June 25, 2024

మోదుగపూలు – 14

రచన: సంధ్యా యల్లాప్రగడ

వివేక్‌ స్కూలుకు వచ్చిన గంటకు వచ్చింది నాగలక్ష్మి. అప్పటికీ వివేక్‌ స్కూలు గ్రౌండులో పనిలో ఉన్నాడు.

ఆమెను చూసి దగ్గరకు వచ్చాడు.

“నా రూము ఇక్కడే అక్కడికి వెళదామా?” అడిగాడు ఆమెను.

తల ఊపి “పద బిడ్డా!” అంది.

“ఎమన్న తిన్నావా? తింటావా?” అంటూ కుశలం అడిగాడు.

“దావత్ చేసినా గదా. అది చాలు!” అన్నది.

“టీచర్ల ఇళ్ళు ఇవే…” అన్నాడు తలుపు తీస్తూ

“నే చూసిన బిడ్డా!” అన్నదామె.

లోపల ఉన్న బల్లను చూపి కూర్చో మని మంచి నీళ్ళు అందించాడు.

త్రాగి గ్లాసు పక్కనుంచింది.

“చెప్పు ఏ కథలు కావాలి?” అడిగింది.

“నీవు నక్సలేట్‌ గా ఎలా మారావు?” అడిగాడు నోటుబుక్ తీసుకుంటూ.

“నే కావాలని మారలేదు. నాకు నక్సలేట్‌ అంటే కూడా తెలవదు బిడ్డా” అన్నదామె ఉపోద్ఘాతంగా

“ఆ…మరి…”

“మా ఊరు ఇది కాదు. లోపలికి పోవాలి. బిజుగొన్. చాలా పేదగా ఉంటది. మాకు అడవి తప్ప మరో దారి లేదు. ప్రక్క ఊర్లో భూమి సాగుకు కూలీకు పోయేవాళ్ళం. పది ఊర్లకంతటికీ షావుకారు ఉండే. వాడు పచ్చి దొంగ…”

“దొంగ అంటే..?”

“దొంగ అంటే మన అవసరం ఉందననకో రూపాయి ఇస్తడు. దానికి మన భూమి అంతా తీసుకుంటడు.  వాని కాడ అప్పు చెయ్యరాదు. కానీ చెయ్యక తప్పదు. మా అన్న అట్ల అప్పు చేసి ఉరి పోసుకు చచ్చాడు. నేను పొలం పనిలోకి పోతుంటె. ఆ పొలము లచ్చయ్యది. కాని షావుకారు అప్పు కింద పొలం తీసుకున్నడంట. నాకు తెలవదు. నేను కూలి అడిగితే నన్ను కొట్టి వెళ్ళగొట్టె”

“తరువాత”…

“తరవాత ఏముంది? నన్ను వళ్ళంతా కొట్టిన దెబ్బలతో సచ్చి బతుకుతు పనికి పోకుంటే పనికి రాలేదని గదిలో వేసి కొట్టిండ్రు. నేను తట్టుకోలేక కొడవలితో ఒకటి కొడితే చచ్చాడు.”

“ఆ..”

“పోలీసులు కేసులు…” నేను అడివిలోకి పోయి ఉన్న. ఇంటికి రాలే అంది ఆమె నవ్వేస్తూ.

“అటు తరువాత ఏమయ్యింది?”

“షావుకారు పోతే. ఇంకొకడు వస్తాడు. కాని కొన్ని దినాలు జనాలు సుఖపడతరులే!” తేలికగా అన్నదామె.

 

 

***

 

వివేక్ ఆలోచనలలో మునిగాడు. నిజానికి గిరిజనులకే కాదు గ్రామాలలో పేదలకు కూడా ఆ రోజులు చాలా కష్టమైన రోజులు. తెల్లదొరలు పోయినా, భూస్వామి జమిందారు వ్యవస్థ ఆ రోజులలో కూరుకుపోయింది.

గిరిజనులు ప్రతిదానికి అప్పుకు వెళ్ళవలసి వచ్చేది.

అప్పు ఇచ్చే పద్దతులు రకరకాలుగా ఉండేవి.  స్వల్పకాలపు అప్పు నుంచి ధీర్ఘకాలపు అప్పు వరకు.

నలుగురు సాక్షులతో చేబదులు ఇచ్చేవారు. ఇరవై రూపాయిలు కావాలంటే 18 ఇస్తారు, రెండు రూపాయిల అప్పుకు వడ్డీగా ముందే ఉంచుకునేవారు. అప్పు వడ్డీ తీరదు. అసలు అసలే తీరదు.

అప్పు తీర్చకపోతే గుద్దులు తినాలి కొన్ని చోట్ల. అలా గుద్దులకు చచ్చిపోయేవారు గిరిజనులు.

పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంటే యాభై నుంచి వంద శాతం వడ్డీ ఉంటుంది. అవసరాన్ని బట్టీ వడ్డీ పెంచుతారు షావుకారులు.  బస్తా వడ్లు తీసుకుంటే రెండున్న బస్తాలు తీర్చాలి

వందకు మూడు వందలు ఇవ్వాలి. ఇలా దోపిడి వివిధ రకాలుగా ఉండేది గిరిజనులకు.

పొలము ఉన్నా అప్పు తీరక, పంట వెయ్యలేక, పొలం షావుకారికి ఇచ్చి ఆకులుఅలములు తింటూ బ్రతుకుతారు కొందరు.

దానికి తోడు శుభకార్యాలకు, అశుభకార్యాలకు ఖర్చులు. పైగా మందు, విందు తప్పనిసరి వారికి.

మర్యాదలకు ఖర్చు, అనారోగ్యము కోసం ఖర్చు, ఇక తాగుడు ఖర్చు ఉండనే ఉంది.

చట్రములాంటి కష్టాలవి. ఆ ఊబిలో గిరిజనుడు కూరుకుపోతాడు.

భూమి ఉంటే భూమిలో పాలు షావుకారిది . నాగలి ఉంటే ఎద్దు ఉండదు. ఎద్దు ఉంటే నాగలి ఉండదు. రెండూ ఉంటే భూమి ఉండదు.

అప్పు తీసుకొని తీర్చలేక పెళ్ళాం పిల్లలతో కలసి షావుకారి ఇంట్లో వెట్టి చాకిరీ చెయ్యాలి. వాళ్ళు జీతం బత్యేం లేని పనివారుగా మారతారు.  ఇటు వంటి కథలే వినపడేవి గిరిజనుల తాండాలలో ఎక్కువగా. ఇలా అప్పులేనివారు ఉండేవారు కారన్నది సత్యం. న్యాయపరమైన వడ్డి వ్యాపారము లేదసలు. బ్యాంకులు జాతీయం చేసేవరకూ. ఆ తరువాత కూడా లంచగొండి అధికారులతో గిరిజనుల తంటా ఇంతింతకాదు.

ఆ విషయాలు తెలుసుకునే కొద్ది గుండె పట్టేసేది వివేక్‌కి.

“ఏంది ఏం మాట్లాడవు? భయపడుతున్నావా?” అడిగిందామే

“కాదులే” నవ్వేస్తూ చెప్పాడు వివేక్‌.

“ఎక్కడ్నుంచి నీవు? ఏ ఊరు? మీ నాయననెవరు?” ప్రశ్నల వర్షం.

“అన్ని చెబుతాగాని నీవు నక్సలేట్లతో పనిచేస్తుంటే ఎవరెవరితో పని చేశావు? గన్ కాల్చటం వచ్చా?”

“వచ్చు!. నేర్పించినారు. నేను షావుకారిని చంపినాని తెలిసాక నన్ను అస్సాం తీసుకుపోయారు. అక్కడ సేఫ్ అని”

“హో..అస్సాంయే?”

“అవును. అప్పుడు నేను తుపాకీ కాల్చటం, చేతులతో దెబ్బలు కొట్టటం నేర్చుకున్నా. నాకు చెట్లు ఎక్కటం అవ్వన్నీ ముందే వచ్చు. నేను అడివిలో పెరిగినా కదా” అన్నదామె.

“అసలు నీవు వాళ్ళ ఎట్ల కలిశావు?”

“నేను అడవిలో ఉంటూ ఊరికి రాకుండా కొన్ని రోజులు తిరిగిన. అంటే ఒక పదిరోజులు తిరిగనేమో. తరువాత ఊర్లకొస్తుంటే పోలిసుల్ని చూసిన. మా అక్క ఊరు లక్కింపేట పోయిన. అక్కడ ఒకలు వచ్చి నన్ను తమతో తీసుకుపొయినారు. వాళ్ళు నన్ను అస్సాం పంపినారు”

“నీవు పాటలు పాడేదానివా?”

“ఆ. గజ్జెలు కట్టుకు ఆడేది కూడా!!”

ఇలా గంటలు గంటలు మాట్లుడుకున్నారు వివేక్‌, నాగలక్ష్మిమ్మ.

“నేను ఒక ఫోటో చూపిస్తా గుర్తు పట్టగలవా?” అంటూ తన తండ్రి ఫోటో చూపాడు.

ఆమె కళ్ళు చిట్లించి చూసింది.

“చూసినట్లే ఉంది గాని యాదికొస్తలేదు బిడ్డా!”

“చూసిన గుర్తు ఉందా?” ఉద్వేగంతో ఊగిపోతూ అడిగాడు.

“అవ్‌. అయితే గియితే ఉట్నూరు రాజుల కొడుకై ఉండాలీయన!!” అన్నదామె.

“నక్సలేటు కాదా?”

“ఛ! అస్సలు కాదు… కానీ ఆ రాజులు తలకు పెద్ద టోపిగిట్ల పెట్టుకుంటారు. అందుకే తెలవటం లేదు. ఉట్నూరు పోయి ట్రైచెయి” చెప్పింది నాగలక్ష్మి.

“ఉట్నూరులో ఎవరిని ట్రైచెయ్యాలి?”

“అక్కడ ఇప్పుడు వాళ్ళ పిల్లలెవరో ఉండే ఉంటరుగా!”

“సరే. చాలా థాంక్స్…” అన్నాడు ఆనందముతో.

“థాంకులు…థాంకుల…” నవ్వుతూ నిష్కమించింది ఆమె.

 

***

 

వివేక్ హృదయము ఉప్పొంగింది. అతను తన సంతోషము దాచుకోలేక పోయాడు. వెంటనే రాము కోసము ఊళ్ళోకి ఉరికాడు. రామును కలిసి “ఉట్నూరు వెళ్ళాలి!” అన్నాడు

“ఎందుకు”

“ఉట్నూరు రాజులలో ఒకరు మా నాయన గురించి చెప్పవచ్చని నాగలక్ష్మమ్మ చెప్పింది…”

“అవునా. కూల్‌… వచ్చే ఆదివారం పోదాం”

“సరే!” అన్నా వివేక్ మనసు ఆగటం లేదు.

ఆదివారం కోసం ఎదురుచూస్తున్నాడు.

ఆదివారం రెండు రోజుల తరువాత వచ్చింది. ఆ రెండు రోజులు రెండు యుగాలుగా మారాయి అతనికి.

***

ఆదివారం ఉదయమే తయారై పరుగున రాము దగ్గరకు వెళ్ళాడు.

అప్పటికే రాము రెడి అవుతున్నాడు, వచ్చేశాడు ఐదు నిముషాలలో.

ఉట్నూరులో గోండుల కోట ఒకటి ఉంది. వాళ్ళ వంశస్థులు ఎక్కడ ఉన్నారో తెలియదు. మనము ముందు వెళ్ళి కోట దగ్గర విచారిద్దాం” అన్నాడు రాము.

“సరే పద!”

బండి మీద మామిడిపల్లి నుంచి బయలుదేరి గంటన్నర తరువాత ఉట్నూరు కోట వద్దకు చేరారు మిత్రులిరువురు.

 

****

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *