June 24, 2024

వెంటాడే కథ 12 – ఉత్తరం

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507


నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

**********

మధ్యాహ్నం మూడు గంటలు..
ఆకాశం మబ్బు పట్టి ఉండడంతో ఎండ వేడి అనిపించడం లేదు.
వృద్ధుడైన సయ్యద్ బాషా ఇంటి తలుపులు ధడాల్మని తెరుచుకున్నాయి. తెల్లని మల్లె పువ్వు లాంటి పైజామా, లాల్చి, రూమీ టోపీ ధరించి తెల్లని కురుచ గడ్డాన్ని నిమురుకుంటూ తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తలుపు తాళం వేసి లాల్చీ జేబులో తాళం చెవులు వేసుకున్నాడు. భద్రత కోసం కాబోలు ఒకటికి రెండుసార్లు తాళం లాగి చూసుకుని వీధిలోకి నడిచాడు. అతని సోడాబుడ్డి కళ్ళద్దాల నుంచి కనుగుడ్లు లావుగా గోళీ కాయల్లా కనబడుతూ ఉండడంతో ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద కర్రా బిళ్ళా ఆడుకుంటున్న పది పన్నెండేళ్ల పిల్లలు ‘బాషా.. బాషా’ అంటూ పెద్దగా అరిచారు.
”ఓరి కుర్ర కుంకల్లారా… ఏంట్రా మీ అల్లరి? ఆడుకోండి హాయిగా” అని వాళ్ళని ముద్దుగా విసుక్కుంటూ బాషా నవ్వుతూ గడ్డం సవరించుకుంటూ అక్కడ నుండి బయలుదేరాడు.
ఊళ్లోని పిల్లలందరికీ బాషా అంటే.. వినోదం! సన్నగా, రివటలా ఉండే అతను గాలికి ఊగుతూ నడుస్తుంటే వారికి తమాషాగా ఉండేది.. అందుకే చనువుగా ఆటపట్టిస్తూ ఉంటారు. ఆయన కూడా ఎప్పుడూ వాళ్లపై విసుక్కోలేదు.. కోపం తెచ్చుకోలేదు మహా అయితే “భడవల్లారా ఉండండి మీ సంగతి చెప్తా” అంటాడే తప్ప మరేమీ అనడు.
ఊళ్లో పెద్దలకు కూడా బాషా అంటే ఒక రకమైన గౌరవం ప్రేమ!
దారిలో ఎవరో పెద్దాయన ఎదురై “కాకా బాగున్నావా ?” అడిగాడు.
“బాగున్న బిడ్డ! అంత అల్లా దయ.. పక్కూరు వెళ్తున్న బేటా” అంటూ చేతులు ఊపుతూ నాలుగడుగులు ముందుకు వేశాడు బాషా.
దారి పొడవునా ఆడవాళ్లు, మగవాళ్లు ‘కాకా’ అంటూ ఆయన్ని పలకరించే వాళ్లే!
అందరికీ నవ్వుతూ జవాబు చెబుతూ ముందుకు సాగుతున్నాడు బాషా.
పిల్లలు మాత్రం ఆయన తోకే వస్తూ ‘అల్లా దయ..’ ‘బహుత్ షుక్రియ’ అంటూ ఆయన మాటల్ని వేళాకోళంగా అంటూ గడబిడ చేస్తూ పెద్దగా నవ్వుతున్నారు. ఆయన మాత్రం వారిని పట్టించుకోవడం లేదు.
కొందరు పెద్దలు మాత్రం ఆ పిల్లల్ని గద్దిస్తున్నారు
”ఏంట్రా తాతగారితోనా వేళాకోళాలు? బడేమియాకి నమస్తే చెప్పి వెళ్లిపోండి” అంటూ.
“ఫర్వాలేదు… పర్వాలేదులే! వాళ్ళ సరదా వాళ్లది.. వాళ్ళని ఎందుకు తిడతావు” అంటూ ఆ పెద్దల్ని మందలిస్తూ బాషా మెల్లగా ఊరు వెలుపలికి చేరుకున్నాడు. కూడా వస్తున్న పిల్లలు ఊరి పొలిమేరల్లో ఆగిపోయారు.
పొలాల గట్ల మీద బాషా ఊగుతూ నడుస్తుంటే వరి కంకులు గాలికి ఊగుతూ ఆయనను ఆట పట్టిస్తున్నాయి.
పొలాల్లో వంగి పని చేసుకుంటున్న కొందరు ఆడా మగా కూలీలు లేచి నిలబడి ”కాకా సలామాలేకుం.. కాక సలామాలేకుం” అంటూ నవ్వుతూ నమస్కారాలు పెడుతున్నారు.
”వాలేకుం సలాం బేటా… అంతా అల్లా దయ” అంటూ చేతులు ఊపుతూ ముందుకు సాగుతున్నాడు సయ్యద్ బాషా.
వార్ధక్యం వల్ల కాబోలు నడుస్తున్నా మాట్లాడుతున్నా ఆయాసం వస్తోంది.. అయినా మనిషిలో హుషారు తగ్గలేదు. ఎందుకంటే తను వెళుతున్నది పక్కూరి పోస్ట్ ఆఫీసుకు కదా!
ఆ విషయం చిన్న పిల్లలతో సహా ఊళ్ళో అందరికీ తెలుసు.
అయినా ‘ఈ ఎండలో ఎందుకు కాకా’ అని మాత్రం ఎవ్వరూ చెప్పరు.
పొలాల్లో నడుచుకుంటూ బీడు భూముల్లో పెద్ద చెట్లు కనబడితే వాటి నీడ కాసేపు సేద తీరుతూ ఒక గంటలో సయ్యద్ బాషా పక్క ఊరికి చేరుకున్నాడు.
పక్కఊర్లో కూడా కొందరికి బాషా పరిచయమే.
”సలాం కాక… సలాం కాక” అంటూ ఒకరిద్దరు అతనికి నమస్కారం చేసి వెళ్లిపోయారు.
రెండు చేతులెత్తి ”అల్లా అచ్చా కరేగా.. అల్లా అచ్చా కరేగా” అంటూ వారిని ఆశీర్వదిస్తూ పోస్ట్ ఆఫీస్ ఉన్న సందులోకి మళ్లాడు సయ్యద్ బాషా.
ఆ సందు చివరి ఇల్లే పోస్ట్ ఆఫీస్!
పోస్ట్ ఆఫీస్ ఆవరణలో తిరుగుతున్న పోస్టుమాస్టర్ అల్లంత దూరంలోనే సయ్యద్ బాషాను చూసి –
”ఓరి దేవుడా! మళ్ళీ వస్తున్నాడు ఈ ముసలాయన” అన్నాడు తల కొట్టుకుంటూ.
అక్కడే కూర్చుని బాతాఖానీ వేస్తున్న నలుగురైదుగురు యువకులు “ఏమైంది భాయ్? ఎవరు ఆయన? నువ్వెందుకు తల కొట్టుకుంటున్నావ్?” అడిగారు కుతూహలంగా.
ఆయన పెద్దగా నిట్టూర్చాడు తప్ప ఏం మాట్లాడలేదు.
అంతలో సయ్యద్ బాషా అక్కడికి రావడం పోస్టుమాస్టర్ కి నమస్కారం చేయడం జరిగింది.
అక్కడున్న నలుగురు ఐదుగురిలో ఒకరు లేచి నిలబడి పెద్దాయనకు బెంచి మీద కూసింత చోటిచ్చారు కూర్చోవడానికి.
”సాబ్ మా అబ్బాయి నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా?” ఆశగా అడిగాడు బాషా పోస్టుమాస్టర్ ను.
ఎండన పడి రావడంతో అతని గొంతులో అలసట తాండవమాడుతోంది.
పోస్ట్ మాస్టారు ఏమీ జవాబు ఇవ్వకుండా అక్కడే ఉన్న కడవ నుంచి ఒక గ్లాసు చల్లని నీళ్లు తెచ్చి సయ్యద్ బాషాకి అందించాడు.
”యా అల్లా… బహుత్ షుక్రియా” అనుకుంటూ ముసలాయన గ్లాస్ అందుకుని నీళ్లు తాగాడు. సగం గ్లాసు నీళ్లతో వరండా పక్కకెళ్ళి ముఖం కడుక్కున్నాడు. జేబురుమాలు తో తుడుచుకుంటూ వచ్చి మళ్ళీ బల్ల మీద కూర్చుని ప్రశ్నార్ధకంగా పోస్ట్ మాస్టర్ ముఖంలోకి చూశాడు.
పోస్ట్ మాస్టారు విచారంగా అతని వంక చూస్తూ “రాలేదు కాకా! వస్తే మీ అబ్బాయి ఉత్తరం నేనే నేరుగా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తాను.. మీరు తడవ తడవకీ శ్రమ పడి రాకండి” అన్నాడు.
గొనుక్కుంటూ లేచాడు సయ్యద్ బాషా.
అసలే తెల్లటి మొహం మరింత పాలిపోయింది విచారంతో!
”ఈ కాలం పిల్లలకు ఏం పనులో… పాడు పనులు! కన్నతండ్రికి ఒక ఉత్తరం ముక్క రాయాలన్న జాస కూడా ఉండదు” అని తనలో తానే సణిగినా అందరికీ బాషా మాటలు వినబడ్డాయి.
పోస్ట్ మాస్టర్ కి షుక్రియ చెప్పి కొండంత నిరాశతో తిరిగి తన ఊరికి బయలుదేరాడు.
అతను ఊగుతూ నడవలేక నడవలేక నడుస్తుంటే పోస్ట్ మాస్టారు ఆయనవంకే జాలిగా చూస్తూ నిలబడ్డాడు.
అతను సందు మలుపు తిరిగాక అక్కడ కూర్చున్న తన దోస్తులతో –
”ఈ పెద్దాయన కొడుకు మిలిటరీలో పని చేసేవాడు. ఐదేళ్ల క్రితం యుద్ధంలో చనిపోయాడు. ఆ టెలిగ్రామ్ స్వయంగా నేనే వెళ్లి ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చాను. బాధాకరమైన ఆ విషయం చెప్పి వచ్చాను.. బాగా దుఃఖించాడు. భార్య ఎప్పుడో పోయింది .. ఒంటరి జీవితం! ఆ తర్వాత ఏడాదికి అది మర్చిపోయాడో లేక మతిచెడిందో మళ్ళీ వచ్చాడు ‘మా అబ్బాయి నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా సారు?’ అంటూ. నాకు ఏం చెప్పాలో తోచలేదు. ‘నీ కొడుకు చనిపోయాడు కదా’ అని మళ్లీ చెబితే అతను ఏమైపోతాడో అని ఆందోళన! అందుకే ‘రాలేదు కాకా’ అని చెప్పి పంపించాను. అప్పటి నుంచి గత నాలుగేళ్లుగా రెండు వారాలకు ఒకసారి కొడుకు ఉత్తరం కోసం వస్తూనే ఉన్నాడు. ఇంకెన్నాళ్లు వస్తాడో ? నేనింకెన్నాళ్లు అతనికి అబద్దం చెబుతూ ఉండాలో” వివరంగా చెప్పాడు చెమగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ.
పోస్ట్ మాస్టర్ స్నేహితులు సయ్యద్ బాషా కథ విని కదిలిపోయారు. పాపం అనుకున్నారు.

* * *

పొలాల్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న కాకాని కూలీలు ఎప్పటిలా పలకరించినా మాట్లాడలేదు. ఎవరినీ పట్టించుకోకుండా విచారంగా తలదించుకుని పోతూనే ఉన్నాడు. వాళ్ళకి కూడా అసలు విషయం తెలుసు కనుక ఆ పైన అతన్ని ఎవరు పలకరించలేదు.
ఈ విచారం మరచి పోవడానికి అతనికి మరో రెండు వారాలు పట్టవచ్చు నేమో! లేదంటే ఇంకా ఎక్కువైనా పట్ట వచ్చు.
అది ఎంత కాలం అన్నది అల్లా ఒక్కడికే తెలుసు!

***

నా విశ్లేషణ :

బాగా గుర్తుంది ఇది పాకిస్తానీ కథ. మలిసంధ్య ఏ స్థాయి మనిషికైనా పెనుశాపమే! తిరిగి రాని కొడుకు కోసం.. కొడుకు ఉత్తరం కోసం సయ్యద్ బాషా ఎన్నాళ్లయినా ఎదురు చూస్తూనే ఉంటాడు. తిరిగి రాడని నచ్చచెప్పడానికి ఆ వృద్ధుడికి ఎవరున్నారు? రెక్కలుడిగిన ఒంటరి పక్షి! గ్రామ పెద్దలు ఎవరైనా చొరవ తీసుకుని చెబుదామంటే మళ్ళీ అతను ఏ చిత్తభ్రమలోకి జారిపోతాడోనన్న భయం అందరిలో గూడు కట్టుకుని ఉంది. కనుక ఎవరూ ఆ సాహసం చేయరు.
కొడుకు బతికే ఉన్నాడన్న భ్రమలో అలా ఆయువు ఉన్నంతవరకూ బతికేస్తూనే ఉంటాడతను. ఇలాంటి ఒంటరి ముసలి పక్షులు ప్రపంచమంతా ఉన్నారు.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు చూశాను. కళ్ళు సరిగా కనబడని ఒక ముసలావిడ చేతి కర్ర సాయంతో ఓ సెల్ ఫోన్ దుకాణానికి వస్తుంది. ”అయ్యా ఈ ఫోన్ పనిచేయడంలేదు కాస్త చూస్తావా?” అని అడుగుతుంది షాపు వాడిని.
అతను దాన్ని పరిశీలించి ”ఫోన్ బాగానే ఉంది గదవ్వా !” అంటాడు.
”అట్లయితే మూణ్ణెల్ల సంది దుబాయ్ నుంచి నా కొడుకు ఫోన్ రాడంలేదేం బిడ్డ… గందుకే ఫోన్ చెడిందని వచ్చిన” అంటుందా అవ్వ.
తెల్లబోయి చూస్తాడు షాపతను.
”దుబాయ్ నుంచి కాల్ చేస్తే ఈడ(ఇండియా)కి రాదా బిడ్డా?” అంటే అతను ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
సయ్యద్ బాషాలా చనిపోయిన బిడ్డల పరిస్థితి అలా ఉంటే – కొందరు బిడ్డలకు సొంత దేశంలో ముసలి తల్లిదండ్రులు బతికున్నా చచ్చినట్టే లెక్కగా మారిపోయిన ఒక విచిత్రమైన తరంలో మనం బతుకుతున్నాం.

8 thoughts on “వెంటాడే కథ 12 – ఉత్తరం

 1. Poni ee post master gare uttaralu raaste!! Urike urata kaliginchataniki…!!
  Bhale klistamaina paristiti…
  Ennalani abadhamlo unchutam?
  Ala ani malli malli nijam cheppalem!!
  Saradaga modalaina katha, inta baadhaga mugisindenti sir!!
  You made me thoughtless, wordless for a moment sir!!

 2. “ఉత్తరం” కథని ఇప్పుడే చదివాను. చిన్న కథే అయిన వెంటాడుతూ ఉండే కథ! ఉత్తరాలు కనుమరుగౌతున్నాయి. ఇప్పుడంతా ఉత్తగా పెదిమెల పైనుండే చెప్పే రాం… రాం లు. కథ చదవగానే, 30 ఏళ్ల క్రితం Doordarshan TV లో శ్యామ్ బెనెగల్ లేక బాసు భట్టాచార్జీ గార్లు చేసిన కథా సాగర్ సీరియల్ (ప్రతి ఆదివారం ఒక మంచి కథని దృశ్యకావ్యంగా చూపేవారు.) లో చూసిన ఇలాటి కథే గుర్తుకొచ్చింది. తల్లి తండ్రుల్ని వదిలి ఉంటున్న ఒక చిన్న బాబు ఉత్తరం రాయడం, దాన్ని ఉపయోగంలో లేని పోస్ట్ డబ్బాలో వేయడంతో కథ ముగుస్తుంది. ఎన్నటికీ చేరని ఆ ఉత్తరమది. కంట తడిపెట్టించే కథ. వివరలేవీ గుర్తుకురావడం లేదు. అయితేనేం వెంటాడుతూనే ఉంది కదా!

  1. ధన్యవాదాలు సంపత్ కుమార్ గారు చాలా చక్కగా ఉత్తరం గురించి చెప్పారు ఇది నిజంగా వెంటాడే కథ

 3. వెంటాడే ప్రేమ పాశం ఈ వుత్తరం కథ ఈనాటి వాస్తవానికి అద్దం పడుతుంది బాగుంది

  1. బాగా చెప్పారు తేరాల రామకృష్ణ గారు మనిషి జీవితంలో ఎన్నో ఎన్నో పార్శ్వాలు వాటిలో ఇదొకటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *