్మరి..రెండు కుటుంబాలు తమతో సహా..పద్మశాలి..నేత..చేనేత..యుగయుగాలుగా మారని తలరాత.

నగరాన్నీ ఉద్యోగాన్నీ విడిచిపెట్టి తన పల్లె..ఆశాలపల్లె కు వచ్చి..రేపటికి సరిగ్గా ఎనిమిది నెలలు.

అన్నీ సర్దుకుని..బస్సెక్కి సామాను మూటలతో ఊర్లోకొస్తున్నపుడు..ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఎదురొచ్చిన మొట్టమొదటి మనిషి లక్ష్మి.కమ్మరోళ్ల పిల్ల.ఐదవతరగతి వరకున్న తమ బడిలో..తను నాల్గవ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడే బడిలో చేరిన లక్ష్మి.తమ ఇండ్లు ప్రక్కప్రక్కనే.అందుకని కలిసి పోతూ..కలిసి వస్తూ.,

తను ఒక చెత్త, పనికిరాని ఎం టెక్ డిగ్రీని చేతపట్టుకుని గాయపడ్డ సైనికునిలా వచ్చినప్పుడు..అనూహ్యంగా..ఎదురుపడ్డ లక్ష్మి..ఎస్ డి ఎల్ సి లో డిగ్రీ పూర్తి చేసిందిఅప్పటికి .. సోషియాలజీ.

అంది..’ నువ్వనేది..రాజలింగం సార్ కూడా అనేదికదా..చదువే మనిషికి ధైర్యాన్నీ..ఆలోచననూ ఇస్తుందని..అందుకే ఈ డిగ్రీ ‘ అని.

నగరంలో ఉన్నన్ని నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లలో ఎందరో అమ్మాయిలు తటస్థ పడ్డా..ఎందుకో ఒక్క లక్ష్మి మాత్రమే అప్పుడప్పుడు మనసులో మెదిలింది తప్పితే ఏ ఒక్కనాడూ మరో ఆడదాని ఆలోచనే రాలేదు.

లక్ష్మి ముఖం స్విచ్ వేసిన..వెలుగుతున్న లైట్ లా ఉంటుంది.కళ్ళు కాంతి సముద్రాలు.

‘ ఏయ్ పిల్లగా ..డోంట్ వర్రీ..హియరోన్లీ వుయ్ కెన్ మేక్ అవర్ లైఫ్ గ్రేట్’ అని ఇంగ్లిష్ లో అంది.అని చేయి చాపి అందించింది ఆ రాత్రి ఊరి హనుమంతుని గుడి మెట్లమీద.

అంతే..కొత్త చూపు..కొత్త అన్వేషణ..కొత్త ఆలోచనలు..కొత్త ధైర్యం.

ఇద్దరం మనుషులం..నీదీ నాదీ మొత్తం ఏడెకరాల భూమి..రెండు పడవలు..యాభై కుటుంబాల సహవాసం..ప్రక్కన ఒక నది..ఒక అడవి..చాలవా జీవితాలను అర్థవంతంగా నిర్మించుకోడానికి.

విభిన్నత..విలక్షణత.

చటుక్కున జ్ఞాపకమొచ్చింది రాముకు తను పట్టణానికి వళ్ళిన మొదట్లో పేపర్ బాయ్ గా పని చేసిన రోజులు.కస్టమర్లందరూ..తన పేపర్ ఏజంట్ తనను ఎంతో మెచ్చుకునేది.ఎందుకంటే..తన రెండు వందల పేపర్లను ఉదయం ఆరుగంటలలోపే వాళ్ల వాళ్ళ ముంగిట్లో వేసేది.నో డిలే..నో ఆబ్సెన్స్.తనతోటి పోరగాండ్లు ఎప్పుడో ఆరింటికొచ్చి ఎనిమిద్దాకా వేసేది.కస్టమర్లందరూ తిట్లె..’గిప్పుడు పేపరేందిరా బై ‘ అని.

ప్రతి ఆదివారం..పది మంది కార్లున్న వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ‘ కార్ క్లీనింగ్ ‘ చేసేది తను.అందువల్ల కొంత ఆదాయం..పరిచయాలూ..ప్రేమలూ..అనుబంధాలు.పులకింపజేసే మానవ సంబంధాలు.

లక్ష్మి అంది..’ రామూ..మన ఊర్లోని మొత్తం వ్యవసాయ భూమి..దాదాపు ఐదు వందల ఎకరాలు..మొత్తం మనుషులు..నాల్గు వందల యాభై.దాంట్లో యువజనం దాదాపు మూడు వందలు..సరిగ్గా ఎడ్యుకేట్ చేస్తే ఒక వందమంది మన వెంట వస్తరు..ఇక ఊహించు..మన ఊరు ఇక ముందు కేవలం కూరగాయలనూ..పండ్లనూ..పూల మొక్కలనే పండిస్తది..అదీ ప్రత్యేక శాస్త్రీయ పద్ధతులద్వారా.కార్పొరేట్ సంస్థలతో ప్రతిదినం ఇంత వెజిటబుల్ స్టాక్..ఇన్ని పళ్ళు..ఇన్ని రకాల స్పెషల్ పూలు..ఇలా గ్యారంటీడ్ సప్లై చేస్తాం..థింక్..’ అంది.

అంతే..పెట్రోల్ బావికి నిప్పంటుకుంది..రాకెట్ ఇగ్నైటెడ్.

ఇద్దరూ “తమచుట్టుప్రక్కలఅద్భుతంగా వ్యవసాయం చేసే వ్యక్తులెవరు..ప్రభుత్వ ఆఫీసర్లూ..వాళ్ళు చేయగల సహకారం ఏమిటి..బ్యాంక్స్ ఏమి చేయగలవు..తమ హక్కులేమిటి.. ” ఈ దిశలో పర్యటన..సర్వే..వ్యక్తులను కలుసుకోవడం..ఊళ్ళోని యువతను సంఘటితం చేయడం..మానవ సమూహాలే అతిపెద్ద సహజ వనరులు..అని ఎడ్యుకేట్ చేయడం..”

ఆ రోజు..వర్షం కురిసిన తెలతెల్లవారిన రోజు..మొదలైంది..ఐదు ట్రాక్టర్లు..రెండు టిప్పర్లు..ఒక క్రేన్..ఎనభై ఆరు మందియువతీయువకులు.

మానవ శక్తిని నింపుకుని..ఆశాల పల్లె..భవిష్యత్తుపై విశ్వాసాన్ని ప్రకటిస్తూ.. ఆశల పల్లెగా మారింది.

నేల చేతులు చాచి పిల్లలను కౌగిలించుకుని..వర్షం అక్షింతల్లా శిరస్సులపై కురిసి..మొక్కలు మొలుస్తున్న చేతులై పిలిచి .,

కొత్త ప్రయాణమొకటి మొదలైంది..ఒంట్లో ఏదో కొత్త రక్తం ప్రవహిస్తున్న అనుభూతి ఆ ఊరి జనమందరిలో..నిండుగా.

ఇన్నాళ్ళూ..ఊరు..అంటే..అందరిది..కాని ఏ ఒక్కరికీ చెందింది కాదు.ఎవరికివారు..ఊరు ఎవరిదో..నాదిమాత్రం కాదు అన్న భావన.

కాని ఇప్పుడు..చింతన మారింది..ఊరు అందరిది..ప్రతి ఒక్కరిదీ..అందరికీ చెందింది..ఊరు ఒక శరీరం..ఊరి ప్రతి వ్యక్తీ ఆ శరీర అంగం. రెండు వందల మందితో..దాదాపు పన్నెండు స్వయం సేవక సంఘాలు పనిచేస్తున్నాయి ఇప్పుడు.పని సృష్టి..పని కల్పన..పని విభజన..పని అమలు..పనుల పర్యవేక్షణ..ఇదీ ఇప్పటి ఊరి సంస్కృతి.

రాగి తీగ అదే..ఇదివరకు దానిలో విద్యుత్తు లేదు.ఇప్పుడు పూర్తి వోల్టేజ్ తో లోపల కరంట్ ప్రవహిస్తోంది.ముట్టుకుంటే షాక్..అనుసంధానం చేస్తే వెలుగు.

ప్రభుత్వం నుండి తమ గ్రామానికి అందవలసిన సకల సౌకర్యాలను అఫీసర్లను అడిగి..నిలదీసి..స్నేహంగా అర్థించి..అవినీతి జరుగుతున్నప్పుడు ప్రశ్నించి..నిజంగా ఎన్ని పథకాలున్నాయో..గ్రామాభివృద్ధికి..ఇన్నాళ్ళూ తెలియనే లేదు.బడి ఉంది..కాని టీచర్లు రారు..అందరూ అప్ అండ్ డౌన్ లే.ఇప్పుడు తప్పడం లేదు..ఊళ్ళోనే కాపురముంటున్నారు పంతుళ్ళు..ముగ్గురు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..ఆంగన్ వాడి..స్వయం ఉపాధి పథకం..గ్రామోదయ..మధ్యాహ్న భోజన పథకం..ఇప్పుడు గ్రామ జ్యోతి.గ్రామానికి ప్రతి వారం వచ్చి వ్యవసాయదారులకు సలహాలివ్వవలసిన

వ్యవసాయ శాఖ ఉద్యోగులు..ఒక్కడుకూడా రాలేదు..ఇప్పుడు ప్రతివాడూ ఉరుక్కుంటూ వస్తూ..భూసార పరీక్ష చేయవలసిన ల్యాబ్స్..నీటి సంఘాలు..విద్యా వాలంటీర్ల వ్యవస్థ..గ్రామ గ్రంథాలయం.అన్నింటినీ నిద్ర లేపి..ప్రశ్న..ప్రశ్న..నిలదీత.

ఎదుట ఒక కరిచే కుక్క నిలబడి ఉంటే మనిషికి భయం..కుక్క లేకుంటే దొంగతనం చేసే సాహసం..అదే మనిషి ఎవడూ చూడకుంటే చటుక్కున మాయం చేసే దొంగవుతాడు..ఎవరైనా గమనిస్తూంటే వాడే కాపలాదారుడౌతాడు..మనిషి నైజం అది.

మొన్నటికి మొన్న లక్ష్మి ఒక కంప్లైంట్ ను తయారుచేసి మంత్రిగారికి ఇచ్చింది స్వయంగా, ప్రక్క ఊరికి వచ్చినప్పుడు..ఓ పదిమంది యువకుల్ని వెంటేసుకుని వెళ్ళి. పుష్కరాల్లో..ఆశాలపల్లి స్నాన ఘట్టానికి ప్రభుత్వం నుండి కాంట్రాక్టర్ డ్రా చేసిన డబ్బు..ఐదు లక్షలు.వాడు ఖర్చు చేసింది రెండు లక్షలుకూడా కాదు.మిగతాది స్వాహ.పని నాసిరకం.పుష్కరాల మధ్యలోనే మెట్లన్నీ ధ్వంసం..లోపలికి తొంగి చూస్తే..సూపరింటెండెంట్ ఇంజనీరు బామ్మర్దికిచ్చిన  నామినేషన్ వర్క్ అది.బామ్మర్దిని నిలదీత.ఎస్ ఈ ని..’కడుపునిండా ప్రభుత్వం జీతాలిస్తూండగా ఈ కక్కుర్తి ఇంకెందుకు ‘ అని గద్దింపు..వాడు సిగ్గుతో తలవంచుకుని.,

చైతన్యం..జలజలా..గల గలా గోదారిలా..ఊరి నర నరాన కొత్త రక్తం..ప్రశ్నే ఒక కొడవలి..ప్రశ్నే ఒక ఆయుధం..పదిమంది మనుషుల కలయికే ఏనుగును బంధించగలిగే గడ్డితాడు అన్న చింతన.

చాకు లాంటి  పదిమంది యువతీయువకులను తనే స్వయంగా కూర్చి..వాళ్ళతో ‘ ప్రశ్న ‘ అన్న గ్రామ కమిటీని వేశాడు.అదే చూస్తుంది..గ్రామ ఆరోగ్యాన్ని.అందరూ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే ఆ కమిటీలో.’ చదువు ‘ అనే ఒక కమిటీని తయారు చేసింది లక్ష్మి.ఊరి బడి టీచర్లను ఇన్వాల్వ్ చేసి.మనుషులను రంగంలోకి దించి ప్రేమతో వాళ్ళకు చదరంగంలో చెక్ పెట్టినట్టు ఫిక్స్ అప్ చేసి పనులను చేయించి చివరికి వాళ్లక్కూడా ఆనందాన్నీ తృప్తినీ మిగల్చడమే. .నాయకుడు చేయవలసిన పని.

లక్ష్మి ఇంకా దగ్గరగా వస్తున్నట్టు ఆమె పడవ శబ్దం వినబడ్తోంది.

‘ ఔను..లక్ష్మి..ఇక ఈ ఊరి పొలిమేరల్లోకి వస్తోంది ‘ అనిపించింది రాముకు.

చెక్క బల్లపైనుండి లేచి కూర్చున్నాడు రాము లక్ష్మి వస్తున్న దిక్కు ఆశగా చూస్తూ.ఆమె వెనుక నిద్రకుపక్రమిస్తున్న ఊరు కనిపిస్తోంది వెన్నెల్లో..జలతారు ముసుగులో రత్నాల రాశివలె.

దగ్గరగా వచ్చి..ఆమె పడవను ప్రక్కనే తన పడవకు తాకుతున్నట్టు ఆపి..తెడ్డును జాగ్రత్తగా ఓరగా ఆనించి..మెల్లగా తన పడవలోకి  మారుతోంది లక్ష్మి.అంతా గమనిస్తున్న రాము..మెల్లగా ఆమెకు చేయినందించి..ఆసరా ఐ..లోపలికి ఆహ్వానించి..ప్రక్కనే కూర్చుండబెట్టుకుని,

లక్ష్మి ముఖం లోకి చూశాడు..నిరామయంగా.

ఆమె ముఖం..నిలకడగా వెలుగుతున్న దీపంలా ఉంది ప్రశాంతంగా..శాంత గోదావరిలా కూడా.

కూర్చుని..తను తెచ్చిన చిన్న టిఫిన్ బాక్స్ లోనుండి ఒక చిన్న దీపాంతనూ..కొవ్వొత్తినీ..ఇంకేదో..లడ్డూ వంటి పదార్థాన్నీ బయటకు తీసి,

దీపాన్ని వెలిగించడం ప్రారంభించింది లక్ష్మి..గాలిలో.

” ఈ రోజు..పూర్ణిమ..గోదావరి తల్లికి..దీపం వెలిగిస్తున్నా” అంది నది మాట్లాడుతున్నట్టు.

రాము నిశ్శబ్దంగానే ఆమెను చూస్తున్నాడు..దేవతా విగ్రహం దిక్కు చూస్తున్న చిన్న పిల్లాడిలా.

” గాలిలో దీపం ఎలా వెలుగుతుందనే కదా నీ ఉత్సుకత” అంది.

రాము మాట్లాడలేదు.

వెలిగించింది దీపాన్ని చేతులను చుట్టూ అడ్డుగాపెట్టి..జాగ్రత్తగా.

” జాగ్రత్తగా వెలిగిస్తే..గాలిలోనే కాదు..తుఫాన్ లోకూడా దీపం వెలుగుతుంది” అంది.

రాము పులకించిపోయాడు..ఎందుకో.

” ఏం చేస్తావిప్పుడు” అన్నాడు.

” దీన్ని గోదావరి తల్లి ఒడిలోకి అర్పిస్తా” అంది.

” ఐతే ఒక్క క్షణమాగు..” అని చక చకా తన ప్లాస్టిక్ ఫోల్డర్ లోని కాగితాలను బయటికి తీసి..తన బి టెక్..ఎం టెక్ సర్టిఫికేట్లను..దొప్పలుగా మలచి..దోనె వలె కూర్చి..” ఆ దీపాలను దీంట్లో పెట్టి వదులు నీళ్ళలోకి..ఇవి ఒట్టి చెత్త..ఫేక్.నకిలీ.మనకు ఈ చెత్తతో పనిలేదిక.మనం చెత్త మనుషులం కాకుండా మనల్ని మనం కాపాడుకున్నాం..ఊ..” అన్నాడు.

లక్ష్మి అభావంగా అతని ముఖంలోకి చూచి ఆ కాగితాలను తీసుకుంది చేతిలోకి.అప్పుడతనిలో సముద్రంలో ఉన్నంత ప్రశాంత గాంభీర్యం కనిపించిందామెకు.

పదిలంగా చేతిలోని దీపాన్ని ఆ సర్టిఫికేట్ల దొప్పలో పెట్టి..అతని చేతులను కూడా తన చేతుల్లోకి తీసుకుని..దీపాన్ని జాగ్రత్తగా గోదావరి నిశ్చల జల తలంపైన విడిచిపెట్టింది.

తెప్పలా తేలుతూ..దీపం కదిలి.,

లక్ష్మి..అప్రయత్నంగానే..రాము ముఖంలోకి చూస్తూ..గోదావరిని చూచింది..అతనిలో పరిపూర్ణమైన నిశ్చింత.

అతనికి లక్ష్మీ..ఆమె వెనుకాల దూరంగా వెన్నెల కుప్పలా ఆశల పల్లె..ఊరూ కనిపిస్తోంది.

ఇద్దరిపెదవులపై .. నవ్వుల మొలకలు.                                                                                                                                                                         *

 

*****

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *