May 25, 2024

సాఫ్ట్‌వేర్ కథలు – ఉప్మా

రచన: కంభంపాటి రవీంద్ర

 

“ఇదిగో… రేపు వీకెండ్ అని లేట్ గా లేవకు… గుర్తుందిగా?” అడిగింది కావ్య

“మర్చిపోలేదు తల్లీ… రేపు ఉదయాన్నే హాస్టల్ నుంచి డైరెక్ట్ గా కొత్త గూడ జంక్షన్ దగ్గిరికి వచ్చి వెయిట్ చేస్తూంటాను… నన్ను పికప్ చేసుకో “అన్నాను

“గుడ్… నైన్ కి అక్కడికి వచ్చేస్తాను… మన మిగతా టీం డైరెక్ట్ గా ఓల్డ్ ఏజ్ హోమ్ కి వస్తామన్నారు… అందరం అక్కడ కలుద్దాం” అంది కావ్య.

“సరే… నేను ఏమైనా తీసుకురావాలా?”

“అక్కర్లేదు… వాళ్లకి మన ఆఫీస్ తరఫున డొనేట్ చేద్దామనుకుంటున్న రైస్ బ్యాగ్, కంది పప్పు, జెనెరిక్ మెడిసిన్స్… ప్రకాష్ వాళ్ళు కార్లో తీసుకొచ్చేస్తామని చెప్పేరు… నువ్వు మటుకు… ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేవాళ్లకి ఏమైనా ఫన్ గేమ్స్ లాంటివి ప్లాన్ చెయ్యి … వాళ్ళతో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే బావుంటుంది… నేనింక వెళ్ళాలి… సతీష్ ఇప్పటికే మెయిన్ గేట్ బయట వెయిట్ చేస్తున్నాడు” అంటూ కావ్య బయల్దేరింది.

ఆఫీస్ లో సీఎస్సార్ అనో వింగ్ ఉంటుంది… ( సీఎస్సార్ అంటే… మాయాబజార్లో శకుని వేషం వేసిన సీఎస్సార్ గారు కాదు , కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట ). కార్పొరేట్ కంపెనీలు తమకి వచ్చే లాభాల్లో కొంత శాతం… సమాజానికి రకరకాలుగా తిరిగిస్తూంటాయి… ఓ ఊరిని దత్తత తీసుకోవడం , చెరువుని బాగుచెయ్యడం , లేదా ఓ స్కూల్, వృద్ధాశ్రమానికి సహాయపడడం… ఇలాంటివన్నమాట.

మా ఆఫీస్ లో రకరకాల క్లబ్స్ ఉన్నా , నాకెందుకో సీఎస్సార్ వింగ్ బాగా ఆకట్టుకుంది. కానీ చేరిన తర్వాత తెలిసింది… సమాజసేవ ఒక లక్ష్యం మాత్రమే… కానీ పరమార్థం మటుకు కంపెనీకి పబ్లిసిటీ. సరేలే ఏదైతేనేమిటి… పబ్లిసిటీ సంగతి ఎలా ఉన్నా, ఎవరో ఒకరికి మంచి అనేది జరుగుతోంది కదా అని సరిపెట్టుకున్నాను.

ఇవన్నీ ఒకెత్తయితే , మా హైదరాబాద్ సెంటర్ కి సీఎస్సార్ లీడర్ గా ఉన్న కావ్య… భర్త సతీష్ , ఇద్దరు పిల్లలు ఉన్న ఇంటిని చక్కగా మానేజ్ చేసుకుంటూ , ఆఫీస్ లో కూడ స్టార్ పెరఫార్మెర్ లా ఉండే కావ్య నాకు ఒక ఇన్స్పిరేషన్ లా కనిపించేది. రేపు ఫ్యూచర్ లో… నాకు కూడా పెళ్ళైతే , కావ్యలాగే పర్సనల్ లైఫ్ , కెరీర్ మేనేజ్ చేసుకోవాలి అని ఎప్పుడో అనుకున్నాను !

అనుకున్నట్టుగానే , ఆ శనివారం ఉదయం కొత్త గూడ జంక్షన్ దగ్గరనున్న మహీంద్రా షోరూం ముందు వెయిట్ చేస్తున్న నన్ను కావ్య పికప్ చేసుకుంది.

“పిల్లలిద్దరినీ ఇవాళ స్కూల్ కాంటీన్ లో తినేయమని చెప్పేను… సతీష్ కి ఏదో ఆఫీస్ గెట్ టుగెదర్ ఉందట” డ్రైవ్ చేస్తూ చెప్పింది కావ్య.

టోలి చౌకీ లోని సందుల్లో ఉన్న ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ చేరుకోవడానికి ఇంకో అరగంట పట్టింది.

మా ఆఫీస్ నుంచి మేమందరం వస్తున్నామని , ఆ హోం నిర్వాహకులు  ఓ చిన్న ఫంక్షన్ వాతావరణం లాంటిది ఏర్పాటు చేసేరు ! ప్రకాష్ వాళ్ళు ఆ ఫంక్షన్ వేదిక పక్కనే , మా ఆఫీస్ బ్యానర్లు పెట్టేరు.

ఆ చిన్న హాల్లో వేసిన కుర్చీల మీద ముసలి వారెందరో కూర్చుని ఆసక్తిగా చూస్తున్నారు. ముందు వాతావరణం తేలిక పరచడానికి , వాళ్లందరితో సరదాగా తంబోలా ఆడించేను , పాటలు పాడించేను , ఒకరిద్దరు ఉత్సాహంగా పద్యాలు కూడా పాడేరు.

ఇంతలో ఓ కళ్ళజోడు పెట్టుకుని హుషారుగా ఉన్నావిడ  అందరికీ చిన్న చిన్న ప్లేట్లలో ఉప్మా పట్టుకొచ్చి పెట్టింది. ఉప్మా అంటే అస్సలిష్టం లేని నేను , మొహమాటంకొద్దీ ఓ స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. అసలంత గొప్ప  రుచి నేనెప్పుడూ చూడలేదు! “ఏమండీ… ఉప్మాలో పొరబాటున అమృతం గానీ ఒలికిందా? ఇంత రుచిగా ఉంది?” అని ఆవిడని అడిగితే , నవ్వుతూ , “ఇంకొంచెం వెయ్యనా పాపా?” అంది.

ఒద్దని మొహమాటంగా చెప్పేను. సులక్షణ అని ఆ హోమ్ సూపర్వైజర్ అట , ఆవిడ చెప్పింది “మా రత్నంగారి వంట తినడానికి అదృష్టం ఉండాలి… ఆవిడది మామూలు చెయ్యి కాదు”

“ఆవిడ కధేమిటి?… ఎందుకు ఇక్కడ ఉంటోంది?” అడిగేను

“ఒక్కడే కొడుకు… కోడలికి అమెరికా పిచ్చి… అత్తగారు వాళ్ళతో ఉండకూడదు… వాళ్ళు అమెరికా వెళ్ళిపోతూ, ఈవిణ్ణి ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయేరు…”

“ఆవిడ ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా?” అమాయకంగా అడిగేను

“ఆవిడ అస్సలు చదువుకోలేదు… బయట ఒక్కత్తీ బతకలేదు… అందుకే ఇక్కడ జాయిన్ చేసేరు” చెప్పింది సులక్షణ

వెనక నుంచి వెక్కుతున్న శబ్దమొస్తే , తిరిగి చూసేను. కావ్య ఏడుస్తూ కనిపించింది.

“ఏమైంది కావ్యా?” అని నేను అడుగుతూండగానే , తను పరిగెత్తుకుని వెళ్ళి  ఆ రత్నంగారిని కౌగలించుకుని భోరున ఏడుస్తూ, “ఆంటీ… మీరు మా ఇంటికి వచ్చెయ్యాలి… మిమ్మల్ని మా అమ్మతో సమానంగా చూసుకుంటాను” అంది.

ఆ రత్నంగారికి జరుగుతున్నదేమిటో అర్ధం కాక అమాయకంగా చూస్తూండిపోయింది !

అందరం కావ్య కి సర్దిచెప్పి తీసుకొచ్చేసేము. ఆ రోజు తర్వాత, రెణ్ణెల్ల పాటు ప్రయత్నించి ఆ రత్నంగారిని తనింటికి తెచ్చేసుకుంది కావ్య !

కావ్య సంగతేమో గానీ ముందర నేను సంతోషించేను… అప్పుడప్పుడు తన ద్వారా , ఆవిడ చేతి ఉప్మా తినొచ్చని. అదే విషయం కావ్యకి చెబితే, గట్టిగా నవ్వుతూ , “ష్యూర్… తప్పకుండా… ఇన్ ఫాక్ట్ నీకో నిజం చెప్పనా? ఇందులో నా స్వార్థం కూడా ఉంది… అంత మంచిగా వంట చేసేవాళ్ళు బయట ఎక్కడ దొరుకుతారు చెప్పు?.. ఇంట్లో నాకు ఇంక వంట బాధ తప్పినట్టే… పైగా ఛారిటీ చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా” అంది

మొదటిసారి నేను కావ్య ని అంచనా వెయ్యడంలో పొరబాటు పడ్డానని అనిపించింది !

ఆ తర్వాత ఎన్నోసార్లు , ఆ రత్నంగారు చేసేరని ఉప్మాయే కాకుండా , పండగలొస్తే బూర్లు , బొబ్బట్లు , రకరకాల రోటి పచ్చళ్ళు… ఆఖరికి ఎండాకాలంలో ఓ బాటిల్ నిండా తరవాణి కూడా తీసుకొచ్చింది. అన్ని రకాల వంటలు… అవీ రుచికరమైనవి తీసుకొస్తున్న కావ్య అంటే చిన్న అసూయ కూడా పుట్టింది నాకు! కావ్యతో ఆ మాటంటే, తను “చాల్లేవే…ఆవిడకేం చెయ్యడానికి అన్ని వంటలూ చేసేస్తుంది… సరుకులు కొనేది మేము కదా..మొన్నామధ్య ఆవిడకి వైరల్ ఫీవర్ వచ్చింది… ఐదు వేలు బిల్లు… ఏవైనా కడతాడేమో అని వాళ్ళబ్బాయికి మెసేజ్ చేస్తే , ‘ఆవిణ్ణి మీ ఇంట్లో ఉంచుకున్నారుగా… కాబట్టి… ఆవిడ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీవే మీవే’ అని రిప్లై ఇచ్చేడా ఇడియట్” అంది చిరాగ్గా !

ఆ తరువాత నుంచి , కావ్యకి కొంచెం కొంచెం దూరం జరగడం మొదలెట్టేను , ఇంక ఆ సీఎస్సార్ ఆక్టివిటీ అంటేనే చిరాకు పుట్టింది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూంటే , ఎవరో తెలిసిన ముఖంలా కనిపిస్తే చూసేను… ఆ రత్నంగారు , చిన్న బ్యాగ్ పట్టుకుని మా బస్ స్టాప్ వైపు వస్తున్నారు.

వెంటనే వెళ్లి పలకరించేను… “ఆఁ… అప్పుడు నా ఉప్మా నీకు బాగా నచ్చిందని చెప్పేవు… గుర్తున్నావమ్మా” అందావిడ.

“మీరిక్కడ ఏమిటి?” అని అడిగితే , “చిన్న సాయం కావాలమ్మా… టోలిచౌకి కి వెళ్లే బస్ ఏమిటో , ఎప్పుడొస్తుందో చెబుతావా?” అందావిడ

“టోలి చౌకీ? అక్కడికెందుకు ఆంటీ?” అడిగేను

“అంటే… నేనుంటే కావ్య వాళ్లకి ఇబ్బంది గా ఉందట… ఈ మధ్య నాకు శరీరం మీద కంట్రోల్ తప్పేసింది… నాకు తెలీకుండానే యూరిన్ పోసేసుకుంటున్నాను… అందుకే… తిరిగి ఆశ్రమానికి వెళ్లిపొమ్మని చెప్పింది… వాళ్ళతో మాట్లాడింది… బస్ కూడా డబ్బులిచ్చింది” అని చెబుతూన్న రత్నంగారిని చూస్తే నాకు కావ్య మీద పీకల్దాకా కోపం వచ్చింది.

“పదండి ఆంటీ… మిమ్మల్ని ఆశ్రమానికి నేను ఆటోలో తీసుకెళ్తాను” అని ఆటోలో తీసుకెళ్ళి, ఆ ఆశ్రమం వాళ్లకి అప్పగించి, కావ్యకి ఫోన్ చేసి కోపంతో అరిచేను “ఏమిటి కావ్యా ఇది? నీ గురించి గొప్పగా ఊహించుకుంటే… పాపం… ఆ రత్నం గారిని అలా వదిలేసేవు?”

“కూల్ డౌన్…రత్నంగారు ఉప్మాలాంటివారే…. ఉప్మా అనేది ఎప్పుడైనా తింటే ఫర్లేదు కానీ రోజూ తిన్నామంటే ఎంత బావున్నా కడుపులో దేవేస్తుంది…” అందా కావ్య!

 

*****

5 thoughts on “సాఫ్ట్‌వేర్ కథలు – ఉప్మా

  1. సోషల్ రెస్పాన్సబిలిటీ పేరుతో మంచి కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెడతారన్న మాట తప్పితే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వంత లాభం చూసుకోవడమే జరుగుతుంది .అంత కపటత్వాన్ని భరించడం సులువు కాదు.

  2. పెద్ద పులిహోర ఉప్మా ఈ CSR అనేది. దీనికి కావలసిన ముఖ్యమైన వస్తువు కెమెరా. ఆ తర్వాత ఆ ఫోటోలు పనిచేసే సంస్థ ఇంటర్నల్ వెబ్సైటు లో పెట్టి తద్వారా నలుగురి దృష్టినీ ఆకర్షించడం. ఇయర్ ఎన్డ్ రేటింగ్ పెంచుకోడమ్. మీ కథ లో ఇంకో అడుగు ముందుకేసింది కావ్య. నేను పనిచేసిన బ్యాంక్ వైజాగ్ లాసన్స్ బే దగ్గరున్న చేపల వాళ్ళ కాలనీలో స్కూల్ renovate చేసింది. పునః ప్రారంభం చెయ్యడానికి US నించి చాలా పెద్ద అధికారి వచ్చేదాకా 3 నెలలు ఆగి బోలెడంత పబ్లిసిటీ మూటగట్టుకుని మరీ కానిచ్చారు. చేసేది ఆవగింజంత. చూపేది ఎవరెస్టంతా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *